మనిషి సమస్త నమ్మకాల వెనుక ఉన్న మూల కారణం భయం. ఆ భయానికి మనిషి పెట్టుకున్న పేర్లెన్నో. వాటిలో భక్తి కూడా ఒకటి. మనిషికి తనకు తెలియని విషయాల పట్ల, తనకు ఎదురయ్యే కష్టాల పట్ల, అనారోగ్యం పట్ల కలిగే భయం ఒక్కోసారి నమ్మకంగా, మరికొన్నిసార్లు మూఢనమ్మకంగా రూపాంతరం చెందుతుంది. ఈ నేపథ్యంలోనే తండా జీవితాలను ఆవిష్కరిస్తూ, ఎర్రమార్కమ్మ అనే గ్రామదేవతను కేంద్రంగా చేసుకొని తండా ప్రజల నమ్మకాల వెనుక దాగి ఉన్న మూఢత్వాన్ని, ఆ మూఢత్వం సృష్టించే భయాలను, వాటి పర్యవసానాలను చిత్రించిన కథ ‘ఎర్రమార్కమ్మ’. ఈ కథను మౌని అనే కలం పేరుతో శ్రీకాంత్ నాయక్ రచించారు.
‘ఎర్రమార్కమ్మ’ కథ ఇక్కడ చదవండి!
సహజంగానే తండా జీవితం ఇటు పూర్తిస్థాయి అడవి జీవితానికీ, అటు నగర జీవితానికీ దూరంగా భిన్నంగా తనదైన ప్రత్యేక సంస్కృతితో ఉంటుంది. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, జీవన విధానం అన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. తమ అవసరాలకు ప్రకృతిపైనే ఆధారపడటమే కాకుండా, తమ జీవన విధానంలో ప్రకృతిని ఒక భాగంగా చేసుకున్నారు. అదే ప్రకృతిని దైవ స్వరూపంగా కూడా కొలుస్తారు. ప్రకృతికి కృతజ్ఞతగా పండుగలు జరుపుకుంటారు. తమ చుట్టూ ఉన్న ప్రకృతితో అనుసంధానమైన గ్రామదేవతలను, పొలాల్లో కాపలాగా నిలిచే పోతురాజు వంటి దైవాలను కొలుస్తారు. ఈ నమ్మకాలు వారి సంస్కృతిలో ఒక భాగంగా కొనసాగుతూ వస్తున్నాయి.
ప్రకృతిని గౌరవించడం, దాన్ని దైవంగా కొలవడం వరకు బాగానే ఉంది. కానీ ఈ తండా జీవితాల్లో విద్య, వైద్యం అందుబాటులో లేకపోవడం, మరీ ముఖ్యంగా ఆధునిక వైద్య విధానాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చినా చాలామంది దైవాన్నే ఆశ్రయిస్తారు. అడవుల్లో దొరికే మూలికలను ఉపయోగించడం, సంప్రదాయ పద్ధతుల్లో చికిత్స చేయడం వంటి ఆచారాలు కూడా వారి జీవితంలో భాగంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల జ్వరం వంటి అనారోగ్యాలు సహజంగానే తగ్గిపోతాయి. అయితే అవి తమ నమ్మకాల కారణంగానే తగ్గిపోయాయని భావించడం వల్ల ఆ నమ్మకాలకు మరింత బలం చేకూరుతుంది. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సరైన వైద్య చికిత్స అందకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పుడు దానికి కారణంగా ఏదో ఒక దేవత ఆగ్రహించిందని, లేదంటే ఏదో ఒక దయ్యం పట్టిందని భావిస్తారు. ఈ విధంగా ఒక నమ్మకం క్రమంగా మూఢత్వంగా మారి వారి జీవితాలను పూర్తిస్థాయిలో ప్రభావితం చేస్తుంది. ఈ సామాజిక నేపథ్యాన్ని రచయిత సహజంగా కథలో ఆవిష్కరించారు.
