ఎక్కడెక్కడి నుంచో కాకులన్నీ వచ్చి చెట్టు మీద కొమ్మల్లో వాలినయి. అంబులెన్సులో మంగ శవాన్ని తీసుకొస్తున్నరని తెలిసి ఊరుఊరంతా హనుమల్ల గుడికాడ ఉంది. జనమంతా రావిచెట్టు కింద నిలబడి రోడ్డు దిక్కు చూసుకుంట మాట్లాడుకుంటున్నరు.
ఏ శబ్దం వినబడ్డా అంబులెన్సే వస్తున్నట్టు రోడ్డు దిక్కు చూసి ‘ఇంకా వస్తలేదన్నట్టు’ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నరు. మంగను చివరి చూపు చూసిపోదామని ఊరి ఆడోళ్ళంతా కలుపుచేలకు పోకుండా ఇంటికాడనే ఉన్నరు.
ఎవరి నోట్లో చూసినా ‘మంగ’ పేరే. పిల్లలను దిక్కులేనోళ్ళని చేసి పోయిందని ఒకరు. చిన్న ఈడున్నే ఆ దేవుడు దోసుకపోయిండని ఇంకొకరు. ఆ దేవుడు తన మీద ఏ తప్పు పెట్టుకోడు. ఏదో ఒక దాని మీద పెట్టి తీసుకపోతడు. నొప్పి లేచిందనో, రోగమొచ్చిందనో ఏదో ఒక వంక చూపి తీసుకొని పోతడు.
అదోమాట, ఇదో మాట మాట్లాడుకుంటుండంగనే అంబులెన్సు వచ్చింది. మంగ శవాన్ని అంబులెన్సు లోపలి నుంచి తీసి వాకిట్ల గడ్డేసి, గడ్డి మీదంగ బొంతలు పరిచి, బొంతల మీద పండబెట్టిండ్రు. ఇంకా లోకం మీద బ్రతకాలని జీవి కొట్లాడుతున్నట్లు కండ్లు తెరిచే ఉన్నయి. అవును! ఎంత పిల్ల మంగ! తిప్పి తిప్పి కొడితే పాతికేళ్ళు కూడా నిండని లేతకొమ్మ. చీర కడితే నడీడు మనిషిలాగ కనబడుతుంది కానీ పదో తరగతి పరీక్షలు రాసిన నెలరోజులకే ఎండకాలం సెలవుల్ల పెండ్లి చేసిండ్రు. మళ్ళీ ఇట్లాంటి సంబంధం దొరకదన్నట్టు హడావిడి చేసిండ్రు. పెండ్లి పిలగాడు కారు డ్రైవరని, ఆస్తిపాస్తులున్నవని దూరదేశమైనా పిల్ల మంచిగ బతుకుతదని ఇచ్చిండ్రు.
‘ఇంత చిన్నపిల్లకు పెళ్ళెందుకని’ మంగ మేనమామ సంజీవ చెప్పినా వినిపించుకోలేదు. పెండ్లైన ఏడాది తిరగకముందే తొలుసూరున కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిన రెండేళ్ళకు బిడ్డ. అదే పెద్దోళ్ళ ఇండ్లల్ల అయితే పెళ్ళీడు వయస్సు. అంతే! వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్ల ఉండొద్దని ఈ లోకంలోనే లేకుండ చేసిండ్రు.
మంగను ఒక్కొక్కరు చూసిపోతున్నరు. మంగను చివరిసారి ఎప్పుడు చూసిండ్రో, ఏం మాట్లాడిందో గుర్తు చేసుకుంటున్నరు. కండ్లల్లకెళ్ళి పానం పోయిందని కళ్ళు చూసి బాధపడుతున్నరు. మంగ కళ్ళల్లో నేరవేరని కోటి ఆశలు. తన పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడాలని, పిల్లలు బడి నుంచి వస్తే ఎదురెళ్ళి వాళ్ళ బ్యాగును తీసుకొని రావాలని, పిల్లలకు తీరొక్క తీపి వంటకాలు చేసి పెట్టాలని తీరని ఎన్నో ఆశలు. చిన్నతనంలనే అమ్మ ప్రేమకు దూరమైంది మంగ. అత్త తనను పొర్కపుల్లలాగ తీసేసినట్లు మాట్లాడినా తనలాగ తన పిల్లలు కావొద్దని జిద్దుకు బతుకుతూ పోరాటం చేస్తుంది.కానీ ఇప్పుడు అమ్మతనం పూర్తిగా అనుభవించకుండానే నిద్రపోయినట్టు పడుకొని ఉంది.
