నాన్న (జస్ట్ ఎ బయోలాజికల్ ఫాదర్)

నాకు పద్దెనిమిదేళ్లు రాగానే, మన మురికివాడలోని ఆడపిల్లల లాగానే ఒక సౌదీ ఇంట్లో కద్దామా (హౌస్ మెయిడ్) పని చెయ్యడానికి రియాద్ పంపించారు. ఎవరైనా కన్నవాళ్ళను, ఊరిని వదిలి వెళ్లాలంటే బాధపడతారు. కానీ నేను మాత్రం ఎంతో సంతోషంగా వెళ్ళాను.

1.

ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనిలా నగరంలో ఉన్న వందలాది మురికివాడల్లోకెల్లా అత్యంత పెద్దదైన తోండో మురికివాడలో సాయంత్రపు రొద మెల్లగా వేడెక్కుతోంది.

నల్లని తారులాంటి మురికినీరు పారే కాలువ, కాలువ నిండా చెత్త, చెదారం. ఆ చెత్తలో పందుల గుంపు, ఆ పందుల గుంపు మీద దోమల, ఈగల రొద. ఆ కాలువ మీదుగా కట్టి ఉన్న వందలాది అగ్గిపెట్టె లాంటి చెక్క ఇళ్లు. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని మీద మరొకటి, ఒక దానిలోపల మరొక్కటి.

అలాంటి ఒక ఇంట్లో, రెండురోజుల్లో జరగబోయే తన పెళ్లి వేడుక కోసం ఇంటిని శుభ్రం చేస్తున్న జార్విస్‌కు స్టోర్ రూంలో ఉన్న ఒక సూట్ కేసులో ఒక పాత ఎన్వలప్ కనిపించింది. ఆ ఎన్వలప్ లో ఒక ఫోటో ఉంది.ఫొటోలో వాళ్ళ అమ్మ లోరి ఇటుక రంగు ఫ్రాక్ వేసుకుని పక్కన ఉన్న మనిషి చెయ్యి పట్టుకుని, తన తలను అతని భుజానికి ఆనించి నవ్వుతోంది. ఫొటోలో అమ్మ మొహం మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది. పక్కన ఉన్న మనిషి మొహం మీద తెల్లని గీతలు ఉన్నాయి. ఎవరో ఉద్దేశపూర్వకంగా పిన్నుతో గీరేసినట్లు, బహుశా కోపంతో అయ్యుండొచ్చు.

ఆ ఎన్వలప్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. ఆ పాత ఉత్తరాన్ని తీసి, చదవడం మొదలు పెట్టింది.

 

రియాద్,

21-9-1998

ప్రియమైన లోరి,

నీ ఉత్తరం అందింది. నువ్వు, మన పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ ఇద్దరి గురించి నేను రోజూ దుఆ చేస్తున్నాను. ఇక్కడ నేను బాగానే ఉన్నాను, కానీ నిన్ను ప్రాణంగా మిస్ అవుతున్నాను. నిన్ను, నా బుజ్జాయిని ఎప్పుడెప్పుడు చూడాలని ఆతృతగా ఉన్నాను.

లోరి.. నా  జీతం గురించి నీకు తెల్సిందే . ఊర్లో మా కుటుంబం అప్పులు తీర్చడానికే ఆ జీతం సరిపోవట్లేదు. మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకుందామంటే… ఫ్యామిలీ వీసాకి కట్టాల్సిన ఫీజులు, మీ ఇద్దరి విమానం టిక్కెట్లు కొనేంత స్థోమత నాకు లేదు. పోనీ ఎలాగోలా అప్పు చేసి మిమ్మల్ని తీసుకొచ్చినా… ఈ ఎడారి దేశంలో మనం ఒక చిన్న గది అద్దెకు తీసుకుని, బతకాలంటే నాకొచ్చే ఈ డ్రైవర్ జీతం ఏ మూలకూ సరిపోదు. అయినా సరే, నాకు చేతనైనంతలో మీకోసం పైసలు కూడబెడుతున్నాను. ఎలాగైనా మీమ్మలని నా  దగ్గరకు తెచ్చుకోవాలని ఉంది, కానీ నా చేతుల్లో చిల్లిగవ్వ లేదు. మీకు కనీసం ఖర్చులకు డబ్బులు కూడా పంపలేకపోతున్న ఈ నిస్సహాయత నన్ను చంపేస్తోంది.

