తంత్రము

ఎన్నాళ్ళు కొట్టుకున్నా యే గిన్నీసు బుక్కూ యెక్కడం లేదన్నట్టు యీసారి యిద్దరూ జుత్తుకు రక్తం వచ్చినట్టు కొట్టుకున్నారు. తారాస్థాయిలో వుంటే గాని తారాస్థాయికి చేరుకోలేమని అనుకున్నారో యేమో మనకు తెలీదు.

వస్తాదులు కాదు, కానీ కుస్తీపట్లుకి దిగారు. వాళ్ళిద్దరూ శత్రువులు కాదు, కాని శత్రువు వుండడం వల్ల లైఫ్‌లో అలర్ట్‌గా వుండే అవకాశమూ- కాంపిటేటివ్‌గా వుండే స్పిరిటూ- వుంటాయని యెరిగినవాళ్ళు. శత్రువే మన గ్రోతూ గ్రాఫూ అని నమ్మినవాళ్ళు. అసలు సిసలు శత్రువులతో తలపడడం తలకాయనొప్పని తెలిసినవాళ్ళు. అంచేత వాడెవడినో శత్రువుగా ప్రకటించి వాడికేదో క్రెడిటిచ్చి నష్టపోవడం కంటే, ఆ ఆఫర్ని తామే వాడేసుకొని వొకరికొకరు శత్రువులుగా ప్రకటించేసుకున్నారు. ఈ శత్రుత్వంవల్ల చిత్రంగా వాళ్ళమధ్య కనపడని మిత్రుత్వం కూడా పెరిగింది.

అయినా వాళ్ళిద్దరూ యెక్కడ వుంటే అక్కడే గోదా. పిడికిళ్ళు బిగించండం… పిడిగుద్దులు గుద్దుకోవడం… తెలిసిన కథేనని- యెప్పుడూ వున్న కథేనని- యింట్లోవాళ్ళూ వీధిలోవాళ్ళూ ఆందోళన పడడం మానేసి, చూడక తప్పని వేడుకనుకొని చూసేవారు.

అలా యెప్పుడు పడితే అప్పుడు వీధికెక్కి తిట్టుకొని కొట్టుకోవడం వల్ల వాళ్ళిద్దరూ జనం దృష్టిని బహుచక్కగా ఆకర్షించేవాళ్ళు. ఆ విధంగా యెప్పుడూ చర్చల్లో వుండి లైం లైట్లో కనిపించేవాళ్ళు. అసలు లైం లైట్లో వుండడం కోసమే వొకరిని వొకరు యెత్తి కుదేసుకుంటున్నారని అనుకున్నవాళ్ళూ లేకపోలేదు. అవన్నీ చాటు మాటు మాటలు కాని, గోదాలో నిలబడి యిద్దరూ కొట్టుకుంటూ వుంటే యెంతకాదన్నా చూసేవారికి కన్నుల పండగగా వుండేది. అంచేత చుట్టూ చేరినవాళ్ళు యేమీ చెయ్యలేక చెరో పక్షం చేరి యిద్దర్నీ యెంకరేజ్ చేసేవారు.

ఊళ్ళల్లో మనుషులు రాజకీయపార్టీలుగా చీలిపోయినట్టు యిక్కడా రెండుగా చీలిపోయేవారు. ఇంకా చెప్పాలంటే, మనలో మన మాట… యెవరి వాళ్ళవైపు వాళ్ళు. ఎవరి కులం వారికి బలం. ఎవరి కులం వారికి వెన్ను దన్ను. మించి అండా దండా.

ఎన్నాళ్ళు కొట్టుకున్నా యే గిన్నీసు బుక్కూ యెక్కడం లేదన్నట్టు యీసారి యిద్దరూ జుత్తుకు రక్తం వచ్చినట్టు కొట్టుకున్నారు. తారాస్థాయిలో వుంటే గాని తారాస్థాయికి చేరుకోలేమని అనుకున్నారో యేమో మనకు తెలీదు.

కొట్టుకోవడం కాదు కాని వొళ్ళు పులిసి పచ్చి పుళ్ళయ్యాయి. ఎముకలు పిండి పిండయ్యాయి, మిల్లాడించినట్టు. కాకపోతే వొకడికి కుడిపక్క పన్ను వూడితే యింకొకడికి యెడమపక్క పన్ను వూడింది. ఆపాటి తేడా తప్ప మరేపాటి తేడా లేదు. ఎప్పటిలాగానే వంతులవారీగా గెలుపోటమిలు సరే యెలాగో పంచుకున్నారు. అందుకు కాదు వాళ్ళు బాధ పడింది. మరి?

ఇద్దరు కొట్టుకు చస్తూవుంటే యేమీ పట్టనట్టు ‘యెంకడు’ వుండడం యెర్రెక్కించింది. కిర్రెక్కించింది. “తనకో… తన శత్రువుకో యెవరికో వొకరికి మద్దతు పలకాలి కదా?” అని తెగ గింజుకున్నారు. ఎప్పుడూ యెడ్డిమంటే తెడ్డిమని భిన్నాభిప్రాయం కలిగిన ఆ పరమ శత్రువులిద్దరూ యీ విషయమై యేకాభిప్రాయానికి వచ్చి వుమ్మడిగా వాపోయారు. ఒంటిమీది దెబ్బలకన్నా, కొట్టకుండా కొట్టిన యెంకడిదెబ్బ యిద్దరిలోనూ మంటను పెంచింది. దాంతో వాళ్ళిద్దరూ తగిలిన దెబ్బలకు వొకరి వొంటికి వొకరు కాపడం పెట్టుకుంటూ మనసులోది దాచుకోలేక బయటపెట్టుకున్నారు.