పిల్లలు తల్లిని చూసి భయపడుతారని, అదురుకుంటరని పిల్లల్ని తల్లి దగ్గరికి పోనిస్తలేదు మంగ వాళ్ళ అత్త మొగులమ్మ.
“సంవత్సరం పాటు తల్లికి, బిడ్డలకు ఎడబాపినవు. ఇప్పుడన్న పిల్లల్ని వాళ్ళ తల్లిని చూసుకోనివ్వు” అని ఏడ్సుకుంటనే మంగ నాయినమ్మ సుబ్బమ్మ పిల్లలను పట్టుకొని శోకం గట్టింది. మొగులమ్మ బెల్లంగొట్టిన రాయోలె అట్నే నిలబడి పిల్లలను తల్లి దగ్గరికి పంపింది.
మంగ సచ్చిపోయిదంటే ఎవరూ నమ్మరు. పానమున్నన్ని రోజులు ఒక్క రోజు ఇంటికాడ ఉండకుండ ఉరుకులాడి ఉరుకులాడి పని చేసేది. ఒక్క కూలి మనిషిని పెట్టకుండ చెల్క పని మొత్తం చేసేది. ఇంత నిమ్మలంగ మంగ పడుకొని ఉందంటే ఎవరూ నమ్మరు. నిద్రపోయినట్టు కండ్లు తెరిచి పడుకొని ఉంది. ఒక చెయ్యి మీద మొగడి పేరు పచ్చబొట్టు కొట్టించుకుంది. పిల్లలు తల్లి చేయి పట్టుకొని లేపుతుంటే మంగ తల్లిగారి బలగమంతా ఎక్కిళ్ళు పట్టేటట్లు ఏడ్చింది.
‘పసిపిల్లలు! వాళ్ళకేం దెల్సు? వాళ్ళకు ధైర్యం చెప్పేదిబోయి ఇట్లా ఏడిస్తే వాళ్ళేం కావాలి’ అనుకుంట పిల్లలను ఎత్తుకొని దూరంగా పోయిండు సంజీవ.
ఇప్పటికే ఎండయ్యింది. తొందరగా తియ్యకపోతే శవం వాసనొస్తదని తలా ఒక మాట అంటుండంగనే, బొంద ఎక్కడ తీయాలో చెప్పమని బేగరోళ్ళు వచ్చిండ్రు. స్మశానంలో తీయమని చెప్పి గడ్డపార ఇయ్యబోయింది మొగులమ్మ. మాములుగా అయితే ఎవరి చెలుకల్ల వాళ్ళనే పెట్టుకుంటరు. చెలుకలు లేనోళ్ళే ఊరి స్మశాన వాటికలో పెడుతరు.
“పదెకరాల పొలం పెట్టుకొని దిక్కులేని దానోలె బొందలగడ్డల ఎట్లా పెడుతరు?” అని సంజీవ గొడవకు దిగిండు.
“ఈ ఊరికి మనుం వచ్చింది. ఇద్దరు పిల్లల కన్నది. వరినాట్లేయపోయింది. కలుపుదీయ నేర్చుకుంది. మూడు, నాలుగు మునుములు పట్టి పత్తి తీసింది. భూమంత మీదేసుకొని పోతున్నాది? దాని చెలుకల దాన్ని పెడితేంది? ఆరడుగల జాగనే కదా!” సుబ్బమ్మ గట్టిగా అందరికీ వినిపించేటట్లు అన్నది.
