పుస్తక శత్రువు 

గిల్పిక

స్థలం: దేశంలో వొకానొక పబ్లిక పార్క్. 

సమయం: ప్రశాంతమైన వొకానొక ఆదివారం వుదయం  పదిగంటలు 

కార్యక్రమం : పార్కులో పుస్తక పఠనం 

పార్కులో పుస్తక పఠనం కార్యక్రమం అనగానే పిల్లలు పిల్లల తల్లులూ వాళ్ళ తల్లులు టీచర్స్ సోషల్ యాక్టీవిస్ట్ లు  రచయితలూ బుక్ పబ్లిషర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు వందమంది జమయ్యారు. ప్రతి వొక్కరి చేతిలో వాళ్లకు నచ్చిన పుస్తకం వుంది. అందరూ పుస్తకాల్లో  తలలు దూర్చి రేపు మళ్ళీ యీ అవకాశం వుండదేమో అన్నంత దీక్షగా మౌనంగా చదువుతున్నారు. వాళ్ళ దండ  చేతులకి కట్టి వున్న నల్లటి రిబ్బన్లు అదొక నిరసన కార్యక్రమం అని చెప్పకనే చెబుతున్నాయి. 

‘పుస్తక పఠనం – వొక ధిక్కార ప్రకటన’ అని వాళ్ళ వెనక రెండు చెట్ల మధ్య కట్టిన  తెల్లటి బ్యానర్ మీద నల్లటి అక్షరాలు మెరుస్తూ చూపరులని ఆకర్షిస్తున్నాయి.  బ్యానర్లో పుస్తకాలు పేజీలు విప్పుకొని పక్షుల్లా యెగురుతున్నాయి.   

‘ఏ స్కూల్లోనో  లైబ్రరీలోనో కూర్చొని చదువుకోక యిక్కడ యీ పార్కులో యేంటో’ పార్కులో ప్రతిరోజూ వాకింగ్ కి వచ్చే పెద్ద మనిషి  అనుకున్నాడు.  కొంచెం పక్కగా నిలబడి కరపత్రాలు అందిస్తున్న యువకుణ్ణి అదే అడిగాడు.

“స్కూల్ లైబ్రరీలో చదవడానికి అవకాశం లేకే యిక్కడ చదువుతున్నాం” అంటూ పాంప్లెట్ యిచ్చాడతను. 

‘మేం చదువుతాం’ 

పాంప్లెట్ శీర్షికే ఆయన్ని ఆకర్షించింది. 

నగరంలో వొక పేరొందిన  ఇంగ్లీష్ మీడియం పాఠశాల లైబ్రరీలో  ‘ఐ యామ్ మలాలా’, ‘ద  డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్’ పుస్తకాలు పెట్టినందుకు కొందరు పేరెంట్స్ అభ్యంతరం చెప్పారు. వాటిని తక్షణమే  తొలగించాలని స్కూల్ మేనేజ్మెంట్ కి అల్టిమేటం యిచ్చారు.  మేనేజ్మెంట్ మొదట అందుకు వొప్పుకోలేదు. కానీ ఆ పేరెంట్స్ అధికారపక్షానికి చెందిన లోకల్ ఎమ్మెల్యేని వెంటబెట్టుకొని స్కూల్ కి వెళ్లి గొడవచేయడంతో  తీసేయక తప్పలేదు. అంతేకాదు; విద్యార్థుల కోసం ఆ పుస్తకాలు తెప్పించిన లైబ్రేరియన్ ని వుద్యోగం నుంచి తొలగించే వరకూ వాళ్ళు స్కూల్లోనే బైఠాయించారు.  

‘మేం చదువుతాం’ అన్న యీ నిరసన అందుకే అని తెలుసుకున్న ఆ పెద్దమనిషి  యిదేదో తిరకాసు వ్యవహారంలా వుంది అనుకుని యేం మాట్లాడకుండా  అక్కణ్ణుంచి చల్లగా జారుకున్నాడు. విషయం అర్థమైన వొకరిద్దరు చదువుకునే వాళ్ళకి తోడయ్యారు. ఆర్గనైజర్స్ వాళ్ళక్కూడా పుస్తకాలు యిచ్చారు.

