జిమ్మెదారి

ఎంతకూ నిద్ర పడ్తలేదు జహాంగీర్‌కు. అటు తిరిగి పడుకున్నా ఇటు ఒత్తిగిల్లి పడుకున్నా జరసేపటికి ఎల్లకిల పండుకుని చీకట్లోకి కనురెప్పలు కొడుతు సోంచాయించుకుంట ఉంటున్నడు.
పొద్దుగూకాల షోయబ్‌ ఫోన్‌ చేసిన కాణ్నుంచి మనసు మన్సుల లేదు. ఆ మాట విని జహాంగీర్‌ ఎంతగనమో ఖష్షయితడు అనుకున్నడు షోయబ్‌. ‘ఐసా..!’ అని వాడు చెప్పిందంతా ఇన్నడు గనీ జహాంగీర్‌ ఎందుకో పెద్దగ  సంతోషపడలేదు. అది గమనించిండు షోయబ్‌. అదే అడిగిండు తండ్రిని.
‘‘అదేం లేదురా! నువ్వు ఇండియాకు వచ్చేస్తనంటే సంతోషమే గదా! ఇన్నాళ్లు నేనే ఆ విషయం తీసేటోన్ని కదా!’’ అన్నడు.
‘‘సరే అబ్బాజాన్‌! అమ్మీకు ఈ విషయం చెప్పు, నేను కాస్త పనిలో ఉన్నా, రేపు మళ్లీ ఫోన్‌ చేస్తా’’ అని పెట్టేసిండు షోయబ్‌.
షోయబ్‌ అమెరికా వెళ్లి పదేండ్లు దాటింది. గ్రీన్‌ కార్డు గుడ వచ్చింది. షోయబ్‌ గ్రీన్‌ కార్డు వచ్చిందని ఖుషీగ చెప్పినప్పుడు గుడ జహాంగీర్‌ ముబావంగనే ఉన్నడు. షోయబ్‌ ఎప్పటికైనా ఇండియా తిరిగి వచ్చేసి తమ కండ్ల ముందల ఉండాలని జహాంగీర్‌ ఆశ. అలాంటిది, ఇవాళ షోయబ్‌ చెప్పిన విషయం విని నిజానికి జహాంగీర్‌ షానా ఆనందపడాలి. గానీ అంతగా ఎందుకు సంతోషంగా లేదో తనకే అర్దమైతలేదు జహాంగీర్‌కు.
***
జహాంగీర్‌కు ఒక బిడ్డ, ఒక కొడుకు. లోకం తెలిసిన మనిషి. పిల్లల్ని బాగా చదివించాల్నని, తనలాగా చదువు కోసం తన పిల్లలు ఇబ్బంది పడకూడదని మొదట్నుంచి ఆరాటపడ్డడు. అందుకు కష్టపడ్డడు. మంచి చదువులు చదివించిండు. కొడుకు పెద్దయ్యేసరికి వాడి ఒకరిద్దరు దోస్తులు అమెరికా వెళ్తున్నరని తను గూడ ఎల్తనని పోరసాగిండు. గుండెల్ల రాయి పడ్డది జహాంగీర్‌కు. ఏది జరక్కూడదని తను అనుకున్నడో కొడుకు అదే కోరుతున్నడని దిగులు పడ్డడు. నిమ్మలంగ అతనితోని కూసొని సమ్జాయించి చెప్పిండు.
‘‘బేటా! మాకున్నది మీరిద్దరే. మీ అక్క షాదీ చేస్తే వేరే ఇంటికి ఎల్లిపోతది. మిగిలేది నువ్వే. నువ్వు అమెరికా ఎల్తే ఇక్కడ మాకు దిక్కెవరు చెప్పు. పైగా నువ్వు డాక్టర్‌వై ఇక్కడ బీద ప్రజలకు ఉన్నంతల సేవ చేస్తవని కల గన్నానురా నేను. నువ్విట్లా పోతనంటే ఎట్లరా?’’ అన్నడు బాదగ.
‘‘అబ్బాజాన్‌! మీ తరం ఇలాగే ఆలోచిస్తున్నది. కానీ మా భవిష్యత్తు గురించి మేం గూడ ఆలోచించాలి కదా! ఇవన్నీ నేను గుడ సోంచాయించిన. మా ఫ్రెండ్స్‌తో మాట్లాడిన. వాళ్ల మాట, నా ఆలోచన గుడ ఒక్కటే. కొన్నేళ్ళు అక్కడ పనిచేయడం వల్ల కొన్ని పైసలు జమ చేసుకోవచ్చు. మళ్లీ ఇండియా వచ్చేసి ఇక్కడ హాస్పిటల్‌ పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడెట్లయినా మీకు తోడుంటా కదా! కాదనకు అబ్బాజాన్‌!’’ అన్నాడు వాడు బతిమాలుపుగా.
కండ్లల్ల నీళ్లు ఊరినయి జహాంగీర్‌కు. కొడుక్కు కనిపించనివ్వకుంట ‘‘సరే, నీ ఇష్టం లేరా! అట్లనే కానీయ్‌’’ అనుకుంట లేషి ‘‘నేను డ్యూటీకి తయారైత’’ అనుకుంట అవతలి అర్రలకు ఎల్లిపోయిండు. షోయబ్‌ హమ్మయ్య అని ఎగిరి గంతేసిండు.
