మా ఊరి శివయ్యను చూడటానికి ప్రతిరోజూ కొండల్ని దాటుకొనొచ్చే సూర్యుడి కోసం కృష్ణమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి పరిచయం నిన్నమొన్నటిది కాదు. యుగాల నాటిది. సూర్యుడు రాగానే కృష్ణమ్మ తన అలలతో వెండి ముత్యాలు పరచి నవ్వుతూ పలకరిస్తుంది. ఆ నవ్వు చూడటానికి సూర్యుడు కళ్ళు తెరచి ఇంకొంచెం ఎర్రబడతాడు. శివయ్య కాళ్ళకు నమస్కరించాలంటే ముందుగా కృష్ణమ్మ ఒడిలో తనువు తడుపుకోవాల్సిందే.
అందుకే ప్రతిరోజూ తెల్లవారుజామున వాళ్ళిద్దరి మధ్య కొంతసేపు గుసగుసలు జరుగుతుంటాయి. ఆ గుసగుసలు వినేది గాలి, చూసేది ఆకాశం, అర్ధమయ్యేది శివయ్యకు మాత్రమే.
ఆ రోజు కూడా అలాగే మొదలైంది. పెద్ద పూజారిగారు మెల్లగా కృష్ణ ఒడ్డుకు చేరుకున్నారు. వయసు డెబ్బై దాటింది. నలభై ఏళ్ళుగా కొన్ని అలవాట్లు మారలేదు. ముందుగా సూర్యనమస్కారాలు. తర్వాత కృష్ణమ్మకు నమస్కారం. ఆ తర్వాత ఇత్తడి బిందెలో అభిషేకానికి నీళ్ళు. ఆ బిందె కూడా ఆయనంత పాతదే. తాతల కాలం నుంచి శివయ్య సేవలోనే ఉంది. దాని మెరుపు పోయింది. కానీ అది పోగు చేసుకున్న పుణ్యం మాత్రం ఇంకా మెరుస్తూనే ఉంది.
బిందెనిండా కృష్ణోదకం నింపుకొని గుడివైపు నడవసాగాడు. పొద్దుపొడుస్తోంది. నది ఒడ్డున తడి ఇసుక చల్లగా ఉంది. పక్షులు మెల్లగా మేల్కొంటున్నాయి. దూరంగా గుడి గంట మొదటి సారి మోగింది.
నాలుగు అడుగులు వేసాడో లేదో కాలికి ఏదో గట్టిగా తగిలింది. చేతిలోంచి బిందె జారిపోయింది. నీళ్ళు ఇసుక మీదుగా పారుకుంటూ మళ్ళీ కృష్ణమ్మ ఒడిలో కలిసిపోయాయి. పెద్ద పూజారిగారు బొక్కబోర్లా పడ్డారు.
వయసు మీద పడిన శరీరం. లేవడానికి కొంత సమయం పట్టింది. మొదట అంగవస్త్రం సరిచేసుకున్నాడు. ఆ తర్వాత కాలికి తగిలిన వస్తువు వైపు తిరిగి చూశాడు.
ఉషోదయపు వెలుతురులో అది మెరుస్తోంది.
ఇసుకలో దాదాపు మునిగిపోయి ఉంది.
చెయ్యో…
కాలో…
ముఖమో…
ఏమిటో పూర్తిగా అర్థం కావడం లేదు. మొదట ఆయనకు భయం వేసింది. తర్వాత దగ్గరికి వెళ్ళాడు. ఇంకొంచెం ఇసుక తొలగించాడు. ఒక్కసారిగా ఆయన చేతులు వణికాయి.
“అమ్మా…” మాట అప్రయత్నంగా వచ్చింది.
అది విగ్రహం. ఏ దేవతో ఇంకా తెలియదు. కానీ విగ్రహమే. పెద్ద పూజారిగారు ఒక్క అడుగు వెనక్కి వెళ్ళారు. మళ్ళీ ముందుకొచ్చారు. చేతులు జోడించారు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“నా కాళ్ళు తగిలి అపవిత్రమయ్యావు తల్లీ..”అని గొణుక్కున్నారు.
