జీవితానుభవానికి కథే దగ్గరి దారి!

నిజం చెప్పాలంటే కొన్ని కథలకు జబ్బు పడినట్టు అయిపోతాను. ‘డాడీ కళ్ళు లాగేసాయి’ అని నన్ను గమనించిన మా అబ్బాయి చెపుతూ వుంటాడు. మామూలు కథలు రాయడం సులువు. ఈ కథలు కష్టమే.

జరా పొట్టి పేరుతో యివ్వాళ మనం ఆత్మీయంగా పిలుచుకునే బమ్మిడి జగదీశ్వరావు పేరు చెప్పగానే రెక్కల గూడు, పిండొడిం
దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టి తీగలు, హింసపాదు వంటి కథా సంపుటాలు గుర్తుకు వస్తాయి. అయితే గత పది పన్నెండేళ్ళుగా ప్రింట్ డిజిటల్ పత్రికల్లో శీర్షికల రూపంలోరాసిన/రాస్తోన్న కథలు విలక్షణమైనవి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, ‘సారంగ’లో ‘మహారాజశ్రీ’, కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’, ‘బుర్ర తిరుగుడు కథలు’, ‘తెలంగాణా డాట్ ఇన్’లో ‘కథేంటంటే…’, మనం ఆదివారంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే…’, కొలిమిలో ‘కాదేది కథకనర్హం’ (బొమ్మకు కథ, వార్తకు కథ, పురాకథకు కథ, ఎఫ్బీ/వాట్సప్ పోస్టుకు కథ), ప్రజాతంత్ర సాహిత్యపేజీ శోభలో ‘మెరుపు తీగలు’, వసంతమేఘంలో ‘ఎడిటర్స్ డస్ట్‌బిన్ స్టోరీస్’ ద్వారా బజరా నిర్వహించిన శీర్షికలు ఆధునిక కథా రచనలో అనితరమైన వైవిధ్యం ప్రదర్శించాయి.

మాతృకలో వచ్చిన కతలు వెతలు ‘రణస్థలి’, ‘మనువాచకం’ యింతకు ముందే వెలువడ్డాయి. గుంటూరులో ఈ నెల 23, 24 తేదీల్లో జరుగుతోన్న ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) తొమ్మిదో మహాసభల్లో మరో రెండు సంపుటాలు ‘ఈతిహాసము’, ‘లోకాయణము’ వెలువడుతున్నాయి. ఆ సందర్భంగా రచయిత బమ్మిడి జగదీశ్వరావుతో ఎ. కె. ప్రభాకర్ చేసిన సంభాషణ.

 

ఎలా వున్నారు బజరా?

  • నమస్తే, ‘ఎలా వున్నారు?’ చాలా చిన్న ప్రశ్న. జవాబు చెప్పడం కష్టం. ఎలా వున్నానో నాక్కూడా తెలీదు. మీరయినా నేనయినా. ఎలా వుండాలో అలా యేదీ లేదు. మనం కూడా. (అలసిపోయి వెలసిపోయిన వో నవ్వుతో)

నేను మీ రచనాభిమానిని.

  • (సిగ్గుతో తలదించుకున్నారు)

మీతో యీ సంభాషణ…

  • ఎవరూ వినడం లేదు కదా? (పెద్ద నవ్వు)

సంభాషణకి వాతావరణం లేకుంటే కాసేపు కొన్ని కబుర్లు కలబోసుకుందాం… సరేనా?

  • మన జేబుల్లోని ఫోను వింటుంది, హోమ్ శాఖ అనుమతి వుందా? ఏ యిద్దరు మాట్లాడుకున్నా విధిగా ప్రభుత్వానికి తెలియజేయాలి – అని చట్టం త్వరలో రావచ్చు. కాబట్టి యిప్పుడే మాట్లాడేసుకుందాం…

మన యీ సంభాషణ చానాళ్ళ కిందే జరగాల్సి వుండింది.

