చలం చెప్పిన “స్త్రీ” ఆమె!

 నాకు డాక్టర్ కామేశ్వరి గారు చలసాని ప్రసాద్ గారి ద్వారా లభించిన అమూల్యమైన ఒక వరం. ప్రాణం నిస్త్రాణమైన వేళ, మనసు నిస్తేజమై గుబులు మేఘాలు కమ్మిన వేళ ఓపిక కూడదీసుకుని కామేశ్వరి ఆంటీ దగ్గరికి శరీరాన్ని చేరవేస్తే చాలు ఆమె చూపించే ప్రేమ, ఆప్యాయతలకు కోయిల రాగం తీసినట్లు పలికే చిలక పలుకులకి దిగులంతా దూదిపింజలా ఎగిరిపోతుంది. డాక్టర్ గా భౌతిక ఆరోగ్య సమస్యలు, ఆత్మీయ స్నేహితురాలిగా, అమ్మగా మానసిక సమస్యల గురించీ పట్టించుకుని స్వస్థత పరుస్తారు! ఆమెతో ఉన్నంతసేపూ చలం గారిని స్మరిస్తూనే ఉంటారు!   

నాకు అమ్మ పాతిక, ముప్పై ఏళ్ల నుంచి పరిచయం. కొత్తలో ఆరోగ్య సమస్యలకోసం క్లినిక్ కీ, ఇంటికీ వెళ్తుండేదాన్ని. ప్రసాద్ అంకుల్ వచ్చిన ప్రతిసారీ “మన కామూ” దగ్గర కెళదా పదరా అని తీసికెళ్ళేవారు. వాళ్ళిద్దరిదీ  చాలా అపురూపమైన స్నేహం. అమ్మ ఆప్తుల    బృందం చాలా పెద్దది. మల్లాది రామకృష్ణ శాస్త్రి, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి, జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి, ఆరుద్ర, మద్దిబొట్ల సూరి, మాధవపెద్ది గోఖలే, మాధవపెద్ది సత్యం, పిలకా గణపతి శాస్త్రి, పింగళి నాగేంద్ర రావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, నోరి నరసింహశాస్త్రి, నండూరి సుబ్బారావు, సంజీవ దేవ్, ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు, రావిశాస్త్రి, శ్రీ శ్రీ, దాశరధి, చిత్రకారుడు చిన్నారావు, ఆచంట జానకీరాం, బాలబంధు బి.వి. నరసింహారావు, మహానటుడు ఎస్.వి రంగారావు, సంగీత విద్వాంసులు బాల మురళీకృష్ణ, రావు బాల సరస్వతి, కృష్ణాబాయి, కొమ్మూరి పద్మావతి, రంగనాయకమ్మ మొదలైన ఎందరో ప్రముఖులతో అమ్మకు ఆత్మీయ స్నేహ సంబంధాలుండేవి. “మా స్నేహితులందరూ చాలా గొప్ప వాళ్ళమ్మా, అలాంటి వాళ్ళెవరికీ దొరకరు” అంటూ వాళ్ళ స్నేహాల గురించి,  ఒక్కొక్కరితో తనకున్న స్నేహానుబంధాల  గురించి కథలు కథలుగా ఊరిస్తూ చెప్పేవారు. అవి వింటుంటే ఎంత గొప్ప వైవిధ్యమున్న  జీవితమో అని అమితమైన ఆశ్చర్యం కలిగేది!

ఆరో తరగతి నుంచి ఎం బి బి ఎస్ వరకూ జరిగిన సాంసృతిక కార్యక్రమాలన్నింటిలోనూ ఆమె పాల్గొని బహుమతులు సాధించారట. స్వయంగా ఆమె మంచి నటి కూడా. తన సమకాలికులెందర్నో ప్రభావితం చేసిన ప్రతిభావంతురాలు. మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో జరిగిన “Inter Collegiate Dramatic Competitions” లో పాల్గొని “పంజరం”, “భయం” అనే రెండు నాటకాల్లో “Best Actress” భెస్ట్ యాక్ట్రెస్” అవార్డులు గెల్చుకున్నారు.

