పాల సముద్రం

తమిళ మూలం:  లా.స.రామామృతం       

పూర్తి పేరు లాల్గుడి సప్తర్షి రామామృతం. అక్టోబర్ 30, 1916 న సప్తర్షి , ‘శ్రీమతి’ దంపతులకు జన్మించారు.

ఈయన కథలు, నవలలు, వ్యాసాలూ రాశారు. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ (చైతన్య స్రవంతి) శైలిలో, పదాలతో చేసే విన్యాసాలు , సూక్ష్మమైన సాంస్కృతిక విశేషాలతో ఈయన రచనా శైలి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈయన కథలలో భావోద్వేగాల ఉప్పెన, సూక్ష్మమైన వర్ణనలు , హిందూ మత సాంప్రదాయపు ప్రతీకలు కనిపిస్తాయి. వీటిలో సంగీతానుభూతి మరియు ఆధ్యాత్మికానుభవం కూడా వ్యక్తమవుతాయి.

తండ్రి సప్తర్షి ద్వారా తమిళము , ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించి, 12 సంవత్సరాల వయస్సులోనే భాషపై ఆసక్తి, పాండిత్యమూ సంపాదించారు. పాఠశాల విద్యను ఎస్.ఎస్.ఎల్.సి (SSLC) వరకు అభ్యసించారు. చెన్నైలోని ‘వాహిని పిక్చర్స్’లో టైపిస్టుగా మూడేళ్లు పనిచేశారు. సినిమా దర్శకుడు కే. రామ్‌నాథ్ సలహా మేరకు తన రచనలను కొనసాగించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకులో 30 సంవత్సరాలు పనిచేసి, 1976లో పదవీ విరమణ చేశారు.

భార్య హైమవతి. వీరికి జయరామన్, సప్తర్షి, చంద్రశేఖరన్, శ్రీకాంత్ అనే కుమారులు,గాయత్రి అనే కుమార్తె ఉన్నారు. (ఈయన కుమారులలో ఒకరైన లా.రా. సప్తర్షి కూడా కథలు, వ్యాసాలు రాస్తున్నారు)

ఇధల్గల్, జనని, పచ్చై కణవు, గంగా, మీనోట్టం, ​ఉత్తరాయణం, నేసం, ​పుట్రు, ​అవళ్ మొదలైన కథా సంపుటాలు… పుత్ర, అభిదా, ప్రాయశ్చిత్తం, కేరళత్తిల్ ఎంగో, కల్ సిరిక్కిరదు మొదలైన నవలలు… చింతానది(స్వీయ చరిత్ర) పార్కడల్, నాన్, ఉణ్మైయిన్ దరిసనం, విళింబిల్ మొదలైన జ్ఞాపకాలు రాశారు.         సాహిత్య అకాడమీ పురస్కారం, కలైమామణి పురస్కారం, ఇలక్కియ చిందనై ఆదిలక్ష్మణన్ పురస్కారం, వానవిల్ పన్ బాట్టు మయ్యమ్ భారతి పురస్కారం మొదలైన పురస్కారాలను పొందారు.

ఆయన తన 92వ పుట్టిన రోజునే (2007లో) మరణించారు.

*

నమస్కారం

క్షేమం, మీ క్షేమాన్ని తెలుపుతూ ఉత్తరం రాయమని అర్థిస్తున్నాను. మీరేమో నాకు ఉత్తరం రాయరు. అసలు మీకు ఆ ఆలోచన ఉన్నదో లేదో? ఇక్కడున్నప్పుడే… నోటిని పుక్కిలించటానికి, చెంబులోని నీటి కోసం నా చేతిలో నుండి తీసుకుని, చుట్టుపక్కలా దొంగచూపులు చూస్తూ, వేల అనుమానాలూ, సందేహాలూనూ! మీరేనా కట్టుకున్న భార్యకు ఉత్తరం రాసేది? అందుకనే నేనే చొరవ తీసుకున్నట్టుగా అనుకోండి.

కట్టుకున్నవాడు మీలా ఉంటేనేగా, నాలాంటి భార్యకు మెట్టినింట్లో చెడ్డపేరు. ‘అది చదువుకున్న అమ్మాయి, చదివిన చదువంతా వృథా దేనికి? మొగుడికి ఉత్తరం రాస్తోంది!’ అని ఈ ఇంటి పాతతరం పెద్దవాళ్లు, కొత్తతరం పెద్దవాళ్లు అందరూ నా చెంపల్ని వాయించకుండా, తమ చెంపల్నే వాయించుకుని, ఎగతాళి చెయ్యొచ్చు! చేస్తే చెయ్యనివ్వండి, నేను రాసేశాను. రాయటం రాయటమే. రాసినదాన్ని మీరు, తొలి దీపావళి పండగప్పుడు, అంత దూరాన ఉన్న మీరు, చదవటం చదవటమే. రాసినదాన్ని చదివాక, రాసిన వ్యక్తీ, చదివిన వ్యక్తీ నేరంలో సమానమేగా? ఇక ఎందుకలోనైనా ఐకమత్యం ఉన్నదో లేదో?

ఇదేంటీ మొదటి ఉత్తరమే ముఖంపై చరిచినట్టుగా మొదలైంది అని అనిపిస్తోందా? సరే, నేను మొద్దుని, పోనివ్వండి; తృప్తేగా? నేను బోళామనిషిని, నాకు మనసులో ఏదీ దాచుకోవటం తెలియదు. నాన్న కూడా మొత్తుకునేవారు: ‘ఎవరూ జగదా దగ్గర పొరబాటున కూడా ఏ రహస్యాన్నీ చెప్పకండి. ఎవరితోనూ చెప్పకపోయినా ఒక కాగితపు ముక్కలోనైనా దాన్ని రాసి కాల్చేస్తుంది. లేకపోతే ఆమె తల పగిలిపోతుంది. జగదా అంత ప్రమాదకరమైన మనిషి’ ఔను! అలాగే అనుకోండి. మరి నేనెవరితో  చెప్పుకోనూ, తొలి దీపావళికి నా భర్త నాతో లేడన్న కష్టాన్ని? మా అమ్మానాన్నలకు రాయనా? రాస్తే, మెట్టినింటి విషయాలను పుట్టింటికి చేరవేస్తోందన్న అపవాదును మూటగట్టుకోనూ? నేను మొద్దునే; కానీ అంత మొద్దునేం కాను. మరి నాకింకెవరున్నారనీ; మీరే చెప్పండి!

దీపావళికి రెండురోజుల ముందు అమ్మ ఇక్కడికొచ్చింది. ఎంతో ఆశగా కూతుర్నీ అల్లుణ్ణీ తొలి  దీపావళి పండక్కి తీసుకెళ్లాలని. మీరు ఊళ్లో లేరు, లేరని తెలియగానే ఆమె ముఖం మాడిపోవటాన్ని చూడాలి!

‘సరే, అల్లుడేమో లేరు, జగదానైనా తీసుకెళతాను! మేమూ దూరమై కొంత కాలమైంది. మీ ఇష్ట ప్రకారం పెళ్లైన నాల్గవరోజు గృహప్రవేశానికి విడిచిపెట్టిందేగా!’  అని చెప్పింది.

అయితే అమ్మ (మీ అమ్మ – ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మలయ్యారుగా!) కొనకంటితో నన్ను చూస్తూ, ‘ఎప్పుడైతే నా కొడుకు అక్కడికి రాలేకపోతున్నాడో మీ కూతురూ ఇక్కడే నలుగురితోపాటు నారాయణా అని కలిసి ఉండిపోతుంది! ఇకమీదట మా అమ్మాయేగా! తర్వాత మీ ఇష్టం. ఆమె ఇష్టం. ఇక్కడ ఎవరూ చెయ్యి పట్టుకుని ఆపరు!’ అంది.

