సురూపుడు

తెల్లవారడానికి ఇంకా గంట పడుతుంది. ఆకాశంలో సూర్యుడు చీకటి దుప్పటి కప్పుకున్నాడు.

కనపడడం లేదు కాని ఆవలిస్తూనే ఉండి ఉంటాడు.

బద్ధకం వదిలించుకుందుకు ప్రయత్నిస్తూనే ఉండి ఉంటాడు.

కాసేపు దొర్లుదామని నిర్ణయించుకునే ఉండి ఉంటాడు.

తన రాక కోసం కోట్లాది జీవాలు ఎదురు చూస్తుంటాయని తెలుసు కాని సూర్యుడికి ఇంకొంచెం సేపైనా పడుకోవాలని ఉండి ఉంటుంది.

చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆకాశాన్ని కాస్త మడిచి తన కాళ్ల కిందకి తెచ్చుకోవాలనే ఉండి ఉంటుంది.

తెలుగు నేల మీద మాత్రం త్రిశూలపాణి ఆపాటికే నిద్ర లేచాడు. దంత ధావనంతో పాటు ఏకంగా స్నానం కూడా చేసేశాడు.

తడిగా ఉన్న శరీరాన్ని అంగవస్త్రంతో మరోసారి తుడుచుకుంటున్నాడు.

తన ఎడమ భుజం నుంచి కుడి వైపునకు గుండెల మీంచి ఉన్న జంధ్యాన్ని కూడా అంగవస్త్రంతో తుడిచాడు.

అలా జంధ్యాన్ని తుడవడం అప్పటికి అది నాలుగోసారి.

త్రిశూలపాణి ముందు నుంచుని చూస్తున్న వారికి ఆ జంధ్యం మెరుస్తున్న నెలవంకలా ఉంది.

త్రిశూలపాణి వెనుక నుంచుని చూస్తున్న వారికి ఆ జంధ్యం నల్లటి నడుం మీద స్థిరంగా కూర్చున్న కుందెలు పిల్లలా ఉంది.

ఎందుకో తెలీదు కానీ ఆ జంధ్యాన్ని పదే పదే చూసుకుని కళ్లకి అద్దుకున్నాడు.

తర్వాత జంధ్యాన్ని చిన్నఉండలా చేసి గుప్పిట్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.

జంథ్యాన్ని కళ్లకి అద్దుకున్నప్పుడు త్రిశూలపాణి కళ్లు కృతజ్ఞతతో ఉన్నాయి.

జంధ్యాన్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు త్రిశూలపాణి పొట్ట ఆనందంగా ఉంది.

ఈ రెండూ చేసిన తర్వాత త్రిశూలపాణికి తెలియకుండా ఓ నాలుగు కన్నీటి బొట్లు రాలాయి.

*** *** ***
త్రిశూలపాణి పేరు అందమైందే కాని మనిషి అనాకారి. నల్లటి ముఖం మీద సూరీడు కాయలు. పొట్టిగా ఉండేవాడు. సంవత్సరాల పాటు తినడం, తిరగడమే వ్యాపకంగా మారడంతో లావుగా అయిపోయేడు. పొట్ట బాగా పెరిగి కాళ్లని చూస్తున్నట్లుగా జారిపోయి ఉండేది. తన శరీరాన్నే కాదు జుట్టును కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తైల సంస్కారం లేక… అడ్డదిడ్డంగా పెరుగుతున్న వెంట్రుకలకి క్షవరం చేయించక భుజాల వరకూ జుట్టు ఉండేది. దీనికి తోడు గడ్డం కూడా చింపిరిగా పెరిగి గుండెలకి పైన.. కంఠానికి కింద వరకూ పెరిగింది.

ఓసారి అద్దం ముందు కూర్చుని శ్రద్ధగా తన ముఖం మీదున్న సూరీడు కాయల్ని లెక్కెట్టాలని ప్రయత్నించాడు. నుదిటి మీద.. కుడి చెంప మీద లెక్కపేట్టే సరికి వాటి లెక్కకి దిగులేసింది. ఎడమ చెంప మీదా.. మెడ దగ్గరా ఉన్న సూరీడు కాయల్ని ఇక లెక్కించాలనిపించ లేదు. అద్దాన్ని విసిరికొట్టలేదు. జాగ్రత్తగా కిటికీలో పెట్టేశాడు.

పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి ఓసారి ముఖం కడుక్కున్నాడు. చేతికి మళ్లీ సూరీడు కాయలు తగిలాయి. ఈసారి సబ్బుతో కడుక్కున్నాడు. అప్పుడూ అవే తగిలాయి. గొంతుకూర్చున్న వాడల్లా లేచి నూతిలోకి చూసాడు. పదిహేను అడుగులున్న ఆ నుయ్యిలోని నీళ్లలోకి చూస్తే తన ముఖమే తప్ప సూరీడు కాయలు కనిపించలేదు.

మనుషుల్లో కొందరు నుయ్యిలాంటి లోతైన వాళ్లు. వాళ్లకి ఎదుటి వారి ముఖమే కాని అందులో మచ్చలు కనిపించవు’ అని తనలో తానే అనుకున్నాడు.

*** *** ***
తన అంద విహీనం త్రిశూలపాణిని చిన్నతనం నుంచి వెంటాడింది. స్కూల్లో ఎవరూ అతడ్ని పక్కన కూర్చేనిచ్చేవారు కాదు. ఆటలకి రానిచ్చేవారు కాదు. దాంతో స్కూల్‌ మానేశాడు. తండ్రి రాధాకృష్ణ తిట్టినా ప్రయోజనం లేకపోయింది. చెప్పి చెప్పి విసుగొచ్చి ఇక చెప్పడం మానేశాడు. ఇంట్లో తినడం… వీధుల్లో తిరగడంతోనే సంవత్సరాలు గడిచిపోయాయి.

ఈ అనాకారితనం తనకే ఎందుకు వచ్చిందో త్రిశూలపాణికి ఎంతకీ అర్థం కాలేదు. తండ్రి రాధాకృష్ణ ఊర్లోనే ఆర్‌ఎంపీ డాక్టర్‌. ఆ రోజుల్లోనే హంబర్‌ సైకిల్‌ మీద ఇంటింటికి వెళ్లి వైద్యం చేసేవారు. ఆయన రాసుకున్న అత్తరు వాసన బట్టి ఆ వీధిలో వాళ్లకి “డాక్టరు బాబు వచ్చేస్తున్నారు” అని తెలిసిపోయేది. ఇద్దరు ఆడ పిల్లల తర్వాత కలిగిన సంతానం త్రిశూలపాణి. ఇద్దరు ఆడపిల్లల్లో చిన్నమ్మాయికి పోలియో. పెద్ద కూతురుకి పెళ్లి చేసారు. మిగిలిన పిల్లల్నీ, భార్యని పోషించుకుంటూ కాలం గడిపేవారు రాధాకృష్ణ.

ఓ రాత్రి తొమ్మిది గంటల వేళ కౌశిక ఒడ్డున ఉన్న కొబ్బరితోటలో నివాసం ఉంటున్న ఓ రాజు గారికి వైద్యం చేసి సైకిల్‌ మీద వస్తూంటే ఆ చీకట్లో ఏదో పురుగు కుట్టి మంచాన పడ్డారు రాధాకృష్ణ.

తానే గొప్ప వైద్యుడిననే అహంభావంతో ఏ డాక్టర్ని కలవలేదు.
తన రోగానికి తానే చికిత్స చేసుకుని ఓ రెండు నెలల తర్వాత కాలం చేశారు రాధాకృష్ణ.

అదిగో అప్పటి నుంచి కుటుంబ భారం త్రిశూలపాణిపై పడింది.
ఆ పల్లెలో ఉంటే రోజులు గడవడం కష్టమని పక్కనే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురానికి మకాం మార్చాడు త్రిశూలపాణి.

*** *** ***

ఇన్నాళ్లూ రికామీగా తిరగడం.. ఏ పని రాకపోవడంతో ఊర్లోనే పెద్ద పురోహితులుగా పేరున్న రాణి అప్పన్న శాస్త్రిగార్ని కలిసాడు.

త్రిశూలపాణి కష్టానంత విన్న అప్పన్న శాస్త్రి గారు “ఓరేయ్‌ అబ్బాయ్‌… ఈ వయసులో నీకు ముక్క అబ్బదు. అందుకని ముందు విఘ్నేశ్వర పూజ, ఆ తర్వాత శుక్రవారం పూజలు నేర్చుకో. అవే కాపాడతాయి” అని చెప్పడమే కాక నేర్పించారు కూడా.

