హసంతి పుట్టింది. ఇల్లు మురిసింది.
అల్లారుముద్దుగా పెరిగింది. నవ్విందంటే మల్లెల పరిమళాలు. హసంతి ఎంత అందంగా పుట్టిందంటే చలం ఒక పువ్వులా పుట్టింది. హసంతికి చలం తెలీదు. పెరిగే క్రమంలో చలనం తెలిసింది. మలినం తెలిసింది. దరిద్రం తెలిసింది. కాఠిన్యం తెలిసింది. అంతస్తు తెలిసింది. ఐశ్వర్యం తెలిసింది. అందం తెలిసింది. అనుభవం తెలిసింది. అన్నీ తెలిశాయి. తెలిసొచ్చాయి. ఇంత వయసుకేనా అంటే?– కేనే.
ఒకసారి హసంతి తనకి తెలియంది ఏముందాని ఆలోచిస్తూ ఉంటే ఆమె పద్దెనిమిదవ పుట్టినరోజొచ్చింది.
ఆ! పద్దెనిమిదవ ఏట తనకు తెలీదు కదా అని నవ్వుకుంది. నవ్వుతూ మంచం మీద ఒరుగుతుంటే రమణ వొడి గుర్తొచ్చింది. ఎక్కడున్నాడో రమణ ఎన్నిసార్లు చెప్పినా అర్థమయ్యేది కాదని తలచుకుంటూ మొటిమలకు క్రీం పెట్టుకుంటోంది.
తన పెద్దమ్మ కొడుక్కి విషయం తెలిసి రమణ ముక్కు పగలగొట్టి సరిపెట్టాడు. లేదంటే రేవులో రమణ వాళ్లమ్మ ఉతికే బండకేసి బాదుండేవాడు.
“ఎందుకే గిన్నెలు అలా ఎత్తేస్తున్నావ్? రాత్రి ఇవ్వలేదా మీ ఆయన!”
వంట గదిలోంచి పనిమనిషితో అంటున్న అమ్మ మాటలు విని గుండెంతా సిగ్గుతో నిండిపోయింది హసంతికి.
“అమ్మా రమ్య వాళ్ళింటికి వెళ్లొస్తా”
“ఇప్పుడెందుకే ఎండలో. రంగు తగ్గుతావ్. సాయంత్రం వెళ్ళు. మొటాలకు ఈ క్రీములు పన్జేయవు. శనగపిండి పసుపు పుదీనాకు కలిప్పెట్టు పోతాయి”
“సరే”
హసంతికి అన్నీ అమ్మే. తండ్రి అడిగిందల్లా తెచ్చిపెడుతుంటాడు కానీ గారం తక్కువ. గరుకుదనం ఎక్కువ. కూతుర్ని ఏమనడు. పెళ్ళాన్ని పిలవని బూతుండదు. తనవాడి ముందైనా పనివాడి ముందైనా. అతనొక డబ్బున్న లాయర్. పేరున్న లాయర్. బలగమున్న లాయర్. చురుకైన లాయర్. కులపిచ్చలేని లాయర్ కూడా అయ్యుంటే బావుండేది.
హసంతికి తండ్రంటే భయమని కాదు. అలా అని ఏది పడితే అది మాట్లాడేంత చనువూ లేదు.
కూతురేం చేస్తుంది, ఎవరితో తిరుగుతుందని నిఘా పెట్టేంత దుర్మార్గపు తండ్రి కాదు కానీ ఎవరితో తిరగాలో ఎలా నడుచుకోవాలో చూచాయిగా చెప్తుంటాడు. హసంతి పూర్తిగా అర్థం చేసుకుంటుంది.
పదిహేడు నుండి పద్దెనిమిదిలోకి అడుగుపెట్టిన హసంతి ఇప్పుడో కొత్త ఇంతి. ఏంటో తోచట్లేదు. ఏదీ ప్రత్యేకత లేకుండా ఉంది. అంతా పాతగా అనిపిస్తుంది. ఏదీ నచ్చట్లేదు. ముభావంగా ముక్తసరిగా ఉంది. మెదడంతా అలుపెరుగని ఆలోచనలు. అసలు తనెందుకు ముడుచుకుపోవాలి? ఎందుకు అసంతృప్తిగా ఉండాలి? ఎందుకు ఈ ఖాళీతనాన్ననుభవించాలి? ఆదుకోవడానికి ఎవరూ లేరా?
ప్రణీత్ ఉన్నాడుగా.
పెద్దగా చదివే పిల్లోడు కాదు. అత్తెసర మార్కులు. ఏ గొడవల్లోకి వెళ్ళడు. తన మానాన ఉంటాడు. అందంగా ఉంటాడు. హడావుడి చేయడు. తనకు తెలియకుండానే హసంతికి నచ్చాడు. ప్రణీత్ కి హసంతి తెలీదు. అతని మీదింకా ఇంతి పరిమళాలు కురవలేదు.
ప్రణీత్ కళ్ళల్లో పడాలని చేసిన హసంతి ప్రయత్నాలన్నీ ఓ రోజు ఫలించాయి. ఆమె గుండె చప్పుళ్ళన్నీ అతని దేహమంతా ధ్వనించాయి.
ప్రణీత్ ఇంకా కార్టూన్లు చూడడం ఆపనేలేదు. హసంతికి ఏమివ్వాలో అతనికి తెలీదు. ఎలా చెప్పాలో హసంతికి తెలుసు. చెప్పింది. నెగ్గింది. దక్కించుకుంది.
ప్రణీత్ ప్రేమలో హసంతి తేలిపోతోంది. హసంతి ప్రేమలో ప్రణీత్ మునిగిపోతున్నాడు. హసంతితో మాట్లాడకుండా తన గొంతు వినకుండా ఉండలేకపోతున్నాడు. క్రికెట్ మానేశాడు. కార్టూన్లు చూడడం ఆపేశాడు. చదువు ఎలాగో అప్పుడప్పుడే. ఇప్పుడు అది కూడా లేదు.
***
ఓ రోజు హసంతి చుట్టాల పేరంటానికి వెళ్ళింది. పట్టు వోణీలో సరికొత్త బాణీలు పలికిస్తోంది. పొగడ్తలకు సిగ్గుపడుతుంది.
“అబ్బా హసంతి! ఎంత బాగున్నావే నిన్ను చూస్తే నాకే లౌ చేయాలనిపిస్తోంది”
అత్త వరసయ్యే లలితాంటీ ఇచ్చిన కితాబుకి హసంతి కిలకిల నవ్వింది.
“నీకివ్వను గానీ నీ కొడుకు కాస్త పెద్దోడయ్యుంటే ఇచ్చుండేదాన్ని” హసంతి తల్లి.
అందరూ ఆనందంగా నవ్వుకున్నారు.
ఇంత అందాన్ని భద్రంగా సెల్ఫీలో ప్రణీత్ కి పంపింది హసంతి. దూరంగా ఉన్నవాడు ఏం చేయగలడు? పాపం అదీ హసంతి ఆజ్ఞలూ సూచనలు లేకుండా.
వాట్సాప్ లో ప్రియుడి విరహవేదనా సందేశాలు చదువుతున్న హసంతిని తల్లితో పాటు ఇతరులు కూడా గమనించకపోలేదు.
“ఎవరే ఫోన్లో?” ఇంటికొచ్చాక తలుపేస్తూ అడిగింది తల్లి.
“అబ్బా ఎవరూ లేరమ్మ” చెవి కమ్మలు తీస్తూ సమాధానం.
“ఎవరాబ్బాయి”
“క్లాస్మేట్ అమ్మా”
“లౌ చేసుకుంటున్నారా”
“అంత సీన్ లేదులే మా. ఊరికే మాట్లాడుతుంటాడు అంతే”
“ఎక్కువ దూరం వెళ్ళకు. లేదంటే మీ నాన్న ఎంత దూరమైనా వెళ్తాడు”
“సరే మా. నువ్వెళ్ళు నేను బట్టలు మార్చుకోవాలి”
‘సాయంత్రం నెహ్రూ పార్క్ కి రా’
తల్లి నిలదీయకపోయి ఉంటే ప్రణీత్ కు ఈ వాట్సాప్ హుకుం జారీ చేసేది కాదేమో హసంతి.
