విష్ణుమూర్తి గారు ఓడిపోయారు..
విష్ణుమూర్తి గారు ఇక బయటకు రాలేరు..
విష్ణుమూర్తి గారు ఏం చెప్పినా ఎవరూ నమ్మరు..
విష్ణుమూర్తి గారు జ్యోతిషం ఆయనకే పనికి రాలేదు…
* * *
ఆరోజు బుల్లబ్బాయి గారి ఇంట్లో ఆబ్దీకం. అక్కడికి వచ్చిన మహేశ్వరుడు ఆబ్దీకం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాడు. అరటి ఆకుల్ని రెండుగా చీల్చి వాటిలో ఓ ముక్కని అప్పుడే నీళ్లతో శుభ్రం చేసిన చీపురు పుల్లల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అరటి ఆకు రెండు వైపులా ఆ పుల్లలతో కుట్టి చిన్న బుట్టలా చేస్తున్నాడు మహేశ్వరుడు.
ఇప్పటికే ఐదారు బుట్టల్ని తయారు చేశాడు. మరో ఐదు బుట్టలు చేస్తే ఆ రోజు ఆబ్దీకానికి సరిపోతాయి.
అప్పుడే బుల్లబ్బాయిగారి ఇంటికి వచ్చిన విష్ణుమూర్తిగారు “మహేశం దొన్నెలు సిద్ధం చేసావా..?” అడిగారు.
“సిద్ధం అయ్యాయి గురువు గారు. చిటికెలో మిగిలినవి చేసేస్తా” అన్నాడు మహేశం.
“రెండో భోక్తగా శంకరంకి చెప్పమన్నా.. చెప్పావా?” అంటూనే..
“ఆ నువ్వులూ… కాసిన్ని అక్షింతలూ ఆ దొనెల్లో పొయ్యి” అన్నారు విష్ణుమూర్తిగారు.
“శంకరానికి నిన్న సాయంత్రమే చెప్పాను గురువు గారు. వచ్చేస్తూ ఉంటాడు” అని సమాధానం చెప్పి…
గురువు గారు పురమాయించినట్లుగానే నల్ల నువ్వుల్ని, తెల్ల బియ్యపు గింజల్ని అక్షింతలుగా తాను తయారు చేసిన దోనెల్లో నింపాడు మహేశ్వరం.
వాటి పక్కనే అరటిఆకులో అంతకు ముందే తాను అరగదీసి ఉంచిన గంధాన్ని ఉంచాడు.
ఆకుపచ్చ దోనెలో ఉన్న నల్లని నువ్వులు వర్షంలో తడిసిన నల్ల చీమల్లా ఉన్నాయి.
ఆకుపచ్చ దోనెలో ఉన్న తెల్లటి బియ్యం ఆకాశంలో చుక్కల్లా మెరుస్తున్నాయి.
ఆకుపచ్చ అరటిఆకులో లేత గోధుమ రంగులో ఉన్న గంధం అరటిఆకు నుదుట బొట్టు పెట్టుకున్నట్లుగా ఉంది.
ఈ ఇద్దరి మాటలు విన్న బుల్లబ్బాయి లోపలి నుంచి వస్తూనే విష్ణుమూర్తి గారికి రెండు చేతులతో నమస్కరిస్తూ “రండి గురువు గారు. లోపలికి రండి” అని ఆహ్వానించాడు.
వీధి గదిలోంచి లోపల గదిలోకి వస్తూ “వంట అయ్యిందా. పదకొండు దాటింది. ఒకటి, ఒకటిన్నరకల్లా కార్యక్రమం అయిపోవాలి. మీరు స్నానం చేసి వస్తే క్రియ ప్రారంభిద్దాం” అన్నారు విష్ణుమూర్తిగారు బుల్లబ్బాయిని ఉద్దేశించి.
“ఇదిగో చిటికెలో వచ్చేస్తా. వంట దాదాపు అయిపోవచ్చింది. పిండివంట మిగిలిందనుకుంటా. ఓసారి లోపల కనుక్కుని స్నానం చేసి వచ్చేస్తా. మీరు కూర్చోండి” అంటూ లోపలికి వెళ్లిపోయాడు బుల్లబ్బాయి.
సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన శంకరాన్ని చూసి “నువ్వు కూడా వెళ్లి స్నానం చేసిరా శంకరం” అని తన సంచీలో ఉన్న దర్భాసనాన్ని నేల మీద పరిచి దానిపై కూర్చున్నారు విష్ణుమూర్తి గారు.
