మా అమ్మమ్మ గారి ఊరు సర్జాఖాన్‌పేట్

 అధ్యాయం 1: పాలమూరు – నా కథ మొదలైన చోటు

​పాలమూరు, ఆ పేరు వినగానే నాకు ముందుగా గుర్తొచ్చేది ఆ మండుతున్న ఎండలు, కరువు, వలసలు కాదు, ఆ కరువు లో కూడా చెదరని చిరునవ్వుతో కష్టాన్ని పండుగలా మార్చుకునే మనుషుల జ్ఞాపకం. ఇది కేవలం ఒక జిల్లా కాదు, అనేక తరాల పోరాటాలకు, వలస జీవుల వేదనలకు, ఆప్యాయతలకు నిలయం. నా కథ మొదలైంది ఇక్కడే, ఈ మట్టిలోనే.

​పాతకాలంలో మా ఊరు హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండేది. నిజాం రాజుల పాలన, ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం నాటి గుర్తులు మా ఊరి పొలిమేరల్లో ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో గ్రామాల్లో “దొరల వ్యవస్థ” బలంగా ఉండేదట. గడీలు, జమీందార్లు, వారి ఆధిపత్యం. ఇవన్నీ పెద్దలు కథలు కథలుగా చెబుతుంటే వినేవాడిని. కానీ పాలమూరు మనుషులు మాత్రం వంగి ఉండటం నేర్చుకోలేదు, కష్టాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్నారు.

​ఈ నేలలో జీవితం అంత సులభం కాదు. వానలు ద్రోహం చేసినా, ఎండలు మండినా ఇక్కడి జనం పశువులనే ప్రాణంగా చూసుకునేవారు. పాలు (Milk) సమృద్ధిగా దొరికేవి. అందుకే దీనికి “పాలు ఉన్న ఊరు – పాలమూరు” అని పేరు వచ్చిందని మా తాతయ్య తరచుగా చెబుతుండేవారు. “ఈ నేలలో పాలు ఎప్పుడూ తక్కువ కాలేదురా.” అని ఆయన అంటుంటే, ఆ మాటల్లో ఒక గర్వం కనిపించేది. ఆ తర్వాత ఆరవ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ పేరు మీద దీనిని ‘మహబూబ్‌నగర్’గా మార్చారు. ‘మహబూబ్’ అంటే ‘ప్రియమైన’ అని అర్థం. నిజమే, ఈ పట్టణం మా అందరికీ ఎంతో ప్రియమైనది.

​నాకు ఊహ తెలిసినప్పటి నుండి, అంటే సరిగ్గా ఐదేళ్ల నుండి పదిహేను ఏళ్ళ వయసులో జరిగిన విషయాలు ఇప్పటికీ నా కళ్లముందే కదలాడుతున్నాయి. నేను ఒకటో తరగతి చదువుతున్న రోజుల నుండి ఈ కథ మొదలు పెడతాను. మా ఇంటి నుండి బడికి కేవలం ఐదు నిమిషాల నడక కానీ ఆ ఐదు నిమిషాల ప్రయాణం నాన్నగారి చేతి వేళ్లను పట్టుకుని సాగేది. నాన్న నన్ను, అక్కను ఇద్దరినీ తలొక చేత్తో పట్టుకుని బడిలో దింపేవారు.

​బడిలో పాఠాల కంటే నాకు ఆ 12 గంటల ‘లంచ్ బెల్’ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ బెల్ కొట్టగానే మా అమ్మ గేటు దగ్గర కనిపిస్తుంది. ఉదయం 11:45 AM నుండే అమ్మ గేటు దగ్గర నిలబడి లోపల మేము ఏం చేస్తున్నామో, స్నేహితులతో ఎలా ఉంటున్నామో ఆత్రుతగా గమనిస్తూ ఉండేది. 12:00 PM కొట్టగానే బెల్ శబ్దం వినబడడమే ఆలస్యం. నేను పుస్తకాల సంచిని భుజాన వేసుకుని పరుగున వెళ్లి అమ్మ చంక ఎక్కేవాడిని. ఒక వైపు నన్ను ఎత్తుకుని, మరోవైపు అక్క చేయి పట్టుకుని అమ్మ రోడ్డు మీద వెళ్లే వాహనాల గురించి చెబుతూ మాతో ముచ్చట్లు ఆడుతూ ఇంటికి తీసుకెళ్లేది.

​మళ్లీ ఒంటి గంటకు స్కూల్లో దింపడం, సాయంత్రం 4 గంటల బెల్ కొట్టగానే అందరికంటే ముందు నేను బయటకు వచ్చి అక్క కోసం ఎదురుచూడటం. అక్క తన స్నేహితులతో కలిసి నెమ్మదిగా వచ్చేది. అక్కతో ఒక చిక్కు ఉండేది, తను నాన్న చెప్పిన దారిలో కాకుండా తన స్నేహితుల ఇళ్ల మీదుగా నన్ను తిప్పుకుంటూ ఇంటికి తీసుకెళ్లేది. అప్పుడు నాకు సమయం అంటే ఏంటో తెలీదు, కేవలం బడి గంటల లెక్కలే నా ప్రపంచం.

​ఇంటికి రాగానే హోంవర్క్ గురించి పట్టించుకోకుండా బ్యాగు మంచం మీద పడేసి వీధిలోకి పరుగు తీసేవాడిని. చీకటి పడేవరకు స్నేహితులతో ఆటలే ఆటలు. నాన్న వచ్చి పిలిచే వరకు ఆడుకుంటూనే ఉండేవాడిని. నాన్న పిలిచినా మొండికేస్తే, ఒక దెబ్బ వేసి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. ఇక ఇంట్లో అసలు కథ మొదలయ్యేది. ఆడి ఆడి అలసిపోవడం వల్ల ముద్ద నోట్లో పెట్టుకుని అలాగే నిద్రపోయేవాడిని. అమ్మ విసుక్కుంటూనో, కొడుతూనో తినిపించేది. మరుసటి రోజు ఉదయం హోంవర్క్ చేయలేదని ఏడుస్తుంటే అక్కే నా హోమ్ వర్క్ పూర్తి చేసి ఇచ్చేది.

​అలా పాలమూరు వీధుల్లో, అమ్మ ఒడిలో, నాన్న కౌగిలిలో నా బాల్యం చిగురించింది. కానీ అసలు సంబరం మాత్రం వేసవి సెలవుల్లో మొదలయ్యేది. అది మా అమ్మమ్మ గారి ఊరు ‘సర్జాఖాన్ పేట’ ప్రయాణం!

అధ్యాయం 2: ప్రయాణం – పల్లెటూరి దారిలో.