ఇక చలం విషయానికొస్తే కల్నల్ కామేశ్వరి (Armed forces gynecology Doctor) దాదాపు 50 సంవత్సరాలు చలంతో అతి సన్నిహితంగా వారి స్వంత బిడ్డ లాగే గడిపారు. చిన్నతనంలో 16, 17 సంవత్సరాల సమయంలో అమ్మా నాన్నలతో ఉన్న జ్ఞాపకం కంటే రంగనాయకమ్మ- చలం – సౌరిస్ తో గడిపిన జీవితమే ఎంతో విలువైనదంటారు. అదే తన పుట్టిల్లు అంటారు. దేశంలో ఏమూల పని చేస్తున్నా ఆర్మీ రెండు నెలల సెలవులివ్వగానే తిరువణ్ణామలైకి పరుగు పెట్టేవారు. భీమిలీలో ఉండాలనుకుని పైన ఒక సింగిల్ రూమ్ ఇల్లు కూడా ఏర్పరుచుకున్నారు.

ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఆంటీ ఇల్లు కట్టుకుంటూ చాలా హడావిడిగా ఉన్నారు. ఆంటీకి సహాయం చేస్తూ గుంటూరు నుంచి వచ్చిన రజని అనే ఆవిడున్నారు. రజని తన యుక్త వయసులో పెళ్ళి వద్దనుకుని చలం దగ్గర కెళ్ళి కొన్ని సంవత్సరాలపాటు అక్కడే ఉండిపోయారట. ఇక వీళ్ళిద్దరూ ‘నాన్న-అలా, నాన్న-ఇలా, నర్తకి ఇలా, పకపక అలా చేసేది, చిత్ర చేష్టలు, డాలీ అల్లరి, హీరాగాడి నృత్యం గుర్తుందా? ఆమని చచ్చిపోయిందనే విషయం తెలిసి నాన్న బాధతో ఎంత సతమతమయ్యారు?’ – ఇలా ఒకటే ఎడతెగని కబుర్లలో పడిపోయేవారు. అరుణాచల పర్వతం గురించీ, కుక్కలూ, పిల్లులూ, కోళ్ళూ, చిలకలూ, గోరింకలూ, నెమళ్ళూ, వంటలూ, భోజనాలూ ఒకటి కాదు, ఎన్నో ఊసులు దొర్లిపోతుంటే నేను గుడ్లప్పగించి చూస్తుండేదాన్ని. పుస్తకాల్లోని మహా రచయిత చలం వేరుగా, వీళ్ళ కబుర్లలోని చలం వేరుగా ఉండి సంభ్రమంగా ఉండేది.

రజని గుంటూరు నుంచి వచ్చినప్పుడల్లా నేనక్కడ హాజరయ్యేదాన్ని. ఆహా! చలం అనుకునే ఆయన పప్పు రుబ్బడం, టీ చేసి ఇంట్లో అందరికీ ఇవ్వడం,“ఒరేయ్ చలం”, “ఒరేయ్ గాడిదా” అని పిలుస్తుంటే ఆనందంగా పలకడం లాంటి కబుర్లెక్కడా ఇంతకు ముందెప్పుడూ వినలేదు కదా? నర్తకి చేసే కాకరకాయ రసం వద్దని ఆంటీని చేయమనేవారట చలం! అలా నాకు అక్కడి వంటలు కూడా తెలిసిపోయాయి. కొందరి అమ్మాయిల  జీవితాలను దృశ్యాలుగా మలిచి చూపిస్తున్నట్లుండి, ప్రతిసారీ కబుర్లు ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేవి. పైగా చలం మాటలన్నీ ఆయన స్వరాన్ని అనుకరిస్తూ, ఆయన మాట్లాడినట్లే మాట్లాడేవారు. బాగా వినాలనిపించేది. చలం రాసిన కట్టల్లో ఉన్న ఉత్తరాలను ఒక క్రమంలో పెట్టి పుస్తకంగా వేయమని ఎన్నిసార్లు నేను మొత్తుకున్నా, “అవి నాకు చలం ఎంతో వాత్సల్యంతో రాశారు. ఎందుకు అందరికీ తెలియడం” అని ఆంటీ వాదించేవారు. “మంచి మేలిమి ముత్యాల్లాంటి మన బంధాలు నలుగురి నోళ్ళలో పడి పలచ బారడమెందుకు” అని చలం కూడా అన్నారట!

