అమ్మతనానికి దూరం చేసిన దుష్టాచారాల శోకగీతం

ఎందుకో మనుషులు మానవత్వం కన్నా మూఢనమ్మకాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మానవ సంబంధాలు మూఢనమ్మకాలలో మాడి మసైపోతున్నాయని గట్టిగా చెప్పడానికి ఈ కథ ఒక సజీవ సాక్ష్యం.

నా చిన్నతనంలో ఒక దగ్గరి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాను. నాకు అప్పుడప్పుడే లోకజ్ఞానం వస్తున్న రోజులవి. ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ఆ జీవి శవాన్ని చూసి కొడుకులు, బిడ్డలు ఏడుస్తున్నారు.

“మేము కలిసి ఉంటే చూస్తానన్నావు కాదనే..నాయనా!” అంటూ శవాన్ని పట్టుకొని దీర్ఘశోకంతో ఏడుస్తోంది కూతురు.

శవాన్ని తీసుకెళ్తుంటే ఊరి జనం తండ్రి శవం మీద పడి ఏడుస్తున్న ఆ బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నారు. “చూశావా అక్కా? తండ్రి చనిపోయాక వాళ్లకు మాటలు కలిశాయి. భూముల పంచాయితీల గొడవల వల్ల తండ్రి బతికున్నప్పుడు ఒక్కనాడైనా మాట్లాడుకోలేదు.”

“ఏదైతేనేం.. ముసలోడు అవిషి అవిషి పానం వదిలిండు. ఇట్లన్నన్న వాళ్ల మాటలు కలిశాయి” అన్నది ఇంకో ఆమె.

తగుళ్ళ గోపాల్ అన్న రాసిన “నువ్వులు చల్లిన తొవ్వ” కథ చదువుతున్నప్పుడు నాకు ఆ సంఘటన గుర్తుకొచ్చింది. ‘చావు మనుషులను కలుపుతుంది’ అని సంఘటన ద్వారా అర్థమైంది.

ఈ కథలో మంగకి చాలా చిన్నవయసులోనే పెళ్లి చేస్తారు. ఊపిరితిత్తుల సమస్య ఉన్నందున, పిల్లలకు దూరంగా ఉంటుంది. బాగా అయ్యేవరకు పెంచి పెద్ద చేసిన నాయనమ్మ దగ్గరే ఉండాలనుకుంటుంది. కానీ మంగ మనసంతా పిల్లలపైనే ఉంటుంది. అత్త మొగులమ్మది నోరు మోరి అని ఊర్లందరికి తెలుసు.

ఆరోగ్యం క్షీణించి మంగ చిన్న వయసులోనే చనిపోతుంది. “ఇంకా లోకం మీద బ్రతకాలని జీవి కొట్లాడుతునట్లు కండ్లు తెరిచి ఉన్నయి.” అంటూ రచయిత ఏడుస్తూ కథ చెప్పుకుంటూపోతాడు.

ఈ కథ మొత్తం మంగ చావు చుట్టూ తిరిగినప్పటికీ, పూర్తి చేశాక నాకెందుకో అలా అనిపించలేదు. నా మటుకు నాకు – ఈ కథంతా మనిషిలో నిండుకొనిపోయిన మూఢాచారాలు, మూఢనమ్మకాల మధ్య మానవత్వం శవమై పడి ఉన్న దృశ్యమే కనిపిస్తుంది.

“అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగిపోయింది!” అని జాలిపడే వ్యక్తుల మధ్యలోనే.. చచ్చిన మనిషిని కూడా చంపడానికి చూసే దారుణమైన పాత్రనూ ఈ కథలో చూస్తాం.

ఎవరైనా చనిపోయినప్పుడు చేసే ఆచారాల గురించి ఎక్కువగా ఆలోచించే స్థితిలో మనం ఉండం. ముఖ్యంగా అలాంటి విషాద వాతావరణంలో. ఏది చేసినా ‘ఆత్మ శాంతి కోసమే’ అని చేస్తారు.

“నీ కంట్లో సూదులు గుచ్చ!” అనే తిట్టు నేను చాలాసార్లు విన్నాను. కానీ దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అదొక సాధారణ తిట్టు అనుకుని వదిలేశాను; విని విని అలవాటైపోయింది. కానీ ఈ కథ చదివాక తెలిసింది – ఆ తిట్టు వెనుక ఎంత ఇంత తీవ్రమైన అర్థం ఉందో అని.