“నిన్ను సమర్ధించినవాళ్ళమీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు,” అని వొకడు అంటే, “నాకూ లేదు,” అని మరొకడు అన్నాడు. “అయినా, నన్ను విభేదించడం అంటే… నిన్ను సమర్ధించడం! నిన్ను విభేదించడం అంటే… నన్ను సమర్ధించడం!” అని ఆ శత్రువులిద్దరూ అనుకున్నారు, ఫాన్స్ యెక్కడైనా వుంటారన్నట్టు. ఆ విధంగా యేదో విధంగా యెటో వొక వేపు వుండడంలో యే పూచీ పేచీ కనిపించలేదు వాళ్ళకి. ఎటూ వుండని యెంకడ్ని చూస్తే మటుకు రక్తం సలసలా కాగిపోయింది… యిద్దరికీ!

యెంకడు తమ వునికిని గుర్తించడంలేదని ఆ యిద్దరికీ బోధ పడిపోయింది. తామంటే తమ వునికే! ‘తమ వునికిని రద్దు చేయడం కాకపోతే యేమిటిది?’ అని అనుకున్నారు యిద్దరూ. అసలు తమ వునికిని రద్దు చేయడమంటే, తమ మీద యుద్ధం ప్రకటించడంగానే భావించి కూడబలుక్కొని కయ్యానికి కాలుదువ్వారు శత్రువులిద్దరూ కలిసి.

మొత్తానికి శత్రువులిద్దరూ కలిసి కాపుకాసి యెంకడ్ని పట్టుకున్నారు. “నీకేమయింది?” అని కాలరు పట్టుకు నిలదీశారు. అర్థం కాని అయోమయంతో తలడ్డంగా వూపాడు యెంకడు. “నువ్వు యెవరి పక్షం?” స్ట్రెయిట్‌గా అడిగారు. ఇద్దరి వంకా చూశాడు, యేమంటే యేమి కొంప ములుగుతుందో అన్నట్టు. “వాడి పక్షమా?” యిద్దరూ వొకేసారి అడిగారు. కాదన్నట్టు తలడ్డంగా వూపి… అవునన్నట్టు తలను వూపి… మొత్తానికి అడ్డదిడ్డంగా వూపాడు.

శత్రువులిద్దరూ వొకరి ముఖాలు వొకరు చూసుకున్నారు.

ప్రమాదం పసిగట్టిన యెంకడు “నేను యిద్దరి పక్షమూ,” అన్నాడు.

“మరి నువ్వు మా యిద్దర్నీ యెంకరేజ్ చెయ్యలేదు,” శత్రువులిద్దరిదీ వొకటే మాట.

“ఒకరికి మద్దతిస్తే మరొకరికి కోపం వస్తుందని…” అన్నాడు యెంకడు మాటని మింగేస్తూ.

“అలా అని యిద్దరికీ మద్దతు యివ్వలేదు కాబట్టి మా యిద్దరికీ నీమీద కోపం వస్తోంది…” అని శత్రువులిద్దరూ కళ్ళూ పల్లూ బిగించారు.

“అయితే మీరిద్దరూ వొకటైపోయారా?” ఆశ్చర్యంగా నమ్మలేనట్టు చూస్తూ అడిగాడు యెంకడు.

“మేమెప్పటికీ శత్రువులమే,” అని యిద్దరూ అరిచి వొకేలాగ చెప్పారు. చాలదన్నట్టు వొకరి వంక వొకరు కోపంగా చూస్తూ బుసలు కొడుతూ జబ్బలు చరుచుకున్నారు, యెప్పటిలాగే.

యెంకడు చాలా వేగంగా చాలా దూరం ఆలోచించాడు. ‘అంటే… వొకడు మన జోలికి వస్తే, మరొకడు అడ్డుకుంటాడన్నమాట…’ ఆ వూహతో చాలా ధైర్యం వచ్చింది.

“ఇంతకీ యేమంటారు?” అన్నాడు యెంకడు, తల విసురుతూ. పొగరు చూపులు చూస్తూ. అప్పుడు వొకడు యెంకడి కుడి దవడ మీద లాగి వొక్క గుద్దు గుద్దాడు. శత్రువులు కదా… యిద్దరికీ పడదు కదా… వొకడు కొడితే యింకొకడు అడ్డుకుంటాడని యెంకడు వూహించాడు కదా, కాని అప్పుడే యింకొకడు యెంకడి యెడమ దవడ మీద లాగి వొక్క గుద్దు గుద్దాడు. అలా చెరో రెండేసి పల్లు వూడగొట్టారు యిద్దరూ. మిగిలిన పల్లన్నీ కదిలిపోయాయి. అక్కడితో అయిపోలేదు వొకడు కుడిచెయ్యి పట్టుకు తిప్పితే, రెండోవాడు యెడమచెయ్యి పట్టుకు తిప్పాడు. ఒకడు కుడిపక్క పొట్టలో గుద్దితే, రెండోవాడు యెడమపక్క పొట్టలో గుద్దాడు. వీపుని కూడా వొకరు యెక్కువ మరొకరు తక్కువ కాకుండా సమానంగా వాటాలేసుకున్నట్టు చక్కగా పంచుకున్నారు, చెరోపక్క చేసి… చెయ్యి వేసి.