దయచేసి నాకు కొంచెం టైమ్ ఇవ్వు. ఈ సారి ఉత్తరంలో నా బుజ్జాయి ఫోటో పంపించు.

మీ ఇద్దరి గురించే ఆలోచిస్తూ…

నీ,

షరీఫ్.

ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి జార్విస్ ఒళ్ళంతా చెమట. మెదడునిండా ఎన్నో ప్రశ్నలు. ఆ ఉత్తరం పట్టుకుని వణుకుతున్న చేతులతో వెంటనే ఇంటిబయట కూర్చొని ఉన్న అమ్మ దగ్గరకు వెళ్ళింది.

“అమ్మా! ఈ లెటర్ ఏంటి ? ఈ ఫొటోలో నీ పక్కన ఉన్నది ఎవరు? ఆ బుజ్జాయి  ఎవరు అమ్మా?”

జార్విస్ అడిగిన ప్రశ్నలకు లోరి ఉలిక్కిపడింది. ఆ ఉత్తరం చూడగానే ఆమె కళ్లలో ఇరవై ఏళ్ల క్రితం నాటి ఎడారి ఇసుక తుఫాను రేగింది. చిన్నగా, చేదుగా నవ్వి ఆ ఫోటో వెనుక ఉన్న కథ చెప్పటం మొదలు పెట్టింది.

2.

నాకు పద్దెనిమిదేళ్లు రాగానే, మన మురికివాడలోని ఆడపిల్లల లాగానే ఒక సౌదీ ఇంట్లో కద్దామా (హౌస్ మెయిడ్) పని చెయ్యడానికి రియాద్ పంపించారు. ఎవరైనా కన్నవాళ్ళను, ఊరిని వదిలి వెళ్లాలంటే బాధపడతారు. కానీ నేను మాత్రం ఎంతో సంతోషంగా వెళ్ళాను. నేనే కాదు, ఈ మురికి వాడల్లో పెరిగి పెద్దయిన ప్రతీ ఆడ, మగా అలానే ఫీల్ అవుతారేమో. ఈ దుర్భర జీవితం నుంచి విముక్తి పొందినందుకు ఒక రకమైన సంతోషం.

ఎయిర్పోర్టులో ఫ్లైట్ లో కూర్చోగానే యావజ్జీవ జైలు శిక్ష అనుభవించిన ఒక ఖైదీ, జైలు నుంచి విడుదల అయ్యే ఫీలింగ్. పద్దెనిమిదేళ్లు ఒక నరకం లాంటి ఈ మురికి కూపం లోంచి బయటపడ్డానన్న ఆనంద భాష్పాలు నా కళ్ళలో.

ఇష్టంతో వెళ్ళాను కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా ఆ సౌదీ ఇంట్లో ఇమిడిపోయాను. రాజభవనం లాంటి ఇల్లు, తినడానికి మూడు పూటల భోజనం, ఉండటానికి శుభ్రమైన ఒక చిన్న గది. పని ఎక్కువగా ఉన్నా ఆ మురికి నరక జీవితంతో పోల్చితే ఎంతో మేలు.

చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది.

ఒక రోజు కిచెన్ లో పనిచేసుకుంటుండగా, మా అరబ్బీ సార్ (బాబా) వచ్చిడ్రైవర్ రూంలో కొత్తగా వచ్చిన డ్రైవర్ కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వమని చెప్పాడు. నేను పొద్దున్న చేసిన మకరోని ఫ్రిడ్జ్ లోంచి తీసి అతనికి ఇవ్వడానికి ఇంటి బయట ఉన్న డ్రైవర్ రూమ్ దగ్గరకి వెళ్ళాను.