​పాలమూరులో ఎండలు ముదురుతున్నాయంటే చాలు, మా మనసులు మాత్రం చల్లటి పల్లెటూరు వైపు పరుగులు తీసేవి. స్కూల్లో ఆఖరి పరీక్ష అయిపోగానే, పుస్తకాల సంచిని అటక మీద పడేసి “అమ్మమ్మ గారి ఊరికి ఎప్పుడు వెళ్తాం అమ్మ?” అని రోజుకు వంద సార్లు అడిగేవాడిని. మా అమ్మమ్మ గారి ఊరు ‘సర్జాఖాన్ పేట’ అంటే నాకు కేవలం ఒక ఊరు కాదు, అదొక స్వేచ్ఛా ప్రపంచం.

​ప్రయాణం రోజు రానే వచ్చేది. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఒక రకమైన హడావిడి మొదలయ్యేది. అమ్మ పెద్ద పెద్ద సంచుల్లో మా బట్టలు, మరికొన్ని తినుబండారాలు సర్దుతుంటే, నేను, అక్క ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతుండేవాళ్లం. అప్పట్లో మాకు ఒక చిన్న చెల్లి కూడా ఉంది. ఆమె పుట్టకముందు వరకు అమ్మ చంకలో నాదే రాజ్యాం ఉండేది, కానీ చెల్లి వచ్చాక నా ప్లేస్ ఆమెకు వెళ్ళిపోయింది. అమ్మ చెల్లిని ఎత్తుకుంటే, నాన్న నన్ను, అక్కను తలొక చేయి పట్టుకుని నడిపించేవారు.

​మా ఇంటి నుండి కొంచెం దూరంలో ‘తిరుమల దేవుని గేటు’ అని ఒక చిన్న బస్ స్టాప్ ఉండేది. అది మా ఊరికి ప్రధాన ద్వారం లాంటిది. అక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఉరికి పోయే బస్సెస్ వచ్చి ఆగేవి, అక్కడికి చేరుకోగానే నాన్న మా కోసం ఎదురుచూసి, బస్సు వచ్చే వరకు మాతో ఉండేవారు. బస్సు రాగానే నాన్న మమ్మల్ని ఎక్కించి, అమ్మకు జాగ్రత్తలు చెప్పి సాగనంపేవారు. కిటికీ పక్కన కూర్చుని, వెనక్కి వెళ్తున్న చెట్లను, పొలాలను చూస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను.

​దాదాపు గంట ప్రయాణం తర్వాత మేము ‘కోస్గి’ బస్ స్టాండ్ చేరుకునేవాళ్లం. అక్కడ బస్సు దిగగానే అసలైన కష్టం మరియు ఆనందం మొదలయ్యేది. కోస్గి మార్కెట్ గుండా నడుచుకుంటూ ఆటో స్టాండ్ వరకు వెళ్లాలి. మార్కెట్ లోని రకరకాల వాసనలు, జనాల సందడి మధ్యలో అమ్మ చెల్లిని ఎత్తుకుని నడుస్తుంటే, నేను అక్క చేయి పట్టుకుని వెళ్లేవాడిని. అప్పట్లో మా అమ్మమ్మ గారి ఊరికి బస్సు సౌకర్యం లేదు, కేవలం ‘షేర్ ఆటో’లే దిక్కు.

​ఆ ఆటో డ్రైవర్లు కూడా విచిత్రంగా ఉండేవారు. ఆటోలో మనుషులు సరిపోయినా, “ఇంకొక్కరు. ఇంకొక్కరు” అంటూ ఊరంతా తిప్పి, సీట్ల మధ్యలో కూడా జనాలను కుక్కేవారు. ఆ ఇరుకులో కూర్చుని వెళ్లడం మాకు అప్పట్లో ఒక పెద్ద సాహసంలా అనిపించేది. సాయంత్రం 4 గంటలకు కోస్గిలో ఆటో ఎక్కితే, మా ఊరు చేరేసరికి సాయంత్రం 5 అయ్యేది. ఆ ప్రయాణంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న వేప చెట్లు, పచ్చని పొలాలు మమ్మల్ని స్వాగతిస్తున్నట్లు ఉండేవి.

​ఊరి పొలిమేరల్లో ఆటో దిగగానే, మట్టి వాసన ఊపిరిని నింపేది. అక్కడి నుండి అమ్మమ్మ ఇంటికి నడక మొదలయ్యేది. దారిలో పాతకాలపు దేవాలయాలు, మసీదులు దాటుకుంటూ వెళ్తుంటే ఊరంతా ” మా అమ్మ ని చూసి గుర్తు పట్టి దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉండేవారు”. మధ్యలో జిల్లా పరిషత్ స్కూల్ వచ్చేది. ఆ స్కూల్ ఆవరణలో ఉన్న పెద్ద చింతచెట్టు కింద పిల్లలంతా క్రికెట్, గోటీలాట ఆడుతూ కనిపించేవారు.

​ఆ స్కూల్ పక్కనే ఒక పెద్ద ‘బురుజు’ (Old Fort Tower) ఉండేది. అది చాలా పాత నిర్మాణం. బహుశా 300 నుండి 500 ఏళ్ల చరిత్ర దానికి ఉండి ఉండవచ్చు. పెద్ద పెద్ద రాళ్లతో, బంక మట్టి తో కట్టిన ఆ గోడలు కొంచెం వంకరగా ఉన్నా, ఇప్పటికీ బలంగా నిలబడి ఉన్నాయి. దాని పైభాగంలో చెట్లు మొలిచి ఉండటం చూస్తుంటే ఒక రకమైన భయం, కుతూహలం కలిగేవి. “అప్పట్లో దొరలు శత్రువుల రాకను గమనించడానికి వీటిని కట్టారురా” అని అమ్మచెప్తుంటే ఆశ్చర్యంగా చూసేవాడిని.

​ఆ బురుజు దాటి ఒక మలుపు తిరగగానే దూరం నుండి మా అమ్మమ్మ గారి ఇల్లు కనిపించేది. ఆ ఇల్లు చూడగానే నాలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేది. అమ్మ చేయి వదిలేసి, పరుగున వెళ్ళి “అమ్మమ్మా… వచ్చేశాం!” అని అరవాలనిపించేది. ఆ ఇంటి ముందు ఉన్న రెండు పెద్ద వేప చెట్లు, ఆ పాత గోడలు మా కోసం వేచి చూస్తున్నట్లు ఉండేవి. ఆ ఇంటి గుమ్మం దాటగానే మా అమ్మమ్మ, మామయ్యలు బయటకు వచ్చి మమ్మల్ని ఆదరంగా లోపలికి తీసుకెళ్లేవారు. పట్టణపు రొద నుండి విముక్తి పొంది, ఒక ప్రశాంతమైన లోకంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగేది. అలా మా అమ్మమ్మ గారి ఊరి ప్రయాణం ముగిసి, సెలవుల సందడి మొదలయ్యేది!