***
ఆధునిక భావాలు కలిగినవాడు జహాంగీర్‌. తన వంతు సామాజిక కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు.
కొడుకు అమెరికాలో కుదురుకున్నడు. సంవత్సరానికోసారి వచ్చిపోతున్నడు. మధ్యలో అతడు కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నడు. ఇప్పుడు అతడికో అమ్మాయి.
బిడ్డను పెళ్లికి ముందే ఉజ్జోగం సంపాయించుకునేలా చేసి ఆ తరువాతే ఆమెకు తగిన వాడిని చూసి పెళ్లి చేసిండు జహాంగీర్‌.
చుట్టూ షోయబ్‌ లెక్క అమెరికా వెళ్లినవాళ్లను చూస్తున్నడు జహాంగీర్‌. కాబట్టి ఇక షోయబ్‌ అక్కడే సెటిలైపోతడని అర్దమైపోయింది జహాంగీర్‌కు. అందుకే మనసు గట్టి చేసుకొని ఇక షోయబ్‌తో ఇండియా రావడం గురించి మాట్లాడడం మానేసిండు.
బార్య నసీమా అప్పుడప్పుడు బాద పడేది, ఉన్న ఒక్క కొడుకు మన కండ్ల ముందు లేకుంట పరాయి దేశం పాలైపోయిండని ఏడ్చేది.
‘‘ఏడవడం ఎందుకు నసీమ్‌! వాడికిష్టమైనట్లు వాడుంటున్నడు కదా! ఫోన్‌ మాట్లాడుతనే ఉన్నడు గదా! వీడియో కాల్‌లో చూస్తనే ఉన్నవు కదా! పిల్లలకు ఇష్టమైనట్లు ఉండనివ్వడమే ఇప్పుడు మనం చేయగలిగింది’’ అంటు ఓదార్చేటోడు జహాంగీర్‌.
షోయబ్‌ తండ్రితో ఫోన్‌ మాట్లాడేప్పుడు ఇండియాలో రాజకీయ పరిస్థితులు, సామాజిక ఉద్యమాల గురించి అడిగి తెలుసుకునేటోడు. కొన్ని విషయాల్లో తన అబ్జర్వేషన్లను చర్చించేటోడు. 2014 తర్వాత ముస్లింల మీద విష ప్రచారం పెరగడం గురించి, అమెరికాలోని కొందరు తన సహచరుల్లోనూ మతోన్మాద స్పందనలు వింటున్న విషయాలు పంచుకునేటోడు. బాద పడేటోడు. పరవాలేదు, వీడు అక్కడున్నా ఇక్కడి విషయాల పట్ల ఒక నజర్‌ వేసి ఉంచాడే అని కొద్దిగ తృప్తి పడేటోడు జహాంగీర్‌.
***
ఎడమ పక్కకి ఒత్తిగిల్లి పండుకోవడం ఇష్టం జహాంగీర్‌కు. అటు మల్లి పండుకుంటానికి కోషిష్‌ చేసిండు. అయినా మల్లా చూసుకుంటే ఎల్లకిలా పండుకొని సోంచాయిస్తనే ఉన్నడు. తను బేచైన్‌ అయితున్న కోణం కరెక్టేనా?! ఇది స్వార్థమా? లేక ముందు జాగ్రత్తనా? `ఆలోచనలు ఎంతకూ తెగడం లేదు. ఎప్పటికో గానీ ఒక స్థిర నిశ్చయానికి వచ్చి అప్పుడు జరంత నిమ్మలపడి నిద్రపోయిండు.
పొద్దున లేషి కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్‌ చేసి కొడుకు ఫోన్‌ కోసం ఎదురుచూసిండు. జర లేటుగానే చేసిండు షోయబ్‌.
‘‘బేటా! నువ్వు తొందరపడి ఇండియాకు మొత్తంగా వచ్చేయకురా! నువ్వు ఇక్కడికి వచ్చేయడం నాకెందుకో నచ్చడం లేదురా! నువ్వక్కడే ఉండు బేటా! నువ్వక్కడ ఉండడమే మంచిది’’ అన్నడు జహాంగీర్‌.
ఆశ్చర్యపోయిండు షోయబ్‌.
‘‘అదేంది అబ్బాజాన్‌! నువ్వేనా ఇట్లా చెప్తున్నది?! ఇన్నాళ్లు నేనిక్కడ బాగానే ఉన్నప్పటికీ మీ ఇద్దరి గురించే రంది పడేటోన్ని. ఎప్పటికైనా వీలైనంత జల్ది ఇండియా వెళ్లిపోయి అమ్మానాన్నలకు తోడుండాలి, వారికి సేవ చేసుకోవాలి అని ఆలోచించేవాన్ని. అందుకే కదా, నేను పనిచేసే హాస్పిటల్‌లో రిజైన్‌ చేస్తున్నానని చెప్పేశాను. నేనీ విషయం చెప్తే నువ్వు ఎంతో సంతోషపడతా వనుకున్నాను. నువ్వేంటి అబ్బాజాన్‌, నన్ను ఆశ్చర్యపరుస్తూ ఇట్లా అంటున్నావు!?’’ అన్నాడు అయోమయంగా.
