బొమ్మ పడింది

మే నెల. మూడో శనివారం. మధ్యాహ్నం ఒంటి గంట. అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌ ప్రయాణీకులతో కిక్కిరిసి లేదు కానీ ఓ మోస్తరుగా ఉన్నారు జనం.
ఎండ… కోపం వచ్చిన వెన్నెలలా మండిపోతోంది…
ఎండ.. ఒకేసారి అంటుకున్న పది ఎకరాల కలప వనంలా ఉంది…
ఎండ… ఆకాశం నూనె మూకుడులో సలసలా కాగుతున్న సూర్యుడిలా ఉంది…
స్నానం చేసి వొళ్లు తుడుచుకోకుండా బట్టలు వేసుకున్నట్లుగా ఉన్నారు ప్రయాణీకులు.
బస్టాండ్‌ చెమటతో తడిసిన లగ్జరీ బస్‌లా ఉంది.
బస్టాండ్‌లో ఉన్న ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ.. ఆ గాలి ఆ ఫ్యాన్‌లకే తగలడం లేదన్నట్లుగా ఉన్నాయి.
బస్టాండ్‌లో ఉన్న చెక్క బెంచీల్లో ఆ చివరా, ఈ చివరా కూర్చున్న ప్రయాణీకుల చేతి చెమటతో బెంచీ హ్యాండిల్స్ తడి తడిగా ఉన్నాయి.
కొందరు ప్రయాణీకులు జేబు రుమాళ్లతో విసురుకుంటూంటే… మరి కొందరు చొక్కా కాలర్‌కి, మెడకి మధ్యలో రుమాళ్లను మడిచి పెట్టుకున్నారు.
మహిళా ప్రయాణీకులు తమ చెంపల మీదకి కారుతున్న చెమటని చీర కొంగుతో తుడుచుకుంటున్నారు. ఇంకొందరు కొంగుతో విసురుకుంటూ పక్కనే ఉన్న పిల్లలకి కూడా మధ్య మధ్యలో విసురుతున్నారు.
సరిగ్గా ఆ సమయంలో బస్టాండ్‌కి వచ్చాడు పురుషోత్తమ శాస్త్రి. తెల్ల పంచా, తెల్ల చొక్కా తొడుక్కుని… భుజాన అంగవస్త్రం వేసుకున్నాడు. అతను వేసుకున్న హవాయి చెప్పులు సగానికి పైగా అరిగిపోయాయి. చేతిలో అటు ఇటు మూడు గుర్రాల బీడీ కంపెనీ ప్రకటనతో ఉన్న గుడ్డ సంచీ ఉంది. అందులో మరో పంచె, చొక్కా, ఇంకో అంగవస్త్రం, ఓ పేపరులో తల్లి ఇచ్చిన అటుకుల పొట్లం మాత్రమే ఉన్నాయి.
ఆ రోజు ఉదయాన్నే గుండు చేయించుకున్నాడు.  పిలక కోసం కొంత జట్టు వదిలేసి దాని చివరి చిన్న ముడి పెట్టాడు. నుదురు మీద మూడు వేళ్లతో విభూది రేఖలు…. దాని కింద కుంకుమ బొట్టు ఉన్నాయి. కంఠం దగ్గర విభూదితో అడ్డంగా రాసుకున్నాడు. అలాగే కుడి, ఎడమ భుజాల మీద కూడా రాసుకున్నాడు కానీ చొక్కా వేసుకోవడం వల్ల అవి పైకి కనపడవు.
మనిషి లావూ కాదు… అలాగని సన్నమూ కాదు. మనిషి పొడుగా అంటే అవుననే చెప్పాలి.
బస్టాండ్‌లోకి వచ్చిన పురుషోత్తమ శాస్త్రి ఓ సారి కుడి వైపు, మరోసారి ఎడమ వైపు చూశాడు.
 పురుషోత్తమ శాస్త్రి కుడి వైపు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ వైపు వెళ్లే బస్సుల ఫ్లాట్‌ఫాంలున్నాయి. ఎడమ వైపు రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లే బస్సుల ఫ్లాట్‌ఫాంలున్నాయి.
 రెండూ వైపుల చూశాక తడితడిగా ఉన్న చొక్క జేబులోంచి తడిగా ఉన్న రూపాయి బిళ్ల తీసాడు.
అలా తీసిన రూపాయి బిళ్లని పురుషోత్తానికి వాళ్ల అమ్మ ఇచ్చింది. ఆ రూపాయి నాణెం ఇస్తూ “ఈ రూపాయి బిళ్ల  నేను కాపురానికి వచ్చినప్పుడు మా అమ్మ ఇచ్చింది. ఇది నీ దగ్గరుంటే నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పింది మా అమ్మ. నా జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు తప్ప సాఫీగానే సాగింది. ఇదిగో ఇప్పుడు నీకు ఇస్తున్నాను. జాగ్రత్త. దీన్ని నీ కూడా ఉంచుకో. మంచి జరుగుతుంది” అని చెప్పింది.
అదిగో అప్పటి నుంచి ఆ రూపాయి బిళ్ల పురుషోత్తానికి శరీరంలో ఓ భాగం అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఆ రూపాయి బిళ్ల అతని వెంట ఉండాల్సిందే.
చొక్కా జేబులోంచి తీసిన ఆ తడి రూపాయి బిళ్లని పంచెతో తుడిచి శుభ్రం చేశాడు. చూపుడు వేలుని… బొటన వేలుని కాసింత వొంచి దాని మీద రూపాయి బిళ్ల ఉంచాడు.
కళ్లు మూసుకుని మనసులో ఏదో అనుకున్నాడు. అలా అనుకున్నాక కళ్లు తెరచి రూపాయి బిళ్లని ఆకాశంలోకి విసిరి బొమ్మా బొరుసు వేశాడు. పై నుంచి కిందకు పడుతున్న రూపాయి బిళ్లని ఎడమ అరచేతితో పట్టుకుని దాని మీద కుడి అరచేతితో మూసాడు.
ఈ సారి మళ్లీ కళ్లు మూసాడు… ఓ పది సెకన్ల తర్వాత కళ్లు తెరిచి కుడి అరచేతి మూతని తీసాడు. రూపాయి బిళ్ల బొమ్మ చూపించింది.
పురుషోత్తమ శాస్త్రి చిర్నవ్వాడు. ఆ చిర్నవ్వు పెద్దదైంది.
బస్టాండ్‌ టాప్‌ కేసి చూసాడు. అప్పుడు చిర్నవ్వు పగలబడింది.
అలా నవ్వుతూనే కుడి వైపు చూసి “నువ్వు అనుకున్నదే వచ్చింది. గెలుస్తావురా పురుషుగా” అనుకుంటూ విశాఖపట్నం బస్సు ఉన్న ఫ్లాట్‌ఫాం వైపు నడిచాడు. బస్సు ఎక్కి కిటీకీ పక్కనున్న సీటులో కూర్చున్నాడు.
పురుషోత్తమ శాస్త్రి నవ్వుకి కన్నీళ్లొచ్చాయి.
అవి ఆనందబాష్పాలు కావు… కన్నీళ్లే…
***                 ***             ***
నాయుడు గారు ఆ మాటలు అన్న తర్వాత పురుషోత్తమ శాస్త్రి చిన్నబుచ్చుకున్నారు.
ముఖం వివర్ణం కాలేదు కాని ముడుచుకుపోయింది.
కంటి రెప్పల కింద రెండు కన్నీటి బొట్లు చెంపలపై రాలేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కంటి పైరెప్ప మూస్తే ఆ కన్నీటి బొట్లు రాలేవే…!! కానీ బలవంతంగా ఆ రెప్పలు మూయకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం  చేస్తున్నాడు పురుషోత్తమ శాస్త్రి…
