ఎర్ర మార్కమ్మ కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలలోని, గ్రామీణ ప్రాంతాలలోని, ఒక గ్రామదేవత. రౌద్రానికి, రుధిరానికి ప్రతీకగా నిలుస్తూ, గ్రామీణుల ఆపతి, సంపతులలో తోడుంటుంది. ఎవరికయితే ఎర్ర మార్కమ్మ కొంటెతనం ఉంటుందో, వారి నుండి ఖరాఖండిగా ఆ తల్లి రక్తబలినే కోరుతుంది. విశేషమేమిటంటే, ఆ బలి యాట మాంసం తిన్న బంధు మిత్రుల ఇండ్లకు, వారు తిన్న మాంసంతో పాటు తోడు వస్తుందని, అందుకే ఎవరికయితే కొంటెతనం ఉంటుందో, వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ దేవికి శాంతి చేయాలనేది ప్రతీతి.
*
ఎండలు మాడు పగలగొడుతున్నాయి. రోయిణిలో రోళ్లు పగుల్తాయన్న పెద్దల మాటను నిజం చేస్తున్నాయి. ఎండలకు తోడు రేగిన వడగాలి ఒంట్లో ఉన్న నీటినంతా లాగేస్తున్నది. రంగు బట్టలేసుకున్న వాళ్లపై ఉప్పుచారికలు పాయల్లా కన్పిస్తున్నాయి.
వడ గాలుల సెగ బలంగా తగుల్తోంది. మనుషులైతే, చెట్ల కొమ్మలు నరికి పందిర్లు ఏర్పాట్లు చేసుకున్నారు, జివాలకు కష్టం తప్పట్లేదు. గొడ్డు గోదకు తాగేందుకు సరిపడ నీరు లేక లోతైన బావులున్న రైతులు, అడుగున ఉన్న రాళ్ల సందులోంచి ఊరిన చెలిమ నీటిని తోడి బోదర్లు ఏర్పాటు చేయగా పశువుల పేగైనా తడుస్తలేదు. కరువు నేలలో దాదాపు చుట్టుపక్కల ఊర్లలోనూ ఇదే పరిస్థితి. ఎండ ఎటు చూసినా పరచుకొని ఉండడంతో ఎండ పొడ తప్పించుకునేందుకు ఎవరికీ ఏ అవకాశము లేకుండా పోయింది. ఎండాకాలం సెలవులు, పిల్లలు ఎండను ఖాతర్ చేయకుండా గల్లీలన్నింటిని ఒకటి చేస్తున్నారు.
పిల్లల కాళ్లు ఒక దగ్గర నిలవడం లేదు. లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుక్కుంటూ తాండా అంతా ఏకం చేస్తున్నారు. కోతి కొమ్మొచ్చి, పైసలాట, ఇంకా ఎన్నో ఆటలు ఆడుకుంటున్నారు. పిల్లలందరూ రోజులానే ఆటలకు సిద్ధమయ్యారు. చిల్కి బాయి ముద్దుల మనవడు, తొల్చురు బిడ్డ తేజు. దాది ప్రత్యేకంగా తన కోసం, తన మనవడి కోసం వండిన జొన్నగట్కను, మీగడ పెరుగుతో తిని తండా మీదికి యుద్దానికి బయలుదేరినట్లు వెళ్ళిపోయాడు తేజు.
ఎనిమిదైనా దాట లేదు. పిల్లలు తాము ఎప్పుడు కలుసుకునే రావి చెట్టు కింద జమయ్యారు. వచ్చి రాగానే గోటిలాట ఆడడం మొదలుపెట్టారు. తేజు తెచ్చిన పన్నెండు గోళీలు నాలుగు ఆటలకే తేలిపోయాయి. సరే బదల్ అడిగి ఆడుదామంటే నిన్న, మొన్నటి బదల్ ఇంకా తీరనేలేదు. దాంతో ఏ ఒక్కరు బదల్ కి సాహసించడం లేదు. చేతులు ఖాళీ అవ్వడంతో చేసేదేమీ లేక రావి చెట్టును ఆనుకుని కొన్ని అడుగుల దూరంలో పక్కనే ఉన్న మర్రి చెట్టు, ఊడను పట్టుకొని తేజు ఊగుతుంటే, పక్కనే ఉన్న చింటుగాడు,
“ఎక్కువ ఊగకు. ఆ ఊడ ఊడుతది” అన్నాడు తేజుతో.
“ఏం ఊడదు” అంటూ ఊడని చుట్టూ తిప్పుతున్నాడు తేజు.
“అట్ల చెయ్యకు తల తిరుగుతది” అన్నాడు చింటుగాడు.
“నాకు తల ఏం తిరగదు” అంటూ తేజు గిర్రున బొంగరంలా తిరిగాడు. నాలుగు చుట్లు తిరిగాడో లేదో చూపంత కదిలిపోయినట్టు, తల ఇరిగిపోతున్నట్లు అనిపించి ఆగిపోయాడు. ఎక్కడ తన దోస్తులు తన్ను చూసి నవ్వుతారోనని, తనని తాను పడకుండా బలంగా నిలబెట్టుకున్నాడు. తనకేమి కాలేదు అని నమ్మించేందుకు, తేజు ఉబ్బి ఉన్న మర్రి వేరు పై దొరలా కూర్చుని, తనను తను నిలబెట్టుకున్నాడు . చుట్టూ చూశాడు. దోస్తులు తననే చూస్తున్నారు. మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి ఉంచాడు. ఎంతసేపటికి వాళ్ళ చూపులు ఇంకోవైపు మల్లకపోవడంతో,
“అరేయ్… ఐలయ్య లేడురా” అంటూ లేచి హుషారుగా అన్నాడు తేజు.
వెంటనే ఇంకో ఇద్దరు కూడా “అవునవును ఎటో ఎల్లిండంట” అన్నారు.
“అరేయ్ దొరికితే, ఈపు సింతపండే. సెట్టుకు కట్టేస్తడు. మస్తుగ కొడతడు. జుర్మాన కూడా. సక్కగా ఆటలు ఆడుకుందాం” అన్నాడు ఇంకో మిత్రుడు.
“గింత భయం పడుతున్నవ్, నువ్వు రాకు. మేం పోతం. నాతో మామిడి తోటకు ఎంత మంది అస్తున్నరు?” అడిగాడు తేజు.
అక్కడున్న పది మందిలో నలుగురే చేతులెత్తారు. మిగిలిన వాళ్ళు ఏమి పలకలేదు . తేజు వాళ్ళ వంక చూస్తూ “ఛోరీ(అమ్మాయి) లెక్క భయపడుతున్నరు. గింత భయం దేనికి”?