“మీరు మంచిగ చూపిస్తే ఎందుకు సచ్చును నా మేనకోడలు? మీరు పైసకు పియ్యి తిని దాని ప్రాణం తీసిండ్రు” అని మొగులమ్మను పక్కకు నూకిండు సంజీవ.
“అంత ప్రేమున్నోడివయితే మా ఇంట్లకు ఎందుకిచ్చినవు? నీ ఇంట్లనే దాసుకుంటే ఏంది? రోగాలదాన్ని తీసుకొచ్చి నా కొడుకు మెడన ఏసిండ్రు” అని మాటకు మాట పెంచింది మొగులమ్మ. సావు కాడ లొల్లి ఎందుకని సంజీవను, సుబ్బమ్మను సముదాయించిండ్రు పెద్దలు.
బేగరోళ్ళు పాడె కట్టెలు కొట్టుకొని వచ్చిండ్రు. ఇడుపుకు కుర్చీ వేసి మంగను కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. పక్కనే ఇంకొక కుర్చీలో మొగడు రమేషును కూర్చోబెట్టిండ్రు. ఇద్దరికీ నీళ్ళు పోసి కుంకుమతోటి పెద్ద బొట్టు పెట్టిండ్రు. పట్టుచీర కట్టించిండ్రు. పెండ్లైన కొత్తల తొలిసారె ఎట్ల పెడుతరో అట్లనే చనిపోయినప్పుడు కూడా తల్లిగారు బియ్యం తెచ్చి పోస్తరు. కొత్త బట్టలు కట్టిస్తరు.
“మంగా..మంగా..చూడు బిడ్డా..” అని తండ్రి పట్టుకొని ఏడుస్తుండు. “నా చెయ్యి తోటి ఇగ ఇవే ఆఖరి బియ్యం బిడ్డా” అని వలవల ఏడ్చుకుంట బియ్యం పోసి బిడ్డ కాళ్ళు, అల్లుడి కాళ్ళు మొక్కిండు యాదయ్య. మంగ వాళ్ళ అన్న కృష్ణ చెల్లెలు కాళ్ళు మొక్కి పక్కకొచ్చి కండ్లు తుడ్సుకున్నడు.
ఎక్కడెక్కడి నుంచో జనం చూసిపోతున్నరు. ఎవరిని కదిలించినా ఒకటే మాట. “ఇంత పాపం ఏ ఊర్లో ఉండదమ్మా! పాపం మంచి పిల్ల. సచ్చి దాని పానానికి నిమ్మలం చేసుకుంది.”
ఈ ఊరికి మనుం వొచ్చి ఏం సుఖపడలే మంగ. బొక్క ముదరని ఈడుల పెండ్లి చేస్తే ఒక్కక్కటి నేర్చుకుంట వచ్చింది. మంగకు ఐదేండ్లున్నప్పుడే వాళ్ళ అమ్మ పాము కరిచి చచ్చిపోయింది. పెద్దగైందాక నాయినమ్మ సుబ్బమ్మ దగ్గరే పెరిగింది. అలకడం, ముగ్గేయడం, గంజి వొంపడం అన్ని నాయినమ్మ దగ్గరే నేర్చుకుంది.
మంగ అత్తగారోళ్ళకు పదేకరాల పొలం. రెండు బోర్లు. బాయికాడ బెండతోటకు మందు కొడుతుంటే తోటకు నీళ్ళు మోసింది మంగ. ఆ వాసన పడలేదు. అయినా వారం రోజులు అట్లనే పని చేసింది. వారం రోజులైనంక లేవలేకుండ పడేటాలకు దవాఖానకు చూపించి పానం బాగలేదని తల్లిగారింటి కాడనే తోలిపోయిండ్రు.
