అనుకోకుండా ఇంటర్నెట్‌లో “విన్సెంట్ వాన్ గోహ్స్ లాస్ట్ లెటర్ టు థియో” (Vincent van Gogh’s last letter to Theo) అనే ఒక కవిత నా కంట పడింది. ఆ పేరు చూడగానే నాలో తెలియని ఒక కుతూహలం మొదలైంది.
ప్రపంచం మెచ్చిన ఆ ప్రముఖ చిత్రకారుడు, తన ప్రాణాలు తీసుకునే ముందు తన తమ్ముడికి రాసిన ఆ చివరి లేఖలో ఏముండి ఉంటుంది? అసలు ఆయన అంతటి ఘోరమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు నన్ను వెంటాడాయి. ఆ ఆరాటంతోనే వాన్ గోహ్ జీవితం గురించి, ఆ లేఖ వెనుక ఉన్న కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాను.
ఆ ప్రయత్నంలో నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది—వాన్ గోహ్ కేవలం తన చిత్రాల్లోనే కాదు, జీవితంలోనూ ఎంతో లోతైన, మరెంతో సంక్లిష్టమైన భావోద్వేగాలను దాచుకున్నాడు. ఆయన గీసిన ప్రతి బ్రష్ స్ట్రోక్ వెనుకా ఒక కన్నీటి కథ ఉందన్న చేదు నిజం నా మనసును కదిలించివేసింది. తను సృష్టించిన రంగుల ప్రపంచంలో, కొన్ని వెలిసిన రంగులు తనని ఈ ప్రపంచం నుంచి దూరం చేసాయి.
మానసిక సంఘర్షణ, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు
జూలై 27, 1890న విన్సెంట్ వాన్ గోహ్ తన గుండెల్లో తుపాకీతో కాల్చుకుని, రెండు రోజుల తర్వాత మరణించాడు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానికి చరిత్రకారులు తీవ్రమైన మానసిక అనారోగ్యం, ఒంటరితనం, ఆర్థికపరమైన అపరాధభావాన్ని (Financial Guilt) ప్రధాన కారణాలుగా చెబుతారు.
వాన్ గోహ్ తీవ్రమైన బైపోలార్ డిజార్డర్, ఎపిలెప్సీ (మూర్ఛరోగం) వంటి సమస్యలతో బాధపడేవాడు. తనకు ఎప్పుడు పిచ్చి ముసురుతుందో తెలియని ఒక భయానక స్థితిలో ఆయన జీవించాడు. వీటన్నింటికీ తోడు, ఆయన జీవితాంతం ఆర్థికంగా తన తమ్ముడైన థియో (Theo) పైనే ఆధారపడ్డాడు. థియో పంపే డబ్బుతోనే విన్సెంట్ రంగులు, కాన్వాసులు కొనుక్కునేవాడు. తిండి కంటే ఎక్కువగా సిగరెట్లు, మద్యంపైనే బతికాడు.
చివరి రోజుల్లో థియోకి పెళ్లై, ఒక బాబు పుట్టడం, అలాగే థియో ఉద్యోగంలో సమస్యలు రావడం విన్సెంట్‌ను బాగా కుంగదీశాయి. తన వల్ల తమ్ముడి కుటుంబం భారం మోస్తోందనే అపరాధభావం ఆయనను నిలువునా దహించివేసింది. తాను బతికి ఉండటం కంటే చనిపోవడమే అందరికీ మంచిదనే తీవ్ర నిర్ణయానికి ఆయన వచ్చాడు.
ఆయన చనిపోయినప్పుడు జేబులో ఒక సగం పూర్తయిన లేఖ దొరికింది. అది థియోకి రాసిన చివరి సందేశం. అందులో ఎక్కడా “నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని స్పష్టంగా లేదు, కానీ బతుకుపై విరక్తి, అలసట స్పష్టంగా కనిపించాయి. ఆ లేఖలో ఆయన రాసిన ఒక వాక్యం నన్ను బాగా కదిలించింది:
“నిజానికి, మన చిత్రాల ద్వారా మాత్రమే మనం మాట్లాడగలం. ఐనా సరే నా తమ్ముడా… నా కళ కోసం నేను నా ప్రాణాలను పణంగా పెట్టాను. దాని కోసమే నా మానసిక సమతుల్యతను సగం కోల్పోయాను…”
తన సృజనాత్మకతకు, కళకు తను చెల్లించిన మూల్యం తన మానసిక ఆరోగ్యమే అని ఆయనకు బాగా తెలుసు. ఆ లేఖ ఆయన మేధస్సుకు, అలాగే ఆయన అనుభవించిన నరకయాతనకు సజీవ సాక్ష్యం.
