నేను అనువాద రంగంలోకి రావటం ముందుగా అనుకుని చేసింది కాదు. మొదట్లో చేసిన అనువాదాలు నా పేరుతో పబ్లిష్ కాలేదు కూడా. చూపు పత్రిక కోసమూ, మరికొన్నిఅవసరాల రీత్యానూ అనువాదాలు చేస్తుండేదాన్ని. ఐతే, చిన్నతనం నుంచి రష్యన్, బెంగాలీ అనువాదాల పాఠకురాలిని కావటంతో ఆ ప్రక్రియపై ఆసక్తి ఉంది.
నా పేరుతో అనువాదాలను ప్రచురించటం మొదలయింది మాత్రం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచే. అదివరకు కొందరు పబ్లిషర్స్ అడిగినా సిద్ధపడని నన్ను అనువాదకురాలిగా తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది గీతారామస్వామి ప్రోత్సాహమే. నా మొదటి అనువాద పుస్తకం, సారా అబూబకర్ నవల ‘ నాదిరా’. ఆ తర్వాత కొన్ని నాన్ ఫిక్షన్ పుస్తకాల అనువాదాలు, స్వతంత్ర రచనలుగా జీవితచరిత్రలు కూడా హెచ్ బిటి ప్రచురించింది.
ముఖ్యంగా ఫిక్షన్ అనువాదం చేస్తున్నప్పుడు ఆ కథలో, పాత్రల్లో వ్యక్తమయ్యే భావోద్వేగాలను తెలుగులోకి తీసుకురావటం చాలెంజింగ్ గా ఉంటుంది. అనువాదమంటే ఒక భాషలోని వాక్యాలకు మరో భాషలో అర్థతాత్పర్యాలు రాయటం కాదు- మూల భాషలోని రచయితతోనూ, లక్ష్య భాషలోని పాఠకులతోనూ ఏకకాలంలో సంభాషించటం అని అర్థమైంది. మూల రచనలోని మూడ్ ను, టోన్ ను, ఆ స్థల,కాల సందర్భాల్లోంచి పట్టుకుని, తెలుగు పాఠకులకు పరిచయమైన ఇడియమ్ ను, వాక్యనిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి సృష్టించగలిగితే సరళమైన, సహజమైన అనువాదం రూపొందుతుందని నా నమ్మకం. అందుకు నా శక్తిమేరకు ప్రయత్నం చేస్తుంటాను.
ఇలా, అనువాద రచనలోని టేస్ట్ తెలిశాక, దాన్ని సీరియస్ గా తీసుకున్నాను. ఫిక్షన్, బయోగ్రఫీ, విద్య, రాజకీయం, జెండర్, ఫీలాసఫీ, పొయిట్రీ లాంటి వివిధ ప్రక్రియల, సబ్జెక్టుల పుస్తకాలను ముప్ఫై దాకా అనువాదం చేశాను . విడిగా కథలూ, వ్యాసాలు కూడా ఉన్నాయి. నా అనువాదాలు ఎక్కువగా హెచ్ బిటి ప్రచురణలుగా వచ్చాయి. ఎమెస్కో, మలుపు, సమీక్ష, ఛాయ, శ్రీశ్రీ పబ్లిషర్స్, ప్రజాశక్తి, లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్…మరికొన్ని ప్రచురణ సంస్థలు కూడా ప్రచురించాయి.

నా అనువాదాలు ఇంగ్లిష్ నుంచి తెలుగుకు చేసినవి. ఇంగ్లిష్ లోకి చేసినవి కొన్ని వ్యాసాలు, కథలు మాత్రమే. ఇంగ్లిష్ రచనలతోబాటు, వివిధ భారతీయ భాషల ఇంగ్లిష్ అనువాదాలను కూడా తెలుగులోకి తెచ్చాను. నిజానికి ఆయా భాషలనుంచి నేరుగా చెయ్యగలిగితే బావుండునని ఆశ పడతాను. కానీ, ప్రస్తుతానికి, నాకు కొంచెం తెలిసిన అదనపు భాష ఇంగ్లిష్ మాత్రమే.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి- భారతీయ భాషల నుండి నేరుగా వచ్చిన కొన్ని అనువాదాలను చూసినప్పుడు చాలా నిరాశగా ఉంటోంది. ఆ అనువాదకులు ఆయా భాషలు బాగా వచ్చిన వాళ్ళే. ఐతే, వాళ్ళు అనువదించిన రచనను చదవాల్సినది తెలుగు పాఠకులనే విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకుంటున్నట్టు కనబడదు. అందువల్ల మూలభాష లోని వాక్యనిర్మాణాన్ని, జాతీయాలను యథాతథంగా దింపేస్తున్నారు. ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయని గమనించక పోవటం వల్ల వచ్చిన సమస్య ఇది. ప్రత్యేకంగా పేర్లు చెప్పటం బావుండదు కానీ, ఇటీవల కొందరు ప్రసిద్ధ అనువాదకులు కూడా ఇదే చేస్తుండటంతో అనువాద సాహిత్యం పాఠకులకు దూరమవుతోందని నా పరిశీలన. ఐతే, కొందరు యవతరం అనువాదకులు అద్భుతమైన కృషి చేస్తున్నారు. ఇతర భాషలను క్షుణ్ణంగా నేర్చుకుని చక్కటి అనువాదాలు చేస్తున్నారు.
