ఎంతకూ నిద్ర పడ్తలేదు జహాంగీర్‌కు. అటు తిరిగి పడుకున్నా ఇటు ఒత్తిగిల్లి పడుకున్నా జరసేపటికి ఎల్లకిల పండుకుని చీకట్లోకి కనురెప్పలు కొడుతు సోంచాయించుకుంట ఉంటున్నడు.
పొద్దుగూకాల షోయబ్ ఫోన్ చేసిన కాణ్నుంచి మనసు మన్సుల లేదు. ఆ మాట విని జహాంగీర్ ఎంతగనమో ఖష్షయితడు అనుకున్నడు షోయబ్. ‘ఐసా..!’ అని వాడు చెప్పిందంతా ఇన్నడు గనీ జహాంగీర్ ఎందుకో పెద్దగ సంతోషపడలేదు. అది గమనించిండు షోయబ్. అదే అడిగిండు తండ్రిని.
‘‘అదేం లేదురా! నువ్వు ఇండియాకు వచ్చేస్తనంటే సంతోషమే గదా! ఇన్నాళ్లు నేనే ఆ విషయం తీసేటోన్ని కదా!’’ అన్నడు.
‘‘సరే అబ్బాజాన్! అమ్మీకు ఈ విషయం చెప్పు, నేను కాస్త పనిలో ఉన్నా, రేపు మళ్లీ ఫోన్ చేస్తా’’ అని పెట్టేసిండు షోయబ్.
షోయబ్ అమెరికా వెళ్లి పదేండ్లు దాటింది. గ్రీన్ కార్డు గుడ వచ్చింది. షోయబ్ గ్రీన్ కార్డు వచ్చిందని ఖుషీగ చెప్పినప్పుడు గుడ జహాంగీర్ ముబావంగనే ఉన్నడు. షోయబ్ ఎప్పటికైనా ఇండియా తిరిగి వచ్చేసి తమ కండ్ల ముందల ఉండాలని జహాంగీర్ ఆశ. అలాంటిది, ఇవాళ షోయబ్ చెప్పిన విషయం విని నిజానికి జహాంగీర్ షానా ఆనందపడాలి. గానీ అంతగా ఎందుకు సంతోషంగా లేదో తనకే అర్దమైతలేదు జహాంగీర్‌కు.
***
జహాంగీర్‌కు ఒక బిడ్డ, ఒక కొడుకు. లోకం తెలిసిన మనిషి. పిల్లల్ని బాగా చదివించాల్నని, తనలాగా చదువు కోసం తన పిల్లలు ఇబ్బంది పడకూడదని మొదట్నుంచి ఆరాటపడ్డడు. అందుకు కష్టపడ్డడు. మంచి చదువులు చదివించిండు. కొడుకు పెద్దయ్యేసరికి వాడి ఒకరిద్దరు దోస్తులు అమెరికా వెళ్తున్నరని తను గూడ ఎల్తనని పోరసాగిండు. గుండెల్ల రాయి పడ్డది జహాంగీర్‌కు. ఏది జరక్కూడదని తను అనుకున్నడో కొడుకు అదే కోరుతున్నడని దిగులు పడ్డడు. నిమ్మలంగ అతనితోని కూసొని సమ్జాయించి చెప్పిండు.
జహాంగీర్‌కు ఒక బిడ్డ, ఒక కొడుకు. లోకం తెలిసిన మనిషి. పిల్లల్ని బాగా చదివించాల్నని, తనలాగా చదువు కోసం తన పిల్లలు ఇబ్బంది పడకూడదని మొదట్నుంచి ఆరాటపడ్డడు. అందుకు కష్టపడ్డడు. మంచి చదువులు చదివించిండు. కొడుకు పెద్దయ్యేసరికి వాడి ఒకరిద్దరు దోస్తులు అమెరికా వెళ్తున్నరని తను గూడ ఎల్తనని పోరసాగిండు. గుండెల్ల రాయి పడ్డది జహాంగీర్‌కు. ఏది జరక్కూడదని తను అనుకున్నడో కొడుకు అదే కోరుతున్నడని దిగులు పడ్డడు. నిమ్మలంగ అతనితోని కూసొని సమ్జాయించి చెప్పిండు.