బుర్ర గిర్రున తిరిగింది యెంకడికి. ‘ఎవరి జోలికీ వెళ్ళకపోతే, నీ జోలికి యెవరూ రారు’ అని చెప్పిన నాయినమ్మ పీక నొక్కేయాలనిపించింది. ఆవిడ పైకి పోయింది. ‘నన్నూ పైకి పంపేలా వున్నారు, అక్కడికి వచ్చి నీపని చెప్తానుండు’ అని కసిగా పైకి చూస్తూ అనుకున్నాడు. ‘నువ్వు యెవరి జోలికీ వెళ్ళకపోతే, నువ్వే అజాత శత్రువు’ నాయనమ్మ మాటలు వొకవైపు కుల్లబొడుస్తూ వుంటే- 

మరోవైపు ‘నువ్వు యెన్ని కొడుతున్నావో కొట్టు… అంతకు తక్కువ కొట్టను నేను’ అని భీష్మించుకున్నట్టు కొడుతున్నారు శత్రువులిద్దరూ, పోటీ పడి. ఉమ్మడి శత్రువుని చేసి. మొత్తానికి చితకబాదేశారు. ఈ విషయం మూడోకంటికి తెలియక పోవచ్చు, కాని రెండు కళ్ళున్న అందరికీ తెలిసిపోయింది… చెవుల ద్వారా.

ఊళ్ళోవాళ్ళు అయ్యో అనలేదు. ఎవరూ అదేమని అడగలేదు. ఆ విధంగానైనా శత్రువులిద్దరూ వొక్కటయ్యారని సంతోషపడినట్టున్నారు.

చచ్చీజావులయిపోయిన ‘యెంకడే ఆ యిద్దరు శత్రువులకూ వున్న వొక్కగానొక్క యేకైక శత్రువు’ అని జనం గుసగుసలాడుకున్నారు. అదే విషయం క్షణాల్లో ప్రచారమయిపోయింది. 

ఏ గొడవలకూ గొల్లుకూ పోని యెంకడిలో ‘యింతుందా?’ అని వూరంతా గుసగుసలాడుకొని ముక్కున వేలేసుకున్నారు. ముక్కు కింద వున్న నోరు వూరుకుంటుందా? ఊరుకోలేదు. అలా ఆ నోటినుండి యీ నోటికీ యీ నోటి నుండి ఆనోటికీ చేరింది కథ. ఆ కథకి యెవరు చేర్చాల్సింది వారు చేర్చారు. కల్పన కమ్మగా వుండేసరికి అది తమ కళ్ళతో చూశామన్నంత భ్రమకు లోనయ్యారు. “లేదు, మేం మా కళ్ళతో చూశాం,” అని కొందరంటే, “అవునవును మేమూ చూశాం,” అని మరికొందరన్నారు. “చూడనిది యెవరు?” అని యింకొందరు ప్రశ్నించారు కూడా.

అలా కొత్త కతలూ పుట్టుకొచ్చాయి. అందులో వొక కథ మళ్ళీ యెంకడి ప్రాణాల మీదికి తెచ్చింది. ‘వొక్కొక్కడే వస్తే, శత్రువులిద్దర్నీ దుమ్ము రేగగొట్టేవాడని, యిద్దరూ కలిసి రావడం వల్ల యెంకడికి ఆపాటి దెబ్బలు తగిలాయని…’ యీ మాట గాలిలో కలిసి శత్రువులిద్దరికీ చేరింది.

శత్రువులిద్దరూ ఆగలేక కలుసుకున్నారు. ఈసారి తలపడడానికి కాదు, తలపోసుకోవడానికి.

“ఒక్కొక్కడ్నీ దుమ్ము రేగ్గొడతాడట… రేగ్గొట్టించుకుందామా?” వొకడు అడిగాడు. “నాకూ ఆల్రెడీ రేగిపోయుంది… కొట్టించుకుందాం!” అన్నాడు మరొకడు. శత్రువులిద్దరికీ వొక్కసారిగా వుగ్గబట్టలేనంత నవ్వొచ్చింది. నవ్వి నవ్వి అలసిపోయారు. కాని ఆ నవ్వు ముఖాల్లో యేడుపు ముఖాలే కనిపించాయి, వొకరి ముఖాల్లో వొకరికి.