“ప్రజలందరూ సమానులే అన్న భావం చాలా మనుష్యం” అన్న చలంలాగే ఆంటీ కూడా మనుషులకుండే గొప్పవిశేషణాలు, కుల, మతాలు ఏమీ పట్టించుకోని మనిషితత్వం నిలువెల్లా మూర్తీభవించిన ఆకర్షణీయమైన రూపానికి తోడు మంచి హస్తవాసి ఉన్న గైనిక్ డాక్టర్. నా స్నేహితులెందర్నో ఆంటీ దగ్గరికి పంపించాను. ఒకసారి చూసినవాళ్ళు మళ్ళీ మళ్ళీ తలుస్తారు. ప్రతి మూడు సంవత్సరాల కొకసారి బదిలీ అవుతూ దేశంలోని ఎన్నోచోట్ల పనిచేసిన డాక్టర్ కామేశ్వరి గారంటే త్రివిధ దళాల్లోని స్త్రీ లోకానికే కాదు, దేశమంతా తెలుసు. నేనొకసారి పాకీస్థాన్ సరిహద్దుల్లో ఉన్న(మా బాబు ఆర్మీ ఏవియేషన్ పైలట్ గా పని చేశాడు) ‘శ్రీగంగానగర్’ అనే ఊరికీ, లేహ్ లఢక్ కీ, ఇంకోసారి చైనా సరిహద్దుల్లో ఉన్న“లీమా కాంగ్” అనే గ్రామానికీ వెళ్ళాను. అక్కడి మహిళలు నేను హైదరాబాద్ నుంచి  వచ్చాననగానే “సైనిక్ పురిలో కామేశ్వరి గారనే ఒక అద్భుతమైన డాక్టరున్నారు” మీకు తెలుసా? అంటూ ఆమె అప్యాయత రంగరించి వైద్యం చేసే విధానం గురించి వైన వైనాలుగా చెప్పారు. ఆంటీ ముందు తరం నుంచి మా తరం, ఇప్పటి యువతరం, జెన్ జీ తరాన్ని కూడా కలిపి నాలుగు తరాలకు డాక్టర్ కామేశ్వరి అంటే చెప్పలేనంత గౌరవం. అసలు ఆ వైద్యాన్ని మర్చిపోవడం సాధ్యం కాదంటారు! “నా వృత్తి నాకు చాలా తృప్తినిచ్చిందమ్మా” అంటారు ఆంటీ. “నీరసంగా ఉందమ్మా” అని ఫోన్ చేస్తే “ఏమీ లేదు. శరీరంలోని చివరి రక్తపు బొట్టుని కూడా ఖర్చు పెట్టి ప్రసాద్ లా, కాకిలా తిరిగి ఉంటావు. ఎర్రని సిరాతో “rest, rest, rest” అని  రాసి ఎదురుగా పెట్టుకుని పడుకో అని నాకొకసారి చెప్పారు. మనిషి తత్వాన్ని, శరీర తత్వాన్ని కూడా అర్ధం చేసుకుని,  “శరీరం నీతో మాట్లాడుతుంది. నువ్వు దాన్ని వినడం నేర్చుకో” అని అనునయంగా చెప్తూ, శాస్త్రీయ పద్ధతిలో వైద్యం చేస్తే ఎవరైనా ఎలా విస్మరించగలరు? అందుకే “అందరికీ నువ్వు సొలేస్ కంఫర్టర్ అయితే, నేను నీ కంఫర్టర్  ని” అని అమ్మతో అన్నారట  చలం!

