సాహిత్యమే ఊపిరిగా బతికిన అద్దేపల్లి

సెప్టెంబరు 6: అద్దేపల్లి రామమోహన రావు తొంభయ్యవ జయంతి సందర్భంగా –

కొంతమంది మనుషులు తమ  కాలంలో జీవిస్తారు. కొంతమంది మాత్రం తమ కాలాన్ని దాటి జ్ఞాపకాల్లో నిలిచిపోతారు. వాళ్లు వెళ్లిపోయిన తరువాత కూడా వాళ్ల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. వాళ్ల అడుగు జాడలు ఏదో ఒక సాహిత్య సభలో మళ్లీ ధ్వనిస్తాయి. వాళ్లు ప్రోత్సహించిన కొత్త కవులలో ఎప్పుడో వాళ్ల నీడ కనిపిస్తుంది. అలా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అద్దేపల్లి రామమోహనరావు.

అద్దేపల్లి రామమోహనరావు అరవై ఏళ్ల తన సాహితీప్రస్థానంలో సుమారు ముప్పై గ్రంథాలు వెలువరించి, వందల ముందుమాటలు వ్రాసి, వివిధ సభల్లో రెండువేలకు పైగా అధ్యక్షోపన్యాసాలు ఇచ్చి, ఎన్నో పుస్తకాలను సమీక్షించి, కొన్ని వందల తెలుగు గజల్స్‌ను రచించి, గానం చేసి – తెలుగు సాహితీలోకంలో ఒక సాహిత్యయోధునిలా జీవించారు

అద్దేపల్లిని తలచుకున్నప్పుడు ఆయన కవిత్వాన్ని మాత్రమే కాక, ఆయన విమర్శా ప్రజ్ఞను కూడా గుర్తుచేసుకోవాలి. ఆయన దృష్టిలో విమర్శ అంటే ఒక కవితలోని వస్తువును, శిల్పాన్ని, భావాన్ని, భాషను, సామాజిక ప్రయోజనాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం. “వస్తువు శిల్పమూ ఎక్కడ కలిసిపోతాయో అదే గొప్ప కవిత్వం” అన్న అద్దేపల్లి మాట చాలా లోతైనది.

తెలుగు సాహిత్యంలో “అనుభూతివాదం” అనే పేరును ప్రతిపాదించారు.  మినీకవితా ఉద్యమాన్ని నడిపించారు. దళిత, బహుజన, స్త్రీవాద ధోరణులకు తాత్విక నేపథ్యాన్ని ఇచ్చారు.  ప్రపంచీకరణను ప్రారంభదశలోనే దాని సామాజిక ప్రభావాలను గుర్తించి విమర్శనాత్మకంగా  కవిత్వం చేసారు.

శ్రీశ్రీ మహాప్రస్థానంపై ఆయన రాసిన “శ్రీశ్రీ కవితా ప్రస్థానం” ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ పుస్తకం తనపై వస్తోందని విని శ్రీశ్రీ ఆనందపడిన సందర్భం అద్దేపల్లి సాహిత్య జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం.

అంతకన్నా గొప్ప విషయం—తరువాతి కాలంలో శ్రీశ్రీపై తాను చేసిన విమర్శను రాచమల్లు రామచంద్రారెడ్డి ప్రతివిమర్శ చేసినప్పుడు, తన భావాలను తానే పునఃపరిశీలించుకొని “నా లోపాలు కూడా నాకు తెలిసిననై” అని ఒప్పుకోవడం. అద్దేపల్లిలోని ఈ నిత్యచలనశీలత, తనను తాను సరిదిద్దుకునే స్వభావం ఆయన విమర్శక వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.