“కాని, వూరి జనం కూడా నమ్ముతున్నారు…” అన్నాడు వొకడు, గొంతు తగ్గించి. “ముందు మనం నమ్ముతున్నామా లేదా?” అన్నాడు మరొకడు, చాలా సీరియస్సుగా. శత్రువులిద్దరూ వొకరి కళ్ళలోకి వొకరు చూసుకున్నారు. తరువాత ఆలోచనలో పడ్డారు. ‘ఇంతకీ యెంకడు మనతో గెలిచాడా? వోడిపోయాడా?’ అన్న అనుమానం యిద్దరికీ వచ్చింది. ‘మనం కొడితే, తిరిగి కొడితే కదా… గెలిచినట్టో వోడినట్టో?’ సందేహం యిద్దరికీ కలిగింది. ‘కొట్లాటకే దిగనివాడు గెలవడం సరే, వోడిపోవడమైనా యెలా వోడిపోతాడు?’ సందిగ్ధం యిద్దరికీ వచ్చింది. ‘అలాగయితే గాంధీగారు కర్ర తిరగేసి వొక్కడి నెత్తీ బద్దలు కొట్టలేదు, దెబ్బలు కాశాడు. కాని గెలిచాడు కదా?’ యిద్దరూ వొక్కలాగే ఆలోచించారు. ‘శత్రువులిద్దరూ సరిగ్గా జతపడ్డారు’ అని వూరు అన్నది అనుకున్నదీ అందుకే.

“అలా చూస్తే, యెంకడు గెలిచినట్టే,” వొకేమాట యిద్దరి నోళ్ళలోంచి వొకేసారి వచ్చింది.

అందుకు అంగీకారం లేనట్టు వొప్పుకోలేనట్టు శత్రువులిద్దరూ అడ్డంగా తలలు వూపారు.

“అయితే ఆడ్ని వోడించి వద్దాం,” వెంటనే సిద్ధమైపోయాడు వొకడు.

“ఇప్పుడు కాదు, వాడు తేరుకోవడానికి కొంత టైమిద్దాం. ఇప్పుడే కొట్లాడితే కక్ష పెట్టుకొని కొట్టాం అంటారు,” అని మరొకడు అన్నాడు.

అలా అప్పటికి ఆగిపోయారు. కాని వూరివాళ్ళ నోళ్ళు ఆగలేదు. శత్రువులిద్దరూ భయపడ్డారన్నారు. యెంకడి దెబ్బ తట్టుకోలేరన్నారు. రుచి చూసిన అనుభవం యెక్కడికి పోతుందని నవ్వారు. అందుకే వెనక్కి తగ్గారన్నారు. పిరికి సన్నాసులన్నారు. పిత్తబోయి చిరుక్కున్నారని కూడా అనేసారు.

యెంకడు కూడా యే వొక్క దాన్నీ కాదనలేదు, ఖండించలేదు. ఆ కట్టు కథలు వినడానికి కమ్మగా వుండేవి. భగవంతుడి దయ తనమీద వుండడం వల్లే యుద్ధం చెయ్యకుండా వీరుడిని శూరుడిని అయ్యానని అనుకొని మురిసిపోయేవాడు. కొందరు ‘యివన్నీ నిజమేనా?’ అని అడిగేవారు. కాదని చెప్పేవాడు కాదు. నవ్వేవాడు. తన గొప్పతనం చెప్పుకోవడం కూడా యెంకడికి యేమాత్రం యిష్టం లేదని- చాలా గొప్పవాడని- జనాలు కీర్తించారు.

ఒకరి కీర్తి అంటే మరొకరికి అపకీర్తి అన్నట్టే కదా, శత్రువులిద్దరికీ అదే దక్కింది. ఎప్పటిలా తామిద్దరూ కొట్టుకు చచ్చినా యెవరూ చూడడం లేదు. దాంతో నిద్రపోయిన దెయ్యాల్ని లేపినట్టయింది. ఊరుకున్నోళ్ళమీద వుచ్చబోసి వుసిగొల్పినట్టయింది. యుద్ధం ఆపడానికి లేదని అర్థమైపోయింది. ఇంత బతుకూ బతికి యింటి యెనకాల చచ్చిపోయినట్టు వుండకూడదని బోధపడిపోయింది.

జనం మనమీద పడిపోవడం కన్నా మనం యెంకడి మీద పడిపోవడమే మేలు అనుకున్నారిద్దరూ.

“ఏదో వొకటి చేసి గొడవ పెట్టుకుంటాం సరే, ఆ నా కొడుకు తిరగబడి కొట్టాలి కదా? కొట్లాటకి దిగాలి కదా?” అన్నాడు వొకడు.

“రెచ్చగొట్టి దింపుదాం…” అని మరొకడు అంటే, “మనిషే కదా?” అని రెండోవాడు అంతే నమ్మకంగా అన్నాడు. ఆ తరువాత తలలూపి యిద్దరూ నవ్వుకున్నారు. కాని ఆ నవ్వు అప్పటికప్పుడే మాయమయ్యింది.

నిశ్శబ్దం ఆవరించింది.

“ఊరు నమ్మింది నిజమవుతుందంటావా?” వులిక్కిపడుతూ అడిగాడు వొకడు. “ఏమిటి?” అని అడిగాడు రెండోవాడు. “వాడు మనిద్దర్నీ…” ఆగిపోయాడు అవతలివాడు. “ఏమిటి?” మళ్ళీ అడిగాడు యివతలివాడు. “మనం యిద్దరం వేరుగా వొంటరిగా వెళితే?” యిద్దరి నోళ్ళలోంచి వొకేమాట.