ఆయన పక్కనే నిలబడి నేల చూపులు చూస్తున్న నలుగురు తమ్ముళ్ల పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఆఖరి తమ్ముడు రాంబాబు అయితే వెక్కి వెక్కి ఏడవడానికి సమయం ఎప్పుడు దొరుకుతుందా అన్నట్లు ఉన్నాడు.
ఊరి పెద్ద నాయుడిగారి ఇంట్లో ఆ రోజు గణపతి హోమం. ఇంటి ముందు పందిరి వేసారు. పందిరి మధ్యలో హోమ గుండం వేసి క్రతువు నిర్వహిస్తున్నారు ఊరి పురోహితులు. ఆ కార్యక్రమం ఓ గంటలో పూర్తవుతుంది. పెద్ద పురోహితులకే అక్కడ పని ఉంది. మిగిలిన చిన్న పురోహితులు ఒక్కొక్కర్నే సంభావన ఇచ్చి పంపేయండంటూ బ్రహ్మగారు పురమాయించడంతో నాయుడు గారు ఆ పనే చేస్తున్నారు.
  పురుషోత్తమ శాస్త్రి దగ్గరకు వచ్చిన నాయుడు గారు…
“ఏదైనా శుభమో… అశుభమో జరిగితే చాలు మొత్తం కుటుంబమంతా వాలిపోతారు. మీకు సంభావనలు ఇవ్వడానికే కార్యక్రమాలు చేస్తున్నట్లు ఉంది” కళ్లు ఎర్రగా చేస్తూ అన్నారు.
అంతే కాదు నాయుడు గారు సర్వేశ్వర శాస్త్రిగారి కొడుకుల్ని చూస్తూ… “మీ ఇంటి పక్కనే ఉన్న రెండు సెంట్లు నాకు కలిసొస్తుంది. అది నాకు దఖలు పరచవయ్యా. ఎంతో కొంత ఇస్తానంటే నీలిగాడు మీ నాన్న. పైగా తాతలు ఇచ్చింది ఎలా ఇస్తామంటూ సాగదీయడం ఒకటి. ఇదిగో ఇప్పుడు మాత్రం సంభావనలకి మీరు వచ్చేసారు” అని కూడా అన్నారు.
అంతకు ముందే కార్యక్రమం ప్రారంభమవుతూండగా పురుషోత్తమ శాస్త్రిని, అతని తమ్ముళ్లని చూసి “ఆ సర్వేశ్వర శాస్త్రి పోయినోడు పోకుండా ఈ సంతని మనకి అంటగట్టాడు” అని కూడా అన్నారు నాయుడు గారు.
ఇదిగో ఆ మాటలకే పురుషోత్తమ శాస్త్రి, అతని తమ్ముళ్లు తీవ్రంగా కలత చెందింది.
 “గర్భాష్టమం కాగానే ఉపనయం చేసేయడం… ఓ జంధ్యం పోగు మెడలో వేసేయడం. ఇదిగో సంభావనల కోసం రోడ్డు మీదకి వదిలేయడం. బ్రాహ్మణ్యం పరువు తీసేస్తున్నారు” కార్యక్రమం చేస్తున్న బ్రహ్మ సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నాయుడుకి వంత పాడారు.
“ఎందుకొచ్చిన మాటలూ. రూపాయో…. రెండు రూపాయలో ఇచ్చేసి పంపేద్దురూ. ఎదర ఇంకా కార్యక్రమం ఉంది” అన్నారు ఆ పక్కనే గోడకి చేరబడి కూర్చున్న అవధానులు గారు కుడి చేతితో ఎడమ తొడమని గోక్కుంటూ…
మళ్లీ అవధానులే “గురువుగారూ… గర్భాష్టమం అంటే…” అని కూడా అన్నారు.
ఈ ప్రశ్నకి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అవధానులు వైపు ఇది కూడా తెలీదా అన్నట్లు చూస్తూ “తల్లి గర్భంలో ప్రవేశించిన నాటి నుంచి ఏడో ఏడు వచ్చే వరకురా అవధానులు” అన్నారు.
ఈ మాటలు వింటున్న పురుషోత్తమ శాస్త్రి నేల మీద కూర్చున్న వాడు కాస్తా లేచి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. తమ్ముళ్లు కూడా అన్నని అనుసరిస్తూ వెళ్లిపోవడానికి సిద్ధ పడ్డారు. ఆఖరి తమ్ముడు రాంబాబు రెండు అరచేతులతోనూ కళ్లు తుడుచుకుంటూ అన్నలని అనుసరిస్తూ నడుస్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ రాంబాబు రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి నాయుడి గార్ని, సుబ్రహ్మణ్య శాస్త్రిగార్ని, అవధానులు గార్ని చూస్తూ నడుస్తున్నాడు.
“వెధవకి ముడ్డి కిందకి పన్నెండేళ్లు రాలేదు. ఎలా చూస్తున్నాడో మిడిగుడ్లేసుకుని” అన్నారు అవధానులు గారు.
“ఏవిటో… గొణుగుతున్నాడు కూడానూ… శపిస్తారా.. ఏం?” అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి శపించాలని లేదు.
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి కోపగించాలని లేదు.
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి ఆగ్రహించాలని లేదు.
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి ఆకలిగా ఉంది.
***                ***              *** బ్రాహ్మణ్యం ఎక్కువగానే ఉన్న గ్రామం అది. ఓ రెండు కుటుంబాలు తప్ప మిగిలిన ఏడెనిమిది కుటుంబాల వారికి పౌరహిత్యమే ఆధారం. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకు ఇక్కడి వారే పురోహితులు. అందుకే పురోహితుల మధ్య పోటీ ఎక్కువ ఆ గ్రామంలో.
పురుషోత్తమ శాస్త్రి తండ్రి సర్వేశ్వర శాస్త్రిగారు కూడా పౌరహిత్యమే చేయించే వారు. ఆరుగురు సంతానం. ఐదుగురు మగ పిల్లలు, ఒక్కతే అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేసేశారు. ఆ క్రతువు పూర్తి అయిన ఏడాదికి సర్వేశ్వర శాస్త్రిగారు కాలం చేశారు.
 ఇంటి బరువు, బాధ్యతలు పెద్ద కుమారుడు పురుషోత్తమ శాస్త్రి మీద పడ్డాయి.
తన తర్వాత పుట్టిన వారిని చదివించాలి. ఈ వృత్తిలోకి రానీయకూడదని పురుషోత్తమ శాస్త్రి పట్టుదల. పెద్ద తమ్ముడు ఇంటర్‌ చదువుతున్నాడు. రెండో వాడు పది, మూడో వాడు ఎనిమిది చదువుతున్నారు. చివరి తమ్ముడు రాంబాబు ఆరో తరగతి.
ఈ తమ్ముళ్లని ప్రయోజకులని చేయాలని, చేస్తానని తల్లికి మాటిచ్చాడు కూడా పురుషోత్తమ శాస్త్రి.