‘‘బేటా! మాకున్నది మీరిద్దరే. మీ అక్క షాదీ చేస్తే వేరే ఇంటికి ఎల్లిపోతది. మిగిలేది నువ్వే. నువ్వు అమెరికా ఎల్తే ఇక్కడ మాకు దిక్కెవరు చెప్పు. పైగా నువ్వు డాక్టర్‌వై ఇక్కడ బీద ప్రజలకు ఉన్నంతల సేవ చేస్తవని కల గన్నానురా నేను. నువ్విట్లా పోతనంటే ఎట్లరా?’’ అన్నడు బాదగ.
‘‘అబ్బాజాన్! మీ తరం ఇలాగే ఆలోచిస్తున్నది. కానీ మా భవిష్యత్తు గురించి మేం గూడ ఆలోచించాలి కదా! ఇవన్నీ నేను గుడ సోంచాయించిన. మా ఫ్రెండ్స్‌తో మాట్లాడిన. వాళ్ల మాట, నా ఆలోచన గుడ ఒక్కటే. కొన్నేళ్ళు అక్కడ పనిచేయడం వల్ల కొన్ని పైసలు జమ చేసుకోవచ్చు. మళ్లీ ఇండియా వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడెట్లయినా మీకు తోడుంటా కదా! కాదనకు అబ్బాజాన్!’’ అన్నాడు వాడు బతిమాలుపుగా.
కండ్లల్ల నీళ్లు ఊరినయి జహాంగీర్‌కు. కొడుక్కు కనిపించనివ్వకుంట ‘‘సరే, నీ ఇష్టం లేరా! అట్లనే కానీయ్’’ అనుకుంట లేషి ‘‘నేను డ్యూటీకి తయారైత’’ అనుకుంట అవతలి అర్రలకు ఎల్లిపోయిండు. షోయబ్ హమ్మయ్య అని ఎగిరి గంతేసిండు.
***
ఆధునిక భావాలు కలిగినవాడు జహాంగీర్. తన వంతు సామాజిక కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు.
ఆధునిక భావాలు కలిగినవాడు జహాంగీర్. తన వంతు సామాజిక కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు.
కొడుకు అమెరికాలో కుదురుకున్నడు. సంవత్సరానికోసారి వచ్చిపోతున్నడు. మధ్యలో అతడు కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నడు. ఇప్పుడు అతడికో అమ్మాయి.
బిడ్డను పెళ్లికి ముందే ఉజ్జోగం సంపాయించుకునేలా చేసి ఆ తరువాతే ఆమెకు తగిన వాడిని చూసి పెళ్లి చేసిండు జహాంగీర్.
బిడ్డను పెళ్లికి ముందే ఉజ్జోగం సంపాయించుకునేలా చేసి ఆ తరువాతే ఆమెకు తగిన వాడిని చూసి పెళ్లి చేసిండు జహాంగీర్.
చుట్టూ షోయబ్ లెక్క అమెరికా వెళ్లినవాళ్లను చూస్తున్నడు జహాంగీర్. కాబట్టి ఇక షోయబ్ అక్కడే సెటిలైపోతడని అర్దమైపోయింది జహాంగీర్‌కు. అందుకే మనసు గట్టి చేసుకొని ఇక షోయబ్‌తో ఇండియా రావడం గురించి మాట్లాడడం మానేసిండు.
బార్య నసీమా అప్పుడప్పుడు బాద పడేది, ఉన్న ఒక్క కొడుకు మన కండ్ల ముందు లేకుంట పరాయి దేశం పాలైపోయిండని ఏడ్చేది.
‘‘ఏడవడం ఎందుకు నసీమ్! వాడికిష్టమైనట్లు వాడుంటున్నడు కదా! ఫోన్ మాట్లాడుతనే ఉన్నడు గదా! వీడియో కాల్‌లో చూస్తనే ఉన్నవు కదా! పిల్లలకు ఇష్టమైనట్లు ఉండనివ్వడమే ఇప్పుడు మనం చేయగలిగింది’’ అంటు ఓదార్చేటోడు జహాంగీర్.