ఆ శత్రువులిద్దరి కళ్ళల్లో అనుమానం. అది యెంకడి గురించి కాదు. తమ గురించి. ఇంతకాలం వొకర్ని వొకరు శత్రువుగా మలచుకోవడంలో నిలుపుకోవడంలో తంత్రాలు పన్నడంలో పిడిగుద్దులు గుద్దుకోవడంలో కాయడంలో గెలుపోటములు పంచుకోవడంలో యెంతెంత శ్రమ పడ్డారని… మరెంతెంత కృషి చేశారని… కాని, తమ శత్రుత్వానికి మూడో మనిషి అర్థం చెప్పడమే యెటొచ్చీ అర్థం కాలేదు.

“సరే, తినబోతూ రుచెందుకు?” అన్నాడు వొకడు. “తన్నబోతూ రుచెందుకు వోకె. కాని కాయబోతూ… అనుకుంటేనే…” మరొకడు ఆగిపోయాడు. “అంత బలవంతుడా?” అని అంటే, “యిద్దరం కొడితే తట్టుకున్నాడుగా?” అని అనుకొని- “నిజంగానా?” యిద్దరూ వొకేసారి వొకర్ని వొకరు అడిగారు.

ఇద్దరూ వొక నిర్ణయానికి వచ్చినట్టు ఆ రాత్రి యెంకడి కోసం వెతికారు. ఎక్కడికి పోతాడు? యెంకడు సులువుగానే దొరికాడు. మునిపటిలా కాలర్ పట్టుకోలేదు. ప్రశ్నలూ వెయ్యలేదు. జవాబులూ కోరలేదు. లోపల భయాన్ని దాచుకొని ధైర్యంగా చూశారు శత్రువులిద్దరూ. యెంకడిదీ అదే పరిస్థితి.

“ఏమయ్యింది?” అడిగాడు యెంకడు.

శత్రువులిద్దరూ మాట్లాడలేదు. ముఖాముఖాలు చూసుకున్నారు. ‘ఏమిటి?’ అన్నట్టు తల యెగరేశాడు యెంకడు. ‘ఏమీలేదు’ అన్నట్టు తలను అడ్డంగా వూపారు శత్రువులిద్దరూ.

“ఒత్తినే రారుగా?” అన్నాడు యెంకడు.

పెద్దగా గాలి పీల్చుకొని “నిన్నొకటి అడగాలి,” అన్నారిద్దరూ వొకేసారి. ఒక్కక్షణం అనుమానంగా చూసి “అడగండి,” అన్నాడు యెంకడు. “నువ్వు మమ్మల్ని కొడతావా?” అని వొకడు తొట్రుపడితే, “యిద్దర్నీ కలిపి కాదు, వొక్కొక్కడ్నీ?” సరిచేశాడు మరొకడు.

ఇద్దర్నీ మార్చి మార్చి చూసి, “మిమ్మల్ని యెందుకు కొట్టాలి?” బుర్ర గోక్కుంటూ అడిగాడు యెంకడు. “అది కాదు, కొట్టగలవా? లేదా?” చేతి వేలు ముఖమీద పెట్టి అడిగాడు వొకడు. యెంకడికి నవ్వాలో యేడవాలో అర్థం కాలేదు. మళ్ళీ అదే ప్రశ్న వేసేసరికి “మిమ్మల్ని నేను యెందుకు కొడతాను?” యెంకడు ముఖం మడతలు పెట్టుకుంటూ అడిగాడు. “అదికాదు, కొట్టగలవా? లేదా?” మరొకడు చాలా సీరియస్సుగా అడిగాడు.

ఒక్కక్షణం ఆలోచించి “యేమో నాకు తెలీదు,” అన్నాడు యెంకడు. “తెలీదా?” యిద్దరూ వొకే గొంతై అడిగారు. “తెలీదు” చెప్పాడు యెంకడు. “అంటే… కొట్టలేవా?” అని వొకడు అంటే, “విడివిడిగా?” అని మరొకడు. “అది కూడా తెలీదు,” అన్నాడు యెంకడు.

శత్రువులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు.

యెంకడు ఆలోచనలో పడ్డాడు. ‘ఇప్పటివరకూ దెబ్బలు కాసింది చాలు. నా బలం వాళ్ళకెందుకు తెలియాలి? శత్రువుకి మన బలం తెలియక పోవడమే అసలైన బలం…’ అని అనుకున్నాక భయం పోలేదు, కొత్తగా ధైర్యమూ రాలేదు. కాని జాగ్రత్త పడడానికి యిదే మంచి మార్గమనిపించింది. శత్రువులిద్దరూ తనగురించి అనుకోకూడనిది యేదో అనుకుంటున్నారని, దాన్ని అలానే వుండనివ్వాలని కూడా అనిపించింది.

శత్రువు బలం తెలియనప్పుడు యుద్ధానికి దిగడం యేమంత మంచిది కాదన్న అనుభవంతో శత్రువులిద్దరూ “సరే,” అన్నారు. “ఏమిటి సరే?” అడిగాడు యెంకడు. “ఏమీ లేదు,” అని యిద్దరూ అక్కణ్నుంచి వెనుదిరిగి చీకటిలో కలిసిపోయారు.