ఈ కథలో ప్రధానంగా కనిపించే పాత్రలు చిల్కి, తేజు, తేజు తల్లి, తేజు స్నేహితులు, ఐలయ్య. ఇందులో తేజు పాత్ర కథ ప్రారంభం నుంచి చివరి వరకు కనిపించినప్పటికీ, చిల్కి పాత్ర మాత్రమే కథకు చాలా బలంగా నిలుస్తుంది. అయితే కథలో అసలు సంఘర్షణకు కారణమైన పాత్ర మాత్రం కావలికార్ ఐలయ్య. ఐలయ్య మామిడి తోటకు కాపలాదారుగా ఉంటాడు. ఆ తోటలో ఎర్రమార్కమ్మ ఉంటుంది. ఒకరోజు తేజు తన స్నేహితులతో కలిసి ఆ మామిడి తోటకు వెళ్లి ఆడుకుంటుండగా, ఒకవైపు నుంచి ఐలయ్య గొంతు వినిపిస్తుంది. ఊహించని ఆ సంఘటనతో పిల్లలందరూ భయపడి పారిపోతుంటే, తేజు మాత్రం భయంతో కొద్దిసేపు అక్కడే స్తంభించిపోయి నిలబడిపోతాడు. ఆ తర్వాత స్నేహితులతో పాటు తను కూడా పారిపోతాడు. ఐలయ్య తన ఇంటికి వస్తాడేమో అనే భయం అతనిలో అలాగే ఉండిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందో ఎవరికీ చెప్పలేకపోతాడు. కొద్దిగా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. అతని ప్రవర్తనలో కనిపించిన మార్పును గమనించిన దాది చిల్కి, తేజును ఏమైందని ప్రశ్నిస్తుంది. అక్కడి నుంచి తేజుకు ఎదురైన అనుభవం, చిల్కి మనసులో ఏర్పడిన భయాలు, నమ్మకాలు, ఆ నమ్మకాల ప్రభావం కథలో ప్రధానంగా కనిపిస్తాయి.
భయంతో నిర్ఘాంతపోయిన తేజు పరిస్థితిని అర్థం చేసుకోకుండా, దానికి కారణాలను వెతకకుండా ఎర్రమార్కమ్మ పట్టిందని చిల్కి తనలో తానే ఒక భయాన్ని ఏర్పరచుకుంటుంది. మనవడిపై ప్రేమ, ఆప్యాయతలు సహజంగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ ప్రేమే చిల్కిని ఆలోచించనీయకుండా చేస్తుంది. తేజు తోటకు వెళ్లాడనే విషయం ఆమెలో మరింత భయాన్ని రేపుతుంది. ఆ భయం క్రమంగా తేజుకు ఎర్రమార్కమ్మ పట్టిందనే నమ్మకంగా మారుతుంది. ఇది కథలో కీలకమైన అంశం. ఇలాంటి భయాలు తండాల్లోనే కాకుండా అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంటాయి. ఒక మనిషి అనారోగ్యానికి గురైనా, మానసిక సంఘర్షణకు లోనైనా, భయంతో అసాధారణంగా ప్రవర్తించినా, దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఏదో ఒక దేవతకు లేదా దైవశక్తికి ఆపాదించడం జరుగుతుంటుంది. తేజు విషయంలోనూ అదే జరిగింది. అతని మనసులో ఏర్పడిన భయం క్రమంగా ఎర్రమార్కమ్మ పట్టిందనే నమ్మకంగా మారుతుంది. ఇక్కడ రచయిత కేవలం ఒక దేవతపై ఉన్న నమ్మకాన్ని విమర్శించడమే కాకుండా, ఒక మనిషికి ఎదురైన సమస్యను అర్థం చేసుకోకుండా దానికి మూఢనమ్మకాల ద్వారా పరిష్కారం వెతికే సామాజిక ధోరణిని ప్రశ్నించడం కనిపిస్తుంది.
