అది 2047వ సంవత్సరం. భారత స్వాతంత్ర శతజయంతి ఉత్సవాల సంబరాలతో దేశమంతటా పండుగలా ఉంది . దేశాన్ని వికసిత భారత్ గా మార్చినందుకు ప్రభుత్వ నాయకులకు కట్టిన మందిరాల ఉద్ఘాటన జరుగుతోంది. దేశమంతటా ఇళ్లపై కాషాయ రంగు జెండాలు రెప రెప లాడుతున్నాయి.ఆకాశంలో ఏఐ హోలోగ్రామ్‌లు సువర్ణ భవిష్యత్తును, విశ్వ గురువును కీర్తిస్తూ కాంతులు విరజిమ్ముతున్నాయి.ఆ ప్రకాశవంతమైన కాంతులు ఆ గది కిటికీ అద్దాల గుండా లోపలికి ప్రసరిస్తుండగా..
“ERROR..unable to submit”
ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద ఆ ఎర్రర్ మెసేజ్ చూడగానే ఆదిత్య కోపంతో చేతిలో ఉన్న వైర్లెస్ మౌస్ విసిరి గోడకు కొట్టాడు. పాస్‌పోర్ట్ కోసం తన అప్లికేషన్ సబ్మిట్ అవ్వట్లేదు. ఉదయం నుంచి ఇప్పటికి మూడుసార్లు ప్రయత్నించాడు. ఇలా ఎందుకు అవుతోందో అర్థం కావట్లేదు.
ఆదిత్య వయస్సు ఇరవై ఏళ్ళు . ఈ ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలోని ఒక యూనివర్సిటీలో ఉన్నత చదువుకోవడానికి వెళ్లాలన్నది అతని కల. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తయింది. ఇప్పుడు వీసా అప్లై చేయడానికి పాస్‌పోర్ట్ అత్యవసరం. కానీ డిజిటల్ సిటిజెన్ సాఫ్ట్‌వేర్‌లో అప్లికేషన్ సబ్మిట్ కావడం లేదు.
విసుగ్గా బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో ఉదయం ఆఫీసుకు వెళ్లిన వాళ్ల నాన్న రఘు ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రిని చూడగానే ఆదిత్య ఆవేశంగా, “నాన్నా! నా పాస్‌పోర్ట్ అప్లికేషన్ మళ్లీ రిజెక్ట్ అయ్యింది. ఎందుకో అర్థం కావట్లేదు ” అన్నాడు.
వంటింట్లో నుంచి వాళ్ల అమ్మ వీణ తడి చేతులు టవల్‌తో తుడుచుకుంటూ బయటకు వచ్చింది.
“ఇంట్లో నీళ్లు కూడా రావట్లేదు రఘు!!” అని అసహనంగా అంది.
“డాడీ, సెంట్రల్ ఇంటర్నెట్ కూడా మార్నింగ్ నుంచిరావట్లేదు. నేను మొబైల్ డేటా యూజ్ చేస్తున్నాను ” అంటూ బెడ్ రూంలోంచి కూతురు బయటకి వచ్చింది.
రఘు మౌనంగా సోఫా మీద కూర్చొని కళ్లు మూసుకున్నాడు. ఇంతలో వాళ్ళు ఉండే ఆ అపార్ట్మెంట్లో కరెంట్ పోయింది. సెక్యూరిటీ అలారామ్స్ మోగుతున్నాయి.
“వాట్స్ హ్యాపెనింగ్ డాడ్?? నాకు భయంగా ఉంది” అంది కూతురు వణికిపోతూ.
“వెరీ స్ట్రేంజ్ !! ఒకసారి మన డిజిటల్ సిటిజెన్ యాప్ ఓపెన్ చేసి చూడండి. ఏదైనా నోటిఫికేషన్ ఉందేమో?” అంది వీణ ఆందోళనగా.
రఘు వెంటనే “ హే సీతా , ఓపెన్ ది డిజిటల్ సిటిజెన్ అప్ అండ్ ప్రోజెక్ట్ ఆన్ టు వాల్ “ అన్నాడు. వెంటనే ముందు వున్న గోడమీద ఆప్ ఓపెన్ అయ్యింది. అంతా ఎర్రగా కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా అలర్ట్స్, నోటిఫికేషన్స్ వస్తున్నాయి. రఘు గుండె భయంతో ఒక్క క్షణం ఆగిపోయింది. అతని చేతులు వణుకుతున్నాయి, ఒళ్లంతా చెమటలు పట్టాయి.
