మనిషి చరిత్రంతా వేటతో మొదలైంది. కానీ ఆకలి కోసం చేసిన వేట, ఆధిపత్యాన్ని నిరూపించుకునే వేటగా మారిన క్షణం నుంచే నాగరికత ప్రశ్నార్థకమైంది. గేయా స్కోటర్స్ రచించిన “ట్రోఫీ” (తెలుగు అనువాదం: వేట) నవల ఈ మార్పును, ఆకలి నుంచి అహంకారానికి జరిగిన ప్రయాణాన్ని అత్యంత సూక్ష్మంగా పట్టుకున్న రచన. ఇది కేవలం జంతువుల వేట గురించి చెప్పే కథ కాదు, ఇది మనిషి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి ఎంత దూరం వెళ్ళగలడో చూపించే మానసిక ప్రయాణం. ఇది వేట కథ మాత్రమే కాదు, వేటను సమర్థించుకునే మానసికతపై దాడి చేసిన కథ.
అభివృద్ధి అనే నినాదాన్ని కవచంగా చేసుకుని ప్రకృతిని దోచుకోవడం, ఆ దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడే బలహీన వర్గాల గొంతులను ఉద్దేశపూర్వకంగా అణచివేయటం, ఇవి ఆధునిక సమాజం ఇంకా వదలని క్రూర అలవాట్లు. ఈ నవల ఒక చిన్న రచన అయినప్పటికీ, దానిలోని భావసాంద్రత, నైతిక లోతు, రాజకీయ ప్రతిధ్వని అసాధారణమైనవి. పైకి చూస్తే ఇది ఆఫ్రికాలో జరిగే ఒక పెద్ద వేట (ట్రోఫీ హంటింగ్) కథలా కనిపిస్తుంది. కానీ లోతులోకి వెళ్లినప్పుడు ఇది పాశ్చాత్య వలసవాద మనస్తత్వం, అధికార దుర్వినియోగం, పర్యావరణ హింస, మనిషి అహంకారం మీద రాసిన ఒక కఠినమైన విమర్శా గ్రంథం.
యూరోపియన్ సాహిత్యంలో ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన నవల ఇది. ఆధునిక మనిషి లోపలి క్రూరత్వాన్ని, ఆధిపత్య భావనను, వలసవాదపు మానసికతను ఒక వేట కథ రూపంలో చెప్పింది రచయిత్రి. ఒకప్పుడు ఆఫ్రికా ఖండాన్ని వలసపాలనతో హింసించిన యూరోపియన్ దేశాల చారిత్రక అపరాధ భావాన్ని, నేటి ఆధునిక కార్పొరేట్ దోపిడీని ఆమె ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు.
ఈ నవల కథానాయకుడు హంటర్ వైట్, ఒక యూరోపియన్. అతడు ధనికుడు, విద్యావంతుడు, ప్రపంచమంతా తిరిగిన పెద్ద వేటగాడు. ఆఫ్రికాలోని ‘బిగ్ ఫైవ్ ‘ జంతువులలో ఒకటైన బ్లాక్ రైనోసరస్ను (నల్ల ఖడ్గమృగం) వేటాడి చంపటం కోసం అతడు ఆఫ్రికాకు వస్తాడు. అక్కడ చట్టాలు, అనుమతులు, డబ్బు అన్నీ అతని పక్షానే ఉంటాయి. అతను తన వేటను క్రూరత్వంగా చూడడు. చట్టబద్ధమైన, డబ్బుతో కొన్న హక్కుగా చూస్తాడు. “వేట వల్ల సంరక్షణ జరుగుతుంది” అన్న వాదనను అతను బలంగా నమ్ముతాడు. అలా ఆ నల్ల ఖడ్గమృగాన్ని వేటాడడానికి వచ్చిన అతనికి అక్కడ కలిగే అనుభవాలు, ఎదురయ్యే సమస్యలు, అతన్ని ఎదిరించిన జంతువులు, చివరికి అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నదే ఈ “వేట” నవల.
ఆఫ్రికాలోని తెగల జీవన విధానం, అక్కడి వారు పడుతున్న ఇబ్బందులు, వేటాడే పద్దతులు ఇందులో క్షుణ్ణంగా చూపించారు. వేటాడే మనిషి ఎలా ఆలోచిస్తాడో, అతని అంతరంగం ఎలా ఉంటుందో, ఏ జంతువుకు ఎటువంటి గన్ను వాడాలో, ఏ సైజు బుల్లెట్ వాడితే వేట సులువవుతుందో, తేలు విషాన్ని ఒక జంతువు వేటకు ఎలా ఉపయోగిస్తారో … ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఇందులో ఉన్నాయి.