కాసేపటికి యజమాని బుల్లబ్బాయి… భోక్తలు మహేశ్వరం, శంకరం కూడా స్నానాలు కానిచ్చి వచ్చి విష్ణుమూర్తిగారి ముందు కూర్చున్నారు.
“ముందు ఆచమనం చేయండి… కేశవాయస్వాహా.. నారాయణయస్వాహా.. మాధవాయస్వాహా ” అంటూ మంత్రాలు చదువుతూ క్రతువు ప్రారంభించారు విష్ణుమూర్తి గారు.
ఆబ్దీకం క్రతువు జరుగుతోంది కానీ విష్ణుమూర్తి గారు అన్యమనస్కంగానే ఉన్నారు. రెండు మూడు సార్లు మంత్రాలు కూడా తడబడ్డారు.
అలా తడబడడం చూసిన మహేశం… శంకరం ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.
*** *** ***
మున్సిపల్ ఎన్నికల కోలాహలం. అమలాపురంలోని ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడ్డారు విష్ణుమూర్తి గారు. ఆయనకున్న సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎనిమిదో నెంబర్ అచ్చి రాదు. గెలుస్తామని కాదు కానీ… బ్రాహ్మడు రాజకీయాలకు కూడా పనికి వస్తాడు అని చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారాయన.
విష్ణుమూర్తి గారు పోటీ చేస్తున్న వార్డులో దాదాపు అన్ని ఇళ్లకి ఆయనే బ్రహ్మగారు.
ఆ వీధిలో శుభకార్యాలన్నీ ఆయన చేతి మీదే జరిగాయి. జరుగుతున్నాయి. తెల్లారి లేస్తే వార్డులో అందరూ తాను కనపడగానే “గురువు గారు నమస్కారం” అంటూ పలకరిస్తారు.
ఆ ధీమాతోనే ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. అంతకు ముందు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బ్రాహ్మలెవరూ పోటీ చేయలేదు.
ఈసారి విష్ణుమూర్తి గారు పోటీలో ఉండడంతో ఆ విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి.
అవతల పోటీలో ఉన్నది రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. పైగా ఆయనే ఈ ఎన్నికల ముందు వరకూ కౌన్సిలర్.
ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా మరొకరు పోటీలో ఉన్నారు. ఊరంతటిలోనూ ఎనిమిదో వార్డులోనే త్రిముఖ పోటీ. మిగిలిన వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులే ఎన్నికల పోటీలో ఉన్నారు.
విష్ణుమూర్తి గారు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజు రాత్రి ఎనిమిది గంటలైంది. ఆ రోజు శుక్రవారం. రాత్రి ఫలహారం చేసి వీధరుగు మీద కూర్చున్నారు విష్ణుమూర్తి గారు.
ఓ ఎనిమిది మంది సైకిళ్లు, మోటారు సైకిళ్ల మీద విష్ణుమూర్తి గారి ఇంటి ముందుకు వచ్చారు. అంతా జెమాజెట్టీల్లా ఉన్నారు. అవతలి వారు ఎంతటి వారైనా ఆ వచ్చిన వారిని చూసి భయపడాల్సిందే.
సన్నగా… వెదురు బద్దకు పంచె కట్టినట్లుగా ఉండే విష్ణుమూర్తి గారు తన ఇంటికి వచ్చిన వారిని చూసారు.
వీళ్లు జాతకాలు చెప్పించుకుందుకు వచ్చారా అనుకున్నారు.
వీళ్లు ముహూర్తం పెట్టించుకుందుకు వచ్చారా అని తలంచారు.
వీళ్లు సంఖ్యాబలం తెలుసుకుందుకు వచ్చారా అని భావించారు.
కానీ, విష్ణుమూర్తి గారు అనుకున్నది జరగలేదు.
విష్ణుమూర్తి గారు తలచింది కాలేదు.
విష్ణుమూర్తి గారు భావించింది కూడా కాలేదు.
ఏం జరిగిందంటే…
“పంతులు గారూ… మీరు నామినేషన్ విత్ డ్రా చేసుకోండి” అని ఆ వచ్చిన వాళ్లలో ఒకరు కాసింత వొద్దికగా చెప్పారు.
“చాలా కాలంగా ఈ వార్డు కౌన్సిలర్ మా అయ్యగారే. ఇప్పుడు ఆయనే గెలుస్తారు. కానీ మీరు పోటీ చేయడం వల్ల మెజార్టీ తగ్గుతుంది” అని మరొకరన్నారు.
“మీరు బామ్మర్లు. మీకెందుకు రాజకీయాలు. మీరు మీ పూజలు చేయించుకోండి. మా జోలికి రాకండి” అని ఇంకొకరన్నారు.