ఇదేం లేగదూడ నోటికి తాళమేసి పాలు తాగించే విషయమా? నన్ను అమ్మ లోతుగా పరిశీలించటం తెలియదా, ఏం? నేనేం అంత మొద్దును కాను. ఈ ఇంట్లో ఎవరు స్పష్టంగా మాట్లాడుతున్నారనీ? ఇక్కడ మాట్లాడే మాటలకు అర్థం ఉండదుగా! నాకు ఉన్నట్టుండి బెంగ పట్టుకుంది. నా తోడ బుట్టిన తమ్ముడు శీనును చూడాలని. మేమిద్దరమూ ఒకర్నొకరు వదిలి ఒక్కనిమిషం కూడా ఉన్నది లేదు. ఉదయం చేతులు కడుక్కొని తడిసిన చొక్కాను మార్చటం మొదలు, రాత్రి మంచంమీద వాడికి పడకను వేసేంతవరకూ ఈ అక్కే అన్నీ చేసి తీరాలి. ఇప్పుడు బిడ్డ ఏం చేస్తున్నాడో? కానీ నేను ఇక్కడే ఉంటానని చెప్పేశాను. అమ్మ కళ్లల్లో చెమ్మ. అమ్మ మరేమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. నేను కొంతసేపు దిగ్భ్రాంతితో ఉండిపోయాను. అమ్మ చిర్నవ్వుతో నన్ను ఒక్కక్షణం లోతుగా చూసి పనిలోకి  వెళ్లిపోయింది. ఆమెకు లోలోపల సంతోషం. నాకు తెలుసు, నేను పరీక్షలో నెగ్గానని. ఏం పరీక్ష? ఆడదానిగా పుట్టాక స్వేచ్ఛ ఎక్కడుందీ అన్నదే.

ఔనూ, నేనడుగుతున్నాను – ఇదేం ఉద్యోగం. ఒక ఆదివారం పూట కూడా తల్లిదండ్రులు, బంధువులతో కలిసి లేకుండా? ఎంత ‘క్యాంపు’కు వెళ్లినా సమయానికి సెలవు పెట్టి రావటానికి వీలు కాదా?

అయితే, నాకే తెలుస్తోంది; ఆడవాళ్లకేమిటి, మగవాళ్లకు కూడా ఏం స్వేచ్ఛ ఉందనీ? మాకు ఇల్లు అయితే మీకు ఉద్యోగం. చూస్తుంటే ఎవరు మాత్రం స్వేచ్ఛగా ఉన్నారనీ? అందరం కలిసి ఒక పెద్ద జైల్లో ఉన్నాంగా, ఈ లోకంలో! శ్రీమంతుడు బంగారపు పంజరంలో. ఈ రెండు స్థితులలోనూ లేకుండా మనలాంటివాళ్లు ఇందులోనూ లేరు? అందులోనూ లేరు? కాలు నిలదొక్కుకోవటానిక్కూడా చోటు లేకుండా, గాల్లో ఊగిసలాడుతున్నాం. లేకపోతే ఈ సమయంలో మనం విడిపోయి మీరు ఎక్కడో దూరంగా ఉంటారా? నేను మిమ్మల్నే తలుచుకుని తపిస్తూ ఉంటానా? ఉద్యోగాన్ని వదిలేసి పరుగెత్తుకొని రాగలరా? నేనేం అంత మొద్దును కాను. మనసు పెట్టానంటే అన్నీ నాకు తెలుస్తాయి. ఇప్పుడు మనసు పెట్టున్నాను!

అయితే అందుకని నాతో మాట్లాడకూడదని ఉందా? వెళుతున్నప్పుడు నా దగ్గరికొచ్చి, “జగదా, నేను వెళ్లిరానా?” అని నాతో ఒక్కమాట చెప్పి వెళితే, తల తీసేసుంటారా? దాన్నీ చూసుండాల్సింది; ఏమయ్యుండేది? శోభనాన్ని ‘తై నెల’కు వాయిదా వేసినా నోటి మాటలు కూడా ఉండకూడదంటే పిల్లలు పెళ్లిళ్లు చేసుకుంటారా? ఈ ఇల్లే విడ్డూరంగా ఉంది. మీరందరూ ఇలా ఉండటం వల్లే మేమందరం సిగ్గు విడిచిన వాళ్లమైపోతున్నాం?

అయితే అమ్మే చెప్పిందిగా. ఉమ్మడి కుటుంబం అంటే ఇలాగే ఉంటుందీ అని. ఆమెకూడా ఇలాంటి ఇంట్లోనే ఋణపడిందట. చోటు చాలని ఇంట్లో నాలుగు జంటలు ఉండాలంటే ఏం చెయ్యటం? ఇంటికి అతిథులెవరైనా వస్తే ఇక చెప్పఖ్ఖర్లేదు. ఉన్నట్టుండి ఒక జంట పడక అరుగుమీదికొచ్చి పడుతుందట, అదీ చిట్టీల లాటరీ ద్వారా. ఎవరి పడక అన్నది లాటరీ తీశాకే తెలుస్తుందట. ఏమి  చెప్పనూ లేము, గొణగనూ లేము; దొంగకు తేలు కుట్టినట్టుగా నోరు మూసుకుని ఉండవలసిందే. అమ్మ చెబుతున్నప్పుడు నాకు నవ్వొచ్చేస్తుంది. ఈ సంబంధం చేసుకోవటానికి ముందు నాన్నకూడా అన్నారు: ‘ఇదేమిటే, ఇదంత అవసరమా? ఒకటే సంసారపు ఇల్లులా ఉంది. అబ్బాయి నలుగురి మధ్యలో నాలుగో కొడుకుగా ఉన్నాడు. ఇంకా పెళ్లిళ్లకి ఒకళ్లిద్దరు అమ్మాయిలు కాచుకుక్కూర్చున్నట్టున్నారు.’

‘ఉండనీ, ఉండనీ, ఎక్కువ కాపురాలుండి బాగా వృద్ధి చెందనీ. నలుగురు ముందూ ఇదే మన అమ్మాయికి బాగా అర్థమౌతుంది. చూడండీ. ఇప్పుడు మనకు ఏం తక్కువనీ? ఆదిలోనే పట్టువిడుపులంటూ లేకుండా, పైచేయి సాధించిన వాళ్లంతా చివరకు, లోకం తెలియకుండా, ఏది శాశ్వతమో తెలియకుండా, పిల్లీ ఎలకల్లా ఉండటాన్ని నేనూ చూస్తూనే ఉన్నాగా! పిల్లవాడు చక్కగా నాల్గవ కొడుకుగానేగా ఉన్నాడు? నాలాగా, నా కూతురు, ఇంటికి పెద్ద కోడలుగా ఉండకూడదు?’

అమ్మ అలా అంటున్నప్పుడు బాగానే ఉంది; నవలలో కథానాయకురాలిగా ఉండటానికి ఎవరు ఇష్టపడరనీ? అయితే తనదాకా వస్తేనే తెలుస్తుంది? నిజంగా మీరు ఆరోజు ప్రేమగా నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా బండెక్కి వెళ్లిపోయాక, నాకు ఏడుపు ముంచుకొచ్చేసింది. నా గుండె భారాన్ని ఎవరితో చెప్పుకోనూ? అందరూ నాకు కొత్త, నోట్లో చీర చెరుగును కుక్కుకొని పెరట్లోని బావి దగ్గరకు పరుగెత్తుకుని  వెళ్లిపోయాను.