షోయబ్ తండ్రితో ఫోన్ మాట్లాడేప్పుడు ఇండియాలో రాజకీయ పరిస్థితులు, సామాజిక ఉద్యమాల గురించి అడిగి తెలుసుకునేటోడు. కొన్ని విషయాల్లో తన అబ్జర్వేషన్లను చర్చించేటోడు. 2014 తర్వాత ముస్లింల మీద విష ప్రచారం పెరగడం గురించి, అమెరికాలోని కొందరు తన సహచరుల్లోనూ మతోన్మాద స్పందనలు వింటున్న విషయాలు పంచుకునేటోడు. బాద పడేటోడు. పరవాలేదు, వీడు అక్కడున్నా ఇక్కడి విషయాల పట్ల ఒక నజర్ వేసి ఉంచాడే అని కొద్దిగ తృప్తి పడేటోడు జహాంగీర్.
***
ఎడమ పక్కకి ఒత్తిగిల్లి పండుకోవడం ఇష్టం జహాంగీర్‌కు. అటు మల్లి పండుకుంటానికి కోషిష్ చేసిండు. అయినా మల్లా చూసుకుంటే ఎల్లకిలా పండుకొని సోంచాయిస్తనే ఉన్నడు. తను బేచైన్ అయితున్న కోణం కరెక్టేనా?! ఇది స్వార్థమా? లేక ముందు జాగ్రత్తనా? `ఆలోచనలు ఎంతకూ తెగడం లేదు. ఎప్పటికో గానీ ఒక స్థిర నిశ్చయానికి వచ్చి అప్పుడు జరంత నిమ్మలపడి నిద్రపోయిండు.
పొద్దున లేషి కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేసి కొడుకు ఫోన్ కోసం ఎదురుచూసిండు. జర లేటుగానే చేసిండు షోయబ్.
ఎడమ పక్కకి ఒత్తిగిల్లి పండుకోవడం ఇష్టం జహాంగీర్‌కు. అటు మల్లి పండుకుంటానికి కోషిష్ చేసిండు. అయినా మల్లా చూసుకుంటే ఎల్లకిలా పండుకొని సోంచాయిస్తనే ఉన్నడు. తను బేచైన్ అయితున్న కోణం కరెక్టేనా?! ఇది స్వార్థమా? లేక ముందు జాగ్రత్తనా? `ఆలోచనలు ఎంతకూ తెగడం లేదు. ఎప్పటికో గానీ ఒక స్థిర నిశ్చయానికి వచ్చి అప్పుడు జరంత నిమ్మలపడి నిద్రపోయిండు.
పొద్దున లేషి కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేసి కొడుకు ఫోన్ కోసం ఎదురుచూసిండు. జర లేటుగానే చేసిండు షోయబ్.
‘‘బేటా! నువ్వు తొందరపడి ఇండియాకు మొత్తంగా వచ్చేయకురా! నువ్వు ఇక్కడికి వచ్చేయడం నాకెందుకో నచ్చడం లేదురా! నువ్వక్కడే ఉండు బేటా! నువ్వక్కడ ఉండడమే మంచిది’’ అన్నడు జహాంగీర్.
ఆశ్చర్యపోయిండు షోయబ్.
‘‘అదేంది అబ్బాజాన్! నువ్వేనా ఇట్లా చెప్తున్నది?! ఇన్నాళ్లు నేనిక్కడ బాగానే ఉన్నప్పటికీ మీ ఇద్దరి గురించే రంది పడేటోన్ని. ఎప్పటికైనా వీలైనంత జల్ది ఇండియా వెళ్లిపోయి అమ్మానాన్నలకు తోడుండాలి, వారికి సేవ చేసుకోవాలి అని ఆలోచించేవాన్ని. అందుకే కదా, నేను పనిచేసే హాస్పిటల్‌లో రిజైన్ చేస్తున్నానని చెప్పేశాను. నేనీ విషయం చెప్తే నువ్వు ఎంతో సంతోషపడతా వనుకున్నాను. నువ్వేంటి అబ్బాజాన్, నన్ను ఆశ్చర్యపరుస్తూ ఇట్లా అంటున్నావు!?’’ అన్నాడు అయోమయంగా.
