పిల్లలు- మిణుగురు పూలు- ఎగిరే నక్షత్రాలూ

పిల్లలు మానవజాతి సామూహిక సంపద. జాతి, వర్ణం, మతం, కులం వంటి విభజనలకతీతంగా వాళ్ళను పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దడం ఆయా సమాజాల బాధ్యత. అల్పప్రయోజనాలు ఆశించే కొందరు పాలకులకు ఈ విషయం పట్టదు. కొద్దిమంది చింతనాపరులు, ప్రజా పక్షం వహించే రచయితలూ  ఆ బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు. ఏ భాషలోనైనా వెలువడే మొత్తం రచనల్లో పిల్లలకోసం వచ్చే రచనలు ఒక శాతాన్ని మించవేమో! అలా మించితే ఆసమాజం నాగరీకమైందనీ, సంస్కారవంతమైనదనీ మనం భావించవచ్చు.

విప్లవం విజయవంతమైన తొలినాళ్ళలో మొదలుపెట్టి  కనీసం ముప్పై ఏళ్లపాటు రష్యాలో అటువంటి ప్రయత్నం జరిగింది. సుహో మ్లీన్స్కీ ‘పిల్లలకే నాహృదయం అంకితం’, నికోలోయ్ ఓస్త్రోవస్కీ ‘కాకలు తీరిన యోధుడు’, మకరెంకో ‘రోడ్ టు లైఫ్’ వంటి రచనలు అటువంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయని  తెలియజేస్తాయి. చిన్న పిల్లలు, యువజనుల కోసం రాడుగ ప్రచురణాలయం వేసిన పిల్లల పుస్తకాలు కొన్ని తరాలను ప్రభావితం చేశాయి. ప్రపంచ మానవ విలువలను ఉన్నతీకరించాయి. అడపా దడపా అయినా 1970- 80ల నుంచి తెలుగులో అలా (సుమారుగా  ఐదేళ్లకొకసారి) వచ్చిన  అనువాదాలు గొప్ప  ప్రభావాన్నే వేసాయి. టెట్స్ కో కురియనాగి ‘రైలుబడి’, గిజూభాయి ‘పగటికల’ ఏ. ఎస్ నీల్ ‘సమ్మర్ హిల్’ పుస్తకాలు ( హెచ్. బి. టి. ప్రచురణ) అందులో కొన్ని. చాలా రోజుల తరువాత మళ్లీ అంతగా కదిలించిన  ఒక చిన్ని పుస్తకం ‘మిణుగురు పూలు’  గురించి మీతో నా మనసు  పంచుకుంటాను.

*****     *****

మిణుగురు పూలను చూశామా ఏనాడైనా?  కనీసం విన్నామా? అసలున్నాయా ఏ లోకంలోనైనా?

“గోధుమ మొక్కల్లాగా రంగులో సన్నగా, పొడుగ్గా కనపడతాయంతే, అవి మిణుగురు పూలు.”

“పేరెప్పుడూ వినలేదే?”

“మిణుగురు పురుగులు తెలుసుకదా అలా మెరుస్తాయి యీ పూలు…

ఇప్పుడు పగలు కదా మనకు కనిపించవు. రాత్రి చీకట్లో వాటి మెరుపుల వెలుగుకు మైదానం మొత్తం నక్షత్రాల ఆకాశంగా మారిపోతుంది. నేలమీద ఆకాశం.”

ఇది కేవలం ఒక పదకొండేళ్ల  పిల్లవాడి అద్భుతమైన  వూహేనా? ఉత్సాహం తొణికిసలాడే మానవ ఆసక్తికి,  ఆశకు ప్రతీకనా? అనివార్యమైన పిల్లవాడి మరణాన్ని  అజరామరం చేసిన ఒక రంగుల కలనా?