***              ***              ***
నాయుడిగారి ఇంట్లో జరిగిన అవమానం తట్టుకోలేక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన పురుషోత్తమ శాస్త్రి “అమ్మా… నేను హైదరాబాద్‌ గానీ, విశాఖపట్నం గానీ వెళ్లిపోతాను. అక్కడే పౌరహిత్యమో… ఏదైనా ఉద్యోగమో చేసుకుంటాను. ఇక ఈ ఊళ్లో ఉండలేను” అన్నాడు.
ఊళ్లో పిల్లలకి జరిగిన అవమానం తల్లికి తెలియడంతో ఆమె ఏం అనలేకపోయింది.
మళ్లీ పురుషోత్తమే “ఈ రెండు వందలు ఉంచు. ఓ వారం రోజుల్లో ఎలాగైనా కొంత మణియార్డర్‌ చేస్తాను” అని తల్లి చేతిలో డబ్బులుంచి ఓ సంచీలో బట్టలు కుక్కుకుని బస్టాండ్‌కి వచ్చేశాడు.
అలా వస్తూ వస్తూ తన దగ్గరున్న వంద రూపాయలతో పాటు తల్లి ఇచ్చిన రూపాయి నాణాన్ని జేబులో వేసుకుని వచ్చేశాడు.
***                ***              ***
పురుషోత్తమ శాస్త్రి మధ్యాహ్నం రెండు గంటలకి ఎక్కిన బస్సు రాత్రి ఎనిమిదింటికి విశాఖ చేరింది.
 పురుషోత్తమ శాస్త్రికి విశాఖపట్నంలో బంధువులు కానీ, తెలిసిన వారు కానీ లేరు. బస్టాండ్‌లోనే తెల్లవార్లూ ఉండాలని, తెల్లారేక ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుని బస్టాండ్‌లో ఖాళీగా ఉన్న ఓ రాతి చప్టా మీద కూర్చున్నాడు.
ఇంటి నుంచి తెచ్చుకున్న అటుకులు, బెల్లం తిని అక్కడే ఉన్న కుళాయిలో నీళ్లు తాగాడు.
రాత్రి పది దాటి ఓ గంట అయ్యింది. పురుషోత్తమానికి తెలియకుండానే కళ్లు మూతలు పడ్డాయి. ఆ రాత్రి చప్టా మీదే నిద్రపోయాడు.
తెల్లవారుజామున ఎవరో కర్రతో మెల్లిగా కొడుతున్నట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా ఇద్దరు కానిస్టుళ్లున్నారు.
 పడుకున్న వాడు కాస్త లేచాడు. కాసింత కంగారుగా కానిస్టేబుళ్ల వైపు చూసాడు.
ఆ ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరు “పంతులు…. ఏటి విక్కడ పడుకున్నావు. ఏ ఊరేటి. ఇంట్లోంచి ఎలిపొచ్చేసావేటి” అని అడిగాడు.
“మాది అవలాపురవండి. ఇక్కడ బంధువులు ఎవరూ లేరండి. పౌరహిత్యమో… ఏదైనా పనో చేసుకుందామని వచ్చానండి” అని సమాధానం చెప్పాడు పురుషోత్తమ శాస్త్రి.
“సరే, బస్టాండ్‌లో నిద్ర సేయకూడదు. దొంగనాకొడుకులుంతారు. చిటీ బస్సేక్కి శంకరమఠం యెల్లు పంతులు. అక్కడ నీలాంటి పంతుల్లు ఉంటారు” అని చెప్పి కానిస్టేబుళ్లు వెళ్లిపోయారు.
అక్కడి నుంచి లేచి బస్టాండ్‌లోనే ముఖం కడుక్కుని బయటకు వచ్చాడు పురుషోత్తమ శాస్త్రి.
శంకరమఠానికి ఎలా వెళ్లాలో దారి అడుగుతూ నడవడం ప్రారంభించాడు. అలా ఓ గంట నడిచాక శంకరమఠం చేరుకున్నాడు పురుషోత్తమ శాస్త్రి.
తెలతెలవారుతోందేమో ఇంకా ఎవరూ రాలేదు.
రాత్రి తిన్న అటుకులే… కడుపు నకనకలాడుతోంది. కడుపునిండా నీళ్లు తాగాడు. అక్కడే ఓ గోడకి జారబడి కూర్చున్నాడు. స్నానం కూడా చేయలేదేమో చిరాగ్గా ఉంది పురుషోత్తమ శాస్త్రికి. అలసిపోయి ఉన్నాడేమో గోడకి జారబడే నిద్రపోయాడు.
ఎవరో లేపినట్లు అయితే కళ్లు తెరిచాడు పురుషోత్తమ శాస్త్రి. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా ఓ పురోహితుడున్నాడు.
“ఎవరు మీరూ… ఏ ఊరేం. బాగా నీరసంగా ఉన్నారు. లేవండి. ముందు ఆ కుళాయి దగ్గరకు వెళ్లి ముఖం కడుక్కుని రండి” అన్నాడా పురోహితుడు.
ఆ పురోహితుడు చెప్పినట్లే చేసి వచ్చాడు పురుషోత్తమ శాస్త్రి.
“ముందు ఈ అరటిపళ్లు తినండి. వివరాలు తర్వాత” అన్నాడాయన.
ఆ పురోహితుడు ఇచ్చిన మూడు అరటి పళ్లు ఆబగా తినేశాడు పురుషోత్తమ శాస్త్రి. ఆ పురోహితుడు మరచెంబు అందిస్తే అందులో నీళ్లు కూడా గటగటా తాగేసి కాస్త స్థిమిత పడ్డాక ఆ పురోహితుడికి రెండు చేతులతోనూ నమస్కరించాడు పురుషోత్తమ శాస్త్రి.
ఓ ఐదు నిమిషాల తర్వాత ఆకలి తీర్చిన ఆ పురోహితుడికి తన గురించి పూర్తిగా చెప్పాడు పురుషోత్తమ శాస్త్రి.
అంతా విన్న ఆయన “నా పేరు జగన్నాథం. నేను భోక్తగా వెళ్తాను. ఇహనో.. ఇప్పుడో గురువుగారు వస్తారు. ఆయనకి మీ విషయం చెబుదాం” అన్నాడు జగన్నాథం.
గురువుగారి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు ఇద్దరూ.
***                 ***            ***
సమయం తొమ్మిదికి తక్కువ… ఎనిమిదిన్నరకి ఎక్కువ అయ్యింది. ఓ పది మంది దాకా పురోహితులు వచ్చారు ఆపాటికి.
వాళ్లందరికీ పురుషోత్తమ శాస్త్రి గురించి వివరించారు జగన్నాథం.
వాళ్లలో ఒకరు “బతకలేకపోం. ఇంత పెద్ద నగరంలో రోజూ ఏదో ఒక కార్యక్రమం ఉండనే ఉంటుంది. మీరు కుర్రాళ్లే కనుక గురువు గారి దగ్గర ముక్క నేర్చుకున్నారా… ఇహ తిరుగుండదు జీవితానికి” అని భరోసా ఇచ్చారు.
ఇలా వీళ్లు మాటల్లో ఉండగానే ఓ రిక్షాలో దిగారు కొడమర్తి చలపతి గురువు గారు.
అక్కడున్న వారంతా లేచి నుంచున్నారు. పురుషోత్తమ శాస్త్రి కూడా లేచి నుంచుని గురువుగారికి నమస్కరించాడు.
“ఈ కుర్రాడెవరు. కొత్తగా వచ్చినట్లుందే” అన్నారు గురువు గారు.
ముందుగా జగన్నాథమే కలుగజేసుకుని పురుషోత్తమ శాస్త్రి గురించిన వివరాలన్నీ చెప్పాడు.
అంతా విన్న చలపతి గురువు గారు పురుషోత్తమ శాస్త్రి వైపు చూస్తూ “ఏమైనా నేర్చుకుంటావా… లేకపోతే వీళ్లలాగే భోక్తగానో… దానాలు పట్టే వాడిలానో ఉంటావా” అని అడిగారు.