ఎన్ని రోజులు అక్కడే కూర్చున్నానో తెలుశా?

‘ఏమిటే చిట్టీ, ఏం చేస్తున్నావు?’

ఉలిక్కిపడ్డాను. అమ్మ ఎదురుగా నిలబడుంది. మీ అమ్మ మెరిసిపోయేటట్టుగా నుదుటున రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కటి గంగిగోవులా ఒక్కోసారి ఎంత అందంగా ఉంటారనీ!

‘ఏం లేదమ్మా!’ అని గబగబా కళ్లు తుడుచుకున్నాను. అయితే ముక్కును చీదకుండా ఉండలేకపోయాను.

‘అరెరే! బాగా జలుబు చేసినట్టుంది. ముక్కుల్లోనూ కళ్లల్లోనూ కారుతోందా? రాత్రికి మజ్జిగ వేసుకోకేం’. (కపటమూ, కరుణా కళ్లల్లో నింపుకొని అమ్మ కళ్లను టపటపమంటూ ఆర్పుతున్నప్పుడు, అదీ ఎంతో అందంగానే ఉంది!) ‘ఏమిటోనమ్మా. కొత్త అమ్మాయివి; నీ ఒంటి తీరు మాకు అర్థమయ్యేంత వరకూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో  – అరె; చిట్టీ ఇదేంటీ… ఇక్కడ చూడవే!’

అమ్మ ఆశ్చర్యంగా బావిలోకి తొంగి చూస్తోంది. గబగబా నేనూ లేచి వెళ్లి ఏమిటా అని చూశాను; అయితే నాకేమీ కనిపించలేదు.

‘ఏయ్ చిట్టీ, నా కంటిచూపు మందగిస్తోందా? నూతిలో నీళ్లున్నాయా?’

‘ఉన్నాయే!’

“తక్కువగా ఉన్నాయా?”

“లేదే, ఎక్కువగానే ఉన్నాయే!”

“ఉన్నాయి కదూ? అందుకే అడిగాను; అదే చెప్పొచ్చాను, నూతిలోని నీటిని సముద్రం లాక్కెళ్లటానికి వీలుకాదని! సమయమైంది. దేవుని గది ముందు ముగ్గు పెట్టు`’ అని చిరునవ్వుతో చెబుతూ లోపలికి వెళ్లిపోయింది.

నేను బావి దగ్గరే కొంతసేపు నిలబడ్డాను. హృదయంలో చిన్నదిగా ఒక చిరు దీపాన్ని వెలిగించినట్టుగా అనిపించింది. పైన చెట్టునుండి ‘పారిజాత పుష్పాలు’ రాలి నూతిలో పడుతున్నాయి. పగ్గం తెంచుకొన్న లేగదూడ తన ముఖాన్ని నా చేతికి రాస్తూ ఉన్నది.

ఈ ఇంట్లో ఎవరు స్పష్టంగా మాట్లాడుతున్నారనీ? స్పష్టత మాటల్లో లేదు. దాన్ని మించీ అందులోనే ఉంది.

అయితే మూగకు మాత్రం స్పందనలుండవా? వాళ్లకే ఎక్కువ ఉంటాయని ఎవరో చెబితే విన్నాను. అయితే మీరు నిజంగా మూగ కాదుగా, మూగ లాగానే కదూ! నాకు ‘రెస్పెక్ట్’ లేదండీ? ఔను, అంతే. వెళ్లండి నేను మీకిప్పుడు ఉత్తరం రాయటం లేదు. మీతో ఉత్తరంలో మాట్లాడుతున్నాను. కాదు. ఉత్తరంలో ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలు నాకు సంబంధించినవి. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నా వల్లే అడ్డుకోను కాదుగా, నేనేం చెయ్యనూ? నేను ఇంతకు మునుపే చెప్పానుగా, నా మనసులో ఉన్నదాన్ని అలాగే కుమ్మరించేస్తానని!

నాకు మాత్రం తెలియదా, మీరు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్టుగా, విషాన్ని మింగి, ముఖం నిప్పులా కాలుతుంటే, గుమ్మం దగ్గరికీ లోపలికీ తిరగటం? అప్పుడు మీకు మాత్రం నాతో మాట్లాడాలని కోరిక లేదని చెప్పటానికి వీలవుతుందా? ఆ విషయాన్ని తలుచుకుంటేనే నాకిప్పటికీ గుండె మెలి పెడుతుంది. ఏం మాట్లాడాలని అనుకున్నారో? దాన్ని వినే అదృష్టం నాకు లేదు. ఇంతకు మునుపు మీరెవరో, నేనెవరో? పరదేశి వేషంలో మెట్లెక్కి లోపలికొచ్చి మీరు నా చేతిని పట్టుకోగానే జన్మజన్మలుగా ఎదురుచూసిన కార్యం నెరవేరినట్టుగా నాకనిపించింది?

అలా ఎదురుచూసిన వస్తువు చేతికి చిక్కాక కూడా, ఇంకా ఎదురుచూసే వస్తువుగానే ఉన్నానా? ఇంకా జన్మజన్మల కార్యం నెరవేరలేదా? ఇప్పుడు నిప్పు అంటే నోరు కాలిపోదు. తాళి కట్టిన ఇంట్లో తప్పులు పడుతున్నావే అని అడక్కండి. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ధైర్యంగానే చెప్పాలి. మీరు ఎక్కడో ‘క్యాంప్’ అని దూరదేశం వెళ్లిపోయారు. ఈ నిమిషం ఏ ఊళ్లో, ఏ హోటల్లో, ఏ సత్రంలో, ఏ పైకప్పులోకి చూపుల్ని నిలిపి ఏమేం ఆలోచనల్లో ఉన్నారో? నేనూ గొణుక్కుంటున్నాను. మీరు తిరిగొచ్చేలోపు నాకు ఏమీ జరగదని ఏం నిశ్చయం? ఆలోచించటానికి కూడా మనసు భయపడుతున్నా, ఆలోచించటమే చేస్తోంది. మీ గురించీ అంతే కదూ? ప్రతిరోజూ ఒక ఆయుష్షు అని గడిపే ఈ రోజుల్లో, మనమిద్దరమూ, ఇంత తొందరగా, ఇన్ని రోజులుగా దూరంగా ఉన్న ఈ సమయంలో, మన ఇద్దరిమధ్యా సంభవించిన ప్రతి ఒక్క చూపులోనూ, శ్వాసలోనూ పలికిన ఒకట్రెండు మాటలూ, అవసరమయ్యో, అకస్మాత్తుగానో, ఒకరిమీద ఒకరికి పడ్డ స్పర్శో, జ్ఞాపకాల నిధి లాగానే అనిపిస్తోంది. మేము అలా నిధులను భద్రంగా కాపాడుకోవటం లోనూ వాటిని నమ్ముకోవటం లోనేగా బ్రతుకుతున్నాం.

మా గుమ్మం ముందు నుండి ఎవరైనా ముసలివాళ్లు వెళితే, మానాన్నకు తెలియకుండానే ఆయన చేతులు నమస్కరించేవి. ‘ఏంటి నాన్నా?’ అని అడిగితే చెప్పేవారు, ‘అమ్మా, ఈ ముసలాయన వయసు వరకూ నేను ఉంటానా అని నాకు నిశ్చయం లేదు. కాలమేమో అల్పాయుషు కాలమై పొయ్యింది. ఈ రోజుల్లో ఇంత వయసు వరకూ ఉండటం అన్నదే, కాలాన్నీ వయసునూ వీళ్లు జయించినట్టేగా? వీళ్ల ఆ గెలుపుకు నమస్కరిస్తున్నాను.’ ఆయన కావాలనే గొంతును మృదువుగా చేసుకొని అలా చెప్పటంతో అది నన్ను మెలిపెట్టేటట్టుగా ఉండేది.

