తాడి ప్రకాష్… ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు ఇది.
పేరుకే పత్రికా రచయిత కానీ, నిలువెల్లా సృజన ఆవహించిన వ్యక్తిత్వం. ఏ పత్రికా ఛత్రంలోనూ , చట్రంలోనూ ఇమడని ముక్కుసూటి వచనం. దానికి తగ్గ కవితాత్మక తీవ్రతా, నిమగ్నతా పొదువుకున్న ఆలోచనల ప్రవాహం. రాసిందల్లా చదివించేలా రాయడం ఒక వ్యసనం. వయసు నిలువరించలేని అధ్యయనం. కాలంతో పాటు స్థిరత్వం అందుకున్న పరిణతి. ప్రకాష్ అనే సంతకం కొత్త తరం తెలుగు వాళ్ళకి ఒక మెరుపూ, ఒక విరుపూ, కొరడా చరుపు.
జర్నలిస్టు అనుభవాలతో ప్రకాష్ గారు రాసిన ఏలూరు రోడ్డు ఆత్మగీతం బాగా పాపులర్ అయింది. నాన్ ఫిక్షన్ prose రాయడంలో ఒక ప్రత్యేకమైన శైలితో ఆకట్టుకుంటున్నారు. ప్రకాష్ గారికి గత ఏడాది కే ఎన్ వై పతంజలి లిటరరీ అవార్డు, ఈ ఏడాది ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అవార్డు వచ్చిన సందర్భంగా కొన్ని కబుర్లు :
ఏంటి సార్, ఎలా ఉంది జీవితం?
చాలా సంతోషంగా ఉంది.
చర్మ సౌందర్యానికి సంతూర్ లాగా, ఏంటి మీ సంతోషానికి కారణం?
రోజువారీ రొటీన్ విషయాలు, అంటే చదువుకోవడం, రాసుకోవడం, సినిమాలు చూడటం లాంటివి కాకుండా అమెరికా లాంటి పెద్ద దేశాన్ని ఇరాన్ లాంటి చిన్న దేశం ఓడించి సాధించిన విజయాన్ని తలచుకుని తెగ సంతోషపడుతున్నా… సోవియట్ యూనియన్ చెయ్యలేని పని, అంత పెద్ద చైనా చెయ్యలేని పని చిన్న చిన్న దేశాలైన వియత్నాం, ఇరాన్ లాంటివి చెయ్యడం చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, I’m very happy.
మీరు పాతతరం కమ్యూనిస్టులు కావడమే కారణమా?
ఇది కొంతవరకూ నిజమే… కానీ అమెరికా అనేది ఒక దుర్మార్గమైన దేశం, అది చేసే యుద్ధాలు కూడా అన్యాయమైనవి. దాన్ని ఎవడు ప్రపంచ పెద్దన్న అన్నది, అది ఏంటి వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న దేశాలకి విముక్తి కల్పించేది. ఎవడు ఇచ్చాడు దానికా అధికారం? దాని అండ చూసుకుని ఇజ్రాయెల్ చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు, మనం చూస్తూనే ఉన్నాంగా పాలస్తీనానీ, అందులో గాజానీ వాళ్ళు ఏ స్థితికి చేర్చారో. అందుకని ఇరాన్ ఎంత మతచాందస దేశమైనా నా సపోర్ట్ ఇరాన్‌కే.
కమ్యూనిస్టులకి ముస్లింల మీద ప్రత్యేక ప్రేమ ఉంటుందని చాలామంది ఆరోపిస్తుంటారు? దానికి మీరేం అంటారు?
ప్రత్యేక ప్రేమ అనేదేం లేదు. పవర్ బ్యాలెన్స్‌లో హీనపక్షంలో ఉన్నవాళ్ళని సపోర్ట్ చెయ్యడం, వాళ్లకి సపోర్ట్ చేసి, వాళ్ళ పక్కన నిలబడటం అంతే. ఇదంతా రాజకీయాలలో భాగం.
గ్లోబల్ పాలిటిక్స్ మీద మీకు ఈ ఇంట్రెస్ట్ ఏలూరు నుంచే ఉండేదా? లేదా జర్నలిస్ట్ అయ్యాక కలిగిందా?
ఏలూరు నుంచే, మా నాన్న తాడి అప్పలస్వామి, కమ్యూనిస్టు నాయకుడు. ఆయన మిత్రులందరూ కమ్యూనిస్టు నాయకులే, వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్న దేశాల గురించీ, వాటి విముక్తి పోరాటాల గురించీ మాట్లాడుకుంటుంటే వినేవాడిని, అలాగే మా అన్నయ్య ఆర్టిస్టు మోహన్, మా అక్క సుశీల వల్ల కూడా కొంత వీటి గురించిన అవగాహన కలిగింది.