ఇక్కడ ఎర్రమార్కమ్మను కేవలం ఒక గ్రామదేవతగా మాత్రమే చూడలేం. తండా ప్రజల సమష్టి నమ్మకానికి, తరతరాలుగా వారి జీవితాల్లో కొనసాగుతున్న భయానికి కూడా ఆమె ఒక ప్రతీకగా కనిపిస్తుంది. ఎర్ర మార్కమ్మ నేపథ్యాన్ని కథ మొదట్లోనే రచయిత వివరిస్తాడు. తేజుకు ఎదురైన సంఘటన వాస్తవానికి ఒక భయానుభవం మాత్రమే. కానీ ఆ అనుభవాన్ని చిల్కి తనకు తెలిసిన నమ్మకాలతో అనుసంధానం చేయడంతో అది ఎర్రమార్కమ్మకు సంబంధించిన భయంగా మారుతుంది. అంటే ఎర్రమార్కమ్మ ఉనికికంటే, ఆమె చుట్టూ సమాజం నిర్మించుకున్న నమ్మకాలు, ఆ నమ్మకాల ప్రభావం కథలో ప్రధానంగా కనిపిస్తాయి. ఒక వ్యక్తికి కలిగిన భయం మరొకరిలో ఉన్న నమ్మకాన్ని బలపరచడం, ఆ నమ్మకం తిరిగి భయాన్ని పెంచడం ఈ కథలోని అంతర్లీనమైన సంఘర్షణగా కనిపిస్తుంది.
ఈ కథలో చిల్కి పాత్రను మనం ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తేజుపై ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతలు సహజమైనవి. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. తేజు సమస్యను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోకుండా తనకున్న నమ్మకాల పరిధిలోనే ఆ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకవైపు మనవడిని కాపాడుకోవాలనే తపన, మరోవైపు సామాజికంగా లేదా తరతరాలుగా తనకు సంక్రమించిన విశ్వాసాలు ఆమెను ముందుకు నడిపిస్తాయి. అందువల్ల చిల్కి పాత్రను కేవలం మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తిగా చూడలేం. ఆమె పాత్ర ద్వారా ఒక సమాజం, ఒక తరం నమ్మకాలు, ఆ నమ్మకాల వెనుక ఉన్న భయాలు, ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. ఆ ప్రేమ, భయాలు, ఆప్యాయతలు ఆమెను ఏ స్థాయికి తీసుకెళ్తాయంటే, హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న తన మనవడికి వైద్యం చేయించడాన్ని తిరస్కరించి, అతన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చేంత వరకు తీసుకెళ్తాయి. ఇక్కడ చిల్కి భయాన్ని కేవలం మూఢనమ్మకాల్లోనే కుదించలేం. ఎందుకంటే దానికి మనవడిపై ఉన్న ప్రేమ కూడా తోడవుతుంది. దానికి తోడు ఆ తండాలో కొన్ని తరాలుగా కొనసాగుతున్న నమ్మకాలు ఆమె భయాలకు కారణమవుతాయి.
ఇక్కడ చిల్కి పాత్ర మనకు బలంగా కనిపించినప్పటికీ, ఆమె భయానికి అసలు కారణం ఏమిటనే విషయంలో కొంత స్పష్టత లోపించింది. ఒక మనిషిపై సామాజికంగా ప్రభావం చూపే నమ్మకాల తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ అదే నమ్మకం వ్యక్తిగత అనుభవంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. చిల్కి వైద్యాన్ని నిరాకరించి, తన నమ్మకాన్నే పట్టుకొని మనవడిని ఇంటికి తీసుకురావడానికి వెనుక ఆమెకు ఎదురైన గత అనుభవాలను కూడా రచయిత జోడించి ఉంటే చిల్కి పాత్ర మరింత బలంగా రూపుదిద్దుకునేది. విశ్వాసాల వెనుక గత అనుభవాలను ఆవిష్కరించి ఉంటే ఆ పాత్రలోని భయానికి మరింత బలం చేకూరేది. ఎందుకంటే ఒక వ్యక్తి స్వయంగా అనుభవించిన భయం ఒక రకంగా ఉంటే, సమాజంలో తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న నమ్మకాల ద్వారా ఏర్పడే భయం మరో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ చిల్కికి కలిగిన భయం ఆమె గత అనుభవాల నుంచి వచ్చిందా, లేక తరతరాలుగా సామాజికంగా సంక్రమించిన నమ్మకాల నుంచి వచ్చిందా అనే విషయంలో స్పష్టత కొరవడింది. కథలో సామాజిక అంశాన్ని వస్తువుగా తీసుకున్నప్పటికీ, ఆ మూఢనమ్మకాల వెనుక ఉన్న సామాజిక, చారిత్రక, ఆర్థిక పరిస్థితులను కూడా మరింత లోతుగా ఆవిష్కరించినప్పుడే ఆ నమ్మకాలకు ఎందుకు అంత బలం చేకూరిందో పాఠకులకు అర్థమవుతుంది. ఈ అంశమే చిల్కి పాత్రలో కొంత లోపించినట్లు అనిపిస్తుంది.