తలుపు సగం తెరిచి ఉంది. మెల్లగా తొంగి చూసాను. ఒక మనిషి పరుపు లేని స్టీల్ మంచం మీద తల వంచుకు కూర్చొని ఉన్నాడు. కార్డు బోర్డు లగేజి పెట్టె కింద అలాగే నిలబెట్టి ఉంది. కొంచెం ముందుకు వెళ్లి నిలబడ్డాను. ఆ మనిషి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది.

అతనిని అలా ఏడుస్తూ చూడగానే, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కాసేపటి తరువాత వద్దాం అనుకుని వెనక్కి తిరిగాను. మళ్లీ గంట తర్వాత వెళ్ళాను. ఇప్పడు అతని ముఖంలో అతను తన పరిస్థితిని అర్థం చేసుకుని, ఈ గల్ఫ్ బతుకు అనే చేదు నిజంతో  రాజీపడినట్లు కనిపించింది. టక్ టక్ మని డోర్ మీద కొట్టాను.

అతను మంచం మీద నుంచి నిలబడి, కళ్ళు నేలకు దించి భయంగా చూస్తున్నాడు. నాకు నవ్వొచ్చింది.

“బాబా… బ్రేకఫాస్ట్ ఇవ్వమన్నారు! నేను ఈ ఇంట్లో కద్దామా నీ!” అని చెప్పి, ఆ ప్లేట్ బయట మెట్ల మీద పెట్టి వెనక్కి తిరిగాను.

అతని పేరు షరీఫ్ నూరుద్దీన్. ఇండియాలోని కేరళ రాష్ట్రానికి చెందినవాడు. నాలాగే ఇంటి పేదరికం సముద్రాలు దాటించింది. నేను సంతోషంగా వచ్చాను, పాపం అతను ఇంటిమీద బెంగతో, భారంగా వచ్చినట్లు ఉన్నాడు.రోజులు గడిచేకొద్దీ గాయం నయమైనట్లు , షరీఫ్ కూడా ఆ ఇంటికి, ఆ పనిలో మెల్లగా సెటిల్ అయ్యాడు. మేమిద్దరం ఎక్కువగా కలవడం, మాట్లాడుకోవడం ఉండేది కాదు.

ఒక రోజు బాబా నన్ను పిలిచి తిట్టాడు. ‘షరీఫ్‌కి ఇచ్చే బ్రేక్ ఫాస్ట్  సరిగ్గా ఉండట్లేదంట ,తినడం కష్టం అవుతుందని కంప్లైంట్ చేశాడు’ అన్నాడు.

నాకు కోపం వచ్చింది.మరుసటి రోజు కావాలనే ఇంకా ఎక్కువ ఆయిల్, కారం వేసి ఆమ్లెట్ చేశాను. అలా ఓక మూడు రోజుల పాటు చేశాను. నాలుగవ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడానికి వెళ్ళినపుడు షరీఫ్ నాతొ మాట్లాడాడు.

‘సారీ… బాబా కి చెప్పకుండా ఉండాల్సింది’ అన్నాడు తప్పు చేసిన పిల్లాడిలా.

‘ఫుడ్ వండేది నేనా? బాబానా?’ అని కోపంగా అడిగాను.

‘మీరే’

‘మరి బాబాకి చెబితే ఏమవుతుంది? ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా? ‘ అంటూ కాస్త గట్టిగ

అడిగాను.

‘సారీ…’ అంటూ మౌనంగా తల వంచుకుని బ్రేక్ ఫాస్ట్ ప్లేట్ తీసుకున్నాడు. ఆ అమాయకపు మొహం, అతని చేతుల్లో ఉన్న ఆ కారపు ఆమ్లెట్ చూడగానే నాకే జాలేసింది.

‘ఆగు ! దాంట్లో ఉప్పు, కారం ఈరోజు కూడా ఎక్కువగా వేసాను. మళ్ళీ చేసుకొస్తాను’ అని చెప్పి లోపలి వెళ్లి మంచి ఆమ్లెట్ వేసుకుని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాను.

‘షూక్రాన్ (ధన్యవాదాలు)’ అంటూ నవ్వాడు.