…. మరణమా? పదకొండేళ్ల పిల్లవాడి మరణాన్ని  పిల్లల కథల్లో  చెప్పవచ్చా? ఎంత చేయితిరిగిన రచయిత అయినా చెప్పగలడా? వర్ణించలేని  బాధాకరమైన ఆ అనుభవాన్ని చదివి పిల్లలు తట్టుకోగలరా?  రచయితకు అతి కష్టమైన ఒకానొక సందర్భం కదూ ఇది! రాబర్టో  పియుమిని దీన్ని సాధించాడు. ( ‘లో స్ట్రాలిస్కో’1987) ‘మిణుగురు పూలు’ నవలికలో అటువంటి ప్రయోగం చేసాడు. మృత్యువుకు, బ్రతకాలన్న ఆశకు మధ్య జరిగే  ప్రేమపూర్వక సంభాషణను పూలతోటలా మనముందు పరిచాడు.

ఇటాలియన్  సంస్కృతికి కూడా  మనలాగే బలమైన సాహిత్య, జానపద మూలాలు వున్నాయి. ప్రాచీన మూలాలు  బలంగా ఉన్న  ఏషియన్, పర్షియన్, ఇటాలియన్, గ్రీక్, రోమన్, రష్యన్  సంస్కృతుల్లో ప్రతీ తరానికీ  అందుకోదగ్గ ఒక  రచనా వారసత్వం ఎల్లప్పుడూ వుంటుంది. అది వస్తువులోనో, శిల్పంలోనో తన ప్రభావాన్ని చూపుతూ వుంటుంది. అటువంటి ప్రభావమే నేనిందులోనూ చూసాను.

మీకు అరేబియన్ నైట్స్ ( one thousand and one nights) కథలు గుర్తున్నాయి కదా? అంటే సింధ్ బాద్ సాహసయాత్ర, అలీబాబా నలభై దొంగలు, అల్లాఉద్దీన్ అద్భుత దీపం … కథా రచన పద్ధతిని అందునుంచి  తీసుకొని ఈ నవల రాశాడా అనిపిస్తుంది. ‘అరేబియన్ నైట్స్’ లో  రాజు  షేర్యర్ విధించబోయే మరణాన్ని తప్పించుకోడానికి  అతని భార్య షహ్రాజాద్ ప్రతి రోజూ రాత్రి  ఒక కథ చెబుతుంది. తెల్లవారుఝాము అవుతుండగా ముగింపు లేకుండా కథను ఆపేసి మరురాత్రి మళ్లీ కొనసాగిస్తుంది. అలా కథ తరువాత కథ చెబుతూ వెయ్యిన్నొక్క రాత్రులు తన మరణాన్ని  వాయిదా వేసింది. అలాగే

పదకొండేళ్ల  మదురర్ ను కబళించబోయే మృత్యువును వాయిదా వేయడానికి అతని తండ్రి గానువాన్, చిత్రకారుడు సుకుమత్ చేసే ప్రయత్నమే ఈ నవల.  కథలకు బదులుగా ఇందులో చిత్రకారుడు సుకుమత్ గోడమీద బొమ్మలు గీస్తాడు. అంతులేకుండా కొనసాగే కుడ్యచిత్రాలు…తెల్లటి  గోడలమీద ప్రాణం పోసుకొని, నిత్యం మార్పునొందుతూ, పరుగులు పెడుతూ ఒక కొత్త వాస్తవ ప్రపంచాన్ని ఊహల్లో సృష్టిస్తూ మదురార్ కు కొంతకాలం పాటు కొత్త జీవాన్ని, జీవితాన్ని ఇస్తాయి. కథ విషాదాంతం అవడం మనలను బాధిస్తుంది. కానీ రచయిత తన కళాత్మక సౌందర్యంతో  వంద  పేజీల నవల పూర్తిఅయ్యే లోపు మదురార్ ను, పాఠకుడినీ కూడా అందుకు సిద్ధం చేస్తాడు. అది ఎలా జరిగిందో తరువాత చూద్దాం.