మందువాసన కడుపులకు కూడా పోయిందో ఏమో, ఏ దవఖానకు తిప్పినా రోగం నయంగాలే. ఎప్పుడు చూసినా పెదాలు ఎర్రగా వాచి ఉండేయి. కాళ్ళు చేతులు పగిలి ఎర్రగా ఉబ్బినట్లు ఉండేవి. వేడిమి వల్ల ఇట్ల అయ్యిందని డాక్టర్లు చెప్పేది. మందులు వాడితే నయం అయినట్టె అయ్యి మల్ల ఎప్పటి తీర్గనే ఉండేది. పెద్ద దవఖానకు తీస్కపోతే ‘ఊపిరితిత్తుల ప్రాబ్లమ్. మందులు వాడితే సరిపోతదని’ డాక్టర్లు చెప్పిండ్రు.
అప్పటిసంది తల్లిగారింటికాడనే టాబ్లెట్లు ఏసుకుంట ఉండేది. అట్లా సంవత్సరం పొద్దు గడిచింది. పిల్లల్ని చూడాలనిపిస్తుంది అని మొగడికి ఫోన్ చేస్తే ‘నీ రోగం పిల్లలకంటనింకెనా? మళ్ళీ ఆ మాట ఎత్తితే సంపుత’ అని ఫోను పెట్టెసేటోడు.
ప్రాణం మంచిగైనంక ఎప్పటికైన అత్తగారింటికి పోత అని అంటుండేది మంగ. అప్పటిదాక వాళ్ళ చదువు ఖరాబు కాకుండా చూసుకొమ్మని రమేషుకు చెప్పేది. పిల్లలంటే రమేషుకు పానమే. మంగ మీదనే ప్రేమ లేకపోయేది. ఊర్లో ఒకదాన్ని చూసుకొని కన్నమ్మ శెరలు పెట్టిండు మంగను.
“ఊపిరితిత్తులకు నీరొచ్చిందని, పానం బాగోలేదని నన్ను తల్లిగారింటికాడ తోలిపోయిండు. అదే రోగం రమేష్‌కు వస్తే ? రమేషును నేను ఒంటరివాణ్ణి చేసి పోతే? అట్లా చేస్తే లోకం ఊరుకునేదా? గంపెడంత నోరు పెట్టుకొని సూదుల్తో గుచ్చి మరీ మొగడికి సేవ చేయించేది” అనకుంట ఒక్కతి కూర్చున్నప్పుడు అనేక తీర్ల ఆలోచించి బాధపడేది. బాధలన్నింటిని కడుపులనే పెట్టుకుంది. ఎక్కడున్నా తన పిల్లలు సంతోషంగా ఉండాలని ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదు. రోజుకొక్కసారైనా పిల్లలతో ఫోన్లో మాట్లాడేది.
*
తల్లిగారి మంది బియ్యం పోసి పక్కకు జరుగంగనే, అందరూ చూస్తుండంగనే మొగులమ్మ మంగ శవం దగ్గరికి పోయింది. కనురెప్పలను తెరిచి కండ్ల నిండా కాటుక పెట్టింది. అనుమానం రాకుండ రెండు కండ్లల్ల సూదులు గుచ్చింది. రెండు కాళ్ళు బొటనవేళ్ళను ఒక దగ్గరకు జరిపి తెల్లదారంతోటి ముడేసింది. ఇన్నేళ్ళు కన్నీరు కార్చి కార్చి ఇంకా అవి లేవన్నట్లు రక్తాన్ని కార్చుతున్నాయి మంగ కళ్ళు. అందరూ చూస్తున్నరు గానీ ఎందుకిట్ల చేస్తున్నవని నోరు తెరిచి అడిగే ధైర్యం ఎవ్వరు చెయ్యలే!
‘గోవిందా…గోవిందా’ అనుకుంటూ అటు నలుగురు, ఇటు నలుగురు పట్టి పాడెను ఎత్తిండ్రు. ఒక్కసారిగా ఏడుపులన్ని ఊరి పొలిమేర దాటినయి. ఆ ఏడుపుల ముందు డప్పులన్ని మూగబోయినయి. మంగ శవాన్ని తీస్తున్నరని ఇండ్లల్ల నుంచి బయటకొచ్చి మిద్దెల మీద నిలబడి చూస్తున్నరు.