“చూడండి, మిమ్మల్ని చూస్తే ఎందుకు అందరికీ గౌరవం. మీలో అందరికీ ఎందుకు సొలేస్  కలుగుతుంది? మీ హృదయవైశాల్యం వల్ల, ప్రపంచపు విలువలు గాక మీకు వేరే విలువలు ఉండడ వల్ల. నా పుస్తకాలనించో నా మిత్రులనుంచో చలం హృదయం చాలా విశాలమయిందని మీరు తెలుసుకోవడం వల్ల”- అని రాశారు చలం తన ఉత్తరంలో.

మహాకవిననీ, రచయితననీ మర్చిపోయి తనని మాములు మనిషి లాగే చూడమంటారు చలం. పైగా డాలీ పాప “ఒరే, నాన్నా, కపిక చలం (కవిగా చలం) అని పిలుస్తుందని చెప్పి మురిసిపోయేవారట. నేను కూడా తనొక డాక్టర్ నని మర్చిపోయి ఉద్యోగం చేసేటప్పుడు పొందే సౌకర్యాలన్నీ వదులుకుని మామూలు ఆడపిల్లలా ఆ ఇంట్లో ఆడుకుని మైమరచిపోయానంటారు ఆంటీ. అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం డాక్టర్లకి సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలుండేవి. అందులోనూ మిలిటరీలో పని చేసే లేడీ డాక్టర్ అంటే ప్రత్యేకమైన హోదా, గౌరవాలుండేవి. మొత్తానికి ఇద్దరూ తమ తమ గొప్ప అస్థిత్వాల స్పృహ లేనివారు. ఇద్దరిలోనూ ఉన్న ప్రజాస్వామ్య దృక్పధం ఇద్దర్నీ ఒకచోటికి చేర్చింది!

అధికార దౌర్జన్యం పట్ల ద్వేషం, హాస్యం, వ్యంగ్యం, మామూలు మనిషి పట్ల ప్రేమ, కరుణ, దైనందిన జీవితంలోని కష్టసుఖాలకు స్పందించడం, ప్రాణమున్న అన్ని జీవుల్ని మనుషుల్ని ప్రేమించినట్లే ప్రేమించడం, పువ్వులు, కొండలు, ప్రకృతిని చూసి పరవశించిపోవడం మొదలైన లక్షణాలు చలం గారి ఉత్తరాల్లో కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నీ కామేశ్వరి గారి లోనూ ఉన్నాయి!

