Seen

చుట్టూ అందరూ వాళ్ల వాళ్లతో మాట్లాడుకుంటున్నారు. తనకే ఎవరూ లేరు. టైప్ చేసి చేసి బొటన వేలు, చేయి నొప్పిగా ఉన్నాయి పల్లవికి. ఒకసారి చేయి విదిలిస్తే తేలికవుతుంది అనుకుని బ్యాగ్ లో పెట్టే ముందు ఫోన్ చూసుకుంది. ఏం మెసేజీలు లేవు.

 ‘నిన్ను ఇంతగా బతిలాడుతున్నా అని నీకు అలుసు కదా’. 

కీప్యాడ్ మీద వేళ్లు వేగంగా కదులుతున్నాయి. పుల్లల చీపురుతో వాకిలి ఊడుస్తూ చెత్తని ఒక చోటకి జమ చేస్తారే, అలా కీబోర్డ్ మీద అక్షరాలని జమ చేస్తోంది. పదాలన్నీ స్క్రీన్ మీద పేరుకుంటున్నాయి.

‘నిన్ను అని ఏం ఉపయోగం, నాకే నేను చీప్ గా కనిపిస్తున్నా’. 

చీప్ అనే మాట టైప్ చేస్తుంటేనే ఏడుపొచ్చేసింది పల్లవికి. తలెగరేస్తూ ముక్కు ఎగబీల్చింది. తనని ఎవరన్నా చూస్తున్నారేమో అన్న స్పృహే లేదు. తల దించి మళ్లీ టైపింగ్ మొదలుపెట్టింది.

టైప్ చేస్తుంటే ఫోన్ స్క్రీన్ పక్కగా ఎవరిదో చేతికర్ర అడుగు పడింది, దాని ఊతంతో రెండో కాలు, నిదానంగా మూడో కాలు పడింది. బాటా చెప్పులు వేసుకున్న ఆ మూడు కాళ్ల ముసలాయన ఇంకో అడుగు వేస్తే, ఆ చేతికర్ర పల్లవి పాదం మీద పడేంత దగ్గర ఉంది. తల ఎత్తకుండానే పక్కకి జరిగి స్క్రీన్ చూస్తే ‘ఒక్కసారి’ అన్నమాట తర్వాత ఏం చెప్పాలనుకుందో మర్చిపోయింది. టైప్ చేసింది అంతా చదివింది. నీరసం అనిపించి, కూర్చోటానికి చోటు దొరుకుతుందేమో అని అటూ ఇటూ  వెతికింది.

చేతికర్ర, ఆ పాదాలు ఇప్పుడు ఆమె పక్కగా వెళ్తున్నాయి. చూసింది. ఆయనకి డెబ్భై ఏళ్లుంటాయాయేమో. శరీరం మొత్తాన్ని ఆ చేతికర్ర పిడి మీద వదిలినట్టు నడుస్తున్నాడు. నడవలేని వయసులో ఎందుకు ఇంత దూరం వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. సగంలో ఆపేసిన ఆ మెసేజ్ ని డిలీట్ చేస్తోంది. కీప్యాడ్ ని ఎంత బలంగా ఒత్తుతోంది అంటే.. ఆ ఫోన్ ఊతం లేకపోతే తెగిన గాలిపటంలా ఎటో కొట్టుకోపోయేది. మెసేజ్ అంతా డిలీట్ చేసి, పక్కనున్న రాతి గట్టు మీద కూలబడగానే  ‘హమ్మా..’ అనే శబ్దం పల్లవి నోట్లో నుండి వచ్చింది. ఎవరో ఒకావిడ, అరవై ఏళ్లుంటాయేమో, పల్లవిని చూసి, “మనమే నయం ఈ పిల్లల కంటే. నిలబడితే కూర్చోలేరు. కూర్చుంటే నిలబడలేరు” అని పక్కామెతో చెప్పింది. ఆ పక్కావిడ తల బలంగా ఊపి, అంగీకారం తెలిపింది.