తేజు పాత్రలో కూడా బాల్య మనస్తత్వానికి సంబంధించిన ఒక కోణం కనిపిస్తుంది. పిల్లలకు ఎదురయ్యే చిన్న సంఘటనలు కూడా ఒక్కోసారి వారి మనసులో పెద్ద భయాలుగా మిగిలిపోతాయి. ఆ అనుభవాలను అర్థం చేసుకోవడానికి వారికి పెద్దల సహాయం అవసరం. కానీ ఇక్కడ తేజు భయాన్ని అర్థం చేసుకోవాల్సిన పెద్దలే దానికి మరో అర్థాన్ని ఆపాదిస్తారు. తేజుకు తనకు ఎదురైన అనుభవాన్ని పూర్తిగా చెప్పే అవకాశం లేకపోవడం, అతని ప్రవర్తనను పెద్దలు తమ నమ్మకాల పరిధిలో అర్థం చేసుకోవడం కథలోని విషాదాన్ని మరింత పెంచుతుంది. తేజు, తేజు స్నేహితుల పాత్రలు మనల్ని మన బాల్యపు రోజులను గుర్తుచేస్తాయి.
అలాగే తేజు తల్లి పాత్ర ఒక కోడలిగా తన అత్తకు ఎదురు చెప్పలేని నిస్సహాయ పాత్రగా కనిపిస్తుంది. కుటుంబ కట్టుబాట్ల ముందు ఒక తల్లిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఒక తల్లిగా తన బిడ్డకు వైద్యం అందించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, కుటుంబంలోని పెద్దల నిర్ణయాల ముందు ఆమెకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ మూఢనమ్మకాల సమస్యతోపాటు కుటుంబ వ్యవస్థలో స్త్రీకి ఉన్న పరిమిత అధికారం కూడా కనిపిస్తుంది. చిల్కి కుటుంబంలో పెద్దదిగా నిర్ణయాలు తీసుకుంటే, తేజు తల్లి ఆ నిర్ణయాల ముందు మౌనంగా ఉండిపోతుంది. అంటే ఒక స్త్రీ మరో స్త్రీపై ఆధిపత్యం చెలాయించే కుటుంబ వ్యవస్థ కూడా ఇందులో కనిపిస్తుంది. ఈ అంశాన్ని కథలోని కొన్ని సంభాషణలు మరింత స్పష్టంగా చూపిస్తాయి. అంతేకాకుండా చిన్నప్పటి నుంచే స్త్రీలను చిన్నచూపు చూసే దృష్టికోణం పిల్లల్లో నాటుకుపోయిన విధానం కూడా ఇందులో కనిపిస్తుంది.
ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఐలయ్య పాత్ర గురించి. కథలో ఈ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కథలోని సంఘర్షణకు మూలకారణం ఈ పాత్రే. ఐలయ్య పాత్రలో తన బాధ్యతలను నిర్వర్తించే ఒక కావలికార్ కనిపిస్తాడు. తన యజమాని అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడమే అతని జీవనోపాధి. ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ఐలయ్య కఠినంగా కనిపిస్తాడు. ఇందులో యజమాని పట్ల అతనికున్న విధేయత, తన బాధ్యతను నిర్వర్తించడానికి ఇతరులపై చూపించే అధికారం వంటి అంశాలు కనిపిస్తాయి. అయితే ఐలయ్య ఉద్దేశం పిల్లలను భయపెట్టడం కాకుండా తన బాధ్యతను నిర్వర్తించడమే కావచ్చు. కానీ అతని గొంతు తేజు మనసులో భయంగా మిగిలిపోతుంది. ఒక వ్యక్తి తన జీవనోపాధి కోసం చేసే పని, మరొక వ్యక్తి మనసులో ఎంతటి ప్రభావాన్ని చూపించగలదో ఈ పాత్ర ద్వారా అర్థమవుతుంది.
ఇక కథా నిర్మాణం, కథావస్తువు విషయానికొస్తే, గతంలో వచ్చిన బంజారా కథలను పరిశీలిస్తే, వాటిలో ఎక్కువ శాతం కథలు ప్రత్యేకంగా బంజారా జీవితాల కాకుండానే బంజారా పదాలను చేర్చడం ద్వారా వాటిని బంజారా కథలుగా పేర్కొన్నప్పటికీ, వాటిలో తండా వాతావరణం, తండా ప్రజల జీవిన విధానం, జీవనశైలి ఇవ్వన్ని తక్కువగా కనిపిస్తుంది. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈ కథలో చాలా సూక్ష్మమైన విషయాల ద్వారా తండా వాతావరణాన్ని మన ముందుంచారు. పందిరికి వేలాడదీసిన బుట్టలో రొట్టెలు, ఎడ్లబండి, జొన్నగట్క, సల్ల వంటి చిన్నచిన్న వివరాలు కథలోని తండా జీవన చిత్రణకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. అలాగని బంజారా పదాలను ఉపయోగించలేదని కాదు. ఆ పదాలన్నీ చదువుతున్నప్పుడు ఎక్కడా పంటికింద రాయిలా తగలవు. కథలో భాష సరళంగా, సహజంగా సాగుతుంది. బంజారా జీవితాన్ని చూపించడానికి కేవలం ఆ సమాజానికి సంబంధించిన పదాలను ఉపయోగించడం మాత్రమే సరిపోదు. అక్కడి ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కుటుంబ సంబంధాలు, నమ్మకాలు, పరిసరాలు కథలో సహజంగా భాగమైనప్పుడే ఆ జీవితం పాఠకుడి ముందు ఆవిష్కృతమవుతుంది. ఈ విషయంలో రచయిత చేసిన ప్రయత్నం కథకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అయితే కథలో చిత్రించిన ఒక తండా జీవితాన్ని మొత్తం బంజారా సమాజానికి ప్రతినిధిగా చూడకూడదు. ఆ తండా ప్రత్యేకతలను, అక్కడి నమ్మకాలను వాటి పరిధిలోనే అర్థం చేసుకోవాలి.
కథావస్తువు, కథ ఎత్తుగడ, రచయిత ఉపయోగించిన భాష కూడా బాగున్నాయి. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. వివరణలో వ్యవహారిక భాషను, సంభాషణల్లో తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించడం కథకు సహజత్వాన్ని తీసుకొచ్చింది. అయితే కొన్ని చోట్ల వివరణలోని వాక్యాలు కూడా వ్యవహారిక భాషలోనే కొనసాగి ఉంటే బాగుండేదనిపిస్తుంది. మరికొన్ని చోట్ల మాండలిక పదాలు కనిపించినప్పటికీ, వాక్య నిర్మాణం సరిగా లేని సందర్భాలు ఉన్నాయి. అక్కడక్కడా అనవసరమైన వాక్యాలు కూడా కనిపిస్తాయి. అందువల్ల కొన్ని చోట్ల వాక్య నిర్మాణంలో మార్పులు, మరికొన్ని చోట్ల అనవసరమైన వివరణలను తొలగించడం అవసరమనిపిస్తుంది.
