‘మంచి పుస్తకం కోసం వెతుకుతుంటే…..’

వులు ప్రతిరోజూ ప్రతి క్షణమూ చూసే దృశ్యాలనన్నింటినీ కవిత్వం గా మార్చగలరా, అని ఈమధ్యనే ఎవరో అడిగారు. తాము చూసి తమపై ప్రభావం చూపగలిగిన విషయాలను కవిత్వంగా మార్చడం కవులు రాసే విధానంలో ఒక భాగం. తాము చూసిన దృశ్యాలనూ తాము విన్న విషయాలనూ తాము చూసిన, విన్న దృశ్యాలూ, విషయాలూ, తాము చూసిన విన్న విషయాలద్వారా తమకు కలిగిన అనుభూతులూ కవిత్వ విషయాలు అవుతాయి. కవిత్వం రాస్తున్న కొత్తలో కొందరు కవులు తాము చూసిన విన్న విషయాలనూ తమ అనుభూతులనూ కలగాపులగం చేసుకుని తాము రాసే కవిత్వంలో తామే అస్పస్టతకు కారణమవుతారు. కొందరు తాము చెప్పదలచుకున్నది స్పష్టంగా హృద్యమైన కవితగా మలచగలుగుతారు.

ఈ స్పష్టతనూ  నవ్యతనూ సాధించడానికి కవులు ఏం చేస్తున్నారు?

కొత్తగా రాయాలనుకుంటున్నవారు ఏమి చెయ్యాలి?

సాహిత్య ప్రక్రియల్లో చదువరుల హృదయాన్ని ఆకట్టుకునేది కవులూ, కథకులూ పాటించే స్పష్టత. స్పష్టత సాధించడానికి రాసేవారికి విషయ సమగ్రతతోపాటు  చదువరిని మెప్పించగల ఒప్పించగల నేర్పు ముఖ్యం. ఈ నేర్పునే సాహిత్య విమర్శకులూ విశ్లేషకులూ రూపంగానూ, శిల్పంగానూ   వ్యవహరిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకటి రెండు పేజీలలో పూర్తి చేయగలిగిన కవిత అయితే కవి తీసుకునే విషయం ఒక్కటే అయినప్పుడు చదువరులకు సులభంగా అర్థం అవుతుంది. కవిత మొదట్లోనే కవి ఏమి చెప్పదలచుకున్నారో చదువరికి స్పురించాలి. కవి తను చెప్పదలచుకున్న విషయం నుండి పక్కదారి పట్టకుండా సూటిగా చదువరుల హృదయాలను తాకేలా చెప్పాలి.

పత్రికలలో కవిత్వం శీర్షికలు నిర్వహిస్తున్న సంపాదకులు తరచూ చేసే అభియోగం   కవిలో విషయ స్పష్టత లేక పోవడం , విషయాన్ని సూటిగా చెప్పగలిగిన నేర్పు లేకపోవడం.

పై రెండింటిలో మొదటిది మెదడుకూ ఆలోచనకూ చెందినది అయితే, రెండవది హృదయానికీ హృద్యతకూ కవి స్పందనకూ చెందినది. ఈ రెండింటిలో ఏది లోపించినా కవిత ప్రయోజనం నెరవేరదు.

యిక్కడ కవిత ప్రయోజనం ఏమిటీ అని ప్రశ్నించుకుని తర్కించుకుని కవి రాసే కవిత చదువరుల మెప్పునూ సహానుభూతినీ పొందగలదు.

కవిత్వం రాసేవారు నిరంతరం గుర్తుంచుకోవలసిన విషయం భావాలతో, అక్షరాలతో తాము ఒక శిల్పాన్ని సృష్టిస్తున్నామని. ఒక శిల్పంలో తమ హృదయాలలో అదివరకే భావించుకున్న ఒక మూర్తినీ, ఆ మూర్తిలోని సౌందర్యాన్నీ దాన్ని దర్శించే వారు భావించకపోతే ఆ శిల్పం ఎలా నిరర్థకమవుతుందో అలాగే చదువరులకు స్పష్టత ఇవ్వలేని, సహానుభూతినీ కలిగించలేని కవిత కూడా.

ఈ సారి మనం దృశ్యాలను కవితలుగా మార్చగలిగిన కొందరు కవుల కవితలను చూద్దాం.