మంగ పాడె ముందు పోతుంది. ఇంకా అయిదేళ్ళు కూడా నిండని కొడుకు చిన్న కుండ పట్టుకొని ముందల నడుస్తున్నడు. పిలగానికి తోడుగా తాత చేయిపట్టుకొని నడుస్తున్నడు. వెనుకంగ చిల్లర పైసలు, పువ్వులు కలిపిన బొంగులు చల్లుకుంట మంగ మేనమామ వస్తున్నడు.
మంగ శవం బస్టాండు దాటింది. బస్టాండు దగ్గర, మూల మలుపుల కాడ మంగ ఫొటో బ్యానర్ కట్టి పెట్టిండ్రు. పెయ్యి నిండా నగలతోటి వంకాయ రంగు చీరలో బంగారంలాగ ఉంది మంగ. గదుమకు గంధం, పాపిట మధ్యలో కుంకుమ. తొలిసారె పోసుకున్ననాడు దిగిన ఫొటో అది. ఆ ఫొటోలో ఎంత అమాయకమైన నవ్వు నవ్వుతుంది మంగ. బతికున్నపుడు నన్ను ఒక్కసారన్న చూసిపోతే నాకీగతి పట్టేది కాదన్నట్టు చుట్టాలను నిలదీస్తున్నట్టుగా ఉందా నవ్వు.
బస్సుల పోతున్నోళ్ళు కిటికీలోంచి మంగను తొంగి చూసుకుంట పోతున్నరు. అందరూ ముందల ముందల పోతుంటే మంగ వాళ్ళ అత్త ఏదో పనున్నట్టు వెనుకంగ వెనుకంగనే నడుస్తుంది. మొగులమ్మ చీరకొంగును ఒడిలాగ కట్టుకొని ఏవో చల్లుకుంట వస్తుంది. ఒడినిండా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. ఎవరికీ అనుమానం రాకుండ పిడికిటి నిండా నువ్వులు తీసుకొని దారి పొడవునా ధార తెగకుండా చల్లుకుంటూ వస్తుంది.
ఆడోళ్ళంతా గుసగుస మాట్లాడుకుంట నడుస్తున్నరు. “బంగారమసొంటి మనిషే పోయింది. దీనితోటి ఎవరు పెట్టుకుంటరని?” చూసీచూడనట్టు సుట్టాలు పోతుండ్రు. సుబ్బమ్మ చెవిన పడేసిండ్రు. కండ్లల్ల సూదులు గుచ్చింది కూడా చెప్పిండ్రు.
మొగులమ్మ అంటే ఊరంతటికీ భయం. వాళ్ళ వాకిలి తొక్కాలంటే భయపడుతరు. మొగులమ్మకు చేతబడులు వొస్తవని మూడు బాటలు మాట్లాడుకుంటయి. మొగులమ్మ బెల్లం లేని బూరెలు చేస్తది. కొత్తోళ్ళు అయితే మొగులమ్మ మాట తీరు చూసి ఎంత మంచిదో అనుకుంటరు. కోడలు తోటి ఎవరైనా నవ్వుకుంట మంచిగ మాట్లాడితే ‘నా కోడలుకు ఏం నేర్పిస్తున్నరే లంజల్లారా! నా మొగడి దగ్గర పండబెడుత’ అని నోరు చేసేది.
చెల్కల విత్తనాలు చల్లినట్టు నువ్వులు చల్లుతున్న మొగులమ్మ దగ్గరకు పోయింది సుబ్బమ్మ. “నువ్వేమన్న అత్తవేనానే, నీకెట్ల సావొస్తదే? ఏనుగంత కోడలు చస్తే కంట నీరు వస్తలేదు గానీ, నువ్వులు చల్లుకుంట వస్తవా” అని చీరను గుంజి నువ్వులను కింద పోయబోయింది సుబ్బమ్మ.
“చిన్న కోడిపిల్ల కనబడకపోతనే ఊరంత వెతికిందాక పానం నిమ్మలవడదు. ఎద్దంత మనిషి మట్టిపాలు కాబోతుంటే కనికరం లేకుండా కండ్లల్ల సూదులు గుచ్చనీక ఎట్ల చేతులొచ్చినవే” అని మన్ను తీసి ముఖం మీద గుప్పింది.