మరణానంతరం లభించిన కీర్తి – జోహన్నా వాన్ గోహ్ అద్భుత పోరాటం
విన్సెంట్ బతికున్నప్పుడు కేవలం ఒకే ఒక్క పెయింటింగ్ మాత్రమే అమ్ముడుపోయింది. ఆయనను అందరూ ఒక పిచ్చివాడిగా, ఓడిపోయిన కళాకారుడిగా చూశారు. మరి ఈ రోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ చిత్రకారుడిగా ఎలా మారాడు? దీని వెనుక జోహన్నా వాన్ గోహ్-బోంగర్ (Johanna van Gogh-Bonger) అనే ఒక అసాధారణ మహిళ కృషి ఉంది. ఆమె ఎవరో కాదు, థియో భార్య.
విన్సెంట్ చనిపోయిన ఆరు నెలలకే, ఆ బాధను తట్టుకోలేక థియో కూడా కన్నుమూశాడు. అప్పుడు కేవలం 28 ఏళ్ల వయసున్న జోహన్నా, చేతిలో పసిపాపతో ఒంటరిదైపోయింది. ఆమెకు వారసత్వంగా మిగిలింది విన్సెంట్ గీసిన వందలాది పెయింటింగ్స్, ఆ అన్నదమ్ముల ఉత్తరాలు మాత్రమే. వాటిని పారేయమని అందరూ సలహా ఇచ్చినా, ఆమె విన్సెంట్ కళలోని గొప్పతనాన్ని గుర్తించింది. విన్సెంట్ ని కలిసింది కొన్ని సార్లే అయినా, విన్సెంట్ లోని లోతైన పరిసీలకుడిని తను అర్థం చెసుకోగలిగింది.
జోహన్నా అప్పట్లో పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న ఆర్ట్ ప్రపంచాన్ని ఎదిరించి, విమర్శకులు విన్సెంట్‌ను కేవలం ఒక ‘పిచ్చివాడు’ అని కొట్టిపారేయకుండా గట్టిగా నిలబడింది. ఆమె ఒక వ్యూహం ప్రకారం పనిచేసింది. కేవలం చిత్రాల సాంకేతికత గురించి వాదించకుండా, ఆమె మూడు వ్యూహాత్మక మార్గాల ద్వారా విన్సెంట్ కళను వెలుగులోకి తెచ్చింది. మొదటిది, ఆమె విన్సెంట్ రాసిన ఉత్తరాల ద్వారా విన్సెంట్ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. జాన్ వెత్ లాంటి కఠినమైన విమర్శకులకు విన్సెంట్ రాసిన ఉత్తరాలను ఇచ్చి చదవమని కోరింది. ఆ ఉత్తరాలను చదివిన విమర్శకులు, ఆ మొరటు రంగుల వెనుక ఎంతటి మేధావి ఉన్నాడో తెలుసుకుని తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. రెండవది, ఆమె చాలా ప్లాన్ ప్రకారం పెయింటింగ్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. మార్కెట్‌లో ఒకేసారి అన్ని చిత్రాలను అమ్మకానికి పెట్టకుండా, యూరప్ అంతటా జరుగుతున్న ఆధునిక ఆర్ట్ షోలకు కొన్ని ముఖ్యమైన చిత్రాలను మాత్రమే లోన్‌గా ఇస్తూ ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. మూడవది, ఆమె ఎంత పేదరికంలో ఉన్నా విన్సెంట్ అపురూప చిత్రాలను తక్కువ ధరకు అమ్మడానికి అస్సలు ఒప్పుకోలేదు. తన జీవనం కోసం ఒక బోర్డింగ్ హౌస్ నడుపుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు తట్టుకుంటూనే విన్సెంట్ పెయింటింగ్స్ అన్నింటినీ ఒకే దగ్గర భద్రంగా కాపాడింది. ప్రపంచం విన్సెంట్ విప్లవాత్మక సృజనాత్మకతను గుర్తించే వరకు ఆమె ఓపికగా పోరాడింది.