“మేం ఎవరితోనూ ఇంత మర్యాదగా మాటాడం. బామ్మర్లు.. పైగా మా ఇళ్లలో అన్ని కార్యక్రమాలు మీ చేతుల మీదే సేయించుకుంటాం. అందుకని ఇలా మాట్లాడుతున్నాం. పిలక ముడేసుకుని మీ పని మీరు చేసుకోండి” అని నల్లతుమ్మ చెట్టులా ఉన్న మనిషి హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు.
ఇవన్నీ విన్న విష్ణుమూర్తి గారు ఏం మాట్లాడలేదు. అరుగు మీంచి లేస్తూ తన పక్కనే ఉన్న అంగోస్త్రాన్ని ఓ దులుపు దులిపారు. దాన్ని అలాగే భుజం మీద వేసుకున్నారు. రెండు అడుగులు ముందుకి నడిచి…
“ఓహో… బెదిరించడానికి వచ్చారా. భయపెట్టడానికి వచ్చారా. విత్ డ్రా చేయించడానికి వచ్చారా. మంచిది. ఇంట్లో వాళ్లు ఎందుకీ రాజకీయాలు అంటే, పోనీలే విత్ డ్రా అయిపోదామనుకున్నా. ఇప్పుడు ఇక అలాంటి ఆలోచనే లేదు. రాదు. కచ్చితంగా పోటీలో ఉంటా. మీ అయ్యగారికి చెప్పండి” అని చాలా శాంతంగా చెప్పి “ఇక మీరు వెళ్లచ్చు అన్నట్లు”గా చూశారు.
“పంతులూ… చివరిసారి చెబుతున్నాం. ఇక చెప్పడాలు ఉండవు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవడు మీమీదకి వస్తాడో మాకు కూడా తెలీదు” అని అందరి కంటే వెనుక నుంచున్న మనిషి ముందుకు వచ్చి చాలా కోపంగా అన్నాడు.
విష్ణుమూర్తి గారు కూడా నాలుగడుగులు ముందుకి వచ్చి
“ఎప్పుడో.. ఎక్కడో.. ఎవడో… ఎందుకు.. ఇప్పుడే.. ఇక్కడే… మీరే రండి” అని అనలేదు.. అరిచారు.
మళ్లీ ఇంకో మాట కూడా అన్నారు… “మీరు నామీద దాడి చేసారనుకోండి. నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లను. మీ మీద కంప్లైంట్ కూడా ఇవ్వను. మీరు కొట్టిన దెబ్బలకి మందులు కూడా వేసుకోను. అవే దెబ్బలతో వార్డంతా కలియ తిరుగుతా. ఓటర్లకి చూపిస్తా. ఒకవేళ… అంటే అంత జరగదు. కానీ.. ఒకవేళ నన్ను చంపేస్తే… మీలో ఒక్కడినైనా నాతో పాటు తీసుకెళ్తా” అన్నారు.
“పిలక ముడేసుకుని కూర్చోమన్నారు ఎవరో… ఇదిగో ఇప్పుడే ఈ ముడి తీసేస్తున్నా. ఎలక్షన్ అయ్యే వరకూ ఈ ముడి వేయను. ఇలా తిరుగుతా” అని పిలక ముడి తీసేసారు.
అలా పిలక ముడి తీసేయడంతో ఆయన వెనుక ఉన్న జుట్టు విష్ణుమూర్తి గారి మెడ కింద వరకూ జారింది.
ఈ గొడవ జరుగుతున్నంత సేపు విష్ణుమూర్తి గారి భార్య, పిల్లలు అరుగు మీదే నిలబడ్డారు.
“సూద్దాం. ఏటవుద్దో. మీకే తెలుస్తుంది. నడండ్రా. ఈ పంతుల్ని ఏం చేయాలో అయ్యగారే చేస్తారు” అని ఆ జట్టకు నాయకుడిగా ఉన్న మనిషి వెనుతిరిగాడు. మిగిలిన వారు అతడ్ని అనుసరించారు.
*** *** ***
పట్టణంలో ఎన్నికల కోలాహలం జోరుగా ఉంది. ప్రతి వార్డులోను అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
అందరి చూపు ఎనిమిదో వార్డుపైనే ఉంది. ప్రత్యర్థులు ఎవరికి వారే ధీటుగా ప్రచారం చేస్తున్నారు.
అధికార పార్టీ అభ్యర్థితో పాటు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కూడా డబ్బు లెక్క చేయడం లేదు.