స్థానిక భాషల నేటివిటీ ఏమాత్రం దెబ్బతినని ఇంగ్లిష్ అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా నేను తెలుగులోకి అనువదించిన రచనలు పాఠకులకు నచ్చటం సంతోషాన్నీ, నమ్మకాన్నీ ఇచ్చింది. ఐతే, ఈ సందర్భాల్లో కొంత శ్రమ, జాగ్రత్త అవసరం. ముందుగా మూల రచన చదివి, అర్థం చేసుకుని, సందేహాలుంటే జవాబులు తెలుసుకోవాలి. మూల రచయిత భావజాలాన్ని, రచనా శైలిని, రచన సాంస్కృతిక నేపథ్యాన్ని అధ్యయనం చెయ్యాలి. పదాల ఉచ్చారణను తెలుసుకోవాలి. నేను పాటించే పద్ధతి ఇది.
నా అనువాదాల్లో అన్నీ నాకు నచ్చిన రచనల నుండి చేసినవే. నేను మౌలికంగా అంగీకరించని, ఐడెంటిఫై కాని ఏ పనినీ నేను చెయ్యలేను, అలా చెయ్యాల్సి వస్తే బాగా చెయ్యలేనని కూడా తెలుసు. అందువల్ల నాకు నచ్చినవి మాత్రమే అంగీకరిస్తాను. ప్రతి అనువాదం నుంచి నేను ఎంతో కొంత నేర్చుకోవాలని ఆశిస్తాను. ప్రతి అనువాదం ఒక ప్రత్యేకమైన అనుభవం. బిభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్ తో కలిసి నడుస్తూ నా చిన్నతనం లోకి, మా ఊరి సముద్ర తీరానికి వెళ్ళొస్తుంటాను. బషీర్ కథల్లో పదునైన సెటైర్ తో కూడిన జీవన వాస్తవికత, చిన్నపిల్లల ప్రశ్నల్లోంచి జీవన తాత్వికతను నిర్వచించిన సుందర్ సరుక్కై దృక్పథం, జేమ్స్ పెట్రాస్ చూపించిన లాటిన్ అమెరికా; భాషను, సాహిత్య విమర్శను గురించి జి.ఎన్. దేవి వివేచన, మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని ఇంత అందంగా, పొయెటిగ్గా చెప్పొచ్చా, అని ఆశ్చర్యపరిచిన రోజర్ గరౌడీ… ప్రతి రచయితకూ చాలా రుణపడి పోయాను. వీళ్ళందరినీ చదివే అవకాశాన్నీ, నా అనువాద వ్యాసంగాన్నీ విడదీసి చూడలేను.
ఇలా, అనువాదం నాకు ఇష్టమైన పనిగా మారింది.ఐతే, దీన్ని వృత్తిగా తీసుకోవాలనో, పెద్ద సంఖ్యలో రాయాలనో లక్ష్యాలేమీ లేవు. చెయ్యదలచుకున్న ఏ పనినైనా వీలైనంత అందంగా, సిన్సియర్ గా చెయ్యాలని అనుకుంటాను- ఈ అనువాదం పనిని కూడా!
*
బషీర్ కథ “గోడలు” చదవండి!








“అనువాదమంటే ఒక భాషలోని వాక్యాలకు మరో భాషలో అర్థతాత్పర్యాలు రాయటం కాదు- మూల భాషలోని రచయితతోనూ, లక్ష్య భాషలోని పాఠకులతోనూ ఏకకాలంలో సంభాషించటం అని అర్థమైంది.”
ఎంత బాగా చెప్పారు మేడం.
మీరు చెప్పింది అక్షర సత్యం.
అనువాదకుడంటే మూల రచయితకూ, పాఠకునికీ మధ్య వారధి.
ముఖ్యంగా మీరు చేసిన బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ్ బెంగాళీ అనువాదాలు వంగ ప్రజల ఆత్మను పట్టస్తాయి.
మీ ఆత్మావలోకాన్ని ప్రతీ అనువాదకుడూ తనకు అన్వయించుకుంటే మంచి అనువాదాలు వచ్చే అవకాశం ఉంది.
పైగా ఈమధ్య టెక్నాలజీ పెరగడంతో కొందరు అనువాదకులు నిజంగా అనువాదం చేస్తున్నారా అనే అనుమానం నాకూ వస్తోంది.
ప్లాస్టిక్ పూలు అందంగా ఉంటాయి కాని, పరిమళం రావు.
అలాగే, టెక్నాలజీతో తర్జుమా చేయబడ్డ అనువాదాలు చదివిస్తాయి కాని, అనుభూతి మాట (లేని) దేవుడెరుగు, కనీసం అర్థం కావు.