ప్రస్తుతం చుట్టూ ఉన్న సమాజమూ, దేశంలో పరిస్థితులు, నానాటికి దిగజారిపోతున్న రాజకీయ వ్యవస్థ, ఏం చెయ్యాలో తెలీని స్థితిలో మన దేశపు యువత. ఇవన్నీ చూస్తూ ఒక రకమైన నిరాశ, నిస్పృహ కలగడం సహజమే కదా. మీకు అలా ఏమన్నా అనిపిస్తుందా?
నాకు నిరాశా లేదు. నిస్పృహ అస్సలే లేదు. ఎందుకంటే నాకు తెలుసు, it’s a very slow and painful transition, మార్పు అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. మా కమ్యూనిస్టులు చెప్పినట్టు మార్పు శనివారం సాయంత్రానికో, ఆలస్యం అయితే సోమవారం పొద్దున్నకో రాదు. సాయుధ పోరాటం ద్వారా రేపు సాయంత్రం కరీంనగర్ అడవుల్లోంచి వెళ్ళి మనం ఢిల్లీని క్యాప్చర్ చెయ్యలేం.
మనకి స్వాతంత్య్రం వచ్చి కేవలం 75 యేళ్ళే అవుతుంది. ఇంతలోనే అంతా జరిగిపోతుందనే దురాశలు నాకు లేవు.
లేటు వయసులో కలిగిన జ్ఞానోదయమా?
అంతే అనుకోవాలి.
కానీ మీరు యువకులుగా ఉన్నప్పుడు అందరిలాగే కచ్చితంగా విప్లవాన్ని కాంక్షించే ఉంటారు కదా?
ఓ పాత సామెత ఉంది. నీ ఇరవైల్లో నువ్వు కమ్యూనిస్టువి కాకపోతే నీ యవ్వనం వృధా, నీ వృద్ధాప్యంలో నువ్వు ఇంకా కమ్యూనిస్టుగా ఉంటే నీ అనుభవం వృధా అని. ఆ వయసులో నేను, నాలాంటి ఎంతోమంది స్వర్గం అంటే రష్యాలోనే ఉందని కలగన్నాం. ఆ కల మా కళ్ళముందే ముక్కలు అవడం చూసి బాధపడ్డాం. కానీ ఆ వయసులో అది మాకు ఒక హోప్ ఇచ్చింది. అది మమ్మల్ని నడిపించింది. వయసుతో పాటూ ఆ ఆశ కూడా అడుగంటింది.
సరే, ఇక ఈ రాజకీయ సైద్ధాంతిక విషయాలు పక్కన పెడితే మీరు రచనా వ్యాసంగంలోకి ఇంత ఆలస్యంగా ప్రవేశించడానికి కారణం ఏంటో చెప్తారా?
జర్నలిజంలోకి చాలా చిన్న వయసులోనే వచ్చేసాను, అంటే పందొమ్మిదేళ్లకే. రకరకాల పత్రికలలో పనిచేసి కొద్దికాలంలోనే న్యూస్ ఎడిటర్ కూడా అయిపోయాను. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఉదయం లాంటి ఒక పత్రిక మొత్తం వార్తలతో నింపి ప్రింట్‌కి పంపే బాధ్యత నా మీద ఉండేది. ఇదంతా చేస్తూ కూడా విప్లవ, సాహిత్య, రాజకీయ రంగాలలోని వ్యక్తులతో స్నేహం, సాన్నిహిత్యం ఉండేవి. వాళ్ళ వల్ల మంచి సాహిత్యము, మంచి సంగీతం, మంచి సినిమా అంటే ఏంటో నాకు ఒక అవగాహన కలిగింది.