***
“ఎందుకింత లేట్ గా వచ్చావ్”
“నీ పేరుకి అర్ధం తెలుసుకుని గుప్పిట్లో పట్టుకుని వచ్చేసరికి లేటైంది”
“ఏం తెలుసుకున్నావ్? ఏం పట్టుకొచ్చావ్? నన్ను గుప్పిట్లో పట్టుకుంటే కాలిపోతావ్”
ప్రణీత్ రెండు జేబుల్లోంచి గుప్పిళ్ళు బయటకు తీసి హసంతిపై మల్లెపూలవాన కురిపించాడు. ఆమె నవ్వులు.. ఆ పరిమళం.. ఆ పూలరంగు కళ్ళ నిండా చూసుకున్నాడు ప్రణీత్.
“వావ్! ఎంత బావుందో ఈ సర్ప్రైస్” వళ్ళో పడ్డ మల్లెపూలు లెక్కపెడుతూ అంది.
“నీ పేరులో ఒకటే మల్లెపూవు. కానీ నీకోసం ఎన్ని తెచ్చానో చూడు”
“నా పేరులో మల్లె పువ్వా? హలో హసంతి అంటే నిప్పు! అగ్గి! మంట! మల్లెపూవంట మల్లెపూవు” ఎగతాళి చేస్తూ అంది.
“ఎవరు చెప్పింది? చాలా రిసెర్చ్ చేశాను నీ పేరుకి అర్ధం మల్లెపూవు”
“నాకు తెలీదా? మా నాన్న ఎప్పుడూ నిప్పనే చెప్పారు. అందుకే పెట్టారు కూడా. ఎక్స్పైర్ అయిన డిక్షనరీలో చూసుంటావ్. నిప్పుతో పెట్టుకోకు మాడి మసైపోతావ్” మళ్ళీ మల్లెపూల నవ్వు.
“నీ కోసం బూడిద కూడా అయిపోతాను”
***
ఒకానొక చంద్రోదయం.
హసంతి, ప్రణీత్ రేపటి పరీక్ష కోసం ఎవరిళ్లల్లో వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటున్నారు. మధ్యలో కుశల క్షేమాలు వాట్సాప్ చేరేస్తూనే ఉంది. ఇద్దరిళ్లల్లో భోజనాలయ్యాయి. మంచాలెక్కారు. బెడ్ లైట్స్ వెలిగాయి. వాట్సాప్ కూడా.
“సరే పడుకో. రేపు ఎగ్జామ్ బాగా రాయి”
“నువ్వు కూడా”
“నన్నే తలుచుకుంటూ కలలు కనకు. రాలేను కూడా”
చిలిపి లిపి మొదలైంది.
“ఇప్పుడు వస్తావా లేదా” హసంతికి వద్దన్న మాట జరిగితీరాల్సిందేనని ప్రణీత్ కి తెలుసు.
“ఏంటి పిచ్చి పట్టిందా? టైం ఎంతో చూసావా? రేపు ఎగ్జామ్ ఉంది”
వెళ్లొద్దనే అనుకున్నాడు ప్రణీత్. ఛాయాచిత్రం రాకముందు వరకు.
సాధారణంగా హసంతి తల్లిదండ్రులకు స్పృహ లేకపోయినా రావాల్సిన సమయంలో మెలుకూ వచ్చి తీరుతుంది. ఆ రాత్రి రాలేదు. ప్రణీత్ మళ్ళీ మళ్ళీ వచ్చిన ఏ రాత్రీ రాలేదు.
***
హసంతి ప్రణీత్ ఇంటికి వెళ్లడం అదే మొదటిసారి. పెంకుటింటి లోపల చూడటం కూడా మొదటిసారే. ప్రణీత్ నడిపే కెటిఎమ్ డ్యూక్ బైక్ ఇంట్లో కొట్లాడి కొనిపించుకున్నాడని, తనొక్కడే వాళ్లలో కాస్త మంచి బట్టలు వేసుకుంటున్నాడని, తన అక్క చదువు మధ్యలోనే మానేసి ఇంట్లో చీరలమ్ముకుంటూ టైలరింగ్ చేస్తుందని, తల్లిదండ్రులు కూలీ నాలీ చేసుకుంటున్నారని రెండు నిమిషాల్లో అర్థమైంది హసంతికి.
