విషాదాన్ని మోహనంగా మార్చిన కవి

తైవాన్ చెందిన ప్రసిద్ధ కవయిత్రి Xi Murong  తన  “ A blooming tree” అనే కవితలో ఒక ప్రేమికుడు తాను ప్రేమించిన స్త్రీ కంట్లో పడాలని, ఆమె నడయాడే త్రోవలో ఒక అందమైన పూల మొక్కగా మారాలని బుద్దున్ని ప్రార్థిస్తాడు. పూలమొక్కై పుట్టి కొమ్మ కొమ్మనా పూలు పూసి వికసించినా.

ఆమె ఆ మొక్కను గమనించకుండానే  దాటుకొని వెళ్ళి పోతుంది.అప్పుడు రాలి పడింది పూలు కాదు అతని అతనిహృదయపు శకలాలని కవయిత్రి Xi Murong తన కవితలో చిత్రించింది. ఇది విషాదాంతపు ప్రేమ భావన.

Barbara Allen అనేది శతాబ్దాల చరిత్ర కలిగిన అతి ప్రసిద్ధ జానపద గేయం.1666 లో శామ్యుల్ పెపిస్ తన డైరీలో ఈ కవితా గేయాన్ని విన్నట్టు రాసుకున్నాడు. విలియం అనే అతను బాబరా అల్లెన్ అనే యువతిని ప్రేమించి ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. విలియం  మరణ సమయంలో తన ప్రేమను బాబరా అల్లెన్ తో వ్యక్త పరిచినా  ఆమె హృదయం కరగదు.విలియం మరణించిన మరుసటి రోజే బాబారా కూడా మరణిస్తుంది. వారిద్దరిని ప్రక్క ప్రక్కనే పూడ్చిపెడతారు .  విలియం సమాధి నుంచి ఎర్రటి రోజా మొక్క, బాబారా సమాధి నుంచి ఒక ముళ్ళ తీగ మొలుస్తాయి.ఈ రెండూ పెరిగి గుడి గోపురానికీ ఎగబ్రాకి అల్లుకొని ప్రేమ బంధానికీ ప్రతీకగా నిలుస్తాయి. ఇది ఒక అద్భుత జానపదుని ఊహా. ఇది కూడా విషాదాంతమే.

ఈలాంటి ఎన్నో ప్రేమ భావనల్నిఇంకా ఎందరో కవులు తమ ఊహాశాలిత్వంతో కవిత్వం చేసి ఉండొచ్చు.కానీ  పైన పేర్కొన్నకవుల కవితల కన్నా మరింత భిన్నంగా ఒక కొత్త ఊహను కవిత్వం  చేసిన తెలుగు కవి ఒకరున్నారు.

ఆ కొత్త ఊహ ఏమంటే ‘తన ప్రేమను అతను  ఆమెకు తెలపకుండానే మరణించి, ఆ తర్వాత ఒక పూల మొక్కగా మొలిచి పూలను పూయడం అనే భావన కొత్తగా అనిపిస్తుంది. ఇట్లా ఊహ చేసిన ఆ తెలుగు కవి ఊహే అత్యంత ఆర్ద్రమైన ఊహ. ఆ ఊహా అంతటితో ఆగలేదు. ఆ పూల మొక్కను తనకే తెలీకుండా ఆమె అత్యంత ఇష్టంగా ప్రేమించటంతో మొదలై, ఆమె ప్రేమే ఊపిరై  ఆ మొక్క ఆనందంగా పూలు పూయడం వరకు కొనసాగుతుంది. ఇదొక విషాద మోహనపు భావన.

ఇట్లా ఒక విషాదాన్ని చివర్లో మోహనంగా మార్చగల అద్భుత ఊహాశాలి ఆ తెలుగు కవి. ఆ కవి ఎవరో కాదు కర్నూలు నివాసి తెలుగు వెంకటేష్ . మొటార్ వైండింగ్ టెక్నిషియన్ గా  జీవనం సాగిస్తున్న తెలుగు వెంకటేష్ గారి ప్రవృత్తి కవిత్వం. రాగి తీగలతో మోటార్ ని చుట్టి విద్యుత్ ని ప్రవహింప చేసినట్లే పదాలతో భావాలను అల్లి కవిత్వ ప్రకంపనలు సృష్టించగల కవి తెలుగు వెంకటేష్.