“నేర్చుకుంటానండి. మీరు ఏం చెప్తే అది చేస్తానండి” అన్నాడు పురుషోత్తమ శాస్త్రి.
“శుభం. మంచి మాట విన్నాను. ఈ రోజుకి ఇంటికి వెళ్లు. రేపటి నుంచి ఏం చేయాలో చూద్దాం” అన్నారు చలపతి గురువు గారు.
“ఇతనికి ఇక్కడ ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్తాడు” అన్నాడు జగన్నాథం.
“బానే ఉంది. అంతా విన్నాను కదా. ఇక ఏ ఇంటికంటాను. మా ఇంటికే. నువ్వే తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపు. నే పంపానని చెప్పు అమ్మతో. అలాగే ఇతడ్ని దింపేసి నువ్వు వన్‌టౌన్‌లో ఉంటున్న విశ్వేశ్వర రావుగారి ఇంటికి వచ్చేయ్‌. అక్కడ ఆబ్దీకం. నువ్వో భోక్తవి. వీళ్లలో ఒకడ్ని మరో భోక్తగా పంపుతాను” అన్నారు చలపతి గురువు గారు.
మళ్లీ ఆయనే పురుషోత్తమ శాస్త్రి వైపు చూస్తూ “ఒరేయ్‌ అబ్బాయ్‌. ఈ రోజు మన ఇంటికెళ్లిపో. అరటి పళ్లు తిన్నావుగా, భోక్తగా పనికి రావు. రేపటి నుంచి నువ్వు కూడా పనిలో పడిదివిగాని” అన్నారు.
జగన్నాథం తన సైకిల్‌ మీద పురుషోత్తమ శాస్త్రిని ఎక్కించుకుని సీతమ్మధారలో ఉంటున్న గురువు గారి ఇంటి వైపు బయలుదేరాడు.
***           ***                   ***
పురుషోత్తమ శాస్త్రి తెల్లవారుజామునే లేవడం గురువు గారి ఇంట్లో చిన్నా చితకా పనులు చేయడంతో రోజు ప్రారంభిస్తున్నాడు.
గురువు గారు పురమాయించిన చోటకి వెళ్లడం. భోక్తగానో… గురువు గారి సహాయకుడిగానో కార్యక్రమం దగ్గర వ్యవహరించడం జరుగుతోంది.
భోక్తగా వెళ్లిన రోజున మధ్యాహ్నం భోజనం చేసి… రాత్రి మాత్రం ఏం తినకుండా మంచినీళ్లు తాగి పడుకుంటున్నాడు.
ప్రతి రోజూ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకూ గురువు గారి దగ్గర స్మార్తం నేర్చుకుంటున్నాడు.
ఓ పది రోజుల తర్వాత చలపతి గురువు గారు పురుషోత్తమ శాస్త్రితో…
 “ఒరేయ్‌ అబ్బాయ్‌ అపర కర్మలు చేయించే వాళ్లు తగ్గిపోతున్నార్రా. ఒక్కోసారి ఇది నాతోనే ఆఖరేమో అనిపిస్తోంది. బ్రాహ్మలంటే పౌరుల హితం కోరుకునేది. ఆ జన్మ మనది” అన్నారు.
మళ్లీ ఆయనే “మానవ జన్మకి సద్గతులు కలగాలంటే జీవుడ్ని శాస్త్రోక్తంగా పంపాలిరా. ఎందుకో నువ్వు ఇందులో రాణిస్తావనిపిస్తోంది. నేర్చుకుంటావా” అని అడిగారు.
“మీరు ఎలా చెప్తే అలాగే గురువు గారు” అన్నాడు పురుషోత్తమ శాస్త్రి.
“ఒరేయ్‌ అబ్బాయ్‌. అపర కర్మలు చేయించే వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. అందులో మొదటిది ధైర్యం. ఏ ఇంట్లో కష్టం వచ్చిందో వారికి ధైర్య వచనాలు చెప్పాలి. మన మాట తీరు బాగుండాలి. మన మాటలతో కష్టం కలిగిన వారికి సాంత్వన కలగాలి” అని చెప్పారు.
కాసేపు ఆగిన చలపతి గారు మళ్లీ… “అపర కర్మలు చేయించే వారికి దాతృత్వం కావాలిరా. ఇచ్చే వాళ్లుంటారు… ఇచ్చుకోలేని వాళ్లు ఉంటారు. క్రియలు చేయించేప్పుడు అది చూడకూడదు. అందరికీ ఒకేలా కర్మలు చేయించాలి” అని హితబోధ చేశారు.
అన్నీ విన్న పురుషోత్తమ శాస్త్రి వినయంగా గురువు గారికి దండం పెడుతూ “మీరు చెప్పినట్లే నడుచుకుంటాను గురువు గారు” అన్నాడు.
ఆ మాటలు విన్న గురువుగారు “వీడు సాధకుడు. అనుకున్నది సాధించే వరకూ నిద్రపోడు” అని మనసులో అనుకున్నారు.
పైకి మాత్రం “సరే రా అబ్బాయ్‌. ఎల్లుండి ఆశ్వీయుజ శుద్ధ తదియ. పైగా బుధవారం. వినాయక ప్రీతి. విఘ్నూలు ఉండవు.  నీకు సాధన తార అవుతుంది. ఆ రోజు నీకు విద్య నేర్పుతా. నువ్వు ఎంత కష్టపడితే అంత తొందరగా పట్టుబడుతుంది” అన్నారు.
***                ***              ***
గురువు గారు చెప్పిన రోజు రానే వచ్చింది. పురుషోత్తమ శాస్త్రి తెల్లవారుజామునే లేచాడు. తల స్నానం చేశాడు. అంతకు ముందు రోజే గురువు గారి భార్య ఇచ్చిన కొత్త పంచె కట్టుకున్నాడు. భుజాలు నిండుగా కండువా కప్పుకున్నాడు. బొట్టు పెట్టుకున్నాడు. దేవుడికి దండం పెట్టుకుని గురువు గారి దగ్గరకు వచ్చాడు.
ఆ రూపంలో ఉన్న పురుషోత్తమ శాస్త్రిని చూసిన గురువు గారికి అతని ముఖంలో ఏదో కళ ఉన్నట్లు అనిపించింది.
ఆ రూపం… పట్టుదలకు ప్రతిరూపంగా ఉంది.
ఆ రూపం… అవమానాలు జయించేందుకా అన్నట్లు ఉంది.
ఆ రూపం… విజయానికి మరో రూపంలా ఉంది.
అతడ్ని చూసిన గురువు గారు తన ఎదురుగా కూర్చోమని సైగ చేశారు.
గురువు గారి పక్కనే గోడ దగ్గర గుండ్రంగా మడిచిన దర్భాశనాన్ని తెచ్చుకుని గురువు గారి ముందు పరిచి దాని మీద కూర్చున్నాడు పురుషోత్తమ శాస్త్రి.
“నీకు ముందు శబ్దమంజరి నేర్పిస్తాను. అపర కర్మలలో అది ప్రధానమైనది.  ఇందులో ఎవరు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు వంటి క్రియలుంటాయి. అపర కర్మలలో శబ్దమంజరిదే ప్రధాన పాత్ర. దాని తర్వాత పాత్రే మంత్రానిది. శబ్దం మారితే అర్థం మారిపోతుంది రా అబ్బాయ్‌. అందుకని అదే నేర్పిస్తా ముందు. ఆ తర్వాత శోడశ కర్మలు నేర్పుతా” అన్నారు చలపతి గురువు గారు.
అలా అనడమే కాదు… ఒక్కొక్కటి చెబుతున్నారు.
అంతా మౌఖిక విద్యే. రాత కోతలు లేవు.
