కాలాల్ని జయించిన ఆత్మ బంధం

కె. బాలచందర్, బాలుమహేంద్ర, శంకర్‌లు టైమ్‌లెస్ తమిళ్ సినిమాగా, ప్రపంచ సినిమాగా, వెండితెర కవిత్వంగా ప్రశంసించిన ‘మొదల్ మరియాదై’ భారతీరాజాకు భారతీయ సినిమా చరిత్రలో శాశ్వత గౌరవం పొందేలా చేసిన కళాకృతి.

1929లో ఫ్రాన్స్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న జీన్ పాల్ సార్త్రే, సిమోన్ డి బోవా మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె మేధస్సు, ఆలోచనా విధానం అతనిని అమితంగా ఆకర్షించగా, అతని నిజాయితీ, పారదర్శకత ఆమెను ఆకట్టుకున్నాయి . ఎవరికి వారు ఆత్మకు దొరికిన తోడు అనుకున్నారు. చాయ్ బిస్కెట్లతో పాటు అంతరంగాలను పంచుకున్నారు. చదువు అయిపోయింది, పరీక్షా ఫలితాలు వచ్చాయి. సార్త్రే మొదటి ర్యాంకు, సిమోన్ రెండో ర్యాంక్ సాధించారు.

ఇక ఎవరి దారి వారు వెతుక్కుంటూ వెళ్లాలి- ఆ అక్టోబర్ మాసంలో పారిస్‌లోని లక్సెంబర్గ్ గార్డెన్స్‌లోని ఒక బెంచీపై కూర్చుని ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. దానిని వారి తత్వశాస్త్ర భాషలో ‘ఎసెన్షియల్ అండ్ కాంటింజెంట్ లవ్’ అన్నారు.ఆ ఒప్పందం నాటికి అతని వయసు 24, ఆమె వయసు 21. ఒప్పందం కాలపరిమితి రెండేళ్లు. వీరిద్దరి ఆత్మిక బంధం గడువు మించి, ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగింది. పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్ర సిమోన్ డి బోవార్, జీన్-పాల్ సార్త్రేల బంధాన్ని ’20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన మేధో భాగస్వామ్యంగా అభివర్ణించింది.

1980లో జీన్ పాల్ సార్త్రే మరణించారు. సార్త్రే మరణించిన ఆరు సంవత్సరాల తర్వాత,సిమోన్ కూడా కన్నుమూశారు. పారిస్‌లోని ‘మోంట్‌పర్నాస్’  స్మశానవాటికలో వీరిద్దరినీ పక్కపక్కనే సమాధి చేశారు.

“ఆయన మరణం మమ్మల్ని విడదీసింది. నా మరణం మమ్మల్ని మళ్ళీ కలుపుతుంది. మాకు లభించిన ఈ జీవితంలో ఇద్దరం అంతలా కలిసి జీవించగలిగాం, అదే అద్భుతం.” అని   సార్త్రే మరణం తర్వాత సిమోన్ డి బోవా అన్నారు.

ప్లేటో ‘ప్లేటోనిక్ లవ్’, నీషే ‘స్టార్ ఫ్రెండ్షిప్’, షోపెన్‌హోవర్ ‘మెటాఫిజిక్స్ ఆఫ్ లవ్’, స్పినోజా ‘మేధోపరమైన దైవిక ప్రేమ’, రూమీ “ఇష్క్-ఎ-హఖీఖీ” – వీటన్నింటికీ కార్యాచరణ సాక్ష్యంగా వీరి బంధం ఐదు  దశాబ్దాల పైగా నిలిచి నిలిచింది. ఈ బంధాన్ని “శరీరాలకు అతీతంగా బుద్ధి మరియు ఆత్మ మాత్రమే ప్రధానంగా సాగిన బంధం”గా పేర్కొంటారు. సార్త్రే జీవితంలోకి ఎందరో స్త్రీలు వచ్చారు, అలాగే సిమోన్ జీవితంలోనూ కొందరు పురుషులు ఉన్నారు. కానీ సిమోన్ జీవితంలో సార్త్రే స్థానాన్ని, సార్త్రే హృదయంలో సిమోన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోవడమే దీనికి నిదర్శనం.

