- “కత్రా కత్రా మిల్తీ హై
కత్రా కత్రా జీనే దో
జిందగీ హై
జిందగీ హై, బహ్ నే దో
ప్యాసీ హు మై, ప్యాసీ రెహ్ నే దో”
బొట్టు బొట్టుగా చేరుతుంది
బొట్టు బొట్టుగానే ఆస్వాదించనీ
జీవితం కదా! అలాగే సాగిపోనీ!
దాహం తీరకపోతేనేమి
దాహంతోనే నను బతికేయనీ!
“ఇజాజత్” కోసం గుల్జార్ రాసి, ఆశా భోస్లే పాడిన పాట ఇది. ఈ పాటలో చెప్పినట్లే ఆశాజీ ప్యాసీ- దాహార్తి తీరని కళాకారిణి. ఎందుకంటే, దాదాపు 80 దశాబ్దాలుగా 20కి పైగా భాషల్లో 12 వేల పాటలు పాడిన ఈ అద్భుత గాయని, దూర తీరాలకు తరలిపోవడానికి రెండు నెలల ముందు కూడా పాటలు రికార్డ్ చేశారు. బ్రిటీష్ వర్చువల్ బ్యాండ్- ది గొరిల్లాస్ రూపొందించిన The Mountain (Parvat) అనే ఆల్బమ్ లో The Shadowy Light అనే పాట ఆవిడ పాడిన చివరి పాట. ఆ పాట పల్లవి ఇది-
“చల్ మేరే మాఝీ
గెహ్ రా హై పానీ
ముఝే జానా ఉస్ పార్
జహా సుఖ్ హో, న దుఖ్ హో
జహా జై హో, నా హో హార్!”
పద నావికుడా!
నీరు లోతుగా ఉంది
నన్నా దరికి చేర్చు
అక్కడ సుఖం తప్ప దు:ఖం ఉండదు
గెలుపు తప్ప ఓటమి ఉండదు!
ఆధ్యాత్మికత నిండిన ఈ పాట మనిషి చివరి ప్రయాణం గురించి మాట్లాడుతుంది. దీన్ని ఆశాజీ తన చివరి పాటగా ఎంచుకోవడం కాకతాళీయమే కావచ్చు. కానీ ఆవిడ వెళ్ళిపోయాక ఈ పాట వింటుంటే గుండె బరువెక్కుతుంది.
- “ఇన్ ఆంఖోంకీ మస్తీ కే
మస్తానే హజారోం హై
ఇన్ ఆంఖోం సే వాబస్తా
అఫ్సానే హజారోం హై”
ఈ కనుల మత్తుకు చిత్తయ్యే వెర్రివాళ్ళు వేవేలు! ఈ కనుల చుట్టూ అల్లుకున్న కథలు వేనవేలు!
ఆశా భోస్లే స్వరానికి, చిరస్థాయిగా నిలిచిపోయే చిరునామా ఇచ్చిన పాట ఇది. 1981లో రిలీజైన ఉమ్రావ్ జాన్ లోని ఈ పాట రాసింది షహరియార్, స్వరపరిచింది ఖయ్యామ్. ఈ పాట రేఖ మత్తైన కళ్ళకు ఎంత చక్కగా సరిపోతుందో ఆశాజీ గమ్మత్తయిన స్వరానికీ అంతే బాగా అమరిపోతుంది. ఒక్కసారి “ఇన్ ఆంఖోంకీ మస్తీ కే” అనే లైన్ ని “ఇస్ ఆవాజ్ కీ మస్తే కే” అని మార్చుకుంటే సరి! అప్పడిక పాటంతా ఆశా తాయీ కోసమే రాసినట్లుగా కనిపిస్తుంది.
“ఇస్ ఆవాజ్ కీ మస్తీ కే
మస్తానే హజారోం హై
ఇస్ ఆవాజ్ సే వాబస్తా
అఫ్సానే హజారోం హై”
ఈ స్వరంలోని మత్తుకు చిత్తయ్యే వెర్రివాళ్ళు వేవేలు! ఈ గళం చుట్టూ అల్లుకున్న కథలు వేనవేలు! ఆశాజీ పాటంటే పడి చచ్చేవాళ్ళు వేలు, లక్షలు కాదు, కోట్లు! కాదంటారా? వాళ్ళంతా అనేది ఒకటే మాట-
“దిల్ చీజ్ క్యా హై
ఆప్ మేరీ జాన్ లీజియే
మా మనసులే కాదు, ప్రాణాలు కూడా దోచేసుకోండి!” అని!
ప్రాణాలు తోడేసే గానానికి ప్రాణం పెట్టడమే కదా అంతులేని ఆరాధనకు కొలమానం!
- “అభీ న జావో ఛోడ్ కర్
కే దిల్ అభీ భరా నహీ
అభీ అభీ తో ఆయీ హో
బహార్ బన్ కే ఛాయీ హో”
అప్పుడే విడిచి వెళ్ళిపోకు
తనివి ఇంకా తీరనిదే!
వచ్చింది ఇప్పుడే కదా
వసంతంలా అలుముకుంటోందీ ఇప్పుడే కదా!
80 వసంతాలుగా పాడుతున్న ఆశా అనే కోయిల ఇక సెలవంటూ దిగంతాలకు ఎగిరిపోయింది. అన్నాళ్ళుగా ఆ స్వర మాధుర్యంలో ఓలలాడిన శ్రోతలు ఉలిక్కిపడ్డారు. అప్పుడే వెళ్ళిపోతారా అని అలకబూనారు. ఎనిమిది దశాబ్దాలు కాస్తా ఎనిమిది క్షణాల్లా గడిచిపోయి ఉంటాయి పాపం ఈ సంగీత ప్రేమికులకు!
- “జబ్ చలీ ఠండీ హవా
జబ్ ఉఠీ కాలీ ఘటా
ముఝ్ కో ఐ జానే వఫా
తుమ్ యాద్ ఆయే
***
యే బహారే యే ఫిజా
దేఖ్ కర్ ఓ దిల్ రుబా
జానే క్యా దిల్ కో హువా
తుమ్ యాద్ ఆయే!”
చల్లగాలి వీచినప్పుడు
నల్ల మబ్బు పరుచుకున్నప్పుడు
ఓ ప్రియతమా!
నువ్వే గుర్తొస్తావు!
ఈ వసంతాలు, ఈ ప్రకృతిని చూస్తే చాలు ప్రియా!
ఎందుకనో నువ్వే గుర్తొస్తావు!
నిజమే! ఆశాజీ స్వరం చల్లని పిల్లగాలిలా గిలిగింతలు పెడుతుంది, కారు మబ్బులా కవ్విస్తుంది, వసంతాలు వెదజల్లుతుంది. ఆవిడ వెళ్ళిపోయినా ఆవిడ పూయించిన పాటల తోటలు మన కోసం పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి.
*








True ! Venavela abhimanula manasulomata meeru chepparu .
Thank you so much Eesani .
Thank you Annapurna garu