ఆ గ్రంథానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విమర్శా చర్చ ఉంది. శ్రీశ్రీ కవిత్వంలోని “ఇతరేతర శక్తులు” అనే ప్రయోగాన్ని అద్దేపల్లి, రాచమల్లు రామచంద్రారెడ్డి ఇద్దరూ వేర్వేరుగా అన్వయించుకున్నారు. రారా దాన్ని వర్గ సంఘర్షణకు సంబంధించిన “పరస్పర శక్తులు”గా భావిస్తే, అద్దేపల్లి మాత్రం “వేరు వేరు శక్తులు” అనే అర్థంలో తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్ళ తరువాత అంపశయ్య నవీన్ శ్రీశ్రీని ఇంటర్వ్యూ చేస్తూ ఈ పదబంధాన్ని ప్రస్తావించినప్పుడు, “ఇతరేతర అంటే వేర్వేరు శక్తులే అని నా ఉద్దేశం” అంటూ శ్రీశ్రీ స్వయంగా చెప్పారు—అద్దేపల్లి వ్యాఖ్యానాన్నే బలపరుస్తూ.  కవి తానే స్వయంగా తన విమర్శకు ఇచ్చిన ఈ  ఆమోదం, అద్దేపల్లి విమర్శకు దక్కిన అరుదైన గౌరవం.

సాహిత్యసంబంధ విషయాలు పక్కనపెడితే అసలైన అద్దేపల్లి కనిపించేది సాహిత్య సభల మధ్య, ప్రయాణాల మధ్య, కొత్త కవుల మధ్యనే. ఒక మారుమూల ప్రాంతంలో ఐదుగురే ఉన్నా సభకు వెళ్లేవారు. పది మందే ఉన్నా మాట్లాడేవారు. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలంలో బస్సులు ఎక్కి, రైళ్లు పట్టుకుని, అవసరమైతే రైల్వే స్టేషన్లలోనే రాత్రులు గడిపి, మరుసటి రోజు సాహిత్య సభలో ప్రత్యక్షమయ్యేవారు. సభ ఎంత పెద్దదన్నది ఆయనకు ముఖ్యం కాదు; అక్కడ సాహిత్యం వినాలనుకునే ఒక్క మనిషైనా ఉన్నాడా అన్నదే ముఖ్యం.

ఈ లక్షణమే ఆయనను నిజమైన సాహిత్య కార్యకర్తగా నిలబెట్టింది. సాహిత్యంపై ప్రేమకు ఒక సాహిత్య ప్రచారకర్త పట్టుదల కలిసిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది.

ఆ ప్రయాణాల్లోనే ఆయన ఎన్నో తరాలను కలిశారు. పెద్దలను గౌరవించారు. తనకంటే చిన్నవారిని దగ్గరకు తీసుకున్నారు. కొత్తగా రాస్తున్నవారి పుస్తకాలు చదివారు, పీఠికలు రాశారు, సభల్లో మాట్లాడించారు. ఒక రచయితలోని చిన్న మెరుపును గుర్తించి వెలుగులోకి తీసుకురావడం కూడా తన బాధ్యతేనని భావించారు. ఒక కవితలో రెండు మంచి పంక్తులు కనిపించినా వాటిని గుర్తించి చెప్పితే, ఆ యువకుడు మరింత రాసేలా ప్రోత్సాహం దొరుకుతుందని ఆయన నమ్మేవారు.

అందుకే ఆయన రాసిన పీఠికలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన మానవీయ అధ్యాయం. అనేక వందల పుస్తకాలకు రాసిన ముందుమాటల్లో ఎక్కువగా ఆ రచనలోని మంచినే వెలికితీసి చూపేవారు. ఇది కేవలం విమర్శా పద్ధతి కాదు, ఆయన ఔదార్యం. ఒక రచయితలోని బలాన్ని గుర్తించి తిరిగి అతనికే చూపించడం కూడా సాహిత్య సేవేనని ఆయన నిరూపించారు.

పేరు రావాలని, తన ప్రతిభకు తగిన గౌరవం దక్కాలని ఆయనకు కోరిక లేదని చెప్పలేం. కానీ ఆయన జీవితం చూస్తే గుర్తింపు కోసం ఎదురుచూస్తూ కూర్చున్న మనిషిలా కనిపించరు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయిన వ్యక్తిగానే కనిపిస్తారు.

అయినా అప్పుడప్పుడూ ఆయనను ప్రేమించిన మిత్రుల మాటల్లో ఒక చిన్న బాధ మెదిలేది. అద్దేపల్లి ఎం.ఏ.లో గోల్డ్ మెడలిస్టు, చదువులో ప్రతిభావంతుడు. ఇంతున్నా, ఆయనకు దక్కాల్సినంత గుర్తింపు ప్రపంచం ఇవ్వలేదన్న భావన కొందరిలో ఉండేది.