ఈ నవలలో ఆఫ్రికా ఖండాన్ని ఒక వినియోగ వస్తువుగా చూపించారు. అక్కడి భూమి, జంతువులు, మనుషులు అన్నీ పాశ్చాత్యులకు సేవలందించాల్సిన వస్తువులుగానే పరిగణిస్తారు. ఇక్కడి ఆఫ్రికన్ తెగ ఒక పక్క వేల ఏళ్ల సాంప్రదాయ పద్ధతిలో వేటాడుతూనే, ఇప్పటి కాలానికి తగ్గట్టు జీన్స్ టీషర్ట్ వేసుకుని పాశ్చాత్య దేశాల సంగీతానికి నాట్యం చేయటం చూస్తే నేటి సాంస్కృతిక గందరగోళాన్ని, మార్పును చూపిస్తుంది.
ఇందులో వేట అనేది కేవలం జంతువులపై జరగదు. ప్రకృతి, స్థానిక సంస్కృతి, మనుషుల ఆత్మగౌరవం అన్నింటిపైనా వేటే. కథానాయకుడి ఆలోచనల్లో కనిపించే ‘నేను చెల్లిస్తున్నాను కాబట్టి నాకు హక్కుంది’ అనే భావన, నేటి గ్లోబల్ ప్రపంచంలోని అసమానతలకు సంకేతం. ప్రత్యేకించి చివరి భాగంలో వచ్చే సంఘటనలు పాఠకుడిని ఒక నైతిక అసౌకర్యంలో నిలబెడతాయి.
గేయా స్కోటర్స్ ఈ కథను చెప్పిన తీరు అమోఘం. ఒక దశలో వేటాడటం తప్పు కాదని పాఠకులను ఒప్పించేలా ఉంటూనే, తర్వాతి క్షణంలోనే మనల్ని తీవ్రమైన ఆత్మపరిశీలనలోకి నెడుతుంది. కథానాయకుడి ఆలోచనలు, అతడి నిశ్శబ్దాలు, అతడి లోపలి గర్వం ఇవన్నీ నెమ్మదిగా పాఠకుల ముందు ఉంచబడతాయి.
వలసవాదం రాజకీయంగా ముగిసినా, తాత్వికంగా ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ నవల సూచిస్తుంది. కేవలం వేటాడటమే కాక అందులోని ఆనుపానులను, ఆఫ్రికన్ ఖండంలోని జీవనాన్ని చూపిస్తూ, ధనికుల స్వభావాన్ని, అక్కడి అడవి తెగలను, వాళ్ళ జీవనాన్ని, అడవుల చుట్టూ జరిగే రాజకీయాలను, మనుషుల చిత్రమైన కోరికలను, జంతువుల జీవన విధానాన్ని… ఇలా అన్నిటినీ క్షుణ్ణంగా ఇందులో చర్చించటం బాగుంది.
ఈ నవల బుద్ధునిలా “ఇది తప్పు” అని చెప్పదు కానీ సాక్రటీస్‌లా మనకు ప్రశ్నలు వేస్తుంది.
“చట్టబద్ధమైతే చాలా?”,
“ధనం నైతికతకు ప్రత్యామ్నాయమా?”,
“డబ్బు చెల్లించాడు కదా, సరిపోదా?”,
“జీవితం విలువ దేనిలో ఉంది?”…
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేయడం ద్వారానే పాఠకులను ఒక నైతిక అసౌకర్యంలోకి నెట్టేస్తుంది. నైతికతను చట్టంతో కొలవలేమని, చట్టం అనుమతిస్తే అది న్యాయం కాదని, డబ్బు చెల్లిస్తే హత్య కూడా సమర్థనీయం కాదని ఈ నవల మనకు స్పష్టం చేస్తుంది.
కథనం పరంగా చూస్తే, నవల ప్రథమార్థం ఏకబిగిన చదివించినట్టుగా ఉండి, ద్వితీయార్థం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కుమార్ గారు ఇదివరకు చేసిన అనువాదాలకన్నా కాస్త మెరుగ్గా అనిపించింది ఇది. అనువాదం ఆసాంతం చక్కగా చేసారు. పదాలు, వాక్య నిర్మాణం చాలా పదునుగా సాగాయి. అనువాదానికై తెలుగులో వారు వాడిన పదాలు ‘వడ్రంగి పురుగు’, ‘నీలి దెయ్యం’ … ఇలా కొన్ని పదాలు ఇందులో కొత్తగా, కథా వాతావరణానికి తగినట్టుగా అనిపించాయి.
పేదవాడు జీవించడానికి వేటాడితే నేరం, ధనికుడు వినోదానికి వేటాడితే చట్టబద్ధం, ఇదే ఈ నవలలో చూపించే భయంకరమైన విరోధాభాసం. నవల మనకు పెద్ద ప్రశ్నలనే విసురుతుంది. మనిషి ప్రకృతిపై తన హక్కును ఎక్కడి వరకు విస్తరించగలడు? మనం వేటగాళ్లమా, లేక ప్రేక్షకులమా? అభివృద్ధి, వినియోగం, విజయాల మత్తులో మనమూ ఎక్కడైనా ట్రోఫీలను కూడబెట్టుకుంటున్నామా? ప్రకృతిని, మనుషులను, సంబంధాలను విజయ చిహ్నాలుగా మార్చుకుంటున్నామా? ఈ ప్రశ్నలన్నీ అసౌకర్యంగా అనిపించినా అవన్నీ వాస్తవాలే.
ఈ “వేట” నవల ప్రతిధ్వని చాలా కాలం పాఠకుడి మనసులో మిగిలిపోతుంది. వేటగాడి చేతిలో తుపాకి కంటే, అతడి మనసులో ఉన్న అహంకారమే అసలైన ప్రమాదమని ఈ నవల మనకు గుర్తు చేస్తుంది. నవల కచ్చితంగా పాఠకులకు అసౌకర్యం కలిగిస్తుంది. మనం కూడా ఒక రకంగా “చూసే వేటగాళ్ళమే” అని గుర్తు చేస్తుంది. ఆధునిక ప్రపంచంలో మనిషి నిజంగా ఎవరి మీద వేటాడుతున్నాడు? ఈ ప్రశ్నే ‘వేట’ నవల పాఠకులకు ఇచ్చే అసలైన బహుమతి. ఇందులో పర్యావరణ సంక్షోభం, వలసానంతర చర్చలు, ఆర్థిక అసమానతలు, భయపెట్టే రాజకీయాలు అంతర్లీనంగా కనిపిస్తాయి.
తెలుగు పాఠకులకు “వేట” ఒక భిన్నమైన అనుభవం. మన సాహిత్యంలో అరుదుగా కనిపించే పాశ్చాత్య ఆధిపత్య మానసికత, మనిషి-ప్రకృతి సంబంధం వంటి అంశాలను ఈ నవల చర్చించింది. వలసానంతర ప్రపంచంలో కొనసాగుతున్న అధికార అహంకారంపై రాసిన గంభీరమైన నైతిక విమర్శ ఈ నవల. ఇది ప్రకృతి సంరక్షణకు వ్యతిరేకంగా రాసింది కాదు, అదే సమయంలో వేటకు మద్దతు ఇచ్చే కథ కూడా కాదు. ఈ రెండు అంచుల మధ్య నిలబడి, మనిషి నైతిక ద్వంద్వాన్ని ప్రశ్నించే అద్భుతమైన సాహిత్య ప్రయత్నం ఇది.
సరైన ప్రశ్నలు సంధించటం సాహిత్యం బాధ్యత అనుకుంటే, అటువంటి ప్రశ్నలను సంధించి ఈ నవల తన బాధ్యతను పూర్తి చేసింది. ఇది వినోదం కోసం చదివే నవల కాదు, మన అంతరాత్మను ప్రశ్నించే రచన. ఎక్కువమంది పాఠకులకు చేరాల్సిన, చేర్చాల్సిన అద్భుతమైన పుస్తకం ఇది.
వేట (తెలుగు అనువాదం) – గేయ స్కోటర్స్ & ఎస్. కుమార్
ఛాయ పబ్లికేషన్స్ ప్రచురణ
225 పేజీలు
₹325
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం.
మరిన్ని వివరాలకు – https://chaayabooks.com/








Add comment