పొద్దున్నే కరెంట్ పోయింది . కాబట్టి మిక్సీ తిరగదు . నేనే ఇల్లంతా తిరిగి కల్వ౦ లాంటి చిన్న రాతి బండని దొరకబుచ్చుకుని కూరలోకి అల్లం నూరుతున్నాను . పక్క వాటా సావిత్రి గారు దేవుడికోసం చదువుతున్న పూజా స్త్రోత్రం ఇక్కడికి వినిస్తోంది . ఎదురు వాటా లోంచి ఎవరో బట్టలు ఉతుకుతున్న చప్పుడు ఈ స్త్రోత్రానికి పక్క వాయిద్యం ఇస్తోంది . మూడు ఇళ్లలోనూ మూడు బండలతో తలో పనీ చేయిస్తున్నాం .
చెక్కింది ఒక శిల్పకారుడే . ఒక దానికి ముక్కు చెవులు చెక్కడం వల్ల సావిత్రి గూట్లో దేవుడయింది . ఇంకోటి గుండ్రంగా చెక్కేసి వదలడం వల్ల నా చేతికి పచ్చడి బండ అయింది . అసలు చెక్కుడు పని పెట్టుకోకుండా అలాగే వదిలేయడం వల్ల ఎదురు వాటా ఇల్లాలికి బట్టలుతికే బండ అయింది . నటుడు రంగనాధ్ దీనిమీద మ౦చి కవిత రాశాడు . యోగి వేమన అంతకంటే ముందు రాసాడు. ఒకప్పుడు వున్న తాత్త్విక భావనలు ఇప్పుడు దేశ ద్రోహం అయిపోతున్నాయి . నేనిప్పుడు దాన్ని గురించి మాట్లాడదల్చుకోలేదు . మా రాజోలు వదిన గురించి మాట్లాడాలను కు౦టున్నాను.
ఆవిడ పేరు ఉమా చండీ గౌరి శ౦కరి . అవును, నలుగురికి పెట్టాల్సినంత పెద్దపేరు వాళ్ళ అమ్మానాన్నలు తమ ఒక్కగానొక్క కూతురికి పెట్టారు . కానీ అన్నీ తుంగలో తొక్కి అల్లుడు తమ బిడ్డని “ఒసే బండా” అని పిలుస్తాడని అప్పుడు ఊహించివుండరు . ఆ పేరు మన చెవులకి ఇంత హింసాత్మకంగా వుంది కదా , కాని అదేమిటో ఆవిడకి కోపం రాదు . భానుమతీ అని వినిపిస్తుందేమో తెలియదు . నాలాంటి వాళ్ళు ఎవరయినా అడిగితే ఆవిడే ముందు అడ్డ౦ పడుతుంది .
“ఆయన అల్లా పిలు స్తారు కానీ, లోపల ప్రేమే వుంటుంది” ట . బానిసల స్వర్గం ఎక్కడో వుండదు కొందరి కబుర్లలోనే వుంటుంది . ఆయన అమ్మవారి భక్తుడు . వాళ్ళ ఇంట్లో ముక్కోటి బండలున్నాయి లక్ష్మి సరస్వతి , పార్వతి, కామేశ్వరి అంటూ అన్నిటికీ గొప్ప గొప్ప పేర్లు . ఆయన గనక అష్టోత్తరమో శతోత్తరమో లంఘించుకున్నాడంటే పుట్టలు పుట్టలుగా పేర్లు దొర్లు తాయి . అన్ని పేర్లు చదివిన ఆ నోటితోనే “ఒసే బండా ఆ కర్పూరం ఇలా పట్టుకురా” అని భార్యని పురమాయిస్తాడు. అలాంటి “ఒసే బండ” ఆ మధ్య వచ్చళ్ళ బిజినెస్ పెట్టి ఒక చిన్నపాటి ఎంటర్ ప్రెన్యూర్ అయిపోయింది . కనీస౦ దానికయినా తన పేరు పెట్టుకోవచ్చు కదా అలా చెయ్య లేదు . “శంకర్ పికిల్స్” అని మొగుడి పేరు పెట్టింది .