రచనలో నా టాలెంట్ అంతా వార్తలు రాయడంలోనూ, రాసిన వార్తలకి హెడ్డింగులు పెట్టడంలో చూపించేవాడిని. రిటైర్ అయిన తర్వాత రాయాలనే కోరిక ఏం కలగలేదు, కోవిడ్ టైంలోనే ఊసుపోక కొంతమంది పెద్దవాళ్ళని తలచుకుని నేను రాసిన రాతలు, మిత్రులు బాగున్నాయని మెచ్చుకున్నారు, అప్పుడు మరిన్ని రాయాలనే ఉత్సాహం పుట్టి రాస్తూ ఉన్నాను. డెబ్బై ఏళ్ళ జీవితంలో నలభై ఏళ్ళ ఉద్యోగ జీవితంలో ఎన్నో చూసి ఉంటాను కదా, అందుకని చెప్పటానికి నా దగ్గర చాలా సంగతులు ఉన్నాయి. రాచమల్లు రామచంద్రారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, నండూరి రామ్మోహన్ రావు, ఏ బీ కె ప్రసాద్ గారు లాంటి మహామహులతో కలిసి పనిచేసిన అనుభవం, కె ఎన్ వై పతంజలి, నామిని గారి లాంటి గొప్ప రచయితలతో ఇరవై ఏళ్ళ స్నేహమూ, కలిసి పనిచేసిన అనుభవమూ, ఇక మా అన్నయ్య ఆర్టిస్టు మోహన్ అంటే ఒక యూనివర్సిటీ అంత కదా! కాబట్టీ సహజంగానే చాలా ఙ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు నాకు ఉన్నాయి. అవే రాస్తున్నాను.
ఎవరి గురించి రాసినా(నాతో సహా)మోతాదుకు మించి పొగుడుతారనే అపవాదు మీ మీద ఉంది. దాని గురించి ఏమంటారు?
నాకూ తెలుసు, అది అపవాదే. కానీ, నేను పొగుడుతూ రాసిన వాళ్ళంతా ఆ పొగడ్తలకి అర్హులనే నేను అనుకుంటాను.
ఇప్పుడు మీకు డా. చందు లిటరరీ అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డుల మీద మీ ఒపీనియన్ ఏంటి?
అవార్డులని నేను పాజిటివ్ గానే చూస్తాను. Self-promotion కోసం కొంతమంది lobbying చేయించుకుని అవార్డులు సంపాదించుకునేవాళ్లు కూడా ఉంటారు. కానీ, నిజంగా అర్హులైన వాళ్ళకి ఈ అవార్డులు వచ్చినప్పుడు, అది వాళ్ళకి గొప్ప ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని నేను అనుకుంటాను.
మీ వచనానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అనుభవాలు అందరికీ ఉంటాయి గానీ దాన్ని చెప్పే పద్ధతి makes it all different. ఈ ప్రత్యేకమైన వాక్యం మీకు ఎలా అవడింది. దానికి మీరు చేసిన ప్రాక్టీస్ ఏమైనా ఉందా?
జర్నలిస్టుగా రాయడమే పనిగా కొన్ని దశాబ్దాలు గడిపాను. దానితో పాటే చదవడం కూడా. ఎంతోమంది దిగ్గజాలు లాంటి రచయితల కాలమ్స్, తెలుగులో తర్జుమా చేసాను. అదంతా నాలో ఇంకిపోయింది అనుకుంటా. ఒక పాత హిందీ సామెత చెప్పినట్టు నీ తల ఎంత బరువుగా ఉంటే, నీ చెయ్యి అంత సులువుగా కదులుతుంది. ఇది కూడా అంతే అనుకుంటా.
జర్నలిస్టుగా మీ జీవితంలో బెస్ట్ టైమ్స్ ఏంటీ?
చాలాసార్లు జర్నలిస్టు జీవితంలో వరస్ట్ టైమ్స్ ఆర్ ద బెస్ట్ టైమ్స్. అంటే, కారంచేడు, చుండూరు లాంటి దారుణమైన ఘటనలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను. వాటిని వార్తలుగా రాసాను. కానీ అవి ఎంత దారుణమైన సంఘటనలో మనకు తెలుసు కదా!. అలాగే ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు వాటిని రిపోర్ట్ చెయ్యడం జర్నలిస్టుల జీవితాలలో బెస్ట్ టైమ్స్ అవుతాయి. కానీ నిజంగా అవి వరస్ట్ టైమ్స్ కదా?