‘‘అదికాదురా! ఇక్కడ ఇండియాలో పరిస్థితులు మారుతున్నాయి. రోజు రోజుకు మాలాంటివాళ్లలో ఆందోళన ఎక్కువవుతున్నది. ఇక్కడున్న పరిస్థితులను బట్టి వేరే దేశాలకు వెళ్లి స్థిరపడడమే మేలని కొందరు ఆలోచిస్తున్నరు. అలాంటప్పుడు అక్కడ సుఖంగా ఉన్న నువ్వు ఇక్కడికి వచ్చి జాబ్ వెతుక్కోవడం దగ్గర్నుంచి, ఇల్లు వెతుక్కోవడం దగ్గర్నుంచి, ఇక్కడ ఎన్నో వివక్షల్ని ఎదుర్కొంటూ ఉండడం అవసరమా చెప్పు’’ అన్నడు జహాంగీర్ కొద్దిగ ఇబ్బందిగనే.
‘‘అవన్నీ మనలాంటి వాళ్లకు అలవాటైపోయాయి కదా అబ్బాజాన్! మీరు ముఖ్యం నాకు. మిమ్మల్ని ఇప్పుడైనా బాగా చూసుకోవాలి అబ్బాజాన్! మా కోసం మీరెంతో ఆరాటపడేవారు. నేను అన్ని విషయాలు అర్దం చేసుకుంటూనే వచ్చాను. ఇకనైనా మీకు సేవ చేసుకోలేకపోతే నా బతుకు ఎందుకు చెప్పండి.’’
‘‘అదికాదురా! మేము ఇవాళో రేపో వెళ్లిపోయేటోళ్లం. మీకు ఇంకా జీవితం ఉంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా! మా కోసం ఇండియాకి వచ్చేయడం ఎందుకు చెప్పు. మీ భవిష్యత్తు ఆలోచించుకోండి బేటా!’’ అన్నడు జహాంగీర్.
అప్పటి దాంక పనులు చేసుకుంటూ వీళ్ల మాటలు వింటున్న నసీమా వచ్చి జహాంగీర్ పక్కన నిలబడి బుజం మీద చెయ్యేసి నొక్కింది. ఆమె కండ్లల్ల నీళ్లు.
‘‘అబ్బాజాన్! నేను నీ కొడుకును. స్వార్థపరుడిని కాను. నువ్వలా పెంచలేదు నన్ను. నేను మీ గురించే కాదు, దేశం గురించి, దేశంలో ఉన్న మనలాంటి ప్రజల గురించి కూడా ఆలోచిస్తున్నాను.
ఎప్పటికప్పుడు మదనపడుతనే ఉన్నాను. ఉన్నత చదువులు చదువుకున్నవారు, మేధావులు దేశం విడిచిపోతే దేశంలో ఉండి పోరాడుతున్నవారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కదా! మాలాంటి ఆలోచనాపరులం కూడా దేశం గురించి పట్టించుకోకుంటే ఎట్లా అబ్బాజాన్! ఇండియా మీద నాకు ప్రేమే కాదు, గొప్ప నమ్మకం ఉంది అబ్బాజాన్! ఇండియన్స్ గొప్పవారు. వారు అందరికందరూ ఎన్నటికీ మతోన్మాదులుగా మారలేరు. తిరోగమనవాదులు ఎన్ని గొడవలైనా సృష్టించనీ.. ఎందరినైనా చంపనీ.. మంచితనం, మానవత్వం నిలిచే ఉండే దేశం అబ్బాజాన్ మనది. ఆ మంచితనాన్ని మానవత్వాన్ని సహజీవన సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత కదా.. అందులో మాలాంటివారి బాధ్యత మరింత ఎక్కువ. నాలాంటివాళ్లం తప్పించుకుని పోకుండా దేశంలో ఉండి ఆ గంగా జమున తెహజీబ్‌ను కాపాడుకోవడమే ఇప్పుడున్న తక్షణ అవసరం. మీ అందరి పోరాటంలో నేను కూడా భాగం కావాలి. నేను ఇండియాకి వచ్చేస్తున్నాను అబ్బాజాన్! మరో మాట లేదు’’ స్థిరంగా అనేసి ఫోన్ కట్ చేసిండు షోయబ్.