ఎందుకూ, అంతదాకా వెళ్లాలా? ఈ కుటుంబంలోనే, ఆయుష్షుతో పోటీపడి, ప్రతి దీపావళికీ తనను తాను కొత్తగా రూపొందించుకునే దృష్టాంతాలు లేవా? మీరిప్పుడు నాల్గవ వ్యక్తిగా ఉన్నవారు, గతంలో ఐదవ వ్యక్తిగా ఉన్నవాళ్లేగా?

చివరకు దేని గురించి రాయాలని అనుకున్నానో, అక్కడికే వచ్చేశాను. మీరు లేకుండానే జరిగిన తొలి దీపావళి పండగ సంబరాల గురించే.

అమ్మను చూస్తే ఒక్కోసారి భ్రమిసిపోయేలా ఉంటుంది. విశ్రాంతీ విరామం లేకుండా ఆ ఒంటితో ఆమె ఎలా బొంగరంలా తిరుగుతుందనీ, ఎన్ని పనులు చేస్తోందనీ! చిన్నవాళ్లమైన మేము ఆమెకు సమానంగా చెయ్యలేకపోతున్నాం! మేడమీదికి వెళ్లి ఆమె అత్తగారికి శుశ్రూష చేసి, మలం మొదలైన వాటిని తియ్యవలసి ఉంటుంది (మరెవరికీ బామ్మకు సేవ చేసేందుకు అనుమతి లేదు) మీ నాన్నకు శుశ్రూష చేసి… మీనాన్నకేమిటీ, ఈ వయసులోనూ అంత కోపం వస్తోందీ! ఒక చింతపండో, మిరపకాయో, కాస్త కూరలో ఎక్కువైతే, పళ్లేల్నీ పాత్రల్నీ అలా విసిరికొడుతున్నారే! ఆయన్ను చూస్తేనే కోడళ్లందరికీ వణుకు. అందంగా ఉన్నారు, గడకర్రలా, సన్నగా, నిటారైన వీపుతో; ఈ వయసులోనూ ఆయన తలలో అంత దట్టమైన వెంట్రుకలు! కళ్లు ఎప్పుడూ నిప్పులు కురిపిస్తూనే ఉంటాయి. అమ్మ అంటుంది: ‘ఏం చెయ్యగలరీ బ్రాహ్మణుడు? ఉద్యోగం నుండి రిటైరయ్యాక సమయం గడవటం లేదు. ఇంట్లో అధికారం చలాయిస్తున్నారు. ఆఫీసులో చేసీ చేసీ అలవాటైపోయింది! ఇకమీదట వొంగే వయసా? వొంచితే ఆయన ‘టప్’మంటూ విరిగిపోతారు. నేను బూడిద గుమ్మడికాయను, ‘ఫట్’మంటూ పగిలిపోతాను. మేమున్నంతవరకూ మీరందరూ సహిస్తూ ఉండవలసిందే. ఈ మేడ మీదున్న ముసలిదాన్ని వచ్చిన చోటుకు చేర్చవలసిన బాధ్యత ఒకటుంది. తర్వాత…’

‘ఎందుకమ్మా ఇలాగంతా మాట్లాడుతున్నారు?’ అనేది పెద్ద తోటికోడలు.

‘లేకపోతే ఏమిటీ, మేము వుంటూనే ఉంటే, మీరు మీ ఇష్టప్రకారం ఉండేది ఎప్పుడనీ?’

‘ఇప్పుడు మాకేంటమ్మా తక్కువ?’

అమ్మకు లోలోపల సంతోషమే. అయితే బయటికి ప్రదర్శించదు. ‘అది సరేలేవే, నువ్వు అందరికన్నా ముందొచ్చావు. వెనకొచ్చిన వాళ్లకంతా అలా ఉంటుందా? ఎందుకూ, నా కూతురినే తీసుకో; దానికి కాలేజీ అమ్మాయిని అనిపించుకోవాలని కోరిక. దానిష్టప్రకారం వచ్చి వెళుతూ, ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకుని… నేనొకదాన్ని వాటికంతా అడ్డుగా ఉన్నదాన్ని. అది పుట్టినప్పటి నుండే వాళ్ల నాన్నతో బాగా ముదిగారం. నా నోరు మూతబడిందంటే ముందు గణపతికి కొబ్బరికాయ కొట్టేది అదే. నా కడుపున పుట్టిందే ఇలా ఉంటే, ఇంటికొచ్చిన మీరు మాత్రం నా మాట వింటారా?’

‘లేదమ్మా; మేము మీరు చెప్పినదాన్ని వింటామమ్మా…’ ముక్తకంఠంతో బడిపిల్లల్లా, ఎక్కాలు అప్పచెప్పినట్టుగా చెప్పేవాళ్లం.

‘అవును ఏంటో చెబుతారు; పనుల్లో కనిపించదు. నా చుట్టూ ఐదుగురున్నారు. వీపు గుంజుతోంది; మనిషికి ఐదురోజులు ~ ఎందుకూ, నేనూ చేస్తాను. నా కూతురు చెయ్యదు; ఆమె వంతు నేనే చేసి తీరాలి. మనిషికి అయిదు రోజులు ఉదయం లేచి కాఫీ ఇవ్వండే అంటున్నాను. విన్నందుకు ఫలితం అందరూ ఇంకో అర్థగంటసేపు ఎక్కువ నిద్రపోతారు.’

మాకు పౌరుషం వస్తుంది. వచ్చి ఏం చెయ్యగలం? అమ్మను ఎదిరించి ఏమీ చెప్పటానికి వీల్లేదు. మేము 6 గంటలకు లేస్తే ఆమె 5 గంటలకు లేచి పొయ్యి వెలిగించేసేది. 5 గంటలకు లేస్తే ఆమె నాలుగున్నర గంటలకే లేచి కాఫీ కలుపుతుండేది. నాలుగున్నరకు లేస్తే ఆమె నాలుగు గంటలకే; ఈ పోటీకి ఎవరేం చెయ్యగలరు?

‘రండి, రండి; కాఫీ తాగేసి వెళ్లండి. చల్లారిపోయిన దాన్ని మళ్లీ వేడి చెయ్యకముందే; అదే నాకు మీరు చేసే ఉపకారం. నేను చెబుతున్నానుగా; నేను ఒంటరిగా ఉన్నప్పుడు అన్నింటినీ నేనేగా చేసి తీరాలి, చేస్తుండేదాన్ని. ఇప్పుడేమిట్రా అంటే గుంపు పెరిగిపోయింది; పనిని వేలం వేసుకోవటం. ఊ. ఊ… జరగనీ… జరగనీ అన్నీ జరుగుతున్నంత వరకేగా? నేనూ ఒకరోజు నీలుక్కొని ఏ అర్థరాత్రో కాలు చాచేశానంటే, అప్పుడు మీరు చేసి తీరవలసిందేగా? మీరు చేసింది నేను అంగీకరించవలసిందేగా? మడో, గిడో, ఆచారమో, అనాచారమో `’

అమ్మ ఆమె పనుల గురించి చెప్పుకోనీ. అన్నీ ఆమే చేసుకుంటేనే ఆమెకు తృప్తిగా ఉంటుంది. మమ్మల్ని కన్నవాళ్లూ ఏదో తమకు తెలిసింది మాకు చెప్పారు. మాకు తెలిసినదాన్ని, మావల్ల వీలైనంతవరకూ బాగానే చేస్తున్నాం. అయితే ఆమె ఆచారాల గురించి గొప్పలు చెప్పుకోవటంలో ఆవగింజంత కూడా న్యాయం లేదు. మంచినీళ్లు తాగుతున్నప్పుడు ఎప్పుడైనా పంటికి టంబ్లర్ తగలని రోజు ఉండదు; దీన్ని ఎవరైనా చెబితే “ దీనికంటూ కాస్త ధైర్యంగా పెద్దకోడలే అడగ్గలదు“ అంగీకరించరు. ‘నా చెవికి వినిపించలేదే!’ అనేసేవారు. ఇదేంటీ చెవికి వినిపించకపోతే పంటికి తెలియదా ఏంటీ?