సన్మానాలకోసం, అవార్డులకోసం ఎదురుచూసే ఇప్పటి రచయితలకూ, కళాకారులకూ వర్తించే ఒక సంగతి రాశారు. “Art కీ & Artists కీ చాలాసార్లు సంబంధం లేదు. జీవితంలోగానీ, పద్ధతిలోగానీ ఏ art ఉండదు. పైగా మామూలు మనుషుల కన్నా చాలా విధాల తక్కువతనం చూపుతారు. సర్వ సాధారణంగా artist చాలా selfish man. ఇతరులు తనకి  ఇవ్వాలంటాడు. ఇచ్చుకోవాలంటాడు. కాని తనని ఏమాత్రం ఇచ్చుకోడు. తన Comfort ని త్యాగం చెయ్యడు. గొప్ప artist గూడ తమ art  కోసం త్యాగం చేసుకుంటారు. కాని ఇతరులకోసం కాదు. తాను art కోసం త్యాగి కనుక, మనుషులు తన యెడల త్యాగులు కావాలంటాడు” – అని అంటారు చలం ఒక ఉత్తరంలో. ఇవి అక్షర సత్యాలు! ఇక్కడొక విషయం ఆంటీ చెప్పింది గుర్తొస్తుంది. కామేశ్వరి గారి స్నేహితుల్లో కొందరు మేము మీతోనే చలం గారి రమణాశ్రమానికి వస్తామని చెప్పి ఆమెతో శ్రీ శ్రీ, చలసాని ప్రసాద్, కోటేశ్వరరావు, ప్రసూన మొ.న వారు వెళ్ళారట. చలంగారికీ, కామేశ్వరిగారికీ కూడా స్నేహితుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు కూడా “నేనూ మీ తోనే వస్తానని చెప్పేవార”ట. ఆంటీని చూడగానే చలం “ఏడీ నా స్నేహితుడు?” అని ప్రతిసారీ అడిగేవారట. రాలేదు అని ఆంటీ చెప్తే “ఎందుకొస్తాడు? సన్మానం అంటే వెళతాడు గానీ” అనేవారట! ఇది నిజం. చాలామంది రచయితలు తమను వేదిక లెక్కించి సన్మానాలు చేస్తేనే వస్తారు. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదని, తమకు తెలియని విషయాలు కొన్ని ఎదుటివారి దృష్టి కోణం నుంచి సమాజాన్ని అర్ధం చేసుకుని రాయడానికి, ఎదగడానికి ఉపయోగపడతాయనుకోరు! చలంగారి కాలంలో ఎక్కడో ఒకరుంటే ఇప్పుడలాంటివారు కోకొల్లలు!

స్వేచ్చ విషయానికొస్తే అసలు కామేశ్వరి గారి జన్యువుల్లోనే స్వేచ్చా కణాలున్నాయనిపిస్తుంది నాకు. ఆమె జీవితం మొత్తం ఒక తెరిచిన పుస్తకమే! గమనిస్తే ఆమె జీవితమంతా తన మనసు కోరుకున్న పద్ధతిలోనే జీవించారు. ఆరేళ్ళ వయసులో స్కూలుకి తనకి తనే వెళ్ళి, సీట్ తెచ్చుకున్నారు.  పదమూడు, పధ్నానుగు సంవత్సరాల వయసులోనే ఆంటీ చలం పుస్తకాలన్నీ చదివేసి, ఆయన్ని తప్పకుండా చూడాలనుకున్నారు. చూశాక పురూరవ లోని ఊర్వశి, శశాంక లోని తార, జీవితాదర్శం లోని లాలస, అరుణ లోని అరుణ, స్త్రీ లోని స్త్రీ ల లాంటి వ్యక్తిత్వమున్న స్త్రీలు అసలు లోకంలో ఉన్నారా? ఎవరి స్ఫూర్తితో నువ్వీ పాత్రల్ని సృష్టించావు? అని ప్రశ్నించి, ఎక్కడో చెదురు మదురుగా ఒకటి రెండు గుణాలుంటే ఉండవచ్చు గానీ మొత్తానికి అలాంటి స్త్రీలు నీకుతెలుసా? అసలున్నారా అని చలాన్నే ప్రశ్నించిన ధీర. “నిజమే, అలాంటి సౌందర్య పిపాసులూ, శృంగార మహిళలు లేరు, నేను చూసిన వాళ్ళలో కొంచెం లీలా, కొంచెం పద్మావతి ల గుణాలు కలిపి రాశా” నన్నారట చలం!