Hyderabad book fair

అక్షరాలు, పదాలు, వాక్యాలు పుస్తకంలో నిక్షిప్తమై చదువరి కోసం

ఎదురుచూస్తున్నఓ కన్నె పిల్ల జాడలా కనపడింది నాకు…

చలికాలంలో చెలికాలం రాబోదా అన్న సందిగ్ధానికి

చెరమ గీతం పాడే కొన్ని మస్తకాల కలయిక బుక్ ఫెయిర్

లోపలికి అడుగు పెడితే ఇది నిజానికి పుస్తక నది, మనసు నది, జ్ఞాపకాల నదులు కలిసే సంగమం

స్టాల్ నెంబర్ 248, 24,12,106,91 , 88,14 ,237 లలో మళ్లీ మళ్లీ భ్రమించాను

Online పరిచయాలు ప్రత్యక్షమై మంత్రముగ్ధుల్ని చేస్తున్న సమయం

అక్షరాలు మొదటిసారి పలుకుతున్న చిన్న గొంతులు తీరంలో మొదలు పెట్టిన చిన్న ప్రవాహాల్లా,

విద్యార్థుల చేతుల్లో ఎగ్జామ్ గైడ్‌లు, కెరీర్ బుక్స్

మూసీలా వంగి వంగి జీవితాన్ని హైదరాబాదిలో కలపడానికి పరుగెత్తుతుంటాయి

ఒక్కడిగా నడుస్తున్న ఒక రైటర్ కళ్లలో తన మొదటి పుస్తకంపై ఆశలు ….

ఆహార స్టాళ్ల వద్ద వేడివేడి సమోసాల వాసన, పక్కనే కవితా వేదిక నుంచి వినిపించే కవితా పఠనాలు

కొంపల్లి స్టేజీలు అని శెట్టి రజిత స్టేజి మీద ప్రదర్శనలు పుస్తక పరిచయాలు మేధావుల అనుభవాలు

అలా అక్కడే కొన్ని గంటల పాటు కూర్చొని నిలబడిపోయాను

యువకవుల డైరీలు, ఫెమినిస్ట్ ఎస్సేలు అన్ని కలిసిపోయి

సంగమం మీద సాయంత్రం సూర్యాస్తమయం పడినట్టుగాఒక బంగారు వెలుగును పుస్తకాలపై చల్లుతాయి.

ఇక్కడ ప్రతి స్టాల్ ఒక ఉపనది. ఏ దారిలో నడిచినా ఎక్కడో ఒక చోట నీ గుండెకు దగ్గరైన వాక్యం దొరుకుతుంది.

ఆ ఒక్క వాక్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా మనసులో మౌనంగా పారుతున్న

ప్రశ్నల నదులు ఒకేసారి ప్రశాంతంగా నిలబడిపోతాయి

తెలంగాణ భాష, సంస్కృతి, కలలన్నీ వివిధ ప్రవాహాల నుంచి వచ్చి

ఒక్క సారి ఆలస్యం లేకుండా అక్షరాల సముద్రంలో కలిసిపోయే నది నదుల సంగమం.

మంచి పుస్తకం కోసం తిరుగుతుంటే  చివరికి నాకు నేను దొరికాను

కొన్ని పుస్తకాలను మనం కొనలేం   కానీ సొంతం మాత్రం చేసుకోవచ్చు

అప్పుడే రాత్రి తొమ్మిది అయ్యిందా లైట్లు బంద్ చేశారు

 కానీ నాకు వెలుగు ప్రారంభమైంది

 

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను సందర్శించిన కవి  మహేష్ బల్ల  ప్రకటించిన ఈ కవిత హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను దర్శించని వారికి కూడా అక్కడి దృశ్యాలను చూపుతూనే ఆ దృశ్యాలకు కవి స్పందనను తెలియజేస్తుంది. “ఇది నిజానికి పుస్తక నది, మనసు నది, జ్ఞాపకాల నదులు కలిసే సంగమం” అంటూ కవి పుస్తకాలనే కాక అక్కడ కలిసే మిత్రుల సమయాలనూ చిత్రిక పట్టిన పద్ధతి హృద్యంగా ఉంది.

‘మంచి పుస్తకం కోసం తిరుగుతుంటే  చివరికి నాకు నేను దొరికాను’ అంటూ “అప్పుడే రాత్రి తొమ్మిది అయ్యిందా లైట్లు బంద్ చేశారు కానీ నాకు వెలుగు ప్రారంభమైంది” అని కవి మురిసిపోయినట్లు మురిసిపోని వారు అరుదు.

ఈ కవితలో కొంచం వచనం పాలు ఎక్కువైందనిపించినప్పటికీ కవితలోని భావుకత వచనాన్ని మించి కవి హృదయాన్ని ఆవిష్కరించింది. మనం పైన చెప్పుకున్నట్లు దృశ్యం కవిలో కలిగించే అనుభూతికి ఇదొక ఉదాహరణ. ఆ భావుకతను హృద్యంగా ప్రకటించగలగడమే  కవి ప్రతిభను నిర్దేశించగలదు.

యింకొక కవిత చూద్దాం.

 

జెట్టీల్లేని_తీరంలో..