విష్ణుమూర్తి గారి ప్రచారం మౌనంగా ఉంది.
విష్ణుమూర్తి గారి ప్రచారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఉంది.
విష్ణుమూర్తి గారి ప్రచారం చాప కింద నీరులా ఉంది.
స్వతంత్ర అభ్యర్థి విష్ణుమూర్తి గారికి ఎన్నికల అధికారులు ధనస్సు గుర్తుగా కేటాయించారు.
విష్ణుమూర్తి గారి ప్రచారానికి రిక్షాలు లేవు. మైకుల గోల లేదు. జెండాలు లేవు. కార్యకర్తలు లేరు.
విష్ణుమూర్తి గారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
రేపు ఎన్నికలు అనగా ఎనిమిదో వార్డులో అధికార పార్టీ అభ్యర్థి ఓటుకి రెండు వందలు పంచుతున్నారని ఆ నోటా ఈ నోటా విష్ణుమూర్తిగారికి తెలిసింది.
ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కూడా ఓటుకు రెండు వందల ఏభై రూపాయలు ఇస్తున్నారని కూడా ఆయన విన్నారు.
విష్ణుమూర్తి గారు ఈ ప్రచారం వింటూ నవ్వుకున్నారు.
విష్ణుమూర్తి గారు నవ్వుకుంటూ వింటున్నారు.
ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎవ్వరూ ఇల్లు కదలవద్దని విష్ణుమూర్తిగా రు ఆదేశించారు.
ఆయన చెప్పినట్లే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇల్లు కదలలేదు.
తెల్లారింది. ఓటు వేసేందుకు ఎనిమిదో వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఓటర్లు ఒక్కొక్కరే వస్తున్నారు.
పాఠశాలకు కుడి వైపు ఓ వంద అడుగుల దూరంలో అధికార పార్టీ అభ్యర్థి తన మందీ మార్బలంతో కూర్చున్నారు.
ఎడమ వైపు వంద అడుగుల దూరంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కూర్చున్నారు.
స్వతంత్ర అభ్యర్థి విష్ణుమూర్తి గారు అక్కడెక్కడా లేరు. ఆయన కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ ఎవ్వరూ పోలింగ్ జరిగే ప్రాంతంలోనే లేరు.
ఇంతకీ విష్ణుమూర్తి గారు ఎక్కడున్నారు..! ఏం చేస్తున్నారు..! ఓటర్లను ఆయన తరఫున ఎవరు కలుస్తున్నారు… ఎవరు ఓటు వేయమని అడుగుతున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకి చిరాకుగా ఉంది.
ఆందోళనగా కూడా ఉంది.
లోలోపల ఏదో జరుగుతోందనే భయం వెంటాడుతోంది.
మనం ఓడిపోతామా… అనే అనుమానంగా ఉంది.
పంతులు ఏదో మాయ చేసి గెలుస్తాడా..! అనే సందేహంగా కూడా ఉంది.
ఇంతకీ విష్ణుమూర్తి గారు ఎక్కడున్నారు… ఎవరితో ఉన్నారు. ఏఏ మంతనాలు చేస్తున్నారు?
విష్ణుమూర్తిగారు ఎక్కడున్నారంటే….
పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడసకుర్రులో ఉన్నారు.
విష్ణుమూర్తి గారు ఏం చేస్తున్నారంటే…
రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో వివాహం చేసుకున్న నవ దంపతుల చేత సత్యన్నారాయణ వ్రతం చేయిస్తున్నారు.
ఇక్కడ ఓటర్లు క్యూలో నుంచుని ఓట్లు వేస్తూంటే…
అక్కడ విష్ణుమూర్తి గారు సత్యన్నారాయణ వ్రత కథ చదువుతున్నారు.
ఒక్కో కథ పూర్తి అయిన తర్వాత నవ దంపతుల చేత కొబ్బరికాయ కొట్టిస్తున్నారు.
విష్ణుమూర్తి గారి ముఖం ఎంతో కళగా ఉంది. ఆనందంగా ఉంది. దైవారాధన చేయిస్తున్నాననే సంతోషం ఆ ముఖంలో వెలుగుతోంది.
సత్యన్నారాయణ వ్రతం పూర్తి చేసిన తర్వాత పెళ్లి వారింట్లోనే విందు భోజనం చేశారు విష్ణుమూర్తి గారు.
అదిగో ఆ సమయంలోనే ఎనిమిదో వార్డులో తన ఓటు వేసి శుభకార్యానికి వచ్చిన ఓ పెద్ద మనిషి భోజన సమయంలో విష్ణుమూర్తి గారిని చూశాడు.
