షోడశ భోక్త

దయం పది గంటలైంది. స్వాతి వార పత్రికలో పదబంధం పూర్తి చేసేందుకు చాలా దీక్షగా కూర్చున్నాడు గొడవర్తి మోహనరావు.

పదబంధంలో చాలా వరకూ పూరించాడు. నాలుగైదు చోట్ల ఇంకా చేయాల్సి ఉంది. అవే పట్టు బడడం లేదు. కుడి చేతిలో పెన్నుతో నుదిటి మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు. గత వారం స్వాతి వారపత్రిక పదబంధం మొత్తం పూర్తి చేశాడు. అయితే, అలా పూర్తి చేసిన వారు ఎక్కువ మంది ఉండడం, పూర్తి చేసిన వారి పేర్లు లాటరీ తీయడంతో ఆ వారం స్వాతి నుంచి మోహనరావుకు ప్రైజ్‌ మనీ రాలేదు. పత్రికలో విజేతల జాబితాలో మోహన రావుపేరు వేసారు.

డబ్బులు రాలేదన్న బెంగ మోహన రావుకి ఏ కోశాన లేదు. ఎవరైనా : “డబ్బులు రాని దానికి ఈ జంఠాటం ఎందుకూ” అని అంటే “పేరు పడిందిగా. అన్నింటికీ డబ్బులు వస్తాయా.. ఏమిటీ. నీ పేరెప్పుడైనా ఇలా అచ్చయిందా” అని నవ్వుతూ సమాధానం చెప్పేవాడు. పైగా “ఆల్‌ కరెక్ట్‌ గొడవర్తి… అన్‌ లక్కీ మోహన రావుని ” అనేవాడు. ఏమాట కామాటే ఏ వారం స్వాతిలో పదబంధం పూర్తి చేయకుండా ఉండలేదు మోహనరావు.

అమలాపురంలో అపర కర్మలు చేయించే సుబ్రహ్మణ్యం గారి ఇంటి మీద చిన్న గదే మోహనరావు ఆవాసం. వర్షం వస్తే మాత్రం ఆ ఇంటికి ఎదురుగా ఉన్న పాలకేంద్రంలో తలదాచుకునే వాడు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో పాలకేంద్రం అరుగు మీదే కూర్చుంటున్నాడు. ఆ అరుగు మీద కూర్చునే పదబంధాన్ని పూర్తి చేస్తున్నాడు మోహన రావు.

మనిషి కవిలిపోయిన అరటి ఆకులా ఉన్నాడు. వొంటి మీద చిన్న అంగవస్త్రం తప్ప మరేం లేదు. అతని మెడలో ఉన్న జంథ్యం కూడా రూపు మారిపోయి నలుపు, తెలుపుల కలనేతలా ఉంది. తైల సంస్కారం లేకపోవడమో, నిత్యం స్నానం చేయడం వల్లో కాని అతని వెంట్రుకలు చాలా మటుకు రాలిపోయాయి. ఉన్న కాసిన్ని తలనీలాలు బిరుతుగా, పాడై పోయిన నల్ల నువ్వుల్లా ఉన్నాయి. మనిషి పొడగరే కానీ తిండి లేకపోవడం వల్ల పొట్ట లోపలికి, నడుం బయటకు వచ్చి కాసింత గూని వచ్చినట్లుగా ఉంటుంది మోహన రావు ఆకారం.

గంట నుంచి ఆలోచించి ఆలోచించి బుర్రకి మరింత పదును పెట్టాక ఆ వారం పదబంధం కూడా పూర్తి అయ్యింది. మోహనరావు మనసు కుదుట పడింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన వాడిలా ఆనందపడ్డాడు. తన ఎదురుగా నిలుచుని సైకిల్‌కి పాల బిందెలు కడుతున్న పెదకాపుతో “వచ్చేసిందోయ్‌ పెదకాపు. వచ్చేసింది. ఈ వారం మనకి స్వాతి వారు డబ్బులు పండడం ఖాయం” అని హుషారుగా చెప్పాడు. పెదకాపు అనే బుల్లబ్బులు ఓ నవ్వు నవ్వేసి “పంతులూ ఓ గ్లాసుడు పాలు ఇత్తాను. తాగవయ్యా. మూడు రోజులైంది రెండు ముద్దలు తిని” అన్నాడు. ఆ ప్రశ్నకి కూడా నవ్వే సమాధానమైంది మోహనరావు నుంచి.