నిద్దుర సరిహద్దుల మీదుగా ఏ అర్ధరాత్రో వాళ్ళు ఇల్లు దాటుతారు

అప్పటికి రేయి కూడా ఆదమరచి  నిద్రపోతూ ఉంటుంది  కత్తావలన్నీ కరవాక దగ్గర  తండేల్లయి నిలబడతాయి  

పల్దోం పుల్లలూ క్యారేజీలు పడవల్లో సర్దుకుంటాయి  వలలూ సిక్కాలు వరసపేర  డెక్కెక్కి చోటు చూసుకుంటాయి

 

దినమంతా దిబ్బల మీద నడుంవాల్చి పదిమంది ఎత్తి మోస్తే తప్ప ఒళ్ళు కదల్చని నాటు పడవలు..

నీళ్ళలోకి దించగానే తేలికవుతాయి  నురగల్ని నెట్టుకుంటూ ఒక్కొక్కటీ

ఒడుసు కెరటాల శిరసెక్కి ఒడుపుగా పెద్దపడి దాటుకెళతాయి

లంగరు కట్టుమీదున్న మరపడవలకు  బరువంతా బదిలీ చేసి విశ్రమిస్తాయి

 

పూలూ పిందెలు సహా సముద్రంతోటను ఆకు దూసినట్టు దోర్సుకెళ్ళే మెకనైజ్డ్ బోట్లు

వెలితిగా సాగే సాదావేటను వెక్కిరిస్తాయని తెలిసీ –

చెయ్యిచాచి సముద్రాన్నడిగితే  ఉత్తి చేతులతో ఒడ్డుకు పంపదని నమ్మి వలల కళ్ళతో ఇంజిన్ బోట్లు

చీకటి కుప్పల్లో నీసుకూనల్ని గాలిస్తాయి తోకమట్ట కదిపే చందమామల్నీ

తాండాలా తానకముండే తారల గుంపుల్నీ  పసిగట్టి గురిచుట్టి శక్తంతా కూడగట్టి

పరువుకొకపాళి ఉంచెట్టి ఒడికెత్తుకుంటాయి

తపతప కొట్టుకునే నీటికోడెల్ని దగ్గరగా చూడాలని సూర్యుడు సురసురమంటూ సిక్కంలో దూరుతాడు

 

నీరసపడిన దేహాలకూ అలసిన కండరాలకూ రాత్రి క్యారేజీ పొద్దున్నే బువ్వ పెడుతుంది

పడవల వాటా వలల వాటా పోనూ  కూలి పరిగెలు ఎన్ని కిడతాయో చూసి

మరపడవ వెనుదిరిగి లంగరెక్కుతుంది  అంతసేపూ లంగరు తాడు నడుముకి చుట్టి

నిమ్మళంగా కునుకు తీసిన చెక్క పడవ రిలే పరుగులో బ్యాటన్ అందుకుంటుంది

బరువెత్తుకొని, ఇక ఒడ్డు చేర్చే భారం  నీదేనంటూ కత్తావకేసి చూస్తుంది

 

యానగాలి రివ్వాట్లకు  ఒళ్లంతా ఉప్పుదేరుతుంది రొజ్జ కొట్టిన కళ్ళు ఎర్ర జీరలౌతాయి

రాకాసుల్లాంటి కెరటాలని గెలిచి వస్తే  కూలి దక్కుతుంది

సొరచేప పళ్ళలాంటి మరగడికి చిక్కిపోతే ప్రాణాలు నీళ్ళలో కలిసిపోతాయి

 

అంతులేని సంపదైతే చెంతనే ఉంది గాని గుప్పెడు మెతుకులు అందుకోవాలంటే

ప్రాణాలు అరచేత్తో పట్టుకొని  అగాదాల్లో మగాదాల్లో దిగాల్సొస్తుంది

లేదంటే, వలస పడవలై ఏ పశ్చిమ తీరాలకో  సాగిలబడాల్సొస్తుంది

 

తూరూపు సముద్రం సంపదంతా  పడవలకెత్తుకు రాగల పౌరుషం ఉందిక్కడ..

కళ్ళు కాయలుకాసి అలోడుతున్న తీరానికి  ప్రతి యాభై కిలోమీటర్లకొకటైనా

జెట్టీ హార్బర్లు కట్టివ్వగల నాథుడేడీ ఎక్కడా..?

 

నాటు పడవలలో చేపల వేటకు వెళ్ళే జాలరుల జీవిత చిత్రాన్ని హృద్యంగా దృశ్యమానం చేసిన కవి కంచరాన_భుజంగరావు ఈ కవితను ప్రకటించారు. పై కవిత ఎంత స్పష్టంగా ఉందో వారి జీవితాలపై కవి స్పందన అంత హృద్యంగానూ ఉంది.

*

చంద్రశేఖర్ కర్నూలు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు