నేను మొదటిసారి పదేళ్ళ వయస్సులో కన్నడం నుంచి హిందీకి అనువాదం చేసాను. మా పక్కింట్లో మా ఆర్ట్ టీచర్ ఉండేవారు, ఆయన కూతురు నా ఏకైక స్నేహితురాలు. ఆయన మంచి ఆర్టిస్ట్, అప్పట్లోనే చాలా పెద్ద కేక్టస్ గార్డెన్ పెంచారు. తన గురించిన వార్తలు స్థానీయ కన్నడం పేపర్లలో వచ్చినప్పుడల్లా ఆయన నన్ను పిలిపించి ఆ కన్నడం వార్తని పైకి చదివి, ఆయన పేరు వినిపించినప్పుడు అండర్లైన్ చేసుకుని, మొత్తం మళ్ళీ హిందీలో చెప్పమనేవారు. అప్పట్లో నేను చేసింది translation కీ interpretation కీ మధ్య, సాంకేతిక పరిభాషలో Sight translation అనబడే ఒక ప్రక్రియ అని ఇన్నేళ్ళకి నాకు తెలిసింది!
భాషలపై ఎంతోకొంత మక్కువ ఉండటం వల్ల, యాదృచ్ఛికంగానే అయినా అనువాదాన్ని ముందు వృత్తిగా, ఆపై ప్రవృత్తిగా చేసుకున్నాను. వాణిజ్యానువాదాలలో fidelity (మూలవిధేయంగా) and fluency (సహజంగా) అనే రెండు సూత్రాలను పాటించక తప్పదు. ఇందులో అనువదిస్తున్న విషయం, లక్ష్య భాష కలిసి గీసిన చట్రాన్ని దాటి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. దాంతో రానురాను ఇది రొడ్డుకొట్టుడు వ్యవహారంగా తయారవుతుంది. ఈ కారణంగా కూడా ఈ మధ్యకాలంలో వాణిజ్య అనువాదాలు ఎక్కువగా యాంత్రికంగా, ఏఐ సహాయంతో జరుగుతున్నాయి.
సాహిత్యానువాదాలు దీనికి పూర్తి వ్యతిరేకం. ఇందులో మనం తీసుకున్నంత స్వేచ్ఛకి తావుంది. మూలంలోని అర్థాన్ని, భావాన్ని పాఠకులకి అత్యంత సన్నిహితంగా ఎలా తీసుకువెళ్ళాలి అనేదే ప్రధాన ధ్యేయం. దీని కోసం మూలభాషనీ, సంస్కృతినీ లక్ష్యభాషాసంస్కృతులకి అనుగుణంగా మలుస్తారా లేదా పాఠకులకి వాటి రంగు, రుచి వాసనలు తెలిసేట్టుగా తర్జుమా చేస్తారా అనేది అనువాదకులే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఇది domestication vs. foreignization అనే పెద్ద చర్చగా మారింది.
క్రిందటేడాది నేను మొహమ్మద్ ఖదీర్ బాబు రచించిన ‘దర్గామిట్టా, పోలేరమ్మబండ కథలు’ అనే తెలుగు పుస్తకాన్ని ఆంగ్లంలోకి ‘That’s A Fire Ant Right There! Tales From Kavali’ (Speaking Tiger Books) గా, అలాగే దాదాపీర్ జైమన్ రాసిన ‘ನೀಲಕುರಿಂಜಿ’ అనే కన్నడం కథల పుస్తకాన్ని తెలుగులో ‘తేరు ఇతర కథలు’ (ఎలమి ప్రచురణలు) గా అనువదించాను. అయితే తెలుగు నుంచి ఇంగ్లీష్ కీ, కన్నడం నుంచి తెలుగు కీ అనువాదం చేయడం దేనికదే ప్రత్యేకమైన అనుభవం.
తేరు కథ ఇక్కడ చదవండి!
తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి అనువదించడం కంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి మార్చడమే కొంత సులువేమో అనిపిస్తుంది నాకు. బ్రిటిష్ వారి పరిపాలన కారణంగా మనకి వారి భాషాసంస్కృతుల మీద మంచి అవగాహన ఉంది. అదే చాలా మంది ఇంగ్లీషు వారికి తెలుగు అనే భాష ఒకటి ఉందనే విషయమే తెలియకపోవచ్చు. మన సంస్కృతిని వారికి కేవలం అక్షరాల ద్వారా పరిచయం చేయడం సాహసమే. అలాగని ప్రతి పదం, ప్రతి విషయం విడమరచి చెప్పడానికి కథల్లో వీలు కాదు. దానికి తోడు హాస్యంగానే గంభీరమైన విషయాలు చెప్పే దర్గామిట్టా కథలు వంటి పుస్తకాన్ని ఆంగ్లంలో ఇనుమడింప చేయడానికి రెండువైపుల పదునున్న కత్తి మీద సాము చేసిన అనుభవం కలిగింది నాకు.