ఆ తెల్లవారి సూర్యుడికన్నా ముందు కొత్త కథ వొకటి పొడిచింది. శత్రువులిద్దరూ యెంకడి దగ్గరకు వెళ్ళారని, వొక్కడే వుండి కూడా యెంకడు వెనకడుగు వేయలేదని. వీళ్ళిద్దరూ మనసు మార్చుకొని వెనక్కి తిరిగి వచ్చేశారని. అది కూడా యెంకడికి భయపడే వచ్చేశారని.

కొట్లాటలు తప్ప మరో ఆటలు చిన్నప్పటినుండి ఆడని వాళ్ళు కొట్టకుండా కొట్లాటకు దిగకుండా శత్రువులిద్దరూ వచ్చేశారంటే, ‘వోడిపోయామని వొప్పుకున్నట్టే కదా?’ జనాలు గుసగుసలాడుకున్నారు.

మరుసటి రోజు మరో కథ పుట్టుకొచ్చింది.

‘ఈ అవమానం భరించేకన్నా యెంకడి చేతిలో ఆయువు వదిలేయడమే మేలు- అని, అందుకే వొక్కక్కడిగా వెళ్ళి అమీ తుమీ తేల్చుకోవాలని…’ శత్రువులిద్దరూ సిద్ధమయ్యారని.

మూడో రోజుకి మరో కథ పుట్టుకొచ్చింది.

‘శత్రువులిద్దరితో విడివిడిగా కొట్లాటకు యెంకడు యెగిరి గంతేసి వొప్పుకున్నాడని…’

నాలుగో రోజు యింకో కొత్త కథ పుట్టుకొచ్చింది.

‘యెంకడ్ని చూసి శత్రువులిద్దరూ భయపడుతున్నారని…’

అయిదో రోజు మళ్ళీ మరో కొత్త కథ పుట్టుకొచ్చింది.

‘భయం కాదు, శత్రువులిద్దరికీ యెంకడిమీద గౌరవం వచ్చిందని…’

ఆరో రోజు యింకొక కొత్త కథ మొదలయింది.

‘శత్రువులిద్దరూ యింక యేనాడూ కొట్టుకోకుండా యెంకడు గట్టి వార్నింగు యివ్వబోతున్నాడని…’

ఏడో రోజు మళ్ళీ మరో కథ.

‘లేదు, లేదు… యెంకడే వాళ్ళిద్దర్నీ కొట్టుకొనేలా చేస్తున్నాడని, అసలు వాళ్ళిద్దరూ శత్రువులు కావడానికి కారణమే యెంకడని…’

రోజుకొక కథ వూళ్ళో వూరేగుతోంది. ఆ కథలు అటు శత్రువులిద్దరూ వింటున్నారు. ఇటు యెంకడూ వింటున్నాడు.

‘ఇది నిజమేనా?’ అని యెంకడ్ని యెవరూ అడగలేదు. యెంకడూ నోరువిప్పీ చెప్పలేదు. కాని శత్రువులిద్దరికీ వొకరి మీద వొకరికి అనుమానం వచ్చింది. ఈ పుకార్లన్నీ నువ్వు పుట్టించావు అంటే నువ్వు పుట్టించావు- అని. అంతే- శత్రువులు మళ్ళీ శత్రువులైపోయారు. మళ్ళీ వీధిలో పడి కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఈ రెండు కోతుల మధ్య రొట్టెముక్క పంచి గొడవలు పెంచిందే యెంకడని- దీనికి కూడా యెంకడికే క్రెడిట్ యిచ్చేశారు.

ఊళ్ళో యెంకడికి అసాధారణంగా గౌరవం పెరిగిపోయింది. ఎంతలా పెరిగిందంటే, యెంకడి పేరు చెప్పుకొని వూళ్ళో దందాలు మొదలయ్యాయి. అవి యెంకడి యింటిదాక వచ్చాయి. చెప్పాలంటే, యెంకడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం యెవరికీ లేకపోయింది. అక్కడితో ఆగలేదు. ఊళ్ళో యేదైనా పెళ్ళో పేరంటమో అయితే తొలి శుభలేక యెంకడికే.

శత్రువులిద్దరికీ వొకే సందేహం కలిగింది. మనం కొట్లాడుతుంటే, ఆడిస్తున్నది యెంకడు అని అనుకోవడం వల్ల మన కొట్లాటకు అర్థంలేకుండా పోయిందని. గెలుపోటములు యెంకడు ముందే నిర్ణయించాడని జనాలు చెప్పుకోవడంతో, తగిలిన గాయాలు మరింత సలుపుని పెంచేవి. అంచేత ‘యీ శత్రుత్వం మనకి అవసరమా?’ అని శాంతిని ప్రకటించి స్నేహితులైపోయారు శత్రువులిద్దరూ. అక్కడితో కథ ముగియ లేదు. మళ్ళీ మరో కథ జనాలు చెప్పుకోవడం మొదలు పెట్టారు. ‘నోరూ గుద్దా మూసుకొని వుండండి’ అని యెంకడు గట్టి వార్నింగ్ యిచ్చాడని…