***

మూడు రోజుల క్రితం తిన్న తిండి. అది కూడా అంతకు ముందు రెండు రోజుల నుంచి తినలేదేమో చాలా ఆబగా తిన్నాడు మోహన రావు. తిన్న ఆ నాలుగు మెతుకులు వంటబట్టలేదు. ఖాళీ కడుపు నింపడం కోసం ఆవురావురు మంటూ తిన్నాడు. నెలలో సగం రోజులు మోహన రావు కడుపు ఖాళీగానే ఉంటుంది. మిగిలిన రోజుల్లోనే భోజనం. బ్రాహ్మల ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఉత్తర క్రియలు జరిగినప్పుడే గొడవర్తి మోహనరావుకి భోజనం దొరుకుతుంది. అది కూడా 11, 12 రోజుల్లో చనిపోయిన వారి పేరుతో పెట్టే మైల భోజనమే చేస్తాడు. ఈ భోజనం చేసే వారిని షోడశ భోక్తలు అంటారు. అలాంటి షోడశ భోక్త మోహనరావు. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ షోడశ భోక్తలని మాసికాలు, తద్దినాలు, సంవత్సరీకాలు వంటి అపర క్రియలకి భోక్తలుగా అనుమతించరు.

మోహనరావు ఇలా షోడశ భోక్తగా మారి ఏడేళ్లయ్యింది. ఈ వృత్తిలోకి రావాలనుకున్నప్పుడు అపర కర్మలు చేయించే సుబ్రహ్మణ్యం గారిని కలిసాడు మోహన రావు. ఈ వృత్తి గురించి, ఇందులో సాదకబాదకాల గురించి విపులంగానే చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. అయితే, తనకా ముక్క రాదు. వైదికం నేర్చుకునే వయసూ కాదు. పైపెచ్చు ఈ షోడష భోక్త అంటే పోటీ ఉండదు అని ఇందులోకి ప్రవేశించాడు మోహన రావు.

 ***

“పంతులూ, నీ ఊరు చెప్పవు. నీ వాళ్లు ఎక్కడుంటారో తెలియదు. ఈ మైల భోజనం చేసి ఎన్నాళ్లు బతికుంటావయ్యా. నా మాట విను. అన్నం పెట్టను. ప్రతి రోజూ మూడు పూటలా పాలు ఇస్తాను. నెలకింతని డబ్బులు ఇస్తాను. ఊరికే కాదు. నా పాల బిందెలు కడుగు. పంతులూ.. నిన్ను ఇలా చూడలేకపోతున్నానయ్యా” అని వారానికి ఒకసారైనా పెదకాపు బతిమిలాడుతాడు. కానీ, ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న మోహన రావు ఆ మాటలకి నవ్వుతాడే కాని సమాధానం చెప్పడు.

గతంలో కూడా పెద కాపు ఇలా చాలాసార్లు అడిగాడు మోహనరావుని. ఆకలికి, ఆత్మాభిమానానికి మధ్య నలిగిపోయిన మోహనరావు ప్రతీసారి నవ్వే సమాధానంగా చెబుతున్నాడు. ఒకటి రెండు సార్లు ఆత్మాభిమానాన్ని వదిలేసి ఆకలి తీర్చుకుందామనుకున్నాడు కూడా. అయితే, తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చేయి చాపకపోవడం అనే గుణం మాత్రమే అని బలంగా నమ్మి దానికే కట్టుబడిపోయాడు.

***

గొడవర్తి మోహనరావు పెద్దగా చదువుకున్న వాడు కాదు.

పదో తరగతి ఫెయిల్‌ అయ్యాక ఏదో ఒకటి చేసుకుని బతకాలని హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. మోహనరావు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. ఆయనా వైదిక వృత్తే చేసేవాడు. కాకపోతే మాసికాలకి, ఆబ్దీకాలకి, సంవత్సరీకాలకి భోక్తగానే వెళ్లేవారు. మోహనరావుకి పదేళ్లుండగా తండ్రి టీబీ వ్యాధితో చనిపోయాడు.