ప్రభుత్వం నుంచి వచ్చిన అతి ముఖ్యమైన నోటీసు ఓపెన్ చేసాడు. కుటుంబమంతా చదవడం ప్రారంభించారు.
“ప్రియమైన భారత పౌరుడా,
భారత ప్రభుత్వం SIR-2026 చట్టానికి తీసుకువచ్చిన ముప్పై ఐదవ సవరణ ద్వారా, మీ వంశ వృక్ష డిజిటల్ డేటా, డీఎన్ఏ పరీక్షలతో మళ్లీ సరిపోల్చబడింది. భారత ప్రభుత్వం ఒక కొత్త సాంకేతికను ఉపయాగించి చేసిన ఈ పరీక్షలో మీ హిందూ డిఎన్ఏ స్ట్రైన్ భారత దేశ పౌరులుగా ఉండేందుకు కావాల్సిన 95% కంటే తక్కువగా నిర్దారించబడింది . దీనితో మీ ఓటు హక్కు కూడా తీసివేయబడినది . అందు వలన మీరు నిజమైన హిందువుగా ప్రభుత్వానికి తగిన ఆధారాలు సమర్పించే వరకు మిమ్మల్ని ‘తాత్కాలిక పౌరుడు’ (Temporary Citizen) గా మారుస్తున్నాము. ఇందులో భాగంగా మీ డిజిటల్ సిటిజెన్ సర్వీసెస్ (ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్, బ్యాంక్ అకౌంట్లు) తక్షణమే సస్పెండ్ చేయబడుతున్నాయి.
మీకు భారత ప్రభుత్వం ముప్పై రోజుల గడువు ఇస్తోంది. ఈలోగా మీ పౌరసత్వాన్ని నిరూపించే రుజువులు సమర్పించండి. లేనియెడల, మిమ్మల్ని మీ కుటుంబాన్ని అక్రమ వలసదారులుగా నిర్ధారించి, హిందూ మహాసముద్రం మధ్యలో నిర్మించిన కొత్త డిటెన్షన్ సెంటర్‌కు తరలించడం జరుగుతుంది.”
ఆ నోటిఫికేషన్ చదవడం పూర్తి కాగానే ఆ గదిలో ఒక భయంకరమైనా నిశ్శబ్దం ఆవహించింది.
“అదేంటి నాన్న మనం నిజమైన హిందువులమే కదా ? ఇప్పుడు కాదంటున్నారు ఏంటి ?” అని ఆదిత్య భయంతో వణికిపోయాడు.
“అసలు మన కసెంట్ (సమ్మతి) లేకుండా మన డిఎన్ఏ టెస్ట్ ఎలా చేస్తారు?” అంటూ కూతురు అడిగిన ప్రశ్నకు రఘు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
“ష్… ష్… సైలెంట్!” అని భయంగా చేతిలో ఫోన్‌ను చూపిస్తూ… ఆ పదాలను గట్టిగా మాట్లాడకూడదని, ఇప్పుడు ప్రతి మాటను ఆటోమేటిక్ ఏఐ సర్వైలెన్స్ రికార్డ్ చేస్తుందని సైగలతో హెచ్చరించాడు.
రఘుకు ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు. వెంటనే తన పరిస్థితి వివరిస్తూ గవర్నమెంటుకు ఒక ఇమెయిల్ రాసాడు.
ఇమెయిల్ రాసి అప్పటికే మూడు రోజులు అయ్యింది. ఎటువంటి జవాబు లేదు. ఒకప్పుడు తాను గుడ్డిగా నమ్మి, సమర్థించిన రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రజలకు అందనంత దూరంలో ప్యాలసుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇప్పుడంతా పూర్తిగా ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ గవర్నెన్స్ నడుస్తోంది. సాఫ్ట్‌వేర్‌లో ఫీడ్ చేసిన అల్గారిథమ్స్ ఏది చెబితే అదే వేదవాక్కు.