గురువు గారు చెబుతున్నారు…. పురుషోత్తమ శాస్త్రి వల్లె వేస్తున్నాడు.
తొలి రోజు రెండు గంటల పాటు గురు శిష్యులు ఇద్దరూ ఏకాగ్రతతో ఉన్నారు.
రోజులు గడుస్తున్నాయి. అదే ఏకాగ్రత. అదే పట్టుదల. అదే నిమగ్నత.
ఆరు నెలల తర్వాత ఓ రోజు రాత్రి పన్నెండు అయ్యింది. గురువు చలపతి గారు పెరట్లో లైటు వెలుతురు చూసి అక్కడికి వచ్చారు.
శిష్యుడు పురుషోత్తమ శాస్త్రి తాను నేర్చుకున్న వాటిని  వల్లె వేస్తున్నాడు.
అది చూసిన చలపతి గురువు గారు ఆశ్చర్యపోయారు.
తెల్లవారింది. ఎప్పట్లాగే గురువు గారి ముందు కూర్చున్నాడు పురుషోత్తమ శాస్త్రి.
“ఈవాళ నీకో పరీక్షరా అబ్బాయి” అన్నారు గురువుగారు. పురుషోత్తమ శాస్త్రి ఆయన వైపు కుతూహలంగా చూశాడు.
“ఓ పెద్దాయన చనిపోయారు. ఆయనకి ఎవరూ లేరు. బయట వారే కార్యక్రమం చేస్తున్నారనుకో… అప్పుడు సంకల్పం ఏం చెబుతావు?” అని అడిగారు.
పురుషోత్తమ శాస్త్రి తడుముకోకుండా “స్వర్గస్తులైన వారు పురుషులైతే పోషక పితుహు అని… స్త్రీలైతే పోషక మాతుహు అని చెప్తా గురువు గారు” అన్నాడు.
చలపతి గురువు గారు చాలా ఆనంద పడుతూ…
“శబ్దమంజరిని ఇలా ఆరు నెలల్లో నేర్చుకున్న వారు లేరురా. ఇక నీకు పితృమేథం… అనుక్రమణిక బోధిస్తాను. అవి కూడా త్వరగా నేర్చుకుంటే స్వంతంగానే చేసుకోవచ్చు. ఇన్ని రోజులూ నాకూడా ఉంటూ ఓ వైపు నేర్చుకుంటూ మరోవైపు సహాయకుడిగా ఉన్నందుకు ఇదిగో ఈ పది వేలు తీసుకో” అంటూ ఓ పది వేల రూపాయలు చేతిలో పెట్టారు.
“ప్రతి రోజూ ఏదో రూపంలో సంభావనలు వస్తున్నాయి కదా గురువు గారు…! మళ్లీ ఇప్పుడు ఇవి ఎందుకు” అంటూ నేల చూపులు చూసాడు పురుషోత్తమ శాస్త్రి.
“అవి క్రతువు చేయించుకున్న యజమానులు ఇచ్చినవిరా. ఇది నా సహాయకుడిగా ఉన్నందుకు నీకు నేను ఇస్తున్నది. అమ్మకి పంపు” అన్నారు గురువు చలపతి గారు.
రెండు రోజులు అమ్మ దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పి గురువు గారు ఇచ్చిన డబ్బులతో ఇంటికి బయలుదేరాడు పురుషోత్తమ శాస్త్రి.
***              ***             ***
ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లి, తమ్ముళ్లు ఆనందపడ్డారు. విశాఖపట్నంలో ఎలా ఉందో… ఏం నేర్చుకుంటున్నాడో అన్ని వివరంగా చెప్పిన పురుషోత్తమ శాస్త్రి తల్లి చేతిలో గురువు గారు ఇచ్చిన డబ్బులు పెట్టాడు.
“అప్పుడప్పుడు పంపుతూనే ఉన్నావు కదరా..! మళ్లీ ఇవేమిటి!” అంది తల్లి.
ఈ డబ్బులు గురువు గారి దగ్గర సహాయకుడిగా ఉన్నందుకు ఆయన ఇచ్చిన డబ్బులని, వీటితో ఏదైనా చేయమని చెప్పి తమ్ముళ్ల చదువుల గురించి తెలుసుకుని రెండు రోజుల తర్వాత విశాఖపట్నం వెళ్లిపోయాడు పురుషోత్తమ శాస్త్రి.
కొడుకు ఇచ్చిన డబ్బుల్ని భద్రంగా ఓ పెట్టెలో దాచింది పురుషోత్తం తల్లి.
***             ***            ***
రోజులు త్వర త్వరగా నడుస్తున్నాయి. పురుషోత్తమ శాస్త్రి విశాఖపట్నం వచ్చి రెండేళ్లు దాటింది.
గురువు గారు చలపతి గారి దగ్గర అపర కర్మలకు సంబంధించిన అన్ని క్రియలు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు పురుషోత్తమ శాస్త్రి.
ఓ రోజు తెల్లవారుతుండగా చలపతిగారింటికి ఓ పెద్దాయన, మరో కుర్రాడు వచ్చారు.
వీధరుగు మీద కూర్చున్న చలపతి గారికి నమస్కరించి “గురువు గారు మేం మద్దిలపాలెంలో ఉంటాం. నిన్న రాత్రి నా తమ్ముడు కాలం చేశాడు. మీరు కార్యక్రమం చేయించాలి” అని చలపతి గారితో చెప్పాడు.
కాసేపు నిశ్శబ్దంగా ఉన్న చలపతి గురువు గారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు “నాకు కాస్త నలతగా ఉంది. నా శిష్యుడు పురుషోత్తమ శాస్త్రి వస్తాడు. వాడైతే నేను చేయించినట్లే అంతా. అవును ఇంతకీ పోయినాయన పేరేమిటి” అని అడిగారు.
“మహేష్ గుప్తా అండి. ఇంట్లో హోల్‌సేల్‌ కిరాణా వ్యాపారం. నిన్న రాత్రి గుండెపోటు వచ్చిందండి. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు పోయాడండి” అని చెప్పారు వచ్చిన పెద్ద మనిషి.
గురువు గారికి కాస్త దూరంగా కూర్చుని సంధ్యావందనం పూర్తి చేసుకున్న పురుషోత్తమ శాస్త్రిని తన దగ్గరకు రావాలంటూ పిలిచారు గురువు గారు.
పురుషోత్తమ శాస్త్రి గురువు గారి దగ్గరకు వెళ్లి నిలుచున్నాడు.
“అబ్బాయ్‌. ఈయన మద్దిలపాలెం నుంచి వచ్చారు. వీరి తమ్ముడు కాలం చేశారట. నువ్వు వెళ్లి కార్యక్రమం చేయించు. నాకు కాస్త నలతగా ఉంది” అన్నారు.
ఆ మాటకి పురుషోత్తమ శాస్త్రి “నేనా గురువు గారు!” అన్నాడు.
” ఆ… నువ్వే… బయలుదేరు. వాళ్లు తీసుకువెళ్తారు. కార్యక్రమం తర్వాత రిక్షాలో ఇంటికి వచ్చేయ్‌” అన్నారు.
పురుషోత్తమ శాస్త్రి  “అలాగే గురువు గారు” అన్నాడు. “ఐదు నిమిషాల్లో వస్తానండి” అని అక్కడున్న పెద్ద మనిషికి చెప్పి లోపలకి వెళ్లాడు.
తన వృత్తి జీవితంలో తొలి కార్యక్రమం.
పురుషోత్తమ శాస్త్రికి భయంగా ఉంది.
పురుషోత్తమ శాస్త్రికి కంగారుగా ఉంది.
పురుషోత్తమ శాస్త్రికి కాస్త గర్వంగా ఉంది.