తల్లి వంటలు చేస్తూ మోహనరావుని పెంచింది. తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక… స్వగ్రామంలో రికామీగా ఉండడం ఇష్టం లేక హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. అక్కడ ఓ మెడికల్‌ కంపెనీలో బంట్రోతుగా ఉద్యోగం చేశాడు మోహనరావు. అయితే, అక్కడ తోటి సిబ్బంది నుంచి వచ్చే అవమానాలు, ఛీత్కారాలు తట్టుకోలేకా, ఒంటరి తల్లిని వదలలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. అలా వచ్చేసి తండ్రిలాగే భోక్తగానే ఉండాలనుకున్నాడు. మోహనరావు స్వగ్రామం వచ్చిన రెండేళ్ల వరకూ తల్లి బాగానే ఉంది. కరోనా సమయంలో ఆ వ్యాధితోనే కన్ను మూసింది ఆమె.

పెద్దగా చదువు లేకపోవడం, ఎక్కడా ఏ పనీ దొరకకపోవడంతో తండ్రిలాగే తాను భోక్తగా మారాలనుకున్నాడు మోహన్‌ రావు. కానీ, అప్పటికే భోక్తలు ఎక్కువగా ఉండడంతో తప్పని పరిస్థితుల్లో షోడష భోక్తగా మారాడు.
బ్రాహ్మణ కుటుంబాలలో అంత్యేష్టి కార్యక్రమాలలో భాగంగా 11 రోజున నిర్వహించే షోడశ శ్రార్థ క్రియ చాలా ప్రధానమైంది. నిజానికి ఈ 11 రోజున నిర్వహించే షోడశ శ్రార్థ క్రియకి పూర్వం 19 మంది బ్రాహ్మలకి మట్టి కుండల్లో వంట చేసి పెట్టే వారు. బ్రాహ్మలు ఈ వృత్తిలోకి రావడం తగ్గిపోవడంతో ఒకరికే పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అదీ లేదు. మనసులోనే “మమ” అనుకుని కానిచ్చేస్తున్నారు.

ఈ వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయి. జీవితం బాగానే ఉందనుకుంటున్న వేళ ఓ కుదుపు. తనకు పోటీగా మరొకరు షోడశ భోక్తగా వచ్చారని తెలిసింది మోహనరావుకి. ఒకింత కంగారు పడ్డాడు. అయినా… “చూద్దాం… ఏమవుతుందో. పైన దేవుడున్నాడు” అని మనసులో అనుకున్నాడు.

***

అతని భయం నిజమైంది. షోడశ భోక్తగా రావాలంటూ మోహనరావుకి గడచిన ఐదు రోజులుగా పిలుపు రాలేదు. పిలుపు రాకపోవడానికి కారణం ఎక్కడా మరణాలు లేక కాదు. తనకు షోడశ భోక్తగా పిలుపు ఎందుకు రావడం లేదో అంతుపట్టడం లేదు. ఓ రోజు సాయంత్రం కాళ్లీడ్చుకుంటూ మరో భోక్త ఆంజనేయులు దగ్గరికి వెళ్లాడు మోహనరావు.

ఇంటి అరుగు మీద కూర్చుని జంథ్యాలు వడుకుతున్న ఆంజనేయులు “ఏమోయ్‌ ఆల్‌ కరెక్ట్‌ మోహనరావు ఇలా వచ్చావు” అన్నాడు.

“నమస్కారం ఆంజనేయులు గారు. ఎలా ఉన్నారు” అని అడుగుతూ అరుగు మీద ఆంజనేయులు పక్కనే కూర్చున్నాడు మోహనరావు.

“ఏం బాగులే. ఏమిటీ అలా నీరసంగా ఉన్నావు.” అడిగారు ఆంజనేయులు.

“అదే.. ఈ మధ్య గురువుగారు నాకు కబురు పంపడం లేదు. కారణం ఏమై ఉంటుందా అని అడుగుదామని” నోట్లో మాటలు తడబడుతున్నట్లుగానే అడిగాడు మోహనరావు.

“ఓ అదా… మళ్లీ నే చెప్పానని ఎవరి దగ్గర అనకు. నువ్వు గురువు గారి గురించి ఎక్కడో తక్కువ చేసి మాట్లాడావట. నీ దగ్గర కూడా కమిషన్‌ తీసుకుంటారని… ఇంకోటని… మరోటని అన్నావట. అది ఆ నోటా.. ఈ నోటా గురువు గారికి తెలిసింది. నీ ఖర్మకి అదే సమయానికి ఓ అనాధ వెధవ వచ్చి తనకు దారి చూపించమంటే వాడికి నీ స్ధానం ఇచ్చేశారాయన” అంటూ అసలు విషయం బయట పెట్టారు ఆంజనేయులు.