‘‘అదికాదురా! ఇక్కడ ఇండియాలో పరిస్థితులు మారుతున్నాయి. రోజు రోజుకు మాలాంటివాళ్లలో ఆందోళన ఎక్కువవుతున్నది. ఇక్కడున్న పరిస్థితులను బట్టి వేరే దేశాలకు వెళ్లి స్థిరపడడమే మేలని కొందరు ఆలోచిస్తున్నరు. అలాంటప్పుడు అక్కడ సుఖంగా ఉన్న నువ్వు ఇక్కడికి వచ్చి జాబ్‌ వెతుక్కోవడం దగ్గర్నుంచి, ఇల్లు వెతుక్కోవడం దగ్గర్నుంచి, ఇక్కడ ఎన్నో వివక్షల్ని ఎదుర్కొంటూ ఉండడం అవసరమా చెప్పు’’ అన్నడు జహాంగీర్‌ కొద్దిగ ఇబ్బందిగనే.
‘‘అవన్నీ మనలాంటి వాళ్లకు అలవాటైపోయాయి కదా అబ్బాజాన్‌! మీరు ముఖ్యం నాకు. మిమ్మల్ని ఇప్పుడైనా బాగా చూసుకోవాలి అబ్బాజాన్‌! మా కోసం మీరెంతో ఆరాటపడేవారు. నేను అన్ని విషయాలు అర్దం చేసుకుంటూనే వచ్చాను. ఇకనైనా మీకు సేవ చేసుకోలేకపోతే నా బతుకు ఎందుకు చెప్పండి.’’
‘‘అదికాదురా! మేము ఇవాళో రేపో వెళ్లిపోయేటోళ్లం. మీకు ఇంకా జీవితం ఉంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా! మా కోసం ఇండియాకి వచ్చేయడం ఎందుకు చెప్పు. మీ భవిష్యత్తు ఆలోచించుకోండి బేటా!’’ అన్నడు జహాంగీర్‌.
అప్పటి దాంక పనులు చేసుకుంటూ వీళ్ల మాటలు వింటున్న నసీమా వచ్చి జహాంగీర్‌ పక్కన నిలబడి బుజం మీద చెయ్యేసి నొక్కింది. ఆమె కండ్లల్ల నీళ్లు.
‘‘అబ్బాజాన్‌! నేను నీ కొడుకును. స్వార్థపరుడిని కాను. నువ్వలా పెంచలేదు నన్ను. నేను మీ గురించే కాదు, దేశం గురించి, దేశంలో ఉన్న మనలాంటి ప్రజల గురించి కూడా ఆలోచిస్తున్నాను.
 ఎప్పటికప్పుడు మదనపడుతనే ఉన్నాను. ఉన్నత చదువులు చదువుకున్నవారు, మేధావులు దేశం విడిచిపోతే దేశంలో ఉండి పోరాడుతున్నవారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కదా! మాలాంటి ఆలోచనాపరులం కూడా దేశం గురించి పట్టించుకోకుంటే ఎట్లా అబ్బాజాన్‌! ఇండియా మీద నాకు ప్రేమే కాదు, గొప్ప నమ్మకం ఉంది అబ్బాజాన్‌! ఇండియన్స్‌ గొప్పవారు. వారు అందరికందరూ ఎన్నటికీ మతోన్మాదులుగా మారలేరు. తిరోగమనవాదులు ఎన్ని గొడవలైనా సృష్టించనీ.. ఎందరినైనా చంపనీ.. మంచితనం, మానవత్వం నిలిచే ఉండే దేశం అబ్బాజాన్‌ మనది. ఆ మంచితనాన్ని మానవత్వాన్ని సహజీవన సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత కదా.. అందులో మాలాంటివారి బాధ్యత మరింత ఎక్కువ. నాలాంటివాళ్లం తప్పించుకుని పోకుండా దేశంలో ఉండి ఆ గంగా జమున తెహజీబ్‌ను కాపాడుకోవడమే ఇప్పుడున్న తక్షణ అవసరం. మీ అందరి పోరాటంలో నేను కూడా భాగం కావాలి. నేను ఇండియాకి వచ్చేస్తున్నాను అబ్బాజాన్‌! మరో మాట లేదు’’ స్థిరంగా అనేసి ఫోన్‌ కట్‌ చేసిండు షోయబ్‌.
జహాంగీర్‌ గుండెలు ఉప్పొంగినయి. నసీమాను అల్లుకొని గొంతు పూడుకుపోతుండగా, ‘‘నా కొడుకు నాకన్నా గొప్పగా ఆలోచిస్తున్నందుకు ఆనందంగా ఉంది నసీమ్‌..!’’ అంటూ ఏడ్చేసిండు. నసీమా కూడా జహాంగీర్‌ తల నిమురుతూ ఏడుస్తూ ఉండిపోయింది.
*

స్కైబాబ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.