తెలుగు, కన్నడం దగ్గర భాషలు, సంస్కృతులు కావడం వల్ల కన్నడం నుంచి తెలుగుకి అనువదించడంలో కొంత వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ కథలని అనువదిస్తుంటే నాకనిపించిందేంటంటే కన్నడంలో రోజువారీ భాషలో ఇంగ్లీషు పాలు చాలా తక్కువ. అదే తెలుగులో మన సాధారణ వాడుక భాషలో ఇంగ్లీష్ మాటలు ఎక్కువగా చొప్పించడం వల్ల ఒక విచిత్రమైన ఇబ్బంది ఏర్పడింది. కన్నడం మాటకి అచ్చ తెలుగు మాట వేస్తే అసహజంగా అనిపించి ఆంగ్లపదమే నయమేమో అనిపించేది ఒక్కొక్కసారి, ఉ. కన్నడంలో కైమర అంటే దారిని చూపించే పలక లేదా సైన్ బోర్డు. ఈ రెండింటిలో మనం ఏది ఎక్కువ వాడుతాం?
ఈ రెండు పుస్తకాల్లో ఎదురైన ఒక క్లిష్టమైన అనువాదసమస్య మాండలికం లేదా యాసని రూపాంతరం చేయడం. దర్గామిట్టా కథల్లో అచ్చమైన నెల్లూరు-కావలి యాస ఉంటే, నీలకురింజిలో బళ్ళారి వైపు మాట్లాడే కన్నడ మాండలికం వాడారు. యాసలని భాషలు దాటించడం చాలా కష్టం, ఎందుకంటే అవి ప్రాంతాలను దాటి రావడానికి ఇష్టపడవు! యాస కీ, భాష కీ, ప్రాంతాలకీ, సంస్కృతులకీ, ఇవన్నింటినీ కనిపెట్టిన మనుషులకీ మధ్య ఎంత విడదీయలేని చిక్కుముడి ఉందో అనే విషయం ఇక్కడే తెలిసొస్తుంది. కానీ యాసని అనువదించడం సాధ్యం కాదు అనే సాకుతో కొన్ని పుస్తకాలనే అవతలి భాష పాఠకులకి దూరం చేయడం సబబు కాదేమో. ఎందుకంటే అనువాదంలో భాషా పరిమళాలు, రచయిత శైలి వంటి అంశాలు చాలామటుకు తుడుచుకుపోయినా, అసలంటూ ఒక జాతి ఉనికిని, వారి ఆచారవ్యవహారాలనీ, వారి ఆలోచనావిధానాలనీ చాటిచెప్పడానికి అనువాదం ఎంతైనా ఉపయోగిస్తుంది. నన్నడిగితే మాండలికంలో రాసిన పుస్తకాలని భాషాంతరం చేయడం వల్ల కోల్పోయేదానికంటే చేకూరే లాభాలే ఎక్కువ.
చివరిగా, మనిషిని అర్థం చేసుకోవడానికి, మనుషులని దగ్గర చేయడానికి అనువాదాన్ని పరికరంగా వాడుకోవచ్చనేది నా గట్టినమ్మకం. ఈ ప్రయాసలో నా తప్పటడుగులకి చప్పట్లు కొట్టి ప్రోత్సహించినవారందరికీ కృతజ్ఞతలు.
*








అనువాదం విషయంలో మీ అనుభవాలు చాలా చాలా బాగున్నాయి. అయితే యాసను పట్టుకోవడం ఒక కష్టం. వేష భాషలు, సంస్కృతీ పార్శ్వాలు, స్థానీయ మాటలు, ప్రకృతిలో కనిపించే చెట్లు, గడ్డి రకాలు వంటివి అనువదించి మెప్పించడం ఎంతో విజ్ఞత, మేధావితనంతో చేయాల్సిన పనులు. మీరు వాటిని అందుకోవడం సంతోషం.
ధన్యవాదాలండి 🙏