వాళ్లనే చూస్తున్న పల్లవికి ఓ, ఆ అన్న శబ్దాలు వినిపించాయి. ‘ఈ శిల్పాల్లో ఉన్న అమ్మాయిలని మదనికలు అంటారు. ఈ శిల్పం చూడండి. ఈ పురుషుడు.. విల్లు ఎక్కుపెట్టిన ఈ మదనిక కాల్లో ముల్లు తీస్తున్నాడు. రామప్ప శిల్పాలు అన్నిటిలో ఇది చాలా స్పెషల్.’ అని గైడ్ చెప్తున్నాడు. ఆ శిల్పాన్ని చూసే అరిచారు అనుకుంటా అని పల్లవి కూడా లేచి, కుదిరినంత దగ్గరగా వెళ్లి చూసింది. అది విల్లే, చెరుకుగడ కాదు. ఆ మదనిక ఒక పాదం మీద నిలబడి రెండో పాదాన్ని ఒకరి మోకాలు మీద పెట్టి నిబ్బరంగా నిలబడి ఉంది. నల్లటి రాయితో చెక్కిన శిల్పం అది. ఎర్ర రాతి రామప్ప గుడిలోఈ నల్లరాతి మదనిక ఎంత నున్నగా మెరిసిపోతోందో అనుకుంది పల్లవి. కూర్చోబోతుండగా పల్లవికి అనుమానం వచ్చి, ఆ శిల్పంలో ముల్లు తీస్తున్న వ్యక్తిని చూసింది. ముడి వేసుకున్నాడు, మోకాళ్ల మీద కూర్చుని ఆమె పాదంలో ముల్లు తీస్తున్నాడు. ఇంకా దగ్గరగా వెళ్లి చూసింది. నెత్తిన ముడి, చెవులకి జుంకాలు, చేతులకీ కాళ్లకీ కడియాలు, పంచె.. ఆడో మగో చెప్పటం కష్టమైన అలంకరణ అది. పరిశీలంగా చూస్తే ఆ బొమ్మ ఛాతి మీద వస్త్రం లేదు. మగవాడే. అమ్మాయి అరికాల్లో నిజంగానే ముల్లు తీస్తున్నాడు.

ఆ శిల్పాన్ని చూస్తుంటే ఆవాలు నేల మీద జారినట్టు బుర్రలో ఒకేసారి బోలెడు జ్ఞాపకాలు జారిపోతునట్టు ఉంది పల్లవికి.  అతనికి కొనిచ్చిన షర్ట్, అతను పల్లవికి కొన్న డ్రెస్, పుట్టిన రోజున వెళ్లిన గుడి… అసలు ఎక్కడ  మొదలైంది గొడవ! గొడవ అనేంత పెద్ద విషయం కూడా కాదు అది. అతని ఫ్రెండ్ పెళ్లిలో దోస్తులందరి మధ్య చిన్న వాదన. అంతే. చిన్నదే. ‘పెళ్లి కొడుక్కంటే పెళ్లి కూతురే బాగుంది’ అనే ఒక్క మాటతో మొదలు. అందరూ తలో అభిప్రాయం చెప్తున్నారు. ఎటో ఎటో వెళ్లిపోయాయి మాటలు. ‘ఆ మాటకొస్తే పల్లవి పొట్టి. పైగా ఈమధ్య లావయింది. నేనేమన్నా తనని తక్కువ చేసి మాట్లాడానా ఎప్పుడన్నా’ అన్నాడు సంతోష్. నిజమే. తనని ఎప్పుడూ తక్కువ చేయలేదు. కానీ ఎందుకు చివుక్కుమనిపించిందో పల్లవికి తెలీలేదు.

ముల్లు గుచ్చుకున్న ఈ మదనికకి నొప్పి ఉండాలి కదా, మొహంలో ఆ నిబ్బరం ఎలా వచ్చిందా అని ఆలోచిస్తోంది పల్లవి. చప్పట్లు వినిపించి మళ్లీ ఈ లోకంలోకి వచ్చింది. ఆ గైడ్ ఏదో ఉత్సాహంగా చెప్తున్నాడు. అతని చుట్టూ ఉన్న టూరిస్టులు చప్పట్లు కొడుతున్నారు. అతని మాటలు ఆ చప్పట్లలో కలిసిపోయి, వినిపిస్తున్నాయి.

“.. మోసుకొచ్చి, చెక్కి జీవం పోశారు.. ఆ నడుం ఒంపు చూడండి.. ఎంత నాచురల్గా ఉందో” ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు.