తేజు పక్కనే ఉన్న మిత్రుడొకడు, “మనకెందుకురా, రాకపోని మనకే మంచిది. మనం పోదం నడు, మనమే మంచి మామిడిపండ్లు తినచ్చు” అన్నాడు. తేజు, తన నలుగురు దోస్తులతో కలిసి తోటలోకి ఎటువైపు నుండి వెళ్తే బాగుంటుందోనని అనుకుంటూ అడుగులు వేశారు.
తండాకి పక్కనే, దగ్గరలోనే కాపోల్ల పదారు ఎకరాల మామిడి తోట ఉన్నది. మే నెలాకరికల్లా తోటలోని పండ్లనన్నింటికీ మార్కెట్కు తరలించే ప్రయత్నం చేస్తారు కాపులు. మామిడికాయలను కాపాడుకోవడానికి ఒక కావల్ కార్ ను నియమిస్తారు. అలా ఐలయ్యను నియమించారు. తన తండ్రి పెద కాపుకు నమ్మకస్తుడైన పని వాడు కావడం, తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం ఐలయ్య చిన్న కాపు దగ్గర పనికి కుదిరాడు. ఐలయ్య తోట నాటిన నుండి కావల్కార్ గా ఉన్నాడు. పదారు ఎకరాల తోట వయస్సు అక్షరాల పదారు సంవత్సరాలు. ఏ చెట్టుకు ఎన్ని కాయలు కాస్తాయి. ఏ మూల నుండి ఎవరు తోటలోకి చొరబడతారు. తోటలోకి దూరిన పిల్ల దొంగలను ఎలా పట్టుకోవడం, వారిని పట్టుకొని చెట్లకు కట్టేసి, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు, దండుగ రాబట్టడం ఇదంతా ప్రతి ఎండాకాలపు కధే.
చాలాసార్లు రాత్రుళ్ళు తాండవాళ్ళు తోటలోకి ప్రవేశించి, పెద్ద పెద్ద చెట్లు ఎక్కి, పెద్ద కొమ్మల పై కూర్చుని సంచుల నిండా మామిడికాయలు నింపుకుంటుంటే, అంత చీకట్లో కూడా వాళ్ళని దొరకపట్టి వారి దగ్గర నుండి కూడా దండిగా దండుగ రాబట్టిన దండివాడు. అందుకే ఐలయ్య ఉండగా తోటవైపు చూడడానికి కూడా తండా వాళ్లు సాహసించరు.
తేజు, తన మిత్రులు ఓ మూల నుండి వైరు కంచెల మీద కాలు పెట్టి కిందికి తొక్కి, తల వైరుకి తగలకుండా దాటుకుని తోటలోకి అడుగుపెట్టారు.
పచ్చని ఆకులతో చెట్లు మెరిసిపోతున్నాయి. నేల నిండా ఎండిపోయిన, పండిపోయిన కాయలతో, కోతులు, కాకులు తిని వదిలేసిన పండ్లతో నిండి ఉంది. తోట నిండా తియ్యని వాసన. ఎండ తాకిడి తాళలేక చిన్న చిన్న పిట్టలు అప్పటికే చాలా రాలిపోయి ఉన్నాయి. వీస్తున్న గాలికి ఆ చచ్చిన పిట్టల శరీరాల మీద ఈకలు కదులుతున్నాయి.
ఎందుకైనా మంచిదని, తేజు ఆ మూల నుండే తోట అంతా గమనించాడు. ఐలయ్య లేడని బలంగా అనుకున్న తర్వాతే , తన మిత్రులను ముందుకి కదలమని సైగ చేశాడు. ఇద్దరూ మిత్రులు చచ్చిపడి ఉన్న పిట్టలు ఏం పిట్టలో చూస్తూ ఉంటే, ఇంకో ఇద్దరు ముందుకు నడుస్తూ ఉన్నారు. నేల మీద పడి ఉన్న పండ్లని తీసి తినబోయాడు మయిగాడు.
“ఎందుకంత తొందర? జర్రసేపు ఆగు. ఎన్ని కావాలంటే అన్ని తిందువు” అని తేజు అన్నాడు. మయి తన చేతిలో పండును పడేసాడు. నోట్లో ఊరిన సొంగను ఉమ్మేసాడు.
తోటలో కోత అయిపోయిన తర్వాత మిగిలిపోయిన మామిడికాయలను, ఆకుల సందుల్లో దాగిన, దోర మామిడిపళ్ళను, చిటారు కొమ్మన కోయడానికి వీలు లేకుండా వదిలేసినవి, రాకాసి ఎర్ర చీమల గూళ్లకు బెదిరి వదిలిపెట్టిన కాయలు కోసుకొని తినడంలో తేజు, వాడి దోస్తులు ఆరితేరారు.
ఐలయ్య ఆరోజు వాళ్ల గూడెంలో పెళ్లికి వెళ్ళాడు. సాయంత్రం దాకా రాడు. తోటలో పదింట ఒక వంతు కోతకు సిద్ధమై, కోతకాబడలేదనే సంగతి తండా ప్రజలకు, పిల్లలకు తెలియనిదేం కాదు.
ఇక తోట అంతా వాళ్ళదే. ఆ తోటకి వాళ్లే రాజులు, వాళ్లే మంత్రులు. ముందే ఎండాకాలం. ఎండ నుంచి తప్పించుకోవడానికి పిల్లలు ఆ చెట్ల కింద తిరుగుతూ ఉంటే, చెట్ల నీడ ఎంత చల్లగా ఉందో. ప్రతి చెట్టుకి దగ్గరలో పెట్టిన నల్లని పైపులు దూరం నుంచి చూస్తుంటే నల్ల పాములు అప్పుడే తమ రంద్రాల నుండి బైటికి తొంగి చూస్తున్నట్లున్నాయి.
తేజు, తన మిత్రులు చెట్టు చెట్టు తిరిగి, ఎక్కడెక్కడ ఎన్ని పండ్లు ఉన్నాయో లెక్కపెడుతున్నారు. ఎవరెవరు ఏ చెట్టు నుండి పళ్ళను తెంపుకోవాలో చూసుకుంటున్నారు. చెట్ల మీద రాళ్ళతో గుర్తులు గీసుకుంటున్నారు. తోటలో అక్కడక్కడున్న అల్లనేరెడు చెట్లకు అప్పుడప్పుడే పక్వానికి వస్తున్న అల్లనేరెడు పళ్లును, గుత్తులు గుత్తులుగా తెంపి తింటున్నారు. జేబుల నిండా నింపుకుంటున్నారు. పిల్లల నాలుకలన్నీ నీలిరంగులోకి మారిపోయాయి. ఒకరికి ఒకరు నాలుకలు చూపించుకుని సరదా పడుతున్నారు. నేరేడు పళ్లు తినడంతో నోట్లో తేమ తగ్గిపోయింది. తోటలోని పైప్లైన్లల్లో నీళ్ల కోసం చూసారు. కొన్ని కొన్ని పైప్లలో నీళ్లు ఉన్నాయి. కొన్ని కొన్ని పైపులలో ఏమీ లేవు. దాగి ఉన్న నీళ్లను తమ నోటి బుగ్గలలో గాలిని అదిమిపెట్టి, నీటిని పీల్చి, దూప తీర్చుకుంటున్నారు. దాంతో నాలుక వగరు, వగరుగా ఉంది .