వెంటనే కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బిందె నిండా నీళ్ళు నింపుకొచ్చి విగ్రహం మీద మెల్లగా పోయడం మొదలుపెట్టారు.
మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. నీళ్ళు విగ్రహాన్ని తాకి ఇసుకలోంచి జారుకుంటూ మళ్ళీ తల్లి దగ్గరకు పరిగెత్తే చిన్నపిల్లల్లా కృష్ణమ్మ ఒడిలోకి వెళ్తున్నాయి. సమయం గడుస్తోంది. సూర్యుడు పైకి ఎగబాకుతున్నాడు. కానీ పూజారిగారు ఆపలేదు.
మరో బిందె
మరో మంత్రం
మరో నమస్కారం
ఇలా గంటలు గడిచిపోయాయి. మొదట ఇద్దరు చూశారు, వాళ్ళు నలుగురయ్యారు, చూస్తుండగానే రెట్టింపవుతున్నారు.
“ఏమైంది?”
“ఏ విగ్రహం?”
“ఎక్కడ నుంచి వచ్చింది?” ప్రశ్నలు పెరిగాయి. జనం పెరిగారు. కానీ పూజారిగారు మాత్రం సమాధానం చెప్పలేదు. ఆయనకు ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ముఖ్యం కాదు. కళ్ళముందు కనిపిస్తున్న విగ్రహం, జరగాల్సిన పూజా కార్యక్రమాలే ముఖ్యం. కొద్దిసేపటికి ఊరంతా కృష్ణ ఒడ్డుకు చేరుకుంది. అందరూ చేతులు జోడించి నమస్కారాలు పెడుతున్నారు. కర్పూరం వెలిగించి హారతులిస్తున్నారు. విగ్రహం ఇంకా పూర్తిగా బయటపడలేదు. కానీ భక్తి మాత్రం అప్పటికే అఖండ జ్యోతిలాగా వెలిగిపోతుంది. మనిషి నమ్మాలనుకున్నప్పుడు తర్కాలు ఆలోచించడు. ఆ ఊరు అదే నిరూపించబోతోంది.
ఉదయం ఎనిమిది గంటలు దాటేసరికి కృష్ణ ఒడ్డు చిన్న జాతరలా మారిపోయింది. విగ్రహం ఇంకా సగం ఇసుకలోనే ఉంది. కానీ దాని చుట్టూ కథలు పూర్తిగా పుట్టేశాయి.
“ఇది పార్వతమ్మ”అన్నాడు ఒకడు.
“కాదు… గంగమ్మ”అన్నాడు మరొకడు.
“నిన్న రాత్రి నాకు కలలో కనిపించింది”అని ఇంకొకడు చెప్పాడు.
ఆ కల నిజమో కాదో ఎవరికీ తెలియదు. కానీ వింటున్న వాళ్ళల్లో సగం మంది నమ్మేశారు. భక్తికి ఆధారాలు అవసరం లేదు. దేవుడు ఉంటే చాలు.
మధ్యాహ్నానికి పక్క ఊర్ల నుంచి కూడా జనం రావడం మొదలైంది. మొదట సైకిళ్ళ మీద వచ్చారు. తర్వాత ఆటోలు. తర్వాత ట్రాక్టర్లు.
ఒకేరంగు బట్టలు వేసుకున్న వాళ్లెవరో గుంపులుగా వచ్చారు. ఒకపక్కన కోలాటాలు మొదలయ్యాయి. మరోపక్కన కొబ్బరికాయలు అమ్మడం మొదలుపెట్టారు.
విగ్రహం ఇంకా ఇసుకలోనే ఉంది. కానీ వ్యాపారం మాత్రం బయటపడిపోయింది. ఒక మూలన మిఠాయి బండి, మరొక మూలన బొమ్మలు అమ్మే వాళ్ళు అవతరించారు.