“ఒక మనిషిని అతను చెప్పే సమాధానాలను బట్టి గాక వేసే ప్రశ్నలను బట్టి అంచనా కట్టు” అని అంటాడు ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్. కొన్నిసార్లు రాసిన వాళ్ళకన్నా చదివినవాళ్ళ హృదయాల్ని రచనలు పట్టేస్తాయి. అలా చలం రచనల సారాన్ని పట్టుకున్నారు. తన మానసిక, భౌతిక  విషయాల్లో గాని, స్నేహ సంబంధాల విషయాల్లో గానీ తన మనసు కోరుకుంటున్నట్లే ప్రవర్తించారు తప్ప సమాజం చెలాయించే ఆధిపత్యానికి ఎప్పుడూ ఆంటీ తలవంచలేదు. స్త్రీలందరిలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులెదురైనప్పుడు సంసారంలో పొత్తు కుదరకపోయినా సరే, రాజీ పడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిన క్షణంలో చలాన్ని సలహా అడిగితే “కామేశ్వరీ నువ్వెవరివి అనుకుంటున్నావు? నువ్వు కామేశ్వరివి! ఒకసారి రాజీ పడడం మొదలైతే జీవితమంతా ప్రతి సందర్భంలోనూ రాజీపడాలి. జీవితానికి లొంగి జీవచ్చవం కావడం కన్నా సంపూర్ణంగా నాశనమవడం  నయం” అని చలం గట్టిగా చెయ్యి పట్టుకుని చెప్పేవారట. “ఏ పరిస్థితుల్లోనూ నీ స్వతంత్రాన్ని ఎవరి చేతిలోనూ పెట్టకు, ఆఖరికి దేవుడి చేతిలో కూడా” అని కొమ్మూరి పద్మావతి ఇంకో సందర్భంలో అమ్మతో చెప్పారట. ఆ సలహాలన్నీ స్ఫూర్తినిచ్చి ఆమెను నిలబెట్టాయే తప్ప అసలు సిసలైన స్వేఛ్చాపిపాసి అమ్మే! ఎన్ని కష్టాలెదురైనా మనిషి తన స్వేఛ్చను తానే కాపాడుకోవాలి అన్నదానికి నిలువెత్తు ఉదాహరణ డాక్టర్ కామేశ్వరి. “Roman Holiday” సినిమాలో రాజకుమారిలాగా ఆయా దేశాల్లో ఎవరూ తెలియకపోయినా, ఆ దేశాల కరెన్సీలేమీ తన చేతిలో లేకుండానే యూరప్ దేశాలు, తూర్పు, పశ్చిమ ఉత్తర అమెరికా దేశాలు మొత్తం ఒంటరిగా వెళ్ళి చూసి  వచ్చానని చాలా హృద్యంగా నాకు వినిపించారు. తన లోపలినుంచి ధృఢమైన స్వేఛ్చాకాంక్ష ఉన్నవారే అంత ధైర్యంగా ప్రవర్తించ గలరు! గుంపులో గోవిందం లాంటి మనుషులెవరూ అలా చెయ్యలేరు!

తన దగ్గరకి వచ్చినవాళ్ళు ఎవరైనా విశాఖ వెళ్తున్నామంటే వాళ్ళని “మీరు వెళ్ళి కామేశ్వరిని కలవండి” అని చలం చెప్పేవారట. వాళ్ళలో ఎవరో చలాన్ని అడిగారట “ఎవరండీ ఈ డాక్టర్ కామేశ్వరి?” అని. ఆయన “కామేశ్వరి ఎవరు? అని అడిగితే ఏంచెప్తాను? కామేశ్వరిని చూడాలి. ఆమెతో గడపాలి. ఆమె ఒక Phenomenon” అన్నారట చలం. “నాన్నా! ఇంత లోకాన్ని చూసిన నువ్వు నన్ను Phenomenon అన్నావా?” అని ఆంటీ అడిగితే “నిన్నే అన్నాను. ఇంకెవర్నీ అనలేదు” అని అన్నారట చలం!