“మా మున్నాగాడు మీ గురించే చెప్తుంటాడమ్మా. అమ్మ వాళ్ళంతా బాగున్నారా”
“ఆ బాగున్నారు ఆంటీ”
“మీరెంతమందమ్మా”
“నేనొక్కదాన్నే” ప్రణీత్ ఇస్తున్న మాజా డ్రింక్ అందుకుంటూ.
కాసేపు అవీ ఇవీ మాట్లాడుకుని “సరే ఆంటీ మేం వెళ్తాం” అని హసంతి బయటికి నడిచింది.
“అమ్మా తను తాగిన డ్రింక్ లోపల పెట్టు. పడేయకు”
గుసగుసా చెప్పేసి బయటకొచ్చి హసంతిని బండిపై ఎక్కించుకొని వెళ్ళాడు ప్రణీత్. ఎంత వేగంగా వెళ్ళాడో అంత ఆలస్యంగా వచ్చాడు ఇంటికి.
వస్తూనే అమ్మకోసం వెతుకుతూ వంటింట్లోకి నడిచాడు. చేతిలో హసంతి సగం తాగిన మజా సీసా.
“అమ్మా ఎందుకమ్మా ఆ అమ్మాయిని మీరూ మీరూ అంటావ్?”
“అంత పెద్దింటి పిల్లని తీసుకొచ్చావ్. అక్కా నేను భయపడి చచ్చాం. మీ నాన్న ఇంకా అప్పటికి రాలేదు కాబట్టి సరిపోయింది. పిల్ల మెళ్ళో గొలుసు చూశావా? రెండు తులాల పైనే ఉంటుంది”
“ఆ అమ్మాయి నిన్ను ఆంటీ అనే అంటుంది కదా”
“వాళ్ళలాగే పిలుస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి”
“ఏంటేంటో మాట్లాడతావ్ ఏంటమ్మా”
అప్పుడే ఇంటికొచ్చిన తండ్రి పిలుపుతో బయటకొచ్చాడు ప్రణీత్. భుజానికి బాధ్యతలు, చేతిలో కూరగాయలు తగిలించుకొని వచ్చాడు నాన్న. ప్రణీత్ కూరగాయలు మాత్రం అందుకోగలిగాడు.
“రేయ్ మున్నా”
“ఆ డాడీ”
“రా”
పెద్దయ్యాక మొదటిసారి మానంత కొడుకుని గారంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ప్రణీత్ అయోమయంగా సిగ్గుగా నవ్వుతూ పక్కన కూర్చున్నాడు.
“ఏంటి డాడీ”
“ఎవర్రా అమ్మాయి”
“అప్పుడే ఫోన్ చేసి చెప్పేసిందా అమ్మ? డాడీ ఎందుకంత పెద్దది చేస్తున్నారు దీన్ని? ఆ అమ్మాయి నా క్లాస్మేట్. అంతే ఇంకేం లేదు”
“ఇంకేదైనా ఉందా అని మేం అడగలేదు కదరా”
ప్రణీత్ తల కిందకి వాలింది. ప్రస్తుతానికి తల మెడకే ఉంది.
“చూడయ్యా! పెద్దింటమ్మాయిని బండి మీద ఇంటికి తీసుకొచ్చి తీసుకెళుతున్నావు. ఇంక ఎప్పుడూ బండెక్కించుకోకూడదు. చదువు గురించి మాట్లాడుకోండి. అంతకుమించి ఇంకేం వద్దు సరేనా”
కొడుకును తలనిమురుతూ బుగ్గలకి ముద్దు పెడుతూ చెప్పాడు ఆ పిచ్చి తండ్రి. కొడుకంటే ఎంత ప్రేమున్నా తనకున్న అనుభవంలో గొప్పవాడు ఆ పేద తండ్రి. ఆయన ఊహించినట్టే హసంతి మళ్లీ వాళ్ళింట్లో కనిపించింది.