శివనామస్మరణ తో పాటు, “టీ… కాఫీ..”అన్న అరుపులు కూడా అక్కడ మారుమ్రోగుతున్నాయి. కాసేపటికే భజన బృందాలు కూడా చేరుకున్నాయి.
మొదట భక్తి, తర్వాత ‘ఎవరి భక్తి?’ అనే ప్రశ్న, వెంటనే వారి మధ్య పోటీ.
“మా బృందం ముందుగా పాడుతుంది”అన్నారు ఒకరు.
“చాలా ఏళ్ళుగా శివయ్యకు పాడేది మేమే”అన్నారు ఇంకొకరు. అరగంటలోనే భక్తి కాస్త వాదనగా మారింది. వాదన కాస్త గొడవగా మారింది.
పెద్ద పూజారిగారు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఆయనే స్వయంగా నీళ్ళు తెచ్చి విగ్రహం మీద పోస్తూనే ఉన్నారు. మంత్రాలు చదువుతున్నారు. ఆయన కళ్ళల్లో భక్తి మెరుస్తుంది. ఆయనకు ఇది దైవ దర్శనం. మిగతా వాళ్ళకు మాత్రం ఒక మంచి అవకాశం, వినోదం, వ్యాపారం, కొందరికి రాజకీయ భవిష్యత్తు.
సాయంత్రానికి ఊరి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. ఆయన నడిచి రావడం కుదరలేదు. నలుగురు అనుచరులు రెక్కలు పట్టుకుంటే కిక్కిరిసిన జనం పైనుంచి నెమ్మదిగా ఈదుకుంటూ కాలికి ఇసుక అంటకుండా వచ్చారు. వచ్చీ రాగానే ముందు విగ్రహాన్ని చూశారు. తర్వాత జనాన్ని చూశారు. ఆ చూపులో భక్తి కంటే లెక్కలే ఎక్కువగా ఉన్నాయి.
ఆయన పక్కనే పూజారిగారి కొడుకు నిలబడి “మా తాతగారి కాలం నుంచీ..”అని మొదలుపెట్టాడు.
తండ్రి భక్తి, తాత సేవలు, వంశ పరంపర, దైవానుగ్రహం అన్నీ సభక్తికంగా వివరించాడు. ప్రెసిడెంట్ గారు నవ్వుతూ విన్నారు. ఆ నవ్వులో ఎంత భక్తి ఉందో తెలియదు. కానీ ఎన్నికల లెక్కలు మాత్రం ఉన్నాయి. జనం పెరిగారు. గోల పెరిగింది. పుకార్లు పెరిగాయి. ఒకడెవడో అఘోరా వేషంలో ప్రత్యక్షమయ్యాడు. చేతిలో కపాలం, భుజాల దాకా సంస్కారంలేని జుట్టు, కళ్ళల్లో విచిత్రమైన మత్తుతో ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు.
“హిమాలయాల్లో ఇలాంటి మహిమలు నేను వందసార్లు చూశాను”అన్నాడు.
అక్కడ ఉన్నవాళ్ళల్లో ఒక్కరూ హిమాలయాలు చూడలేదు. అందుకే అందరూ నమ్మారు. అతను చెప్పిన ప్రతీ అబద్ధం భక్తి భాషలోకి అనువదించబడింది. సాయంత్రం నాలుగు గంటలు దాటేసరికి చివరకు విగ్రహం పూర్తిగా బయటపడింది. జనం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఇప్పుడు అందరికీ అది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక చేయి విరిగిపోయింది. మరో చేయి మాత్రం ఆశీర్వదిస్తున్నట్టుగా ముందుకు ఉంది. ముఖం అద్భుతంగా చెక్కబడింది. కళ్ళల్లో ఒక విచిత్రమైన కరుణ. జనం మంత్రముగ్ధులయ్యారు.
“అమ్మవారు”అన్నాడు ఒకడు.
“ఖచ్చితంగా అమ్మవారే”అన్నాడు మరొకడు.