ఇలాంటి ఆత్మిక బంధానికి మరో విశిష్ట ఉదాహరణ రష్యన్ సాహిత్యంలో కనిపిస్తుంది. 1866 లో, అక్టోబర్ చలికాలంలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలోని షిలోవ్ హౌస్ అనే అపార్ట్ మెంట్  కాంప్లెక్స్, రెండో అంతస్తులోని చిన్న గదిలో విఖ్యాత రష్యన్ రచయిత ఫ్యోదర్ దోస్తోయెవ్‌స్కీ, తన పబ్లిషర్‌కు ఇచ్చిన మాట ప్రకారం 26 రోజుల్లో ‘The Gambler’ నవల రాయలేకపోతే పుస్తకాలపై హక్కులన్నీ కోల్పోవలసి వస్తుందని  కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఎం.వి.ఎస్. హరనాథరావు ‘క్షీరసాగరమథనం’ నాటకంలో తండ్రి భయంకరాచారి కొడుకు రంగాచారిని ఉద్దేశించి ‘దరిద్రం దరిద్రం కన్నా దరిద్రంగా ఉందిరా రంగా!’ అంటాడు, అలాంటి కఠిన దరిద్రం దోస్తోయెవ్‌స్కీని వెంటాడుతోంది. దాన్ని అధిగమించడానికి అక్షరాలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అతని దగ్గర. అప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన దోస్తోయెవ్‌స్కీ గడువు లోపల నవల పూర్తి చేయడానికి ఒక స్టెనోగ్రాఫర్ ను నియమించుకున్నాడు..

ఇరవై ఏళ్ళ అన్నా స్నిత్కినా ఆ ప్రాజెక్టులోకి వచ్చాక, 26 రోజుల్లో నవల పూర్తయింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. అప్పటికి అన్నా వయసు 20 ఏళ్లు, దోస్తోయెవ్‌స్కీ వయసు 44. కానీ వారిద్దరిదీ శారీరక ఆకర్షణలకూ, దైహిక వాంఛలకూ అతీతమైన బంధం.

ఆ నవంబర్ నెలలో దోస్తోయెవ్‌స్కీ తాను రాయబోయే కొత్త నవలలో ఒక వయసు మళ్లిన కళాకారుడు, అతగాడి ప్రేమ ప్రతిపాదన పట్ల,తనకన్నా వయసులో చిన్నదైన, తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న  యువతి, ప్రతిస్పందన ఎలా ఉండాలి అని ‘అన్నా’ను అడుగుతాడు. ఆమె అతని ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకోవాలని సమాధానమిచ్చింది అన్నా .అది కల్పితం కాదు మన ఇద్దరి కథే అని 1867లో ఆమెను రెండో వివాహం చేసుకుంటాడు దోస్తోయెవ్‌స్కీ.

ఆమె అతనిలోని అసాధారణ ప్రతిభావంతుడిని, జూదం అనే వ్యసనానికి బానిసైన ఒక బలహీన మనస్కుడిని, మూర్ఛవ్యాధితో బాధపడే ఒక రోగిని చూసింది. అతని ఆర్థిక భారాన్ని, ఆరోగ్య బాధల్ని కూడా తన బాధ్యత చేసుకుంది. ఆఖరికి జూదంలో తన నగలు కోల్పోయినా అతన్ని నిందించలేదు. దోస్తోయెవ్‌స్కీ రాసిన ప్రపంచ ప్రసిద్ధ నవలలు: ‘క్రైమ్ అండ్  పనిష్మెంట్’, ‘ది ఇడియట్’, ‘ది బ్రదర్స్ కరామజోవ్’ వెనుక అన్నా నిరంతర శ్రమ, మానసిక చేయూత ఉన్నాయి.