ఇదంతా ఇలా ఉండగా రానన్న దోస్తులు కూడా తోట చేరుకున్నారు. వాళ్లు వస్తున్నది చూసిన చింటూ గాడు,
“అరె తేజ, మయి, చిన్న, అటు సూడుర్రి” అన్నాడు చింటూ.
తేజు చింటూ గొంతు వింటూనే, ఐలయ్య ఏమైనా వచ్చాడా ఏమో అని భయపడ్డాడు.
“అర్రే, దొంగ బడవే గాళ్ళు వస్తున్నరు, సూడు తేజు” అన్నాడు మయి.
తేజు అటుగా చూసి, “నేను ముందే అనుకున్న. సరే రాని, అందరం కలిసి కాసేపు ఆడుకుందాం” అన్నాడు తేజు.
“అరె, ఏమొద్దురా, ఆళ్లని వేరేగా ఆడుకోమని చెబుదాం” అన్నాడు మయి.
“ఏం వద్దు అందరం కలిసి ఆడుకుందాం” అన్నాడు తేజు. తేజు మాటలకి మయికి ఎక్కడలేని కోపమొచ్చింది. తేజుని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు.
మిగిలిన మిత్రులు దగ్గరవుతున్నప్పుడు తేజు మదిలో ఓ ఆలోచన వచ్చింది. ‘ఒకవేళ ఐలయ్య కనక వచ్చాడే అనుకో, పదిమంది ఉన్నాం. పదిమంది కలిసి ఒక్క ముసలోడిని కొట్టలేమా? పదిమందికి పదిమంది దొరికిపోతామా? వానితో దొంగా పోలీస్ ఆట ఆడుకుంటం!’ పౌరుషంగా తనకు తాను చెప్పుకున్నాడు.
వచ్చిన మిత్రులందరికీ లీడర్గా తేజు వ్యవహరిస్తున్నాడు. మొదట కోతి కొమ్మ అనుకున్నారు. ఆట మొదలుపెట్టారు. ఆట కొనసాగుతుంది.
అల్లరే అల్లరి. గడియ రికాం లేకుండా ఆట, రెండు, మూడు గంటల పాటు నడుస్తున్నది. పిల్లల శక్తి ఉడిగిపోయింది. అలసిపోయినట్లు అనిపించినా, తోటలోకి ధైర్యంగా ప్రవేశించిన తమ వీరగాధని అందరికీ గొప్పగా చెప్పుకోవచ్చు అన్న ఆరాటం వాళ్లని అలసిపోనివ్వలేదు.
అందరూ చెట్టు కింద కూర్చుని మామిడికాయల్ని రెండు చేతుల మద్య పెట్టి, మోకాళ్ల నడుమ ఒత్తి, రాళ్లతో పగలగొట్టి తింటున్నారు. తేజు మాత్రం, చెట్టు ఎక్కి వంకర కొమ్మ మీద ఉన్న పిట్టగూడులోకి తొంగి చూసాడు. ఆకుల్లానే పచ్చగా ఉన్న గుడ్లు కనిపించాయి. చిన్న చిన్న బూడిద ఈకలు. ముట్టుకుంటే ఎక్కడ పగిలిపోతాయో అన్నట్లు అపురూపంగా వాటిని తడుముతున్నాడు. కింద నుండి మయి, చింటు తేజుని కిందికి దిగమని పిలుస్తున్నారు. తేజుకి ఆ క్షణం గుడ్లను చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది. అయిష్టంగా కొమ్మ మీద కాలు పెడుతూ పట్టు తప్పి జారాడు. తొడ మీద కొంచెం గీరుకుపోయింది. పడబోతు కొమ్మని పట్టుకొని తననుతాను కోతిలా బ్యాలెన్స్ చేసుకున్నాడు. తను జారడం తన మిత్రులు ఎవరైనా చూసారేమో అని కిందకు వంగి చూశాడు. అందరూ మామిడికాయలు తినే హడావిడిలో ఉన్నారు. ఎవరు చూడలేదు. హమ్మయ్య అనుకుంటూ తేజు, కిందికి దిగాడో లేదో ఏవో కుడుతున్నట్లు అనిపించాయి. ఎప్పుడు ఎక్కినయో, ఎలా ఎక్కినయో తెలియదు కానీ, ఎర్ర చీమలు తేజు లాగులోకి దూరాయి. నవ్వుల పాలు కాకూడదని చీమల్ని దులుపుకొని “అరె, ఏం ఉన్నరురా, ఈడనే తినుడు షురూ చేసిండ్రు. నడుర్రి నడుర్రి” అన్నాడు.
వాళ్ళ దృష్టి ఇప్పుడు కోతకానీ భాగం పై పడింది. అక్కడ ఇంకా మంచి పళ్ళు, చెట్టు మీద నుండే కోసుకొని తినొచ్చు. ఎన్ని రకాల పళ్ళో, ఎన్ని పేర్లను గుర్తుకుంచుకుంటారు. రసాలూరే రసాలు, బంగినపల్లి, కోతమామిడి(తోతాపరి) పండ్లు పండి తోటంతా గుమగుమలాడుతుంది. వాళ్ళు తోటలో ప్రవేశించినప్పటి గుమగుమలకంటే ఈ గుమగుమ ఇంకా ఎక్కువగా ఉంది. అనుకున్నదే ఆలస్యం, పిల్లలంతా ఆటలు కట్టిపెట్టి, ఆ వైపుగా నడిచారు.
అప్పటికే వాళ్ల బట్టల మీద చమటంతా ఉప్పు ఊరి, తెల్లని గీతలు ఎండకి మెరుస్తున్నాయి. ఎండిపోయిన గొంతులను తడుపుకోవడానికి పిల్లల నోర్లు ఉమ్మును తోడుతున్నాయి.
తాము ఎంచుకున్న చెట్టును దగ్గరికి వెళ్లి, తమకు అనువుగా ఉన్న కొమ్మలెక్కి కూర్చున్నారు. ఒకరిని ఒకరు చూసి, “నీకంటే నేను ఇంకా పైకి ఎక్కుతా” అని ఒకడు.