రోజలు గడుస్తున్నాయి . రఘు వాళ్ళు ఉండే సొసైటీలో చాలా మందికి ఈ నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఒకరితో ఒకరు ఈ సమస్య గురించి మాట్లాడుకోలేరు. ఒకవేళ దీని గురించి ఎవరితో నైనా మాట్లాడితే వెంటనే పొలిసు వాళ్లకు తెలిసిపోతుంది. క్షణాల్లో పోలీసు డ్రోన్లు వాలిపోతాయి.
రఘు ఆఫీసుకి వెళ్లక్కర్లేదు అని డిజిటల్ వర్క్ టెర్మినేషన్ నోటీస్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులన్నీ బ్లాక్ అయిపోయాయి. ఈ ముప్పై రోజుల పాటు నిత్యావసరాల కోసం ప్రభుత్వం డిజిటల్ వాలెట్లో ఇస్తున్న రోజువారీ రేషన్ అలవెన్సే గతి.
డిజిటల్ సిటిజెన్ సాఫ్ట్వేర్ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ రఘు అప్లోడ్ చేశాడు. కానీ… ఒక్క డాక్యుమెంట్ మాత్రం అతని దగ్గర లేదు. అదే అసలు ఉచ్చు.
రఘు వాళ్ళ ముత్తాత భారత విభజన జరిగిన 1947వ సంవత్సరంలో తానూ భారతదేశంలోనే ఉన్నాడు అని ప్రూఫ్ అడుగుతోంది సాఫ్ట్వేర్ . ఆ డాక్యుమెంట్ రఘు దగ్గర లేదు. అది ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. అప్పటికే పదిహేను రోజులు గడిచిపోయాయి. ఇంట్లో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది.
భార్యతో రోజూ గొడవ నడుస్తోంది. ఆ రోజు రాత్రికూడా ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైంది.
“నన్నేం చేయమంటావ్ ? ఇది నా తప్పా ? ఇప్పుడు నా ముత్తాతకు సంబంధించిన డాక్యుమెంట్ నేనెక్కడినుంచి తేవాలి.”
వీణ పెద్దగా నవ్వింది.
“ఒక్కసారి ఇరవై ఎల్లా వెనక్కి వెళ్లి గుర్తుతెచ్చుకో నువ్వు చేసింది తప్పా , ఒప్పా నీకె తెలుస్తుంది.”
“ఎం మాట్లాడుతున్నావ్ వీణ”
“నీకు గుర్తులేదా రఘు ?… నువ్వు అప్పట్లో గుడ్డిగా నమ్మిన ఈ సిస్టమ్, నువ్వు చప్పట్లు కొట్టి, దగ్గరుండి సప్పోర్ట్ చేసి ,చేయించిన ఈ చట్టం… ఇవాళ నిన్ను నీ దేశంలోనే ఒక పరాయి వాడిగా, ఉనికి లేని వాడిలా మార్చేసింది.”
రఘు మాట్లాడలేకపోయాడు. తన దగ్గర జవాబు లేదు.
మళ్ళీ వీణ మాట్లాడింది.
“ఇరవై ఏళ్ల క్రితం నీకు,నాకు మన లాంటి వాళ్లందరికీ ఒక అవకాశం దొరికింది. దాన్ని మనమే , మన చేతులారా నాశనం చేసుకున్నాం. ఈ కిరాతక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళను గేలి చేసి ఆ పోరాటాన్ని నీరుకార్చము . ఇది మన చేతులారా మనం చేసుకున్న ఖర్మ. అనుభవించాల్సిందే “
రఘు మౌనంగా కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు.
కిటికీ బయట ప్రభుత్వ డ్రోన్ వాళ్ళు మాట్లాడుకునేది వింటూ, తచ్చాడుతోంది . గడువు ముగియడానికి కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది అని అనౌన్స్మెంట్ చేస్తుంది .
సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం (2026)…
అది దేశవ్యాప్తంగా SIR చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న కాలం. కోట్ల మంది పౌరుల ఓట్లను అర్ధంతరంగా తొలగిస్తున్నారంటూ యువత, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి పోరాడుతున్నాయి.
ఒక ఆదివారం ఉదయం. కొత్తగా పెళ్లి అయిన రఘు వీణ హాలులో కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్ ఛానల్ చూస్తున్నారు . టీవీలో దేశ రాజధానిలో జరుగుతున్న ఆందోళనల దృశ్యాలు కనిపిస్తున్నాయి.