అధ్యాయం 3: అమ్మమ్మ ఇల్లు – ఆత్మీయతల లోగిలి

​ఆ మలుపు తిరగగానే కనిపించే మా అమ్మమ్మ గారి ఇల్లు నా కళ్లముందు ఒక కోటలా కనిపిస్తుంది. ఇంటి ముందు రెండు నిలువెత్తు వేప చెట్లు. ఉదయం, సాయంత్రం అయితే చాలు ఆ చెట్ల మీద కోతుల సందడి మొదలయ్యేది. మా ఊరి భాషలో వాటిని ‘కొనేంగలు’ అనేవాళ్ళం. ఆ కోతులు చేసే అల్లరి చూస్తూ అరుగుల మీద కూర్చోవడం ఒక కాలక్షేపం.

​ఇంటి ముందు రెండు పెద్ద అరుగులు ఉండేవి. ఆ రోజుల్లో మా ఊళ్లో సాయంత్రం కాగానే కరెంట్ పోవడం ఒక ఆనవాయితీ. అప్పుడు ఊరంతా చీకటిలో మునిగిపోయినా, ఆ అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే మనుషుల నవ్వులతో వీధులన్నీ కళకళలాడేవి. ఆ చల్లటి గాలిలో అరుగు మీద పడుకుని నక్షత్రాలను లెక్కపెడుతుంటే కలిగే ఆనందం అద్భుతం.

​ఇంటి లోపలికి అడుగు పెట్టగానే మొదట కనిపించేది ‘దసరా కట్ట’ గది. అది చాలా పెద్ద గది, మా కుటుంబం అంతా కూర్చున్నా ఇంకా చోటు మిగిలేది. ఆ గదిలో మా తాతయ్య, ముత్తాతల ఫోటోలు గోడలకి వేలాడుతూ ఉండేవి. ఆ గదికి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. ప్రతి దసరా పండుగకు మా తాతయ్య గారు అక్కడ కూర్చునేవారు. ఊరి జనం అందరూ వచ్చి తాతయ్యకు ‘జమ్మి’ ఇచ్చి ‘అలై-బలై’ చెప్పుకునేవారు. అది కేవలం ఒక గది కాదు, మా తాతయ్య వంశపు గౌరవానికి, ఆత్మీయతకు ఒక నిదర్శనం.

​దసరా కట్ట గది దాటాక ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉండేది, అక్కడే ఒక పాతకాలపు చేద బావి ఉండేది. ఇప్పుడు అందరి ఇళ్లలో బోర్లు ఉన్నాయి కానీ, అప్పట్లో ఆ చేద బావి నీళ్లే మాకు ఆధారం. ఆ బావి దగ్గర నీళ్లు తోడటం, స్నానాలు చేయడం ఒక పెద్ద వేడుకలా ఉండేది.

​మా అమ్మమ్మ గారి ఇంటి పక్కనే మా పెద్ద అమ్మమ్మ ఇల్లు ఉండేది. విచిత్రం ఏమిటంటే, రెండు ఇళ్లకు కలిపి మెయిన్ డోర్ ఒక్కటే! లోపలికి వచ్చాక ఎవరి గదులు వారివి. అందుకే అక్కడ ఎవరు వచ్చినా అందరికీ తెలిసిపోయేది. వెంటనే వెళ్లి పలకరించుకోవడం, ఒకరి ఇంట్లో వంట మరొకరితో పంచుకోవడం అప్పట్లో చాలా సహజం. ఇప్పుడు కాలం మారిపోయింది, ఇళ్లు విడిపోయాయి, గోడలు పెరిగాయి. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే మనసు కొంచెం బరువుగా అనిపిస్తుంది.

​ప్రతి ఆదివారం మా కోసం ఒక ప్రత్యేకమైన రోజు. అమ్మ మమ్మల్ని పిలుచుకుని ఊరిలోని ‘ మైసమ్మ కట్ట’ దగ్గరికి వెళ్లేది. అక్కడ దీపం పెట్టి, కొబ్బరికాయ కొట్టి మొక్కుకునేది. అక్కడి నుండి మామయ్యల చేను (పొలం) వైపు వెళ్లేవాళ్లం. మా ముత్తాతల సమాధుల దగ్గర మొక్కి, గుడాలు (ఉడకబెట్టిన శనగలు) మరియు కళ్లు నైవేద్యంగా పెట్టి కాసేపు అక్కడ సమయం గడిపి చీటికీ పడకముందే తిరిగి వచ్చేసేవాళ్ళం

​సెలవులు గడుస్తున్న కొద్దీ, ఒకరి తర్వాత ఒకరు మా బంధువులంతా రావడం మొదలయ్యేది. పెద్దమ్మలు, పిన్నిలు, బాబాయ్‌లు, అత్తలు, మామయ్యలు, అందరూ తమ పిల్లలతో కలిస్తే ఆ ఇల్లు ఒక చిన్న జాతరలా మారిపోయేది. పగలు పొలాల వెంట తిరుగుతూ, రాత్రి పూట దసరా కట్ట గదిలో అందరం కలిసి పాత సినిమాలు చూస్తూ గడిపే ఆ రోజులు నా జీవితంలో అత్యంత మధురమైనవి. మేము ఉదయం నుండి బాగా అది అలిసిపోవడం వాళ్ళ మా పెద్ద వాళ్ళు మూవీ చూస్తూ ఉంటె వాళ్ళ దగ్గరే పడుకొని ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ ఇంటి గడప దాటితే చాలు, ప్రేమ అంటే ఏంటో, బంధం అంటే ఏంటో ప్రతి అడుగులోనూ కనిపిస్తుండేది.

అధ్యాయం 4: పల్లెటూరి పలకరింపు

​పల్లెటూర్లో ఉదయం అంటే అలారం శబ్దం కాదు, కోడి కూత లేదా బావి దగ్గర నీళ్లు తోడే శబ్దం. అమ్మమ్మ ఇంటికి వచ్చిన ప్రతిరోజూ నాకో ప్రత్యేకమైన బాధ్యత ఉండేది. అది అమ్మమ్మతో కలిసి పాలు తేవడానికి వెళ్లడం. సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే, అమ్మమ్మ నన్ను లేపేది. ఒక చేత్తో పెద్ద స్టీలు చెంబు పట్టుకుని, మరో చేత్తో నా చిటికెన వేలు పట్టుకుని అమ్మమ్మ నడక మొదలుపెట్టేది.

​మా ఇంటి నుండి సుమారు పావు కిలోమీటర్ దూరం నడవాలి. ఆ దారిలో కనిపించే ప్రతి ఒక్కరూ అమ్మమ్మను ఆప్యాయంగా పలకరించేవారు. “ఏందే బుగ్గమ్మ, మనవడా?” అని అడిగితే, అమ్మమ్మ గర్వంగా నన్ను చూపిస్తూ “అవును. పాలమూరు నుండి వచ్చాడు” అని చెప్పేది. ఆ నడకలో నేను అమ్మమ్మను ఒక ప్రశ్న అడిగాను, “అమ్మమ్మా, మా అమ్మ కూడా చిన్నప్పుడు నీతో ఇలాగే పాలు తేవడానికి వచ్చేదా?” అని.