“అమ్మా హసంతీ ఇంట్లో అమ్మానాన్నలకి తెలియకుండా ఇలా మా వాడితో బండెక్కి తిరగడం ఇక్కడికి రావడం మీ ఇద్దరికీ మంచిది కాదు. ఏం తెలియనోడు మా మున్నాగాడు. మీ నాన్నగారికి తెలిస్తే కోప్పడతారు”
“లేదంకుల్ మా డాడీ చాలా ఫ్రెండ్లీ”
“మరి మా వాడిని మీ ఇంటికెప్పుడూ తీసుకెళ్లలేదేమ్మా”
“ప్రణీత్ కూడా చాలా సార్లొచ్చాడు అంకుల్” కిసుక్కున నవ్వింది.
“డాడీ వదిలేయ్. హసంతి పదా నిన్ను డ్రాప్ చేస్తాను” ప్రణీత్ తెర దింపాలని చూశాడు.
“మున్నా వద్దు. అమ్మా నిన్ను ఆటో ఎక్కిస్తాను పద. వెళ్ళాక చేరినట్టు ఫోన్ చెయ్. ఇద్దరూ బాగా చదువుకోండి. వెళ్ళమ్మా” చేతులెత్తి చెప్పాడు చేవలేని తండ్రి.
***
ప్రణీత్ పుట్టినరోజు.
హసంతికంటే కొన్ని నెలలు పెద్దవాడు ప్రణీత్. మొదటి బర్త్ డే విషెస్ రాత్రి పన్నెండు గంటలకి తనే ఫోన్లో చెప్పింది.
తెల్లారే కొడుకుని నిద్రలేపి అమ్మానాన్నలు అల్లారుముద్దుగా నలుగు పెట్టి, అక్క అల్లరిగా తలరుద్ది నవ్వులకేళిలో స్నానం చేయించారు. దేవుడికి దణ్ణం పెట్టుకొని తల్లిదండ్రులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తలారా స్నానం చేసిన నుదుటి మీద కుంకుమ పెడితే ప్రణీత్ మొహంలో కళ రెట్టింపైంది.
ఈ తంతంతా ఎప్పుడెప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాడు ప్రణీత్. జీడిపప్పుకు నోచుకోని పాయసం చేసి తినిపించింది తల్లి. ఎప్పుడూ తండ్రి తెచ్చే మూడు సన్నిడ్నీలు గుటగుట తినేసి పరుగు పరుగున కాలేజీకి బయలుదేరాడు.
“ఒరే ఒరేయ్ బ్యాగ్ ఇక్కడే వదిలేసావ్”
“ఆ! అయ్యో ఇటివ్వు. సరే అమ్మా బాయ్”
వాడి కంగారు చూసి ఇటు ముచ్చటపడలేక అటు అధైర్యపడకుండా ఉండలేక ఆ తల్లిదండ్రులు వెళ్లిపోతున్న కొడుకును చూస్తుండిపోయారు.
***
“ఏమే పిల్లోడింకా రాలేదా”
పని ముగించుకుని సాయంత్రాన్ని చంకలో చుట్టబెట్టకుని ఇంట్లోకొస్తూ అడిగాడు ప్రణీత్ తండ్రి.
“ఇంకా లేదు. ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫ్రెండ్స్ తో ఉన్నానమ్మా. తినేసొస్తానన్నాడు. పుట్టిన్రోజునాడైనా వాడికొక ఐదొందలివ్వడానికి చేతులు రావు నీకు”
“అవునే నేనూ రోజంతా అదే ఆలోచిస్తూ ఉన్నాను”
“నీ కూతురిచ్చిందిలే”
“పోన్లే నేన్నీకు రేపిస్తా తల్లీ”
“నాకేం వద్దులే నాన్నా”
ముగ్గురూ కాసేపు మున్నాగాడు వాళ్ళని ఎలా సంపూర్ణం చేశాడు, వాళ్లమ్మ నొప్పులు పడేటప్పుడు ఒక రిక్షా కూడా దొరకలేదు, చేతిలో నయా పైసా లేదు, చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడు, నాలుగేళ్లు అమ్మ దగ్గర పాలు తాగాడు, నాన్న భుజం దిగేవాడు కాదు, ఇలా ఎన్నో కొడుకు ముచ్చట్లు కూతురికి చెప్పుకొని మురిసిపోయారు. చిన్నప్పుడు అక్కా తమ్ముళ్లు ఎంత అల్లరి చేసేవాళ్ళు, ఒకే బొమ్మ కోసం ఎంత కొట్టుకునే వాళ్ళు, పుల్ల ఐస్ కోసం ఎన్ని యుద్ధాలు చేశారని తలుచుకుని ఒకటే నవ్వుకున్నారు. మాటల్లోనే అన్నాలు తిని మంచాలెక్కారు. అప్పటికి తల్లి రెండు సార్లు ఫోన్ చేసింది. రింగ్ అవుతున్నా ఎత్తట్లేదు ప్రణీత్.