యీ నవల మొదటి వాక్యం చూడండి.

‘మలత్యా టర్కీలోని ఓ అందమైన చిన్న గ్రామం. సకమత్ పుట్టిపెరిగిన వూరు. అంతపెద్దవాడూ కాదు అలాఅని  చిన్నవాడూ కాదు. మనసునిండా రంగులు నింపుకున్న చిత్రకారుడు. అతని చుట్టూ ఎప్పుడూ మనుషులుంటారు. అందరితోనూ కలసితిరుగుతూనే ఒంటరితనపు మాధుర్యాన్ని ఆస్వాదించగల వ్యక్తి. తనదంటూ ఓ ప్రపంచాన్ని నిర్మించుకొని ఆ ప్రపంచమంతా తనే నిండిపోయి వుంటాడు. ఎప్పుడూ ఎవరికీ అర్థంకాడు.’

కింద ఇచ్చిన రెండో పేరా  మొదటి వాక్యంలోని పారడాక్స్ నవలపట్ల ఆసక్తిని కలిగించింది.

‘ రాళ్లు గుట్టలుగా వుండే మలత్యా అంత అందంగా ఏమీ ఉండదు కానీ సకమత్ తన కళతో మలత్యాను నందంవనంలా చిత్రించాడు. చుట్టు పక్కల వ్యాపారులు, ధనవంతులు సకమత్ తో బొమ్మలు గీయించుకుంటారు.

వాళ్ళు ఎవరూ పిలవకపోయినా సకమత్ తనకోసం తాను బొమ్మలు గీసుకుంటాడు. అదే జీవితం శ్వాస, జీవితపు ప్రతీక్షణంలో తన ప్రతీరక్తపు బొట్టులో వేళ్లనే కుంచెలుగా ముంచి అనుక్షణం మరో రసరమ్య సృష్టికి ప్రాణం పోస్తూనే వుంటాడు.’ ఇదీ చిత్రకారుడు సకమత్ తొలి పరిచయం.

ఉత్తర టర్కీలోని బార్బన్ వంశీయుడైన రాజు గానువాన్ పదకొండేళ్ల కొడుకు మదురర్. ఆరుబయటి గాలి, సూర్యకాంతి అతనికి పడదు. వాటివల్ల అలెర్జీ కలిగే ఒక తీవ్రమైన అనారోగ్యం కారణంగా బయట తిరగలేడు, గదులనుండి  బయటకురాలేడు. తన కొడుకు కోసం నిర్మించిన మూడుగదుల గోడల మీద మొత్తం  ప్రపంచాన్ని కళ్లముందుంచే బృహత్తరమైన కళాఖండాలను  గీయమని ఆ తండ్రి కోరతాడు.  సకమత్ కు సంపదతో పెద్దగా పరిచయం లేదు, కీర్తి ప్రతిష్టలపైన ఆసక్తి కూడా లేదు. పదకొండేళ్ల పిల్లవాడు ఇంకా ‘బూచాట’ ఆడుతూ కేరింతలు కొట్టడం చూసిన సకమత్ కు మొదట జాలి కలుగుతుంది. నిరంతరం ఒంటరిగానే వున్నా ఒళ్ళంతా నిండిన జిజ్ఞాసతో, జీవం నింపుకున్న ఉన్న పిల్లవాడి చేష్టలు, ఉహలూ ఆశ్చర్యపరుస్తాయి. ఆ చిన్నారి అతడి మనసును దోచుకుంటాడు.

