మామూలు మధ్య తరగతి ఇంట్ల బుట్టి పట్నం గల్లీలల్ల పొర్లుకుంట పెరిగి, ఇక్కడి పోకడ ఒంటికి పులుముకున్న గిసొంటి పాత బస్తీ పైల్వాన్, కైత్కం రాసుట్ల సూర్మార్ ఖాన్ మన ఆశారాజు సారు. కైత్కం అంటే ఆయినెకు పానం గాదు, గది ఆయినెంబడి నడిచె నీడ.
చార్మినార్ సాచ్చికంగా ముత్యాల నగరం ముచ్చట్లు తన కీసల నింపుకుని,అచ్చరాల నగిషీలు దిద్దిన సాహితీవేత్త. బతుకును ప్రేమించుకుంటనే, సుట్టుపక్కలున్న సంగం సెగలను, మన్షుల దిక్కత్ లను కైత్కంగ మల్సుడు మస్తుగుంటది. సెంట్రల్ గవుర్మెంటు కొలువు జేసినా, మనసు మాత్రం గీ సాయిత్యం దిక్కే మొగ్గింది.
మొదట్ల ఇరవయైదు దాన్క కతలు రాసి తన కలం పదనెంతటితో చూపి, తర్వాత అసలు సిసలు కవి అయిండు. తనకంటూ ఒక తొవ్వ ఏర్పాటు జేసుకున్న అచ్చరాల వస్తాదు మన ఆశారాజు సారు.
శ్రీ శ్రీ ‘మహా ప్రస్థానం’ ఆయినెను పరేషాన్ చేస్తే, సాయిర్ లుథియాన్వి కైత్కం ఆయినె సూపుకు కొత్త రంగులద్దింది. శివారెడ్డి సారును గురువులెక్క తల్సుకుని కైత్కపు లోతుపాతులను, చుట్టున్న సమాజం ఎగుడు దిగుళ్లను గుండెకు పట్టించుకున్నడు మన సారు.
ఇప్పటి దాన్క ఇర్వైమూడు కవితా సంపుటాల అత్తరు.. లోకానికి పంచిపెట్టిన ఆయినె పుస్తకాలు కన్నడం, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషలల్ల కూడా మెర్సినై. ఇరవై కంటే ఎక్కువనే అవార్డ్లు ఆయ్నను ఎతుక్కుంటచ్చినై.
“మన్షులను ప్రేమించుడు దప్పమరో విద్య తెల్వదు” అనుకుంటూ ఎతుకులాట సాగిస్తున్న గీ “రాజా హైదరాబాదీ” నిజంగ మన తెలంగాణ గర్వించేటి కవి.
గీ మషూ(శూ) ర్ షాయర్ రాసిన కైత్కం “ఒక్క రోజైనా జైలు తాళాలు పారేసి పోరు” ల హైదరబాద్ బిర్యాని అసొంటి గుమగుమలు ఎట్లున్నయో సూడున్రి జర.
ఒక్క రోజైనా జైలు తాళాలు పారేసి పోరు 
అత్తర్ పరిమళం వేరు
షరాబ్ నిషా వేరు
కళ్లమీద అల్లుకొన్న
సాలె గూళ్ల వలలు వేరు
మనిషికి రెక్కలిచ్చే
కలల బలం వేరు
చాలా యేండ్ల తర్వాత
జీవితం నన్ను అర్థం చేసుకుంది
కానీ, అప్పటికే,
అక్కడి వంతెన కూలిపోయింది
బ్యాండు బాజాతో
బారాత్ ముందుకు వెళ్లిపోయింది
మరణించిన వీరులు
చాలాసార్లు కలలోకి వస్తున్నారు
అమాయకులను విడిపించాలనుకుంటే,
ఒక్క రోజైనా గేటు దగ్గర
జైలు తాళాలు పారేసిపోరు
ఇష్టమైన దాన్ని దానం చేయొచ్చు
కష్టపడి పొందిన దాన్ని పోగొట్టుకోవచ్చు
జ్ఞాపకం పెట్టుకో…
జీవితాన్ని, ఎలాపడితే,
అలా వాడుకోవద్దు
ఈ మనుషులను తెలుసుకోవడానికి
నేను ఎందరికో దూరం కావాల్సివచ్చింది
అందరినీ కలుపుకోవడానికి
నేను చాలా వాటిని
పోగొట్టుకోవాల్సివచ్చింది
వాళ్లు పడవల్లో నా వెంటపడ్డారు
నాకు ఈత రాదని తెలిసి కూడా
నేను మునిగిపోతుంటే
అందరూ నవ్వుకొంటూ
సెల్ఫీలు తీసుకున్నారు
స్నేహం వేరు
ప్రేమ వేరు
ఆ రెండిటినీ వెదుక్కుంటూ
మనుషులు ఆగమై పోయారు
-ఆశారాజు
నిఖార్సయిన నిజాయితీ.. సురకలు పెట్టే సూటి మాట.. గిదే ఈ కవితలో వున్న అసలైన దమ్ము. బతుకులో ఎదురయ్యే చిక్కుముళ్లను, ఎదలో సాగే తండ్లాటను ఆశారాజు సారు అద్దంల చూపించినట్టు చూపించిండ్రు. ఉన్న ఊళ్లెనే ఉండి లోకాన్ని ఎట్లా సూడాలో, తక్కువ మాటల్నే వాడి ఎక్కువ లోతును ఎట్లా పలికించాల్నో సారుకు ఎరుకైనంత ఇంకెవ్వరికీ ఎరుకకాదు.