మలాలా, ఆన్ ఫ్రాంక్ పుస్తకాలు మాత్రమే కాదు; రాజ్యాంగం దగ్గర్నుంచీ రామాయణం వరకూ బొమ్మల భారతం దగ్గర్నుంచీ బుడుగు వరకూ నిరసనకారుల దగ్గర వున్నాయి. 

అప్పుడప్పుడూ ఆకాశంలో వాళ్ళ పైగా యెగురుతోన్న పక్షుల రెక్కల సవ్వడి  పుస్తకాల పేజీల చప్పుడుతో కలిసి యెంతో మనోహరంగా వుందా వాతావరణం. 

కార్యక్రమంలో భాగంగా ఆనంద్ నికేతన్ పాఠశాలకి చెందిన పదో తరగతి విద్యార్థి రాజ్యాంగ ప్రవేశికను గొంతెత్తి చదువుతూ వుండగా కర్రలు కాషాయ జెండాలు పట్టుకున్న గుంపొకటి అకస్మాత్తుగా అక్కడ చొరబడింది. 

“ఇక్కడ యీ పార్కులో చదవడానికి మీకు పర్మిషన్ యెవడిచ్చాడు” అని వాళ్లలో వొకడు వస్తూనే గట్టిగా అరిచాడు.

గ్రంథాలయోద్యమంలో స్కూటర్ యాత్ర చేసినాయిన యెదురెళ్ళాడు. 

“చదువుకోడానికి పర్మిషన్ ఏంటి, అదేం దేశద్రోహం కాదే” అని చాలా సౌమ్యంగా అడిగాడు.  

“మీరు చదువుతున్న పుస్తకాలేంటి? ఆ పాకిస్తానీ పిల్ల రాసిన పుస్తకాలు యెందుకు చదవాలి? అది ముమ్మాటికీ దేశద్రోహమే.”

“ఆమె ఆడపిల్లల చదువు కోసం ఆ దేశంలో యెంతో కృషి చేసింది. అందుకు ఆమెకు నోబెల్ ప్రయిజ్ వచ్చింది” వుద్యోగం పోగొట్టుకున్న లైబ్రేరియన్ అన్నాడు. 

“నీకు అంతగా యిష్టమైతే నువ్వుకూడా పాకిస్తాన్ ఫో. పోయి అక్కడ చదూకో. ఆళ్ళతో మింగిచ్చుకో”  

“యిది చదువు యిది చదవొద్దు అనడానికి మీరెవరు? మనం ప్రజాస్వామ్యంలోనే వున్నామా?” జీన్స్ మీద యెర్రటి టీ షర్ట్ వేసుకున్న  పిల్ల తల్లి వొకామె ప్రశ్నించింది. 

“మేం చదవమన్నదే చదవాలి. మాది  దేశీ  సిలబస్. విదేశీ పుస్తకాలు  మన సనాతన సంస్కృతిని నాశనం చేస్తాయి. దానిపేరేంటీ మలాలానా  గులాలానా? దాని  లాంటి వాళ్ళ పుస్తకాలు  స్కూల్లో  లైబ్రరీ లో పార్క్ లో షాపుల్లో యెక్కడా వుంటానికి వీల్లేదు.”

“పుస్తకానికి దేశం మతం జాతి యెలా అంటగడతావు? అక్షరాలకి  హద్దుల్లేవ్. ఆలోచనకి  యెల్లల్లేవ్. మేం అన్నీ చదువుతాం. అందరివీ చదువుతాం” అని  వొకాయన తన చేతిలో  రామాయణం పుస్తకం చూపిస్తూ శాంతంగా అన్నాడు. 