ఆ బాధను ఆయన బాల్య మిత్రుడు తంగిరాల సుబ్బారావు ఎంతో చమత్కారంగా, అంతే ఆవేదనతో ఇలా వ్యక్తం చేసేవారట—”అమావాస్య రోజున నీకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. నువ్వు మబ్బుల మాటున చంద్రుడిలా ఉండిపోయావు. కాకినాడలోని ఎమ్మెస్సెన్ కళాశాలలో కాకుండా ఏ యూనివర్సిటీలోనో ఉండి ఉంటే, నీకు మరింత పెద్ద పేరు వచ్చేది.”

ఇది ఒక జోకు కాదు. ఆయన విలువను మిత్రులు ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో చెప్పే మాట.

కానీ ఆ గుర్తింపు కోసం అద్దేపల్లి తన ప్రయాణాన్ని ఆపలేదు. అదే ఆయనలోని గొప్పదనం.

మునిమాణిక్యం వారు అద్దేపల్లికి పాఠాలు చెప్పిన గురువు. చిన్న వయసులో సాహిత్యం చదువుతున్న రోజుల్లో, మునిమాణిక్యం కథల గురించి విన్న అద్దేపల్లి ఒకసారి ఆయనను “మీరు కథలు చాలా బాగా రాస్తారట కదా, మీ కథల పుస్తకం ఇవ్వండి” అని అడిగారట. దానికి మునిమాణిక్యం ప్రేమతో తలపై ఒకటి వేసి, “ఆ కథలు చదవడానికి నీ వయసు సరిపోదులేరా” అన్నారట. ఆ కథలు కాంతం కథలు.

మరికొన్ని సంవత్సరాల తరువాత అదే మునిమాణిక్యం, బుచ్చిబాబు సాహిత్యంపై అద్దేపల్లి చేసిన రేడియో ప్రసంగం విని, తన మీద కూడా అలాంటి రచన చేయమని కోరారట. “మీ పుస్తకాలన్నీ పంపించండి” అన్న అద్దేపల్లి మాటకు, “వీడేంట్రా నా మీద రాయమంటే పుస్తకాలన్నీ పంపించమంటాడు!” అని ఆయన ఎవరితోనో సరదాగా అన్నారట. సాహిత్య సంబంధాలు ఎంత లోతైనవో చెప్పడానికి ఇలాంటి ఆత్మీయ సంఘటనలే పెద్ద సాక్ష్యాలు.

ఒకసారి మధునాపంతుల సత్యనారాయణ గారి ఆంధ్ర పురాణంపై పల్లిపాలెంలోని ఆంధ్రీకుటీరంలో అద్దేపల్లి చేసిన ప్రసంగం విన్న తరువాత, ఆయన సోదరుడైన మధునాపంతుల సూరయ్య శాస్త్రి ఆ ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారట. వచన కవిత్వం రాస్తూ, ఆధునిక భావాలతో మాట్లాడే అద్దేపల్లి—సంప్రదాయ సాహిత్యంలోని అంతరార్థాలను ఇంత అద్భుతంగా విశ్లేషించగలరా అని ఆశ్చర్యపోయారట. ప్రసంగం ముగిశాక “ఈ ఊరు ఇక పల్లిపాలెం కాదు, అద్దేపల్లిపాలెం అనాలి” అంటూ ఆయన ఉపన్యాసాన్ని అభినందించిన సందర్భం సాహిత్య అభిమానుల జ్ఞాపకాల్లో నేటికీ నిలిచి ఉంది.

జాషువా పట్ల అద్దేపల్లికి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కుసుమ ధర్మన్న రచనలపైనా ఆసక్తి ఉండేది. విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం ఉండేది. కృష్ణశాస్త్రిని పిలిచి ఎన్నో సభలు జరిపారు.   శ్రీశ్రీని కలిసిన సందర్భాలున్నాయి.  కానీ పెద్ద పేర్ల నీడలో నిలబడి తనను తాను నిర్మించుకున్న వ్యక్తి కాదు ఆయన—తనదైన దారిలో నడిచి, తనదైన శైలిలో ఎదిగిన వ్యక్తి.