లోపలికి వెళ్లాడు. గబగబా తన సంచీలో ఉన్న రూపాయి బిళ్ల తీసాడు. రెండు నిమిషాలు మౌనంగా ఉన్నాడు. మనసులో ఏదో తలచుకున్నాడు. చేతిలో ఉన్న రూపాయి బిళ్లని బొమ్మా బొరుసు వేశాడు. పైనుంచి కిందకి పడుతున్న రూపాయి బిళ్లని గుప్పిట పట్టాడు. కళ్లు తెరిచి గుప్పిటలో ఉన్న రూపాయి బిళ్లని చూశాడు. అది బొమ్మ చూపించింది. పురుషోత్తమ శాస్త్రి కళ్లు ఓ వెలుగు వెలిగాయి.
ధర్భలతో పాటు కార్యక్రమానికి కావాల్సిన సామాన్లన్నీ సంచిలో సర్దుకున్నాడు. వీధరుగు మీద కూర్చున్న గురువు గారి కాళ్లకి దండం పెట్టాడు. గురువు గారు రెండు చేతులు పురుషోత్తమ శాస్త్రి తల మీద పెట్టి ఆశీర్వదిస్తూ…
“విజయోస్తు. క్రతువంతా శ్రద్ధగా చేయించు” అన్నారు.
పురుషోత్తమ శాస్త్రి వచ్చిన వారితో కలిసి బయలుదేరాడు.
మద్దిలపాలెం ఇంటి దగ్గర కొంత… చావులమదం శ్మశానవాటికలో మరికొంత కార్యక్రమం చాలా నిష్టగా చేయించాడు.
 మిగిలిన రోజులు ఏం చేయాలో.. ఎలా చేయాలో వివరించాడు.
పురుషోత్తమ శాస్త్రి బయలుదేరుతూండగా ఉదయం ఇంటికి వచ్చిన పెద్ద మనిషే పది వేల నూట పదహార్లు పురుషోత్తం చేతిలో పెడుతూ “సాయంత్రం ఇంటికి వస్తా గురువు గారు. ఇతర విషయాలు మాట్లాడదాం” అన్నారు.
ఇంటికొచ్చిన పురుషోత్తమ శాస్త్రి సంభావన డబ్బులు గురువు గారి చేతిలో పెట్టబోతే చలపతి గురువు గారు “ఈ రోజు నుంచి నువ్వు సర్వ స్వతంత్రుడివి. కార్యక్రమాలు నీవే. సంభావనలు నీవే” అన్నారు.
కన్నీళ్లు వస్తూండగా గురువు గారి కాళ్లకి దండం పెట్టాడు పురుషోత్తమ శాస్త్రి.
తొలి సంపాదనలో రెండు వేలు తన దగ్గర ఉంచుకుని మిగిలిన డబ్బులు తల్లికి మనియార్డర్‌ చేశాడు పురుషోత్తమ శాస్త్రి.
***           ***              ***
వయోభారం… అనారోగ్యాలతో చలపతి గురువు గారు వృత్తిని పూర్తిగా వదిలేశారు.
గురువు గారి కుటుంబాన్ని పురుషోత్తమ శాస్త్రే చూసుకుంటున్నాడు.
పురుషోత్తమ శాస్త్రి పేరు విశాఖపట్నం అంతా మారుమోగుతోంది.
డబ్బున్న వాళ్ల ఇంట్లో కార్యక్రమం అయితేనే డబ్బులు తీసుకుంటాడని, లేని వారి ఇంట్లో ఎవరు చనిపోయినా అతనే సొంత డబ్బులతో కార్యక్రమాలు చేయిస్తాడని ఊరు వాడా తెలిసిపోయింది.
పురుషోత్తమ శాస్త్రి కింద ఓ ఐదారుగురు శిష్యులు కూడా చేరారు.
పురుషోత్తమ శాస్త్రి చేతి నిండా పనే కాదు డబ్బులు కూడా ఆడుతున్నాయి.
తాను విశాఖపట్నం వచ్చిన ఈ ఐదేళ్లలో సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం తల్లికే పంపుతున్నాడు. ఊర్లో తల్లి ఆ డబ్బుల్ని పిల్లల చదువులకు కొంతా… ఇంటి అవసరాలకు కొంత ఖర్చు చేసి మిగిలింది పోస్టాఫీసులో దాస్తోంది.
***              ***             ***
ఓ రోజు కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన అరగంటకి పోస్ట్‌మాన్‌ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. తల్లి రాయించిన ఉత్తరం అది. క్షేమ సమాచారాల తర్వాత ఆ ఉత్తరంలో…
“బాబూ… నాయుడిగారి ఆరోగ్యం బాలేదు. వైద్య ఖర్చుల కోసం పొలం అమ్మకానికి పెట్టారని తెలిసింది. నువ్వు ఓసారి వస్తే ఆ విషయం మాట్లాడదాం” అని ఉంది.
పురుషోత్తమ శాస్త్రి అయ్యో అనుకున్నాడు. చాలా బాధ పడ్డాడు. వస్తానని ఉత్తరం రాయడం కంటే వెళ్తేనే మంచిదని నిర్ణయించుకున్నాడు.
శిష్యులని పిలిచి తాను ఒక్క రోజులో వస్తానని… కార్యక్రమాలు జాగ్రత్తగా చేయించమని పురమాయించి అమలాపురం బయలుదేరాడు.
***               ***            ***
ఇంటికి వచ్చిన పురుషోత్తమ శాస్త్రి మధ్యాహ్నం భోజనం తర్వాత తల్లి, ఆఖరి తమ్ముడు రాంబాబుతో పాటు కలిసి సుబ్రహ్మణ్య శాస్త్రి ఇంటికి వెళ్లారు.
అప్పటికే భోజనం చేసి అరుగు మీదున్న మంచం మీద నడుం వాల్చారు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ ముగ్గురి రాకను గమనించిన ఆయన లేచి కూర్చున్నారు.
“తల్లీ కొడుకులు ఇలా వచ్చారేంటి?!. ఏరా పురుషోత్తం విశాఖపట్నంలో బాగుందటగా. వింటున్నాను నీ గురించి. సంతోషం” అంటూ లేచి కూర్చున్నారు.
పురుషోత్తమ శాస్త్రితో పాటు తల్లి, తమ్ముడు రాంబాబు కూడా ఆయనకి నమస్కారం చేసి మంచం ఎదురుగా ఉన్న చెంచీ మీద కూర్చున్నారు.
“మీ దయ వల్ల అంతా బాగానే ఉందండి” అన్నాడు పురుషోత్తమ శాస్త్రి.
“ఏంటీ సంగతి. ఇలా వచ్చారు” అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి.
“అదే నాయుడి గారికి బాగోలేదని తెలిసింది. పైగా ఆయన పొలం అమ్మకానికి పెట్టారని తెలిసింది. మీ ద్వారా ఆ భూమి కొందామనుకుంటున్నాం” అని చెప్పింది పురుషోత్తం తల్లి.
ఈ మాటతో కాస్త కంగారు పడి ఆ తర్వాత సర్దుకున్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి.
“మంచి ఆలోచనే. నేనేం చేస్తాను” అన్నారు.
“మీరూ.. నాయుడు గారు మంచి స్నేహితులు కదా! ఓ మాట వేస్తారని” అన్నాడు పురుషోత్తమ శాస్త్రి.
“సరే. అలాగే చెబుతాను. ఇద్దరూ కావల్సిన వాళ్లేనాయే. సాయంత్రం రండి వెళ్దాం” అన్నారు.
ఆ మాటతో ముగ్గురు వెనక్కి వచ్చేశారు.