​అమ్మమ్మ ఒక్క క్షణం ఆగి, పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి నవ్వుతూ చెప్పింది, “అప్పుడు మన ఇంట్లోనే చాలా ఆవులు, ఎడ్లు ఉండేవిరా, ఊరంతా మన దగ్గరికే వచ్చి పాలు తీసుకెళ్లేవారు. మీ అమ్మే స్వయంగా పాలు పితికి తాగేసేది. ఇప్పుడు కాలం మారింది, మనం ఇతరుల దగ్గరికి వెళ్తున్నాం” అని. ఆ మాటలు వింటుంటే మా అమ్మ పాలు పితికే దృశ్యం నా కళ్లముందు కదలాడింది. ఇంటికి రాగానే అమ్మను అడిగితే, తను ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకునేది. ఆ నవ్వులో ఎంతో అర్థం ఉండేది.

​ఇంటికి పాలు రాగానే అసలైన సంబరం మొదలయ్యేది. మా పిన్ని ఆ పాలను కాచి, టీ పెట్టి మా పిల్లలందరికీ ఇచ్చేది. దాంతో పాటు ‘ఉప్పు బిస్కెట్లు’, ‘తోసులు’ (Rusk) ఇచ్చేవారు. ఆ వేడి టీ లో బిస్కెట్ ముంచుకుని తింటుంటే వచ్చే ఆ రుచి, ఇప్పట్లో ఏ ఫైవ్ స్టార్ హోటల్ టిఫిన్ లోనూ దొరకదు.

​ఇక సాయంత్రం అయితే మా చూపులన్నీ పొలం నుండి వచ్చే మామయ్య వైపు ఉండేవి. మామయ్య వస్తూ వస్తూ మా కోసం కందులు, వేరుశనగ కాయలు (Groundnuts) తీసుకువచ్చేవారు. మేము వేరుశనగ కాయలను ‘పాల బుడ్డలు’ అని పిలిచేవాళ్ళం. వాటిని పిన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి ఉడకబెట్టేది.

​రాత్రి పూట భోజనాలు అయిపోయాక, ఆ ఉడకబెట్టిన పాలబుడ్డల గిన్నె పట్టుకుని అందరం అరుగు మీదకు చేరేవాళ్ళం. అది పున్నమి వెన్నెల సమయం అయితే ఇక చెప్పక్కర్లేదు. చందమామ వెలుగులో, నక్షత్రాలను చూస్తూ, ఆ చల్లటి గాలిలో కూర్చుని ఉడకబెట్టిన పల్లీ కాయలు ఒలుచుకుంటూ తింటుంటే, ప్రపంచమే మర్చిపోయేవాళ్ళం. మామయ్యలు, నాన్నలు ఒక పక్క తమ కబుర్లు చెప్పుకుంటుంటే, మేము పిల్లలమంతా కథలు వింటూ, ఆటలాడుతూ గడిపేవాళ్ళం.

​పల్లెటూర్లో దొరికే ఆ స్వచ్ఛమైన ఆహారం, అంతకంటే స్వచ్ఛమైన ఆ మనుషుల ప్రేమ నా మనసులో చెదరని ముద్ర వేసింది. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని ఇప్పటికీ నా మనసు పరితపిస్తూనే ఉంటుంది.

అధ్యాయం 5: వేసవి సందడి – క్రికెట్, సినిమాలు మరియు పాత ఆటలు

​వేసవి సెలవులు సగం దాటాక, అమ్మమ్మ ఇల్లు ఒక చిన్న జాతరలా మారిపోయేది. పెద్దమ్మలు, పిన్నిలు, బాబాయ్‌లు అందరూ తమ పిల్లలతో కలిసి వస్తే చాలు. ఇంట్లో కనీసం 20-30 మంది పిల్లలం ఉండేవాళ్లం. మా నాన్న, పెద్దనాన్నలు, బాబాయ్‌లు కూడా వారం రోజులు సెలవు తీసుకుని ఊరికి వచ్చేవారు. వారు వచ్చాకే అసలైన సందడి మొదలయ్యేది.

​మధ్యాహ్నం 3 గంటలు దాటిందంటే చాలు, ఇంటి ముందున్న రెండు పెద్ద వేప చెట్ల కింద మా క్రికెట్ గ్రౌండ్ సిద్ధమైపోయేది. మా కుటుంబం అంతా కలిస్తే సులభంగా రెండు, మూడు క్రికెట్ టీమ్‌లు అయ్యేవి. నాన్న, బాబాయ్‌లు, మామయ్యలు. అందరం కలిసి ఆడేవాళ్లం. ​సాయంత్రం చీకటి పడగానే పెద్దవాళ్లందరూ ఒక గదిలోకి వెళ్లి ముచ్చట్లు పెట్టుకునేవారు. మేము పిల్లలమంతా ‘దాగుడు మూతలు’, ‘స్టాట్యూ’, ‘ఉప్పు గేరి’, ‘గోటీలాట’ ఆడుతూ అల్లరి చేసేవాళ్లం. అప్పట్లో ఒక వింత ఆట ఉండేది. ‘రంగు రంగు ఏ రంగు?’ అని ఒకరు అడిగితే మిగతా వాళ్లంతా ఆ రంగును వెతికి తాకాలి. ‘రాజు, రాణి, మంత్రి, సిపాయి’ ఆటలో దొంగ ఎవరైతే వారిని ఆట పట్టించేవాళ్లం.

​ఒకరోజు మధ్యాహ్నం అందరూ నిద్రపోతుంటే, నేను బాబాయ్ కిరాణా షాపు దగ్గరికి వెళ్లాను. అక్కడ రేడియోలో వచ్చే పాటలు వింటూ కూర్చోవడం నాకు చాలా ఇష్టం. అప్పుడు రోడ్డు మీద కొంత మంది పిల్లలు వేప చెట్ల కింద రాలిన వేపకాయలను ఏరుకుని డబ్బాల్లో వేయడం చూశాను. ఇంటికి వచ్చి అమ్మమ్మను అడిగితే, “ఆ వేపకాయలను డబ్బా నిండా నింపి అమ్ముతే రెండు రూపాయలు ఇస్తారురా. వాటితో మందులు, సబ్బులు తయారు చేస్తారు” అని చెప్పింది.