1881లో దోస్తోయెవ్‌స్కీ మరణించే నాటికి ‘ అన్నా ‘ వయసు కేవలం 35 ఏళ్లు. అందమైన అన్నాకు మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా నిరాకరించింది. తన జీవితంలోని మిగిలిన 37 సంవత్సరాలను కేవలం దోస్తోయెవ్‌స్కీ జ్ఞాపకాలను, అతని సాహిత్యాన్ని ప్రపంచానికి చాటడానికే అంకితం చేసింది. ఆమె దోస్తోయెవ్‌స్కీ డైరీలను ప్రచురించింది, అతని పేరిట మ్యూజియం ఏర్పాటు చేసింది. ఆమెను “మీరు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు?” అని అడిగితే ఒక అద్భుతమైన మాట చెప్పింది:”దోస్తోయెవ్‌స్కీతో జీవించిన నేను, ఈ ప్రపంచంలో ఏ మగవాడినీ పెళ్లి చేసుకోలేను. బహుశా ‘టాల్‌స్టాయ్’ దొరికితే ఆలోచిస్తానేమో!” అని . ఈ బంధం తరువాతి తరాల కళాకారులను , రచయతలను ప్రభావితం చేసింది .

118 ఏళ్ల తర్వాత ఈ కథ, ఆర్ట్ సినిమాల్ని కమర్షియల్ హిట్లుగా మలచిన కొద్దిమంది భారతీయ దర్శకుల్లో ఒకరైన భారతీరాజాను ఆకర్షించింది. వెంటనే తన సహచరుడు సెల్వరాజ్ చెవిన వేశాడు. సెల్వరాజ్ ప్రముఖ తమిళ రచయిత జయకాంతన్ నవల “సమూగం ఎన్బదు నాలు పేర్” (సమాజం అంటే నలుగురు మనుషులు) లోని ఒక యువ ఉపాధ్యాయిని, అసంతృప్త వివాహ జీవితంలో ఉన్న ఒక అధికారి మధ్య ఏర్పడిన భావోద్వేగ అనుబంధాన్ని స్ఫూర్తిగా తీసుకుని, అన్నా దోస్తోయెవ్‌స్కీల కథను విస్తృతపరిచి కోయిల్ – మలైచామిల అరుదైన అనుబంధంగా ‘మొదల్ మరియాదై’ స్క్రిప్ట్ తయారు చేశాడు. కోయిల్‌గా రాధ, మలైచామిగా శివాజీ గణేషన్‌లను  ఎంపిక చేశారు . భారతీరాజా ఆస్థాన విద్వాంసులు ఇళయరాజా, కణ్ణన్ లు తమ పనిముట్లతో సిద్ధమయ్యారు. భారతీరాజా సొంత బ్యానర్ ‘మనోజ్ క్రియేషన్స్’ నిర్మాణంలో మద్రాసు ప్రసాద్ స్టూడియోలో మొదలై 50 రోజుల్లో సినిమా రూపొందింది. మైసూరు దగ్గరలోని కావేరి నది ఒడ్డున ఉన్న తలకాడు, శివనసముద్రం జలపాతాల వద్ద షూటింగ్ జరిగింది. 57 ఏళ్ల శివాజీ గణేషన్ అతని మెలోడ్రామా స్టైల్‌కు భిన్నంగా భారతీరాజా పద్ధతిలో అత్యంత సహజంగా, గొప్పగా మలైచామి పాత్రలో ఒదిగిపోయారు.