ఆయనలోని ఈ స్వతంత్రతే కొన్నిసార్లు సన్నిహిత పరిచయాల కంటే విశాలమైన పాఠక సమాజాన్ని ఆయనకు తెచ్చిపెట్టింది. ఆయన చుట్టూ ఎప్పుడూ కొత్త కొత్త కవులు ఉండేవారు. ఒక బృందం వస్తుంది, వాళ్లతో సన్నిహితంగా మెలుగుతారు, వాళ్లు తమదైన స్థానం సంపాదించుకుంటారు; తరువాత ఇంకో తరం వస్తుంది, అద్దేపల్లి మళ్లీ వాళ్లతో పాటు నడుస్తారు. ఆయన సాహిత్య స్నేహ వలయం ఒక ప్రవహించే నది—ఒక తరం నుంచి మరో తరానికి సాహిత్యాన్ని మోసుకెళ్లే ప్రవాహం.

కాకినాడలో అద్దేపల్లికి ఒక కిళ్ళీకొట్టు యజమానితో చాలాకాలంగా పరిచయం ఉండేది. ఆ పరిచయంలో ఎక్కడా తాను ఒక ప్రముఖ కవినని ఆయన చెప్పుకోలేదు. ఒకరోజు ఆయనతో పాటు ఉన్న మిత్రుడు, “ఈయనే ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు” అని ఆ కొట్టు యజమానికి పరిచయం చేశారు. అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, వెంటనే తన దగ్గరున్న బైండు చేసిన ఒక పుస్తకాన్ని తీసి చూపించారు. “మనసు బాగోనప్పుడల్లా ఈ పుస్తకం చదువుతుంటాను” అన్నారు. ఆ పుస్తకం పేరు “అంతర్జ్వాల”—అద్దేపల్లి రామమోహనరావు రాసిన కవితా సంపుటి. ఒక రచయితకు అంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది?

చివరిరోజుల్లో అనారోగ్యం వచ్చినా సాహిత్యం గురించి ఆలోచించడం మానలేదు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా  రేడియేషన్ చికిత్సకు స్వయంగా వెళ్లి వచ్చిన ధీశాలి. అప్పుడు కూడా కొత్త పత్రిక ప్రారంభించాలనే ఆలోచనలు చేసేవారు. నిరాశకు లొంగకుండా మిత్రులకు ధైర్యం చెప్పేవారు.

తనకంటే ముందు వచ్చిన కవులను చదివారు. తన కాలపు కవులతో నడిచారు. తన తరువాత వచ్చిన కవులను ప్రోత్సహించారు. మారుమూల ఊళ్లకు వెళ్లారు, చిన్నా పెద్ద తేడా పాటించక అన్ని సభలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు, పీఠికలు రాశారు, గజల్స్ రాశారు, ఆలపించారు, గంటలకొద్దీ మాట్లాడారు. కొత్త సాహిత్య ప్రక్రియలకు సైద్ధాంతిక నేపథ్యం ఇచ్చారు. పాత సాహిత్యాన్ని కొత్త దృష్టితో చదివారు. కవిత్వాన్ని వస్తువు నుంచి శిల్పం వరకు, వ్యక్తి నుంచి సమాజం వరకు, స్థానికత నుంచి ప్రపంచ పరిణామాల వరకు పరిశీలించారు. చివరి దశలో కూడా సాహిత్యాన్ని వదల్లేదు.

సాహిత్యమే ఊపిరిగా బతికిన ఆ మనిషికి – మన జ్ఞాపకమే శాశ్వత నివాళి.

*

బొల్లోజు బాబా

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నా సాహితీ గురువు అద్దేపల్లి గారికి వందనములు , ఒంగోలులో సప్తతి చేసినప్పుడు ఎంతో సంతోషం పడ్డారు.
    ఎపుడు ఒంగోలు వచ్చినా మాయింటికి
    వచ్చేవారు. నా 4 పుస్తకాలకు ముందుమాట వ్రా శారు.
    Uvrathnam

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.