జోహన్నా కొడుకు పేరు విన్సెంట్ విల్లెమ్ వాన్ గోహ్ (Vincent Willem van Gogh). ఈయనకు తన పెద్దనాన్న అయిన చిత్రకారుడు విన్సెంట్ వాన్ గోహ్ పేరే పెట్టారు. జోహన్నా తన కొడుకును పెయింటింగ్స్ మధ్యే పెంచింది. చిన్నప్పటి నుంచే ఆ చిత్రాల విలువను, వాటి వెనుక ఉన్న పెద్దనాన్న త్యాగాన్ని అతనికి నూరిపోసింది. 1925లో జోహన్నా చనిపోయే సమయానికి వాన్ గోహ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆమె మరణం తర్వాత ఈ భారీ చిత్రాల కలెక్షన్ అంతా విల్లెమ్ చేతికి వచ్చింది. అప్పట్లో వాటిని అమ్మేస్తే కోట్లాది రూపాయలు వచ్చేవి, కానీ అతను ఆ పని చేయలేదు. తన తల్లి ఆశయానికి గౌరవం ఇస్తూ, ఆ చిత్రాలన్నీ ఒకే చోట ప్రపంచానికి అందుబాటులో ఉండాలని భావించాడు. అందుకే, డచ్ ప్రభుత్వంతో మాట్లాడి, ఆ అపురూప చిత్రాలన్నింటినీ భద్రపరచడానికి ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు పునాది వేశాడు. అలా 1973లో ఆమ్‌స్టర్‌డామ్‌లో అధికారికంగా “వాన్ గోహ్ మ్యూజియం” ఏర్పాటయింది. విన్సెంట్ వాన్ గోహ్ కేవలం పదేళ్ల కాలంలోనే ఊహించని వేగంతో పెయింటింగ్స్ వేశారు. ఆయన మొత్తం జీవితంలో సుమారు 2,100 కళాఖండాలను (Artworks) సృజించారు. ఈరోజు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ఆ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారంటే, దానికి కారణం జోహన్నా పెంపకం, ఆమె కొడుకు చూపించిన నిబద్ధతే.
ఈ మొత్తం చరిత్రను చదివాక, నా మనసులోని భావోద్వేగాలను ఆపుకోలేకపోయాను. అందుకే, నా కంట పడిన ఆ ఇంగ్లీష్ కవిత స్ఫూర్తితో, విన్సెంట్ వాన్ గోహ్ చివరి లేఖలోని సారాంశాన్ని జోడించి, నేను తెలుగులోకి చేసిన అనువాద కవితను ఇక్కడ పంచుకుంటున్నాను:
చివరి లేఖ (నా తెలుగు అనువాదం)
రంగుల ప్రపంచంలో నన్ను నేను వెతుక్కుంటూ,
నా కాన్వాస్ పై నా ఆత్మను పరుస్తూపోయాను.
కానీ థియో… ఈ నల్లటి కాకులు, ఎండిన గోధుమ చేలు,
నాలోని వెలుతురును మింగేస్తున్నట్టున్నాయి.
నువ్వు పంపిన ప్రతి పైసా నా రంగుల శ్వాస అయింది,
కానీ నీ సంసారానికి నేను భారమయ్యానన్న నిజం,
నా గుండెను బరువెక్కిస్తోంది, నన్ను నిలువునా దహించేస్తోంది.
నాలోని పిచ్చి నా ఆలోచనలను ముక్కలు చేస్తోంది.
చిత్రాల ద్వారా తప్ప నేను మాట్లాడలేను,
అందుకే చెబుతున్నా…
నా కళ కోసం నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టాను,
నా ఆలోచనా శక్తిని సగం కోల్పోయాను.
ఇక సెలవు థియో…
నా రంగుల పెట్టె మూసేస్తున్నా,
నాలోని చీకటిని కాన్వాస్ నుండి విముక్తం చేస్తున్నా!
*








Add comment