కెనడా కవితలు రెండు

1

ఆకాశంబున నుండి – 

 

నది గడ్డకట్టదు
ఎండిపోదు
ఇగిరిపోదు
తరతరాలుగా ప్రవహిస్తూనే ఉంది
ప్రవాహం ఓ జలపాతమై ప్రయాణిస్తూనే ఉంది
ఈ నీటిని స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టటం
ఏరికైనా సాధ్యమా!

అక్కడ దుముకుతున్న నీటిసౌందర్యం
భూమి మీద నీరంతా ఒకేచోట చేరినట్లు
వందల వేల లక్షల కళ్లల్లో నిలిచిపోతోంది
యుగాల తరబడి హోరెత్తుతున్న
ప్రవాహం స్థంభించదు

ఆకాశంబుననుండి శంభుని శిరం
తాకిందో లేదో కానీ
నయగారమై హొయలోలికిస్తూ
జారుతోంది… పారుతోంది….
నీటిచుక్కల మంచు తుంపర
మనసును తడిచేస్తూ
ఆరిపోనివ్వడంలేదు
లాయబద్ధమైన నీటి సంగీతం
తరతరాలుగా విరామం లేకుండా
చెవులను తాకుతూనే ఉంది.

మంచు కురిసే కాలాన
తీగలు తీగలయ్యే నీరు
ఇప్పుడు మాత్రం ఊరకలెత్తుతోంది
ఎగసెగసి పడుతోంది

(నయాగర జలపాతం చూసినప్పుడు)

** ** ***

ఆకాశంబున నుండి – 2

 

కళ్లల్లో నక్షత్రమై మెరుస్తోన్న
ఆ కట్టడపు తలపాగా
నగరపు నలుదిక్కుల్ని
కలయజూస్తోంది
నేలమీద నుండి నిలబడి
తలెత్తి తేరిపారాజూస్తే
చిటారుకొమ్మన
కదలాడుతున్న నీడలు
అంత ఎత్తును
క్షణాల్లో దాటుకొని
చిట్టచివరన చూపును ఆపితే
బతుకుతెరువు వేగంగా పరుగెత్తుతూ ఉంటుంది

ఆకాశంలో కాలు నిలిపి
చుట్టూ పరికిస్తే
చీమల్లా మనుషులు
ఎవరికి ఎవరూ ఏమీ కానట్టు
గమ్యం కోసం నడుస్తూ… నడుస్తూ…

పైనుంచి చూస్తే
కంటికి ఆనినంతమేరా
లోకం చిన్నదైపోతుంది
గాజుగదుల్లో జీవితం
అక్కడక్కడే గిరికీలు కొడుతూ ఉంటుంది.

(టొరంటో CN టవర్ చూసి)

 

బండ్ల మాధవరావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.