​రాత్రి పూట భోజనాలు అయ్యాక ‘దసరా కట్ట’ గదిలో మా సినిమా థియేటర్ మొదలయ్యేది. అప్పట్లో మా ఇంట్లో ఒక DVD ప్లేయర్ ఉండేది. ఆ పెద్ద గదిలో అందరం కింద దుప్పట్లు పరుచుకుని కూర్చునేవాళ్లం. ‘మాయాబజార్’, ‘భైరవద్వీపం’, ‘అగ్గి భరాట ‘, ‘బాలనాగమ్మ కథలు’ వంటి పాత సినిమాలు సీడీలు వేసి చూసేవాళ్లం. రాత్రి 9:00 గంటలకు సినిమా మొదలైతే అర్ధరాత్రి 12:00 లేదా 1:00 అయ్యేది. పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ సినిమా చూస్తుంటే, మేము పిల్లలమంతా సినిమా మధ్యలోనే ఎవరి ఒడిలోనో ఒకరు నిద్రపోయేవాళ్లం. సినిమా అయిపోయాక పెద్దవాళ్లు మమ్మల్ని భుజాన వేసుకుని తమ గదుల్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టేవారు.

​ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు. కానీ ఆ ఆటలు, ఆ సినిమాలు, ఆ రస్నా ప్యాకెట్ల మధ్య దొరికిన ఆనందం వెలకట్టలేనిది. ఆ మనుషుల మధ్య ఉన్న ఐక్యత మాకు జీవితాంతం గుర్తుండిపోయే పాఠాలను నేర్పింది.

అధ్యాయం 6: పొలాల వెంట – స్విమ్మింగ్ పూల్ అనుభవాలు

​సెలవులు ముదురుతున్న కొద్దీ, మా సందడి ఇంటి నుండి పొలాల వైపు మళ్లేది. మా అమ్మమ్మ గారి ఊరి పొలాలు అంటే మాకు ఒక అడ్వెంచర్ పార్క్ లాంటివి. ఉదయాన్నే నాన్న, పెద్దనాన్నలు, బాబాయ్‌లు సిద్ధమైతే, మేము పిల్లలమంతా వారి వెనుక పరుగు తీసేవాళ్లం. మా మామయ్యల పొలం దగ్గర ఒక పెద్ద బోర్ బావి ఉండేది. అప్పట్లో మాకు అదే మా ‘పర్సనల్ స్విమ్మింగ్ పూల్’.

​బోర్ వేయగానే నీళ్లు ఫోర్స్‌గా వచ్చే ఆ చోట ఒక చిన్న సిమెంట్ తొట్టి (Sump) ఉండేది. ఆ తొట్టిలో నీళ్లు నిండగానే అందరం లోపలికి దూకేవాళ్లం. గంటల తరబడి నీళ్లలో ఆడుతూ, ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉంటే సమయమే తెలిసేది కాదు. ఆ స్నానం అయిపోయాక వచ్చే ఆకలికి, పొలం గట్టున కాల్చిన మొక్కజొన్న కంకులు తింటుంటే ఆ రుచి అమృతంలా ఉండేది. అక్కడ ఒక పెద్ద రేగు పండ్ల చెట్టు కూడా ఉండేది. చిన్నప్పుడు మేమే ఆ రేగి చెట్టు ఎక్కి, రేగిపండ్లు కోసుకుని కడుపు నిండా తినేవాళ్లం.

​సాయంత్రం వేళల్లో అమ్మ, పిన్నిలు, పెద్దమ్మలు అందరం కలిసి ‘దండం చెరువు’ దగ్గరికి వెళ్లేవాళ్లం. ఇంటి నుండి ఆ చెరువు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. అంత దూరం కూడా అందరం కబుర్లు చెప్పుకుంటూ నడిచే వెళ్లేవాళ్లం. అక్కడ పీర్లకు దీపం పెట్టి, ‘మలిద ముద్దలు’ నైవేద్యంగా పెట్టేవారు. మలిద అంటే. చపాతీలను ముక్కలు చేసి, అందులో బెల్లం, పుట్నాలు, సోంపు, నెయ్యి కలిపి ముద్దలుగా చేస్తారు. ఆ చెరువు గట్టున కూర్చుని, చల్లటి గాలిలో ఆ తియ్యటి మలిద ముద్దలు తింటుంటే ఆ క్షణం అక్కడే ఆగిపోతే బాగుండు అనిపించేది.

​ఒకరోజు నేను, నా ఇద్దరు కసిన్స్ కలిసి ఒక కొత్త సాహసం చేశాం. మా బావలు కొత్త సైకిల్ కొన్నారు, దాన్ని తీసుకుని ముగ్గురం చెరువు దగ్గరికి వెళ్లాం. అక్కడ హాయిగా నీళ్లలో ఆడుకుని, స్నానం చేసి తిరిగి వద్దామని చూస్తే. సైకిల్ తాళం (Key) ఎక్కడా కనిపించలేదు! నీళ్లలో ఆడుతున్నప్పుడు ఎక్కడో పడిపోయింది. అప్పుడు మాకు వచ్చిన భయం అంతా ఇంతా కాదు. తాళం లేకుండా సైకిల్ ఎలా తీసుకెళ్లాలి? చివరకు ఒక ఉపాయం ఆలోచించాం. ఒకరు హ్యాండిల్ పట్టుకుంటే, మిగతా ఇద్దరం సైకిల్ వెనుక టైరును గాలిలో పట్టుకుని మోసుకుంటూ ఇంటికి వెళ్లాం. అది చూసి మా మామయ్యలు చాలా తిట్టారు. ఆ తిట్లు సైకిల్ తాళం పోయినందుకు కాదు. “మీకు ఈత రాదు కదా, అంత లోతైన చెరువులోకి ఎందుకు వెళ్లారురా?” అన్న ప్రేమతో కూడిన కోపం అది.

​ సాయంత్రం వేళల్లో మామయ్యలు పొలం నుండి పత్తిని బస్తాల్లో నింపి ఇంటికి తెస్తుంటే, మేము కూడా వారికి చిన్న చిన్న సాయం చేస్తూ రైతు జీవితంలోని కష్టాన్ని, ఆనందాన్ని దగ్గర నుండి చూశాం. పల్లెటూరి పొలాలు, ఆ చెరువు గట్లు మాకు కేవలం ఆటస్థలాలు మాత్రమే కాదు. అవి మనుషుల మధ్య ఉండే ప్రేమని, బాధ్యతని నేర్పిన బడులు.

అధ్యాయం 7: జాతర సందడి – పిడుగుల భయం

​పల్లెటూరి జీవితంలో పండుగలు ఒక ఎత్తయితే, గ్రామ దేవతల ‘జాతరలు’ మరో ఎత్తు. మా ఊరికి దగ్గరలో ‘పోలేపల్లి ఎల్లమ్మ’ అనే శక్తివంతమైన గ్రామ దేవత వెలిసింది. ఆ జాతర వచ్చిందంటే చాలు, ఊరంతా ఒక కొత్త కళ వచ్చేది. గాలిలో డప్పుల శబ్దం, భక్తుల కోలాహలం అదొక అద్భుతమైన దృశ్యం. మేము చాలాసార్లు ఇంటి నుండి ఆ దేవాలయానికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం.

