సీనియర్ కథకుడు పి.ఎస్.నారాయణ వేశ్య గురించి ఒక కథ రాసి ‘చీకటి పువ్వు’ అనే పేరు పెట్టారు. ఆ మకుటం చదివి వణికిపోయాను. అలాంటి పోలిక ఎలా సాధ్యం అనిపించింది. కవయిత్రి ఘంటసాల నిర్మల ‘ఎ కాల్ గళ్స్ మొనొలాగ్’లో ‘వేల వేల వీర్యాల వర్షాల్ని కళ్లు మూసుకునైనా భరిస్తున్నదాన్ని.. రంగులు చిట్లిన రతి రోతకు జ్వరిస్తున్నదాన్ని.. ఆవేశమూ అసహ్యమూ రెండు చేతులుగా సాగే ఆగంతకుల ఆలింగనాన్ని అప్యాయిస్తున్నదాన్ని..’ అని రాసినప్పుడు కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది. గుండెలో దడ పుట్టింది. అంతటి ప్రకంపనం నాలో మళ్లీ కలిగించిన కథ ఇది. ‘మల్లెపూలు’. పేరు రమ్యంగా ఉంది. గుప్పెడు మల్లెల వెనుక దాగిన గుండెలోని కన్నీళ్ల గురించి కథ చదివితేనే తెలుస్తుంది.
కథ ఇక్కడ చదవండి.
ఇది మల్లిక కథ. అమాయకురాలిగా ఉన్న మల్లిక, చివరకు బందరు కాల్వ దగ్గర వేశ్యగా మారిన కథ. తలనిండా మల్లెలు పెట్టుకొని మురిసిపోయే చిన్నారి పిల్ల.. ఒళ్లమ్ముకోవడం కోసం తలలో పూలు పెట్టుకునే స్థితికి ఎందుకొచ్చిందో చెప్పే కథ.
నేను కథంతా చెప్పను. చెప్పలేను కూడా! ఈ కథకు మొదటి పాఠకుణ్ని నేనే. మొదటిసారి చదివి, చదువుతూ దు:ఖపడి, ‘చీ! ఏమిటో ఇయ్యాల మరీ ఏడుపొచ్చేత్తుంది’ అని కథ చివర్లో మల్లిక చెప్పిన మాట గుండెలో తట్టి, కళ్ల నీళ్లు పెట్టుకున్నది నేనే! ఇప్పటికి ఈ కథను చాలాసార్లు చదివి ఉంటాను. కథ మొత్తం చాలా దిటువుగా చదువుతాను. ఆ చివరి వాక్యం వచ్చేసరికి మనసంతా చేదుగా అయిపోతుంది. అమాయకమైన మల్లిక ముఖాన్ని ఊహించుకొని బాధగా అనిపిస్తుంది.
ఈ కథలో చాలా కోణాలున్నాయి. పేదవర్గాల చిన్న చిన్న ఆశలు, ఆర్థిక స్థితి, తల్లి చావు అర్థం కాని చిన్నపిల్ల తత్వం, చెల్లెలిని ప్రేమగా చూసే అన్నయ్య, తలకిందులైన ఇంటిని నిలపడం కోసం తప్పుడు దారులు తొక్కే యువత, వాళ్లకు జతయ్యే స్నేహితులు, వాళ్లను పీల్చుకు తినే పోలీసులు, గొడవలు పడే రౌడీలు, తాగుడు, గంజాయి మైకంలో సొంత వాళ్ల మీద చేసే అఘాయిత్యాలు, ఆడవాళ్ల మీద లైంగికదాడులు, దోషులపై ఎన్కౌంటర్, దిక్కులేని ఆడపిల్లల్ని సమాజం చూసే చూపు, చదువు లేని.. ఏ పనీ దొరకని ఆ ఆడపిల్లలు వేశ్యలుగా మారి పొట్టపోసుకోవడం.. ఇన్ని కోణాలు ఇందులో ఉన్నాయి. వెతికితే మరిన్ని కోణాలు కనిపిస్తాయి. ఇన్నికోణాలను తూర్పుగోదావరి జిల్లా యాసలో అద్భుతంగా రాశారు రచయిత చిన్నీ అజయ్. తను రాసిన కథల్లో అత్యుత్తమ కథగా నాకెప్పుడూ నచ్చే కథ ఇది.
ఇందులో మల్లిక పాత్ర నాకు చాలా అంటే చాలా ఇష్టం. అన్న, అతని స్నేహితులు తన మీద లైంగికంగా దాడి చేస్తుంటే మౌనంగా భరించింది. వాళ్లను పోలీసులు ఎన్కౌంటర్లో చంపేస్తే బాధపడింది. ఆ క్షణంలో మల్లిక చెప్పే మాటలు చూడండి.
‘…. బాగా సదూకునే అన్నయ్య నా కోసమే కదా దొంగయ్యాడు. ఎంత కాదన్నా ఒక్కపుడు పేమగా సూసుకునేవోడు. ఆ బ్యాచీతో జతయ్యాకే గంజాయికి లొంగిపోయాడు. అన్నయ్య మంచోడో, సెడ్డోడో నాకు తెలీదు. ఆడు నాకున్న ఒకే ఒక్క పేగుబందం. అది కూడా తెగిపోయింది.
అన్నయ్యనే కాదు, అసలు నాకా పనిలో నొప్పిలేకపోతే ఆళ్ళెవ్వరిమీదా కూతంత గూడా కోపం వుండేదే కాదు. ఆడితోపాటు పాపం ఆ ముగ్గురు కూడా సచ్చిపోయారు. యే? రోజూ ఆ పనికి నేనెలాగూ వుంటున్నాను, నాతో సరిపెట్టుకోవచ్చు కదా! ఇంకో ఆడపిల్ల జోలికి పోయి ఇలా పేనాలు పోగొట్టుకునే బదులు. పిచ్చినాయాళ్లు కాకపోతీనీ. ఆళ్ళకి అలా మూడిందేమో సావు?’
ఎంత అమాయకప్పిల్ల! ‘ఆ పనికి నేనెలాగూ ఉంటున్నాను కదా.. నాతో సరిపెట్టుకోవచ్చు కదా’ అని అనుకుంటోంది. వాళ్ల ప్రాణం పోయినందుకు బాధపడుతోంది. నిజజీవితంలో మల్లికలుంటారో, లేదో తెలియదు. ఉంటే మాత్రం.. అలాంటి వాళ్లను చూసి, చెయ్యెత్తి మొక్కాలి అనిపిస్తుంది. తనను కాపాడుకోలేని ఈ సమాజంలో నేనూ ఒక భాగమైనందుకు క్షమించమని కోరాలని అనిపిస్తుంది.
*








Nijamga evarinaina kadilinche katha idi . veliki teesinanduku thanks .