జర్నలిజంలో మీరు అభిమానించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ చాలా పెద్దది. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు గురించి చెప్తాను, ఒకరు దిలీప్ బాబ్. ఇందిరాగాంధీ జమానాలో బాగా పేరున్న జర్నలిస్టు. ఒకసారి ఆమె బిహార్ ఎలక్షన్ కాంపెయిన్ కి వెళ్తూ దిలీప్‌ని తనతో పాటూ రమ్మని పిలిచింది. అతను మరుసటి రోజు వెళ్ళేసరికి ఆమె సూట్ కేసులో రెండు చీరలూ, ఒక focus light లైట్ పెట్టుకుని బయల్దేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అరగంటకో బహిరంగ సభ అటెండ్ అవుతూ 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కార్లో వెళ్తూనే ఉన్నారు. చూస్తుండగానే చీకటి పడిపోయింది, అయినా జనాలు ఆమెని చూడ్డానికి రోడ్డుకి రెండువైపులా బారులు తీరి ఉన్నారు. అప్పుడు ఆమె సూటు కేసులో పెట్టుకొని వచ్చిన focus light తీసి, ఆన్ చేసి వొళ్ళో పెట్టుకుందట. ఇక అప్పుడు జనాలందరూ ఆమెని చూసి దండాలు పెడుతుంటే, ఆమెతో పాటూ ఉన్న దిలీప్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు. అప్పటికి గానీ తెలీలేదనికి ఆమె ఆ బ్యాటరీ లైట్ ఎందుకు తెస్తుందో! జనాలు ఆమె దర్శనం చేసుకుని ఓట్లు గుద్ది పడేశారు.
మరి రెండో వ్యక్తి?
రవీందర్ రెడ్డి అనీ ఒక సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ఉన్నారు. బాబ్రీ మసీదు కూల్చేస్తున్నప్పుడు అతను అక్కడికి వెళ్ళి ఆ విధ్వంసం అంతా ఫోటోలు తీస్తుంటే RSS వాళ్ళు పట్టుకుని కొట్టబోయారంట, ఈయన దొరక్కుండా పారిపోతుంటే వాళ్ళు వెంటపడ్డారు, కాస్త దూరం పరిగెత్తాక దొరికిపోయాడు. వాళ్ళు ఈయన్ని మరీ ఎక్కువ కొట్టకుండా కెమెరా లాక్కుని వెళ్ళిపోయారు. అయితే ఆ కెమెరా ఖాళీది. అందులో ఫిల్మ్‌ని ముందే తీసేసి తనతో పాటూ వచ్చిన మరో స్నేహితుడి వైపు విసిరేసి పరిగెత్తాడు. ఆ తర్వాత ఆ ఫోటోలని Time magazine కి పంపిస్తే, ఆ ఫోటోలతో కవర్ స్టోరీ వచ్చింది, బాబ్రీ మసీదు వెనక ఉంటే ముందు ఒక సన్యాసి చేతులు చాచి గట్టిగా అరుస్తున్న ఫోటో కవర్ పేజ్ గా వేశారు.
ఇలాంటి మనుషులూ, స్టోరీలు చాలా ఉన్నాయి. మా అన్నయ్య మోహన్ అందరికీ ఆర్టిస్టు గానే తెలుసు కానీ తను సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. ప్రపంచ రాజకీయాల మీద తనకున్న అవగాహన చాలా గొప్పది, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, వెస్ట్ ఏషియా దేశాల గురించి తను చాలా విషయాలు చెప్పేవాడు. కొన్ని ఆర్టికల్స్ కూడా రాశాడు. ఇవన్నీ వినటం, తనతో డిస్కస్ చెయ్యడం ఓ గొప్ప experience.
మీ ఈ ఆత్మకథాత్మక కథనాలని చదివి మీ మిత్రులూ అభిమానులూ మీరు ఒక ఫిక్షనల్ కథో, నవలో రాస్తే చూడాలనుకుంటున్నారు, వాళ్ళలో నేను కూడా ఉన్నాను. దానికేమైనా అవకాశం ఉందా?
ఉంది. అయితే ఎప్పుడో చెప్పలేను. కొన్ని ఐడియాలు ఉన్నాయి కానీ వాటిని ఇప్పుడు రాయలేను. చాలామంది hurt అవుతారు. ఒక triangle love story రాసే ఆలోచన ఉంది, కానీ వెంటనే రాయలేను. Vagabonds of Chintal Basti అనే anthology series కూడా రాసే plan ఉంది. కానీ ఎప్పుడు రాస్తానో తెలీదు.
మీరు చేసే ఆ రచన తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప contribution అవుతుందని మీరు అనుకోవట్లేదా?
అనుకోవట్లేదు.
ముగింపు : thank you so much sir. మీ అభిమానులమైన మా కోరిక ఫలించి మీరు ఒక fictional story based on true events తొందర్లోనే రాయాలని కోరుకుంటున్నాం.
*








నైస్ ఇంటర్వ్యూ.
ప్రకాష్ గారు రాయాలనుకుంటున్న పుస్తకాలు త్వరగా రాయాలని డిమాండింగ్..