ఆ తరువాత మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. వీలున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. ఆ అరబ్బీ ఇంట్లో మేమిద్దరమే ఖార్జీలం (పరాయి వాళ్లం). ఎడారి దేశపు ఇసుక గాలుల మధ్య ఆ ఇంటి నాలుగు గోడలే మా ప్రపంచం. కష్ట, సుఖాలు, బాధలు పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళం. నాకు వచ్చిన అరబ్బీ భాషను అతనికి నేర్పించేదానిని. షరీఫ్ మీద ఆ అరబ్బీ ఇంట్లో మెల్లగా నమ్మకం కుదిరింది. మెత్తని మనిషి, భాషకూడా రాదు, చెప్పిన పని కాదనకుండా చేసేవాడు. అతను డ్రైవర్ అయినా అతనితో తోట పని, క్లీనింగ్… ఇలా అన్ని పనులు చేయించేవాడు మా బాబా.

‘నీతో ఎక్కువ పని చేయిస్తున్నారు, నేను డ్రైవర్ ని ఇవన్నీ చెయ్యను అని చెప్పు’ అని చాలా సార్లు కోపప్పడేదాన్ని.

‘ఖాళీగా ఉంటే ఊళ్ళో ఉన్న అమ్మ గుర్తొస్తోంది లోరి.. అందుకే ఇలా ఇచ్చిన పని చేస్తూ నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నాను’ అన్నాడు.

ఆ మాట విన్నాక నాకు అతని మీద ఉన్న జాలి కాస్తా ప్రేమగా మారింది. తనకోసం నేను ఇష్టంగా మలయాళీ వంటలు తెలుసుకుని వండేదాన్ని. అతను కూడా నా మీద ప్రేమతో సెలవు రోజు బయటకు వెళ్ళినప్పుడు నాకోసం చిన్న చిన్న బహుమతులు తెచ్చేవాడు.సొంత మనుషులకు, మట్టికి దూరంగా ఒంటరిగా ఉన్న ఇద్దరు అనాథ ప్రాణులు కలుసుకుంటే, ఆ బంధం రక్తం పంచుకుపుట్టిన బంధం కన్నా గట్టిగా ముడిపడుతుంది జార్విస్!

ఒక ఎండాకాలం… మా అరబ్బీ కుటుంబమంతా సెలవులకు వేరే దేశం వెళ్ళారు. ఆ పెద్ద ఇంట్లో నేను, షరీఫ్ ఇద్దరమే మిగిలాం. ఆ పదిహేను రోజులు మేమిద్దరం చిలకా గోరింకల్లా గడిపేసాం. ఎలాంటి పని లేని ఆ  ఇంట్లో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాం. సాయంత్రం పూట కార్లో రియాద్ సిటీ మొత్తం షికారుకు వెళ్ళేవాళ్ళం.ఇష్టమైనది వండుకుని తినే వాళ్ళం.

ఆ పదిహేను రోజులు నేను అతని ఇరుకు  గదిలోనే అతని గుండెల మీద పడుకున్నాను. ఎన్నో కబుర్లు, ఎన్నో ఆశలు. రెండు వేర్వేరు దేశాలు, రెండు వేర్వేరు మతాలు అనే స్పృహ కూడా లేనంతగా ఇద్దరం ఏకమయ్యాం.

సెలవులు ముగిసి బాబా వాళ్ళు వచ్చారు. మూడు నెలల తరువాత నా శరీరంలో  మార్పులు మొదలయ్యాయి. అవును, నేను ప్రెగ్నెంట్ అయ్యాను.

గల్ఫ్ దేశంలో పెళ్ళికాకుండా ప్రెగ్నెంట్ అవ్వడం అంటే పెద్ద నేరం. చట్టప్రకారం జైలు శిక్ష, లేదా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు ఉంటాయి. అక్కడ అబార్షన్ అనేది కూడా చట్టవిరుద్ధం.

ఏమి చెయ్యాలో తెలియక షరీఫ్, నేను ఎంతో భయపడిపోయాం. ఒక వైపు ప్రెగ్నెన్సీ వల్ల నేను ఇంట్లో పని చేసుకోలేకపోయేదాన్ని, కళ్ళు తిరిగి పడిపోవడం , వాంతులు మొదలయ్యాయి . ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం మొదలైయ్యింది . ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇద్దరం జైలు పాలు అవుతామని నేను మెట్లు దిగుతూ కావాలనే కింద పడిపోయినట్లు నటించాను. వెన్నెముక దెబ్బతిందని, ఇక పని చేయలేనని , నన్ను  ఇంటికి పంపించెయ్యమని ఏడ్చాను.

ఇక్కడ హాస్పిటల్ ఖర్చులకు భయపడి బాబా నన్ను వెంటనే ఫిలిప్పీన్స్ కి పంపించేసాడు.

ఎయిర్ పోర్ట్ లో నన్ను వదిలేటప్పుడు షరీఫ్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ‘నువ్వు జాగ్రత్తగా వెళ్లు లోరి,  మనం పెళ్లి చేసుకుని , కలిసి ఉండే దారి చూస్తాను!’ అని మాట ఇచ్చాడు.

ఆ మాట నమ్మి నేను ఈ మురికి కూపంలో మళ్ళీ అడుగుపెట్టాను. నా కడుపులో ఉన్నది నువ్వే జార్విస్!” అని కన్నీళ్లు తుడుచుకుంది లోరి.

3.

లోరి చెప్పిన గతం విన్న జార్విస్ కు పద్మవ్యూహంలో చిక్కుకున్న పక్షిలా అనిపించింది. ఎన్నో ప్రశ్నలు మనస్సుని, మెదడుని తొలిచేస్తున్నాయి.

“మరి నువ్వు తిరిగి ఎందుకు వెళ్లలేదమ్మా? ఆ ఉత్తరానికి జవాబు రాయలేదా ?”

“రాయలేదు.” దృఢంగా చెప్పింది లోరి.

“ఎందుకమ్మా? ఆ ఉత్తరం చదువుతుంటే నీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు అనిపించింది. డబ్బుల్లేక బాధపడుతున్నాడు. పైసలు కూడబెట్టుకుని వస్తాను, వెయిట్ చేయమన్నాడు కదా?”

“అవును జార్విస్, అతను నన్ను ప్రాణంగా ప్రేమించాడు. కానీ ప్రేమ అనేది ఎప్పుడూ పేదరికం చేతుల్లో కీలుబొమ్మ లాంటింది .అది ఆడించినట్లు మనం ఆడాల్సిందే.  తన కుటుంబ అప్పులు తీర్చడానికి  తన జీతాన్ని , జీవితాన్ని ధారపోస్తున్న ఒక సాధారణ డ్రైవర్ అంత డబ్బు ఎలా కూడబెట్టగలడు ?

“కానీ తను ట్రై చేస్తున్నాడు కదా అమ్మా…” అడ్డుపడింది జార్విస్.

“నేను నెలల తరబడి ఎదురుచూశాను. కానీ అతని నుంచి వచ్చే ఉత్తరాల్లో ‘ఇంకొన్నాళ్లు ఆగు, పైసలు కూడబెడుతున్నాను’ అనే ఆశ తప్ప, అది నిజమవుతుందన్న నమ్మకం కనిపించలేదు. ఈ మురికివాడలో నువ్వు ఆకలితో ఏడుస్తుంటే, అతనెప్పుడో వస్తాడని ఆకాశం వైపు చూస్తూ కూర్చోలేకపోయాను.”

జార్విస్ మౌనంగా వింటోంది.

“ప్రేమతో కడుపు నిండదు జార్విస్. ఒక పేద వలస కార్మికుడు రాత్రికి రాత్రే అద్భుతాలు చేసి మనల్ని కాపాడలేడని నాకు అర్థమైపోయింది. ఆ నిస్సహాయత అతనిది, నేను కాదనను. దానికి అతనిని నిందించట్లేదు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టే అతనిని బలవంతం చెయ్యాలనుకోలేదు.

అందుకే ఆ ఉత్తరాలకు జవాబు రాయడం ఆపేసి, కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టాను. షరీఫ్ కోసం ఎదురుచూసే లోరి ని చంపేసి, నీ ఆకలి తీర్చే అమ్మగా మారాను.” అంటూ లోరి కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడినుంచి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది.