“ఈయన ఇక్కడున్నారేంటి ” అనుకున్నాడు.
అనుకోవడమే కాదు… విష్ణుమూర్తి గారి దగ్గరకు వెళ్లి అడిగాడు కూడా ఇదే మాటని.
దానికి విష్ణుమూర్తి గారు ఓ నవ్వు నవ్వి…
“ఇది నా వృత్తి. అది నా రాజకీయం. మొన్న సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఇక ప్రజల ఇష్టం ఎవరిని ఎన్నుకోవాలో. నా వృత్తి నాకు కన్న తల్లి. అందుకే ఇక్కడకు వచ్చేశాను. ఇక ఓటంటారా. సాయంత్రం లోగా వెళ్లి నా ఓటు నేను వేసుకుంటా” అని సమాధానం చెప్పారు.
“అయ్యో! రెండు వందలకి ఆశ పడ్డాను. ఎంత తప్పు చేశాను” అని ఆ పెద్ద మనిషి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
భోజనం చేసిన తర్వాత విష్ణుమూర్తి గారు కూడా తన బుల్లెట్ బండి మీద అమలాపురానికి బయలుదేరారు.
సన్నటి మనిషి… ఆరు అడుగులకు ఇంకో రెండు అంగుళాల పొడవున్న మనిషి.
పంచె కట్టుకున్నారు. అంగ వస్త్రాన్ని నడుంకి కట్టుకున్నారు.
గుండెల నుంచి పొట్ట వరకూ ఏ ఆచ్ఛాదన లేదు.
బుల్లెట్ మీద విష్ణుమూర్తి గారు వెళ్తుంటే గాలికి ఆయన వంటిపై ఉన్న జంద్యం నృత్యం చేస్తున్న నాగుపాములా అటూ ఇటూ తిరుగుతోంది.
ఆయన వెనుక తల నుంచి మెడ వరకూ ఉన్న ముడి విప్పిన పిలక తాలుకు తల నీలాలు పైరగాలికి ఊగుతున్న వరి కంకుల్లా ఉన్నాయి.
అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు దాటి మూడు గంటలు కావడానికి ఇంకో పావు గంట పడుతుంది.
విష్ణుమూర్తి గారు నేరుగా పోలింగ్ బూత్‌కి వచ్చారు.
పురుష ఓటర్లు నిలుచున్న క్యూలో తన ఓటు కాగితాన్ని పట్టుకుని విష్ణుమూర్తి గారు కూడా నిలుచున్నారు.
అక్కడే కాపాలా ఉన్న ఓ కానిస్టేబుల్ విష్ణుమూర్తి గార్ని చూసి దగ్గరకు వచ్చాడు.
“మీరు అభ్యర్థి కదా…! ఇలా లోపలికి వెళ్లి ఓటు వేయండి” అన్నారు
.
“నేను ముందు ఓటర్ని. తర్వాతే అభ్యర్థిని. లైనులోనే వస్తాను” అన్నారు
విష్ణుమూర్తి గారు.
అలా ఓ ఇరవై నిమిషాలు నిలుచున్న తర్వాత ఆయనకి ఓటు వేసే అవకాశం వచ్చింది.
లోపలికి వెళ్లి అక్కడున్న అధికారులకి నమస్కరించి తనకిచ్చిన బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేసి బయటకు వచ్చేశారు విష్ణుమూర్తి గారు.
తన బుల్లెట్ మీద నేరుగా ఇంటికి వెళ్లిపోయారు.
విష్ణుమూర్తి గారు ఇంటికి వెళ్తున్నప్పుడు అధికార పార్టీ అభ్యర్థిని చూశారు. నవ్వారు.
అధికార పార్టీ అభ్యర్థి అప్రయత్నంగానే రెండు చేతులు జోడించి విష్ణుమూర్తి గారికి నమస్కరించారు.
*** *** ***
ఆ రోజు ఆగష్టు ఎనిమిదో తేది. అప్పటికి మూడు రోజులైంది ఓటింగ్ జరిగి. ఆ రోజే ఓట్ల లెక్కింపు. అంతకు ముందే బ్యాలెట్ పత్రాలని రాతి బడికి తరలించారు అధికారులు. అక్కడే ఓట్ల లెక్కింపు…
ఉదయం ఎనిమిది గంటలైంది.
ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్లని కట్టలు కట్టారు.
అభ్యర్థుల ఏజెంట్లు దగ్గరుండి లెక్కింపు ప్రక్రియని పరిశీలిస్తున్నారు.