మీ చెల్లెలు ఎక్కడెక్కడో తిరిగి, వాకిట్లోకి చెప్పులు విసిరేసి, కాళ్లు కూడా కడుక్కోకుండా, నేరుగా వంటగదిలోకెళ్లి ‘ఏంటమ్మా చేశావు?’ అని పాత్రలో నుండి ఒక చేత్తో నోట్లో వేసుకుని వెళ్లేది. అందుకు ప్రశ్నలేవీ ఉండవు. దానికేం చెయ్యటం? నేనూ అలా ఉండుంటే, మా అమ్మ కూడా నాతో ఇలాగే ఉండేదో ఏమిటో? అయితే అమ్మ ఏదో, తన గురించి చెబుతానని చెప్పుకోవచ్చేమో కానీ, ఇంత పెద్ద కుటుంబంలో ఇంతమంది పిల్లలు, పెద్దలు రకరకాల వాళ్లమధ్య మసలుతూ, ఏ గొప్పతనాన్ని గురించి నిజంగా ప్రశంసించగలుగుతుందనీ?

ఒక్కోసారి అమ్మ చెప్పటం చూస్తుంటే, ఏమిటో మేము ఐదుగురమూ ఉత్తినే తిని తిరిగేవాళ్ల౦ లాగా భావించవచ్చు. అయితే ఈ ఇంటికి ఎంతమంది కోడళ్లు వచ్చినా, అంతమందికీ మించిన పనులున్నాయి. వంట పనులను వదిలి పెడితే, ఇంట్లో పనులు లేవా, స్నానాలగది శుభ్రం చేసుకునే పనులు లేవా, పిల్లల పనులు లేవా, భర్తలకు మాత్రమే చెయ్యగల పనులు… ఇవన్నీ పనులలో కలిసినవి కావా? ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్నేసి బంతులు. ఒక్కొక్కరికీ సమయానికి ఒక గుణం. ఒకరికి పులుసు, రసం, మజ్జిగ అన్నీ గిన్నెలలో కంచం చుట్టూ ఉండి తీరాలి; ఒకరికి ఎదురుగా నిలబడి గరిటెలు గరిటెలుగా పోస్తూనే ఉండాలి. మీరేమో మౌనవ్రతం! తలను కంచంలోకి వంచారంటే ఇక ఏం జరిగినా అంతే; ఒకళ్లు ఎప్పుడూ గలగలమంటూ మాటలు, కంచంలోకి చూసి తినకుండా లేచాక ‘ఇంకా ఆకలేస్తోందే. రసం వేసుకున్నానా? మజ్జిగ తాగానా?’ అని అనుమానిస్తూ ఉంటారు. పిల్లల గురించి ఇక చెప్పఖ్ఖర్లేదు.

అందరి ఇండ్లల్లో దీపావళి ముందురోజు రాత్రి ప్రారంభమైతే మనింట్లో మూడు రోజుల ముందే వచ్చేసింది. ఇసరటమూ, దంచటమూ, కాచటమూ అమ్మ చెయ్యి ఎన్నెన్ని మాట్లాతుందనీ? మైసూరుపాకం కలుపుతున్నప్పుడు కమ్మటి వాసన వీధంతా గుభాళించింది. నాలుక మీద పడగానే వెన్నలా కరిగిపోయ్యేది. దేన్ని నోట్లో వేసుకున్నా మిమ్మల్ని తలుచుకునేదాన్ని. మీరేం చేస్తున్నారు? ‘మౌనం’ ఒకటి తప్ప ఇంకేం ఒంటరిగా అనుభవించగలరు? మౌనంకూడా ఒక ‘స్థాయి’కి తర్వాత అనుభవించే విషయం కాదు. మరో మార్గం లేక సహించగలిగే విషయమే. మీకూ నాకూ మౌనంగా ఉండే వయసేనా? హృదయ స్పందనలను ఒకరికొకరు చెప్పుకుంటున్నకొద్దీ, విసిగిపోకుండా, ఇంకా చెప్పుకునే రోజులు కదూ? మీరెందుకు ఇలా నోరులేని జీవిలా ఉన్నారు? మీరు మగవాళ్లు మీకు నిజంగానే విరక్తి ఉండొచ్చు. నేను మీకన్నా చిన్నదాన్నేగా! మీ బుద్ధినీ, పరిపక్వతనూ నాలో ఆశించవచ్చా? మీకోసం కాకపోయినా నాకోసమైనా మీరు నాతో మాట్లాడాలి. నాకు మాటలు కావాలి. మీ తోడు కావాలి… అయ్యయ్యో, ఇదేంటీ మీ చేతిని పట్టుకొని బలవంతంగా లాగేలా నడుచుకుంటున్నానే! నన్ను క్షమించండి, తప్పుగా భావించకండి. అయితే నాకు మిమ్మల్నీ నన్నూ గురించి తప్ప వేరే జ్ఞాపకాలు లేవు. ‘నేనూ నువ్వూ’ అన్న ఈ బంధాన్ని గురించిన సాకే మిగతాదంతా నాకు. దీని గురించి ఆలోచించటం మొదలుపెడితే, రాయదలచుకున్నది కూడా మరపుకొస్తుంది.

అయితే, ‘నేనూ మీరూ’ అని అన్నీ ఆలోచించటానికీ, రాయటానికీ రుచికరంగా ఉన్నప్పటికీ కుటుంబం అన్నదాన్ని పక్కన పెట్టటానికి ఎలా వీలవుతుంది? లేదూ మరిచిపోవటానికి ఎలా వీలవుతుంది? కుటుంబం అన్నది ఒక క్షీరాబ్ధి. అందులో నుండే లక్ష్మీ, ఐరావతం, ఉచ్చైశ్రవం అన్నీ పుడతాయి. కుటుంబంలో నుండి మీరు మొలిచినందువల్లేగా నాకు దక్కారు? హాలాహల విషమూ  అందులో నుండే; వెంటనే దానికి భిన్నమైన అమృతమూ అందులో నుండే. ఏమీలేదు, అల్ప విషయం; ఈ కుటుంబంలో ఉన్నందువల్లేగా, దీపావళిని నేను అనుభవించటానికి వీలవుతోంది! మీరు ఎక్కడో ఉన్నారు.

నాకు అనిపిస్తోంది. నేను నువ్వు లో నుండి పుట్టి పెద్దదైన కుటుంబంలో నేను నువ్వుగా పోగొట్టుకుని మళ్లీ కుటుంబంలోనే మరుగైపోయిన నేను నువ్వు అన్న ఒక రూపానికి సాక్ష్యమే దీపావళా? కుటుంబమే నేను నువ్వుగా చూశాక, రెండింటికీ ఏం వ్యత్యాసం?