  • ఔను, అన్నీ వాయిదాలే, సిజేరియన్ టు ఆక్సిజన్ తీసేసేదాక… వాయిదాని వాయిదా వేసి మాట్లాడుకుందాం…

సమకాలీన సామాజిక రాజకీయ సంఘటనల్ని నేపథ్యం చేసుకొని మీరు ‘మాతృక’ మాస పత్రికలో రాస్తున్న ‘కతలు వెతలు’ శీర్షిక 11 సంవత్సరాలకు పైగా  నడుస్తోంది.

  • ఊఁ… నవంబరు 2014లో POW వారి అధికార మాసపత్రిక ‘మాతృక’ పునః ప్రారంభమైంది. మూడు సంచికల తర్వాత ఆ పత్రిక బాధ్యురాలు రమాసుందరిగారు రెగ్యులర్‌గా యేదైనా రాయమని కోరారు. మనం యేదడిగినా కథే కదా రాస్తాం (చిన్న నవ్వు) అలా ఫిబ్రవరి 2015 నుండి ‘కతలు వెతలు’ శీర్షిక మొదలై నెలకో సంచికకో కథగా… ఇప్పటిదాకా నాన్ స్టాప్ నూటా యిరవైకి పైగా కథలు…

ఒక రాజకీయ కథా శీర్షిక యిన్ని సంవత్సరాలు నిరాఘాటంగా రావడం చాలా అరుదు. కాదు, తెలుగునాట దాదాపు లేదు, నాకు తెలిసి. ఆ ప్రయాణం గురించి రెండు మాటలు చెప్పండి.

  • మాతృక యిప్పటికి నూటా ముప్పై సంచికలు వచ్చాయి. చెప్పాగా, నే మొదలుపెట్టక ముందు వచ్చిన మూడు సంచికలు పక్కన పెడితే, నే రాయడం ఆరంభించాక వో ఐదు సంచికలు మిస్సయివుంటాను. అంటే మా అమ్మ చనిపోయినప్పుడు, నాన్న తీవ్ర అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయినప్పుడు, నాన్న చనిపోయినప్పుడు, వోసారి కథ రాయబోతే అది నవలగా మారిపోతూ వుండడం గ్రహించి ఆపేసినప్పుడు- మళ్ళీ మరో కథ రాయడానికి సమయం చిక్కక, యిల్లు మారినప్పుడూ యిలా. ఓ సారి బైక్ మీంచి పడి చేతికి సిమెంటు కట్టు వేశారు. ఆ నెల వొంటి చేత్తో టైపు చేసి కథ పంపాను. మాతృకకు కథలు పంపే క్రమంలో సిస్టమ్ మీద రాయడం నేర్చుకున్నాను.

‘కరెంట్ ఇష్యూస్ మీద కథలు రాయండి, అవి మా మహిళా సంఘం కేడర్‌కు, సామాన్యులకు అర్థం అయ్యేలా వుండాలి’ అని రమాసుందరిగారు అన్నారు. అందువల్ల జరుగుతున్న పరిణామాల్ని యెప్పటికప్పుడు అర్థం చేసుకోవడం అవగాహన పెంచుకోవడం అనివార్యం అయ్యింది. అలా అప్ డేట్ కావడానికి మాతృక సహకరించింది.

సామాన్యులకు అర్థం చేయిస్తూ వొక శీర్షికకు సాహిత్యస్థాయిని సాధించడంలో యెంతో కొంత వైరుధ్యం వుంటుంది కదా? దీనిని యెలా అధిగమించారు?

  • పాఠకులైనా ప్రజలైనా వొకే చైతన్యస్థాయిలో వుండరు. భిన్న అంతస్తులలో వుంటారు. ఎవరికి అందాల్సింది వారికి అందుతుంది. ఎవరికి బోధపడాల్సింది వారికి బోధపడుతుంది. సబ్ టెక్స్ట్ కొందరికి అందుతుంది. కొందరికి అందదు. ఒక మాట వెనుక ధ్వనిని కొందరు పట్టుకుంటారు. మరికొందరు మాటను మాటగానే తీసుకుంటారు. పసిగట్టేవాళ్ళూ పసిగట్టనివాళ్ళూ వున్నా అందర్నీ పాతాళభైరవిలో మంత్రగాడు తనవెంట తీసుకుపోయినట్టు తీసుకుపోవాలి. అయితే యిక్కడ అదనంగా కార్యకర్తలు పాఠకులుగా మారారు. అది కరెంట్ టాపిక్స్ మీద రాయడంవల్ల వాళ్ళు దానిలోకి సులువుగా ఇన్వాల్వ్ కాగలిగారు. అక్కడి నుండి కథ నడిపించడం యిక మన బాధ్యత.