“అరే మామా, వీడు  యూనివర్సిటీ తుకడా గ్యాంగ్ ని పోగేసే తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రా” అని చెవిలో వూదాడు. 

“రామాయణం చదవడానికి మీరెవరు?  మీ దగ్గర మా రామాయణం వుండటానికి వీల్లేదు” అని ఆయన చేతిలో పుస్తక లాక్కోడానికి ప్రయత్నించాడు. ప్రొఫెసర్ ప్రతిఘటించాడు.  

ఉన్నట్టుండి కాషాయ మూక నుంచి వొకడు “భారతమాతాకి జై” అని అరిచాడు. 

పిల్లలు “భారత మాతా కి జై” అని వుత్సాహంగా బదులు యిచ్చారు. 

“జై శ్రీరామ్” అని మరొకడు కేక పెట్టాడు. 

“జై భీమ్” ప్రతినినాదం యిచ్చాడు  మెడలో నీలం కండువా వేసుకున్న యువకుడు.  

“జై బజరంగబలి” 

“జై రాజ్యాంగం” జవాబుగా స్థిరంగా అన్నాడో తెల్లచొక్కా పెద్ద మనిషి. 

“ఒకే జాతి వొకే సంస్కృతి వొకే మతం వొకే భాష అయిపొయింది యిప్పుడు వొకే పుస్తకం అనేట్టున్నారు మీవాలకం చూస్తే” అన్నాడాయన వాళ్ళని సూటిగా చూస్తూ. 

“పుస్తకం జ్ఞానాన్నిస్తుంది. ఆలోచన పెంచుతుంది.  జ్ఞానాన్నీ ఆలోచనని మీరెలా అడ్డుకుంటారు?” నల్లటి చున్నీ వేసుకున్న వొక అమ్మాయి ప్రశ్నించింది. 

“జ్ఞానాన్ని అందించే ప్రతిదీ మాకు శత్రువే.”

అసలు దిమాగ్ వున్నవాడే మా మొదటి శత్రువు” 

“ఈ దిమాగీ నక్సల్స్ తో మాటలేంటన్నా” అని జెండా కర్రని తిరగేసి ఆ పిల్ల మీదకి దూకుడుగా వెళ్ళాడు నుదుటి మీద పెద్ద బొట్టు పెట్టుకున్నవాడొకడు. 

మధ్యవయస్సులో వున్న నిరసనకారుడు ఆ అమ్మాయికి రక్షణగా వచ్చాడు. కాషాయ రౌడీ అతన్ని పక్కకి నెట్టాడు.

“సేవ్ ద బుక్ సేవ్ ద  నేషన్” యెక్కణ్ణుంచో బిగ్గరగా నినదించారెవరో.   

“భారత మాతా కి జై” అంటూ పెద్దగా కేకలు పెడుతూ చిన్నా పెద్దా ఆడా  మగా తేడా లేకుండా మీదపడి  దొరికినవాళ్ల చేతుల్లో పుస్తకాలు గుంజుకోవడం మొదలెట్టారు. ఈ లోపు వొకడు బ్యానర్ పీకేశాడు. 

ఎర్ర రంగు అట్టలున్న మార్క్స్ మావోల పుస్తకాలు కనపడటాయేమో అని వొక గెడ్డం కార్యకర్త వెతుకుతున్నాడు. 

గుంజుకున్న పుస్తకాలు చించేశారు. వొకడు చించిన కాగితాలకు నిప్పు పెట్టాడు.   

మనవరాలి చేయిపట్టుకుని నిరసనలో పాల్గొడానికి వచ్చాడొక వృద్ధుడు. ఇప్పటిదాకా ఆయన చేతిలో వున్న  ‘అంబెడ్కర్ జీవిత చరిత్ర’ మంటల్లో తగలడిపోతోంది. ఆయన దృష్టాంతా ఆ నీలపు మంటల మీదే వుంది. ఆయన గుండె కూడా మండుతోంది.   