మలైచామి, కోయిల్ మధ్య ప్రాకృతికమైన బంధాన్ని బలంగా ఆవిష్కరించడానికి భారతీరాజా కణ్ణన్ కు ‘గోల్డెన్ అవర్స్’ షూట్‌ను నిర్దేశించాడు. కావేరి ఒడ్డున, ఉభయ సంధ్యల్లో వారిద్దరి స్వచ్ఛమైన అనుబంధానికి ఖచ్చితమైన కాంతి ఛాయలు అమరాయి.20 ఏళ్ల రాధ ఆ ఏడాది జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి పోటీపడింది. జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా, వైరముత్తు రాసిన ‘పూంగాత్రు తిరుంబుమా’ పాటకు ఉత్తమ లిరిక్స్ పురస్కారం పొందింది.సినిమా పూర్తయ్యాక రిలీజ్‌కు ముందు బయ్యర్లకు వేసిన ప్రివ్యూ షోలో వచ్చిన రెస్పాన్స్ భారతీరాజాకు భయం పుట్టించింది.

కెమిస్ట్రీ, రొమాన్స్, డ్యూయెట్‌లు లేకుండా ఓ ముసలి ఊరి పెద్దకూ, ఓ పడుచు పల్లెకారిణికీ మధ్య నడిచే ప్లేటోనిక్ లవ్ స్టోరీని జనం చూస్తారా? అనే ప్రశ్న తొలిచివేయసాగింది. ఈ సందేహ నివృత్తి కోసం కేవలం మహిళా ప్రేక్షకుల ప్రదర్శనార్థం ఒక ప్రివ్యూ షో వేశారు. చూసిన వారంతా కన్నీరు కార్చారు. శభాష్ అన్నారు. ఆగస్టు 15, 1985న విడుదలయి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. తెలుగులో ‘ఆత్మబంధువు’గా డబ్బింగ్ చేయబడింది. ఇప్పటికీ మానవ సంబంధాలను ఒక విభిన్నమైన కోణం నుండి చెప్పబడిన సినిమాగా ప్రశంసలందుకుంటోంది.

మలైచామి మేనల్లుడు చెల్లకన్ను, చెప్పులు కుట్టే సెంగోడన్ కూతురు సెవులి ప్రేమకథను, ప్రధాన పాత్రల కెమిస్ట్రీకి భిన్నంగా యవ్వనం, వాంఛ, భౌతిక సాన్నిహిత్యం ప్రాతిపదికన నడిపించి, అర్ధంతరంగా ముగించి, బలవంతంగా సమాజం ఆమోదించిన సఫల ప్రేమ కంటే, నలుగురు ససేమిరా అంగీకరించలేని ఆత్మబంధం ఉన్నతమైంది అని చెబుతాడు భారతీరాజా.

మనుషుల మితి మీరిన స్వార్ధానికి  సెవులి బలై పోయాక చెల్లకన్ను ఆమె వియోగాన్ని భరించలేక పిచ్చివాడై పోయి,  ఈ లోకాన్నే విడిచిపోతాడు. ఆ హృదయవిదారక  దృశ్యాన్ని భారతిరాజా ప్రయోగాత్మకంగా చిత్రీకరించాడు. సెవులి తో కలిసి తాము కోరుకున్న తీరానికి కలిసికట్టు గా చేరుకున్నట్టు వారిద్దరిమధ్య సంభాషణ సాగుతుండగానే చెల్లకన్ను నదిలో కలిసిపోవడం మనసును కలిచివేస్తుంది.

సెవులి: ‘కిట్టయ్యా! అదిగో అక్కడ కంటికందని దూరంలో ఒక ఒంటి తాటిచెట్టు ఉందదే, దానికవతల ఏముందంట ?’ .

చెల్లకన్ను: ‘నింగీ నేలా కలిసే చోటేగా, అక్కడ కూడా భూమే ఉంది, మనలాంటి మనుషులే ఉన్నారు.’

సెవులి: ‘అబద్ధాలు, అక్కడ ఏడు సముద్రాలు, ఏడు కొండలు ఉన్నాయట, అదో స్వర్గమట, అక్కడ మనలాంటి పేదోళ్లు లేరంటగా  . అంతా డబ్బున్నోళ్లేనట. అదేంటి ఆకాశం అంత ఎర్రగా ఉంది!’