అయితే సమకాలీన సామాజిక అంశాల మీద రాయడం బలమా బలహీనతా?

  • రెండూనూ. ఎందుకంటే సులువుగా యెలా ఇన్వాల్వ్ అవుతారో అలాగే అది తెలిసిన విషయం కావడం వల్ల ఆసక్తిపోయే వదిలేసే అవకాశమూ వుంది. అంచేత దాన్ని కొత్తగా చెప్పాలి. ఆసక్తిగా చెప్పాలి. ప్రభుత్వాలూ మీడియా సెట్ చేసిన మైండ్ సెట్‌లోంచి ముందు లాగి బైటపడేయాలి. మనం కొత్త ఆలోచనలు అందివ్వాల్సిన అవసరం లేదు. అందుకు పురికొల్పితే చాలు. కథలో రచయితే అన్నీ చెప్పేయడం మాట్లాడడం చేవలేని సృజనవుతుంది. ఇంకా చెప్పాలంటే పాఠకుడిమీద గౌరవం లేకపోవడమే!

సరే, మరి అన్ని సమకాలీన సామాజిక అంశాల మీద రాయగలిగారా?

  • లేదు, యింకా అనేక వెబ్ మేగ్జైన్స్‌లోకి కాలమ్స్ పెట్టి విస్తరించి కథలు రాసినా రాయకుండా మిగిలిపోయినవి, రాయాల్సినవి చాలానే వుండిపోయాయి. చాలా అంశాలు పోటీపడి వుక్కిరిబిక్కిరి చేస్తాయి. అప్పటి సమయ సందర్భాలు మానసిక స్థితి సమాయత్తం చేసినది కథగా రూపం తీసుకుంటుంది. నాది చాలా యిరుకైన జీవితం, అన్ని రకాలుగా. సమయం చిక్కలేదు. అన్నింటినీ కథల్లోకి తీసుకురాలేకపోయాను. వాయిదా పడిపోతున్నాను. మాతృకవల్ల చిక్కిన స్పేస్ యుటిలైజ్ చేసుకోకపోతే అర్థం వుండదని చాలావరకు ప్రయత్నించాను.

మాతృకలో వచ్చిన కథల్ని వరుసగా ‘రణస్థలి’, ‘మనువాచకం’ పేర్లతో రెండు పుస్తకాలు యింతకు ముందే తీసుకొచ్చారు. గుంటూరులో ఈ నెల 23, 24 తేదీల్లో  జరగబోయే ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యూ) తొమ్మిదో  మహాసభల్లో మరో రెండు సంపుటాలు ‘ఈతిహాసము’, ‘లోకాయణము’ వెలువడుతున్నాయి.  అందుకు ముందుగా అభినందనలు. మీ కథా రచనా ప్రస్థానంలో కతలు వెతలకి ప్రత్యేక స్థానం వుంది.

  • థాంక్యూ… మాతృక లేకుండా యీ కథలన్నీ వూహించలేను. రాసేవాడ్నే, కాని యిన్ని అయితే రాసేవాణ్ణి కాదు.

సమకాలీన రాజకీయ అంశాలపై వ్యాఖ్యానమో విశ్లేషణో చేయాలంటే వొక వ్యాస రూపంలో చేయొచ్చు;  ఇలా జరుగుతున్న ఘటనలకు సృజనాత్మక రూపం యివ్వటంవల్ల అందులో కళాత్మక విలువలకు అవకాశం వుండదనీ వాటిని కథలుగానే పరిగణించలేమనీ వొక వాదన వుంది.

  • నిజమే, కాని జీవితానుభవానికి కథే దగ్గరి దారి. అనుభవానికి యెదురైన అంశాన్ని  కార్యకారణ సంబంధాలతో చెప్పగలిగితే సృజనాత్మక రూపం యివ్వగలిగితే, ఆ కథలో యేకకాలంలో- వైయక్తిక సామూహిక స్వరాలూ వుంటూనే, కళ ప్రజల కోసంగానూ కళ కళ కోసంగానూ వుంటుంది. కళాత్మక విలువలతోనే సాహిత్యం మనగలుగుతుంది. కళాత్మకతను సృజనలో భాగం చెయ్యడం అనేదే కథకుడి పని. ఆ పనిని యెన్ని విధాలుగా చెయ్యాలో చాలా నలుగుతాను. కథకి అవసరమైన స్థలాలను వొక్క చోటుకి చేరుస్తాను. కథకి అవసరమైన కాలాలను- గత వర్తమాన భవిష్యత్ కాలాలను కలిపేస్తాను. దానివల్ల వొక మేజిక్ జరుగుతుంది. అందువల్లే మూడు చక్రాల కుర్చీ నుంచి అక్షింతలు నుంచి పశు పక్ష్యాదుల దాక అన్నిటినీ ఆశ్రయిస్తాను, మనుషుల్నే కాదు. జానపద కథా కళా ఆలోచనా క్రమం అందుకు యెంతో సహకరిస్తుంది. అలా చెయ్యకపోతే నిషేధిత అంశంగా భావించే ‘రాజకీయాలు’ అవి మనమీద యెంత ప్రభావం చూపినప్పటికీ- నిత్య జీవితంలో తక్షణ స్పందనలకి పరిమితం చేసినప్పటికీ- అనాసక్తిగా వుండే అంశాలను ఆసక్తిగా మలచకపోతే వుత్కంఠ రేపకపోతే కథ పాఠకులను  కాలరు పట్టుకు లాక్కువెళ్ళకపోతే కథ చదవక ముందు చదివాక వొకేలా వుండిపోతే కథా ప్రయోజనాన్ని కాపాడుకోలేం…

ఒక కంటెంపరరీ ఇష్యూని కథగా యెలా మలుస్తారో వుదాహరణలతో చెప్పండి?

  • ఊఁ… రాసిన కథ కన్నా, రాయబోయే కథ చెపుతా, ఆసక్తిగా వుండడానికి. అర్థం కావడానికి. అది యెలా ఎవాల్వ్ అవుతుందో రూపుదిద్దుకుంటుందో చూద్దాం. ఇప్పుడు పెను సంచలనంగా వున్న ఘటననే తీసుకుందాం. కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ మైనర్ అమ్మాయికి మద్యం పట్టించి లైంగిక వేధింపులు యింకా అఘాయిత్యం చేశాడన్న అభియోగాలతో అతని మీద పోక్సో కేసు నమోదు అయింది. జరుగుతున్న పరిణామాలు మీరు అంటే పాఠకులు యెరిగినవే. ఇక్కడ కొత్తగా చెప్పడానికి యేముంటుంది? రాజ్యం నడిపే పోలీసు న్యాయవ్యవస్థలు తమని తాము నిస్సిగ్గుగా బయటపెట్టుకుంటుంటే వొక కథ అంతకన్నా బలంగా బయటపెట్టేదేమిటి? ఫోటో తియ్యడం కాదు కదా సృజనాత్మక పని? సామాన్యులకి అర్థం కావాలి, అదే సమయంలో సాహిత్య ప్రయోజనం లోతుగానూ తాత్వికంగానూ జరగాలి.