ఆ మదనికని, దాన్ని చూస్తున్న ఆడవాళ్ళ నడుములని చూసింది. పల్లవికి అందరి నడుములు ‘మహానటి’ సినిమాలో హీరోయిన్ నడుములానే అనిపించాయి. సన్నని నడుము, పొడుగైన కాళ్ళు అనే కాన్సెప్ట్ కూడా రాతి గుళ్ళంత పురాతనమైనదే అన్నమాట, వేల ఏళ్లుగా ఏం మారలేదా! నవ్వాలో, ఏడవాలో పల్లవికి తెలియలేదు. గైడ్ చూపు తన మీద పడింది అని అర్థం కాగానే, ‘ఫ్రీగా చరిత్ర తెలుసుకుంటున్నా’ అనుకుంటాడేమో అని లేచి గుడి లోపలికి వెళ్ళింది.

గుడి లోపల సిగ్నల్ ఉందో లేదో అని ఫోన్ చూసింది. సిగ్నల్ ఉంది. మెసేజ్ ఏం రాలేదు. అయినా వాట్సాప్ చూసింది. తన మెసేజెస్ ‘డెలివర్డ్’ అని రెండు టిక్స్ కనిపిస్తున్నాయి. చదివినట్టు తెలుస్తుందని బ్లూ టిక్స్ ఆప్షన్ తీసేశాడు. చదివాడో లేదో తెలీదు. ఆన్లైన్లో ఉన్నాడో లేదో తెలీదు.

ఏం తోచక ఇన్స్టాలో రీల్ ఏదో కనిపిస్తే చూస్తోంది. వారంలో అయిదు కిలోలు తగ్గొచ్చు అని ఒక ఇన్ఫ్లూయన్సర్ చేసిన వీడియో అది. తన ఫీడ్ లో ఎప్పుడూ ఇవే రీల్స్, యాడ్స్ కనిపిస్తాయి. వాటిలో కనిపించే అమ్మాయిలని చూస్తే పల్లవికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్లు అంత సన్నగా ఉంటానికి కారణం నిజంగా ఆ యాడ్స్ లో చెప్పే ప్రొడక్ట్స్ యేనేమో అనిపించేది. వాటి వివరాలు ఏఐలో అడిగితే లాభాల లిస్ట్ తో పాటు కిడ్నీ లు పాడయ్యే అవకాశం ఉంది, లివర్ మీద ఒత్తిడి పెరుగుతుంది, నెలసరి ఆగిపోతుంది అని చివర్లో హెచ్చరికలు కూడా కనిపించేవి. రిస్క్ తీసుకోవాలంటే పల్లవికి భయం. డైట్ మొదలుపెడితే మూడ్ స్వింగ్స్, తలనొప్పి, ఎప్పుడూ తిండి గురించే ఆలోచనలు. ఈ ఒత్తిడికి కారణం సంతోష్ అనిపించేది కానీ ఏం అనలేకపోయేది. అతనికి ఈ విషయం చెప్దాం అనుకున్నా, బెరుకు.

ఆ బెరుకు ఎందుకో అర్థం అయ్యేది కాదు. వాళ్లు చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ మీద సంతోష్ కి ఏం చెప్పాలన్నా పల్లవికి ఈ బెరుకు ఉండదు. సంతోష్ జూనియర్ కాబట్టి కాదు, టీమ్ మేనేజర్ కూడా పల్లవి చెప్పేవాటిని శ్రద్ధగా వింటాడు. సంతోష్ కి కూడా ఆమె సామర్థ్యం తెలుసు. ఆమె టీంలో చేరిన కొత్తల్లో పల్లవిని చూస్తే అతనికి గౌరవం, భయం, ఆరాధన. పని కట్టుకుని చెప్పకపోయినా అతనికి ఉన్న గౌరవాన్ని, ఇష్టాన్ని పల్లవి గమనించేది. ఉన్నట్టుండి ఒకరోజు ప్రేమలేఖ రాసి, పల్లవికి ఇచ్చేసి, రెండు వారాలు సిక్ లీవ్ పెట్టేశాడు సంతోష్. ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పేయమని, హెచ్. ఆర్ కి కంప్లైంట్ ఇవ్వద్దని కూడా ఆ ఉత్తరంలో రాశాడు. అలాంటి మనిషి దగ్గర ఇప్పుడు ఏం చెప్పాలన్నా బెరుకు. తన సామర్థ్యం, తన అభద్రతాభావం, తన బెరుకు.. ఇవన్నీ తన శాలరీతో పాటు ఉండే పెద్ద పాకేజ్ అనిపించేది. సంతోష్ దగ్గర ఈ ఎరుక బుర్రలో తిరుగుతూనే ఉండేది. ఒకలాంటి ఒత్తిడి.