“చాలా యేండ్ల తర్వాత
జీవితం నన్ను అర్థం చేసుకుంది
కానీ, అప్పటికే,
అక్కడి వంతెన కూలిపోయింది”
ఈ వాక్యాలు సదువుతుంటే.. ఎప్పుడో తీరాల్సిన కోరికలు తీరినప్పుడు అచ్చే నిరాశ కళ్లముందు కదులుతది. దప్పిక తీర్చుకుందామనే సరికి బాయి ఎండిపోయినట్టు, గమ్యం దొరికిన సంబురం పడే లోపే నడిచే దారి తెగిపోయిన విషాదాన్ని సారు ఎంతో ఆర్తిగా చెప్పిండ్రు.
“స్నేహం వేరు
ప్రేమ వేరు
ఆ రెండిటినీ వెదుక్కుంటూ
మనుషులు ఆగమై పోయారు”
మనుషుల మధ్య బంధాల తీగెలు ఎంత సన్నగ ఉంటాయో ఇక్కడ తెలుస్తది. స్నేహానికి, ప్రేమకు నడుమ ఉన్న గీతను గుర్తుపట్టలేక, అన్వేషణ పేరుతో మనుషులు ఎట్లా ‘ఆగమై’ పోతున్నారో ఈ వాక్యాలు కళ్లకు కట్టినట్టు చెప్పినయ్. కలిసి నడిచే మనుషులు గల్లీ నిండా ఉన్నరు గానీ, మనసు కలిసే తోడు దొరక్క బతుకంతా ఒక ఆగమాగపు అంగడైన తీరిది.
“నేను మునిగిపోతుంటే
అందరూ నవ్వుకొంటూ
సెల్ఫీలు తీసుకున్నారు”
ఇది గిప్పటి కాలపు నిఖార్సైన నిజం. ఎవడన్న దిక్కత్ ల ఉంటే ఆదుకునుడు మరిచి, ‘సెల్ఫీ’ల పిచ్చితో నవ్వుకుంటా చూసే సమాజపు మొద్దుబారినతనాన్ని సారు పదునుగా ప్రశ్నించిండ్రు. నమ్మకద్రోహాన్ని ఇంతకంటే సూటిగా ఎవ్వరూ చెప్పలేరేమో! మానవత్వం మంటగలిసి, మనిషి కేవలం ఒక బొమ్మలా మిగిలిపోతున్నాడనే సత్యం ఇక్కడ అద్దంలో సూపిచ్చిన్రు.
“ఈ మనుషులను తెలుసుకోవడానికి
నేను ఎందరికో దూరం కావాల్సివచ్చింది”
………
అందరినీ కలుపు కోవడానికి నేను చాలా
వాటిని పోగొట్టుకోవాల్సివచ్చింది”
పై మాటలు లోతైన బతుకు పాఠాలు. ఒక మనిషిని అర్థం చేసుకోవాలన్నా, నలుగురిని కలుపుకొని పోవాలన్నా.. మనం ఎంతో కొంత వదులుకోవాల్సిందేనని సారు చెబుతున్నరు. మంచి జ్ఞానం రావాలంటే గాయం కావాల్సిందే.. బంధం నిలవాలంటే అహం చావాల్సిందేనని ఆశారాజు సారు ఎంత బాగా చెప్పిన్రు!.
ఈ కవితలో వాడిన ‘అత్తర్’, ‘షరాబ్’, ‘బారాత్’ వంటి ఉర్దూ పదాలు గీ హైద్రాబాద్ నేలకున్న అచ్చమైన వాసనను అద్దినయ్. కవిత్వమంటే ఉత్త పదాల కూర్పు కాదు, అది గీ మట్టి సంస్కృతికి నిలువుటద్దం అని ఆశారాజు సారు నిరూపించిండ్రు.