బాగుంది పెకాసం గోరు
మీ ఇంటర్వ్యూ
ఆత్మగీతమే !
ఆయన వాక్యం అనితర సాధ్యం
మంచి ప్రయత్నం మీ ఇంటర్వ్యూ
ఒక triangle love story రాసే ఆలోచన ఉంది, కానీ వెంటనే రాయలేను. Vagabonds of Chintal Basti అనే anthology series కూడా రాసే plan ఉంది. కానీ ఎప్పుడు రాస్తానో తెలీదు…..
నీ ఇరవైల్లో నువ్వు కమ్యూనిస్టువి కాకపోతే నీ యవ్వనం వృధా, నీ వృద్ధాప్యంలో నువ్వు ఇంకా కమ్యూనిస్టుగా ఉంటే నీ అనుభవం వృధా అని. ఆ వయసులో నేను, నాలాంటి ఎంతోమంది స్వర్గం అంటే రష్యాలోనే ఉందని కలగన్నాం. ఆ కల మా కళ్ళముందే ముక్కలు అవడం చూసి బాధపడ్డాం.
ఈ రచనల కోసం ఎదురు చూస్తుంటా!
ఒక triangle love story రాసే ఆలోచన ఉంది, కానీ వెంటనే రాయలేను. Vagabonds of Chintal Basti అనే anthology series కూడా రాసే plan ఉంది.
ఏదో అద్భుతమైన అక్షరాల ఉల్క ఆకాశంలో ఆగిపోయినట్టనిపించింది ఈ ఇంటర్వ్యూ చదివాక! ప్రసాద్ గారు, ప్రకాష్ గారు – ఇద్దరూ అన్యాయం చేశారు! మా పతంజలి గారు సరదాగా ‘ఈ మాత్రం మాకూ తెలుసులేవోయ్ ‘ అంటుండేవారు సన్నిహితులతో! అఫ్కోర్స్ అనరు! అలా ఓ లుక్కిస్తారు! దినపత్రిక సైజులో పూర్తి పేజీ కావాలని అభిమాన పాఠకుల డిమాండ్!💐👏👏👏
త్వరగా రాసేయండి ప్రకాష్ గారూ…
తాడి ప్రకాష్ గారినుంచి సమాచారాన్ని పిండుకోవడం అంటే ఇంతేనా. సినిమా మధ్యలో రీల్ ఆగిపోయినట్లు, పుస్తకం పేజీ పుటుక్కున తెగిపోయినట్లు.. మంచిపాట సగంలోనే నిలిచిపోయినట్లు ఏదేదోగా ఉంది. ఈ మాత్రం సంబడానికి ఆయనతో ఇంటర్వ్యూ ఎందుకు..?
వాళ్ల సోదరుడు మోహన్ గురించి తాను చెప్పిన రెండు మాటలు మంత్రవాక్యాల్లాంటివి. కార్టూనిస్టు మోహన్‌గా కంటే రచయిత మోహన్‌గా ఆయనంటే నాకు వల్లమాలిన అభిమానం. తక్కువ రాసి పుటుక్కుమన్నట్లుంది కానీ పాతికేళ్లకు ముందు మోహన్ రాసి ప్రచురించిన రెండు అద్భుత కథనాలు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు.
సుత్తీ కొడవలి పట్టుకున్న సోవియట్ కార్మికుడి బ్లోఅప్ చిత్రం చూస్తూ యావత్ ప్రపంచమే మ్రాన్పడి పోయిన తీరుపై, బోల్షెవిక్ శిల్పకళ గొప్పతనం గురించి అతి గొప్ప కథనం ఆయన రాశారు. ఇది జ్యోతిలోనో లేదా వార్తలోనో వచ్చిందనుకుంటాను టన్నుల కొద్ది స్టీల్‌ని పోతపోసి రూపొందించిన ఆ ఉక్కు కార్మికుడి విగ్రహాన్ని విదేశాల్లో ప్రదర్శించినప్పుడు తలలు ఆకాశానికెత్తి చూస్తున్నవారు కన్నీళ్లు కారుస్తూ సెల్యూట్ చేశారట. ఈ కథనాన్ని నభూతో న భవిష్యత్ అన్నట్లుగా రాసిన మోహన్ చిత్రకారుడి కన్నా రచయితగా శిఖర స్థాయిని చేరుకున్నాడనిపించింది నాకు.