వాట్సాప్ తో లాభం లేదని ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసింది. సంతోష్, లాస్ట్ సీన్ ఒన్ అవర్ ఎగో. గంట క్రితం ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేశాడన్నమాట అనుకుని, అందులో కూడా మెసేజ్ ఇచ్చింది. తర్వాతేం చేయాలో తోచలేదు.

ఎదురుగా గర్భగుడి. దాని రాతిగుమ్మం మీద ఏవో శిల్పాలని చూస్తున్నారు టూరిస్టులు. పూజారి గంట మోగుతోంది. దూరం నుండి ఏవో అరుపుల్లాంటి కూతలు. ఆ కూతలు వింటే ఒళ్లు జలదరించింది. హారర్ సినిమాకి వచ్చినట్టు అనిపించింది. ఆ అరుపుల మధ్యే నటరాజ రామకృష్ణ.. స్యాండ్బాక్స్ టెక్నిక్.. ఏవేవో మాటలు చెవుల మీద పడుతున్నాయి. పల్లవికి ఛాతి కింద, పొట్ట పైన ఉండే చోటులో ఏదో గడబిడగా ఉంది. సగం నిండిన బిందెని ఎత్తుకుని నడుస్తుంటే నీళ్లు ఎలా కదులుతాయో అలా ఏదో కదులుతున్నట్టు ఉంది. కాసేపు గాలి ఆడే చోట ఉంటే నయమేమో అని శివుడికి దణ్ణం పెట్టి బైటకి నడిచింది.

నంది మంటపం మెట్లు ఎక్కుతుంటే ఫోన్ ‘బీప్’ అని మోగింది. ఆత్రంగా ఓపెన్ చేస్తే ‘మీరు లోన్ కి అర్హులు’ అని ఏదో కంపెనీ మెసేజ్.

ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసింది. తన మెసేజ్ ‘Seen’.

కానీ రిప్లై లేదు. Statusలో స్నేహితులతో షాపింగ్ మాల్లో దిగిన ఫోటో ఉంది.

కచ్చి. కోపం.

ఆ ఫోటోలో ఉన్న ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసింది.

“హాయ్.. సంతోష్ కోసం చేశా . అతను పిక్ చేయలేదు. మీతో ఉన్నాడా..”

అటు సైలెన్స్.

ఏమిటి అర్థం?!

“లేడు. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. రేపు కలుస్తా వాడిని.. రేపు కాల్ చేయించనా..?”

“రేపా..  కాసేపట్లో తనే కాల్ చేస్తాడులే” అంది పల్లవి.

కాల్ కట్.