నిన్నటి దిశ, నేటి మైనరు బాలిక యిద్దరూ తారస పడతారు. వ్యక్తి చేసే అత్యాచారం గురించి వొకరు చెప్తే వ్యవస్థలు చేసే అత్యాచారం మరొకరు చెప్తారు. ఎన్కౌంటర్ అయిన ఆ నలుగురు కుర్రాళ్ళూ మంత్రి కొడుకు భగీరథ యెదురవుతారు. చెయ్యని నేరానికి ఎన్కౌంటర్ అయినందుకు వీరు, రేపు పొరపాటున జైలుకెళ్ళినా భవిష్యత్తులో తాను తన తండ్రిలాగే మినిస్టరు అవుతానని యిదే ప్రజలతో జేజేలు పలికించుకుంటానని జై శ్రీరామ్ అని వారు. వారసత్వ రాజకీయాలను ఆహ్వానించడానికి మేం సిద్ధంగా వున్నాం, ప్రాణాలు అర్పించమంటారా అని దూకుడుగా ముందుకొచ్చే ప్రజలు.  ఎప్పుడైనా పోక్సో కేసు విషయంలో మొదట అరెస్టు తరువాత దర్యాప్తు, కాని యిప్పుడు మొదట దర్యాప్తు తరువాత అరెస్టయినా యేదయినా, యీ క్రమంలో జడ్జుల దుస్తుల్లోకి పోలీసులూ పోలీసుల దుస్తుల్లోకి జడ్జులూ మారిపోతారు. రెండు రాజ్యాంగాలు వొకదానికి వొకటి యెదురవుతాయి… యిలా యిప్పటికి ఆలోచనలు, రాసేటప్పుడు కథ నన్ను నడిపిస్తుంది. ఇది వొక వ్యక్తికి జరిగిన కథగా కాక సమూహానికి అంటే అందరి అనుభవంలోకి యింకిపోతుంది. ఈ కేసు విషయం వచ్చేసరికి దర్యాప్తు అధికారిగా మహిళని నియమించడం… జడ్జిగా కూడా మహిళ వుండడం… లైంగిక వేధింపులకు గురైంది కూడా మైనరు మహిళే కావడం… యిటు మీడియా అటు పాలకులూ ప్రతిపక్షాలూ అన్నీ మాత్రం పురుషస్వామ్య దృష్టితో మైనరు బాలికమీద చేసే వ్యక్తిత్వ హననం ఆ బాలిక మీదే కాదు, మొత్తం మహిళల మీదే యెక్కుపెట్టడం- యీ యెరుక అంతా కథలో సబ్ టెక్స్ట్‌గా వుండి యెలా వస్తుందో నాక్కూడా తెలీదు.

సమాకాలిన అంశాలు కథలుగా మలిచేటప్పుడు ఆ సమస్య పూర్తికాకపోవచ్చు. కొనసాగవచ్చు. మరో రూపమూ తీసుకోవచ్చు. అంచేత వొక కథ ముగింపు మరో కథకి ప్రారంభం కూడా.

కళ్ళ ముందు చోటు చేసుకుంటున్న అనేక వెతలను యిలా  కతలుగా రచించడంలో అసలు మీ ఆశయం యేంటి?

  • మన కళ్ళకు కనిపించేది వాస్తవం. వాస్తవం వెనుక సత్యం వుంటుంది. రచయిత పాఠకుల చూపుకు దృష్టిని యివ్వగలగాలి. చూపు భౌతికం. దృష్టి ఆంతరికం. అప్పుడు కార్యకారణ సంబంధాలతో యీ వ్యవస్థ బోధపడాలి. కథ పూర్తి చేసేసరికి పాఠకుల ఆలోచనల్లో అగ్గి రేగాలి. మునుపు లేని తెలివిడి యేదో కనీసం జతవ్వాలి. అది అలా అలా వాళ్ళలోకి యింకి యెప్పటికో యేదో వొక రూపం తీసుకోకుండా వుండదు. ఇది నిశ్శబ్దంగా నిర్మించే పని.

గడిచిన యీ పది పన్నెండేళ్ళ సామాజిక చలనమే మీ కథలకు వస్తువైంది. సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక అస్తవ్యస్తతలపై అవకతవకలపై దుర్మార్గాలపై మీ కోపం యీ కథల్లో బలంగా వ్యక్తమైంది. భిన్న వుద్వేగాల్ని  ప్రకటించడానికి మీరు యెన్నో రకాల రూప వైవిధ్యాల్ని ప్రదర్శించారు. కొన్నిసార్లు హాస్యం, మరికొన్నిసార్లు వ్యంగ్యం, యింకొన్నిసార్లు అధిక్షేపం, అలిగరీ యీ కథలకు మాధ్యమమైంది. అవన్నీ యీ వెతల వెనుక వున్న కారణాలని అన్వేషించడానికి పురికొల్పేవే. మీరన్నట్టు చైతన్యం నింపడానికి నిర్మించుకునే పరికరాలే. అయితే వాటిని అలా చూడటానికి మీకున్న  మీ ప్రాపంచిక దృక్పథం యేంటి? అది మీకు యెలా తోడ్పడింది? 