“సచ్చింది ముసలిదో, నడీడు మనిషో కాదు. వయస్సులో ఉన్న పిల్ల. మొగడి మీద, పిల్లల మీద ప్రేముంటది. దాని ఆత్మ వాళ్ళ చుట్టే తిరుగుతుంటది. దయ్యమై పిల్లల దగ్గరకు, మొగడి దగ్గరకు వస్తది. అందుకే నువ్వులు చల్లుకుంట కట్టుబాటు చేస్తున్న. అందుకే దాన్ని మా చెల్కల బొంద పెట్టిస్తలేను” అని మొగులమ్మ ఒడి సరిచేసుకుంది. మొగులమ్మ నోరు పని నోరు చేస్తుంటే, చేతులు నువ్వులను ధార తెగకుండ పోస్తున్నయి.
కొన్ని ఊర్లల్ల వయసులో ఉన్న ఆడపిల్ల చనిపోతే దయ్యమై వస్తుందని నమ్ముతరు. దయ్యమైతే కండ్లు కనబడొద్దని కండ్లల్ల సూదులు గుచ్చుతరు. ఆత్మ తిరిగి రాకుండా ఉండడానికి బాట పొడవునా నల్లనువ్వులు చల్లుతరు. అట్లా చల్లితే చనిపోయిన వాళ్ళు ఆత్మై వచ్చినా ఒక్కొక్క నువ్వు గింజ ఏరుకుంట ఏరుకుంట వస్తారంట. ఇంటికొచ్చేసరికి తెల్లారి పోతుందంట. తెల్లారింది కదా అని ఆత్మ వెనక్కి వెళ్ళిపోతుందంట.
“అది దయ్యమై వచ్చి వీళ్ళ మీద పడితే ఎవరు సాదుతరు? ఏడాది దాటినంక ఓ పేదింటి పిల్లను తెచ్చి పెండ్లి చేస్త. వాని కాపురం నిలబెడుత” అన్నది మొగులమ్మ. శవం ఇంకా ఊరన్న దాటలేదు. మొగులమ్మ ఈ మాటలు అనేసరికి రగిలిపోతూ నడుస్తుండు మంగ మేనమామ. ఆడోళ్ళంతా మొగులమ్మ మీదికి ఎగవడ్డరు.
“ఇది మా ఊరి నమ్మకం. వొద్దనడానికి మీరెవరు? మీ పిల్ల అయితే మీ ఊరికి తీసుకొని పోయి బొంద పెట్టుండ్రి. చచ్చినోళ్ళ ఎంబడి మనం పోతమా?” అన్నది మొగులమ్మ.
“నువ్వొక్క దానివే వందేళ్ళు బతుకు తల్లీ” సుబ్బమ్మ ముఖం మీద ఉమ్మించినట్లు మాట్లాడింది.
“శనిముందా? పని ముందా? చెప్పుండ్రి? శనే ముందు. ఇది శనిలాగ చుట్టుకుంటే. నా కొడుకు పిల్లలు ఏంగావాలి?”
మొగులమ్మ మాటలు వింటుంటే మేనమామకు లోపల నరాలు తెగేటంత కోపం వస్తుంది గానీ, కొట్లాట పెట్టుకోవడానికి ఇది సమయం కాదని కోపం మీద నీళ్ళు చల్లుకుంటు వస్తుండు.
మర్రిచెట్టు కింద దింపుడుకళ్ళెం కాడ పాడెను దించిండ్రు. వచ్చిన సుట్టాలంతా మంగ ముఖం మీదంగ పైసలు తిప్పి ఏస్తుండ్రు. కొడుకు మూడు సుట్లు తిరిగి కూడు ఏసినంక పాడెను లేపబోతుంటే సుబ్బమ్మ మంగ దగ్గరకు పోయింది.