కథలోని ప్రకృతి వర్ణనలు, తండా పరిసరాల చిత్రణ కూడా కథకు ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. అవి కేవలం నేపథ్యాన్ని చూపించడానికి మాత్రమే కాకుండా, ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని పాఠకుడికి పరిచయం చేస్తాయి. ముఖ్యంగా చిన్నచిన్న వస్తువులు, ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవన వివరాల ద్వారా రచయిత తండా జీవితాన్ని మన కళ్లముందు నిలిపే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి వర్ణనలు కథలోని ప్రధాన సంఘర్షణకు ఎంతవరకు ఉపయోగపడ్డాయనే కోణంలో కూడా పరిశీలించవచ్చు. కథలోని ప్రతి వివరణ కథా వాతావరణాన్ని నిర్మించడంతోపాటు, ప్రధాన ఇతివృత్తానికి కూడా ఏదో ఒక విధంగా అనుసంధానమై ఉంటే కథనం మరింత బిగువుగా ఉండేది.
కథ ముగింపును కూడా ఈ నేపథ్యంలో పరిశీలించాలి. తేజు అనారోగ్యం, చిల్కి నమ్మకం, వైద్య చికిత్స పట్ల ఆమెకు ఉన్న సందేహం వంటి అంశాలన్నీ చివరికి ఏ పరిణామానికి దారితీస్తాయో కథ ముగింపు నిర్ణయిస్తుంది. ముఖ్యంగా తేజు కోలుకోవడంలో వైద్యానికి ఉన్న పాత్ర, చిల్కి నమ్మకంలో వచ్చిన మార్పు లేదా ఆ నమ్మకం అలాగే కొనసాగడం వంటి అంశాలు కథలోని ప్రధాన సంఘర్షణకు సంబంధించినవి. ఈ ముగింపు పాఠకుడికి ఎలాంటి ఆలోచనను మిగులుస్తుందో పరిశీలించినప్పుడు కథలోని అంతర్లీన భావం మరింత స్పష్టమవుతుంది. ఒక మనిషి ప్రాణం విషయంలో నమ్మకం ఎంతవరకు ఉండాలి? ఆ నమ్మకం ఎప్పుడు మనిషికి ఆసరాగా నిలుస్తుంది, ఎప్పుడు ప్రమాదంగా మారుతుంది? అనే ప్రశ్నలు పాఠకుడి ముందుకు వస్తాయి.
మొత్తంగా చెప్పాలంటే, బాల్యపు జీవితాన్ని గుర్తుచేస్తూ, తండా జీవిత చిత్రణను, తండా సంస్కృతిని, మూఢవిశ్వాసాలను, వాటి పర్యవసానాలను మన ముందుంచిన కథ ‘ఎర్రమార్కమ్మ’. ప్రకృతితో ముడిపడిన తండా జీవన విధానాన్ని చిత్రిస్తూనే, ఆ సమాజంలో కొనసాగుతున్న కొన్ని నమ్మకాలు మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో రచయిత ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒక చిన్న భయానుభవం ఎలా దైవభయంగా మారుతుంది, ఆ భయం ఒక కుటుంబం తీసుకునే నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశం కథలో ప్రధానంగా కనిపిస్తుంది. కథలోని కొన్ని పాత్రల నేపథ్యాన్ని, నమ్మకాల వెనుక ఉన్న సామాజిక పరిస్థితులను మరింత లోతుగా ఆవిష్కరించి ఉంటే కథ ఇంకా బలంగా ఉండేదనిపిస్తుంది. ఇది రచయితకు మొదటి కథ అయినప్పటికీ తండా జీవితాన్ని, అక్కడి సంస్కృతిని, మనుషుల నమ్మకాలను సహజమైన వాతావరణంలో చిత్రించిన కథగా ‘ఎర్రమార్కమ్మ’ నిలుస్తుంది.
*








Add comment