జహాంగీర్ గుండెలు ఉప్పొంగినయి. నసీమాను అల్లుకొని గొంతు పూడుకుపోతుండగా, ‘‘నా కొడుకు నాకన్నా గొప్పగా ఆలోచిస్తున్నందుకు ఆనందంగా ఉంది నసీమ్..!’’ అంటూ ఏడ్చేసిండు. నసీమా కూడా జహాంగీర్ తల నిమురుతూ ఏడుస్తూ ఉండిపోయింది.
*








ముస్లిం కమ్యూనిటీలో వినిపించే inclusive voice ని రచయిత చిన్న కథలోనే బలంగా చెప్పారు. అభినందనలు
నేటి పరిస్థితుల్లో మన బాధ్యతను గుర్తుచేస్తూ చక్కని ముగింపు సర్. అభినందనలు మీకు.
కథ బావుంది. వర్తమానం
చాలా చిన్న కథ అయినా చక్కని సందేశాత్మకంగా ఉంది. బాధ్యత గల యువతకి స్ఫూర్తివంతంగా ఉంది. థ్యాంక్యూ స్కై జీ 💐
కథ చాలా బాగుంది అన్నా. ప్రస్తుత రాజకీయాలు ఎలాంటి భయాందోళనలను రగిలిస్తున్నాయో వివరించారు. ఇప్పుడు చాలామంది మైనార్టీలే కాదు మెజార్టీ ప్రజలు కూడా ఈ దేశంలో ఉండడానికి జంకుతున్నారు. పరిస్థితులు అంతగా దిరజారిపోయాయి. ఒకప్పుడు విదేశాలకు పిల్లల్ని పంపాలంటే బాధపడే కన్నవాళ్లు ఇఫ్పుడు తమ పిల్లలకు విదేశాలే బెటర్ అని ఆలోచిస్తున్నారు. అంతగా జనాల్లో విద్వేషాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయాలు మారాలంటే ఈ దేశం మరో స్వాతంత్య్ర పోరాటం చెయ్యాల్సి వస్తుందేమో. నిత్యం విద్వేషపు మాటలు, ప్రసంగాలు, దాడులు, తిట్లు వినీ వినీ భారతీయుల మైండ్ సెట్ మారిపోతోంది. దీన్నంతటినీ ఆ దుర్భర నేతలు అభివృద్ధి ఆనందించండి అంటున్నారు. ధరల మోతలతో చతికిల పడుతూ పేద, మధ్య తరగతి వాళ్లు స్థితి నానాటికీ దిగజారిపోతోంది. అయినా నీఛ రాజకీయాలు తమ దిగజారుడుతనాన్ని ఆపట్లేదు. ప్రస్తుత పరిస్థితలపై మంచి కథ రాశారు అన్నా. అభినందనలు.
మంచికథ. ముగింపు గొప్పగా ఉంది. కంగ్రాట్స్ స్కై…
అస్తిత్వం నుంచి ప్రతిఘటన వరకు: స్కైబాబ ‘జిమ్మెదారి’ కథా విశ్లేషణ
*****
తెలుగు కథాసాహిత్యంలో కొన్ని కథలు కేవలం కథలుగా మాత్రమే మిగలవు.. అవి ఒక కాలపు నైతిక సంక్షోభాన్ని నమోదు చేసే సామాజిక అంశాలుగా నిలుస్తాయి. స్కైబాబ రాసిన “జిమ్మెదారి” అలాంటి కథ. పైకి చూస్తే ఇది ఒక తండ్రి-కొడుకుల మధ్య జరిగే కుటుంబ సంభాషణ. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది వలస, జాతీయత, మైనారిటీ అస్తిత్వం, పౌర బాధ్యత, ప్రజాస్వామిక విలువల మధ్య జరిగే అంతర్గత సంఘర్షణ కథ.