4.

చేతిలో ఆ పాత ఉత్తరాన్ని, గీతలు పడి ఉన్న ఆ తండ్రి ఫోటోని పట్టుకుని అక్కడే నిలబడిపోయింది జార్విస్.ఇన్నేళ్ళుగా తెలియని ఈ నిజం, ఇప్పుడే ఎందుకు తెలియాలి? సరిగ్గా తన పెళ్లికి రెండు రోజుల ముందు, తన చెయ్యి పట్టి చర్చిలో నడిపించడానికి తండ్రి లేడన్న వెలితిని ఫీల్ అవుతున్న ఈ క్షణంలో ఎందుకు బయటపడాలి?

ఇన్నేళ్లు నాన్న లేడని, అమ్మే తనకు అన్నీ అని బతికింది. కానీ ఇప్పుడు ఎక్కడో దూరంగా, వేరే దేశంలో తనకొక నాన్న ఉన్నాడని, ఒకప్పుడు తనను చూడాలని తపన పడ్డాడన్న నిజాన్ని నమ్మలేకపోతోంది .

“నాన్న ఎలా ఉన్నాడో ఇప్పుడు? నా గురించి, అమ్మ గురించి ఇంకా గుర్తుండి ఉంటుందా? వేరే పెళ్లి చేసుకుని, జీవితంలో ముందుకెళ్ళిపోయి ఉంటాడా? తన పిల్లల్ని చూసుకున్నప్పుడల్లా నేను గుర్తొస్తానా? ఎడారి దేశంలో ఒంటరితనం ఇద్దరు మనుషులను ఎలాగైతే కలిపిందో, తిరిగి ఆ ఒంటరితనాన్నే మా ముగ్గురికీ పంచిందా? అసలు నేను ఆ మనిషిని నాన్న అని ఎందుకు అంటున్నాను ? అసలు నాన్న అంటే ఎవరూ ? నా జన్మకు కారణమైనంత మాత్రాన నాన్న అవుతాడా? కాదేమో? మే బి  హి ఐస్ జస్ట్ ఆ బయోలాజికల్ ఫాదర్ ?”  ఈ ప్రశ్నలన్నీ జార్విస్ మెదడుని తొలిచేస్తున్నాయి.

ఒకవైపు తన జీవితంలోకి రాబోతున్న కొత్త భాగస్వామి , మరోవైపు కొత్తగా దొరికిన జవాబులు లేని ఒక బరువైన ప్రశ్నల పుస్తకం . ఈ ప్రశ్నల పుస్తకాన్ని  జీవితాంతం ఒక భారంలా మోయాల్సిందేనా? లేక తన తండ్రి ఊహలను చంపేసి తన కోసం బతికిన అమ్మలాగా… ఈ కాగితాలను ఇక్కడే చించేసి మూవ్ ఆన్ అవ్వాల్సిందేనా?

కానీ, జార్విస్ మనసు అమ్మలా రాజీపడలేకపోయింది. తన ఉనికికి కారణమైన ఆ మనిషి అసలు ఏమయ్యాడో తెలుసుకోవాలన్న తపన ఆ క్షణంలో ఆమెను ఆవహించింది. అమ్మకు అతను కేవలం ఒక చేదు గతం కావచ్చు… కానీ జార్విస్ కు మాత్రం, అతను తన సగం అస్తిత్వం… తన నాన్న!

5.

జార్విస్ పెళ్లి అయ్యి ఏడాది గడిచిపోయాయి. ఆమె జీవితంలో చాలా మార్పులొచ్చాయి. జార్విస్ ఇప్పుడు నిండు గర్భిణి. వచ్చే నెలలో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాను తల్లయ్యేలోపు, తన నాన్న గురించి తెలుసుకోవాలన్న తపన ఆమెలో మరింత బలపడింది.జార్విస్ బాధను తపనను పూర్తిగా అర్థం చేసుకున్న ఆమె భర్త కొండంత అండగా నిలబడ్డాడు. ముందుగా, తనకున్న టెక్నికల్ పరిజ్ఞానంతో, పిన్నుతో గీరేసి చెదిరిపోయిన ఆ పాత ఫోటోలోని నాన్న ముఖాన్ని కొంచెం క్లియర్‌గా కనిపించేలా ఎడిట్ చేశాడు. ఆ ఫోటోతోనే నాన్నను వెతికే వాళ్ళిద్దరి ప్రయాణం మొదలైంది.