వాళ్లిద్దరి గొడవా అందరికీ  తెల్సిపోయింది అని అర్థం కాగానే సిగ్గనిపించింది పల్లవికి. సంతోష్ ఏం చెప్పాడో, వాళ్లకి ఏం అర్థమయి ఉంటుందో ఊహించటానికి ప్రయత్నించింది.  ‘కనిపించేంత సాఫ్ట్ కాదు. చాలా ఇగో. అసలు నేనెందుకు చెప్తానో అర్థం చేసుకోదు. నా మీద అరుస్తది’ అనే చెప్తాడని తెలుసు. ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో రోజూ అనే మాటలే ఇవి. చాలాసార్లు పట్టించుకోకుండా వదిలేసేది. నెల క్రితం ఫ్రెండ్స్ తో గ్రూప్ ఫోటో దిగుతున్నారు. ‘కొంచం సైడ్ తిరిగి నిలబడు, ఫొటోలో సన్నగా కనిపిస్తావ్’ అన్నాడు. ఫ్రెండ్స్ అంతా నవ్వేశారు. ఆ పార్టీ అయిపోయాక, పల్లవిని హాస్టల్ దగ్గర దించేప్పుడు అడిగింది. ‘అందరి ముందు ఎప్పుడూ లావు, సన్నం అని ఎందుకంటావ్? అదేం జోక్ కాదు.’ అన్నది. ‘జోక్ కాదు. నేను అదే చెప్తున్నా. నువ్ ఎంత వెయిట్ పెరిగావ్? ఎవరన్నా సరే మనిద్దరినీ చూస్తే జంట అనుకుంటారా? నువ్ నాకు పెద్దక్కలా తయారవుతున్నావ్.’ అన్నాడు. పల్లవికి పూనకం వచ్చేసినట్టు బైక్ హ్యాండిల్ ని పట్టుకుని ఊపేసింది. ‘వాళ్ళూ వీళ్ళూ ఏం అనుకుంటారు అని కాదు. నువ్వేం అనుకుంటున్నావ్?’ అని అడిగింది. రోడ్డు మీద ఉన్నామనీ, నెమ్మదిగా మాట్లాడమనీ సంతోష్ చెప్తున్నా వినలేదు. ‘చెప్పు.. నువ్వేం అనుకుంటున్నావ్?’ అని గట్టిగా అరిచింది. సంతోష్ బైక్ స్టార్ట్ చేసి, రివర్స్ తిప్పి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద అలా గట్టిగా అరుస్తానే ఉంది. టర్నింగ్ దగ్గర బండి స్లో చేసినపుడు, సంతోష్ వెనక్కి తిరిగి చూశాడు. అదే చూడటం, మళ్లీ చూడలేదు. ఉండబట్టలేక మూడో రోజు తనే మెసేజ్ ఇచ్చింది. ‘నేను సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను’ అని. ‘ఓకే’ అనే రెండు అక్షరాల మెసేజ్ కూడా లేదు. ఏం చేయాలో తెలీక, ఎక్కడికెళ్లాలో తెలీక, టూరిజం బస్సెక్కి రామప్ప గుడికి  వచ్చింది.

ఎంత బావుండేవాడు మొదట్లో, ఇప్పుడెందుకు ఇలా మారాడో అని ఆలోచిస్తూ నిలబడిపోయిన పల్లవిని, పక్కకి జరగమన్నారెవరో. పల్లవి మెట్లు ఎక్కి నంది మంటపంలో నంది పక్కన ఉన్న రాతి అరుగు మీద కూర్చుంది. ఆమెకి ఒకటే నీరసం, కాళ్లు గుంజుతున్నాయి. ఎందుకొచ్చానో అసలు అని తిట్టుకుంటూ, బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ బైటకి తీసింది.

నందికి పసుపు కుంకుమ అద్దుతున్న భక్తులు. ఎవరో ఎగిరెగిరి నంది చెవిలో ఏదో చెప్పుకుంటున్నారు. కొందరు ఫోటోలు దిగటంలో బిజీ. అంతా హడావిడి. అరుపులాంటి కూతలు మళ్లీ వినిపించాయి. ఎవరో ‘నందిని చూశాకే శివుడిని చూడాలి. ముందు ఇటు..’ అని అరిచి, పిలుస్తున్నారు.

ఉన్నట్టుండి స్క్రీన్ మీద నీటి చుక్క పడింది. తల ఎత్తేసరికి బుగ్గ మీద పడింది. చినుకులు మొదలు. ఆ నంది మంటపానికి పైకప్పు లేదు. ఫోన్ తడుస్తుందేమో అని జేబులో పెట్టుకుంది. అక్కడున్న వాళ్ళల్లో కొందరు ‘త్వరగా త్వరగా..’ అనుకుంటూ నందికి పసుపు రాసి, కుంకుమ పెడుతున్నారు. పెద్ద వానే పడేలా ఉందని అర్థం కాగానే పల్లవి బాటిల్ని కూడా బ్యాగ్లో పడేసి మంటపం దిగింది. కొందరు అప్పటికే పరుగులు మొదలుపెట్టారు. పల్లవి కూడా మళ్లీ గుడి వైపుకి వెళ్ళింది.

మరీ లోపలకి వెళ్లకుండా మెట్ల మీద ఓ పక్క నిలబడింది.

వాన జోరు అందుకుంది.

లోపలంతా హడావిడి. అరుపులు.

అందరూ కుదురుకోటానికి పావుగంట పట్టింది. ఎవరి గోలలో వాళ్లున్నారు. ఆ ముసలాయన లోపలికి వచ్చాడా లేదా అని వెతికింది. ఆయన చక్కగా గుడి మధ్యలో నిలబడి, పైకప్పు మీద చెక్కిన సాగరమథనం శిల్పం చూస్తున్నాడు.

జేబులో నుండి ఫోన్ తీసి చూసుకుంది. తడవలేదు. ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసింది. ఆన్లైన్ లో ఉన్నాడు. అతని స్టేటస్ లో ఉన్న ఫోటోని స్క్రీన్షాట్  తీసి, జూమ్ చేసి చూసింది. అతని మొహంలో ఎక్కడా ‘మిస్’ అవుతున్న ఫీలింగ్ లేదు.

ఉక్రోషం తన్నుకొచ్చింది.

ఆ అరుపు మళ్లీ వినిపించింది. గుడి ప్రాంగణం బైట చెట్లు కూలిపోయేలా ఊగిపోతున్నాయి. ఉన్నట్టుండి అంత వాన ఎలా  వచ్చిందా అని ఆలోచిస్తోంది.

ఎదురుగా పగడం రంగులో ఉన్న రాతి పీఠం మీద, కాళ్లు ముడిచి కూర్చున్న ఆ నల్లటి నంది నుదరు నుండి, మెడలో కట్టిన గంటల హారం నుండి, గిట్టల నుండి పసుపు, కుంకుమ జారి, పారుతున్నాయ్.

పల్లవి నిలబడ్డ మెట్లకి పక్కనే మామిడి చెట్టు, దాని మొదలులో నాగుపాముల విగ్రహాలు ఉన్నాయి. అవి చెట్టు మానులో కలిసిపోయాయ్.  ఆ చెట్టు పుట్టి ఎన్నేళ్లు అయి ఉంటుందో అనుకుంటూ తల ఎత్తేసరికి కనిపించింది నెమలి ఒకటి. అప్పుడు కానీ అర్థం కాలేదు, ఇందాకటి నుండి అరుస్తోంది నెమలి అని. వానొచ్చే ముందు వాటికి భలే తెలిసిపోతుంది కదా అనుకుంది. బారు తోకని కిందకి వేళ్లాడదీసి.. కొమ్మ మీద నిలబడింది. నెమలి పింఛం అనాలి కానీ.. ముడిచేసుకుని.. కిందకి వాల్చిన దాని తోక అనే పిలవాలి అనుకుంది.

పురి విప్పిన నెమలి ఫొటోలు, వీడియోలు చూసినప్పుడు, ఎంత అందంగా ఉంటుంది నెమలి అనుకునేది కానీ ఇప్పుడు వానలో తడుస్తున్న ఆ నెమలిని చూస్తే ఒక అనుమానం వచ్చింది. తడిసినప్పుడు ఆ తోక, బరువు అనిపించిందా అని.

బొటన వేలు నుండి గుంజుతున్న చేతిని విదుల్చుకుంటూ హ్యాండ్ బ్యాగ్ ఇటు మార్చి నెమలినే చూస్తోంది. పింఛం కాస్తా తోకలా మారటానికి కాస్త నీళ్ల బరువు చాలు కదా అనిపించింది. ఆ తోక నుండి నీళ్లు జారుతతోనే ఉన్నాయి.

ఈ వాన దెబ్బకి రోడ్లు ఎలా ఉంటాయో, సిటీకి వెళ్లేసరికి ఎంతవుతుందో అని భయమేసింది పల్లవికి. అక్కడ సంతోష్ సంతోషంగా సినిమా చూస్తున్నాడు అనేది వశపడట్లేదు. చేయగలిగింది కూడా లేదు. ఎలా ఉండగలుగుతున్నాడో అర్థం కావట్లేదు. పరిగెత్తుకుంటూ సిటీకి వెళ్లిపోవాలని ఉంది ఆమెకి. సిటీకి వెళ్లాక..? వెళ్ళాక ఏం లేదు, ‘మిస్ అవుతున్నా’ అని సంతోష్ మెసేజ్ ఇస్తే వెంటనే కలవొచ్చు అని ఆశ ఆమెకి.

చుట్టూ అందరూ వాళ్ల వాళ్లతో మాట్లాడుకుంటున్నారు. తనకే ఎవరూ లేరు. టైప్ చేసి చేసి బొటన వేలు, చేయి నొప్పిగా ఉన్నాయి పల్లవికి. ఒకసారి చేయి విదిలిస్తే తేలికవుతుంది అనుకుని బ్యాగ్ లో పెట్టే ముందు ఫోన్ చూసుకుంది. ఏం మెసేజీలు లేవు.

ఏడుపు తన్నుకొచ్చింది. అక్కడ ఉండాలని లేదు. తడిస్తే తడిచాను అని బైటకి కదిలేముందు నెమలి ఎక్కడా అని వెతికింది.

అది  పై కొమ్మ మీదకి ఎక్కింది. నిక్కినట్టు మెడని ముందుకొంచి పెట్టింది. తన మీద సంతోష్ ముద్దు పెట్టినప్పుడు, ఇలాగే మెడని నిక్కినట్టు ముందుకు వంచేసేది. కదల్లేక మెడని తడుముకుంటూ పల్లవి స్తంభంకి ఆనుకుంది.

జోరు వాన కాస్త నెమ్మదించింది. ఎవరో పిల్లాడు బిస్కెట్ కోసం ఏడుస్తున్నాడు. వాడి ఏడుపుకి పల్లవికి చిర్రెత్తుకొచ్చింది కానీ ఏం చేయగలదు. ఎవరి బాధలు వాళ్లవి.

‘ఎక్స్క్యూజ్ మీ’, ఎవరో పిలిచారు. తల ఎత్తింది. కొంచం జరగమని అడిగి, వానలో ఒక బాటిల్ మూతని కడిగి, ‘థాంక్స్’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

‘ఒక్కసారి మాట్లాడు. నా వల్ల కావట్లేదు. నాకు పిచ్చి పట్టేలా ఉంది. ప్లీజ్ ఒకసారి మాట్లాడు.. నేనిలా బతకలేను’ 

ఇంకా ఏదో టైప్ చేసేదే కాని నెమలి అరుపు దగ్గరగా వినిపించి చూసింది.

చెట్టు మీదున్న నెమలి ఎగురుతూ నంది మంటపం మీద వాలింది. ఆ వానలో ఎర్రటి రాతి గోడ మీద నుండి కిందకి తోకని జార్చి, నిలబడిన ఆ నెమలిని చూస్తే ఏదో సరియల్ పెయింటింగ్ లా ఉంది పల్లవికి. జూలో ఎంక్లోజడ్ కేజ్లో నెమలిని చూసినప్పుడు, ‘ఎంత అందంగా ఉంది’ అనుకుందే తప్ప ఇంత ఠీవిగా నిలబడుతుందని పల్లవికి తెలీదు. రాతి గోడ అంచును పట్టుకున్న నెమలి కాళ్ల మీద పడింది పల్లవి చూపు. నెమలి కాళ్ళు బలిసిన కోడి కాళ్లలానే ఉన్నాయి. కలనేత పట్టులా మెరిసే పొడుగైన మెడ ఉన్న నెమలికి ఆ కాళ్లు అదోలా ఉన్నాయ్. రంగుల పింఛం విప్పి నాట్యం చేసే ఆ నెమలి కూత అయితే ఎవరో పీక నొక్కుతుంటే వచ్చే అరుపులా ఉంది. ‘పాకేజ్’. తనకి తట్టిన పదానికి తనకే నవ్వొచ్చింది.

సంతోష్ ఈ నెమలిని చూస్తే ఏమనుకుంటాడో అని ఆలోచిస్తోంది.

అంతలో మంటపం గోడ మీద నెమలి తన ముక్కుని ముందుకు తోసి, మెడని విదిల్చింది. నీలాలూ, పచ్చలు కలిసి బాలే డాన్స్ వేసినంత సుతారంగా ఆ పొడువాటి మెడ వంపులు తిరిగింది. తరువాత ఒక కాలుని ముందుకు జరిపి నిలబడి, ఆ రాతి గోడ మీద కిందకి వేళ్ళాడేసిన తోకని ఒక్కసారిగా విదిల్చింది. పిల్లాడు చిన్న గుప్పిటితో బియ్యాన్ని విసిరేసినట్టు ఆ తోక నుండి నీళ్లు ఎగిరిపడ్డాయి.

మెడని సాగదీసి, దూరంగా ఉన్న చెట్ల వైపు చూసింది.

ఒక్కసారిగా ఎగిరింది.

ఎందుకోగానీ పల్లవి కొంచం ముందుకు ఊగింది.

పలక మీద పిల్లాడు అడ్డంగా గీసిన బలపం గీతలా ఆకాశంలో అంత బారు తోకని మోసుకుంటూ నెమలి ఎగురుకుంటూ, మాయమైపోయింది.

పల్లవి చూస్తూనే ఉంది. నెమలి తిరిగి వస్తుందేమో అని ఏదో ఆశ. వచ్చేలా లేదు. అంత వానలో కూడా పల్లవికి గొంతు ఎండినట్టు అనిపించింది. బ్యాగ్ నుండి బాటిల్ తీసి నీళ్లు తాగింది.

నిదానంగా ఇంస్టా ఓపెన్ చేసింది. సంతోష్ Activeగా కనిపించాడు. మెసెంజర్ ఓపెన్ చేసింది. తన మెసేజిలకి ఇంకా ‘Seen’ స్టేటస్ రాలేదు. వాటిని సెలెక్ట్ చేసి Unsend నొక్కింది.

సోషల్ మీడియాలో, కాంటాక్ట్ లిస్ట్ లో సంతోష్ ని ‘బ్లాక్’ చేసింది.

జడివాన చిన్న తుప్పర అయింది.

ఎదురుగా నంది మంటపం మీద నెమలి నిలబడిన చోటునీ, అది ఎగిరివెళ్లిపోయిన దిక్కునీ చూసింది పల్లవి. అసలు నెమలి అక్కడ వాలిందని, అటు ఎగిరిందనే ఆనవాలు కూడా కనిపించలేదు.

వాన తగ్గగానే, పిల్లలు గుడి నుండి బైటకి పరిగెత్తారు. జనాల మధ్య ముసలాయన నిదానంగా చేతికర్రని పట్టుకుని నడుస్తూ వచ్చి పల్లవి పక్కనే నిలబడ్డాడు. ఆయన్నీ, ఆ చేతి కర్రనీ చూస్తే ముచ్చట అనిపించింది పల్లవికి. ఆయన కళ్లజోడు తీసి నందిని చూసాడు. పల్లవి కూడా చూసింది. వానకి తడిసి, శుభ్రమై, సాయంకాలం సూర్యకాంతికి మెరుస్తోంది నంది.

ఫోన్ తీసి నంది ముందు నిలబడి సెల్ఫీ దిగింది. ఇంస్టాలో అప్లోడ్ చేసింది.

బ్లాక్ చేసినా, తన ఫోటో సంతోష్ కి కనిపిస్తుందో లేదో పల్లవికి తెలీదు. అసలు ఎంత కాలం ఆ కాంటాక్ట్ బ్లాక్ లో ఉంటుందో ఎవరికీ తెలీదు!

*

Image: Rafi Haque

చైతన్య పింగళి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వర్తమాన ప్రేమ సంబంధాలను చక్కగా ప్రతిబింబించిన కథ.

    వర్షంలో తడిసిన నంది విగ్రహం, నెమలి… ప్రతీకలు కావొచ్చు. పల్లవి ఆలోచనలు కొలిక్కి రావడంలో ఇవి యాదృచ్ఛిక పాత్ర వహించినట్టనిపించింది. ద్వైదీభావంతో సతమతమైన ఆమె ఆలోచనల్లో స్పష్టత రాకముందూ, తర్వాతా ముసలాయనను చూసే కోణంలో మార్పు గమనించదగ్గది. ముగింపు సహజంగా ఉంది.

  • పల్లవి.. నంది.. నెమలి.. నేను.. ఆ గుడిలో ఇంకా వర్షంలో తడుస్తున్నట్టే ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.