మరోటి.. ప్రపంచ సరకుల కార్ఖానాగా చైనా సాధించిన అపూర్వ విజయం గురించి పాతికేళ్లకు ముందే ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీలో అనుకుంటాను.. మోహన్ గారు రాసిన మరో మహాద్భుతమైన వ్యాసం. ఈ రెండు వ్యాసాల శీర్షికల పేర్లను నేను మర్చిపోయాను కానీ మరోసారి వాటిని సోషల్ మీడియా పాఠకులకు షేర్ చేస్తే దివ్యానుభూతి కలగక తప్పదు ఎవరికైనా. చిత్రకారుడిగా మాత్రమే ప్రపంచానికి పరిచయమై రచయితగా దాగి ఉండిపోయిన మోహన్ గారి రచనలపై పుస్తకం కూడా ఈ మద్యే ప్రింట్ అయిందట. కానీ ఆ కాపీ నేను పొందలేకపోయాను. ఇప్పుడు ప్రింట్ కాపీ దొరకకపోవచ్చు. కనీసం పీడీఎఫ్ కాపీ అయినా దొరికితే కోల్పోయిన పెన్నిధి దొరికినట్లవుతుంది కదా.
Vagabonds of Chintal Basti అనే anthology series కూడా రాసే plan ఉందంటున్నారు. మేం కూడా అదే చింతల బస్తీలో ఉన్నామండి (ఖైరతాబాద్). దీన్ని రాసి పూర్తి చేసేంతవరకు మధ్యలో దాటుకోవద్దు మీరు..
తాడి ప్రకాష్ గారిని సారంగలో ఇంటర్వ్యూ చేసిన ప్రసాద్ సూరి గారికి, ఈ ఇంటర్వ్యూ ద్వారా మోహన్‌ని మరోసారి తల్చుకునే అవకాశం ఇచ్చిన తాడి ప్రకాష్ గారికి ధన్యవాదాలూ.. కృతజ్ఞతలూనూ…
రాజశేఖర
73964 94557
ఇంటర్వ్యూ మొత్తం చదివించేలా ఉంది. రాజశేఖర్ సర్ ఈ లింక్ పంపడం నిజంగా థ్యాంక్యూ సో మచ్ సర్. ఇంటర్వ్యూ లా అనిపించలేదు. కథ చదువుతున్నట్టుగా ఉంది.
సూరి, మీరు చేసిన తాడి ప్రకాష్ గారి ఇంటర్వ్యూ చదివించిందీ… కానీ అది ప్రకాష్ గారి ఆర్టికల్స్‌లా లోపలి కథలు, జీవితంలోని మలుపులు, అసౌకర్యం కలిగించే ప్రశ్నలు తడిమే ప్రయత్నం మాత్రం చేయలేదు. అంతా చాలా మర్యాదగా, మెత్తగా సాగిపోయింది. కొంచెం కూడా “చీజీ” విషయాల జోలికి వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడినట్టు అనిపించింది.
ఇది ఆయన మీద మీకున్న అవ్యాజమైన ప్రేమ అనుకోవాలా… లేక మిమ్మల్ని ఇంతగా ప్రమోట్ చేసిన వ్యక్తిపట్ల కృతజ్ఞతను ఇంత వినయంగా వ్యక్తం చేసినట్టa?
ఒకింత కవితా స్పర్శా, కొండొకచో అతిశయోక్తీ ప్రకాష్ గారి వచనానికి అలంకారాలూ, లక్షణాలూ. ఆసక్తిని పెంచే పఠనీయత… ఆయన తన రచనలకద్దే పరిమళం!
ఇంటర్ వ్యూ మొత్తమ్మీద పర్లేదు. చివరి ప్రశ్న బాగా లేదు. దానికి సమాధానంగా- ‘అనుకోవట్లేదు’ అంటూ ప్రకాష్ గారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం భలే ఉంది.
పత్రికా రంగం లో మీడియాలో వామపక్ష వాదులు ఎంత బలంగా పాతుకుపోయారో చూస్తే విస్మయం కలుగుతుంది. వారు చెప్పిందే సత్యం.
రెండవ అభిప్రాయానికి దాదాపుగా అవకాశం ఉండదు.
NYT , BBC వంటి అంతర్జాతీయ మీడియా నుంచి భారతీయ పత్రికల వరకు ఇప్పటికీ అదే భావజాలం కొనసాగుతోంది.
Twitter, Facebook, Insta , Wikipedia, … అన్నింటిలో అదే narrative ఉంటుంది. ఎలన్ మస్క్ పుణ్యమా అని X గా మారిన ట్విట్టర్ కొంత మారింది.