మొగ్గ తొడిగింది
1939 లో హంపి విరూపాక్ష ఆలయంలో వాహినీ పిక్చర్స్ “వందేమాతరం” సినిమా షూటింగ్ మొదలయ్యింది. తాను నిలబడ్డ చోటునే శ్రీకృష్ణదేవరాయలు విరూపాక్షుడికి వినమ్ర నమస్కారం చేసి ఉంటాడు అన్న భావన బి ఎన్ రెడ్డి ఆంతర్యంలో కలకలం రేపింది.అప్పుడే అతని మదిలో శ్రీకృష్ణ దేవరాయలు కాలాన్ని నేపధ్యంగా తీసుకుని ఒక సినిమా తీయాలనే ఆలోచన రూపుదాల్చింది. ఆయోచన కార్యరూపం దాల్చడానికి ఓ పుష్కరకాలం పట్టింది.
చిగురు వేసింది
కథాన్వేషణ మొదలయ్యింది.భారతి పత్రికలో ప్రముఖ రచయిత బుచ్చిబాబు రాసిన నాటిక “రాయలవారి కరుణ కృత్యం” అచ్చయింది.1944 లో రేడియో నాటకంగా ప్రసారమయ్యింది.బి.ఎన్.రెడ్డి దృష్టి ఆ కథ మీద పడింది బి.ఎన్.రెడ్డి కి బుచ్చిబాబు మంచి స్నేహితులు.ఆ నాటికను సినిమాగా అనువదించమని బుచ్చిబాబును కోరారు.. రాణివాసానికి వెళ్ళే మల్లీశ్వరిని రాణిఇష్టసఖిగా చేస్తే, కృష్ణ దేవరాయలు ఘనత చెదరకుండా ఉంటుందని బి.ఎన్.రెడ్డి ఆలోచన, సూచన. చారిత్రిక ఆధారాల ప్రకారం రాణివాసానికి వెళ్ళే రమణులంతా రాయలవారి దాసీజనులుగా మాత్రమే రాజప్రసాదంలో అడుగుపెట్టేవారని బుచ్చిబాబు వాదన. ఈ అంశంలో ఇద్దరికీ ఏకీభావన కుదర్లేదు వారిద్దరి మధ్య వచ్చిన ఈ సృజనాత్మక అభిప్రాయబేధం కారణంగా బుచ్చిబాబు ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగిపోయారు.
మల్లీశ్వరి ప్రాజెక్టు కృష్ణశాస్త్రి కి వివరించి, Illustrated Weekly లో ప్రచురితమైన “The Emperor and the Slave Girl”అనే దేవాన్ సహారా కథ, బుచ్చిబాబు రేడియో నాటిక ఆధారంగా సినిమా స్క్రిప్ట్ రాసే బాధ్యతను ఆయన భుజాలపై పెట్టారు బి.ఎన్.రెడ్డి.అమోఘమైన భావనాచాతుర్యాన్ని అద్ది మనసున మల్లెల మాలలూగే పాటలు,మధురమైన సంభాషణలు రాసి ,అందమైన భావకవిత లాంటి స్క్రిప్ట్ తయారు చేశారు భావకవి కృష్ణ శాస్త్రి . విజయనగర సామ్రాజ్య సంస్కృతి, ఆచార వ్యవహార ప్రమాణాల నిర్ధారణ కోసం మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి చరిత్రకారుల్నిసంప్రదించారు.సాలూరు రాజేశ్వరరావుని సంగీతదర్శకుడిగా, కూచిపూడి కులపతి పసుమర్తి కృష్ణమూర్తిని కొరియోగ్రాఫర్ గా,వాహినివారి ఆస్థాన దృశ్యనిపుణుడు ‘ఆది ఎం ఇరాని’తో పాటుగా తన చిన్నతమ్ముడు కొండారెడ్డిని కెమెరామెన్ గా, ఎ కే శేఖర్ ని కళాదర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.అపుడప్పుడే ఎదుగుతున్న ఎన్టీయార్ ను కథానాయకుడు “నాగరాజు” పాత్రకు, శ్రీకృష్ణ దేవరాయలుగా శ్రీవత్సను,నాగరాజు తల్లి గోవిందమ్మగా సురభి కమలాబాయిని,మల్లీశ్వరితల్లి నాగమ్మగా ఋష్యేంద్రమణిని ,రేడియోనాటికలో మల్లీశ్వరి పాత్రవేసిన టి జి కమలాదేవిని మల్లీశ్వరి చెలికత్తె జలజగా తీసుకున్నారు.