ఆ రెండు పూజలు శ్రద్ధగా నేర్చుకున్న త్రిశూలపాణి వినాయక చవితి పది రోజులూ అమలాపురం పక్కన ఉన్న గ్రామాల్లోని వినాయక మంటపాల్లో వినాయక పూజ చేయించేవాడు.

ఆ సమయంలో వచ్చిన బియ్యం ఆ కుటుంబానికి ఓ ఆరు నెలల వరకూ సరిపోయేది. ఇక ఇతర నిత్యావసరాల కోసం తన పూజలకు ఇచ్చిన దక్షిణలని ఖర్చు పెట్టేవాడు. కుటుంబ అవసరాలకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేసేవాడు కాదు.

ఇక శుక్రవారం నాడు షావుకార్లు, రాజస్థాన్‌ నుంచి వ్యాపారం నిమిత్తం వచ్చిన శేట్ల బంగారం దుకాణాలు, రాజులు, కాపుల దుకాణాల్లో శుక్రవారం పూజలు చేయించడం వృత్తిగా మార్చుకున్నాడు.

వీటితో పాటు శుభ, అశుభ కార్యక్రమాలకు కూడా పెద్ద పురోహితులతో వెళ్లేవాడు.

అక్కడ కూడా త్రిశూలపాణి అనాకారితనమే అతనికి అడ్డుగా తగిలేది. తాంబూలం తీసుకునే చోట త్రిశూలపాణికి ఆఖర్న అవకాశం వచ్చేది.
తనలాగే నోట్లో ముక్కరాని వాళ్లు ఉన్నా పెద్ద పురోహితులు త్రిశూలపాణిని అందరి తర్వాతే తాంబూలం తీసుకుందుకు పిలిచేవారు.

ఇదే కాదు… ఇతర బ్రాహ్మలకి రెండు వందలు… యజమాని కాస్త కలిగిన వాడైతే నాలుగు వందలు ఇప్పించేవారు.

అదే త్రిశూలపాణి విషయానికి వస్తే మాత్రం “వీడికో వంద ఇవ్వండి” అని ఆ యజమానికి పురమాయించేవారు.

పైకి చూడడానికి అందవిహీనంగా ఉన్న త్రిశూలపాణిని కార్యక్రమం జరుగుతున్న చోట నుంచి ఎంత త్వరగా పంపించాలా అన్నట్లు ఉండేది అక్కడ వ్యవహారం. ఈ వివక్ష కళ్ల ముందే జరుగుతున్నా త్రిశూలపాణి ఏనాడు పెద్ద బ్రహ్మలని కాని, తనతో ఉన్న ఇతర పురోహితులను కానీ ఏమి అనేవాడు కాదు.

‘మనకి దక్కిందే పరమాన్నం’ అనుకునే వాడు. ఇదిగో ఇలాంటప్పుడే ‘మనుషుల్లో కొందరు మాత్రమే నూతిలో నీళ్ల వంటి వారు… మిగిలిన వారంతా ఎందుకూ పనికి రాని సముద్రం వంటి వారు’ అనుకునేవాడు.

ఎవరి దగ్గరా శిష్యరికం లేదు కాని అందరూ మాత్రం ఎవరికి వారే త్రిశూలపాణి కనిపించగానే “శిష్యుడొచ్చాడు” అనుకునేవారు.

*** *** ***

ప్రతి రోజూ మధ్యాహ్నం వరకూ వివిధ కార్యక్రమాలకు వెళ్లడం, భోజనం తర్వాత ఓ గంటన్నర పడుకోవడం త్రిశూలపాణి నిత్యకృత్యం. ఉదయం నుంచి పంచె, భుజం మీద అంగవస్త్రంతో గడిపే త్రిశూలపాణి సాయంత్రం అయితే మాత్రం టిప్‌ టాప్‌గా తయారయ్యేవాడు.

సాయంత్రం నాలుగున్నర కాగానే తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకునేవాడు. తండ్రి రాధాకృష్ణలాగే అత్తరు కొట్టేవాడు. ఒక రోజు వేసుకున్న డ్రెస్‌ మర్నాడు వేసుకునేవాడు కాదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చెప్పులు లేకుండా తిరిగిన త్రిశూలపాణి సాయంత్రం మాత్రం డ్రెస్‌కి మ్యాచ్‌ అయ్యేలా తెల్ల జోళ్లు వేసుకునేవాడు. సాయంత్రం ఐదు గంటలకు సైకిల్ వేసుకుని గడియార స్తంభం సెంటర్‌కి వచ్చేవాడు.