తండ్రి  ఇవ్వలేని మానసిక సంతృప్తిని సకమత్ స్నేహం ఆ పిల్లవాడికి ఇవ్వగలుగుతుంది. ఎంతో వయసు అంతరం ఉన్న ఇద్దరు మనుషులమధ్య ఏర్పడిన సున్నితమైన బంధం అది.  “జీవితం, ప్రేమ, అందం, మరణాలను కలిపి పియుమిని గీసిన రంగులచిత్రం ఈ నవల. ప్రాణాంతక అనారోగ్యంతో రాజభవనానికే పరిమితమైన మదురర్  జీవితం అతి చిన్నది. అతని  గది గోడలపై, చిత్రకారుడు సకమత్  కుంచెతో వేసే ప్రతి గీత ద్వారా ప్రపంచాన్ని సజీవం చేస్తాడు. స్నేహానికి,  కళకు ఉండే జీవశక్తిని రచయిత అక్షరాల్లోకి ఒంపి చూపించాడు.  ఆ పిల్లవాడి ఊహా సామర్ధ్యాన్ని చూపే ఒక సన్నివేశం మీ ముందు ఉంచుతున్నాను.

– సముద్రం ఆకాశం కలిసే గీత రెండోగది చుట్టూ తిరిగి, సముద్రాన్ని అనంతం చేసింది. ఎటు చూసినా సముద్రమే.

మదరార్ ఉదయమే నిద్రలేచి “సముద్రం ఆవలిగట్టున చుక్కలా కనపడుతోందే అదేంటి” అన్నాడు. నిజానికి అక్కడున్నది కేవలం ఒక మరక లేదా అనుకోకుండా పడ్డ ఒక రంగుచుక్క కావచ్చు. దాని మీద వాడి వూహ ఎలా కొనసాగుతుందో మీరే చూడండి.

“అక్కడ మబ్బులకింద సముద్రంలో తేలుతున్నట్టున్న చుక్క గురించి…  “  వివరించాడు కూడా.

చిత్రకారుడు సకమత్ అది బొమ్మగీసేటప్పుడు పడ్డ మరక అనో మరొకటనో చెప్పకుండా “అదేంటో నాకూ తెలియదు, ఎప్పుడూ చూడలేదు. అదేమైనా పక్షి అంటావా? “ అని వాడి వూహకు వాకిళ్ళు తెరిచాడు అంతే… మదరార్ కల్పనలో రెచ్చిపోతాడు. అది పక్షా? ద్వీపమా? పెద్ద నౌకనా? ఇదమిద్దంగా తక్షణం నిర్ణయించలేక రేపటికి ఏమవుతుందో చూద్దామని ఇద్దరూ వాయిదా వేస్తారు.

మరురోజుకు అది అక్కడే ఉంది. కాకపోతే మరింత పెద్దదైంది. “అంటే తీరానికి వస్తున్న నౌక.  సముద్రపు దొంగల నౌక అయివుండొచ్చు అందులో ఒక బ్రిగేడియర్ కెప్టెన్గా ఉంటాడు. 30మంది నావికులు … ఒక పుర్రె బొమ్మ ఉన్న జండా దానిపై ఎగురుతూ ఉంది. గ్రీకు పురాణ, ఇతిహాసాల్లో కనిపించే ‘టిగ్రేజ్’ దానిపేరు”. కెప్టెన్ నుంచి కాబిన్ బాయ్ వరకు మదరార్ చదివిన అనేక కథల పుస్తకాల్లోని పాత్రలన్నీ అక్కడ వచ్చి చేరుతాయి. అనేక పుస్తకాల్లోని భిన్నమైన పాత్రలు కూడి ఒక కొత్తకథ నిర్మాణమై గోడబొమ్మగా రూపుదిద్దుకుంటుంది. బొమ్మలలోని పడవలు రోజురోజుకీ దగ్గరవుతూ, కొద్ది కొద్దిగా పెద్దవవుతాయి, లేదా దిగంతం వైపు తమ మార్గాన్ని మార్చుకుంటాయి; పచ్చికబయళ్ళు రుతువులను అనుసరిస్తూ పూవులు పూసి రూపు మార్చుకుంటాయి… ఊహల్లో అన్నీ చలనశీలమే.