​ఒకసారి జాతర సమయంలో మా మామయ్యల కుటుంబం అంతా కలిసి అమ్మవారికి ‘బోనం’ సమర్పించాలని నిర్ణయించుకున్నారు. అదొక పెద్ద వేడుక. అందరం ఉత్సాహంగా ట్రాక్టర్‌లో బయలుదేరాం. ట్రాక్టర్ వెనుక ట్రాలీలో కూర్చుని, పాటలు పాడుకుంటూ, జాతర విశేషాలు చెప్పుకుంటూ వెళ్లడం భలే గమ్మత్తుగా ఉండేది. అమ్మవారికి బోనం చెల్లించి, మొక్కులు తీర్చుకున్నాక, సాయంత్రం అందరం కలిసి పొలాల మధ్య ‘వన భోజనాలు’ చేయాలనుకున్నాం.

​కానీ, ప్రకృతి ఆలోచన వేరేలా ఉంది. మేము భోజనం ముగించి బయలుదేరుదాం అనుకునేలోపు, ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో నిండిపోయింది. అంతవరకు ఎండగా ఉన్న వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ఒక్కసారిగా జోరుగా వర్షం మొదలైంది. ఆ వర్షం సామాన్యమైనది కాదు. దాంతో పాటు భయంకరమైన గాలి వస్తోంది. తల దాచుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడిసె వైపు పరుగు తీశాం.

​ఆ గుడిసెలో అందరం గుంపుగా చేరి, వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నాం. అప్పుడే మొదలైంది అసలైన భయం. మేఘాల గర్జన గుండెల్ని పిండేస్తోంది. మెరుపులు కళ్లను మిరుమిట్లు గొల్పుతున్నాయి. ఒక్కసారిగా “పెళపెళా,” మంటూ ఒక పెద్ద శబ్దం. నా జీవితంలో అంత పెద్ద శబ్దాన్ని నేను ఎప్పుడూ వినలేదు. మాకు చాలా దగ్గరలోనే ఒక పిడుగు పడింది! ఆ శబ్దానికి, ఆ వెలుతురికి ఒక్క నిమిషం నాకేమీ అర్థం కాలేదు.

​పిల్లలమంతా భయంతో వారి అమ్మలను గట్టిగా హత్తుకున్నారు. పెద్దవాళ్లు కూడా భయపడినా, మాకు ధైర్యం చెబుతూ దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. “అమ్మో, ఎంత పని అయింది! ఎల్లమ్మ తల్లే మమ్మల్ని కాపాడాలి” అని అమ్మమ్మ అంటుంటే, నా ఒళ్లు గజగజ వణికిపోయింది. ఆ పిడుగు పడిన తాకిడికి భూమి కంపించినట్లు అనిపించింది. వర్షం కొంచెం తగ్గుముఖం పట్టాక, తడిసిన బట్టలతోనే, వణుకుతున్న ఒళ్లతో అందరం సామాన్లు సర్దుకుని జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నాం.

​ఆ రాత్రి పడుకునే ముందు అందరం దేవుడికి దండం పెట్టుకున్నాం. “హమ్మయ్య. ఈరోజు అందరినీ నువ్వే కాపాడావు అమ్మ ” అని అమ్మమ్మా అనడం ఇప్పటికీ నా చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఆ సంఘటన నాకు ఒక విషయాన్ని నేర్పింది. “ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో, దేవుడి మీద నమ్మకం మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఆరోజే తెలిసింది.”

​జాతర సంబరాలు ముగిసినా, ఆ పిడుగు శబ్దం మాత్రం నా మనసులో ఒక భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే. ఆకాశం మళ్లీ నిర్మలంగా ఉంది. కానీ మా మనసుల్లో మాత్రం ఆ గండం గడిచిన ఉపశమనం స్పష్టంగా కనిపిస్తోంది.

అధ్యాయం 8: పల్లెటూరి పలకరింపులు – ఆత్మీయతల బరి

​సెలవుల్లో అమ్మమ్మ గారి ఊళ్లో గడుపుతున్న కొద్దీ, నాకు అక్కడి మనుషుల మధ్య ఉన్న వింతైన అనుబంధం అర్థం కావడం మొదలైంది. ఒకరోజు ఉదయం లేవగానే అమ్మమ్మ నన్ను చూసి, “జట్టు బాగా పెరిగింది రా, మామయ్యతో వెళ్లి కటింగ్ చేయించుకుని రా పో” అంది. నాకు పట్టణంలో అలవాటు కదా. “ఇక్కడ కటింగ్ బాగా చేయరేమో, నేను మా ఇంటికి వెళ్ళాక చేయించుకుంటా” అని మారాం చేస్తూ ఏడ్చాను.

​మా మామయ్య నన్ను బుజ్జగించి, “చాక్లెట్లు కొనిస్తా రా.” అని షాపుకి తీసుకెళ్లారు. చాక్లెట్లు అనగానే నా ఏడుపు ఆగిపోయింది. ఆ కటింగ్ షాపులో కూర్చుని నేను చాక్లెట్లు తింటుంటే, ఆ షాపు ఆయన తన పని తాను పూర్తి చేసేశాడు. కటింగ్ అయిపోయాక మామయ్య డబ్బులు ఇద్దామని జేబులో చేయి పెట్టబోతుంటే, ఆ షాపు ఆయన ” పండగ అప్పుడు చూసుకుందాం” అని అన్నాడు నేను అది గమనించాను.

​తిరిగి వస్తుంటే మామయ్యను అడిగాను, “అదేంటి మామయ్య ఆయన డబ్బులు తీసుకోలేదు?” అని, అప్పుడు మామయ్య నవ్వుతూ పల్లెటూరి పాత పద్ధతి గురించి చెప్పారు. “మన దగ్గర డబ్బుల కంటే ధాన్యానికి విలువ ఎక్కువ. మన పొలం పంట చేతికి వచ్చాక, ఆయనకు రెండు షేర్ల బియ్యం, కందులు ఇస్తాం” అందుకే ఇప్పుడు డబ్బులు తీసుకోలేదు” అని వివరించారు.

​నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్క కటింగ్ షాపు ఆయన మాత్రమే కాదు. ఇంటి ముందు ఊడ్చేవారు, బట్టలు ఉతికేవారు. ఇలా ఊరిలోని చాలా మందికి పంట పండాక ధాన్యమే జీతం. దీనినే మా ఊర్లో ‘బరి’ పద్ధతి అని పిలిచేవారు. మనుషుల మధ్య నమ్మకం, ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికే ఆ జీవన విధానం నాకు చాలా కొత్తగా, గొప్పగా అనిపించింది.