మల్లీశ్వరిగా ఫ్రెష్ ఫేస్ అయితే బావుంటుంది అని ‘రేవతి’ అనే కన్నడ నటికి స్క్రీన్ టెస్ట్ చేయించారు.కానీ బి.ఎన్.రెడ్డికి అభినయంలో అనుభవం,పరిపక్వత ఉన్న నటి అయితే బావుంటుందనిపించి భానుమతిని నిర్ణయించారు. ఆ సినిమాలోని 19 పాటల్లో 13 పాటల్ని తేనెలో ముంచిన గొంతుకతో పాడి భానుమతి తన గాన మాధుర్యాన్ని చిరస్తాయిగా నిలిపారు. 
పువ్వు పూసింది
రాయలవారి రాజప్రసాదాల సెట్లు వేయడానికి వాహినివారి ఆస్థాన కళాదర్శకుడు ఏ కే శేఖర్ కి రెండు సంవత్సరాలు పడితే, సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల,భానుమతిల చేత రిహార్సల్ చేయించి,అద్దెపల్లె రామారావు ఆర్కెస్ట్రా తో పాటల రికార్డింగ్ చేయడానికి ఆరునెలలు పట్టింది .కాళిదాసు మేఘసందేశం ప్రేరణతో దేవులపల్లి రాసిన “ఆకాశవీధిలో హాయిగా” అన్న పాటను ఆభేరి , కీరవాణి, ఛాయావతి,హంసానంది రాగమాలికతో స్వరపరచి తెలుగు సంగీత జగత్తులో ఒక అజరామరమైన గీతంగా మలిచారు.ఆ పాట రాజేశ్వర్రావు గారికి చాలా ఇష్టమైనపాట, అనేక వేదికల మీద ఆ పాట పాడి ఆయన ఆకాశవీధిలో విహరిస్తూ మురిసిపోయేవారు. అలాగే కళ్యాణి లో “మనసున మల్లెల మాలలూగేనే”, పహాడీలో “ఔనా నిజమేనా”,ఖామోసులో “ఎందుకే నీ కింత తొందరా” వరుసలు కట్టారు.
విశ్వకవి ఠాగూర్ భావజాలంతో ప్రభావితుడైన కృష్ణశాస్త్రి అప్పటికే కృష్ణపక్షం, ప్రవాసము, ఊర్వశి వంటి కావ్యాలతో తెలుగునాట భావకవిత్వానికి బలమైనచిరునామాగా ప్రసిద్ధుడై ఉన్నాడు.మారువేషం లో ఉన్న అల్లసానిపెద్దన మల్లీశ్వరి నృత్యాన్ని చూసి ఆశువుగా చెప్పే పద్యం కోసం దేవులపల్లి 108 పద్యాలు రాసి ఇచ్చాడట.
“మొయలు దోనేలలోన పయనంబొనర్చి
వెన్నెల్ల విహరించి మెరుపునై మెరిసి
పాడుచు చినుకునై పడిపోదు నిలకు
పక్షినయ్యెద చిన్ని బుక్షమయ్యెదను
మధుపమయ్యెద చందమామ నయ్యెదను
మేఘమయ్యెద వింత మెరుపు నయ్యెదను.”
– దేవులపల్లి కృష్ణశాస్త్రి
“కొమ్మల గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని, నీ పిలుపేవిని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియయేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా! ”
కృష్ణశాస్త్రి భావకవితా ప్రవాహంలో ఆనాటి సాహితీలోకమే కాకుండా సినిమా ప్రపంచం కూడా ఓలలాడింది మల్లీశ్వరి పాటలలోని సాహితీ సౌరభంతో.