చెల్లకన్ను: ‘మనూరి పేదరాశి పెద్దమ్మ తీరిగ్గా తాంబూలం వేసుకుని ఆకాశంలోకి ఉమ్మేసిందని మా అమ్మమ్మ చెప్పింది.’

సెవులి: ‘నింగీ నేలా కలిసే చోటికి మనిద్దరం వెళ్లి అక్కడ వింతలన్నీ చూసి రావాలి.’

భావోద్వేగాల్ని వ్యక్తం చేయడానికి భారతీరాజా ఆకాశం, పారే నీరు, ఎగిరే పిట్టలు, గాలికి తలలు ఊపే పొడవైన చెట్ల కొమ్మలను సింబల్స్‌గా వాడతాడు. అనంతమైన ఆకాశం అపరిమితమైన స్వేచ్ఛకు ప్రతీకగా కోరుకున్న తీరం చేరుకున్న క్షణభంగురం అనిపించినా, ఊహించని జీవితపు కఠిన వాస్తవం, కులోన్మాదపు కోటగోడలు కూల్చిన విజయ దరహాసం ఎక్కువసేపు నిలవదు అని చెల్లకన్ను, సెవులిల కథ ముడిపడిన వెంటనే విడివడుతుంది.

ఈ సినిమా సంగీతం ఓ గొప్ప ప్రయోగం. తమిళనాడు జానపద సౌందర్యాన్ని, పాశ్చాత్య ప్రపంచపు సింఫనీని మేళవించి ఇళయరాజా అందించిన మృదుమధుర నేపథ్య సంగీతం, ‘వెట్టి వేరు వాసం’, ‘పూంగాత్రు తిరుంబుమా’, ‘అందనెల వచ్చా’ వంటి అజరామరమైన పాటలు, పల్లె నేపథ్యాన్ని తలపుకు తెచ్చే పిల్లనగ్రోవి స్వరాలు,మలైచామి, కోయిల్ ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయాన, వినిపించే విషాద ఆలాపన మనసు తడిచేస్తుంది.

ఆ విషాదవిరమణ ని తట్టుకోలేని గంగ వెర్రెత్తి కొండల మీద నుంచి వడి వడిగా  జారుతుంది, పక్షులు రెక్కలు విరుచుకుని ఆకాశంలోకి దిక్కుతోచనట్టు ఎగురుతాయి, లేగదూడలు వెర్రిగా పరుగులు తీస్తాయి, పచ్చగడ్డి కొసలు పిచ్చిపట్టినట్టు ఊగిపోతాయి.

కె. బాలచందర్, బాలుమహేంద్ర, శంకర్‌లు టైమ్‌లెస్ తమిళ సినిమాగా, ప్రపంచ సినిమాగా, వెండితెర కవిత్వంగా ప్రశంసించిన ‘మొదల్ మరియాదై’ భారతీరాజాకు భారతీయ సినిమా చరిత్రలో శాశ్వత గౌరవం పొందేలా చేసిన కళాకృతి.

ఏ వర్షపు సాయంకాలమో హృదయం లేగదూడలా, ఏ భావుకతా సైకతాల వైపో పరుగు తీసే వేళ, ఠాగూర్ ‘గీతాంజలి’, చలం ‘ప్రేమలేఖలు’, దేవులపల్లి ‘ప్రవాస గీతాల’తో పాటు భారతీరాజా కవితాత్మని దర్శింపజేసే ‘మొదల్ మరియాదై’ లాంటి సినిమా కూడా మీ హృదయాన్ని వెలిగించే ప్రేరణ.

*

శ్రీ నివాస్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Avunu konni cinimaalu hrudayaphalakam meeda mudrapadipotae.Bhasha edaina bhaavam gurtu vundipotundi .
    Eppudo vachhindi .Iena nitya nootaname!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు