దూరపు కొండలు దగ్గరైన వేళ…

మార్చ్ 19, 2006 నాడు నేను దిల్లీ-తిరువనంతపురం విమానమెక్కాను. సీటు వెతుక్కుంటూ అడుగులేసాను. సీటు వరసకి చేరేసరికి ఒకావిడ విండో సీట్లో కూచుని ఉంది. దక్షిణభారత స్త్రీగా కనబడింది. నా సీట్లో కూచున్నాను. మధ్యలో ఒక స్టాపుతో సుమారుగా నాలుగు గంటల ప్రయాణం. పరిచయాలు మొదలయ్యాయి. ఆమె కూడా తిరువనంతపురం వెళుతుందట. ప్రాథమిక సంభాషణల్లో నేనెక్కడివాడినని అడిగింది. చదవడానికి ఆదిలాబాద్ నుండి దిల్లీ వచ్చి, ఉద్యోగరీత్యా అక్కడే ఉంటున్నానని చెప్పాను. వెంటనే తాను సీతారాం ఏచూరి తల్లినని సంతోషంతో చెప్పింది.

ఇంకేం! మాట్లాడుకోడానికి మాకు ఎన్నో కబుర్లు. అప్పటి వరకు ఇంగ్లీషు-హిందీలో సాగుతున్న మా సంభాషణలు యాదృచ్ఛికంగా తెలుగులోకి పరుగెత్తాయి!

నేను కొంత కాలం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో (1978-80) చదివాను. ఆ యూనివర్సిటీలో చేరగానే నాకు విధ్యార్థుల సంఘ నాయకుడిగా (ప్రెసిడెంట్) సీతారాం పేరు మొదటిసారి తెలిసింది. ఆయన చదువులో ఎంతటి దిట్టనో, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంతటి కీలకమైన వ్యక్తో ఆసక్తి లేనివారికి కూడా దానంతటే అది తెలిసిపోతుంది. ఒక రోజు నేను చదువుతున్న ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ స్కూల్లో కొత్త విధ్యార్థులని సంభోదించడానికి సీతారాం వచ్చారు. ఆయన్ని చూడగానే నాకు ప్రఖ్యాత హిందీ నటుడు సంజీవ్ కుమార్ వెంటనే గుర్తుకొచ్చాడు. పోలికలు కనిపించాయి. సీతారాంని చూడడమూ, ఆయన స్పీచ్ వినడమూ ఒకే రోజు జరిగాయి. ధారాళమైన ఇంగ్లీషు, ఆకర్షించే ఉపన్యాస తీరుతెన్నులు నాకెంతో నచ్చాయి. సీతారాం టేబుల్ పై ఆని తనదైన స్టైల్లో మాట్లాడుతున్న దృశ్యం నా మనస్సులో నిన్న మొన్న జరిగినట్టుగా, తాజాగా ఉంది.

ఈ విషయాన్ని నెమరువేసుకొంటూ సీతారాం మాతృమూర్తైన కల్పకంతో ఉత్సాహంతో పంచుకొన్నాను. తన కొడుకు గురించి వినడం ఆవిడకి కొత్తేమీ కాదు. నేను వెనకబడిన ఆదిలాబాద్ జిల్లానుండి చదువుకోడానికి వచ్చానని తెలిసి ఎంతో ఆనందపడింది.

“మేము సీతారాంని డాక్టరో, ఐఏయసో చేద్దామనుకొన్నాం. బలమైన కారణమేమంటే ఇంట్లోనే తన మేనమామ మోహన్ కంద సివిల్ సర్వీసులో ఉండడంతో, సీతారాంని కూడా అదే రోడ్డెక్కించాలని ఆశించాం. కానీ సీతారాం ఆలోచనలు, స్వభావం వామపక్షపు భావాలవైపే భారీగా మొగ్గు చూపడంతో ఇంటివారి కోరిక నెరవేరలేదు. మోహన్ కందాని సీతారాంని ప్రభావితం చేయడానికి దిల్లీ పంపితే ప్రయోజనం కలగలేదు.” ఆని గతాన్ని గుర్తుచేసుకొంటూ సీతారాం పట్టుదలని మెచ్చుకొని గర్వపడింది. కల్పకం 1927లో స్థాపించిన ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ (AIWC), దిల్లీ అనే స్వచ్ఛంద సంస్థకి వివిద హోదాల్లో ఐదు దశాబ్దాలు పనిచేసారు. దాని పని గురించే తిరువనంతపురం వెలుతున్నట్టు చెప్పారు. నాకు ఈ సంస్థ గురించి బాగా తెలుసు కావున మా సంభాషణలు దీనిపై కూడా జరిగాయి.

సీతారాం చదువు దేశంలోని అత్యున్నత ప్రమాణాలున్న స్కూల్, కాలేజీల్లో, విశ్వవిద్యాలయంలో జరిగాయి. ఇంట్లో అందరూ బాగా చదువుకొన్నవారే! వాతావరణం కూడా బాగా తోడ్పడి సీతారాం చదువులో అన్నిచోట్ల మంచి మార్కులతో, రాంకులతో పేరుని సంపాదించుకొన్నాడు.  జెఎన్ యూలో తేజోవంతుడైన స్టూడెంట్ గా ఉంటూ, స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎదిగాడు. దేశంలో అత్యయిక పరిస్థితి రావడంతో సీతారాం పేరు దేశస్థాయిలో తెలిసిపోయింది. ఏకనామిక్స్ లో పిహెచ్ డి చేస్తున్న చదువు మధ్యలో ఆగిపోయింది. విశ్వవిద్యాలయపు ప్రాంగణం నుండి బయటపడి దేశరాజకీయాల్లోకి అడుగులేసాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లో అంచెలంచలుగా ఎదుగుతూ తనదైన శైలి చూపుతూ ఉన్నత స్థాయికెదిగి మంచి నాయకుడని పేరు సంపాదించాడు. జూలై 2005 లో పార్లమెంట్ మెంబర్ గా పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభలో అడుగుపెట్టాడు. తన వాక్చాతుర్యంతో, జ్ఞాన సంపదతో అందరినీ ఒప్పించే కళ ఉండడంతో తనదైన ముద్రవేసుకొన్నాడు. అందరి మన్ననలని పొందాడు.

సీతారాం ఎదుగుదలని గురుతుచేసుకొంటూ కల్పకం ఎంతో మురిసిపోయింది. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. పార్టీలు మార్చలేదు. పదవులనాశించలేదు. నమ్ముకున్న తన ప్రపంచంలో ఎదుగుతూ భాధ్యతలని పెంచుకొంటూ అంకిత భావంతో పనిచేసాడు, చేస్తున్నాడు. చేస్తుంటాడు కూడా! కొడుకుపై ఉన్న తన అపారమైన నమ్మకాన్ని వెళ్ళబుచ్చింది.

ఏ పని మీద వెళుతున్నానని నన్నడిగారు. భూమినుండి ముప్పైఐదువేల అడుగులపైన మా ప్రయాణం గాలిలో సాగుతుంది. ఇంకో గంటలో మా వినూత్న పరిచయం సమాప్తమౌతుంది.

“సీతారాం రాజకీయ ప్రయాణాన్ని చూస్తే నేనెంతో గర్వపడతాను. ఎక్కడా రాజీ పడలేదు. మేనమామకి  తాను ఎందుకు ఐ‌ఏఎస్ పరీక్ష రాయకూడదో నచ్చజెప్పాడు. ఒక్క విషయాన్ని తల్లిగా నేను చాలా గర్వంగా చెప్పుకొంటాను – మన దేశానికి ఒక మంచి, గుణాత్మకమైన రాజకీయనాయకుణ్ణిచ్చాను. రాజకీయాల్లో రాణించాడు. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది.”

గుండె అడుగుపొరలనుండి వచ్చాయామాటలు. కల్పకం కళ్ళల్లో హిమాలయాలంత ఆనందం. సంతోషంతో బాష్పలూ కూడా. కాస్సేపు మౌనం. నా గుండే బరువెక్కింది. నాలుగు గంటల ప్రయాణంలో ఊహించని రీతిలో కల్పకం కలవడం ఒక దూరపుకొండ ఎంతో దగ్గరై, తన కొడుకుని, యూనివర్సిటీలో నా సీనియర్ని ఒక్కసారే దగ్గరికి తెచ్చింది.

సీతారాం పుస్తకాలని రాసారు. ఆంగ్ల దినపత్రికకి వ్యాసాలు రాసేవారు. రాజకీయాల్లో ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో సీతారాం ప్రముఖ పాత్రవహించారు. వామపక్ష భావాల్నే కణకణాన నింపుకొని దాన్నే ఊపిరిగా మార్చుకొన్న సీతారాం రెండు సంవత్సరాల సెప్టెంబర్ 12 నాడు శ్వాస సంభందిత వ్యాధితో దిల్లీలో చనిపోయారు. కల్పకం మూడు సంవత్సరాల ముందే (సెప్టెంబర్ 25, 2021) తనువు చాలించారు.

*

Sampath Kumar, T.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.