“ఒంటి కాలి మీద నిలబడతా” అని ఇంకొకడు. “తలకిందులుగా ఊగులాడుతా” అని ఇంకొకడు.
ఇలా సర్కస్ ఫీట్ల మాటలు నడుస్తుంటే, తేజు “తోటకు రమ్మంటే, భయపడేటోళ్లు, సెట్లు ఎక్కంగానే హీరోలు అయిపొయిర్రు” అన్నాడు.
“అరె, ఆళ్ల బడాయి తెలిసిందే కదరా?! నీ తల పక్కన చూడు ఎంత మంచి పండు ఉందో ” అన్నాడు మయి.
తేజుకి పండ్ల కంటే చుట్టూ చెట్ల కొమ్మల మీద జరుగుతున్న హడావిడి నచ్చట్లేదు. కోపంగా, గట్టిగా “ఎవరెవరికి ఎన్ని కావాలో తెంపుకొని జప్పున పోదాం. ఆ ముసలోడు వచ్చే టైం అయింది” అన్నాడు. పళ్ళు తెంపుకొని తిందామని అనుకునేసరికి, తేజు అన్నట్లు నిజంగానే,
“ఎవర్రా బాడ్కవులు, ఈ తోట ఏమి మీయమ్మ మిం….డె…. ని…..దా!” ఒక కేక వినిపించింది.
దూరంగా పొడుగాటి కర్రను చేతిలో పట్టుకొని పరిగెత్తుతూ వస్తున్న ఐలయ్యను చూసిన పిల్లలు భయంతో, “ఆరే ఊర్కుర్రిరా… ముసలోడు అచ్చేసిండు” అంటూ అందరు కొమ్మల నుండి కిందికి దూకారు. బడాయిగా, పౌరుషంగా మాట్లాడిన తేజు మాత్రం భయంతో వణికిపోయాడు. పైనుండి కిందికి దూకాడు, కానీ ఎటు పరుగెత్తాలో అర్థం కాలేదు. తన చెప్పులు ఎక్కడ పెట్టాడో గుర్తులేదు. అవి దొరకలేదు.
“ఆరే తేజ ఉర్కురా, ఉర్కు” అన్న మయి మాటతో తను పరిగెత్తాడు. తేజు తప్ప దొరికిన వాళ్ళు దొరికినట్లు తమ చెప్పులని చేతుల్లో పట్టుకుని వెనక్కి తిరగకుండా తలో దిక్కుకు పరుగులు తీసారు.
ఐలయ్య అరవై ఏళ్ల ముసలోడు. బక్క పల్చని శరీరం. నల్లని శరీరఛాయతో నిగనిగలాడుతూ, తెల్లని వంకర పోయిన మీసాలతో చూడ్డానికి భయంకరంగా ఉంటాడు.
రాళ్లు, రప్పలు చూడకుండా, పడుతూ లేస్తూ పిల్లలు తోట నుండి బయటికి వచ్చేసారు. ఐలయ్య పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి, పిల్లలను, వాళ్ల తల్లిదండ్రులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు.
పిల్లలంతా మర్రి చెట్టు కింద పోగయ్యారు. ఐలయ్య ఈ విషయాన్ని తమ ఇంటికి వెళ్లి, ఎక్కడ తమ తల్లిదండ్రులకు చెప్పి పంచాయతీ పెట్టిస్తాడోనని పిల్లలు, ఐదారు గంటలైనా ఇళ్లకు చేరనేలేదు. మధ్యాహ్నం నుండి సరిగ్గా నీరు, తిండి లేకపోవడంతో, ఐలయ్య చేసిన ఫీట్లతో పిల్లలు పూర్తిగా అలసిపోయారు.
అందరూ కలిసి తేజును బద్నాం చేస్తున్నారు. తేజు మాత్రం ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా కూర్చుని వింటూ ఉన్నాడు. అంత తేజు వల్లే జరిగిందని, వాళ్ళింట్లో తెలిస్తే కొడుతారని చిన్నా ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే మయి “నీ ఇష్టంతో నువ్వే వచ్చినవు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నవ్” అన్నాడు. అంతలోనే ఇంకో మిత్రుడు “అవును ఇదంతా మీ వల్లనే” అన్నాడు. మాట మాట పెరిగి గొడవగా మారిపోయింది. అలసిపోయిన గొంతుతో గట్టిగా అరిచాడు తేజ.
“ఎప్పుడు సూడు టాండ్రి (స్త్రీ) లెక్క ఏడుస్తూ, గొడవలు పడతారేంది. మాటి (పురుషుడు) ఎట్లుండాలే…” అంటూ నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అందరు అతన్ని చూస్తూ ఉండిపోయారు. తేజు మనసు నిండా భయం. ఇంటికి వెళ్తే తన పరిస్థితి ఏంటో, ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఏంటో అన్న భయం అతన్ని నిలవనీయడం లేదు. చెప్పులు ఐలయ్య దగ్గరే ఉన్నాయన్న భయం, తేజును మరింతగా డస్సిపోయేలా చేసింది. మయిగాడు వచ్చి అతని పక్కగా నడుస్తూ, ఏదో చెప్తున్నాడు. తేజు మాత్రం వినిపించుకునే స్థితిలో లేడు.
ఇల్లు చేరిన తేజు, ఎక్కడ ఐలయ్య తన ఇంటికి చెప్పులతో వస్తాడోనని, తేజు స్నేహితుల తల్లిదండ్రులు కూడా ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తే ఏంటో అని మరింత భయపడుతున్నాడు. పొద్దున్నుంచి ఎండలో తిరగడంతో ఒంట్లో నీరంతా ఆవిరి అయిపోయింది. నీరు సరిగ్గా తాగకపోవడం, ఆపైన భయం, తేజు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.
దాది చిల్కి పిలుస్తున్నా పట్టించుకోకుండా తేజు వచ్చి రాగానే, ఇంట్లోకి వెళ్లి గోనసంచి కుట్టిన బాటిల్ ను తీసుకొని నీళ్లు గటగటా తాగాడు. వెళ్లి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాడు. దాది ఇంట్లోకి వచ్చి, తను చేసిన జొన్న రొట్టెలను దూలానికి కట్టేసిన గంపలో సర్దుతూ ఉంది.
తేజు స్థితి ఎటూ పట్టకుండా ఉన్నది. ఒళ్లంతా చెమటలు. నీళ్లు తాగినా, నాలుక మీద తడి ఆగలేదు. కాళ్లు చేతులు వన్కడం ప్రారంభించాయి.