పది కావస్తోందని చూసి చూసీ మున్నా ఫ్రెండ్ లక్ష్మణ్ కి ఫోన్ చేశాడు తండ్రి.
“మేం ఆరింటికే ఇళ్ళకి వచ్చేశాం అంకుల్” అన్నాడు.
ఆకాశ్ కి చేస్తే “కాలేజ్ అయ్యాక మమ్మల్ని కలిసి వెళ్లిపోయాడు. ఇంటికనే చెప్పాడు” అనన్నాడు.
“నానా మీరొకసారి ఇంటికి రండి. వాళ్ళమ్మ ఒకటే ఏడుస్తుంద”ని బతిమాలాడు తండ్రి.
ప్రణీత్ స్నేహితులు ముగ్గురు నలుగురొచ్చారు.
“నానా నిజం చెప్పండ్రా! ఎక్కడికి వెళ్లాడు వాడు? ఇంత రాత్రి వరకు ఎప్పుడూ రాకుండా లేడు. ఆ అమ్మాయితో ఎటన్నా వెళ్ళిపోయాడా చెప్పండయ్యా” భోరున ఏడ్చాడు నిస్సహాయ తండ్రి.
“ఛఛ లేదంకుల్. ఆ అమ్మాయికి మేం ఇందాకే మెసేజ్ చేశాం. తను ఆరున్నరకే ఇంటికి వెళ్ళిపోయింది. ప్రణీత్ ఆ అమ్మాయి ఫోన్ కూడా ఎత్తట్లేదంట. దార్లో ఎక్కడన్నా పెట్రోల్ అయిపోయి ఉంటుంది అంకుల్. మేం వెళ్లి చూసొస్తాం”
అందరూ బండ్లలో రయ్యిమన్నారు.
తల్లి కన్నీరు మున్నీరవుతోంది. చుట్టుపక్కల వాళ్ళు తోడొచ్చారు. తండ్రి కూడా ఇద్దరు మగాళ్లను వెంటబెట్టుకుని వెతకడానికి వెళ్లాడు.
మధ్య రాత్రి దాటుతోంది. ప్రణీత్ తల్లి, అక్క కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు.
తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక కూడా తిరిగిన రోడ్లే మళ్లీ మళ్లీ తిరుగుతున్నాడు. అలసిపోయి ఒట్టి చేతులతో కళ్ళనిండా నీళ్లతో వచ్చాడు.
పొరుగువాళ్ళు వెళ్లిపోయారు. మళ్ళీ ముగ్గురే మిగిలారు. ఏడ్చీ ఏడ్చీ కనురెప్పలు వాసిపోయాయి. హఠాత్తుగా తల్లి ఫోన్ మోగింది.
హసంతి. స్థిరమైన గొంతుతో
“ఆంటీ”
“అమ్మా మా వాడొచ్చాడా?” ఆశతో కన్నీటితో అడిగింది మున్నాగాడి తల్లి.
“ఆంటీ ప్రణీత్ ని కాల్చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కాలవ గట్టు అవతల గుడికి కుడివైపు పడేసారు. చూసుకోండి”
అమ్మకి అర్థమైంది. క్షుణ్ణంగా వినింది. దుఃఖం పోయింది. ఏదో తెగింపొచ్చింది.
“అంటే నీకు ముందే తెలుసా”
కాల్ కట్ అయింది.
అహం పూర్వమేవ జానామి!
(తెగిపడుతున్న కుర్రాళ్ళ మొండేలకు,
అలుపులేక రోదిస్తున్న తల్లుల గుండెలకు…)
చిత్రం: రాజశేఖర్ చంద్రం








Add comment