ఇన్నాళ్ళూ పడ్డ నొప్పులకు అర్థం లేదనిపించింది శత్రువులిద్దరికీ. దాంతో వొంట్లో వోపిక లేకపోయినా వొక అంగీకారానికి వచ్చి మళ్ళీ వీధిన పడి కొట్టుకోవడం మొదలు పెట్టారు. మనిద్దరం యింత కష్టపడి తన్నుకు చస్తుంటే, గెలుస్తున్నది మాత్రం యెంకడు అని తొందర్లోనే అర్థమయిపోయింది. దాంతో యిద్దరూ యేకదాటిగా యేడ్చుకొని చాటుగా వొకర్ని వొకరు వోదార్చుకున్నారు. ఎవ్వరూ మనల్ని పట్టించుకోనప్పుడు మనం కొట్టుకొని రక్తాలు కార్చుకోవడంలో అర్థంలేదనుకొని వాపోయారు. కాని మనం కొట్టుకోకపోతే మన శత్రుత్వం లోకానికి ప్రకటించి చూపించకపోతే జనాలు మనల్ని మర్చిపోతారని కూడా కొద్దిరోజులకే వాళ్ళకి అర్థమయ్యింది.

యెంకడి అలికిడి లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వాకబు చేస్తే, యెంకడు యెవర్నో యేసేయడానికి వెళ్ళాడని వూరు చెప్పుకుంటోంది. తీరా ఆరా తీస్తే, యెంకడు తన పెద్దమ్మ కూతురు సమర్తాడితే వెళ్ళాడని తెలిసింది. ‘ఆడి వుచ్చ పెట్రోలై కాలుతోంది’ అనుకున్నారు, ఆ మంటల్లో కాలి తగలబడిపోతూ.

కొద్దిరోజులకు వచ్చాడని తెలిసి వెళ్ళి యెంకడ్ని కలిశారు శత్రువులిద్దరూ. లోకం చెప్పిన కథలు వినీవినీ మైకం కమ్మినట్టే వుంది. ఇంత యుద్ధవీరులూ కొంత తగ్గారు… కళ్ళలో కళ్ళు కలిపి చూడడానికి. ఇంతకు ముందు తాము చితక్క చితకేశామన్న సంగతే మర్చిపోయారు. అయితే ఆ విషయం అనుభవించి ఆరగించిన యెంకడికి గుర్తుంది.

“మాకొక శత్రువు కావాలి,” యిద్దరూ కూడబలుక్కున్నట్టు అన్నారు శత్రువులిద్దరూ. ఉలిక్కిపడ్డ యెంకడు దాన్ని దాచుకొని, “మీరిద్దరే కదా శత్రువులు?, మళ్ళీ మీకు శత్రువు యెందుకూ?” అని అడిగాడు. “శత్రువు లేకుండా బతకడం చాలా కష్టంగా వుంది,” అన్నారిద్దరూ నోళ్ళు తెరచి కళ్ళలో నీళ్ళని ఆవిరి చేసి ఆరబెడుతూ.

యెంకడు పెద్దగా నిట్టూర్చాడు. “మీ యిద్దరి వుమ్మడి శత్రువు నేనే కదా?” అన్నాడు. “అవును,” అన్నారిద్దరూ. యెంకడు నవ్వాడు. శత్రువులిద్దరూ నవ్వారు. అరక్షణంలో అన్ని నవ్వులూ మాయమైపోయాయి.

“అర్థమైంది,” తలూపాడు యెంకడు. ఏమిటన్నట్టు చూశారు శత్రువులిద్దరూ.

“శత్రువు లేకుండా బతకలేని వాళ్ళకి… శత్రువుగా వుండడం కంటే ప్రమాదకరమైన పని యింకొకటి వుంది,” అన్నాడు యెంకడు, ఆలోచనగా.

“ఏమిటది?” వొకేసారి అడిగారు శత్రువులిద్దరూ.

“శత్రువు కాకపోవడం!” చెప్పేసి యింట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు యెంకడు.

ముఖాముఖాలు చూసుకున్నారు శత్రువులిద్దరూ. పెద్దగా నిట్టూర్చారు. ఆపై వొకరి భుజమ్మీద వొకరు చేతులు వేసుకుంటూ చీకట్లో కలిసిపోయారు.

తెల్లవారుతూనే వొకటి కాదు, వంద కథలు పుట్టుకొచ్చాయి. ఎప్పట్లాగే శత్రువులిద్దరినీ పిలిచి యెంకడు వార్నింగ్ యిచ్చాడని వొక కథ. లేదు, శత్రువులిద్దరూ యెంకడికే వార్నింగ్ యిచ్చారని మరొక కథ. లేదు, లేదు… ముగ్గురూ వొకటైపోయారని యింకొక కథ. అసలు ముగ్గురికీ వొకరంటే వొకరికి పడదని… పడుతుందని… గూడుపుఠాని అని… గుడుగుడుగుంచం అని… గుండేరాగం అని… కథలు కథలుగా పుట్టలు పుట్టలుగా!

ఊరు బోరుమంది. ‘రేపటి నుంచి వేడుక చూసే అవకాశమే లేదా?’ అని అందిరిలోనూ వొకే ఆందోళన. అయ్యో అని, అలాగైతే యెలాగని!

ఆ సమయంలో వూరు నడుమకు వచ్చారు శత్రువులిద్దరూ.

అక్కడికే వచ్చాడు యెంకడు.

ఎవరు గెలుస్తారో యెవరు వోడుతారో- అన్నదానిమీద జనం పందేలు వేసుకుంటున్నారు. ఒకవైపు యీలలు. మరోవైపు కేకలు. అన్ని వైపులా చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా చప్పట్లు. ఆపాల్సిన పోలీసులు జల్లికట్టుని ఆపి పోట్లగిత్తలతోనూ జనంతోనూ కుమ్మించుకోవడం తగదని భావించి ప్రేక్షకులైపోయినట్టు చప్పట్లు చరుస్తూ జనాన్ని అదుపు చేస్తూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఎవరో మైకులో యేదేదో మాట్లాడుతూ తమ వాక్చతురతను బయటపెట్టుకుంటున్నారు. మేళతాళాలు… అవేనండి డప్పులూ… డాన్సులూ మొదలైపోయాయి.

యెంకడు ముందుకు అడుగేశాడు. అంతా ఆగింది. స్తభించింది. కనురెప్పలు కదల్లేదు. ఊపిరి శబ్దాలు వొక్కటే… వుసిగొల్పుతున్నట్టు!

శత్రువులిద్దరూ యిప్పుడు యెదురెదురుగా కాదు, పక్కపక్కన నిల్చున్నారు. వాళ్ళు నిన్నటిదాక ప్రత్యర్థులు అంటే యెవ్వరూ నమ్మనంతగా ప్రాణమిత్రులుగా అంటుకు నిలబడ్డారు. యెంకడు యెదురుగా వస్తుంటే, శత్రువులిద్దరూ వొకర్ని వొకరు చూసుకొని యెంకడ్ని చూశారు.

    యెంకడు చుట్టూ వున్న జనానికి చేతులు జోడించి అభివాదం చెప్పాడు. జనంలో గోల నాలుగింతలైంది. ఆ స్పందన చూస్తూ శత్రువులిద్దరికీ జడుపు పుట్టింది. రెండడుగులు వెనక్కి వేసి వొక అడుగు ముందుకు వేశారు.

యెంకడు నేలకు నమస్కరించాడు. ఇంత మట్టితీసి తన నుదిటకు రాసుకున్నాడు. ఆపై శత్రువులిద్దరి దగ్గరకు వెళ్ళి చేతులు కలిపి నమస్కరించాడు. చెప్పకేం శత్రువులిద్దరికీ వొళ్ళు వణికింది. అంతా పిండిరాలినంత శబ్దం.

శత్రువులిద్దరూ పిడికిళ్ళు బిగించి సిద్ధమైపోతుంటే, ఆగమన్నట్టు కళ్ళతోనే సౌజ్ఞ చేశాడు యెంకడు. వాళ్ళు అర్థంకానట్టు నిశ్చేష్టులై చూస్తుంటే, యెంకడు ముందు వాళ్ళ భుజాలు తట్టాడు మెచ్చుకోలుగా. ఆపై వాళ్ళ మీసాలను యెత్తిపట్టాడు వీరోచితంగా. శత్రువులిద్దరి ముఖాల్లో మొదట ఆశ్చర్యం, ఆ తరువాత చిరునవ్వు మొలిచాయి. యెంకడు తానూ నవ్వుతూ వాళ్ళ చెంపలమీద చెరో చెయ్యివేసి చిన్నగా నిమిరి నోరు నొక్కాడు. ‘ఆఁ’ అని తను నోరు తెరిస్తే, శత్రువులిద్దరూ నోళ్ళు తెరచారు. ఆ క్షణంలో యిద్దరి నోళ్ళలో రెండు చేతులు పెట్టి చెరో పన్ను తీశాడు. అవి అప్పటికే కొట్టుకొని కొట్టుకొని కదిలి వుండడం వల్ల నోట్లోంచి దానిమ్మగింజలు తీసినట్టు తీశాడు. తీసిన రెండు పల్లనీ రెండు చేతులతో అందరికీ చూపించాడు. చూపించి కింద పడేశాడు.

శత్రువులిద్దరూ షాక్‌లో వెళ్ళబెట్టిన బోసి నోళ్ళను చప్పున చేతులడ్డం పెట్టి మూసుకున్నారు.

జనాలు గొల్లుమన్నారు.

ఆగమని చేయి చూపించి సౌజ్ఞ చేశాడు యెంకడు.

జనం బుద్ధిగా నిశ్శబ్దంగా అయిపోయారు.

అప్పుడు యెంకడు తన నోటిని ‘ఆఁ’ అని తెరచి- మిగిలిన వొక్క పన్నునీ తీసి- అందరికీ చూపించి ఆపై కిందపడేశాడు.

జనం యేమీ అర్థంకానట్టు అయోమయంగా చూస్తూ కొత్త కథల్ని గాల్లోకి వదులుతూ వుండగా యెంకడు అక్కణ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

*

చిత్రం: సృజన్ రాజ్

బమ్మిడి జగదీశ్వరరావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.