***               ***                       ***
సాయంత్రం ఐదు గంటలైంది. సూర్యుడు పొద్దు వాల్చేందుకు సిద్ధమవుతున్నాడు.
సుబ్రహ్మణ్య శాస్త్రి ఇంటికి బయలుదేరడానికి ముందు పురుషోత్తమ శాస్త్రి దేవుడి గదిలోకి వెళ్లాడు. అక్కడున్న దేవుడి పటాలకి దండం పెట్టుకున్నాడు. జేబులోంచి తన దగ్గరున్న రూపాయి నాణెం తీసాడు.
గాల్లోకి బొమ్మా … బొరుసు వేశాడు. నాణం గాల్లోంచి వచ్చి పురుషోత్తమ శాస్త్రి గుప్పిట్లో పడింది.
ఓ పది సెకన్లు కళ్లు మూసుకున్నాడు. కళ్లు తెరిచాడు. రూపాయి నాణాన్ని చూశాడు. అది బొమ్మ చూపించింది.
పురుషోత్తమ శాస్త్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలాడు.
సంతోషంతో చిరునవ్వు నవ్వాడు.
తల్లితో, తమ్ముడి రాంబాబుతో కలిసి సుబ్రహ్మణ్య శాస్త్రి ఇంటికి బయలుదేరారు.
అప్పటికే వారి రాక కోసం ఎదురుచూస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ ముగ్గురితో కలిసి నాయుడి గారి ఇంటికి వెళ్లారు.
పురుషోత్తమ శాస్త్రి చేతిలో మూడు గుర్రాల బీడీ ప్రకటన ఉన్న సంచీ ఉంది.
నాయుడు గారు అరుగు మీద ఉన్న పడక్కుర్చీలో కూర్చున్నారు. వీళ్ల రాకను గమనించి లోపలి నుంచి మూడు కుర్చీలు తెప్పించారు. ఆయన పక్కనే మరో కుర్చీ ఉంది.
నాయుడి గారికి నమస్కరించారు పురుషోత్తమ శాస్త్రి, రాంబాబు. వారి తల్లి మాత్రం చీరకొంగు భుజాల మీంచి కప్పుకుని నిలబడే ఉంది. సుబ్రహ్మణ్య శాస్త్రి బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయాడు.
“ఏమ్మా ఇలా వచ్చారు. అంతా బాగానే ఉందా.. ఏదైనా పనుండి వచ్చారా?” అన్నారు నాయుడు గారు.
ముందుగా ఎవరో మాట్లాడాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తల్లీ, పిల్లలు.
“అదే మీ పొలం అమ్ముతున్నారని తెలిసిందట. దాని గురించి మాట్లాడదామని వచ్చారు వీళ్లు” అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి.
“అవునా… వచ్చిన వాళ్లంతా నా పరిస్థితి చూసి అయిన కాటికి పట్టుకుపోదామనుకుంటున్నారు. పరిస్థితులేం బాగోలేవు. నిజమే. కానీ ఎంతో కొంత చేతిలో పెడితే ఎలా ఇచ్చేస్తాను. అదే ఆలోచిస్తున్నా” అన్నారు నాయుడు గారు.
అప్పుడు నోరు తెరిచాడు పురుషోత్తమ శాస్త్రి. “అయిన కాడికి కాదండి. మీకు నచ్చితేనే కొంటాం” అన్నాడు.
అతను అలా అనగానే నాయుడి గారి ముఖం కాస్త విప్పారింది. “మూడు ఎకరాలుంది. ఎంత తీసుకుంటారు” అన్నారు.
“మొత్తం అంతా తీసుకుంటాడండి మా వాడు. ముందు ఎంతో చెబితే” అన్నారు పురుషోత్తం తల్లి.
 ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుబ్రహ్మణ్య శాస్త్రి వంతు అయ్యింది.
ఇది కొనే బేరం కాదులే అనుకున్నారు నాయుడు గారు మనసులో…
“ఎకరం నాలుగు లక్షలు. మూడున్నర అయినా ఇచ్చేస్తా. గోదావరి ఒడ్డునే ఆనుకుని ఉన్న పొలం. కానీ ఏం చేస్తాం. పరస్థితులు అలాంటివి” అన్నారు నాయుడు గారు.
“ఒకప్పుడు నాయుడు గారే గ్రామంలో అన్నీను. కాల మహిమ. బళ్లు వోడలయ్యాయి… వోడలు బళ్లు అయ్యాయి” అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి.
అక్కడ ఓ ఐదు నిమిషాలు నిశ్శబ్దం.
ఎవరూ ఏం మాట్లాడడం లేదు.
పురుషోత్తమ శాస్త్రికి మాత్రం లోపల పొలం కొనేయాలని ఉంది.
తల్లి వైపు చూశాడు. తమ్ముడు రాంబాబు వైపు చూశాడు.
సుబ్రహ్మణ్యం గారు మాత్రం లోలోపల ” ఇది అయ్యే పని కాదులే” అన్నట్లు పురుషోత్తమ శాస్త్రి వైపు చూశారు.
“అంటే మూడెకరాలు పన్నెండు లక్షలన్న మాట” అన్నాడు రాంబాబు.
“అన్నమాట కాదు.. ఉన్న మాటే. మీ వల్ల కాదేమో” అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి.
పురుషోత్తమ శాస్త్రి చేతిలో ఉన్న సంచీలోంచి డబ్బులు తీసాడు. వాటిని రాంబాబు చేతిలో పెట్టాడు.
నాయుడి గారిని, సుబ్రహ్మణ్య శాస్త్రిని మార్చి మార్చి చూస్తూ…
“ఖాయం. మూడెకరాలు నాలుగు లక్షల చొప్పున పన్నెండు లక్షలు ఇస్తాం. ఇదిగో ముందుగా లక్ష రూపాయలు బయానా” అని రాంబాబు వైపు చూసి…
“నాయుడి గారికి ఈ లక్ష ఇవ్వరా రాంబాబు” అని డబ్బుల కట్ట తమ్ముడి చేతిలో పెట్టాడు.
ఊహించని ఈ పరిణామానికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, నాయుడు గారికి నోట మాట రాలేదు.
కొంత సేపటికి నాయుడు గారే తేరుకుని “మరి కాగితాలు అవి రాసుకోవాలి కదా” అన్నారు.
“మీ మాటే కాగితం. అంతకు మించి ఇకేం కాగితాలు అవసరం లేదు. వారం, పది రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకుందాం. ఈలోగా మీకు ఇంకొంచెం డబ్బులు కావాలంటే పంపిస్తా. వెళ్తాం” అంటూ ముగ్గురూ వెనక్కి తిరిగారు. పురుషోత్తమ శాస్త్రి తల్లి మనసు శాంతించినట్లుగా ఉంది.
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి గర్వంగా లేదు
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి పొగరుగా లేదు
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి గెలిచామని లేదు
అలా నడిచి వెళ్తున్న రాంబాబుకి కడుపు నిండినట్లుగా మాత్రమే ఉంది.
 ***               ***                       ***