అక్కడి నుంచి నిజం వెనక్కి నడవడం మొదలుపెట్టింది. నమ్మకం ముందుకు పరుగెత్తడం మొదలుపెట్టింది. పెద్ద పూజారిగారు జనాలవైపు తిరిగారు. రోజంతా ఎండలో అన్నేసి బిందెల నీళ్ళు మోయడం వల్లనో, వయసు మీద పడటంవల్లనో ఆయన ముఖం బాగా నీరసించింది. కళ్ళల్లో మాత్రం ఒక వింత కాంతి ఉంది.
జనం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు, ఆ నిశ్శబ్దం కోసం ఆయన చాలాసేపు ఎదురుచూసినట్టుగా అనిపించింది.
“నిన్న రాత్రి..” అని మెల్లగా మొదలుపెట్టారు.
“శివయ్య నా కలలోకి వచ్చాడు”
అంతే.
జనం ఇంకొంచెం దగ్గరకు జరిగారు. నిద్రలో వచ్చే కలలకు మనుషులు ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. అవి దేవుళ్ళ గురించి అయితే ఆ గౌరవం ధ్వజస్తంభమంత పెద్దదవుతుంది.
“ఇన్నాళ్ళు ఒంటరిగా పూజలు అందుకోవడం నాకు కష్టంగా ఉంది”
జనం మౌనంగా వింటున్నారు.
“నా ఇంటావిడ కృష్ణ ఒడ్డున రాతిరూపంలో వెలుస్తుంది, నువ్వే గుర్తుపట్టాలి”
ఆయన గొంతు కొద్దిగా వణికింది.
“పర్వతరాజు కూతురుకదా… అందుకే నల్లగా ఉంటుంది అన్నాడు”
కొంతమంది భక్తుల కళ్ళల్లో వెంటనే నీళ్ళు మెరిశాయి. ఇంకొందరు చేతులు జోడించారు. మరికొందరు అప్పుడే అద్భుతం జరిగినట్టుగా నేలమీద పడిపోయి నమస్కరించారు. ఆ క్షణంలో ఎవరూ ఒక ప్రశ్న కూడా అడగలేదు. కొందరు విగ్రహం కింద ఇసుకను సేకరించి బస్తాల్లో నింపుకుంటున్నారు. వాళ్ళ బంధువులకు, స్నేహితులకు పంపుకుంటామని చెప్పుకుంటున్నారు.
ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది?
ఎప్పటిది?
ఎవరు చెక్కారు?
ఎందుకు ఇక్కడ ఉంది?
ఏ ప్రశ్నా లేదు. భక్తి కొన్ని సందర్భాల్లో ప్రశ్నల్ని పాపాలుగా మార్చేస్తుంది. ఆ ప్రసంగం ముగిసిన వెంటనే పూజారిగారు కళ్ళుతిరిగి కిందపడిపోయారు. రోజంతా ఉపవాసం, ఎండ, వయసు, ఆవేశం అన్నీ కలిసి చివరకు శరీరం తన ప్రాధమిక హక్కును కోరుకుంది. జనం ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు.
“శివయ్య ఆవహించాడు”అన్నాడు ఒకడు.
“దైవదర్శనం తట్టుకోలేకపోయారు”అన్నాడు ఇంకొకడు.
వైద్యుడిని పిలవాలని చెప్పినవాళ్ళు మాత్రం ఒక్కరో, ఇద్దరో. వాళ్ళ మాట ఎవ్వరూ వినలేదు. ఆ సాయంత్రం నుంచే ఊరిలో కొత్త కథలు పుట్టడం మొదలైంది. రాత్రికి రాత్రే ఇసుకలోంచి పుట్టిన ఆ విగ్రహం దేవతగా మారిపోయింది. మరుసటి రోజు ప్రెసిడెంట్ గారి ఇంట్లో పెద్ద సమావేశం జరిగింది. ఊరి పెద్దలు, పూజారులు, దాతలు, వ్యాపారులు అందరూ ఒకే విషయం గురించి మాట్లాడుతున్నారు.
“ప్రతిష్ఠ ఎలా చేయాలి?”