ప్రపంచ కథాసాహిత్యంలో ఎడ్వర్డ్ సయీద్, జుంపా లాహిరి, మొహ్సిన్ హమీద్, చిమమండా అదీచీ వంటి రచయితలు వలస జీవితాన్ని కేవలం ఆర్థిక అవకాశాల కోణంలో కాకుండా అస్తిత్వ రాజకీయాల కోణంలో చిత్రించారు. “జిమ్మెదారి” కూడా అదే సంప్రదాయానికి దగ్గరగా నిలుస్తుంది. అయితే దీనిలో ప్రత్యేకత ఏమిటంటే, కథానాయకుడు దేశాన్ని విడిచి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో లేడు.. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తి తిరిగి దేశానికి రావాలా వద్దా అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నాడు.
కథ ప్రారంభంలో జహాంగీర్ మనకు ఒక సాధారణ ముస్లిం తండ్రిగా కనిపిస్తాడు. కొడుకు షోయబ్ అమెరికాలో స్థిరపడినా, ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో జీవిస్తాడు. కానీ కొడుకు నిజంగానే వస్తానని చెప్పినప్పుడు ఆనందించలేడు. ఇదే కథలోని ప్రధాన వైరుధ్యం. అంతర్జాతీయ కథా విమర్శలో దీనిని “moral paradox” అంటారు. ప్రేమించిన వ్యక్తి రావాలని కోరుకోవడం ఒక సహజ మానవ స్పందన. కానీ అతను వచ్చే సమాజం అతనికి భద్రత, గౌరవం, సమానత్వం ఇవ్వలేకపోవచ్చనే భయం మరొక స్పందన. ఈ రెండింటి మధ్య జహాంగీర్ చీలిపోతాడు.
స్కైబాబ కథన శక్తి ఇక్కడే కనిపిస్తుంది. రచయిత ఎక్కడా రాజకీయ వ్యాఖ్యాతగా మారడు. పాత్రల అంతర్మథనం ద్వారానే సమకాలీన భారతీయ వాస్తవాన్ని ప్రతిబింబిస్తాడు. 2014 తర్వాత ముస్లింలపై పెరిగిన అనిశ్చితి, సామాజిక విభజనల గురించి కథలో వచ్చే సూచనలు కథకు రాజకీయ నేపథ్యాన్ని అందిస్తాయి. అయితే ఈ కథ రాజకీయ ప్రచారం కాదు..రాజకీయ వాస్తవం మనుషుల వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించే సాహిత్య రచన.
షోయబ్ పాత్ర ఈ కథకు నైతిక కేంద్రం. సాధారణంగా వలస కథల్లో విదేశాలకు వెళ్లడం విజయానికి చిహ్నంగా ఉంటుంది. కానీ షోయబ్ ఆ విజయాన్ని ప్రశ్నిస్తాడు. చదువుకున్నవారు, ఆలోచనాపరులు, మేధావులు దేశాన్ని విడిచిపెడితే ప్రజాస్వామ్య విలువలను ఎవరు కాపాడతారని అతను ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్న కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించినది కాదు. లాటిన్ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు, మధ్యప్రాచ్యం నుంచి ఆసియా వరకు అనేక దేశాలు ఎదుర్కొంటున్న “brain drain” సమస్యకు సంబంధించిన ప్రశ్న. అందుకే “జిమ్మెదారి” ప్రాంతీయ కథ అయినప్పటికీ దాని ఆలోచన ప్రపంచవ్యాప్త ప్రాసంగికతను సంతరించుకుంటుంది.