ఉదయం త్రిశూలపాణిని తొలిసారి చూసిన వాళ్లు సాయంత్రం తిరిగి అతడ్ని చూస్తే గుర్తు పట్టే అవకాశాలు తక్కువే. కాకపోతే ముఖం మీద సూరీడు కాయలే అతడ్ని పట్టించేవి. ఇది కూడా త్రిశూలపాణిని బాధించేది.

“ఏం పాణి ఈవేళ శోభన్‌బాబులా తయారయ్యావు” అని కొందరు…

“పెళ్లి చూపులకు రెడీ అయ్యావా” అని ఇంకొందరు…

“మద్రాసు వెళ్లకూడదు. సినిమాల్లో అవకాశాలొస్తాయేమో” అంటూ మరికొందరు ఆట పట్టించినా త్రిశూలపాణి మాత్రం చిరునవ్వే సమాధానంగా చెప్పేవాడు.

ఎక్కడ ఎన్ని పనులున్నా సోమవారం నాడు మాత్రం త్రిశూలపాణి కచ్చితంగా పోస్టాఫీస్‌కి వెళ్లేవాడు.

ఆ వారంలో తాను దాచుకున్న డబ్బులు పోస్టాఫీస్‌లో రెండు అకౌంట్లలో జమ చేసేవాడు. అకౌంట్లకి సంబంధించిన పాస్‌ బుక్‌లు రెండు పోస్టాఫీసులోనే ఉంచేవాడు.

*** *** ***

మాఘమాసంలో ఓ రోజు ఏదో కార్యక్రమం నుంచి వచ్చిన త్రిశూలపాణికి వాకిట్లో పడుకున్న తల్లి దగ్గు వినిపించింది.
దగ్గరకు వెళ్లి “వొంట్లో బాలేదా అమ్మా!” అని అడిగితే దానికి కూడా తల్లి నుంచి దగ్గే సమాధానం అయ్యింది.

కాస్త దూరంగా కూర్చున్న చెల్లెలు కాళ్లీడ్చుకుంటూ వాళ్లిద్దరి దగ్గరికి వచ్చి “అమ్మ ఐదారు రోజులుగా దగ్గుతోందిరా అన్నయ్యా. నువ్వు ఇంట్లో ఉంటే మాత్రం పెరట్లోకి వెళ్లి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని దగ్గుతోందిరా” అంది.

ఆ మాటకి త్రిశూలపాణికి కన్నీళొచ్చాయి. అది పైకి కనిపించకుండా
“వైద్యం కూడా చేయించలేననుకున్నావా అమ్మా” అని అంటూనే బలవంతాన తల్లిని పైకి లేపాడు.

“రిక్షా తీసుకొస్తా. డాక్టర్‌ గారి దగ్గరకు వెళ్దాం లే” అంటూ బయటకు వెళ్లడం రిక్షా తీసుకురావడం జరిగిపోయింది.

ఆ రిక్షాలో తల్లిని కూర్చోపెట్టి దగ్గరలో ఉన్న డాక్టర్‌ సుందరం గారి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

డాక్టర్‌ సుందరం గారు త్రిశూలపాణి తల్లి నాడి చూసారు. నోరు తెరవమని నాలుక చూసారు. స్టెతస్కోప్‌తో గుండెలు, నడ్డి పరీక్షించారు.

అలా పరీక్షిస్తున్నప్పుడు కూడా ఆమె తెరలు తెరలుగా దగ్గడాన్ని గమనించారు.

“భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే టీబీయేమోనని అనుమానంగా ఉంది. కొన్ని మందులు రాసిస్తా. రెండు వారాలు వాడండి. ముఖ్యంగా మంచి ఆహారం కావాలి. కాస్త కనిపెట్టుకుని ఉండాలి” అంటూ డాక్టర్‌ సుందరం గారు కొన్ని మందులు రాసి ఆ చీటీని త్రిశూలపాణి చేతిలో పెట్టారు.