మదరార్ చేస్తున్న ఈ కల్పన ఎక్కడ ముగుస్తుంది. ఊహలు అంతమయ్యే చోటు మరణమేనని చెప్పక చెప్పే సత్యం.

ఇంత కల్పన, ఇన్ని ఊహలు మదరార్ ను మృత్యునుంచి తప్పిస్తాయా? కాదు. దాన్ని ఎదుర్కోడానికి అతడిని సన్నిద్ధుడిని చేస్తాయి. సకమత్ సహచర్యం అతనికి ఎన్నో గడ్డు వాస్తవాలను ఎరుకపరుస్తుంది. జీవితానికి ఒక తాత్వికతను అద్దుతుంది. జీవనసంతృప్తిని కలిగిస్తుంది.

మదరార్ లో ఆ సంసిద్ధతను, పాఠకుడిలో కూడా ఆ సంసిద్ధతను కలిగించే కొన్ని వాక్యాలను చూడండి.

“ మనుషులు తప్పులు, పొరపాట్లు చేస్తూనే ఉంటారు. అదేం నేరం, తప్పు కాదు కాకపోతే మనిషి ఎప్పటికప్పుడు కళ్ళు తెరచి మనం ఏంచేస్తున్నాం? ఎం చెయ్యాలి? అనేది సరిచూసుకోవాలి. తప్పుంటే మళ్లీ గీద్దాం. రంగులమీద మళ్లీ రంగులు వేద్దాం. మనల్ని మనం దిద్దుకుంటూ మరింతగా అలంకరించుకోవడమే జీవితం. ముందు మొదలెట్టాలి. మొదలెడితేనే కదా తప్పో ఒప్పో తెలిసేది”

“మనం చేపలను నీళ్లలోంచి బయటికి వచ్చినట్టు చూపిస్తే అవి కదలవు అక్కడే పడుంటాయి. అవే చేపలు నీళ్ల అడుగున లక్షల చేపలతో కలిసి హాయిగా ఆడుకుంటూ, ఈదుకుంటూ బతికేస్తాయి. అదీ అనంతమైన జీవితమంటే.”

” ప్రపంచంలో ఒకే ఒకదారి అంటూ ఏ ఒక్కరిముందూ వుండదు. మరోదారి ఖచ్చితంగా వుంటుంది. వెతుక్కోవాలి, కనపడకపోతే తానే ఓ దారి వేసుకుంటూ పోవాలంతే”

ఇటువంటి శాశ్విత సత్యాల ఎరుక కలిగిన ఏ పిల్లవాడూ తన జీవితంలో ఒంటరితనంలో కుంగిపోడు, ఆత్మహత్యల దారీ పట్టడు. ఆ ఎరుకను కలిగించడమే కదా కళా సాహిత్యాలు చేయవలసిన పని.

మదరార్ కూడా అలాగే  సిద్ధమయ్యాడు. తండ్రినీ అందుకు సిద్ధం చేస్తున్నాడు. అంతిమ క్షణాన తండ్రి గానువాన్ తో అతడి సంభాషణ వినండి.

“కన్నయ్యా! మిణుగురు పూలు కూడా నిద్రపోతున్నా యంటావా?”

“అంతే కదా! కనుచూపు దూరం వరకు మొత్తం మైదానం నిద్రపోతోంది. ఊహు అలా చెప్పకూడదు. నిద్రలోకి మేల్కొంటోంది. అసలు మనం మేల్కొనివున్నామంటే అర్థం ఏమిటి? నిద్రపోతున్న వేరే ఎవరి కలలోనో మనం మాట్లాడుకుంటున్నామన్నమాట.”

“ఈ చలికాలం రాత్రులు  వచ్చేసరికి మిణుగురు పూలు, వాటి వెలుగులు వుండనట్టేనా?”

“నేలమీద పూలు లేకుంటేనేం నాన్నా? అవి రాలిపోక తప్పదు. ఆకాశంలో నక్షత్రాలు వున్నాయి కదా!”