“జాతర ఎంత గొప్పగా జరపాలి?”
“ఎంతమంది వస్తారు?”
“ఎంత పేరు వస్తుంది?”
మొదట భక్తి గురించి, దేవుడి మహిమల గురించి మాట్లాడారు. తర్వాత జాతర గురించి, ఆ తర్వాత ఆదాయం గురించి చర్చించారు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ జాతర కృష్ణా తీరం మొత్తం చెప్పుకునేలా జరగాలి. చుట్టుపక్కల పది జిల్లాల్లో వినిపించాలి. ఎవరూ మర్చిపోలేని ఉత్సవం కావాలి. కొత్తగా వెలిసిన దేవత కోసం ఎంత చేస్తున్నారో తెలియదు. కానీ చరిత్రలో తమ ఊరి పేరు శాశ్వతంగా మిగలాలని మాత్రం అందరికీ ఉంది.
పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. పోస్టర్లు వచ్చాయి, బ్యానర్లు వచ్చాయి, ఆహ్వాన పత్రికలు వచ్చాయి. ఎక్కడెక్కడి నుంచో మంత్రోపాసకులు వచ్చారు. సిద్ధాంతులు వచ్చారు. స్వామీజీలు వచ్చారు. వాళ్ళల్లో కొందరికి దేవుడి గురించి తెలుసు. కొంతమందికి మాత్రం జనాల బలహీనతల గురించి బాగా తెలుసు.
పది రోజుల పాటు ఊరు నిద్రపోలేదు. అన్నదానాలు, వస్త్రదానాలు, హోమాలు, యాగాలు జరిగాయి. భక్తులు లక్షలాదిగా వచ్చారు. విరాళాలు నదిలా పారాయి. ఊరంతా పండుగ రంగుల్లో మునిగిపోయింది.
చివరి రోజు వేదఘోషల మధ్య అమ్మవారిని శివయ్య పక్కన ప్రతిష్ఠించారు. పూల వర్షం కురిసింది. డోలు మోగింది. శంఖాలు పూరించారు.
జనం “హర హర మహాదేవ” అంటూ గర్జించారు.
ఆ గర్జనలో ఒక నిజం పూర్తిగా మునిగిపోయింది.
శివయ్య పక్కనే. అమ్మవారి రూపంలో ఉన్న నిజం మాత్రం ఎవ్వరికీ పట్టలేదు.
ప్రతిష్ఠ ముగిసింది, జాతర ముగిసింది, భక్తుల రద్దీ తగ్గిపోయింది. కానీ ఆ సంబరాల రంగులు ఇంకా ఊరి వీధుల్లో ఆరలేదు. ఇంటింటా అదే చర్చ.
“ఈ ఊరికి మహాభాగ్యం కలిగింది”
“శివపార్వతులు స్వయంగా వెలిశారు”
“ఇక ఈ ఊరికి తిరుగులేదు”
ఎవరి మాటల్లోనూ సందేహం లేదు. సందేహపడే ఆ కొద్దిమంది మనుషులు కూడా కనిపించడం మానేశారు. కొన్నిసార్లు ఒక కథను అందరూ కలిసి నమ్మడం మొదలుపెడితే, నిజం ఒంటరిగా మిగిలిపోతుంది.
చలికాలం మొదలవుతోంది. ఊరు మెల్లగా చీకటి దుప్పటి కప్పుకుంటోంది. కుక్కలు పడుకోవడానికి చోటు వెతుకుతున్నాయి. దుకాణాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. పెద్ద కారు ఒకటి నిశ్శబ్దంగా ఊర్లోకి వచ్చింది. ఆ కారు మీద దేవుడి జెండాలు లేవు. రాజకీయ జెండాలు లేవు. కేవలం దుమ్ము మాత్రమే ఉంది. కారు నేరుగా పెద్ద పూజారిగారి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఐదుగురు దిగారు. తెల్లటి బట్టలు. చేతుల్లో ఫైళ్ళు. ముఖాల్లో ఆత్రుత. వాళ్ళు నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. మొదట ఎవరూ పట్టించుకోలేదు. కానీ గంట గడిచింది. ఇంకో గంట గడిచింది. వాళ్ళు బయటకు రాలేదు. లోపల మాత్రం మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మొదట చర్చ.