“ఇక్కడే మలికిపురంలో మా అక్క, బావ ఉంటున్నారు. వాళ్ల దగ్గర కొన్నాళ్లు అట్టే పెడతా డాక్టర్‌ గారు” అంటూ నమస్కారం చేసి తల్లిని తీసుకుని రిక్షాలో బయలుదేరాడు. మధ్యలోనే మెడికల్‌ షాపులో మందులు కొని నేరుగా ఇంటికి వచ్చేసారు. అప్పటికే సాయంత్రం అయిపోవడంతో “రేపు ఉదయాన్నే మలికిపురం తీసుకెళ్లి అక్క దగ్గర దింపుతా. కొన్నాళ్లు అక్కడ ఉండండి” అని తల్లికి, చెల్లెలికి చెప్పి బయటకు వచ్చేశాడు త్రిశూలపాణి.

*** *** ***

ఆ రాత్రంతా త్రిశూలపాణికి కంటి మీద కునుకు లేదు
.
ఆ రాత్రంతా త్రిశూలపాణి కంటి నుంచి నీరు ఆగలేదు.

ఆ రాత్రంతా త్రిశూలపాణి ఆలోచనలకు అంతులేదు.

తండ్రి లేడు. ఉన్న తల్లికి జరగరానిది జరిగితే ‘నాకూ, చెల్లెలికి దిక్కెవరు.

నా పుట్టుకే కష్టాల కోసం జరిగిందా?!’ అనుకున్నాడు.

లోకంలో అందరూ బాగానే ఉన్నారు కదా..! లేకపోతే వాళ్ల కష్టాలు తనకి తెలియడం లేదా..!’ అని తర్కించుకున్నాడు.

“మానవ జన్మ ఉతృష్టమైనది” అంటారు కదా..! మరి నా జన్మ ఇంత నికృష్టంగా మారిందేమిటి’ అని కూడా బాధ పడ్డాడు.

*** *** ***
తెల్లారింది. తల్లిని, చెల్లెల్ని “ఊరు వెళ్లడానికి సిద్ధం కండి” అంటూ తాను బయటకు వచ్చాడు త్రిశూలపాణి.

నేరుగా పోస్టాఫీస్‌కి వెళ్లాడు. అంత వరకూ డబ్బులు వేయడమే కాని తీయడం తెలియని త్రిశూలపాణి పోస్టల్‌ ఉద్యోగితో “డబ్బులు తీసుకోవాలి. ఏం చేయాలి?” అని అడిగాడు.

“ఏ అకౌంట్‌ నుంచి తీసుకుంటావని” ఉద్యోగి అడిగితే ” నా అకౌంట్‌ నుంచే” అని చెప్పడంతో పాటు “రెండో అకౌంట్‌ గురించి ఎవరికీ చెప్పకండి” అని కూడా అన్నాడు.

పోస్టల్‌ ఉద్యోగి త్రిశూలపాణి అకౌంట్‌ చూసి “పన్నెండు వేలు ఉన్నాయి. ఎంత తీసుకుంటావు?” అని అడిగి ఫారం పూర్తి చేసే పనిలో పడ్డారు.

“పది వేలు ఇవ్వండి” అని చెప్పిన త్రిశూలపాణి విత్‌డ్రాయిల్‌ ఫాం మీద తెలుగులో త్రిశూలపాణి వ్రాలు అని సంతకం చేసి ఇచ్చాడు.

పోస్టల్‌ ఉద్యోగి ఇచ్చిన పది వేలు తీసుకుని ఇంటికి వెళ్లిన త్రిశూలపాణి రిక్షాలో తల్లిని, చెల్లెల్ని కూర్చోపెట్టి తాను మాత్రం వెనుక నడుస్తూ బస్టాండ్‌కి వెళ్లాడు.
రాజోలు బస్సు సిద్ధంగా ఉండడంతో ముగ్గురూ బస్సు ఎక్కారు.

ఓ నలభై నిమిషాల తర్వాత మలికిపురంలో ఉన్న అక్క ఇంటికి చేరుకున్నారు.

జరిగిందంతా అక్కకి, బావకి వివరంగా చెప్పి

“ఇదిగో పది వేలు ఇస్తున్నా. ఉంచండి. మళ్లీ పంపుతా. అమ్మకి మంచి భోజనం పెట్టండి. టైంకి మందులు ఇవ్వండి. చెల్లెని కూడా జాగ్రత్తగా చూడండి” అంటూ అక్క, బావకి అప్పగించి, భోజనం చేసి వెళ్లమని ఎంత బ్రతిమిలాడినా వినకుండా తిరిగి అమలాపురం వచ్చేశాడు త్రిశూలపాణి.

*** *** ***

ఇంటికి వచ్చేశాడే కాని మనసంతా అమ్మ చుట్టూనే ఉంది.