ఎంతో బతిమాలగా, అమ్మ లోరి దగ్గర్నుంచి ఆ పాత సౌదీ కఫిల్ (యజమాని) వివరాలు సంపాదించింది. వాటి ఆధారంగా ఫేస్బుక్ లో ‘కేరళ ఎక్స్-పాట్స్’, ‘మలయాళీస్ ఇన్ రియాద్’ లాంటి గ్రూపుల్లో జాయిన్ అయ్యింది. పిన్నుతో గీరేసి ఉన్న నాన్న పాత ఫొటోను, ఆ ఉత్తరాన్ని అందులో పోస్ట్ చేసింది. “ఇరవై ఏళ్ల క్రితం రియాద్ లో పనిచేసిన ఈ వ్యక్తి కోసం వెతుకుతున్నాను, ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి” అని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్ పెట్టిన వారం రోజులకి… ఒకరోజు రాత్రి జార్విస్ మెసెంజర్ కి ఒక అపరిచిత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది.

“నాకు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తెలుసు…”

ఆ ఒక్క వాక్యం చదవగానే జార్విస్ గుండె ఆగినంత పనైంది. చేతులు వణికాయి. ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెరపడబోతోందన్న ఉద్వేగంతో ఊపిరి వేగంగా పీల్చుకుంది.

“అతను మా ఊరి వాడే. కేరళలోని కంజిరపల్లి మా ఊరు. కానీ… దయచేసి నువ్వు పెట్టిన ఆ పోస్ట్ ని వెంటనే డిలీట్ చెయ్” అని మరో మెసేజ్ వచ్చింది ఆ వ్యక్తి నుంచి.

“ఎందుకు? మా నాన్న ఎలా ఉన్నాడు? ఏమైంది ?” ఆత్రంగా రిప్లై ఇచ్చింది జార్విస్.

“అతనికి ఇప్పుడు వేరే కుటుంబం ఉంది. పెళ్లాం, ముగ్గురు కూతుర్లు. ఆ ముగ్గురు ఆడపిల్లలకి ఇప్పుడు పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. నీ పోస్ట్ ఎవరైనా చూస్తే అతని పరువు పోతుంది, ఆ పిల్లల పెళ్లిళ్లు ఆగిపోతాయి. దయచేసి అతని జీవితాన్ని నాశనం చేయొద్దు. ఇక నాకేం మెసేజ్ చేయకు,” అని పంపించి ఆ వ్యక్తి ఆమెను బ్లాక్ చేశాడు.

జార్విస్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. సెల్ ఫోన్ స్క్రీన్ మీద ఆ అపరిచిత వ్యక్తి పంపిన ఇంగ్లీష్ అక్షరాలు కళ్ల ముందు మసకబారుతున్నాయి.

జార్విస్ కు నాన్న దొరికాడు. కానీ, దొరికిన క్షణంలోనే శాశ్వతంగా దూరమయ్యాడు!

“నేను నాన్న జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తాను? నేను అతని డబ్బు కోసమో, ఆస్తుల కోసమో అతనిని కలవాలనుకోవట్లేదు కదా!” జార్విస్ మనసులో ఆక్రోశం కట్టలు తెంచుకుంది.

ఆమె అతనిని వెతుకుతుంది  “నేను బతికే ఉన్నాను నాన్నా, బాగున్నాను. నా తల్లి నన్ను వదిలించుకోలేదు, ప్రాణంగా పెంచుకుంది,” అని చెప్పాలని మాత్రమే. తన జీవితంలో ఉన్న ఆ చిన్న వెలితి ని పూడ్చుకోవాలని మాత్రమే.