​అదే సమయంలో ఊళ్లో ‘మైసమ్మ ‘ మరియు ‘భూలక్ష్మమ్మ’ మొక్కులు కూడా జరుగుతుండేవి. మైసమ్మ మొక్కు అంటే ఊరి పెద్దలంతా కలిసి చేసేది కానీ భూలక్ష్మమ్మ మొక్కు మాత్రం ఇంట్లోనే రహస్యంగా చేసేవారట. ఆ రోజు ఎవరినీ పిలిచేవారు కాదు. ఇంట్లోనే వంటలు చేసుకుని, భోజనాలు ముగించి, ఆ విస్తరాకులు కూడా బయట పడేయకుండా ఇంట్లోనే ఒక గుంత తీసి పాతి పెట్టేవారు. అది ఎంతో నిష్టగా చేసే పద్ధతి. ఇలాంటి ఆచారాలు వింటుంటే పల్లెటూరిలో మనుషుల నమ్మకాలు ఎంత బలంగా ఉంటాయో అర్థమయ్యేది.

​మా అమ్మమ్మ ఊళ్లో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చుట్టాలే. ఆ కటింగ్ షాపు ఆయన నుండి, పొలం పని చేసే కూలీల వరకు, అందరూ ఏదో ఒక అనుబంధంతో ముడిపడి ఉండేవారు. డబ్బుల లావాదేవీల కంటే, మాట మీద నిలబడే ఆ పల్లెటూరి నిజాయితీ నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది.

అధ్యాయం 9: నిశ్శబ్దపు శబ్దం – తాతయ్య చివరి ప్రయాణం

​కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషాల మధ్యలో ఒక్కోసారి ఊహించని నిశ్శబ్దం వచ్చి పడుతుంది”. ఆ సంవత్సరం వేసవి సెలవులకు వెళ్తున్నప్పుడు మనసులో ఏదో తెలియని వెలితి. ఎప్పుడూ అమ్మమ్మ ఇంటికి వెళ్లడం అంటే ఒక పండుగలా అనిపించేది, కానీ ఆ రోజు ప్రయాణం మాత్రం ఎందుకో భారంగా అనిపించింది.

​నేను పుట్టకముందే మా చిన్న తాతయ్య అనారోగ్యంతో చనిపోయారు. కానీ పెద్ద తాతయ్యను నేను చూశాను. ఆయన అందరిని అని ఆప్యాయంగా పలకరించే ఆ గొంతు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతూనే ఉంటుంది. కానీ ఆ రోజు ఊళ్లో అడుగు పెట్టగానే వాతావరణం భిన్నంగా ఉంది.

​ఇంటికి వెళ్లగానే ఒక మాట వినబడింది. “పెద్ద తాతయ్య లేరు.”.

​ఆ మాట వినగానే ఇంట్లో ఒక పెద్ద శబ్దం వినబడింది. అది ఏడుపు కాదు, ఒక గుండె పగిలిన శబ్దం. అందరూ తలో దిక్కున కూర్చుని ఏడుస్తున్నారు. నాకు అప్పుడు మరణం అంటే ఏంటో తెలీదు. ఏడెనిమిదేళ్ళ వయసులో చావు అంటే కేవలం మనిషి నిద్రపోవడం అనుకునేవాడిని. తాతయ్య దగ్గరికి వెళ్లాను. ఆయన నిశ్చలంగా పడుకుని ఉన్నారు. ఎప్పుడూ మాతో మాట్లాడే ఆ ముఖం ఇప్పుడు మౌనంగా ఉంది.

​అమ్మ వాళ్లు గట్టిగా ఏడుస్తుంటే, మగవాళ్లంతా నిశ్శబ్దంగా తాతయ్య చివరి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తాతయ్యను స్నానం చేయించి, కొత్త బట్టలు వేశారు. ఆ ప్రాసెస్ అంతా నేను ఒక ప్రశ్నార్థకంలా నిలబడి చూస్తూనే ఉన్నాను. ప్రతి అడుగులోనూ ఒక గౌరవం కనిపిస్తోంది, కానీ అది ఎందుకు చేస్తున్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు.

​కొద్దిసేపటికి పల్లకి సిద్ధమైంది. తాతయ్యను ఆ పల్లకిలో పడుకోబెట్టి బయటకు తీసుకువచ్చినప్పుడు నా గుండెలో ఒక తెలియని భారం మొదలైంది. ఊరంతా అక్కడికి చేరింది. ఆ నడకలో మొదటిసారి ఒక శబ్దాన్ని విన్నాను. అదే ‘డప్పుల శబ్దం’.

​”డుమ్, డుమ్, డుమ్.”

​ఆ శబ్దం ఊరంతా మారుమోగుతోంది. డప్పులు కొట్టే వాళ్లు పల్లకి ముందు నడుస్తూ, రౌండ్‌గా తిరుగుతూ డాన్స్ చేస్తున్నారు. ఆ దృశ్యం చూసి నాకు చాలా కన్ఫ్యూజన్ కలిగింది. “ఇది ఏడుపా? లేక పండుగా?” అని అమ్మ చేయి గట్టిగా పట్టుకుని అడిగాను. కానీ అమ్మ ఏడుస్తూ సమాధానం చెప్పలేకపోయింది. అప్పుడే నాకు తెలిసింది. “జీవితంలో కొన్ని సందర్భాలు బాధ మరియు సంప్రదాయం కలిసి ఉంటాయని.

​ఆ మట్టిలో తాతయ్య శరీరం కలిసిపోయింది కానీ, ఆయన జ్ఞాపకాలు మాత్రం మా మధ్యే మిగిలిపోయాయి. ఆ రోజు నేను చిన్నవాడినే కావచ్చు, కానీ మొదటిసారి జీవితం మరియు మరణం మధ్య ఉన్న సన్నటి గీతను చూశాను.

​”మనుషులు వెళ్తారు కానీ వారితో కలిసి మన జీవితంలోకి వచ్చిన జ్ఞాపకాలు ఎప్పటికీ వెళ్లవు” అన్న నిజం ఆ రోజే నాకు బోధపడింది. ఇప్పుడు పెద్దవాడినై ఆ రోజు గురించి ఆలోచిస్తే. భయం కాదు, ఒక లోతైన నిశ్శబ్దం గుర్తొస్తుంది. తాతయ్య చివరి ప్రయాణంలో నేను నడిచిన ఆ దారి, నా జీవితంలో మర్చిపోలేని ఒక పాఠం.