త్రిశూలపాణికి లోలోపల ఓ భయం వెంటాడుతోంది.

‘ఏం కాదులే’ అని ఓసారి… ‘అక్క బాగా చూసుకుంటుంది. బావే చిరాకు మనిషి’ అని మరోసారి అనుకుంటున్నాడు.

భోజనం చేయాలనిపించలేదు… పడుకుందామని ప్రయత్నించినా లాభం లేదు. ఇంట్లోనే కాలు కాలిన పిల్లిలా తిరిగాడు.

సాయంత్రం ఎప్పటిలాగే గడియార స్తంభం సెంటర్‌కి వెళ్లాడు.

వైట్‌ డ్రెస్‌ వేసుకోలేదు. కాళ్లకి చెప్పులూ లేవు. అత్తరు విషయం గుర్తే లేదు.
మనిషి చాలా డీలా పడిన వాడిలా ఉన్నాడు.

ఒకరిద్దరు పలకరించినా వినపడనట్లే ఉండి పోయాడు. ఓ గంట తర్వాత ఇంటికి చేరుకున్నాడు. రాత్రి కూడా ఏం తినకుండా అలా కటిక నేల మీద పడుకున్నాడు. పరిపరి విధాల ఆలోచనలతో బుర్రంతా వేడెక్కిపోయింది.
అర్ధరాత్రి వొళ్లంతా చెమటలు పడితే లేచి గ్లాసుతో నీళ్లు తీసుకుని తాగాడు.
తుండుతో వొళ్లు తుడుచుకున్నాడు. పక్కనే ఉన్న విసనకర్రతో విసురుకున్నాడు.

మళ్లీ ఇంకో గ్లాసుడు నీళ్లు తాగాడు. అయినా చెమటలు పడుతున్నాయి. ఎడమ చెయ్యి ఎందుకో నొప్పిగా ఉంది అనిపించింది.

గూట్లో ఉన్న కొబ్బరినూనె తీసుకుని కుడి చేత్తో నొప్పి వస్తున్న చోట కాసింత రాసుకున్నాడు.
త్రిశూలపాణి నీరసంగా ఉన్నాడు

త్రిశూలపాణి కళ్లు పేలగా ఉన్నాయి

త్రిశూలపాణి శరీరం వేల్లాడుతున్నట్లుగా ఉంది

త్రిశూలపాణి ఉన్న గది మసక మసకగా ఉంది

త్రిశూలపాణి గుండెల మీద రెండు కిలోల రాయి పెట్టినట్లుగా ఉంది
త్రిశూలపాణి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు

*** *** ***
తెల్లారింది. సూర్యుడు చీకటి దుప్పటి లాగి పడేశాడు.

సూర్యుడికి ఆవలింతలు రావడం లేదు.
సూర్యుడు బద్ధకం వదిలించుకుని ఎప్పుడు లోకం మీదకి వద్దామా అని కంగారుగా ఉన్నాడు.

కాసేపు దొర్లుదామన్న నిర్ణయాన్ని మార్చుకుని వడి వడిగా లోకం మీదకి వచ్చేశాడు.

చలి ఎక్కువగా ఉన్నా తాను కప్పుకున్న ఆకాశాన్ని దబ్బున చీల్చుకుని ఎర్రటి వెలుగయ్యాడు.

ఎప్పుడూ సూర్యుడి కంటే గంట ముందే లేచే త్రిశూలపాణి లేవలేదు. కళ్లు తెరవలేదు. దంత ధావనం చేయలేదు. స్నానం చేయలేదు.
త్రిశూలపాణి ఏ అర్ధరాత్రో శాశ్వత నిద్రలోకి జారిపోయాడు.

*** *** ***
నిజానికి ఆరోజు త్రిశూలపాణి తన గురువు గారు రాణి అప్పన్న శాస్త్రి గారితో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లాలి.

త్రిశూలపాణి వస్తాడని చూస్తున్న అప్పన్న శాస్త్రి గారు ఉదయం పదింటి వరకూ చూసి మరో శిష్యుడు మల్లప్ప శాస్త్రితో “శిష్యుడింకా రాలేదు. ఏమైందో ఓసారి ఇంటికి వెళ్లి చూడు” అని పురమాయించారు.

గురువు గారు చెప్పిన మాటతో సైకిల్‌ మీద త్రిశూలపాణి ఇంటికి వచ్చిన మల్లప్ప ఎంత సేపు పిలిచినా అవతలి నుంచి సమాధానం రాలేదు.