“అయ్యో.. ఎంత తప్పు. ఎవరో గిట్టని వాళ్లు అబద్ధాలు పుట్టించారు కానీ, నేనెప్పుడు అలా అనలేదండి. అయినా నన్ను పిలిచి మందలించాలి కాని.. ఇలా చెప్పుడు మాటలు వినడం ఏమిటి ఆంజనేయులు గారు. ఆయన్నేం అంటాంలెండి. అంతా నా ఖర్మ. నా ప్రారబ్ధం” అంటూ నీరసంగా అక్కడి నుంచి కదిలాడు మోహనరావు.

***

“అదన్నమాట సంగతి. తనకు పిలుపు రాకపోవడానికి కారణం ఓ అబద్ధపు ప్రచారం అన్నమాట” అనుకుని ఆ రోజు నుంచి అరుగుకే పరిమితం అయ్యాడు మోహన రావు.

తనకు పోటీగా వచ్చిన కుర్రాడికే ప్రతీరోజూ అవకాశం దొరుకుతోంది. దాంతో మోహనరావుకి పస్తులే మిగిలాయి. రెండో రోజుల పాటు మంచినీళ్లతో కాలం గడిపాడు. మూడో రోజు ఆకలిని తట్టుకోలేకపోతున్నాడు. ఆ బాధ నుంచి బయటపడేందుకే పదబంధం పూర్తి చేసే పనిలో పడ్డాడు మోహనరావు. ఈ పత్రికైనా కొన్నది కాదు. పాల కేంద్రంలో గుమాస్తా సుబ్బారావు తన కాలక్షేపం కోసం ప్రతి వారం తెప్పించుకునే పత్రిక. అది చూసే పదబంధాన్ని నింపి పంపుతూంటాడు.

పైకి చెప్పలేకపోతున్నాడు కాని క్షుద్బాధ దారుణంగా ఉంది. ఏ గుడికైనా వెళ్తే కొబ్బరి చిప్పో, అరటిపండో ఇస్తారు. అయితే, ఈ వృత్తిలో ఉన్న వారిని గుడిలోకి రానివ్వరు. అది తెలిసే ఎక్కడికి వెళ్లకుండా పాలకేంద్రంలోనే గోడకి చేరబడి కూర్చుండిపోయాడు.

సమయం మధ్యాహ్నం రెండు గంటలైంది. మూడు గ్లాసుల మంచినీళ్లు తాగాడు. ఇక నీరసంతో పడిపోవడం.. ఆపై ప్రాణాలు వదిలేయడమే అనుకుంటూ అలా నిద్రలోకి జారిపోయాడు మోహన్‌ రావు.

***

నాలుగు గంటల వేళ. ముఖం మీద చల్లటి నీళ్లు పడితే కళ్లు తెరిచాడు. చేయి అందిస్తే మెల్లిగా లేచాడు.
“పంతులు.. పంతులూ… లేవండి. ఇదిగో ఈ మంచినీళ్లు తాగండి ముందు” అంటూ చెంబుతో మంచినీళ్లు అందించాడు కుసుమ బంగారి.

తానెక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో కూడా తెలియని నీరసంతో ఉన్నాడేమో ఆ నీళ్లు తాగేశాడు. ఆ తర్వాత తనకు నీళ్లు అందించిన బంగారి వైపు చూశాడు.

ఆ పాల కేంద్రంలో కుసుమ బంగారి తనకు పరిచయమే. అతనిదీ పాల వ్యాపారమే. కాకపోతే ఇంటింటికి వెళ్లి పాలు పోయడు. అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మిడివరంలోని అంబేద్కర్‌ నగర్‌లో నివాసం. ఆ పూర్లోనే హోల్‌సేల్‌గా పాలు కొని ఈ పాల కేంద్రంలో వాళ్లకి కాసింత లాభం వేసుకుని అమ్ముతాడు. మూడు రోజులుగా మోహనరావుని చూస్తున్నాడు కాని అతని పరిస్థితి బంగారికి తెలియదు.

ఇందాకే పెదకాపు ఇంటికి వెళ్తూ బంగారికి ఎదురు పడి ఇలా మోహనరావు గురించి చెప్తే తెలిసింది.