అధ్యాయం 10: వీడ్కోలు – అమ్మమ్మ కన్నీటి సంతకం

​సెలవులు ఎలా గడిచిపోయాయో కూడా తెలిసేది కాదు. ఆటలు, పాటలు, మామయ్యలతో పొలాలు ఇవన్నీ ఒక కలలా అనిపించేవి. కానీ తిరుగు ప్రయాణం రోజు రానే వచ్చేది. ఆ రోజు ఉదయం నుండే ఇంట్లో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించేది. అమ్మమ్మ మొఖంలో ఎప్పుడూ ఉండే ఆ నవ్వు ఆ రోజు కొంచెం తక్కువగా ఉండేది. ఆవిడ మమ్మల్ని చూస్తూ, “మళ్ళీ ఎప్పుడు వస్తారురా?” అని పదే పదే అడుగుతుంటే మనసు కరిగిపోయేది.

​సాయంత్రం అయ్యేసరికి సామాన్లన్నీ సర్దుకుని ఆటో స్టాండ్ వైపు బయలుదేరేవాళ్లం. ఇంటి గేటు దాటుతుంటే అమ్మమ్మ మమ్మల్ని ఆపి, “రా నాయనా, ఒక్కసారి దగ్గరకు రా.” అని పిలిచేది. తన పాత చీర పొట్లాలో ఎంతో భద్రంగా దాచుకున్న ఒక ₹50 నోటు తీసి మా ముగ్గురు చేతుల్లో పెట్టేది. “ఇది మీ ముగ్గురికీ జాగ్రత్తగా పెట్టుకోండి, ఆటోలో ఏదైనా కొనుక్కుని తినండి” అని చెప్పేది. మేము వద్దన్నా వినేది కాదు. “నాకు మీరు ఇచ్చే ఆనందం కంటే ఈ డబ్బులు ఎక్కువేం కాదురా.” అని నవ్వుతూ ఒక్కొక్కరికి ముద్దు పెట్టి సాగనంపేది.

​మేము “టాటా అమ్మమ్మ జాగ్రత్త” అని చెప్పి ముందుకు నడుస్తుంటే, ఆవిడ గేటు దగ్గరే నిలబడి చేతులు ఊపుతూ ఉండేది. కొంచెం దూరం వెళ్ళాక నేను వెనక్కి తిరిగి చూశాను. అమ్మమ్మ గేటు దగ్గర లేదు. ఆవిడ మెల్లగా మా వెనకాలే నడుచుకుంటూ వస్తోంది!

​”అమ్మా, అమ్మమ్మ వస్తోంది” అని నేను చెప్పగానే అమ్మ ఆగి వెనక్కి తిరిగింది. “ఎందుకమ్మా వస్తున్నావ్ ఇంత దూరం? మేము వెళ్తాం కదా.” అని అమ్మ కొంచెం కఠినంగా అడిగినా, ఆ మాటల్లో బాధ స్పష్టంగా తెలిసేది. అమ్మమ్మ మాత్రం ఆగి, “ఇంకొంచెం దూరం వస్తా, మీరు కనబడే వరకు చూస్తా” అని అంది. ఆ మాట వినగానే మా అందరి కళ్లు చెమర్చాయి. విడిపోవడం ఇష్టం లేక, ఆ అడుగులు మా వెనకాలే వస్తూనే ఉన్నాయి.

​చివరకు ఆటో స్టాండ్ వచ్చేసింది. ఆటో ఎక్కేటప్పుడు కూడా అమ్మమ్మ డ్రైవర్‌తో, “జాగ్రత్తగా తీసుకెళ్లండి బాబూ పిల్లలు ఉన్నారు” అని ముందే చెప్పేది. ఆటో స్టార్ట్ అయ్యి ముందుకు కదులుతుంటే, కిటికీలోంచి నేను వెనక్కి చూస్తూనే ఉన్నాను. అమ్మమ్మ అక్కడే నిలబడి ఉంది. ఒక చేత్తో కళ్లు తుడుచుకుంటూ, మరో చేత్తో మాకు వీడ్కోలు పలుకుతూ ఆటో మలుపు తిరిగి ఆవిడ కనబడకుండా పోయే వరకు ఆవిడ అక్కడే ఉందన్న విషయం నాకు తెలుసు.

​ఆ రోజు నాకు అర్థమైంది. “విడిపోవడం అనేది కేవలం దూరం వల్ల కాదు, మనసు వదలలేకపోవడం వల్ల” అని. అమ్మమ్మ వేసిన ఆ చిన్న చిన్న అడుగులు, ఆ కన్నీటి వీడ్కోలు నా జీవితాంతం మర్చిపోలేని ఒక జ్ఞాపకం.

 

 

తూర్పు కమాన్ – జ్ఞాపకాల నిశ్శబ్దం

​పాలమూరుకు తిరిగి వచ్చాక, మా ఇంటికి వెళ్లే దారిలో తూర్పు కమాన్ దగ్గర ఆటో ఆగేది. ఆ కామన్ కేవలం ఒక దారి కాదు, అది నా బాల్యానికి సాక్షి. ఆ నిశ్శబ్దంలో ఇప్పటికీ నా చిన్ననాటి నవ్వులు వినబడుతుంటాయి.

​కాలం మెల్లగా ముందుకు సాగింది. మేము కూడా పెరిగి పెద్దయ్యాం. ఇప్పుడు మాకంటూ బాధ్యతలు, చదువులు, పనులు వచ్చేసాయి. ఒకప్పుడు సెలవులు వస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లే అమ్మమ్మ ఇల్లు, ఇప్పుడు ఒక ‘అకేషన్’ అయిపోయింది. ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక దావత్ ఉన్న ఎవరు రావడం లేదు. అందరం కలవడానికి ఒక వాట్సాప్ గ్రూప్ అవసరమైంది. “ఎవరు వస్తున్నారు?” అని మెసేజ్ పెడితే, కొంతమంది ‘బిజీ’ అంటారు, మరికొందరు చూసి కూడా రిప్లై ఇవ్వరు.

​ఫోన్లు లేని ఆ రోజుల్లో మనసులు చాలా దగ్గరగా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కానీ, ఆ పాతకాలపు ఆత్మీయతలు పలచబడిపోయాయి. ఈ కథ చదువుతున్న మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. మీ అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నప్పుడే, ఆ జ్ఞాపకాలు ఇంకా బ్రతికే ఉన్నప్పుడే ఒక్కసారి వెళ్లండి. అందరూ కసిన్స్ కలిసి ఒక వారం రోజులు గడపండి. ఎందుకంటే కాలం గడిచాక మనం ఎంత కోరుకున్నా ఆ రోజులు, ఆ మనుషులు, ఆ అనుభూతులు తిరిగి రావు. అక్కడే, ఆ పాలమూరు నేలలోనే, నా కథ మొదలైంది, నా జ్ఞాపకాలు శాశ్వతమయ్యాయి.

*

భరత్ కనికె

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పాలమూర్ జ్ఞాపకాలనువిశదీకరించిన తీరు బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.