“మేం చదువుతాం”  తాతయ్య  చేయి విడిపించుకుని ముందుకు పరిగెడుతూ పాప అరిచింది.

“మేం చదువుతాం” పార్క్ ప్రతిధ్వనించింది. 

“మీరు వద్దన్నా చదువుతాం” 

“మీరు కాదన్నా చదువుతాం”

“మీరు చించేసినా చదువుతాం” 

“మీరు కాల్చేసినా చదువుతాం” 

“మేం చదువుతాం .. మేం చదువుతాం”

పిల్లల నినాదాలతో పార్కులో పిట్టలు గొంతు  కలిపాయి.  

అప్పటిదాకా, గొడవ జరుగుతున్నంతసేపూ, యెక్కడున్నారో తెలీదు; పిల్లల నినాదాలతో సడెన్ గా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

పర్మిషన్ లేకుండా పబ్లిక్ ప్లేస్ లో గేదరవ్వడం నేరం. అందరూ వెకేట్ చేయాలని హేండ్ మైక్  లో అరుస్తూ లాఠీలు ఆడిస్తూ అడ్డం తిరిగిన వాళ్ళని వేన్ యెక్కించారు. స్టేషన్ కి తీసుకుపోయారు. 

శాంతి భద్రతలకు భంగ కలిగించారని ముఫై మంది పుస్తక ప్రియుల మీద FIR కట్టారు. 

వాళ్లలో ‘మేం చదువుతాం’ అని అరచిన పిల్లలు కూడా నలుగురున్నారు.

పోలీసులు అందర్నీ కోర్టులో జడ్జిగారి ముందు హాజరు పరిచారు.

‘చెద పురుగులు’ కేసు విన్న జడ్జి మనసులో అనుకున్నాడు.

నలిపేయకుండా తనదాకా తీసుకొచ్చినందుకు ఆయనకి చిరాగ్గా వుంది. 

పౌర సమాజంలో శాంతికి విఘాతం కలిగించినందుకు ముప్పై మందీ కోర్టు రూంలో రోజంతా నిలబడాలని శిక్ష విధించారు. ఇది మొదటి తప్పు కాబట్టి చిన్న శిక్షతో విడిచి పెడుతున్నామనీ రిపీట్ చేస్తే ఊపా లాంటి కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. 

శిక్ష చెప్పాడే గానీ ఆయనకీ యింకా అసంతృప్తిగా వుంది. దేశం కోసం ధర్మం కోసం పిల్లలకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆ పిల్లలు నలుగురూ రోజూ బడికెళ్ళే ముందు గుడి చుట్టూ పదిరోజులు వెయ్యి సార్లు ప్రదక్షిణ చేయాలని,  క్రమశిక్షణ నేర్పకుండా పెంచినందుకు వాళ్ళ పేరెంట్స్ ప్రత్యక్షంగా దాన్ని పర్యవేక్షించి దాన్ని వీడియో రికార్డు చేసి ప్రతిరోజూ పోలిస్ స్టేషన్ లో స్టేషన్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయాలని తీర్పు వినిపించారు.

‘మేం చదువుతాం’ నినాదమే యింకా తలలో తిరుగుతోన్న పదో తరగతి విద్యార్థి కాషాయం మూక పోలీసులకు కనిపించకుండా చొక్కా కింద పదిలంగా దాచుకున్న రాజ్యాంగం పుస్తకం బయటికి తీసి చేత్తో పట్టుకుని 

“సర్, మీరేం చదివారు? చిన్నప్పుడు మీకు స్కూల్లో లైబ్రరీ లేదా సర్?” అని జడ్జిని అడిగాడు.

ప్రశ్న కోర్టు హాల్లో ప్రతిధ్వనించింది. 

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

ఏ.కె. ప్రభాకర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • excellent write అప్. ప్రశ్న కోర్టులో ప్రతిధ్వనిస్తుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.