“మరణించిన వీరులు
చాలాసార్లు కలలోకి వస్తున్నారు”
ఈ వాక్యం ఇంటంటే.. యుద్ధం మిగిల్చిన గాయాలను రాసిన ఇంగ్లీష్ కవి విల్‌ఫ్రెడ్ ఓవెన్ (Wilfred Owen) కవిత్వం యాదికొస్తది. గతం నిరంతరం మనల్ని వెన్నాడుతూనే ఉంటుందని, ముఖ్యంగా వీరుల త్యాగాలు నిద్రపోనివ్వవని కవి డప్పు కొట్టి మరీ సెబుతున్నరు.
మొత్తంగా చెప్పాలంటే.. గీ కవిత గిప్పటి బతుకులోని నిరాశను, సంబంధాల చిక్కులను ఇప్పిసెప్పే ఒక పదునైన ఆయుధం. అయితే, కవితా తీవ్రత ఇంకా పెరగాల్నంటే.. ఆఖిరి రెండు పాదాలను ముందు పెట్టి, ముగింపులో ఆ “మరణించిన వీరుల” గురించి చెబితే సదివినోని గుండెల్లో ఆ సెగ అట్లానే ఉండిపోయేదేమో!
*








బావుంది
Thank you very much Giri Prasad garu
I love asharaju mama…. unfortunately i missed his contact since a decade plus.. can anyone share Asharaju gari contact please… thank you
ఆశారాజు గారి ఫోన్ నంబర్: 93923 02245.
Thank you so much. will connect him. your short reflection is nice.. there is lot more on this simple person. thanks again
Thank you very much Srinath garu
కవిత్వ ప్రతిబింబం శీర్షిక తో ప్రతి నెల నాకు నచ్చిన ఒక కవితపై విశ్లేషణకు అవకాశమిచ్చిన “సారంగ” టీం కు, సంపాదకులు అఫ్సర్ గారికి ధన్యవాదాలు.
Thank you very much Raj Kumar garu
ఆశారాజు కవిత్వం మీద చక్కని తెలంగాణ నుడికారం లో సమీక్ష చేయడం బాగున్నది
Thank you sir
Excellent analysis by an eminent poetcritic Wilson Rao garu on a senior and serious poet Aasharsju garu.
Thank you very much Prof.Banala garu
ఒక మంచి కవితను చాలా బాగా విశ్లేషంచారు.
మీ ఇద్దరికీ శుభాకాంక్షలు.
ఆశారాజు భాగ్యనగర కవితా రారాజు
వారికి 30 ఏళ్ల కిందటే వారి దిశ కి మేం ఉమ్మడిశెట్టి ఇచ్చాము.కవిత్వం లో వారు నాకు సమకాలికులు
వారి కవిత్వంలో మనుషులను అర్థం చేసుకోవడానికి,కలుపుకు పోవడాన్ని లోతైన బతుకు
పాఠాల్ని అర్థం చేసుకోవడాని మీదైన శైలిలో చక్కగా విశ్లేషించారు విల్సన్ రావుగారూ .
Thank you very much Radheya garu
ఈ మనుషులను తెలుసుకోవడానికి
నేను ఎందరికో దూరం కావాల్సివచ్చింది”
అందరినీ కలుపు కోవడానికి నేను చాలా
వాటిని పోగొట్టుకోవాల్సివచ్చింది”
…. ఇది కదా కవిత్వం. అందుకే కదా నాలాటోల్లకు . ఇష్టమైన కవి వారు. మంచి కవితకు గొప్ప విశ్లేషణ
Thank you very much Subba Rao garu
మంచి కవితకు గొప్ప విశ్లేషణ
Congratulations
పట్నం పాతబస్తీ కైత్కపు పైల్వాన్ ఆశారాజన్న మీన లవు సొక్కపు యాసం రాసిండు మా దోస్తు యిల్సన్రావు. గాయినె కైత్కం ఎట్లుంటదో రుచి సూపిచ్చనీకి గొన్ని మాస్లా జూపించుండు. ఆశారాజన్న పట్నంనెట్ల కల్వరిస్తడో కండ్లవడ్డదాన్ని కైత్కమెట్ల జేస్తడో జెప్పనీకి గిది రాసిండు . మస్తు ఖుషైంది సదవంగనె. శబ్బష్ దోస్త్.
కవిత అంటే ఇది. విశ్లేషణ బావుంది
ఈ మనుషులను తెలుసుకోవడానికి
నేను ఎందరికో దూరం కావాల్సివచ్చింది
varevvaa..
అద్భుతమైన కవిని మరొక్కమారు చదువుకునే వీలు కలిగింది.
మీ పరిచయం చాలా బావుంది అన్న💐💐
మంచి విశ్లేషణ. విల్సన్ గారికి, ఆశారాజు గారికి అభినందనలు.
Thank you very much Vadhilesi garu. I appreciate your help in correcting the telangana slang in this essay.