కామేశ్వరి ఆంటీ, చలసాని ప్రసాద్ బాబాయితో కలిసి ఒక మంచిపని చేశాననే సంతృప్తి మిగిలింది నాకు. రావిశాస్త్రి గారి ఆరోగ్యం విషమంగా ఉన్నప్పుడు ఆంటీ డాక్టర్ గా చాలా సమయస్ఫూర్తితో తన స్నేహితురాలైన డాక్టర్ డోల్కర్ అనే ఒక టిబెటియన్ డాక్టర్ తో వైద్యం చేయించారు. వారెక్కడున్నారో తెలియకపోతే నేను టెలికంలో పని చేస్తుండడం వల్ల హిమాచల్ ప్రదేశ్ లోని ఎంక్వైరీలన్నీ శోధించి, చివరికి ముంబాయిలో ఆవిడ నంబర్ సాధించాను. ఈ డాక్టర్ల బృందం హిమాలయాలలోని మూలికలు స్వయంగా తెచ్చి వైద్యం చేస్తారు.  ఆమె నాడి, యూరిన్ రిపోర్ట్ మాత్రమే తెలుసుకుని మందిచ్చేవారు. కేస్ గురించిన మెడికల్ హిస్టరీ మొత్తం డాక్టర్ డోల్కర్ కి, అమ్మ వివరించారు. రావిశాస్త్రి గారి కోడలు (ఆమె కూడా డాక్టరే) పల్స్, యూరిన్ రిపోర్ట్ వివరాలు ప్రతిరోజూ నాకు ఫోన్ లో చెప్పేవారు. నేను డాక్టర్ డోల్కర్ కి చెప్పేదాన్ని. వాళ్ళు అక్కడి నుంచి మందు పంపేవారు. చలసాని ప్రసాద్ దాన్ని రావిశాస్త్రి గారింటికి చేర్చేవారు. అది వాడుతున్న క్రమంలో రావిశాస్త్రి గారు కొంచెం తెరిపిన పడ్డారు. అంతకుముందు వారానికి మూడుసార్లు డయాలసిస్  చెయ్యాల్సొచ్చేది. ఈ మందు వాడిన తర్వాత రెండు వారాల కొకసారి చేస్తే సరిపోయేది. అలా మా ముగ్గురి కృషి ఫలితంగా ఆ మహానుభావుణ్ణి కొన్ని రోజులైనా కొంత సౌకర్యంగా ఉంచగలిగాం! ఆయన మంచం మీదనుండే చలసాని బాబాయికి డిక్టేట్ చేసిన “ఇల్లు” నవల నెల రోజుల్లో సాహిత్య లోకం ముందుకొచ్చింది!

Phenomenon లాంటి గొప్ప మనుషులు, వారి స్నేహితులు నాకు పరిచయం కావడం, వారితో సన్నిహితంగా మెలగడం, వారు నన్ను తమ బిడ్డలా చూసుకోవడం, వారి ప్రభావంలో పడడం – ఇవన్నీ జీవితాంతం నన్ను స్ఫూర్తితో ఉప్పొంగించే విషయాలు! అలాంటి గొప్ప అనుభూతులు నాకనుభవంలో కొచ్చి నన్ను గొప్ప అదృష్టవంతురాలిని చేశాయి! చాలాసార్లు రక్తపరిక్షలంటూ అమ్మదగ్గరికి పోయి రెండు, మూడు రోజులు తిష్ఠ వేసేదాన్ని. అప్పుడు  బోలెడు కబుర్లతో పాటు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళం! నాకు పచ్చళ్ళు ఇష్టమని తను చేసిన ఆవకాయ, మాగాయ నెయ్యితో అన్నం ముద్దలు చేసి తినిపించేవారు! తొంభై మూడేళ్ళ వయసులో ఇప్పటికీ “ఐ లవ్ మై ఇండిపెండెన్స్” అని అంటారు కామేశ్వరి. అలాగే జీవిస్తున్నారు కూడా! “జీవితంలో మీరు వేటికి ఎక్కువ విలువిస్తారు” అని చివరిగా ఇటీవల డిమెన్షియాకి పూర్వం నేను ప్రశ్నిస్తే “గొప్ప ప్రేమ,  గొప్ప స్వాతంత్ర్యం” అన్నారు! ఎప్పుడైనా “ఎలా ఉన్నారమ్మా?” అని అడిగితే “హాయిగా ఉన్నాను నాన్నా” అనేవారు. ఎవరైనా పోయినప్పుడు నేను ఏడుస్తుంటే, “ గొడవపడకు, నాన్నా, పోకుండా ఎప్పటికీ ఉండిపోతే ఎలా? అనేవారు. అది తలచుకుని నన్ను నేనే ఓదార్చుకుంటున్నా!