తావి విరిసింది
ఈ చిత్రం 1951 డిసెంబర్ 20 తేదీన విడుదలయ్యింది. మహానటుడు చిత్తూరు నాగయ్య వ్యాఖ్యానం తో మొదలైన ఈ సినిమా తెలుగు కళాత్మక సినిమాల చరిత్రను కొత్తసిరాతో రాసింది.రావికొండలరావు ఆధ్వర్యంలో విజయచిత్ర సినిమా పత్రికలో ధారావాహిక నవలగా ప్రచురితమయింది.
రాచరికపు ఆడంబరాలను,ఆచారాలను చిత్రించిన ఈ సినిమా కమ్యూనిస్టు చైనాలో సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయ్యి శతదినోత్సవం జరుపుకున్న మొదటి తెలుగుసినిమాగా రికార్డులకెక్కింది.పెకింగ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ప్రముఖ సినిమా చరిత్రకారుడు రండోర్ గే “వెండితెర కవిత” అంటే, కవి ఆరుద్ర “ఆధునిక తెలుగు కవిత్వం” అని ప్రశంసిచారు.2013 లో భారతీయ సినిమా శతఉత్సవాల సందర్భంగా CBN-IBN నిర్వహించిన సర్వేలో 100 గొప్పభారతీయ సినిమాల్లో చోటు దక్కించుకుంది.అంతేకాదు 1932 నుండి మొదలైన 94 ఏళ్ళ తెలుగుమూకీ సినిమా చరిత్రలో ఒకే ఒక గొప్ప తెలుగు సినిమా ఏదంటే అనివార్యంగా”మల్లీశ్వరి” పేరే వినిపిస్తుంది.
తన ముప్పై సంవత్సరాల సినిమా కెరీర్లో కేవలం పదకొండు సినిమాలు మాత్రమే తీసిన బి.ఎన్.రెడ్డి కి“వెండితెరకవి” గా విశ్వాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. దక్షిణాది దర్శకుల్లో మొదటి పద్మభూషణ్ అవార్డు,మొదటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందడం లో ప్రధాన భూమిక వహించింది. మద్రాసు పచ్చయప్పన్ కాలేజీ లోజరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో దేవులపల్లి “మల్లీశ్వరికి సర్వసం బి.ఎన్.రెడ్డి గారే, మేము నిమిత్తమాత్రులం” అని వ్యాఖ్యానించడం విశేషం.
“జెమినీ వాసన్” ఈ సినిమాను హిందీలోకి డబ్ చేశారు.విదేశాల్లో ప్రదర్శింప బడినప్పుడు చాలా ఫిలిం యూనివర్సిటీలు తమ విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రతిపాదించాయి.ఏ కళా ప్రక్రియను సినిమాకు అన్వయించుకున్నా వారికే ఆ క్రెడిట్ దక్కేట్టు చేసే బి.ఎన్.రెడ్డి, జీవితకాలం స్నేహం కొనసాగించినప్పటికీ మల్లీశ్వరికు మూలం బుచ్చిబాబు “రాయలవారి కరుణ కృత్యం” అని ప్రకటించలేదు.
వీరాపురం అనే గ్రామంలో రాళ్ళను రమణీయ శిల్పాలుగా మార్చే నాగరాజు అనే యువకుడికి, అల్లరి చేష్టలతో, నాణ్యమైన నాట్యకళ తో విలసిల్లే ముద్దుగుమ్మ మల్లీశ్వరి కి మధ్య జరిగే ముగ్ధమైన ప్రేమకథయే ఈ సినిమాకూర్పుకి కలనేత. ప్రేమ ఏ కాలంలో అయినా, ఏ నేపథ్యంలో అయినా అత్యంత ఆకర్షణీయమైన భావమే.
ఎల్ల కామ్యపదవులకన్న
ప్రేమ ఎక్కువరా!– బసవరాజు అప్పారావు
2026 డిసెంబర్ 20 కి మల్లీశ్వరి కి 75 ఏళ్లు నిండుతాయి. రజతోత్సవం, స్వర్ణోత్సవం దాటి వజ్రోత్సవం వైపు ఉరకలు వేస్తూ పరుగులుతీసే ఈ కల్ట్ క్లాసిక్ తెలుగు చలనచిత్ర చరిత్ర ఉన్నంతకాలం చిరంతనంగా ఉండిపోతుంది అనడం అతిశయోక్తికాదు.
*








Add comment