కానీ… తన ఆ చిన్న వెలితిని పూడ్చుకునే ప్రయత్నంలో, ఎక్కడో కేరళలో ఉన్న ముగ్గురు అమాయకపు ఆడపిల్లల జీవితాల్లో, ఆ కుటుంబంలో  తుఫాను రేపడం న్యాయమేనా? తండ్రి ప్రేమకు నోచుకోక తను ఇన్నేళ్లు ఎంత నరకం అనుభవించిందో, తన ఒక్క పోస్ట్ వల్ల ఆ ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు అదే నరకాన్ని అనుభవిస్తారు కదా!

ఆ ఆలోచన రాగానే జార్విస్ చేతులు దానంతట అవే మొబైల్ కీప్యాడ్ మీదకు వెళ్ళాయి. ఫేస్బుక్ గ్రూప్ లో తను పెట్టిన పోస్ట్ ను డిలీట్  చేసింది.

తన కడుపులో కదులుతున్న బిడ్డను రెండు చేతులతో ఆప్యాయంగా తడిమింది. ఇన్నేళ్లుగా తన గుండెలో పేరుకుపోయిన బరువు ఒక్కసారిగా కరిగిపోయి కన్నీరులా జారింది. తన నాన్నెవరో దొరికాడు. అతను బతికే ఉన్నాడు. అంతే చాలు.

ఒక ఎడారి దేశపు ఒంటరితనంలో పుట్టిన ప్రేమకు సాక్ష్యంగా తను ఈ ప్రపంచంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రపంచంలో తన నాన్న జీవితం పచ్చగా ఉండటం కోసం, తన ఉనికిని శాశ్వతంగా ఒక రహస్యంగానే మిగిల్చేయాలని నిర్ణయించుకుంది జార్విస్.

డెస్క్ లో ఉన్న ఆ పాత ఉత్తరాన్ని, గీతలు పడిన ఫోటోని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చింపి , కిటికీలోంచి ఇంటి కింద పారుతున్న నల్లని మురికి కాలువలో పడేసి, నీళ్లు నిండిన కళ్ళతో వెళ్లి తన భర్తను కౌగిలించుకుని చిన్న పిల్లలా ఏడ్చింది.

*

సంజయ్ ఖాన్

నా పేరు సంజయ్ ఖాన్. ప్రస్తుతం రియాద్, సౌదీ అరేబియా లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , కథలు , కవిత్వం ఇష్టంగా చదువుతున్నాను, ఇవి నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎప్పుడు కథలు చవడమే గాని రాయాలని అనుకోలేదు . అనుకున్న నేను రాయలేను ,లేదా రాసేంత సాహిత్య జ్ఞానం నాకు లేదులే అని తప్పించే వాడిని. కానీ గల్ఫ్ దేశాల్లో నేను చూసిన , మాట్లాడి తెలుసుకున్న మన తెలుగు వాళ్ళ వ్యధలు, కథలు నన్ను కదిలించి ఈ కథలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. పుస్తక పఠనంతో పాటు ట్రావెలింగ్, రన్నింగ్ నా హాబీస్.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • This is really so nice Sanjay,
    Soo emotional and touching story ,
    Each and every line was well written with great emotions

    Not an easy genre and story to choose to ,

    Very difficult genre different story and well composed and written .

  • కథ హృదయాన్ని మెలిపెట్టింది. నిజం! పేదలకు ప్రేమను నిలబెట్టుకునే అవకాశం లభించదు. కానీ ఆ తండ్రి (మెసేజ్ పెట్టిన వ్యక్తి తండ్రి అనే అనుకుంటున్నాను) అలా ప్రవర్తించకూడదు. జార్విస్ హృదయం కలది. మీ కథలు గతంలో చదివాను. బాగుంటాయి. నిజ జీవిత కథలు కధా! అభినందనలు. 💐💐

  • ఎంత సింపుల్ గా ఎడారి జీవిత విషాదాన్ని అక్షరాల్లోకి వొంపారో… గ్రేట్!

  • కథ చాలా బావుంది. వాస్తవిక జీవితం వేరు అన్నది ఎంతో హృద్యంగా చిత్రించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు