ముస్లింవాద సాహిత్య లక్ష్యం ఇప్పుడేమిటి ?

ముస్లింవాద సాహిత్య గమనం- గమ్యం గురించి ఈ చర్చ ముందుకు కొనసాగించండి. మీ అభిప్రాయాలకు మా ఆహ్వానం!

ఖాదర్ మొహియుద్దీన్ గారు ఇటీవల ఒక మాటన్నారు – ‘పుట్టుమచ్చ ‘ లక్ష్యం రాజ్యం కాదు, మెజారిటీ సమాజమని. ఐడెంటిటీ ఉద్యమాల అంతిమ లక్ష్యం అత్యంత శక్తివంతంగా సమస్యను ఎజెండా మీదికి తీసుకు రావటమనీ, ఆ కర్తవ్యాన్ని ఐడెంటిటీ ఉద్యమాలు అతి శక్తివంతంగా నిర్వర్తించాయనీ చెప్పారు.

ఐడెంటిటీ ఉద్యమాలు శక్తివంతంగా సమస్యని ఎజండా పైకి తెచ్చాయనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడో ప్రశ్న తలెత్తుతుంది. మైనారిటీవాద సాహిత్యం మెజారిటీ సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే సరిపోతుందా? మెజారిటీ వాదం రాజ్యాన్ని అంటిపెట్టుకున్నప్పుడు ముస్లింవాద సాహిత్యం వంటి అస్తిత్వవాద ఉద్యమాలు రాజ్యాన్ని లక్ష్యం చేసుకోనవసరం లేదా?

‘ పుట్టుమచ్చ ‘ కాలానికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. త్వరిత గతిలో ఇంకా వస్తూనే వున్నాయి. ఉదాహరణకు ఖాదర్ మొహియుద్దీన్ గారు అలా చెప్పాక అంతలోకే భారతదేశంలో జెన్-జీ ఉద్యమం తలెత్తింది. శ్రీలంక, నేపాల్ జెన్-జీ ఉద్యమాలకు, భారతదేశంలో జెన్-జీ ఉద్యమానికి సూక్ష్మమైన తేడా వుంది. భారతదేశంలో బొద్దింకలు హిందూ – ముస్లిం రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. గత ముప్ఫై యేళ్ళ కాలంలో రాజ్యం పనిగట్టుకుని ఇక్కడ చేస్తున్న ఘనకార్యం అదే కాబట్టి ఆ హెచ్చరికకు ఉలిక్కిపడ్డంలో ఆశ్చర్యం లేదు. ఇది అస్తిత్వవాద ఉద్యమాల ప్రభావమే.

రాజ్యాధికారం గురించి అస్తిత్వవాద ఉద్యమాలు మాట్లాడతాయి. రాజ్యానికి నిరసన తెలిపే విధానం గురించి కూడా ఇప్పుడు ముస్లింవాదం లాంటి అస్తిత్వవాద ఉద్యమాలు యోచన చేయవలసి వుంది. ‘ పుట్టుమచ్చ ‘తో ముస్లింవాద ఉద్యమం తలెత్తిన ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాజ్యం జాతీయంగా, అంతర్జాతీయంగా వైషమ్యాలు పెంచుతూనే పోతోంది. పాలస్తీనాలో మానవహననంతో అది పరాకాష్టకు చేరుకుంది. దానికి ఇప్పటిదాకా మనం అనుకుంటూ వున్న కారణాల్ని పునర్మూల్యాంకనం చేసుకోవాల్సి వుంది.

ఇప్పటిదాకా ఏమనుకుంటూ వచ్చామంటే జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ సంభవించిన కొన్ని స్వప్నభంగాలు, ముఖ్యంగా సోషలిస్టు స్వప్నభంగం నేపథ్యం నుంచి అస్తిత్వవాద ఉద్యమాలు తలెత్తాయని. ఖాదర్ మొహియుద్దీన్ గారు అదే చెప్పారు. అయితే ప్రపంచంలోని బడా పెట్టుబడిదారీ దేశాలు చాలా తెలివిగా మనల్ని అలా నమ్మించాయని ఇటీవల జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్ మీద ఏక పక్షంగా జరిగిన దాడి, తరచుగా పెద్ద దేశాలు చిన్న దేశాల మీద దాడి చేయడం వంటివి ప్రపంచ ఆర్థిక విధానాన్ని సంపన్న దేశాలు గుప్పిట్లో వుంచుకోవడానికేనని అర్థమవుతుంది. విభజించి పాలించు సూత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్నంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ జరగలేదనేది స్పష్టం. అదే సూత్రం భిన్న సామాజిక వర్గాల మధ్య సృష్టించి రాజ్యం ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని అర్థం చేసుకోనిదే ముస్లింవాద సాహిత్యం మరింత బలంగా సమస్యను ఎజెండా పైకి తీసుకురాలేదు.

ముస్లింవాద సాహిత్యం బాగా వేళ్ళూనుకొని బలపడింది. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఇప్పుడిప్పుడిప్పుడే ఎదుగుతోంది. అందుకే దర్వేష్ మహమూద్‌నీ, మౌమితా ఆలంనీ కలుపుకొనిపోగలుగుతోంది. స్వతస్సిద్ధంగా కూడా ఆ స్థాయికి ముస్లింవాద సాహిత్యం చేరుకోవలసి వుంది.

*

దాదా హయాత్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ నిశిత దృష్టికి మిక్కిలి ధన్యవాదాలు సార్
    మీ ప్రతి రాత వెనుక అకుంఠింత దీక్ష, విషయం పట్ల సంపూర్ణ అవగాహన పాఠకుడునీ ఇంకా ముందుకు చదివేలా ప్రేరేపిస్తాయి

    • థ్యాంక్ యూ సార్. చర్చలో మీరు పాల్గొనగలరేమో చూడండి. అభిప్రాయం చెప్పినా చాలు.

  • వాదాలు లేని సాహిత్యం వుండదా? ముస్లిం వాదం, క్రీస్తు వాదం, హిందూ వాదం స్త్రీ పురుష వాదాలు ఈ రకమైన సాహిత్య వల్ల ప్రయోజనం శూన్యం.

  • పుట్టుమచ్చ కవిత ముస్లీంవాదం వాదంగా నిలబడడానికి, సాహిత్య లోకం దానిని ఆహ్వానించడానికి కారణమైన మాట వాస్తవమే కానీ, జెన్ జీ తో పోల్చదగ్గ శక్తిని అది పుణికిపుచ్చుకోలేదు. సాహిత్యం వరకు గొప్ప కదలికకు కారణం అయినా సామాజికంగా దాని రీచ్ ఇంకా బిజ దశలోనే ఉంది. మౌలికంగా ఈ వాదానికి “సమాన స్థాయి” అనే రాజకీయ లక్ష్యం అయితే ఉంది కానీ దళిత ఉద్యమం లాగా రాజ్యాధికారం దాని లక్ష్యం కాదు. రాజకీయ భాగస్వామ్యం, వాటా కావాలి అనే డిమాండ్ చాలా కాలంగా అన్ని మైనారిటీ సమూహాల నుంచి ఉన్నదే!

    • శివరామప్రసాద్ కొనకళ్ళ గారు వేసిన ప్రశ్న వాదాలు లేని సాహిత్యం వుండదా అని. గతంలో ఇజాలు లేని సాహిత్యం వుండదా అనే ప్రశ్న లాంటిదే ఇది. ఏ వాదమైనా ఒకరు పుట్టిస్తే రాదు. ఒక సామాజిక వర్గానికి ప్రత్యేకమైన సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యపైన ఆ సామాజిక వర్గం సృజించే సాహిత్యం ఆ వాదాన్ని తెరపైకి తెస్తుంది. ఆ వాదం మొదట ఒక ధోరణిగా కొనసాగి వుండొచ్చు. సమస్యలో గాఢత్వం పెరుగుతూ పోయే కొద్దీ వాదం కూడా చిక్కబడుతుంది.

      ఇక మహమూద్ జెన్-జీతో పోల్చదగిన శక్తిని ముస్లిం వాదం పుణికిపుచ్చుకోలేదు అని చెప్పిన మాట గురించి: సాహిత్యోద్యమాలు ప్రజా ఉద్యమాల్లాంటివి కావు. అయితే అవి రెండూ పరస్పరం ఒకదానిమీదొకటి ప్రభావం చూపిస్తాయి. నిజానికి మహమూద్ స్వయంగా అప్పుడు పాతికేళ్ళ వయసులో వుండి ముస్లిం అస్తిత్వవాద కవిత్వం రాశాడు. నేను నేను కాను అనే కవితలో-

      నా గురించి నేను మాట్లాడితే
      దేశద్రోహం చేశాననే
      అనుమానాల్తో అవమానాల్తో
      నా నోటి మాటను వురి తీశారు

      -అని రాశాడు.

      తల్లీ నన్నెందుకు కన్నావు
      ఈ పైశాచిక స్వభావాల
      వికృతరూపాల నడుమ
      నన్నెందుకు విసిరేశావు?
      జాత్యహంకారపు జ్వాలల్లో
      చిక్కున్నాన్నేను
      విధ్వంసం నీడల్లో
      హింసధ్వనుల కోరల్లో
      ఇరుక్కున్నాన్నేను

      -అని నెత్తుటి బిడ్డలు కవితలో రాశాడు. ఈ కవితని రువాండా, బురుండీ, బోస్నియాల్లో ప్రాణాలు విడిచిన లక్షల మంది అమాయక బాలురకు అంకితం ఇచ్చాడు. ముస్లిం అస్తిత్వవాద కవిత్వానికి విశ్వజనీనత వుందని అప్పటికే ఈ కవిత నిరూపించింది. కవిత్వం, కథ, విమర్శ వంటి సాహిత్య ప్రక్రియల్లో ముస్లింవాద సాహిత్యం ప్రత్యేక విభాగమైంది. ఆ నేపథ్యంలో ముస్లింవాద సాహిత్యానికి గల సమాన స్థాయి రాజకీయ లక్ష్యం గురించి, రాజకీయ భాగస్వామ్యం కావాలనే డిమాండ్ గురించి, రాజ్యాధికారం గురించి ఈ చర్చ ఇంకా ముందుకు పోవాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.