“పంతులూ… ఇలా ఎన్నాళ్లుంటారు. కాసింత ఎంగిలి పడండి. మా ఇంట్లో వండిందే. ఆ చావు కూడు కంటే ఇది మంచిది కదా.. నా మాట ఇనండి” అని బతిమాలుతున్నట్లుగా అన్నాడు బంగారి.

మోహనరావు కాసేపు కుసుమ బంగారి కేసి చూసాడు. ఎండిన డొక్కల్ని చూసుకున్నాడు. వంటి మీద నీరసంగా వేల్లాడుతున్న జంథ్యాన్ని అరచేతితో పట్టుకున్నాడు.

ఉపనయనం వేళ తండ్రి తన చెవిలో చెప్పిన గాయత్రీ మంత్రం గుర్తుకొచ్చింది. హైదరాబాద్‌ వెళ్లే వరకూ తాను నిష్టగా మూడు పూటలా చేసిన సంధ్యావందనం కళ్ల ముందు కదలాడింది. షోడశ భోక్తగా మారిన వేళ తనను అందరూ అంటరానివాడిగా చూసిన క్షణాలు జ్క్షప్తికి వచ్చాయి. జానెడు పొట్ట నింపుకోవడం కోసం తాను పడిన కష్టాలు, ఎదుర్కొన్న ఛీత్కారాలు మదిలో మెదిలాయి. తాను బతికి ఉంటే ఎవరికి ఉపయోగం లేదు. అలాగని మరణించినా రెండు కన్నీటి బొట్లు రాల్చేవాళ్లు లేరు. అలాంటి నాపై ఈ బంగారికి ఎందుకింత వాత్సల్యం అనిపించింది.

బంగారికి కాని, పెదకాపుకి కాని నేనేం చేయకపోయినా ఎందుకింత కరుణ చూపిస్తున్నారు అని కూడా అనిపించింది.

సాటి మనిషి అన్న ఒకే ఒక్క కారణంతోనే నన్ను ఆదుకోవాలని అనుకుంటున్నారని బోధ పడింది.
తనను ఓ బ్రాహ్మడిగా కాకుండా మనిషిగా చూసే వాళ్లు ఉన్నారు ఈ లోకంలో అని కూడా తెలిసింది.

“ఈ వృత్తిలో ఉన్నానని నన్ను దూరం పెడుతున్న వాళ్లు గొప్పోళ్లా…! నే బతకాలని తాను తెచ్చుకున్న అన్నం పెడుతున్న కుసుమ బంగారి గొప్పోడా!” కాసేపు తర్కించుకున్నాడు.

“కులాలని బట్టి, మతాలని బట్టి ఆకలి ఉండదు కదా… ఆకలి.. నిద్ర..రోగం.. రాత్రి.. పగలు అందరికీ సమానమే కదా..! మరి ఇలా సాటి మనిషి పట్ల వివక్ష చూపడం ఏమిటీ..!?” అని కూడా తర్కించుకున్నాడు.
మోహనరావు ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నప్పుడే.. బంగారి

“ఏటీ ఆలోసిన్నావు పంతులూ. రెండు ముద్దలు తినయ్యా” అన్నాడు.

ఆ మాటతో ఆలోచనల్లోంచి బయటకొచ్చిన మోహనరావు నీరసంగా రెండు చేతులూ ఎత్తి బంగారికి దండం పెట్టి అతని చేతిలో ఉన్న అన్నం బాక్సు తీసుకున్నాడు.

దోసకాయ పచ్చడి… అన్నం.. ఆబగా కలుపుకున్నాడు. గబ గబా రెండు ముద్దలు తిన్నాడు. పొలమారింది. బంగారి చెంబులో నీళ్లు అందిస్తే తాగాడు. మరో రెండు ముద్దలు. ఇంకో రెండు ముద్దలు. బాక్సు ఖాళీ అయ్యింది.

మళ్లీ కాసిన్ని మంచినీళ్లు తాగాకా…

“బంగారి రేపటి నుంచి పెదకాపు పాల బిందెలు… నీ పాల బిందెలు కూడా నేనే కడుగుతా” అని చెప్పాలనిపించింది.

“ఆల్‌ కరెక్ట్‌ గొడవర్తి… యు ఆర్‌ లక్కీ మోహన్‌రావు” అనుకున్నాడు మనసులో…

*

ముక్కామల చక్రధర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.