నాకు ఇలాగే అనిపించింది. దీపావళికి ముందురోజు రాత్రి, వసారాలోని ఊయల బల్లమీద కొత్త పంచెలూ చీరలూ చొక్కాలూ రవికెలూ రాశులుగా పడుండటాన్ని చూడగానే, ఎందుకూ అన్ని బట్టల్నీ నేనే వేసుకుంటే ఏంటీ? ఆడవాళ్ల బట్టల్ని నేనూ మగవాళ్ల బట్టలనూ మీ కోస౦ నేనే! మీరు లేరుగా. అన్నీ ఈ విశ్వరూపంలో నేనూ మీరేగా?

అమ్మ ఒక కొబ్బరిచిప్పలో పచ్చగా ఒక ముద్దను పెట్టుకొని నా దగ్గరకొచ్చింది.

‘చిట్టీ, భోంచేశావా?’

‘అయిందమ్మా.’

‘తినవలసినదంతా తిన్నావా?’

‘అయింది  (ఆ గోధుమ హల్వాలో ఒక ముక్కను తీసుకుంటే సరిపోయేది. నేనే ముక్కలు చేశాను. అయితే అడగటానికి సిగ్గుగా ఉందే!)

‘అలా అయితే కూర్చో, గోరింటాకు పెడతాను.’

అమ్మ నా పాదాలను తాకగానే నాకు ఒళ్లు జలదరించింది.

‘ఏంటమ్మా చేస్తున్నావు?’ అమ్మ చేతులకు పెడుతుందని అనుకున్నాను. అయితే నా మాటలు అమ్మకు వినిపించినట్టు లేదు. ఏదో ఆలోచిస్తూ నా పాదాలను స్పృశిస్తున్నది. పనులు చేస్తున్నా పువ్వు లాంటి మెత్తటి చేతులు; నాకు అక్కడ ఉండటానికే మనసు రావటంలేదు. అమ్మ ఉన్నట్టుండి నా పాదాలను గట్టిగా పట్టుకొని ముందుకు వంగింది. ఆమె భుజాలూ శరీరమూ అలల్లా చుట్టుముట్టాయి. పట్టులాంటి ఆమె వెంట్రుకలు నిండుగా పరుచుకున్నాయి. నా పాదాలమీద రెండు కన్నీటిబొట్లు రాలిపడ్డాయి.

‘అమ్మా! అమ్మా!’ నాకు ఏడుపొచ్చేసింది. నాకు భరించే మనసు లేదు.

‘ఏం లేదే చిట్టీ. భయపడకు’ అమ్మ ముక్కు చీది కళ్లు తుడుచుకుంది.

‘నాకేదో గుర్తుకొచ్చింది. నాకొక కూతురుండేది. రూపురేఖలన్నీ నీ పోలికలే. ఇప్పుడు ఉండుంటే నీ వయసంతే ఉండేది. నా మనసెరిగిన మనిషి అదొక్కటే. మూడురోజులు జ్వరం, మొదటిరోజు మూసిన కన్ను తర్వాత తెరవనే లేదు. మెదడులో నెమ్ము చేరిందట. ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా వ్యాధులన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయిగా! తర్వాత వచ్చిన సమస్యల వల్ల ఆమెను మరిచిపోయానని అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది. నిజంగా ఏదీ మరిచిపోలేము. ఏదీ మరిచిపోవటానికీ లేదు. మంచో చెడో అదీ అదీ  భోజనశక్తి రక్తంతో కలిసిపోయినట్టుగా, ఒంట్లోనే కలిసిపోతుంది. మనం మరిచిపోయాం అని మనసులో అనుకుంటే ‘ఒసేయ్ మొద్దూ! ఇదిగో ఉన్నాను, చూడూ!’ అని తలెత్తి చూపిస్తుంది. నిజానికి అదే పోను పోను మనల్ని తట్టుకునే మనోబలంగా కూడా మారుతుంది. లేకపోతే మా అత్తగారూ నేనూ, మాకు జరిగినదంతా జరిగాక ఇంకా ఈ లోకంలో ఎందుకు బ్రతికుండాలి?’

ఈ విషయం చెప్పేసి అమ్మ ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. తనలోని పెను భారాన్ని దించేసుకున్నట్టుగా ఒక నిట్టూర్పు విడిచింది; అంతే! నా పాదాలకు గోరింటాకు పెట్టటంలో మునిగి పోయింది. అయితే ఆమె నాకు పెట్టటం లేదు. నా రూపంలో ఆమె చూసిన తన చనిపోయిన కూతురి ఆలోచనకూ పెట్టటం లేదు; మా ఇద్దరినీ అధిగమించి మాకు సరిపోలిన యవ్వనానికి గోరింటాకు పెట్టి మురిసిపోయింది. ఈ సమయానికి ఆ యవ్వనపు చిహ్నంగానే ఆమెకు నేను కనిపించాను; నాకూ అలాగే అనిపించింది. ఇలాగంతా ఊహించటం అంటేనూ నాకిష్టం. అందుకే నాకు అలా అనిపించిందో ఏమో?

ఈ ఇంట్లో కొన్ని విషయాలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ నాలుగు తరాలవాళ్లు బ్రతుకుతున్నారు. మీ బామ్మ, తర్వాత అమ్మ నాన్న, తర్వాత మేమూ మీరూ, తర్వాత మీ అన్నావదినెల పిల్లలు. అయితే ఇక్కడ అందరిమధ్యా ఒక ఐకమత్యం కనిపిస్తుంది. ఇక్కడ పూజలూ పునస్కారాలూ లేవు. అయితే కొన్ని సమయాల్లో; ఈ ఇల్లు ఒక కోవెల లాగానే కనిపిస్తుంది. కొండ శిఖరం మీద బొజ్జ గణపతి ఉండి అనుగ్రహిస్తున్నట్టుగా బామ్మ మూడవ అంతస్తులో ఉండి అనుగ్రహిస్తుంటుంది. అక్కణ్ణుండి ఆమె సాగించే పాలన మాకు తెలియటం లేదు. బామ్మకు ఇబ్బంది కలిగించకూడదని పిల్లలను మూడవ అంతస్తుకు వెళ్లటానికి అనుమతించటం లేదు. అది అమ్మ తప్ప ఇంకెవరూ తాకలేని ప్రాకారం. ఆరుకాలాల పూజలాగా, అమ్మ బామ్మ శరీరాన్ని ఎత్తుకొని, తక్కువలో తక్కువంటే రోజుకు ఆరుసార్లయినా ఎక్కి దిగుతుంది. బామ్మకు ఆహారం వేరుగా అమ్మే వండుతుంది. అది గంజో, అంబలో, పునర్పాకమో, అన్నమో – ఏదో మాకు సరిగ్గా తెలియదు. దాన్ని ఒక పళ్లెంలో, ప్రసాదం లాగా, పైన ఆకును మూసిపెట్టుకొని, ముఖంలోనూ పాదాల్లోనూ మెరిసేలా పూసుకున్న ఛాయ పసుపుతో, నుదుటున రూపాయి బిళ్లంత కుంకుమతో, తడి ఆరకుండా వేసుకున్న జడలో చామంతిపువ్వుతో అమ్మ మేడ ఎక్కుతుంటే నాకు ఒళ్లంతా పులకరిస్తుంది.

కొన్ని సమయాల్లో అమ్మ నాన్న ఇద్దరూ మేడమీదికి వెళ్లి జంటగా క్రిందికి దిగి వస్తుంటారు, దేవుని దర్శనం చేసుకొని వస్తున్నట్టుగా. ఒకసారి వాళ్లు అలా కలిసి జంటగా వస్తుంటే ‘ఠక్కున’ వాళ్ల పాదాలమీదపడి నమస్కారం చేసుకున్నాను. అమ్మ ముఖంలో ఒక చిరు ఆశ్చర్యమూ, ఆప్యాయతా కలగలిసి కనిపించాయి. నాన్న కళ్లల్లో కనిపించే కాఠిన్యం కూడా కాస్త పక్కకు తొలిగినట్టుంది.