తలుపులు బాదాడు. “త్రిశూలపాణి… ఓరేయ్‌ శిష్యా! ఎక్కడున్నావురా?” అని అరిచాడు.

మల్లప్పకి భయం వేసింది. కంగారు కూడా వచ్చింది. రైలు వేగమంత స్పీడుగా గురువు గారి ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాడు.

గురువు గారు తన లూనా మీద త్రిశూలపాణి ఇంటికి చేరుకున్నారు.

వెనుక సైకిల్‌ మీద వస్తున్న మల్లప్ప శాస్త్రి తనకు ఎదురైన పురోహితులకి, ఇతర బ్రాహ్మలకి “ఇదీ విషయం” అని చెప్పాడు.

*** *** ***
గురువు గారు, ఇతర పురోహితులు, ఇంటి చుట్టుపక్కల వాళ్లు వచ్చి తలుపులు బద్దలు కొడితే ముందు గదిలో నిర్జీవంగా పడి ఉన్నాడు త్రిశూలపాణి.
అప్పన్న శాస్త్రి గారి ఆజ్ఞ మేరకు డాక్టర్‌ సుందరం గారిని తీసుకొచ్చారు.
డాక్టర్‌ సుందరం గారు త్రిశూలపాణి నాడి చూసి పెదవి విరిచారు.

గురువు గారితో సహా బ్రాహ్మాణ్యం అంతా భోరుమంది.

“శిష్యుడి తల్లి, చెల్లి ఏరిరా?” అని అడిగితే… డాక్టర్‌ సుందరం గారు ముందు రోజు జరిగింది చెప్పారు.

అంతా విన్న గురువు గారు ఓ ఇద్దర్ని మలికిపురం పంపించారు.

తల్లి అనారోగ్యం, చెల్లెలి అవిటితనం త్రిశూలపాణిని భయపెట్టాయి అని అనుకున్నారు.

తల్లికి ఏమైనా అయితే… అని మదనపడ్డాడని తేల్చారు.
ఆ భయమే అతడ్ని మింగేసింది అనుకున్నారు.

*** *** ***
తల్లి, అక్క, బావ, చెల్లెలు వచ్చిన తర్వాత త్రిశూలపాణి అంతిమ సంస్కారం కోసం ఏర్పాట్లు చేసారు.

కర్మకాండ తర్వాత మిగిలిన రోజుల గురించి అక్కడే ఉన్న పురోహిత బృందం తర్జన భర్జనలు పడ్డారు.
ఈ తంతు ఎలా చేయాలనే మీమాంశ అందరిలో వచ్చింది. నలుగురైదుగురు ఆ అంశం గురించి శ్మశానంలోనే చెవులు కొరుకున్నారు.
అప్పన్న శాస్త్రిగారి శిష్యుల్లో ఒకరు ఈ విషయాన్ని ఆయన చెవిన వేశారు.
తనతో పాటు అందరికీ శిష్యుడిగా మెలిగిన త్రిశూలపాణికి తెలిసి కొందరు, తెలియక కొందరు చేసిన అన్యాయం అప్పన్నశాస్త్రిగారి మదిలో మెదిలింది.
త్రిశూలపాణి బతికుండగా చూపించిన వివక్ష కనీసం మరణించాకైనా లేకుండా చేయాలనుకున్నారు అప్పన్న శాస్త్రిగారు.
అలా అనుకున్న ఉత్తర క్షణమే శ్మశానంలో ఉన్న వారందరినీ ఉద్దేశించి “ఓరేయ్‌ అబ్బాయిలు నేనో నిర్ణయం తీసుకున్నానర్రా. త్రిశూలపాణికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు మనమే చేయాలి. అంతే కాదు ఆ కుటుంబానికి త్రిశూలపాణి లేని లోటు తెలియకుండా చేయాలి. నాతో పాటు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి” అన్నారు.

అక్కడున్న వారంతా ముక్తకంఠంతో “మీ ఇష్టం గురువు గారు” అంటూ అంగీకారం తెలిపారు.
అక్కడ తంతు పూర్తి అయిన తర్వాత అప్పన్నశాస్త్రిగారితో పాటు మిగిలిన వారంతా సాయంత్రం త్రిశూలపాణి ఇంటికి వెళ్లారు.