ముక్కామల చక్రధర్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎదురొచ్చే కష్టాలను ఎదిరించి తల ఎత్తుకు నిలబడతావో
    ఆ కష్టాలనే భరిస్తూ కన్నీటి అలల్లో కొట్టుకుపోతావో

    బొమ్మ బొరుసు జీవితానికి దిక్సూచులైతే వాటిని నడిపే నావికుడే వీరుడు
    అవకాశాలు లేవంటూ నిట్టూర్పులు విడుస్తున్న ఎందరికో కనువిప్పు ఈ కథ
    ఇప్పటిదాకా గుండెని తడిచేసిన మా చక్రధర్ గారు ఇప్పుడు గుండెనిండా ధైర్యాన్ని ఇచ్చారు

    • చాలా బాగా చెప్పారు పవన్. ఈ కథ ఎందరికో స్ఫూర్తి

  • ముక్కామల చక్రధర్ గారి ‘బొమ్మ పడింది’ కథ, అవమానాలనే

    మెట్లుగా చేసుకుని ఆత్మగౌరవంతో ఎదిగిన పురుషోత్తమ శాస్త్రి జీవిత

    ప్రయాణానికి అద్దం పడుతుంది.

    చిన్ననాటి ఆకలి, పేదరికం, అవమానాల మధ్య మొలకెత్తిన

    పట్టుదల, గురువు ఆదరణతో సేవాభావంగా వికసించడం

    హృద్యంగా చిత్రించారు.

    రూపాయి బిళ్లలోని ‘బొమ్మ’ కేవలం అదృష్టానికి సంకేతం కాదు—

    ఆత్మవిశ్వాసానికి, ఆశకు, జీవితంపై నమ్మకానికి ప్రతీక.

    తనను అవమానించిన వారిపట్ల ప్రతీకారం కాకుండా, కష్టకాలంలో

    ఆదుకునే ఔదార్యాన్ని చూపిన కథానాయకుడి వ్యక్తిత్వం కథకు

    అసలైన బలాన్ని చేకూరుస్తుంది.

    చదివాక కథ ముగుస్తుంది… కానీ మనసులో మిగిలే మానవత్వపు

    ముద్ర మాత్రం చెరిగిపోదు!

  • కథ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. బళ్ళు ఓడలు,ఓడలు బళ్ళు అవుతాయి అంటే ఇదేనేమో. బ్రహ్మల పరిస్థితులు చాలా బాగా వివరించారు. రొసిన రచియితకు, ప్రచురించిన మీ కూ అభినందనలు

  • ఇది జీవితం తాలూకు మహత్తు.
    ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు ఔతాయి.
    బ్రాహతమణుడి ఆభిజాత్యం నిలబెట్టిన కథ.తిలలు దర్భలు ఏంచేస్తాయో తెలిసి ఉంటుంది నాయుడు గారికి.
    నేను స్వయం గా చూసిన పాత్రలు, పాత్ర ధారులు….. గువ్వల చెన్నా!

  • ఆ రూపం… పట్టుదలకు ప్రతిరూపంగా ఉంది.
    ఆ రూపం… అవమానాలు జయించేందుకా అన్నట్లు ఉంది.
    ఆ రూపం… విజయానికి మరో రూపంలా ఉంది

    చాలా బాగుంది. ఈ వాక్యాలు విజయం కోసం తపిస్తున్న వారికి ప్రేరణను కలుగజేస్తున్నాయి.

    ఎక్కడైతే అవమానించారో అక్కడే గెలవాలి అనే కసిని పెంచేలా ఉంది రచన. మీకు ధన్యవాదాలు

  • చాలా బాగా రాశారు, కళ్ళకి కట్టినట్టు రాశారు. 👏👏👏👏🙏🏼
    చక్రధర్ గారికి అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.