‘ఏమిటే చిట్టీ, ఇప్పుడేమిటీ విశేషం?’ నాకు తెలిస్తేగా? భావావేశమే గొంతును అదిమేసింది; నోరూ మూసుకుపోయింది, కళ్లనుండి కన్నీళ్లు ధారలు కట్టాయి. ప్రేమగా అమ్మ ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది. నా బుగ్గన తట్టి ఇద్దరూ పైకి వెళ్లిపోయారు. అమ్మ మృదువైన కంఠంతో నాన్నతో అంటోంది:  ‘పర్వాలేదు, కూతుర్ని పెద్దాచిన్నా మర్యాదలు తెలిసి పెంచినట్టుంది.’

అదేం కాదు. ఏమిటో నాకు అనిపించింది, అంతే! ఈ సమయంలో వీళ్లకు నేను నమస్కరిస్తే, పైనుండి వీళ్లు పొందిన అనుగ్రహంలో కొంత స్వీకరించాను. తరం నుండి తరానికి దిగివచ్చే పరంపర అనుగ్రహం.

మాకందరికీ తలంటి స్నానం చెయ్యించాక మేడమీదికి వెళ్లిన అమ్మ, మామూలు కన్నా తొందరగానే తిరిగి వస్తోంది. సమాచారం తంతిలా ప్రాకింది. ‘బామ్మ కిందికి రావాలని ఆశపడుతోందట’. అమ్మ నాన్న పైకివెళ్లారు. మేమందరమూ  స్వర్గలోక దర్శనం కోసం ఎదురుచూస్తున్నట్టుగా భయభక్తులతో మౌనంగా ఎదురుచూస్తున్నాం. ఠక్కున ఏదో గుర్తుకొచ్చినవాడిలా ఒక మనవడు ‘కుర్చీ’ మీదికెక్కి, మేడమీది బల్బు స్విచ్‌ను వేశాడు.

ఉన్నట్టుండి మేడ మలుపులో బామ్మ దర్శనమిచ్చింది. విమానంలో స్వామిని లేపినట్టుగా మంచంమీద ఆమెను కూర్చోబెట్టుకొని, అమ్మానాన్నలు ఇరువైపులా మంచాన్ని పట్టుకొని ఎంతో జాగ్రత్తగా, మెల్లగా, కిందికి దిగుతున్నారు. తర్వాత నాన్న భద్రంగా బామ్మను తన రెండుచేతుల తోటీ ఎత్తుకొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. నాన్న పట్టుకుంటే, అమ్మ, గుండుచెంబుతో గోరువెచ్చటి నీళ్లను ముంచి ముంచి పోస్తూ, బామ్మ ఒంటిని తుడుస్తున్నట్టుగా రుద్దింది. మేమందరమూ చుట్టూ నిలబడి చూస్తున్నాము.

ఇది ఆదరణ కాక మరేమిటీ? ఔను, బామ్మ ఆరోగ్య పరిస్థితివల్ల రోజూ స్నానం చెయ్యించటానికి వీల్లేదు, ఏ కారణంతోనైనా ఊపిరితిత్తుల్లో తడి చేరుతుందేమోనన్న భయం. ఉత్సవమూర్తికి విశేష దినాల్లో మాత్రమే అభిషేకం జరిగినట్టుగా బామ్మకు రోజు, వారం, పండగదినం మాత్రమే, ఎంతో జాగ్రత్తగా స్నానం చెయ్యించటం జరుగుతుంది. కాస్త అదిమిపట్టి రుద్దితే చేతికి ఎక్కడ కండ ఊడొచ్చేస్తుందేమోనన్నట్టు శరీరం అంత మృదువు. ఆ ఒంట్లో, సిగ్గూ శెరమూ అన్న భావ వికారాలకు ఎక్కడ చోటున్నది? ఏ సమయంలో ఈ శరీరాన్ని తీసి విసిరికొడతాం అనేగా ఆ ప్రాణం ఎదురుచూస్తోంది! చెట్టు వాలిపోయినా

వేళ్లు భూమిలోనుండి ఊడిపడనంటోంది. బామ్మ వంద దాటేసిందని అనుకుంటున్నాను. ఏళ్ల స్పర్శతో అవయవాలు కృంగిపోయి, శరీరమే వంగిపోయి ముద్దలా అయిపోయింది.

బామ్మ ఒంటిని తుడిచి ఆమెకు చీరను చుట్టి మంచమ్మీద కూర్చోబెట్టుకొని వసారా  వెలుతురులోకి తీసుకొచ్చారు. మేమందరమూ నమస్కరించాము. బామ్మలో మౌనం శిలలా దిగబడి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. వాతంతో చేతులూ కాళ్లూ పడిపోయి, నాలుకనూ పోగొట్టుకున్నాక, కళ్లు మాత్రమే మాట్లాడుతున్నాయి. కళ్లల్లో పూలు పూసినప్పటికీ, గూట్లో దీపాలు పెట్టినట్టుగా, అవి గుంతల్లో వెలుగుతున్నాయి. నేను తల వంచుకోగానే నాకు అనిపించింది: ఈమె ఈమేనా, ఇదా? గుళ్లో మనం మొక్కే శిల్పానికీ, ఈమెకూ ఏ రకమైన తేడా ఉంది? గుళ్లో మాత్రం ఏం ఉందనీ?

‘అయ్యో అయ్యో `’ అని గదిలోనుండి ఒక గావుకేక వినిపించింది. ఏదో ఏమిటో అని బెంబేలెత్తిపోయి, ప్రతిగా అరుస్తూ అందరం గబగబా పరుగెత్తుకెళ్లాం. భోరుమని ఏడుస్తూ బిడ్డ వాడి నానమ్మమీద వచ్చిపడ్డాడు. ‘ఏరా కన్నా!’ అమ్మ అలాగే వాణ్ణి లాగి గుండెలకు హత్తుకుంది. అమ్మకు శేఖర్ ఎప్పుడూ ముద్దుల మనవడే. రెండవకొడుకు బిడ్డ కదా?

‘నానమ్మా! నానమ్మా!’ బిడ్డ భయంతో వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్నాడు.

‘అమ్మ నన్ను దబదబమంటూ కొట్టేసింది…’

‘ఒసేయ్ పాపాత్మురాలా! మంచి దినంగా చూసుకొని ఏం చేసిందో చూడరా నిన్ను!’ అమ్మకు నిజంగానే కడుపు మండిపోయింది, చెంపమీద ఐదువేళ్లూ వాతలు తేలి ఉండటాన్ని చూసి!

‘కాంతీ ఒసేయ్ కాంతీ!!’ గది కిటికీ దగ్గర, కాంతిమతి వదిన కూర్చోనుంది. ఒక కాలును వేలాడదీసుకొని ఒక కాలును మడిచి, దానిమీద చేతుల్ని ఉంచుకొని, జుత్తు ఊడిపోయి భుజాల మీద తారాడుతూ ఉండటం కూడా తెలియటం లేదు. ఆమె కళ్లల్లో కోపఛ్ఛాయలు కనిపిస్తున్నాయి. కనుబొమలు ముడివేసి, కింది పెదవి పగిలినట్టుంది. అమ్మను చూసికూడా లేవలేదు.

