పద౦ ఒకటే. పెదాలు రెండు.
అది ఇచ్చిన మనిషి , సమయం, సందర్భం , దేశం , మతం వీటినిబట్టి నిర్వచనం మారిపోతుంది. ఒక చోటు ముద్దుల పోటీలు జరిగి విజేతల్ని ప్రకటిస్తుంది . ఇంకొక చోటు తలలు నరికేస్తుంది . నేనిప్పుడు రెండు ముద్దు సందర్భాలని గురించి చెప్పాలనుకుంటున్నాను . ఒకటి జుగుప్స కలిగిస్తూ కూడా అందరితో హుషారు కేకలు పెట్టిస్తుంది . ఇంకోటి సందర్బోచితంగా , స్పందనతో వున్నాసరే బలిపీఠ౦ ఎక్కించింది.
అవాళ నా కొలీగ్ జగదా౦బ తన పుట్టినరోజు సందర్భంగా ఒక వూర మాస్ సినిమాకి తీసుకెళ్లింది . పేరు గుర్తులేదు కానీ కధ మాత్రం ముద్దు చుట్టూ తిరుగుతుంది . అ౦దులో ముద్దు ఒక పెత్తనం . ముద్దు ద్వారా భార్యని ఎంత హింస పెట్టాలో అందులో చూడగలం . భార్యా భర్తలిద్దరి మధ్య ఏదో విభేధ౦ వస్తుంది విడాకులు కోరుతూ ఆమె కోర్టు మెట్లు ఎక్కుతుంది . ఆ సమయంలో ఆమె గర్భవతి అయినందున విడాకులు పుచ్చుకున్నా కానీ బిడ్డని ప్రసవించి ఇవ్వాలని భర్త తరఫు లాయరు వాది స్తాడు. విచ్ఛిన్నమైన కాపురంలో గర్భాన్ని వుంచుకోవడం, మానడం చట్ట ప్రకారం తన హక్కు ఆమె వాదిస్తుంది . ఇద్దరి వాదనలు విన్న కోర్టు ఒక మహత్తరమైన తీర్పు ఇస్తుంది.
అదేమిటంటే గర్భం తాలూకు శరీరం ఆమెది అయినా కానీ అందులో వున్న బీజం భర్త దే కాబట్టి, ఆ బీజానికి ప్రాణం పోసి అతని బిడ్డను అతనికి ఇచ్చే బాధ్యత ఆమెకి వుందట . అంతేకాదు పుట్టింట్లో వుంటే అబార్షన్ ప్లాన్ చేస్తుందేమో అని ప్రసూతి అయ్యేవరకు ఆమె అతని ఇంట్లోనే వుండాలని శాసిస్తుంది కూడా.
“దూల తీరిపోయింది కదా” . ఈ మాట నా చుట్టూ కూచున్న ప్రేక్షకుల్లో ఎవరో అన్నారు.
ఇక మొదలవుతుంది యాతన . ఆమెని ఒక గదిలో బంధిస్తారు . సయించక వాంతులు అవుతున్నా సరే బిడ్డ ఎదుగుదల కోసం అంటూ విపరీతమైన తిండి తినిపిస్తాడు భర్త . ఇదంతా ప్రేమతోనే సుమా అనిపించేలా ఒక పాట కూడా వుంటుంది . రాత్రయిన దగ్గరనుంచీ ఆమెని శారీరకంగా రెచ్చగొట్టే చర్యలు మొదలవుతాయి . ప్రసవం అయ్యేలోపు ఆమె దాఖలు చేసుకున్న విడాకులు వెనక్కి తీసుకోవాలనేది అతని పన్నాగం . నిద్రపోతూ వుండగా హటాత్తుగా వచ్చి , పొట్ట మీద ముద్దులు పెడతాడు . తేలు కుట్టినట్టు హడిలిపోయి కెవ్వున కేకలు వేస్తుంది . హీరో చెవులు దద్దరిలిల్లేలా నవ్వుతాడు.
“ఈ ముద్దు నీకు కాదు నా బిడ్డకి “ అని చెబుతాడు.
“నా శరీరం తాకడానికి వీల్లేద” ని ఆమె పరిగెడుతూ వుంటుంది. అది నీ శరీరం కాదు తన బిడ్డ ఆవాసం అంటూ వేటాడతాడు.
నాగరికత ఎంత పెరిగినా సరే మనిషిని మనిషి వేటాడటం మన ఆటవిక క్రీడ కదా. ఆమాటకొస్తే ఆటవిక దశలో కూడా ఎక్కడో రెడ్ ఇండియన్స్ తప్ప మనిషి ని మనిషి ఆహారంగా చూడలేదు.