“నక్షత్ర్రాలు ఎక్కడో ఆకాశంలో… మిణుగురు పూలు అయితే మన పక్కనే వుంటాయి.”

“దూరానిదేముంది నాన్నా! రెండూ ఒక్కటే. మనం చూడడంలో వుంది. ఆకాశంలోని నక్షత్రాలను చూసుకో మిణుగురు పూలు కనపడతాయి. రెండూ ఒక్కటే నాన్నా?” ప్రతీకాత్మకంగా సాగే ఈ మాటల్లో కవిత్వం, జీవన తాత్వికతా ఎంతగా కలగలిసిపోయాయి కదా?

ఇలా కోట్స్ రాసుకుంటూ పోతే మొత్తం నవల రాయాలి.

రెండు భిన్నమైన మానవ సంబంధాల మధ్య యీ కథ అల్లబడింది. ఆల్ఫ్రెడ్ అల్డర్ మనస్తత్వశాస్త్ర భావనల ప్రకారం మానవ సంబంధాలు రెండు రకాలు

  1. నిలువు ( క్రమానుగత) మానవ సంబంధాలు – ఉద్యోగంలో అధికారికీ, ఉద్యోగస్తుడికీ ఉన్న సంబంధం లేదా ఇంట్లో తండ్రికీ బిడ్డలకూ ఉన్న సంబంధంవంటిది. ఒక వ్యక్తి ఉన్నతమైన అధికారం, శక్తి, హోదా లేదా ప్రత్యేక జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మరో వ్యక్తిని పై నుండి క్రిందికి నిర్దేశించడం, నియంత్రణ, మూల్యాంకనం, ప్రశంసలు లేదా మందలింపులు వుంటాయి. మన కథలో తండ్రి గానువాన్ కు కొడుకు మదరార్ పట్ల అపార ప్రేమవున్నా అతడిని రోగిగానే చూస్తాడు. అంటే అది సాంప్రదాయ సంబంధం. తనకున్న సంపద, అధికారం ద్వారా కొడుకు అనారోగ్యాన్ని జయించడానికి, ఒక పరిష్కారాన్ని  ‘కొనడానికి’  ప్రయత్నిస్తాడు. తండ్రిగా కొడుకుపట్ల ఒక సహజమైన జాలి వుంటుంది.
  2. సమాంతర లేదా సమానస్థాయి మానవ సంబంధాలు – ఇది సమాన హోదా కలిగిన సహచరుల మధ్య ఉండేది. సుమారుగా ఒకే వయసు లేదా ఒకే మనో ప్రవృత్తి గల మనుషుల మధ్య ఉండే సంబంధం. ఆజ్ఞలు కాకుండా, పరస్పర గౌరవం,  ఉమ్మడి నిర్ణయం ప్రధాన పాత్ర వహిస్తాయి. కథలో  చిత్రకారుడు సకమత్  పదకొండేళ్ల మదరార్ ను  సమర్థవంతమైన తన  భాగస్వామిగా  పరిగణించడం ద్వారా స్వయంప్రతిపత్తి,  వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహిస్తాడు.

సకుమత్, మదురర్‌ను ఒక రోగిలాగా  చూడడు; వారు గోడలమీద తాము నిర్మించబోయే బొమ్మల ప్రపంచానికి  సహ-సృష్టికర్తలుగా మారతారు. మదరార్ పట్ల  జాలికి బదులుగా సహానుభూతి వుంటుంది. కళ ద్వారా పరిష్కారాన్ని అన్వేషిస్తూ అందులో మదురార్ ను కూడా భాగం చేస్తాడు. సకమత్ గీసే బొమ్మలకు వూహలను జోడిస్తూ , రంగులు కుంచెలూ అందిస్తూ సకమత్ సన్నిధిలో మదురార్ కూడా ఒక చిన్నపాటి చిత్రకారుడు కూడా అవుతాడు.