‘అయ్యయ్యో!’ నా పక్కన చిన్న వదిన నిలబడుంది. నోటికి అడ్డుగా చేతిని పెట్టుకొని, ‘కాంతి వదినకు పిచ్చి ఎక్కువైనట్టుంది’ అంది. కాంతి వదినకు ఈ విధంగా ఏ ముందు హెచ్చరికలూ లేకుండా మతి చలిస్తుంటుంది. మూడు నెలలకొకసారో, ఆరు నెలలకు రెండుసార్లో, మూడురోజుల దాకా తలుపులు బాదుతూ ఉంటుంది. అన్నాహారాలు, స్నానమూ ఏదీ ఉండదు. చంద్రుణ్ణి రాహువు పట్టినట్టుగా గొప్ప మనోవికారం ఆమెను కమ్మేస్తుంది. అప్పుడు అమ్మతో సహా ఎవరూ ఆమె దగ్గరకు వెళ్లరు.

కాంతి వదిన జీవితమే తీరని దు:ఖమైపోయింది. ఆ తర్వాత చిన్న వదిన నాకన్నీ వివరంగా చెప్పింది. నాకు నిజంగానే వినటానికే ఇబ్బందిగా అనిపించింది. చెవులు మూసుకుని కళ్లనూ మూసుకున్నాను. ఆ దృశ్యాన్ని ఆలోచించి చూడ్డానికి కూడా వీలుకాలేదు. మీ రెండవ అన్నయ్య, దీపావళికి టపాకాయలు కొనటానికెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో చిక్కుకున్నారటగా! ఏ పాపాత్ముడు సిగరెట్‌ను ఆర్పకుండా విసిరేశాడో, లేదూ ఇంకేం జరిగిందో?

మందుగుండు పేలుడులో అంగడి సామాన్లు కొబ్బరిచెట్టంత ఎత్తుకు ఎగిరి పడ్డాయటగా! అన్నయ్య ప్రాణం అక్కడే పొయ్యిందట. అన్నయ్య ముఖమే కనిపించలేదట. ముక్కలు ముక్కలుగా చెదిరిపోయిందట. ముఖం ఉండాల్సిన చోట గుడ్డను కప్పి మూసిపెట్టి వచ్చారట.

శేఖర్, అప్పుడు వాళ్లమ్మ కడుపులో మూణ్ణెళ్ల పసికందట. ఇప్పుడు శేఖర్‌కు వయస్సు ఏడా, ఎనిమిదా?

నిజంగానే అడుగుతున్నాను; ఈ బాధను మీరందరూ ఎలా సహించగలిగారు? అమ్మా నాన్నా దీన్నుండి ఎలా బయటపడగలిగారు? ముందు మీరందరూ ఎలా ప్రాణాలతో ఉంటున్నారు? కాంతిమతి వదిన కృంగిపోయిన విషయం వినలేకపోయానే? ఇది జరగక మునుపు ఆమె గలగలమంటూ, ఎప్పుడూ నవ్వు ముఖంతోనే ఉండేదటగా!

ఇప్పుడు కూడా, ఆ ముఖంలోని అందం పూర్తిగా నశించి పోలేదు. ఆమె కోపమంతా ఆమెమీదే ఉండటంతో, మంటలో బంగారం కరిగి మెరుస్తున్నట్టుగా, వేదనా భారంతో జ్వలిస్తోంది. ఆమెకు అంత గతి పట్టాక, మిగతావాళ్లలాగా దిగమింగి పుట్టింటికి వెళ్లకుండా, మాలో ఒకరుగా, ఇప్పటి వరకూ ఇక్కడే ఆమె ఉండటంలోనూ ఒక అందం కనిపిస్తోంది.

ఆమెను అలా చూడగానే అమ్మకు కూడా గొంతు మూగబోయింది.

‘ఏమిటే కాంతీ, ఇంకానా స్నానం చెయ్యలేదు? రా రా, పైకి లే. బిడ్డను ఇలా వాచేటట్టుగా కొట్టావే, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా?’

‘న్యాయమంట న్యాయం! లోకంలో న్యాయం ఎక్కడుందనీ?’

కాంతిమతి వదిన గొంతు నిప్పులు కక్కింది.

‘అందుకు బిడ్డ ఏం చెయ్యగలడు?’

‘నానమ్మా! నానమ్మా! నేనేమీ చెయ్యలేదు. సన్నటి మతాబును పట్టుకొచ్చి ‘ఇదిగో చూడమ్మా’ అని అమ్మ ముఖానికి ఎదురుగా చాపాను. అంతే; నా చేతిని పట్టుకొని లాగి వంగబెట్టి వీపుమీదా ముఖం మీదా దబ్బుదబ్బుమంటూ వాయించేసింది, నానమ్మా!’ పిల్లవాడు చెబుతున్నప్పుడే దు:ఖం మళ్లీ పొంగుకొచ్చింది. అమ్మ వాణ్ణి గట్టిగా హత్తుకుంది.

‘ఇలా రా వెధవా, నిన్ను చంపి మింగేస్తాను! కడుపులో ఉన్నప్పుడే తండ్రికి పుటం పెట్టావు. నిన్నేం చేసినా పాపం లేదు?’

అమ్మకు బాగా కోపం వచ్చేసింది.

‘నువ్వూ నేనూ చేసిన పాపాలకు బిడ్డను ఎందుకే తిడతావు? నా బిడ్డ జ్ఞాపకంగా, వాడినైనా భగవంతుడు మనకు బిచ్చం వేశాడని గుర్తుపెట్టుకో. ఏం, ఇవ్వాళే దినం చూసుకున్నావా దు:ఖాన్ని పాటించేందుకు? నేనుకూడా బిడ్డను పోగొట్టుకొని నిలబడున్నాను. నాకు దు:ఖం లేదా? నేను విదిలించి విసిరి కొట్టేసి నిబ్బరంగా లేనూ?’

వదిన రెచ్చిపోయింది. ‘మీకు బిడ్డ దూరం కావటమూ నాకు భర్త పోవటమూ ఒకటే అవుతుందా?’

మేము అలాగే స్తంభించిపొయ్యాం.

‘అమ్మను నేరుగా చూస్తూ అలా మాట్లాడేవాళ్లూ ఉన్నారా? ఇవ్వాళ లేచిన వేళ ఎలాంటిది?’

అమ్మ ఏమీ బదులివ్వలేదు. బిడ్డను కిందికి దింపి నేరుగా కోడల్ని దగ్గరకు లాక్కుని కౌగిలించుకుంది.

వదిన భళ్లున పగిలిపోయింది. అమ్మ విశాలమైన నడుమును చుట్టుకొని పసిబిడ్డకన్నా మిన్నగా వెక్కివెక్కి ఏడ్చింది. అమ్మ కళ్లూ వర్షించాయి. కోడలి జుట్టును ముడివేసి నుదుటిమీద పరుచుకున్న ముంగురులను సరిచేసింది.

‘కాంతీ, ఇదిగో చూడూ, ఇదిగో చూడమ్మా…’

శేఖర్ ఒక సన్నని మతాబును అమ్మా నానమ్మ ముఖాలకు దగ్గరగా పెట్టి నవ్వుతున్నాడు. వాడి చెంపలమీద కన్నీళ్లు ఇంకా ఆరలేదు.

మా అందరి కళ్లూ తడిసిపోయాయి.

కుటుంబం ఒక పాల సముద్రం, అందులో నుండే లక్ష్మి, ఐరావతం, ఉచ్చైశ్రవం అన్నీ పుట్టాయి. అందులోనుండి పుట్టే నాకు మీరు దక్కారు. హాలాహల విషమూ అందులోనుండే పుట్టింది. వెంటనే దానికి భిన్నమైన అమృతమూ అందులో నుండే…

*

జిల్లేళ్ళ బాలాజీ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.