అధికార పార్టీ అభ్యర్థి రాతి బడి ఎదురుగా ఉన్న కిళ్లీ కొట్టు దగ్గర కూర్చున్నారు. ఆయనకి సమీపంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కూడా కూర్చున్నారు.
విష్ణుమూర్తి గారు మాత్రం రాతి బడికి రాలేదు. వాళ్ల పెద్దబ్బాయి నాగాదిత్యతో పాటు ఆయన శిష్యులు ఇద్దరిని కౌంటింగ్ సెంటర్‌కి పంపించారు.
*** *** ***
“ఆయ్… కట్టలు కట్టారండి. మీయీ… ఇష్ణుమూర్తిగారి కట్టలు సరి సమానంగా ఉన్నాయండి. ప్రతిపక్షం వాళ్లవి కాసింత తక్కువ ఉన్నాయండి. ఆయ్”
అని లోపలి నుంచి వచ్చిన కార్యకర్త ఒకరు కిళ్లీ కొట్టు దగ్గరున్న అధికార పార్టీ అభ్యర్థికి చెప్పి తూటాలా మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు.
అధికార పార్టీ అభ్యర్థి విన్నారు. ఏం మాట్లాడలేదు.
తన పక్కనే వెండి మరచెంబులో ఉన్న నీళ్లని వెండి గ్లాసులో పోసుకుని గటగట తాగేశారు.
ఆయన మంచినీళ్లు తాగడం దూరం నుంచి చూస్తున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి తెలియకుండానే గుండెలు ఉప్పొంగాయి.
ఆయన పక్కనే ఉన్న కార్యకర్తతో “లోపటి నుంచి వేదో కబురొచ్చినట్టుంది. ఎక్స్‌పార్టీ గురుడికి కంగారుగా ఉన్నట్టుంది” అన్నారు.
దానికి ఆ కార్యకర్త “ఆయ్. మరేనండి… దావతేసినట్టుంది. నీల్లు కూడా తాగుతున్నారు” అన్నాడు ఆ కార్యకర్త.
“దావత కాదో… బయం.. బయవట్టుకున్నట్టుంది. సెవట్లు పట్టి నీల్లు తాగుతున్నారు” అన్నారు ప్రతిపక్ష అభ్యర్థి.
గంట గడిచింది… లోపలి నుంచి ఎవరూ రాలేదు…
గంటన్నర… రెండు గంటలు… ఇంకా ఎవరూ రాలేదు…
రెండున్నర గంటల తర్వాత ప్రతిపక్ష అభ్యర్థి దగ్గరికి వాళ్ల కార్యకర్త వచ్చాడు. ముఖం వేల్లాడేసుకున్నాడు.
“ఏటైందిరా.. అలాగున్నావు. సెప్పు. ఆడు ఓడిపోతాడా… ” అని అడిగారు ప్రతిపక్ష అభ్యర్థి.
“ఆయ్… ఆళ్లిద్దరికే పడుతున్నాయండి. మనకి మరీ అన్నాయంగా ఉందండి. అక్కడుండలేక వచ్చేశానండి. ఆయ్” అన్నాడు ఆ కార్యకర్త.
ఈ మాటలతో ప్రతిపక్ష అభ్యర్థికి నోట మాట రాలేదు.
మధ్యాహ్నం పన్నెండు గంటలైంది. కౌంటింగ్ సెంటర్లో చాలా టెన్షన్‌గా ఉంది.
విష్ణుమూర్తి గారి కొడుకు నాగాదిత్య కౌటింగ్ జరుగుతున్న టేబుళ్ల దగ్గర హడావుడిగా తిరుగుతూ తనతో పాటే ఉన్న విష్ణుమూర్తి గారి శిష్యుడ్ని పిలిచి “ఇంటికి వెళ్లి గురువుగార్ని రమ్మన్నానని చెప్పు” అన్నాడు.
శిష్యుడు ఒక ఉదుటున బయటకు గెంతి ఇంటి వైపు పరుగులు తీసాడు.
శిష్యుడు అలా పరుగులు పెట్టడం చూసిన అధికార పార్టీ అభ్యర్థికి చూరులోంచి వర్షపు నీరు వచ్చినట్లుగా జుట్టులోంచి చెమట రావడం ప్రారంభమైంది.
కౌంటింగ్ సెంటర్లోకి వెళ్దామా అనుకున్నారు అధికార పార్టీ అభ్యర్థి.
మళ్లీ ఆయనకి అహం అడ్డొచ్చింది.
ఏ మందీ మర్బాలం లేని స్వతంత్ర అభ్యర్థి… పైగా పంతులే ఇంట్లో కూర్చుంటే నేను వెళ్లడం ఏమిటి అని తర్కించుకున్నారు.