కథలో అత్యంత ముఖ్యమైన భావన “గంగా-జమునీ తెహజీబ్. భారతీయ సహజీవన సంస్కృతిని కాపాడటం తన బాధ్యత అని షోయబ్ చెప్పినప్పుడు, కథ వ్యక్తిగత స్థాయి నుంచి నాగరికత స్థాయికి ఎదుగుతుంది. ఇక్కడ దేశభక్తి అంటే అధికారాన్ని సమర్థించడం కాదు.. విభిన్న సమూహాల మధ్య సహజీవనాన్ని కాపాడటం. ఈ భావన ఆధునిక ప్రజాస్వామ్యాల మూల సూత్రాలతో అనుసంధానమై ఉంటుంది.
శిల్పపరంగా చూస్తే “జిమ్మెదారి” కథ చాలా నియంత్రిత నిర్మాణాన్ని కలిగి ఉంది. కథలో పెద్ద సంఘటనలు లేవు. యాక్షన్ లేదు. సంభాషణలే ప్రధాన ఆధారం. అయినప్పటికీ కథలో ఉత్కంఠ తగ్గదు. ఎందుకంటే అసలు సంఘర్షణ బాహ్య ప్రపంచంలో కాదు. పాత్రల మనసుల్లో జరుగుతుంది. ఆంటన్ చెకోవ్, రేమండ్ కార్వర్ వంటి కథకుల సంప్రదాయంలో కనిపించే “internal conflict narrative” లక్షణం ఇందులో కనిపిస్తుంది.
భాషా పరంగా స్కైబాబ ప్రత్యేకంగా నిలుస్తాడు. తెలంగాణ ముస్లిం మాండలికాన్ని కేవలం స్థానిక రంగు కోసం ఉపయోగించలేదు. ఆ భాషే పాత్రల అస్తిత్వాన్ని నిర్మిస్తుంది. భాష ఇక్కడ సంస్కృతి, జ్ఞాపకం, వర్గ అనుభవం, మత గుర్తింపు అన్నింటికీ వాహకంగా పనిచేస్తుంది. స్కైబాబ రచనల్లో ముస్లిం జీవితం సాహిత్య కేంద్రానికి తీసుకురావడమే ఆయన ప్రధాన కృషి.
కథ ముగింపు అత్యంత హృద్యమైనది. “నా కొడుకు నాకన్నా గొప్పగా ఆలోచిస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని జహాంగీర్ చెప్పే క్షణం కేవలం తండ్రి గర్వం కాదు. ఒక తరం తన భయాలను అధిగమించి తదుపరి తరంలో ఆశను కనుగొన్న క్షణం. ఈ ముగింపు భావోద్వేగపూరితమైనదే అయినప్పటికీ సెంటిమెంట్‌లోకి జారిపోదు. అది కథ యొక్క నైతిక పరిపక్వతను వ్యక్తపరుస్తుంది.
మొత్తంగా “జిమ్మెదారి”ని ఒక ముస్లిం కుటుంబ కథగా మాత్రమే చదవడం సరిపోదు. ఇది సమకాలీన భారతదేశంలో పౌరసత్వం అంటే ఏమిటి, దేశభక్తి అంటే ఏమిటి, మేధావి బాధ్యత ఏమిటి, సంక్షోభ కాలంలో వ్యక్తి ఎలాంటి నైతిక నిర్ణయం తీసుకోవాలి అనే ప్రశ్నలను లేవనెత్తే కథ. అందుకే ఈ కథను కేవలం ప్రాంతీయ తెలుగు కథగా కాకుండా, ప్రపంచ సాహిత్యంలో కనిపించే అస్తిత్వ-రాజకీయ కథల సంప్రదాయంలో ఉంచి చదవవచ్చు. “జిమ్మెదారి” యొక్క శాశ్వత విలువ కూడా అక్కడే ఉంది…ఇది మనిషిని దేశం గురించి ఆలోచింపజేస్తూనే, దేశం అంటే చివరికి మనుషుల మధ్య నమ్మకం, సహజీవనం, బాధ్యతల సమాహారమే అని గుర్తుచేస్తుంది.
– భూక్యా గోపినాయక్
******
వర్తమాన భారత రాజకీయాలకు అద్దం పడుతుంది ఈ కథ.