కథలోకి వెళ్తే చనిపోయిన మంగ కంట్లో సూదులు గుచ్చుతుంది మొగులమ్మ. కళ్ల నుండి రక్తం కారుతోంది. కష్టపడి పనిచేసిన చేనులో పాతిపెట్టడానికి కూడా నోచుకోని మంగ శవాన్ని శోకంలో మునిగి తీసుకెళ్తున్న జనాల మధ్య.. మనిషితనాన్ని వదిలేసిన మొగులమ్మ ఒడినిండా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు చల్లుకుంటూ పోతుంది. ప్రేమానురాగాల కంటే మూఢనమ్మకాలే ఎంత బలమైనవో కదా!

“కనికరం లేకుండా కండ్లల్ల సూదులు గుచ్చనీక ఎట్ల చేతులొచ్చినవే!” అని మట్టి తీసి ముఖం మీద కొట్టిన సుబ్బమ్మ, మంగ తరఫున నిలబడ్డ సంజీవు లాంటి పాత్రలే ఈ కథకు మానవత్వపు వెలుగులు.

ఒక చావే మనిషిని ఈ ప్రపంచానికి దూరం చేశాక.. ఈ దుష్టాచారాలకు ఇంకెన్ని దూరాలు కావాలి?

అమ్మతనానికి దూరమైన మంగ కథ మనల్ని మనిషితనానికి దగ్గర చేస్తుంది. చచ్చిన శవాన్ని కూడా పీక్కుతినే మూఢవిశ్వాసాల మధ్య మానవ జీవితం ఒక శోకసంద్రం.

తగుళ్ళ గోపాల్ అన్న కవితాత్మకమైన వాక్యాలతో మంగకి అక్షరాల పూలదండ అల్లాడు. కవితలతో, కథలతో ఏడిపించడం గోపాలన్నకి కొత్తేమీ కాదు. గుండెను పిండేసే కవితలను కలిపి కుట్టిన దుఃఖపు గాథ ఇది. ఎన్ని కన్నీటి బొట్లను కరిస్తే ఇలాంటి ఒక శోకగీతాన్ని పాడగలడు!

మూగబోయిన మంగ మౌన స్వరాన్ని గోపాల్ అన్న తన గొంతుకగా మార్చుకున్నాడు. ఈ కథ మనల్ని కదిలించకపోతే, మనం మనుషులమనే విషయాన్ని మర్చిపోతేనే ఉత్తమం!

ఎందుకో మనుషులు మానవత్వం కన్నా మూఢనమ్మకాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మానవ సంబంధాలు మూఢనమ్మకాలలో మాడి మసైపోతున్నాయని గట్టిగా చెప్పడానికి ఈ కథ ఒక సజీవ సాక్ష్యం.

“కవిత్వం కదిలించగలదు” అంటారు. నిజమే, కవిత్వమే ఈ కథనంతటినీ నడిపించింది.

చనిపోయిన కోడలి కంట్లో సూదులు గుచ్చడమే కాకుండా మంగ శవాన్ని మోసుకెళ్తున్న తొవ్వలో, “కనీస బాధ” లేని మొగులమ్మ చల్లిన నువ్వుల పూర్తి కథను పూర్తిగా చదవడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

  • కథ: నువ్వులు చల్లిన తొవ్వ
  • రచయిత: తగుళ్ళ గోపాల్
  • కథ పరిచయం: తేజ గుడికండుల
  • ప్రచురణ: జిందగీ కథ సంకలనం – 2025 – ఝాన్సీ పబ్లికేషన్స్

 

తేజ గుడికందుల

హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. స్వగ్రామం: జనగాం, జనగాం జిల్లా . పుస్తకాలు చదవడం ఇష్టం. గత ఆరేళ్లుగా వ్యాసాలు, కథలు రాస్తున్నాను. నేను రాసిన రెండు వ్యాసాలకు రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అవార్డు లభించింది. చదవడం, రాయడం నాకు మా తాత గారి, నాన్న గారి నుండి వచ్చాయి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.