వెళ్లను. చివర వరకూ ఇక్కడే కూర్చుంటా. ఇది మనకు అచ్చొచ్చిన తలం అనుకుని లోపలికి వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. అందరిలోనూ కంగారుగానూ ఉంది.
ఓ పది నిమిషాల తర్వాత డు…డు…డు… అని శబ్ధం చేసుకుంటూ బుల్లెట్ మీద విష్ణుమూర్తి గారు రావడం కనిపించింది.
రాతిబడికి వచ్చిన విష్ణుమూర్తి గారు బుల్లెట్ స్టాండ్ వేసి ఓ సారి అధికార పార్టీ అభ్యర్థి వైపు చూశారు.
అంత వరకూ కుర్చున్న అధికార పార్టీ అభ్యర్థి లేచి నిలబడ్డారు.
విష్ణుమూర్తి గారు చిన్న చిరునవ్వు నవ్వి రాతిబడిలోకి వెళ్లిపోయారు.
కౌంటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఒక్క రౌండ్ మాత్రమే మిగిలింది. ఆ రౌండ్లో ఓట్లన్నీ దాదాపు అధికార పార్టీ అభ్యర్థికే పడతాయని వార్డులో అందరికీ తెలుసు.
బయట కూర్చున్న అధికార పార్టీ అభ్యర్థి దగ్గరికి అంతకు ముందు వచ్చిన కార్యకర్తే మళ్లీ వచ్చారు.
“ఆయ్. మనీదే మిగిలింది. అక్కడన్నీ మన వోట్లే. ఒక్కటీ బయటకి పోదు. మనవే గెలుత్తాం” అన్నాడు.
ఆ మాటకి అధికార పార్టీ అభ్యర్థికి ఊపిరి పోసినట్టు అనిపించింది.
“సర్లేవో… మనవిప్పుడు ఎంత మెజార్టీలో ఉన్నాం” అన్నారు అధికార పార్టీ అభ్యర్థి.
“మెజార్టీ కాదండి. ఇరవై మూడోట్లు తక్కువలో ఉన్నాం. పంతులు గారికి తొమ్మిది వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి. మనకేవో 941 వోట్లు వచ్చాయి. వింకా మనీధి ఉంది. కంగారు లేదు. గెలుస్తాం” అన్నాడు.
ఈ మాట విన్న అధికార పార్టీ అభ్యర్థికి గుండెల్లో రాయి పడ్డట్లు అయ్యింది.
కొంపదీసి మన వీధిలో ఎవరైనా ముంచితే ఏటి పరిస్థితి అనిపించింది.
“ఏం కాదులే… మనోళ్లు మనకే ఏత్తారు” అని తనను తానే సముదాయించుకున్నారు.
మనసెందుకో కీడు శంకించింది. పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తూ “ఈ టైంలో మనం లోపలుండాల. పద. నేను వత్తాను” అంటూ కౌంటింగ్ సెంటర్లోకి బయలుదేరారు అధికార పార్టీ అభ్యర్థి.
ఆఖరి కట్టలో ఓట్లు లెక్కట్టడం ప్రారంభించారు.
అధికార పార్టీ అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి.
వెనుకంజలో ఉన్న ఆయన మెల్లమెల్లగా ముందుకు వస్తున్నారు.
కొన్ని లెక్క పెట్టాక ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి.
అధికార పార్టీ అభ్యర్థికి మనసు కుదట పడింది.
“హమ్మయ్య!” అనుకున్నారో లేదో… ఓ మూడు ఓట్లు ధనస్సు మీద పడ్డాయి.
మళ్లీ అధికార పార్టీ అభ్యర్థికి కంగారు ప్రారంభమైంది.
అక్కడే కూర్చీలో కూర్చున్న విష్ణుమూర్తి గారు ఇదేమీ పట్టించుకోవడం లేదు.
తనకు సంబంధం లేదన్నట్లుగానే తానే రాసిన పంచాంగాన్ని చూసుకుంటున్నారు.
అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణుమూర్తి గారి పెద్దబ్బాయి “నాన్న గారూ, ఆ వీధిలో మనకి ఓట్లు పడుతున్నాయి” అన్నాడు.
విష్ణుమూర్తి గారు తలెత్తి చూసి మళ్లీ పంచాంగం చూసుకోవడంలో మునిగిపోయారు.
ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధికార పార్టీ అభ్యర్థికి ఓట్లు పడుతున్నాయి.