కష్టంలో ఉన్న ఆడపిల్లలను చేరదీసి, సేద దీర్చి చలం ఎంత ఆదుకోవాలని చూసినా, పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకుని బలంగా ఉండడం వల్ల స్త్రీలు మళ్ళీ ఆ పాత రాజీల, అతుకుల జీవితాల్లోకే వెళ్ళిపోయి, చలానికి మనస్థాపం కలిగించేవారు. “స్వేఛ్చ మాటల్లోనే గానీ చాతల్లో ఎక్కడుంది?” అనే చలంకి స్వేఛ్చను తన జీవితంలో నూటికి నూరుపాళ్ళూ ఆచరించి చూపారు కామేశ్వరి. దానివల్ల ఆమె జీవితంలో ఎన్నో యాతనలను అనుభవించారు. ఎన్నో కోల్పోయారు కానీ స్వేఛ్చను మాత్రం వదులుకోలేదు. ఈ విషయాన్ని సౌరిస్ బలపరిచారు కూడా. చలం భావాలతో ప్రభావితమై అలాగే తమ జీవితాలను గడిపిన స్త్రీలెవరైనా ఉన్నారా? అని కృష్ణాబాయి గారడిగిన ప్రశ్నకు “కామేశ్వరి” అని  ఒకరిద్దరున్నా చాలు కదా? అన్నారు షౌ. ఆ ఒకరే కామేశ్వరి!

స్త్రీల స్వేఛ్చను కల గన్న చలం, ఆచరించిన కామేశ్వరి సమాజంలో స్త్రీ- పురుష సమానత్వం సాధించే వరకూ ఇద్దరూ చిరస్మరణీయులే!

                 *

శివలక్ష్మి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవును… చలాన్ని అర్ధం చేసుకోవడం ఆచరించడం అందరికి సాధ్యమయ్యే పని కాదు. స్వేచ్ఛను స్వేచ్ఛగా ఆవాహన చేసుకోవడం, నిజజీవితంలో స్వేచ్ఛగా గడపడం సాహసంతో చేయాల్సిన పనులు. ఇటీవల ఎక్కడనో డాక్టర్ అని ,చలం కోడ్స్ తో ఆమె గురించి రాసారని విన్నాను కానీ ఆమె ఈ అసలైన చలం అని చదివాక మనసు ఉప్పొంగింది.

    చాలామంది చలం రాసినట్టు ఉంటారా అని ప్రశ్నిస్తారు. అసలు ఈ ప్రపంచంలో ఏ సిద్ధాంతం అయినా ముందే ఉన్నదా. ఇట్లా ఉండాలనుకుని కదా రాసింది. మరి వాటిలో లేని ఇబ్బంది చలం పాత్రల వరకే ఎందుకు అంటే… స్త్రీ పురుషుల సమానత్వం, మనుషులు స్వేచ్ఛగా కలసి ఉండటం అనేది ఇంకా ఈ సమాజానికి ఇబ్బందిగా కలిగించే విషయం. అభ్యుదయవాదులు, విప్లవకారులు, ఆధునిక వాదులు చెప్పుకునే వారికి సైతం ఇబ్బందే. పైగా వీరు ధరించే అనేది నాగరికత ఒక ముసుగు. అంతే. అంతే…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.