గలగల మాట్లాడే తేజు ఏమి మాట్లాడకుండా చప్పుడు చేయకుండా ఉన్నాడు. మయిగాడికి తేజుకు మధ్య గొడవ ఏమైనా అయ్యిందా? లేదా ఇంకా ఏమైనా అయ్యిందా ఆలోచిస్తు తేజు దగ్గరికి వెళ్ళింది.
“సోనా బేటా…” అంటూ చిల్కి తేజు జుట్టును తన చేతి వేళ్ళతో దువ్వింది. తేజు తల వెనక్కి వాల్చేసి కళ్ళు తెరిచి పీలగా మారిన ముఖంతో అటు ఇటు చూడడం ప్రారంభించాడు. వెంటనే చిల్కి లబోదిబోమని అరిచింది.
“యాడియె…. యె బేటా పిల్లగానికి ఏమవుతుంది రా” అంటూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్లంతా అక్కడ జమ అయ్యేదాకా అరుస్తూనే ఉంది. తలోదిక్కున ఏవో పనులలో ఉన్నవాళ్లు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అక్కడ పరిస్థితిని చూసి ఉప్పు కలుపుకొని ఒకరు, సల్ల నీళ్ళు తీసుకొని ఒకరు వచ్చారు.
దాది తేజుకు సల్ల తాగించింది. సల్ల తాగినంక, కాసేపటికి స్థిమిత పడ్డాడు తేజు. ఊపిరి మామూలుగా పీల్చుకో సాగాడు. అందరిని తేరిపార చూసి, అందరి ముఖాలు గుర్తుపట్ట సాగాడు.
తేజు తల్లిదండ్రులు దాది మీద గయ్యిమంటూ లేచారు. ‘పనికి పోతా మేము, పిల్లాడిని సూసుకునే పని సెప్తే, నీవు వెలగబెట్టిందేం” అని.
“నేనేమి చేసిన్రా? వాడి కాళ్లకు బొంగరాలు ఉన్నాయి మరి” చిల్కి సమాధానామిచ్చింది.
ఇల్లంతా గందరగోళంగా మారిపోయింది.
కొడుకు కోడల్ని పట్టించుకోకుండా, “బేటా… పొద్దున్నుండి ఏడికి పోయినవ్” అడిగింది దాది తేజుతో.
తేజు నిజం చెప్పాలనుకోలేదు. కానీ అనుకోకుండా నోట్లో నుంచి మామిడి తోట అన్న పదం మాత్రం వచ్చింది .
“యె యా… యె బా” అంటూ దాది తల, ఛాతి బాదుకోవడం మొదలుపెట్టింది.
“అసలే తోటలో మహమ్మారి ఎర్రమార్కమ్మ ఉన్నది. వద్దురా అంటే, మామ గారు ఎర్రమార్కమ్మ చేసుకుంటే, ఎగేసుకుంటూ దావత్కు పోయి పెళ్ళాంతో సహా తిని వస్తివి. ఎవరు దాని యాట మాంసం తింటే దాని వెంబడి వచ్చే రాచ్చసిరా అది, మీరంతా తప్పులు చేసి, నా మీద పడతారేంది?” అంటూ కొడుకును నిందించింది చిల్కి. “పిల్లాడికి ఎర్రమార్కమ్మ పట్టిందిరా” అని ముసలిది మొత్తుకో సాగింది.
అప్పటిదాకా చిల్కి మీద అరుస్తున్న కొడుకు, కోడలు మాటైనా మాట్లాడకుండా నిలబడిపోయారు. తండాలో, చుట్టుపక్కల ఊర్లలో ఎర్రమార్కమ్మ గురించి రోజు ఎన్నో నాలుకలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాయి. కొందరు భయపడితే, ఇంకొందరు అదేదో బైండ్లోళ్లు బతుకుతెరువు కోసం బనాయించిన కథ అనుకుంటారు. .
“ఏమి చేసేదిరా దేవుడా!” అనుకుంటూనే ముసలిది లేచి, చూరు కింద దాచిన ఇప్ప సారా క్యాన్ తీసింది. ఒక సేర్ ఉండాల్సిన సారా పావుసేర్ కూడా లేదు. కోపంగా కొడుకు వైపు చూసింది.
“అది… …యాడి, మామ తీసుకురమ్మంటే……” తడబడుతూ అన్నాడు.
“ఇల్లునంతా బర్బాత్ చేయనీకి ఉన్నరు మీరంతా. సందు దొరికితే నా మీద పడతరు” అంటూ కోపంగా వెళ్లి నల్ల కోడిని పొదిగేసిన బుట్ట నుండి, కోడి పొట్ట కింద చెయ్యి పెట్టి, ఒక గుడ్డు తీసింది. తేజును, కొడుకు సహాయంతో మెల్లగా లేపి, ఇంటికి దూరంగా తీసుకెళ్లి పావులో పోసుకోచ్చిన సారాను చేతిలోకి తీసుకొని పిల్లాడిని కళ్ళు, తెరవమని రెండుసార్లు చరిచింది. పిల్లాడి కళ్ళు మండి మొత్తుకోసాగాడు. ఏమి కాదు బిడ్డ అని ఓదారుస్తూనే కోడిగుడ్డుతో మూడుసార్లు, తల నుండి కిందికి పాదాల వరకు నంజర్ తీసి, గుడ్డును మూడు బాటల కాడ పెట్టి, వెంటనే గుడ్డి రాజయ్యను పిలుచుకు రమ్మని కొడుకును పురమాయించింది. సైకిల్ తీసుకొని కొడుకు సంపత్, రాజయ్య కోసం బయలుదేరాడు.
ఊరికి బైండ్ల గూడెం దగ్గర్లోనే ఉంది. నిమిషాల్లోనే సంపత్ గుడ్డిరాజయ్యతో సహా ఇంటి గుమ్మంలోకి దిగబడ్డాడు. రాజయ్యకు చిన్నప్పుడే, స్నానం చేయిస్తుంటే వాళ్ళ నాయనమ్మ కాలిగోరు తగిలి, కన్ను చిట్లి అంధత్వం వచ్చిందననేది ఓ కథ. మనిషి వికారంగా ఉంటడాయే. నలుగురితో కలిసి తిరగకపోవడమో, కన్ను లొట్ట పోవడమో! ఏమోగానీ పెళ్లి జరగలేదు. అన్న ఐలయ్య(తోట కావల్కార్) గుడిసెలోనే ఉంటాడు.