“పిల్లల మీద పానం కొట్లాడదా దానికి? అది తల్లిగాదా? దయ్యమయ్యో, భూతమయ్యో రానీ. దాని పిల్లల చూసిపోనీ..” అని కండ్లకు గుచ్చిన సూదులు తీసింది. బొటనవేళ్ళకున్న దారం తెంపింది.
మంగ పెయ్యి మీది సొమ్ములన్ని తీస్తుంటే వీసమెత్తు బంగారు గుండును మంగ నోట్లో పెట్టింది సుబ్బమ్మ. “పిల్లల్ని ఎవరి చేతుల పెట్టినవు బిడ్డా!” అని కొంగు అడ్డం పెట్టుకొని ఏడ్చింది. చేతులను చేతుల్లోకి తీసుకొని ముద్దాడుకుంట రొమ్ములు కొట్టుకుంది.
“బతికున్నప్పుడు అది నాది, ఇది నాది అని ఆరాట పడుతం. చచ్చినంక ఏదీ మన వెంట రాదు” అని అందరూ తొవ్విన గుంత దగ్గరకు కదిలిండ్రు. మంగ బతికున్నప్పుడు ఏదీ నాదని అనుకోలే. పనొక్కటే నాదని బతికింది. మాటొక్కటి మంచిగుండాలని బతికింది. కొత్త కొత్త చీరలు కట్టి శుభకార్యాలకు పోవడం ఎరుగదు. పోతే తల్లిగారిల్లే తెలుసు, వస్తే అత్తగారిల్లే తెలుసు.
స్మశానంలో పెట్టినా, సొంత పొలంలో పెట్టినా మట్టితల్లి బిడ్డవే అని తలా పిడికెడు ఉప్పును ముఖం మీద పోసి కాళ్ళు చేతులు కడుక్కున్నరు వచ్చినోళ్ళంత.
“ఈ ఆదివారం గాక మళ్ళొచ్చే ఆదివారం దినాలు” అని డప్పు చాటింపు వేయించారు. మంగ చావుకు వచ్చిన జనంలో సగం మంది కూడా దినాల నాడు రాలే. చివరిసారి ముఖం చూడాలని జాతరలాగ వచ్చిండ్రు. ‘మనిషే పోయింది. ఇంకేముంది మనకు?’ అని దగ్గరి చుట్టాలు కూడా రాకుండనే పోయిండ్రు.
దగ్గరి చుట్టాలు, అత్తగారి పాలోళ్ళు అందరూ కలిసి దినాలు నాడు కూడు తీసుకొనిపోతున్నరు. గంగిరెద్దులోల్లు మంగ మీద పాట గట్టి పాడుకుంట పోతున్నరు. ఒక్కొక్క పదం పాడుతుంటే కండ్లనిండా నీళ్ళు తీసుకొని నడుస్తున్నరు.
దేవలోకంబాయనో మంగమ్మ
నాగలోకంబాయనో మంగమ్మ
ఏదయ్యో మంగమ్మ రామా
ఏడ గానరాదు రామా
ఊరెల్లిపోవంగో రామా
ఊరు చిన్నబాయె రామా
పలుకులెక్కడ బాయనో రామా
పానమెక్కడ బాయనో రామా
సుట్టాలు వచ్చిండ్రు రామా
సూడ కండ్లు లేవు రామా
చెంబుతో నీళ్ళిచ్చి రామా
చేయి కడుగమంటాదా రామా
సూసుకుందామంటే మంగమ్మ
సుక్కల్లో లేదాయె మంగమ్మ
పలుకరిద్దామంటే మంగమ్మ
పక్కల్లో లేదాయె మంగమ్మ
ఏదయ్యో మంగమ్మ రామా
ఏడ గానరాదు రామా
కనుకున్న పిల్లలకు రామా
ఏమి చెప్పిపోయనో రామా
మంగ తొమ్మిదొద్దుల దాక దారి పొడవున చల్లిన నువ్వులు అట్లనే ఉన్నయి. ఒక తల్లి పక్షి పిల్లల్ని ఎంటేసుకొని వచ్చి నువ్వులను ఏరుకొని తింటున్నది.
*








Add comment