ఇక చెప్పేదేముంది . శృంగారానికి, అత్యాచారానికి తేడా తెలీని ప్రేక్షకుల చప్పట్లు హాలంతా మారు మోగిపోయాయి . అందులోనూ అది చిరంజీవి సినిమా . మా జగదా౦బ చిర్రుకి ( తను అలాగే అంటుంది ) అభిమాని . “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” లాటి బ్రాండు అంబాసిడర్ దర్శకత్వం లో ఆ సినిమా చివరిదాకా చూడలేక మధ్యలో వచ్చేయలేక నానా యాతనా పడ్డా౦ . లేచి నుంచుంటే ఆ సినిమా కళ్ళతో మనల్ని కూడా ఇకిలిస్తారు . కూచుంటే చచ్చినట్టు భరించాలి.
భగవద్గీత లో యుద్ద నీతి వుంది . వాత్సాయనుడి కామ శాస్త్రం లో ముద్దు గురించి వుంది . ప్రపంచ నాగరికత , కళ , కవిత్వం , ప్రేమ స్పందన, పులకింత ఈ రెండో పుస్తకం లోనే వున్నాయి . ఆధిపత్య సంస్కృతి కమ్ముకున్నమగవాడు అత్యాచారాలు మాత్రమే చేయగలడు . ఖర్మ కొద్దీ మనకి చట్టంలోనూ సమాజంలోనూ , సాహిత్యం లోనూ చరిత్రలోనూ ఆధిపత్యమే వుంది.
ఇప్పుడు తాజా గా ఇంకొక ముద్దు గురించి వివాదం నడుస్తోంది . ఇది ఇద్దరి భావోద్వేగాలకి చెందిన పరస్పర అంగీకార ముద్దు . కానీ అక్కడి కోర్టు మరణ శిక్ష వేసింది . వివరాలు మీకు తెలిసే వుంటాయి . ఇద్దరు బాంగ్లాదేశ్ ద౦పతులు సౌదీ అరేబియాలో మక్కా ని సందర్శించడానికి వెళ్లారు . తన గర్భ౦ గురించిన శుభవార్త ఆ పవిత్ర స్థలంలో భర్త చెవిన వేయాలని భార్య అనుకుంది , వేసింది . ఆనందం పట్టలేని అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు . వీడియోలో కనిపోస్తున్న ఆ దృశ్యం చూడటానికి కూడా చాలా హృద్యంగా , అనుభూతి రేపేలా వుంది . నిత్యజీవితంలో అందరం అనుభవి౦చిన విషయ౦ లాగానే వుంది కానీ కొందరికి ఎంతో అనై తికంగా అశ్లీలంగా కనిపించిందంట. వెంటనే “క్షేత్ర కళంకం” చేసిన ఆ దంపతులు ఇద్దరికీ మరణ శిక్ష వేసి, వారి స్వదేశానికి కూడా కబురు చేయ్యకుండా తలలు నరికి హత్య చేశారు.
అప్పుడప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆమె కడుపులో బిడ్డ తో సహా ఆ ఇద్దరు హతులయ్యారు . ఇంటిదగ్గర అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న ఆరేళ్ళ పాప అనాధ అయింది . ఇద్దరి శవ పేటికలు ఒకదానితో ఒకటి జతచేసి తాడుతో ఈడ్చుకొస్తున్న దృశ్యం చూస్తే కళ్ళు చెమ్మగిల్లు తున్నాయి .
మతం కంటే క్రూరశత్రువు ఇంకోటి వుందా ? వారిద్దరు భార్యా భర్తలు కాదని ప్రేమించుకుంటున్నారని ఇంకొక కధనం వినిపిస్తోంది . అయితే ఏమిటి, హత్యకి సమ్మతి దొరుకుతుందా ? పొట్టి బట్టలు వేసుకున్న౦దుకు హత్యాచారం చేశామని చెప్పినట్టుగా లేదూ ? ఒక నేరం జరిగిపోయాక దానినుంచి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కధనాలు వినిపిస్తూనే వుంటాయి .
మనిషి పుట్టాక మతం వచ్చిందని మనం వాదిస్తాం కానీ ఇక్కడ మతమే మనిషి పుట్టుకని చంపేసింది . అది కూడా ఒక ముద్దు కారణంగా.
ముద్దులో ఏముంది ? ఒక పదమే వుంది. రెండు పెదాలు వున్నాయి . అది ఇచ్చిన చోటుని బట్టి నిర్వచనం మారిపోయింది . ప్రేమల్ని హత్యచేయడమే పవిత్రత అయితే ఆ పవిత్రతలో నాగరికత వుందా ?
*








చాలా బాగా చెప్పారు. దౌర్భాగ్యం .