“నా మిసెస్ టమెటో పచ్చడి బాగా చేస్తుందండీ , “ అని శంకర్ ఇప్పుడు కొత్తగా బైటివాళ్ళ దగ్గర మెచ్చుకోవడం మొదలెట్టాడు .
తినగా తినగా వేప తియ్యగా వున్నట్టు వినగా వినగా ఆ పేరులో వున్న అనౌచిత్యం ఒప్పుకోలు అయిపోయిందేమో . చివరికి చుట్టు చుట్టు పక్కల వాళ్ళు కూడా “ అదిగో ఆ శంకర్ పచ్చళ్ల బండమ్మలేదూ ఇది ఆవిడ దగ్గర కొన్నా ” అని చెప్పుకుంటారు .
దేవుడి దయవల్ల బిజినెస్ బాగా కలిసొచ్చినందుకు మా వదిన కాశీ విశ్వేశ్వరుడికి ఎన్నో మొక్కులు బాకీ పడింది . మొక్కు తీర్చుకు రావాలని టిక్కెట్టు కొనుక్కు౦ ది . ప్రయాణం వారంలో వుండగానే ఆరోగ్యం దెబ్బతింది . నీరసం తో బాటు విపరీతమైన చెమట వళ్లంతా ధారాపాతంగా కారిపోవడం మొదలుపెట్టింది .
మొదట మెనోపాజ్ అనుకుందిట . హైపర్ హైడ్రో సిస్ వల్ల ఇలా జరుగుతుందని డాక్టరు చెప్పాడు . తను కాశీ వె ళ్ళాల్సి వుందని , వారంలోగా తగ్గిపోయే మందులివ్వమని డాక్టర్ని అడిగింది . మోతాదు మించి కూడా మాత్రలు మిగేసింది . ఈలోగానే వారాహిలో అమ్మవారికి విగ్రహానికి చెమటలు పడుతున్నాయని పేపర్లో చదివింది . గుండె నీరయింది.
అమ్మవారికి మెనోపాజ్ వుండదు కాబట్టి ఏ “అరిష్టం “ జరిగిందో ఏమిటో అనుకుని చూడడానికి బయలేదేరింది . ఆ వార్త వచ్చిన మర్నాడే అదేమిటో గాని తిరుపతి వెంకటేశ్వరస్వామికి కూడా చెమటలు పట్టాయి . ప్రసన్నంగా వుండాల్సిన ప్రసన్నాంజనేయస్వామికి అవే చెమటలు వస్తున్నాయని దేవస్థానాలు ప్రకటించాయి . ఇక చెప్పేదేముంది . ఒకేసారి అందర్నీ దర్శ౦చి పుణ్యం మూట కట్టుకోవాలనే ఆశతో మా వదిన బయల్దేరింది . దేవీ దర్శనం కోసం క్యూలో వుండగానే ఆవిడకి చెమటలు కారిపోయి డీ హైడ్రే షన్ పట్టుకు౦ది . అమ్మవారు దయ చూపలేదు . కళ్ళు తిరిగి పడిపోతే తెలిసిన వాళ్లెవరో అంబులెన్స్ లో తీసుకొచ్చారు . అప్పటికే ప్రాణం పోయిందన్నారు . పోనీలే దేవుడి దర్శనం చేసుకుని పోయింది అనుకున్నారు అంతా.
రాయికి చెమట పట్టి౦దంటే నమ్మి ఆ చెమట చూడడానికో, తుడవడానికో తన వొంట్లో వున్న నీరు మొత్తం ఖర్చుచేసుకున్న మా వదిన గురించి ఏమనుకోవాలో నాకు తెలీదు .
పత్రికలో మొదటిసారిగా ఆవిడ గురించి వచ్చింది కానీ ఆక్కడా పేరు లేదు .
“అమ్మవారి క్యూలో సొమ్మసిల్లిన ఒక పేరు తెలీని మహిళ “ అని వచ్చింది .