గాయపు నొప్పి కన్నా ప్రేమ సలుపు మోయడం కష్టం అని భావించే ఈ కవి, మనిషి పతంగి, జీవితం దారం. గాలి మృత్యువు అని అంటున్న ఈ  కవి, ప్రేమ పరిమళాన్ని,మరణపు నిశ్శబ్దాన్ని కూడా కవిత్వంలోకి ఒంపగల సృజన శీలి.

 “సున్నిత కవిత్వమై కనిపించే వెంకటేష్ చుట్టూ నిత్యం ఎన్ని కర్ణ కఠోర శబ్దాలు ఉన్నా ఎన్నెన్ని శబ్ద చిత్రాలు లిఖించాడో ,వర్ణానికీ ఎన్నెన్ని వర్ణాలనిచ్చాడో, చేతికి గ్రీజు మరకలున్నా అనునిత్యం లోహాలతో కరచాలనం చేస్తున్నా వాటి తాలుకూ నీడలకు ఎక్కడ తావివ్వకుండా రోజు తాజా రోజాలా వికసించడం అతనికి తెలిసిన కవితల విద్య” అని కవి విమర్శకుడు గరికపాటి మణిందర్ వెంకటేష్ కవిత్వ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు.

‘రెయిన్ కేఫ్’. ‘ నూర్జజహాన్ కు ప్రేమ లేఖ ‘ ‘ కబోది చేపల కబుర్లు’ మున్నగు కవిత్వ సంపుటాలతో కవిగా స్థిరపడ్డ వేంకటేష్ భాష పువ్వులాంటి భాష , వెంకటేష్ కవిత్వం సంస్కారం మూర్తీభవించిన కవిత్వం ‘ అని ప్రముఖ కవి, ప్రసిద్ధ విమర్శకుడు ,చిత్రకారుడు అయిన వాడ్రేవు చిన వీరభద్రుడు గారు అనటంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది ఈయన కవిత్వం చదివితే.

భావ సాంద్రత ,భావ గాఢత ఉన్న వెంకటేష్ గారి అనేక కవితల్లో  ‘రహస్యం’ కూడా ఒకటి. అతని ఏక పక్ష  ప్రేమ ఆమెకు తెలియక పోవచ్చు. కానీ తోటకు తెలుసు . తోటలో మొక్కై మొలిచిన అతన్నిఆమె ప్రేమించటం కవి ఊహ. ఆమె ప్రేమను ఆనందంతో స్వీకరించి పూలు పూస్తూ ఉండటం ఒక నిరుత్తర ఊహా.

అతని ఏక పక్ష ప్రేమ మార్మికంగా  అతను జీవించి ఉన్నప్పుడు కాకుండా మరణించి మొక్కై మొలిచాక ఫలించడం ఉందే అదే రహస్యం. ఆ రహస్యం తోటకు మాత్రమే తెలుసు. ఆమె ప్రేమ మొక్కపై  కాదు అతను పూసే పూలపై అని మరణించిన అతనికీ తెలీని రహస్యం. తాను ప్రేమించే మొక్క తనను ప్రేమించిన వ్యక్తి అని ఆమెకు తెలీని రహస్యం. ఒక రహస్యాన్ని ఇంత అద్భుతంగా కవిత్వం చేసిన తెలుగు వెంకటేష్ గారికీ అభినందనలు. త్వరలో వెలువడే అతని “ ఏకాంత స్వగతం” కవిత్వ సంపుటికీ స్వాగతం పలుకుతూ…

రహస్యం

తోటకు రోజూవచ్చే అతను

ఆమెను ప్రేమిస్తున్న సంగతి

ఎప్పుడూ చెప్పలేదు .

తోటకు వచ్చే వారి సంఖ్యలో

ఒకరి సంఖ్య తగ్గిందని

ఆమెకూ తెలియదు

కొన్నాళ్ళకు

తోటలో ఒక అద్భుతమైన

పూల మొక్క మొలిచి

పూలు కాసింది

ఆమె ఆ పూల మొక్కను

ఇష్టంగా ప్రేమించింది

తోటకు మాత్రమే తెలుసు

ఆ రంగుల పూలమొక్క

తనని అజ్ఞాతంగా ఆరాధించిన

ప్రేమికుడని

ఆమె పూల మొక్కను

ప్రేమిస్తూనే ఉంది

అతను ఆనందంగా

పూలు పూస్తూనే ఉన్నాడు.

*

రాజారామ్ తూముచర్ల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.