ఎనుకట నుండి తమ తాతల తండ్రుల నుండి వస్తున్న బైండ్ల విద్యను నేర్చుకున్నాడు. ఎల్లమ్మ పట్నాలు, ఊర్లో గాలి, గత్తర్, ధూళి ప్రవేశిస్తే ఎవరి పిల్లలకైనా సుస్తీ చేస్తే ఇంటికి వచ్చి నజరు తీయడం, ఏ దేవుడి కొంటెతనమొ, పిడికిడు పసుపును పేపర్ ముక్కపైనో ఆకుపైనో వేసి సన్నని చీపురు పుల్లతో పసుపులో గుచ్చుతూ, ఒక్కొక్క దేవుడి పేరు పలుకుతూ ఏ దేవుడిపై అనుమానం వస్తే, ఆ దేవుడి కొంటెతనమని (దోషం)రుజుజేసీ, శాంతి కార్యక్రమం కింద కోడినో, గుడ్డునో బలివ్వడం, కొంటెతనం మరీ ఎక్కువైతే గొర్రెనో, మేకనో బలివ్వమని చెప్పి వాళ్ళు ఇచ్చినంత పైకం తీసుకుని పోతుంటాడు.
తేజును తీసుకొచ్చి చిలకమ్మ రాజయ్య ముందు కూర్చోబెట్టి,
“జర సూడు రాజయ్య పిల్లగాడ్ని. ఏమైందో సెప్పు”
“చిలకమ్మా… ఏంది కత ?” అడిగాడు రాజయ్య.
“పిల్లాడు పొద్దున్నుంచి తోటల తిరిగి, సాయంత్రం ఇంటికి అచ్చి కూలబడ్డడు. అసలే తోటలో ఎర్రమార్కమ్మ ఉన్నది. వద్దన్న వినకుండా నా కొడుకు వాళ్ళ మామ ఇంటి దగ్గర ఎర్రమార్కమ్మ విస్తరి లేపి వచ్చిండు” అని నిట్టూరుస్తూ రాజయ్యతో చెప్పింది సారా నజరు, కోడిగుడ్డు తిప్పడంతో సహా !!
పుక్కిటి పురాణాల రాజయ్య పిల్లాడిని ఒంటి కన్నుతోనే కిందికి మీదికి చూశాడు. పిల్లాడు భయంతో తల కిందికి దించుకునే ఉన్నాడు. పక్కనే దాది నిల్చుని ఉంది.
రాజయ్య తాత్పారంగా పేపర్లో చిల్కి అందించిన పసుపులో చీపురు పుల్లతో తదేకంగా పొడుస్తూ, అందరు దేవతల పేర్లు మైసమ్మ, పోచమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, ఎర్రమార్కమ్మ అని అంటూ ఎర్రమార్కమ్మ దగ్గర ఆగిపోయాడు.
చిల్కి కల్లార్పకుండా రాజయ్యనే చూస్తుంది. చిలకమ్మా అనుమానం నిజమైంది.
రాజయ్య తలెత్తి చిలకమ్మను చూస్తూ.
“ఇది ఎర్ర మార్కమ్మనే. పోరడి కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. చేతులు కాళ్లు వణుకుతున్నాయి. నిజమే నీ కొడుకు వెంట ఎర్రమార్కమ్మ యాట మాంసంతో సహా నీ ఇంట్లోకి వచ్చింది. పిల్లాడి నెత్తి మీద కూర్చుంది. ఇక బలి తప్పదు” అన్నాడు రాజయ్య.
చిలుకమ్మ గుండె ఝళ్ళుమన్నది. కుటుంబంలో తొలిచూరు మగ బిడ్డ వాడు. వాడికి ఏమైనా అయితే ఏంటోనని, “ఇప్పుడు ఏంటి రాజయ్య పరిష్కారం” అడిగింది చిల్కి.
“వెంటనే ఒక కోడి పిల్లను పిల్లాడికి నజర్ తీసి, ఎర్రమార్కమ్మకు ఆరం ఇవ్వు. రేపు సాయంత్రం పొద్దు గూకకముందే మేకపిల్లను బలి ఇవ్వాలి. ఎవరిని పిలవకూడదు. పిలిస్తే వచ్చి తినేవారి ఇంటికి కూడా ఎర్రమార్కమ్మ పోతుంది. ఇప్పుడైతే ఈ పసుపుని బొట్టుగా పెట్టు. పిల్లగాడు నిద్రపోతాడు” అని రాజయ్య చెప్పాడు. రాజయ్య కళ్ళముందే చిల్కి పసుపు బొట్టు పెట్టి, పొదుగు కేసిన నల్లకోడిని తీసుకొచ్చి నజరు తీసి ఆరం ఇచ్చి, అనుమానంగా రాజయ్య వైపు చూసింది. రాజయ్య సరిపోతుందన్నట్లు తల ఊపుతూ… “రేపటి విషయం మరవకు” అన్నాడు.
“సరే రాజయ్యా” అన్నది చిల్కి.
50 రూపాయలు రాజయ్య చేతిలో పెట్టి, ఇంటి వరకు దింపి రావడానికి కొడుకును పంపించింది.
పల్చటి సల్లతో అన్నం కలిపి దాది తినిపించగా . కష్టంగా, అయిష్టంగా తిన్నాడు తేజు. అతనికి అటుపక్క అమ్మ, అటుపక్క దాది పడుకున్నారు. తేజు పడుకున్నాడు కానీ, నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. నిద్ర పట్టక చిల్కి లేచి కూర్చుంది. తేజు వాళ్ళమ్మ ఏడుపే సమాధానం అన్నట్లు రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఏడుపు చిలికి చిలికి గాలివాన అయినట్లు, ఇంట్లో వాళ్ళందరికీ భయం పట్టుకుంది.
పిల్లాడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. పొద్దున్న వరకు మరింత నిరసించిపోయాడు. తేజుకు ఏది తాగించినా లోపలికి పోయింది పోయినట్లే అరగంటలో వాంతి చేసుకుంటున్నాడు. అందరిలో ఆందోళన పెరిగిపోయింది. ఎవరూ మెతుకు కూడా ముట్టుకోలేదు. తేజు మధ్యాహ్నం కల్లా సగం అయిపోయాడు. మళ్ళీ గుడ్లు తేలేయసాగాడు.
“యా… తేజును దవాఖానకు తీసుకుపోదం” అన్నాడు కొడుకు.
“ఏం పర్లేదు సాయంత్రానికి మేకబలితో అంతా సక్కగైతది” అన్నది చిల్కి.
“అవును మా(అత్త) దవాఖానకు తీసుకుపోదాం” అన్నది కోడలు.
“ఈరోజు ఒక్కరోజు చూసి, రేపు దవాఖానకు తీసుకుపోదాం. మళ్లీ ఎర్రమార్కమ్మకు కోపం వస్తే ఎట్లా?” అన్నది చిల్కి.
