ఆనందాచారి కవిత్వమూ, వచనమూ కొంతకాలంగా పరిచితమే. సిద్ధాంత బలమూ , వ్యక్తీకరణలోని పదునూ రెండూ కలిస్తే ఆనందాచారి రచన. ఈ నెలాఖరున ఆయన తాజా కవిత్వ సంపుటి ‘తటిల్లతలు’ ఆవిష్కరణ.
‘ఇక ఇప్పుడు ‘ అని మీరు వచన కవిత్వం రాసారు. ‘తటిల్లతలు’ పేర లఘు కవిత్వం రాయాలని మీకు ఎందుకు అనిపించింది?
‘ఇక ఇప్పుడు’ కవిత్వం చాలా సంవత్సరాలుగా రాసిన మొత్తం అది. ‘తటిల్లతలు’ రెండేండ్లుగా ఆలోచన తట్టగానే రాసింది. ఫేస్ బుక్ లో పెట్టినవి. ఇవి కొన్ని సంఘటనలు, సందర్భాల ప్రతిస్పందనలు, కొన్నేమో జీవన తాత్విక విషయాలపై వ్యాఖ్యలు. మనం చెప్పాలనుకున్నది, క్లుప్తంగా ప్రభావవంతంగా ఉంటే పాఠకుల్లోకి వెళ్తుంది. మంచి స్పందన కూడా వచ్చింది. రూమీ, గుల్జార్, ఉర్దూ పొయెట్స్ దీనికి ప్రేరణ…
చినవీరభద్రుడు గారు హైకుని ‘తటిల్లత’ అన్నారు. మీరు లఘు కవిత్వానికి ‘తటిల్లతలు’ (Sound of Light) అన్నారు. మీ కవిత్వానికి ఈ శీర్షిక ని ఎలా సమర్థిస్తారు?
తటిల్లత (Sound of light) అని చినవీరభద్రుడు గారు అన్న విషయం నాకు తెలియదు. మెరుపులా మన మెదడు పై ఒక ఆలోచనను కలుగచేసే వాక్యాలు కనుక ఆ శీర్షిక సరిగ్గానే ఉందని పించింది. సీతారాం పేరు సూచించాడు. ముందు ఒక మెరుపులా మొదలయి, తర్వాత తీగలా భావం అల్లుకుపోతుంది. ఆలోచన విస్తరించటానికి ఇవి దోహద పడతాయని అనుకొంటున్న.
సామ్యవాదులైన మీరు జీవన తాత్వికత ఎక్కువగా వున్న వస్తువును ఎంచుకున్నారు. కారణం ఏంటి? మీ దృక్పధంలో వచ్చిన మార్పా? లేదా మీ దృక్పధం విస్తరించుకున్నారా?
సామ్యవాదం, రాజకీయ ఆర్థిక దృక్పథం మాత్రమేకాదు. జీవన దృక్పథం కూడా. అసలు విశ్వం లోని ప్రతి అంశానికి సంబంధించిన అన్ని విషయాలను, మనిషికి సంబంధించిన అన్ని అంశాలు వివరించగలిగిన విశ్లేషించగలిగిన తాత్విక దృక్పధమే మార్క్సీజం. నేనేమీ మార్చుకుని రాసింది కాదు. నా దృక్పథమేమీ మారలేదు.
ఈ లఘు కవితలను ఇంగ్లిష్ లోకి చేయాలని మీకు ఎందుకు అనిపించింది?
ఇవ్వాళ్టి యువత, ముఖ్యంగా మా పిల్లలు, మనుమలు, కోడళ్లు ఎవరూ తెలుగు చదవలేక, చదిరినా భావం అర్ధం కాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్లందరికీ నా భావాలు అర్ధం కావాలి అనేది మొదటి లక్ష్యం. ఇక వెంటనే శ్రీనివాసగౌడ్ గారు కలవడం, వారికి వినిపించడం, వారు అనువాదం చేస్తాననటం జరిగి పోయాయి. మనం ఏది చెప్పినా, రాసినా నేటి యువతకు చేరాలి. వాళ్లు వింటున్నారు. చదువుతున్నారు. ఆకలింపు
చేసుకుంటున్నారు. అంతే కాక మన కవిత్వం, రచన ఆంగ్లం లోకి ఇతర భాషల్లోకి పోవాల్సిన అవసరం ఉంది
పదైదు వాక్యాల్లో ముగిసిపోయే ఈ కవితలు పాఠకునిలో ఏ రకపు అనుభూతిని కలిగించగలవని మీరు భావిస్తున్నారు? మీ ఈ కవిత్వ లక్ష్యం ఏంటి?
ప్రస్తుత కాలం చాలా వేగవంతమైనది. క్లుప్తత పాఠకులను పెంచుతుంది. విషయాన్ని, సందర్భాన్ని, సంఘటనలపై ఒక స్థూల అవగాహనను, ఆలోచనను అందిస్తుంది. ఇవన్నీ నా అనుభవాల నుండి చెప్పిన విషయాలు. కవిత్వం చేయాలన్న ప్రయత్నం చేయలేదు. ఆ కొంత కుదింపుతో వ్యక్తీకరించిన భావాలు ఇవి. చిన్న కవితలు రాసాను అంటే, పెద్ద కవితల దీర్ఘ కవితల ప్రభావాన్ని తక్కువ చేయటం కాదు. దేని ప్రభావం దానిదే.
*








తెలుగు నుంచి ఆంగ్లంలోకి విస్తరించడం ద్వారా ఈ భావాలు కొత్త తరానికి చేరాలన్న ప్రయత్నం మరింత అభినందనీయం. మెరుపు క్షణమే… కానీ అది రేపే వెలుగు, ఆలోచన మాత్రం ఎక్కువకాలం నిలుస్తుంది. ‘తటిల్లతలు’ అలాంటి వెలుగుల సమాహారంగా నిలవాలని కోరుకుంటూ, కె. ఆనందాచారి గారికి హృదయపూర్వక అభినందనలు.
ప్రశ్నలు, వాటికి అందిన సమాధానాలు ఆలోచింప చేస్తున్నాయి.
మంచి ప్రయత్నం🎉🎈🎊💐