ఆ సహవాసంలో ఇద్దరూ తాదాత్మ్యతను పొందుతారు.

కొత్త ప్రపంచాన్ని ఊహల్లో మనమే నిర్మించుకోవచ్చుననీ ఆ ప్రపంచంలో  జీవించడానికి మన గది దాటి బయటకు వెళ్లనవసరం లేదని ఆ ఇద్దరి బంధం తేల్చేసింది.

ఇంత పెద్దపని తను చేయగలనో లేదోనని మొదట సందేహించిన సకమత్ ఎలా సాధించగలిగాడు. అతను కళాకారుడుగా  ప్రకృతిని అనుకరించడు. నిరంతరం మార్పు చెందే “ప్రత్యామ్నాయ ప్రపంచపు సృష్టికర్త”. రంగులు వాస్తవ ప్రపంచాలమధ్య వారధి నిర్మించగలిగే శక్తి వున్నవాడు. తను వేసిన ప్రతీ బొమ్మ మదురర్ సృజనాత్మక ఊహను జోడించుకొని  భౌతిక ప్రపంచం కంటే మరింత  ఎక్కువ వాస్తవికంగా మారుతుంది,  కళ ప్రత్యామ్నాయ సత్యాలను నిర్మించగలదని, ప్రాదేశిక పరిమితులను జయించగలదని మరియు నాలుగు గోడల మధ్య కూడా అనంత భావనను వ్యక్తపరచగలదని  పియుమిని చూపుతాడు.

పల్లెలో తనదంటూ ఓ ప్రపంచాన్ని తన చుట్టూ చిత్రించుకొని ఆ ప్రపంచమంతా తానే నిండిపోయి వుండే సకమత్ ప్రపంచంలోకి అనుకోకుండా మదురార్ ప్రవేశించాడు. మదురార్ లోకమే తన లోకమయ్యేంతటి స్నేహంగా మారింది.

మరి మదురార్ లేనప్పుడు?….

మరొకరి కోసం జీవించడంలో గొప్ప ఆనందం వుంటుంది నిజమే… అందువెనక అనంతమైన వేదనా వుంటుంది. ఆ అనంతమైన దుఃఖాన్ని తట్టుకోలేని సకమత్ ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. ఏమిటిది?

నవల చదవండి. ప్రతీ వాక్యమూ మీలోని అంతర్గత చేతనను ఖచ్చితంగా నిద్రలేపుతుంది. ఆలోచింపజేస్తుంది.

*****    *****

మంచి రచనలు ఎప్పుడూ పాఠకుడిని  రెండు మూడు సార్లు చదివేట్టు చేస్తాయి. వొకసారి కథ  ముందుకు లాక్కెళుతుంది. రెండోసారి వాక్యాలలోని అందం విస్మయపరుస్తుంది. మూడోసారి అందులోని తాత్వికత మనలను  పట్టుకుని మరిక వదలదు. ఈ నవల అటువంటిది. కథకులు ఇందులోని కవిత్వంకోసం, కవులు ఇందులోని కథకోసం పుస్తకాన్ని చదవాలి.

ఇంత కవితాత్మకంగా ఉన్న నవలను తెలుగులోకి అనువదించడం ఎంతో ప్రయాసతో కూడిన పని. ప్రతీ భాషకు ఒక తూగు, ఒక లయ, ఒక నడక (Rhythm) ఉంటాయి. దాన్ని పట్టుకొని అనువాదం చేయగలిగే వ్యక్తులు అరుదు. నవల మొదట ఇటాలియన్ లో వచ్చింది. తరువాత  ఇంగ్లీషులోకి తర్జుమా అయి అక్కడినుంచి తెలుగులోకి వచ్చింది. మాతృకలోని అనుభూతిని ఇన్ని అంచెల్లో తెలుగులోకి తేవడమంటే చాలా కష్టం. దాన్ని సాధించారు గుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి గారు. పుస్తకాన్ని డిస్కవర్ చేసి ప్రచురించిన ఛాయ టీమ్ కు, అనువాదకుడు శాస్త్రి గారికి … థాంక్యూ

కవితాత్మక నవల అని అనగానే కథలలో, నవలలో కవిత్వం వుండొచ్చా? ఉంటే అది కథ ఎలా అవుతుంది? ఇలాంటి పండిత, రూప చర్చలు నా దృష్టిలో అనవసరం.