“నడు… నడు.. ఏం కాదు” అంటూ తేజును రెండు చేతులతో ఎత్తి, “ జల్దిన బండి కట్టుపో” అన్నాది తేజు వాళ్ళ అమ్మ భర్తతో. ఇష్టం లేకపోయినా కొడుకు కోడల్ని ఏమనలేక లేచి, ఓ గొంగడి తీసుకొని వాళ్ల వెంట నడిచింది. బండిలో గొంగడి పరిచి, మనవడి పక్కనే కూర్చుంది.
మూడు గంటలకల్లా సర్కారు దవాఖానకు చేరింది బండి. తేజును తీసుకుని దవాఖానలోకి పరిగెత్తాడు తేజు వాళ్ళ నాన్న. దవాఖాన వైపు దీనంగా చూస్తూ బండి దిగింది చిల్కి.
పిల్లాడిని గమనించిన నర్సు, “ఇంత లేట్ ఎందుకు చేశారు. కొంచెం అయితే పరిస్థితి సీరియస్ అయ్యేది” అంది. అప్పటికే వార్డులో అలాంటి పిల్లలు నలుగురు, ఐదుగురు ఉన్నారు.
మూతి విరుస్తూ, ఎర్రమార్కమ్మను తన పిల్లలను క్షమించమంటూ, వేడుకుంటూ దవాఖాన వార్డులోని అయోడిన్, మందుల వాసన భరించలేక ముక్కును టుక్రి(ముస్కు)తో మూసుకుంటూ వార్డులోకి వచ్చిన చిల్కి, అక్కడి పిల్లలను చూసి ఆశ్చర్యపోయింది.
నర్సు వార్డులో ఎవరు ఉండకూడదని అందరిని బయటకు పంపించేసింది. అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ, వార్డు నుండి బైటికి వచ్చి మౌనంగా నిల్చుండిపోయారు.
చిల్కి మెదడులో ఎర్రమార్కమ్మ బలి సంగతి మెదులుతూనే ఉన్నది. ఎర్రమార్కమ్మ తిరగబడితే మళ్లీ మొదటికే మోసం వస్తుందని చిలకమ్మకు తెలియనిదేం కాదు. ఎప్పుడెప్పుడు డాక్టర్ వస్తాడా, తన మనవడి సంగతి చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. రెండు గంటలు గడిచిపోయాయి.
తేజుకు ఏమి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పగానే, కోడలికి తేజును అప్పగించి, కొడుకుతో తిరుగు ప్రయాణం కోసం బండి కట్టించింది. బండిని సర్కారు దవాఖానా పక్క ఉన్న దొమ్మరోళ్ల వాడకు మలుపు మన్నది .
దొమ్మరోళ్ల వాడలో మేకపోతును రెండు వేలకు కొన్నది. మేకపోతుతో సహా ఇల్లు చేరుకున్నది. ఎడ్ల మెడ నుండి కాడే తీయకుండానే, బండి విడవకుండా అట్లానే ఉండనీయమని చెప్పింది హూంకరిస్తున్నట్లు.
ఇంట్లోకి వెళ్లి, కత్తి, పసుపు, నిమ్మకాయలు, ఉప్పు, కుంకుమ, దీపం, వత్తులు, నూనె, పట్నం వేయడానికి జొన్న పిండి తీసుకుని, కొడుకును తోడేసుకుని, పొలం దగ్గరికి చేరుకుంది.
పొద్దు గూట్లో పడేది చూసి, పట్నం వేసి, పసుపు నిమ్మకాయలు పెట్టి, కుంకుమ చల్లి, మేకపోతుని ఎర్ర మార్కమ్మకు బలి ఇప్పిచ్చింది. తన మనవడిని కాపాడమని మనసారా వేడుకున్నది. మేక మెడ నరాల నుండి పొంగుకొస్తున్న రక్తాన్ని గిన్నెలో పట్టి బాటిల్ లో పోసింది. పొతం చేసిన మేకపోతును తీసుకొచ్చి ఇంట్లో అప్పజెప్పి పెళ్ళికాని బిడ్డకు వంట పనికి పురమాయించింది.
రక్తం నిండిన బాటిల్ తో దవాఖానకు చేరుకుంది చిల్కి. దవాఖాన లోపలికి హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళింది. వార్డు చేరుకుంది. చుట్టూ చూసింది. నర్సులు ఎక్కడ కనిపించలేదు. మనవడిని చూస్తూ నిలబడిపోయింది. చేతికి గుచ్చి ఉన్న సూదిని చూడగానే కళ్ళనుండి బొటబొట కన్నీళ్లు కారాయి. బాత్రూం నుండి అప్పుడే వచ్చిన తేజు తల్లి చిల్కిని చూసి ఏదో అడిగేలోపే నర్సు వచ్చి,
“పేషెంట్ దగ్గర ఒక్క అటెండెంట్ మాత్రమే ఉండాలి” అన్నది.
“సరే అమ్మ” అంటూ చిల్కి అక్కడే నిలబడి మనవడిని చూస్తూ ఉంది.
“అమ్మ మీ ఇద్దరిలో, ఎవరో ఒక్కరే ఉండాలి. చెప్తుంది అర్ధమౌతుందా? డాక్టర్ చూస్తే మమ్మల్ని తిడతారు. పేషెంట్ కి కూడా ప్రాబ్లం అయితది. ఇన్ఫెక్షన్ అయితది. ఏడ ఏడనో తిరిగి వస్తారు మీరంతా.” కోపంగా అన్నది నర్సు.
నర్సు తిడుతున్నా పట్టించుకోకుండా, “ఇగో ఇప్పుడే ఎల్లిపోతా” అని చిల్కి చెప్తూ, నర్స్ కొంత దూరం వెళ్లగానే, చిల్కి తను తెచ్చిన మేక రక్తం ఉన్న బాటిల్ ను, తన కొంగు చాటు నుండి తీసి, ఎర్రమార్కమ్మ శాంతించాలని పిల్లవాడికి నెత్తురు బొట్టు పెట్టేసరికి, నర్సు దయ్యంలా ప్రత్యక్షమైపోయింది.
“ఓ యాడి, ఏం చేస్తున్నవ్?” చిరాగ్గా అడిగింది నర్స్.
“ఏం లే అమ్మ. దేవుడి బొట్టు పెట్టిన”
“ఏందమ్మా మీ వోళ్లు ఇట్లా చేస్తారు అంతా”
“ఏం లే అమ్మ, దేవుడిదే”
“ట్రీట్మెంట్ ఇచ్చేది మేమా? మీ దేవుడా?”
“ఏమైంది సిస్టర్” అనుకుంటూ అక్కడికి ఇంకో నర్స్ వచ్చింది.