తర్వాత వాదన.
తర్వాత ఆవేశం.
తర్వాత కోపం.
చివరికి బెదిరింపులు. ఆ శబ్దాలన్నీ బయటికి వినిపిస్తున్నాయి. ఊళ్ళో మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి.
“ఏమై ఉంటుంది?”
“దేవాలయ భూముల విషయమా?”
“ప్రతిష్ఠ ఖర్చుల విషయమా?”
ఎవరికీ ఏమీ తెలియదు.
తెలిసింది ఒక్క పూజారిగారికే. చివరకు ఆ మనుషులు బయటికి వచ్చారు.
వెళ్తూ
“మళ్ళీ వస్తాం” అన్నారు.
ఆ మాటలో హెచ్చరిక ఉంది. కారు వెళ్ళిపోయింది. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ ఆ నిశ్శబ్దం ప్రశాంతతది కాదు. తుఫాను వెళ్ళిపోయిన తర్వాత సముద్రం పొందే అలసటలాంటిది. ఆ రాత్రి పూజారిగారికి నిద్ర పట్టలేదు.
ఎన్నిసార్లు గుడివైపు చూశారో…
ఎన్నిసార్లు నిట్టూర్చారో…
ఆయనకే తెలుసు.
మరుసటి రోజు ఉదయం కూడా భక్తులు వచ్చారు. పూలు పెట్టారు. కొబ్బరికాయలు కొట్టారు. హారతులు ఇచ్చారు. ఎవరికీ ఏమీ తెలియదు. శివయ్య పక్కన కూర్చున్న అమ్మవారిని చూసి నమస్కరిస్తున్నారు. ఆమెను పార్వతిగా పిలుస్తున్నారు. అమ్మగా భావిస్తున్నారు. మహిమలు ఉన్నాయని నమ్ముతున్నారు.
కృష్ణమ్మ మాత్రం మౌనంగా ప్రవహిస్తోంది.
ఆమెకు నిజం తెలుసు.
ఎన్నో ఏళ్ళుగా ఆ రాతి విగ్రహాన్ని తన ఒడిలో మోసింది ఆమెనే.
గత ఏడాది వచ్చిన వరదల్లో పక్క ఊరి చర్చి గోడ కూలిపోయింది.
ఆ గోడతో పాటు ఒక విగ్రహం కూడా కృష్ణమ్మలో కలిసిపోయింది.
నల్లరాతితో ప్రేమగా చెక్కించుకున్న మేరీ మాత విగ్రహం.
వరద దాన్ని కూల్చేసింది.
కృష్ణమ్మ మోసుకొచ్చింది.
కాలం ఇసుకలో దాచింది.
ఒక రోజు మనుషులు దాన్ని కనుగొన్నారు. వాస్తవం కళ్ళను కప్పేసింది. తమకు కావలసింది మాత్రమే వాళ్ళకు కనిపించింది. ఆ విగ్రహం మాట్లాడలేకపోయింది. కృష్ణమ్మ సాక్ష్యం చెప్పలేకపోయింది. పెద్ద పూజారిగారు నిజం చెప్పలేకపోయారు. నిజం చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు.
కొన్ని అబద్ధాలు మనుషులు చెబుతారు. కొన్ని సమాజం చెబుతుంది. కొన్ని మాత్రం భక్తి చెప్పిస్తుంది. అందుకే బహుశా దేవుళ్ళు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. మనుషులు వాళ్ళ పేరుతో చెప్పే కథలు వింటూ.
కృష్ణమ్మ మాత్రం ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది.
మరో నిజాన్ని.
మరో అబద్ధాన్ని.
మరో దేవుడిని.
మరో మనిషిని.
తన ఒడిలో మోస్తూ.
శివోహం.
*








Add comment