అందమైన ప్రకృతినీ, దాని రంగులను, రంగులలోని చిన్నెలను పిల్లలకు ఇప్పుడు మనం పరిచయం చెయ్యకపోతే, తెలియజెప్పకపోతే మరెప్పుడు తెలుసుకుంటాడు. ప్రకృతిని నిశితంగా గమనించడం, భేదపరచడం, మెచ్చుకోవడం, సున్నితమైన భావనలను వ్యక్తపరచడం మరెప్పుడు నేర్చుకుంటాడు. సైన్సులో జరిగిన గొప్ప ఆవిష్కరణలన్నీ తొలినాళ్లలో అద్భుతమైన ఊహలుగానే మొదలయ్యాయనీ, వాటికి రుజువులు అనంతర కాలంలో వచ్చాయనీ మనం మరచిపోవద్దు.

ఫ్రెంచ్, ఇటాలియన్ భాషల్లో చైల్డ్రన్స్ బుక్ అంటే అర్థం వేరు. వాళ్ళు పదహారేళ్ళు పైబడిన  యువజనులను కూడా పిల్లలుగానే గుర్తిస్తారు. మనం పిల్లలపుస్తకం అంటే పదేళ్ల లోపు పిల్లలకు అనుకుంటాం. ఈ తేడా గమనింపుతో ఈ పుస్తకం పాఠకులు తొమ్మిదేళ్లపైబడిన పిల్లలు, పసిమనసు మిగిలిన పెద్దలూ. మీ ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఉంటే కథ చదివి చెప్పండి. ఊహలు నేర్పండి చాలు  భవిష్యత్తును వాళ్లే నిర్మించుకుంటారు.

తా.క.:

యీ నవల చదివాక ప్రతీ రచయితా ఏటా కనీసం ఒక్క రచన అయినా పిల్లలకోసం చేయాలని నియమం పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. నా వరకు నేను అనుకున్నాను. కానీ  అనుకున్నంత సులువేమీ కాదు. అచ్చంగా  పిల్లల కోసమే రాయడం చాలా కష్టం. ప్రయత్నించాలి.

[సమకాలీన  ఇటాలియన్ రచయితలలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన రాబర్టో పియుమిని 1947లో ఇటలీలోని బ్రెస్సియా సమీపంలో ఉన్న ఎడోలోలో జన్మించారు.  పిల్లలు, నవయువకుల కోసమే  రచనలు చేశాడు. బోధనాశాస్త్రంలో పట్టభద్రుడై కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.  రచనారంగంలోకి రాకముందు  అతను నటుడు, తోలుబొమ్మలాట కళాకారుడు కూడా. అందుకనే అతని రచనల్లో నాటకం, జానపద శైలుల ప్రభావం కనిపిస్తుంది

నవలలు, నాటకాలు, కవిత్వం, గేయాలు, నీతి కథలు, జానపద కథలు రాయడంతో పాటు రేడియో టెలివిజన్ లకు స్క్రీన్‌ప్లేలు  అందించాడు.]

 

మిణుగురు పూలు (నవల)

ఇటాలియన్ మూలం: రాబర్టో ఫ్యూమిని

తెలుగు సేత: గుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి

ప్రచురణ : ఛాయ ప్రచురణలు. వెల: 200 రూపాయలు

ప్రతులకు: chaayabooks.com

 

శ్రీనివాస మూర్తి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.