ఆ  ఇంట్లో అందరూ దు:ఖంలో మునిగి ఉన్నారు.
త్రిశూలపాణి లేని లోటుని తలచుకుని తలచుకుని దుఖిస్తున్నారు.

ఆ సమయంలో ఆ ఇంటికి వెళ్లిన బ్రాహ్మణ్యం కూడా దిగాలుగా ఉంది. అక్కడున్న వాతావరణాన్ని తెలిక పరుస్తూ…గురువు గారు అప్పన్న శాస్త్రి గారు ఆ కుటుంబ సభ్యులతో “మీకు అండగా బ్రాహ్మణ్యం అంతా ఉంటుంది. బాధ పడకండి” అంటూ ఓదార్చారు.

పది రోజుల కార్యక్రమాన్ని బ్రాహ్మణ్యం అంతా దగ్గరుండి జరిపించారు.

“వాడి స్నేహితులకి కబురు పంపండిరా. ధర్మోదకాలు ఇవ్వడానికి వస్తారు” అని అప్పన్న శాస్త్రి గారు చెబితే శిష్యులు అలాగే చేశారు.

కౌశిక ఒడ్డున ధర్మోదకాలకి ఏర్పాట్లు చేశారు.

త్రిశూలపాణి మరణ వార్త తెలుసుకున్న పోస్టల్‌ ఉద్యోగి కూడా అక్కడికి వచ్చారు.

“నిన్నే తన అకౌంట్‌లోంచి డబ్బులు తీసుకున్నాడు” అని చెప్పారు.

మళ్లీ ఆ ఉద్యోగే త్రిశూలపాణి రెండో అకౌంట్‌ గురించి కూడా చెప్పారు.

ఆ ఉద్యోగి మాటలు విన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఆ అకౌంట్‌ వివరాలున్న పాస్‌బుక్‌ అప్పన్న శాస్త్రి గారి చేతిలో పెట్టారు పోస్టల్‌ ఉద్యోగి.

ఆ పాస్‌బుక్‌ అట్ట మీద “అమలాపురం పురోహిత పరిషత్‌ సంక్షేమ నిధి” అని రాసి ఉంది.

***

ముక్కామల చక్రధర్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా చాలా మంచి కధ చక్రధర్.
    ఆద్యంతం ఆసక్తి గా సాగి చివర్న మనస్సుని కుది పింది
    మొదట్లో చిలక మర్తి వారి గణపతి మనసుకు వచ్చినా వెంటనే వెళ్ళిపోయాడు.

  • కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.చివరి మలుపు చాలా గోప్యంగా ఊహించ లేనిదిగాఉంది.రచియితకి అభినందనలు

  • గుండెలు పిండిన కథ.కళ్ళు తడిసి పోయాయి.గుండె మెలి పెట్టారు.చక్రథర్ ఈ బ్రాహ్మణ కథల అవసరం ఎంతైనా ఉంది.

  • ఓహో ఒక సురూపుని కథ!
    సౌందర్యమంతా అతడు బతుకంతా నలుగురిలో, నలుగురితో, నలుగురి కోసం బతకడంలో ఉంది.
    ఆ so called నలుగురికి అప్పటికి తెలిసింది

  • “రూపం ఎలా ఉన్నా గుణం అనేది ముఖ్యం” అనే విషయం మీరు కథలో చాలా చక్కగా వర్ణించిన తీరు, త్రిశూలపాణి తిరిగిన సమాజం తనని చిన్నచూపు చూసినప్పటికీ కూడా, దాన్ని ఒక ధనాత్మకంగానే తీసుకుంటూ తన బాధ్యతగా ఒక వైపు కుటుంబం కొరకు మరొకవైపు సమాజం శ్రేయస్సు కొరకు తను డబ్బు దాచిన విషయము హృదయాన్ని కదిలించింది. కథ చాలా బాగుంది అండి.చదువుతున్నంతసేపు తరువాత ఏం జరిగుతుందో అనే ఆతృత కలిగిస్తుంది. ఆసక్తి కలిగించే విధంగా గదలు రాస్తున్న మీకు ఓ అభిమానిగా ధన్యవాదములు.

  • బాగుందిరా చక్రి. కొన్ని జీవితాన్ని తలుచుకుంటే కడుపులో ఏదోలా అయిపోతుంది. అదే సమయంలో ఒక ఊహించని మంచి పని జరిగితే మనసు తేలిక పడుతుంది. చివర్లో ముగింపు బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.