ఈసారి నాలుగు ఓట్లు విష్ణుమూర్తి గారి లెక్కలో పడ్డాయి.
పోటీ హోరాహోరీగా ఉంది.
పోటీ రంజుగా ఉంది.
పోటీ గుండెలు పిండెసేలా ఉంది
.
మళ్లీ ఓ ఓటు విష్ణుమూర్తి గారికి ఖాతాలో పడింది.
అధికారులు లెక్కలు చూస్తున్నారు.
ఒక్క విష్ణుమూర్తి గారిలో తప్ప అందరి ముఖాలోనూ ఓ టెన్షన్ కనపడుతోంది.
ఓట్ల లెక్కింపు ముగిసింది.
ఎన్నికల అధికారి తన స్థానంలోంచి లేచి నిలుచున్నారు. ఆ గదిలో ఉన్న వారంతా లేచి నిలబడ్డారు.
విష్ణుమూర్తి గారు మాత్రం లేవలేదు. కుర్చీలో కూర్చునే పంచాంగం చూసుకుంటున్నారు.
అలా లేచి నిలుచున్న ఎన్నికల అధికారి ఎనిమిది ఓట్ల తేడాతో అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు అని ప్రకటించారు.
అప్పుడు లేచారు విష్ణుమూర్తిగారు.
అలా నిలబడిన విష్ణుమూర్తిగారు ఆ హాలు అంతా ఓమారు చూశారు.
అందరికి నమస్కరించారు.
మెల్లిగా నడచుకుంటూ అధికార పార్టీ అభ్యర్థి దగ్గరికి వచ్చారు.
“సంతోషం. మీరు గెలిచారు. మీకు అభినందనలు” అన్నారు.
మళ్లీ ఆయనే “నేను ఓడాను కానీ.. నా సంఖ్యాశాస్త్రం ఓడిపోలేదు” అని అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.
ఆయన వెంటే కొడుకు, శిష్యులు కూడా బయటకు వచ్చేశారు.
సరిగ్గా ఆయన బయటకు వస్తున్నప్పుడే
అధికార పార్టీ అభ్యర్థి తన పక్కనున్న అనుచరులతో…
“ఒరేయ్ గెలిచాం కాని సంతోషం లేదర్రా. ఇంతకు ముందు నాలుగు వందల పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఎనిమిది ఓట్లకు పడిపోయింది. ఇది గెలుపు కాదురా” అన్నారు.
మళ్లీ ఆయనే “పంతులు గార్ని బెదిరించడానికి వెళ్లింది ఎంత మందిరా” అన్నారు.
“అదేంటండి. మీరేగా ఎనిమిది మంది వెళ్లండి అని చెప్పి పంపారు. మీరు చెప్పినట్లే ఎనిమిది మందే వెళ్లామండి” అన్నాడు వారిలో ఒకరు.
“మీ ఎనిమిది మంది నాకే ఓటేశారా… అనుమానంగా ఉందిరా” అంటూ వాళ్లకేసి చూసారు అధికార పార్టీ అభ్యర్థి.
అక్కడే ఉన్న ఆ ఎనిమిది మంది వాళ్లలో వాళ్లు “నేనైతే పంతులుగారికే ఓటేశా” అని మనసులో అనుకున్నారు.
వాళ్ల మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న అధికార పార్టీ అభ్యర్థి….
“విష్ణుమూర్తి గారు ఓడిపోలేదు”..
“విష్ణుమూర్తి గారు ఎక్కడికెళ్లినా తిరుగుండదు”
“విష్ణుమూర్తి గారు ఏం చెప్పినా అంతా వినాల్సిందే..”
“విష్ణుమూర్తి గారు జ్యోతిషానికి ఎదురేలేదు”
అనుకున్నారు.
ఆయన అలా అనుకుంటూండగా పక్కనే ఉన్న అనుచరుడు…
“ఆయ్… గెలిసాం కదా.. ఊరేగింపు.. బాణాసంచా ఏర్పాటు చేయనా” అన్నాడు.
“ఒరేయ్ పంతులు గారు ఓడి గెలిచారురా… మనం గెలిచి ఓడాం రా. ఊరేగింపులు వద్దు. బాణాసంచా వద్దు. ఇంటికెళ్లిపొండి” అన్నారు.
మళ్లీ ఆయనే… “రేపొద్దున్నే పంతులు గారింటికెళ్లి మున్సిపాల్టీలో పమాణ స్వీకారానికి ముహుర్తం పెట్టించుకొస్తారా” అని కూడా అన్నారు.
*** *** ***








Add comment