తర్పణాలు వదలడానికి ముందు గోదారి ఒడ్డున పురోహితుడు రెండే రెండు క్లిష్టమైన ప్రశ్నలు అడిగాడు.
అందులో ఒకటి ఆవిడ పూర్తి పేరు ఏమిటి ? రెండు ఆవిడకి ఇష్టమైన పదార్ధాలు ఏమిటి ?
ఏం చెప్పాలో పాపం వాళ్ళకి తోచలేదు. ఆదేమైనా జనరల్ నాలెడ్జికి పనికొచ్చే ప్రశ్నా ఏమిటి ?
నిజం చెప్పాలంటే , జీవితాంత౦ ఆవిడ మోసిన పేరు బండ, ఆవిడకి అన్నీ ఇష్టమే. ఎందుకంటే ఏది మిగిలితే అది తింటుంది, అని చెప్పలేరు కదా ఆ సమయంలో .
అందుకని కుటుంబం మొత్తం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు
చుట్టం చూపుగా వచ్చిన బంధువు ఎవరో మాట సాయం చేసింది.
మా అక్క పూర్తి పేరు ఉమా చండీ గౌరి శ౦కరి, దానికి బూందీ లడ్డూ ఇష్టం అని , అవునా, అన్నట్టుగా శవం చెవులు రిక్కించి విని వుంటుంది .
పూస గుచ్చినట్టు ఈ ఉదంతం మొత్తం మొన్న ఈ పాటికి మా చెల్లి కామేశ్వరి చెబుతుంటే నాకు విషాద౦ తో కూడిన నవ్వు వచ్చింది .
మొన్నటిదాకా ఆవిడకి పేరు లేదు . ఇప్పుడు ప్రాణం కూడా లేదు.
కానీ తర్పణం వదలడానికి పేరు పలకాల్సి వచ్చింది . లేకపోతే ఆ తర్పణం ఇంకెవరి ఖాతాలోకో వెళ్లిపోతుందేమో ?
భర్తలకి పేర్లు వుంటాయి కానీ భార్యల్ని పిలవనివ్వరు . స౦ప్రదాయం ఒప్పుకోదు .
భార్యలకి పేర్లు వుంటాయి . కానీ భర్తలు పిలవరు . కారణం తెలీదు .
“ఏమేవ్, ఒసేవ్” అని ఆయనా , “ఏవండోయ్” అని ఈవిడా జీవితాంతం అపరిచితుల్లా బతికేస్తారు . ఇందులో సమానత్వం ఎక్కడ ఏడిసింది ?
వివాహ బంధాల్లో హక్కుల ప్రస్తావన అనవసరం అని చెప్పేవాళ్ళు మన చుట్టూ వుంటారు .
మా వదిన అపోహ పడినట్టు ప్రేమ గౌరవం ఒకటి కాదు . ఒకటి ఇచ్చినంత మాత్రాన ఇంకోటి ఇవ్వను అనడానికి బంధం రేషన్ కార్డు కాదు .
బానిసలకి పేర్లు వుండవు . ఖైదీలకీ వుండవు , నంబర్లతొ పిలుస్తారు .
మా వదినకే కాదు మన అమ్మలకి పేర్లు వున్నాయా ? ఎంతమ౦ది నాన్నలు అమ్మని పేరుతో మర్యాదగా పిలుస్తున్నారు ? దీని మీద పి. సత్యవతి అద్భుతమైన కధ రాసింది.
“ఇల్లు అలకగానే” పేరు మర్చిపోయి౦దట ఆ ఇల్లాలు . మా వదిన పచ్చళ్ల బిజినెస్ పెట్టి బజారు కూడా అలికింది . అయినా పేరు లేదు .
తర్పణాలు ఇవ్వడానికి , సమాధి బండల మీదా రాయడానికేనా అమ్మానాన్నలు అల్లారు ముద్దుగా మనకి పేరు పెట్టింది ?
*








Add comment