“ఈ పిల్లలకు తిన్నది అరక్క రోడ్లమీదకు వస్తున్నారు. అస్సలు దేశ ప్రశాంతతను నాశనం చేస్తున్నారు” అన్నాడు రఘు విసుగ్గా.
పక్కనే కూర్చున్న అతని భార్య వీణ వార్తలు చూస్తూ బాధగా అంది, “పదమూడు కోట్ల ఓట్లు ఎలా తీసేస్తారు అసలు?ఆ SIR ప్రాసెస్‌లో చాలా తప్పులు ఉన్నాయ్ అంట అందుకే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు.”
“తప్పులా? అలా ఏమి కాదు. వీళ్ళందరూ ప్రాపగండా చేస్తున్నారు. ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ల పనే అది.”
“అదేంటి రఘు? మన పనిమనిషి ఉండే బస్తీలో చాలా మంది ఓట్లు తీసేశారు. వాళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నారు కదా!”
“హా అదే… ఆ బస్తీల్లోనే ఉంటారు ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. దేశాన్ని కాపాడేటప్పుడు ఒకటి అరా పొరపాట్లు జరుగుతాయి. బట్ ది బిగ్గర్ పిక్చర్ ఈజ్ ఇంపార్టెంట్.”
“ఇవాళ వాళ్ళ ఓట్లు తీసేసిన వాళ్ళు, రేపు మన ఓట్లు కూడా తీసేయరని గ్యారంటీ ఏంటి?” కోపంగా అడిగింది వీణ .
రఘు నవ్వేశాడు.
“ఏం మాట్లాడుతున్నావు వీణ! మనం నిజమైన హిందువులం. మనకేం కాదు. అయినా ఈ SIR జరిగేదే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను తీసెయ్యడానికి మనం సేఫ్…”
“అదేంటి రఘు అలా మాట్లాడుతావ్ ? పదమూడు కోట్ల మంది ఓట్లు తీసేసారు, వాళ్లు మనలాంటి మనుషులేకదా ? ”
“ నువ్వు ఎక్కువ మాట్లాడకు వీణ !! ఆ ఇంస్ట్గ్రామ్ రీల్స్ చూసి నీకు మైండ్ దొబ్బినట్లు ఉంది. అదంతా ఫేక్ ప్రాపగండా. మన కంట్రీని క్రైసిస్‌లోకి తీస్కెళ్ళడానికి జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు బయట నుంచి ఫండ్ చేసి చేయిస్తున్న పైడ్ ప్రొటెస్ట్…. మొన్నే కదా మన మోడీజీ జీడీపీ 7.8% గ్రో అయ్యింది అని రీల్ చేసి చెప్పారు. మనకేం కాదు. మన దేశం, మనం అంతా సేఫ్…అయన ఉన్నారు కదా మనకు….అయన చూసుకుంటారు.”
రఘు ఇంతటి అంధభక్తితో మాట్లాడటం వీణకు నచ్చలేదు.
“ప్లిజ్ రఘు! కొంచెం సెన్సిబుల్‌గా ఆలోచించు! ఎలాంటి తప్పు చెయ్యకపోతే ప్రభుత్వం ఎందుకు జవాబు ఇవ్వట్లేదు. మరీ ఇంత గుడ్డిగా ఆలోచించకూడదు.”
“గుడ్డిగా ఆలోచించేది నేను కాదు నువ్వు …నువ్వు ఆ నేహా బోరా గురించి మొన్న మాట్లాడినప్పుడే అనుకున్నాను. నువ్వు కూడా ఆ ప్రాపగాండాలో పడ్డావు అని.”
వీణకు రఘు మీద కోపం వచ్చింది. అతనికి జవాబు చెప్పబోతుండగా డోర్ బెల్ రింగ్ అవడంతో కోపంగా లేచి వెళ్ళిపోయింది.
*








What an eye-opening trending story!!!
Seriously, what if..we were in Raghu’s shoes ?????? What if ..we were also part of SIR-2026 effected list???? Soooo scary to imagine……Excellent narration Sanjay…keep rocking…All the very best.