“చూడండి సిస్టర్. ఈమె ఏదో రక్తం తీసుకొచ్చి పేషెంట్ కి బొట్టులా పెడుతుంది”
“ఏందమ్మా అది. ఏంది అ సీసల రక్తం”
కోడలు అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాక సిగ్గుతో చీర కొంగు మూతిన వేసుకుని, కళ్ళతో సైగ చేస్తూ చిల్కిని అల్లరి చేయొద్దని చెప్తున్నా, చిల్కి పట్టించుకునే స్థితిలో లేదు.
వార్డులో ఉన్న తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా అందరు అక్కడ గుమిగూడి ఏమవుతుందో అని తమాషా చూస్తున్నారు. చిల్కికి అందరు అట్లా చూడడం చాలా అవమానకరంగా అనిపించింది. కోపం తన్నుకొచ్చింది. నర్సులిద్దరినీ జుట్టు పట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది.
“మీరు వద్దు. మీ దవాఖాన వద్దు. మేం పోతాం” అని పౌరుషంగా అంది చిల్కి.
“మంచిది, వెళ్లిపోండి. రేపు మళ్లీ పిల్లాడికి ఏమైనా అయితే, మళ్లీ ఇక్కడికే వస్తారు. దిమాక్ లేనోళ్ల లెక్క మాట్లాడుతారు. ఇంత పౌరుషం దేనికమ్మ మీకు…..” అని నర్స్ అంటూ ఉంటే, అత్త కోడల్కి ఆర్డర్ వేసింది. ఇద్దరు కలిసి తేజును తీసుకొని పోతుంటే, నర్సు వెంట నడిచింది. నర్సు అలా తీసుకెళ్లొద్దు అని అంటున్న వినిపించుకోలేదు చిల్కి. ఉరిమినట్లు చూసింది చిల్కి. ఆ చూపులకు నర్సు వెనక్కి తగ్గింది.
తేజుతో, ఎడ్ల బండి మీద ఇంటికి చేరుకున్నారందరు. ఇల్లు చేరే దాకా చిల్కి ఇద్దరు నర్సులను నోటికి వచ్చిన బూతులతో తిడుతూనే ఉంది. ఇల్లు చేరేసరికి రాత్రి 12 అయింది. ఇంట్లో వండిన యాట కూర వండింది వండినట్టే ఉన్నది. ఇల్లు చేరుకోగానే, కోడలు అత్త మీద కోపంతో తేజును ముట్టుకొనివ్వలేదు. కోడలి కళ్ళలో కన్నీళ్లు నిండి ఉన్నాయి. కోపం స్పష్టంగా కనిపించింది చిల్కికి. చిల్కికి మనవడి గురించి ఆలోచించాలో, కోడలి కోపం గురించి ఆలోచించాలో, అర్ధం కాలేదు. ఆమె కళ్ళ ముందు ఎర్ర మార్కమ్మ కనిపిస్తున్నట్లు అనిపించింది.
తీసుకురావడమైతే కోపంతో తీసుకొచ్చేసింది కానీ వాడికేమైనా జరిగితే ఇంట్లో వాళ్లు తనను బతకనిస్తరా ? వాళ్లు బతకనిచ్చేదేంటి తాను బతుకుతుందా? తండా అంతా తనని బద్నాం చేస్తారేమో? అన్న ఆలోచనలు తనని మనిషిని కానివ్వడం లేదు. చుక్క నీళ్ళైనా ముట్టలేదు. రాత్రంతా మనవడి పక్కన జాగారం చేసింది. కొడుకు, కోడలికి చిల్కి చేష్టలకు గొంతుదాక కోపమున్నా ఎదురు మాట్లేడే ధైర్యం లేకపోయింది . తేజు తల్లి మౌనoగా మూలన మోకాళ్లు ముడుచుకుని రాత్రంతా రోదిస్తూనే ఉన్నది.
ఎప్పడు రాత్రి గడిచిందో? ఎప్పడు తెల్లారిందో ? తెలియకుండా కూర్చున్న చోటే కళ్లు మూసుకుపోయి వాకిలి జల్లుతున్న కోడలి చేతి గాజుల చప్పుడుకి మేల్కువొచ్చి లేచింది చిల్కి .
వెంటనే పక్కలో ఉన్న మనవడ్ని మగతలోనే చేతితో తడిమి చూసింది. పక్కలో తేజు లేడు. ఎక్కడలేని గావరంతా తనకే పట్టుకున్నది.
“మళ్లీ ఏమైంది రా దేవుడా ! నా గాచారం కాలిపోను, నా నుష్ఠి రాత ఇట్లా రాసిండు పాడు దేవుడు” అని తనను తాను తిట్టుకోసాగింది. “నా మనవడ్ని కాపాడమ్మా” అని కులదేవత ముత్యాలమ్మకు మనసులోనే ముడుపు కట్టింది .
అప్పుడే, ఎక్కడనుండి ఆడుకుంటూ వొచ్చాడో కానీ గిర్రున తన చుట్టూ తిరిగి తనను ఎన్కనుండి అలుముకున్నాడు తేజు .
వెనకకి తిరిగి తేజును చూసే సరికి కోపం రాలేదు. పుట్టెడు దుఃఖం తన్నుకొచ్చింది. వెంటనే తేజుని చేతుల్లో తీసుకొని తండా అంతా వినిపించేటట్టు బోరున ఢావ్లో(శోకం) తీసింది.
వాడు తోటలోకీ వెళ్లిన మొదలు దవాఖాన నుండి ఇంటికి తీసుకొచ్చేదాకా జరిగిన ఒక్కొక్క అంశాన్ని ఒత్తి ఒత్తి పాడుకుంటూ ఏడుస్తున్నది. ఆమెను ఆపడం తండా తరం కూడా కాలేదు.
చిల్కి ఏడుపుతో తేజు కళ్ళు కూడా నిండిపోయాయి. తేజు తన రెండు చేతులతో చిల్కి రెండు కండ్ల నీళ్లు తుడిస్తే కానీ ఈ లోకంలో రాలేకపోయింది.
“బూడ్యాడి(ముసలమ్మా) నేను మంచిగైపోయినా, చూడు ఇగో ఆడుకుంటున్నా” అని తేజు అంటే కానీ చిల్కి మామూలు మనిషి కాలేకపోయింది. కొంగుతో కన్నీళ్లు తుడుచుకొని అక్కడే పక్కనే నిల్చున్న కోడలు, కూతురు వైపు చూసింది. ఎక్కడో రవ్వంత గర్వం. తానే నెగ్గానన్న బడాయి ఆ చూపులో అందరికీ కనిపించింది.
*








Add comment