నా కళ్ళెక్కడో పోయాయి

కప్పుడు నాకు కళ్ళున్నాయి

 

చరిత్ర కాగితాల్లోని-

నెత్తుటి యుద్ధాల వద్దా,

ద్వేషపు మారణహోమాల వద్దా

గాజు పెంకుల అక్షరాలపై

నా కళ్ళు నడిచిన ముద్రలు అందుకు సాక్ష్యాలు

 

నడుస్తున్న కాలాన-

జరుగుతోన్న అమానవీయాన్ని, అమానుషాన్ని

ఒంటరి గొంతులకు కోరస్ లాగా

ఓ మాటగానో ఓ వాక్యంగానో

బతికిన క్షణాలు అందుకు సాక్ష్యాలు

*

కానీ ఇప్పుడు

నా కళ్ళెక్కడో పోయాయి

 

శిఖరమంత ద్వేషాన్ని,

స్మశానమంత విధ్వంసాన్ని చూస్తూనే

పేజీ పక్కకు తిప్పేసో

స్క్రీన్ కిందకి తోసేసో

మరో క్షణంలోకి నిస్సిగ్గుగా జారినప్పుడే తెలిసింది

నా కళ్ళు ఎక్కడో పోయాయని

*

అవి ఎక్కడో పోయి ఉంటాయి

మణిపూర్‌లోనో, పెహల్గాంలోనో

కథువాలోనో, హాత్‌రస్‌లోనో, గాజాలోనో..

లేదా

దృశ్యాల్ని తప్పించుకు నడుస్తున్నపుడు

పక్కనే జీవితాల్ని కూలుస్తున్న బుల్డోజర్ చక్రాల కిందనో

ఎక్కడో పడిపోయి వుంటాయి

*

చూపైతే ఉంది, కళ్ళే లేవు

అవే ఉండి ఉంటే

కాల్చే దృశ్యాలు కాసేపు నన్నూ కాల్చేవి

మెలిబడ్డ బతుకులు లోపలేదో కదిల్చేవి

బుల్డోజర్ శిథిలాలు అన్నం ముద్దలో కలిసి గొంతుకడ్డం పడేవి

 

ఒక కన్నీటి చుక్కగానో

అక్షర రేఖగానో నన్ను రాల్చి ఉండేవి

*

వీళ్ళంతా కళ్ళజోళ్ళ ప్రేమికులు

మతాన్నో దేశాన్నో వకాల్తా లాక్కుని

ఎవరిని ద్వేషించాలో ఎవరిని ప్రేమించాలో

నిర్దేశించే ప్రవచనకారులు

అన్ని దుఃఖాలూ ఒకటి కాదనే (మ)తత్వవేత్తలు

 

కళ్ళు లేని వాళ్ళు

కళ్ళు ఉన్నాయన్న భ్రమలో బతికేవాళ్ళు

వాళ్ళ ఊపిరి గాలులు

 

అందుకే నా కళ్ళను నేను వెతుక్కుంటున్నాను

*

కొంచెం నా కళ్ళని వెతికి పెట్టండి

కళ్ళజోడుని పక్కకు తీసి

*

శ్రీ వశిష్ఠ సోమేపల్లి

స్వస్థలం గుంటూరు. ఇప్పుడుండేది హైదరాబాద్లో. ఇప్పుడిప్పుడే కవితలు చదువుతున్నాను, అప్పుడప్పుడూ రాస్తున్నాను.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా గొప్ప కవిత. హృదయాన్ని ద్రవీభూతం చేసింది. వశిష్ట గారికి అభినందనలు💐💐💐

  • వశిష్ఠగారూ… మిమ్మల్ని చదువుతుంటే, నా కళ్లెక్కడ రాలిపోయాయో వెదుక్కోవాలనిపిస్తోంది.

  • నిజమే. కళ్ళు ఉన్నాయి గాని ఏమీ చూడలేకపోతున్నాం. అన్ని కళ్ళజోడుతో చూస్తున్నాం. ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నామో, ఎలా స్పందిస్తున్నామో అర్థం కానిస్థితి. కళ్ళు- కళ్ళజోడు మధ్య తేడాని ఈ కవిత నేటి స్థితిగతులను అద్దం పట్టింది.

  • కళ్లుడి గుడ్డి వాళ్లకు, కనువిప్పు ఈ కవిత, ఎవరిని ద్వేషిచాలో ఎవరిని ప్రేమించాలొ నిర్దేశించే కళ్ళజోళ్ళు – బాధను హృదయతో కొలిచే కవిత. కవికి నా హృదయ పూర్వక శుభాశీసులు.

  • గొప్ప కవిత. వశిష్ట గారికి అభినందనలు

  • వర్తమాన కవులు స్పృశించిన, స్పృశిస్తున్న వస్తువే అయినా అద్భుతమైన శైలితో విశిష్టమైన కవితగా మలిచిన వశిష్ఠ గారికి అభినందనలు 💐💐💐

  • మతాన్నో దేశాన్నో వకాల్తా లాక్కుని

    ఎవరిని ద్వేషించాలో ఎవరిని ప్రేమించాలో

    నిర్దేశించే ప్రవచనకారులు

    ఫాసిస్టు వర్తమానానికి సరైన వ్యక్తీకరణ. ఎంత రాసినా మిగిలే ఉంటుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు