1.
ప్రేమ మూల్యం
నీ మనసునే
బొమ్మగా
చిత్రీకరించుకోడానికి
నా మనసును
తెల్లకాగితం చేసి
అప్పగించుకోవడమే
మచ్చలేని ప్రేమచిత్రానికి
నేను నా తరుపున
చెల్లించే మూల్యం

2.
నాకేం కావాలీ?
ఎందుకు
కళ్ళల్లో భిక్షపాత్రలెత్తుకొని
నీ ముందు మోకరిల్లి
దేహీ అంటున్నాను
ప్రేమా?
ఐశ్వర్యమా?
ఆనందమా?
నిన్ను
కనుగొన్న క్షణమే
వాటి విలువేపాటిదో
తేలిపోయింది కదా!
నిన్ను కనిపెట్టేందుకు
నన్ను ఎంచుకున్నావనే
కృతజ్ఞతా?
ఆ క్షణం
హృదయమే
అర్పించేసాను కదా!
*
బహుశా
అమాయక చేపపిల్లను
ఒడ్డుకు చేర్చి
సముద్రాన్ని చూపినట్టు_
నీ ప్రాణంలోంచి
నను వేరు చేసి
యీ ఉనికిలో నిలబెట్టినందుకేమో!

3.
పూల దారి
మృత్యువులో తప్ప
ఎక్కడా లేకుండా
ఒక్క క్షణమైనా వుండగలవా?
ఎక్కడో వుండటం
అనివార్యమైనప్పుడు
ప్రేమలో వుండటమెంత మేలు
*
మాయో
హాయో
రెప్పల పైనుంచో
రెప్పల్లోపలనుంచో
నిరంతర చలిత దృశ్యమాలకు
సాక్షిగుండటమే
నువ్వు చేయగలిగే పనైనప్పుడు
నీకెదురుగా వుండటమెంత హృద్యం
*








Add comment