  • ప్రకృతి మనుషుల్నే కాదు, సమస్త జీవకోటిని సమంగా చూస్తుంది. ప్రకృతిలోని మనిషి అదీ నాగరికుడైన మనిషి అనేక వ్యవస్థలు దాటొచ్చిన మనిషి మాత్రం సాటి మనిషిని మనిషిగా చూడలేడు. ఆకలి తీరిన జంతువు మళ్ళీ ఆకలివేసే వరకూ వేటాడదు. మనిషి జంతు స్థాయిని యెప్పటికీ అందుకోలేడేమో?! సమాజం యెప్పుడూ లేనంత యింకా చెప్పాలంటే రోజు రోజుకీ దుర్మార్గంగా బలహీనులకి చోటులేకుండా నిత్య హింసాత్మకంగా మారుతోంది. బహుశా యీ సామాజిక చలనమే నన్ను మళ్ళించి వుంటుంది. అన్ని పార్శ్వాల  నుండి అర్థం చేసుకోవడానికి అన్ని వాదాలని పనిముట్లు చేసుకొని సృజన అనే లక్ష్యం చేరుకుంటాను.

మనుషులు పుట్టరు, తయారుచేయబడతారు- అనుకుంటే, మన ఆలోచనల చట్రం కూడా ముందే అందుకు సిద్ధంగా వుంటుంది. అది యెలా ఆపరేట్ అవ్వాలో ముందే డిజైన్ చేసి వుంచడంవల్ల మనం అందులోనే గింగిరాలు తిరిగి కొట్టుకుంటూ వుంటాం. ఆ సర్కిల్‌ని దాటనివ్వకుండా యథాతథ స్థితిని కాపాడడం కోసం మన సనాతనం, మతం, కులం, విలువలు, సాంప్రదాయాలు… యివన్నీ పట్టి వుంచుతాయి. అవి చట్టాన్ని సహితం ప్రభావితం చేస్తాయి. కొత్త చట్టాలుగా రూపుదిద్దుకొని ప్రజల పగ్గాలు తమ చేతుల్లో వుండేలా ప్రభుత్వాలు పనిచేస్తాయి. అలాగే ప్రజల బలహీనతలను రెచ్చగొట్టి వాళ్ళని యేకంచేసి తమ పబ్బం గడుపుకోవడమే కాదు, తమ అధికారం యెప్పటికీ నిలిపి వుంచుకొనేందుకు అన్ని వ్యవస్థల్నీ నిర్వీర్యం చేస్తాయి. కాదన్న వాళ్ళని మందిలో కలవని వాళ్ళని నిఘాతో కేసులతో జైలుశిక్షలతో అదుపు చెయ్యడం సర్వసాధారణం అయిపోయింది.

ఇన్ని చేస్తున్న రాజ్యం పరోక్షంగా ఆలోచనాపరులైన బుద్ధజీవుల్ని రచయితల్ని యెవరినైనా వాళ్ళ ప్రాపంచిక దృక్పథం మరింత బలోపేతం అయ్యేలా చేస్తుంది.

మీ మెదడు కథలకు పెద్ద కార్ఖానా అనిపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో సోషల్ మీడియాలోనో నలుగురూ చదివి మర్చిపోయే యేదో వొక వార్తకి కథ కట్టారు. అక్కడ కనిపించిన కార్టూన్‌నో బొమ్మనో చూసి ఆ బొమ్మకి కథలు రాశారు. ఎఫ్బీలోనో వాట్సాప్ లోనో వైరల్ అయిన పోస్ట్ చుట్టూ కథలల్లారు. వాట్సాప్ పోస్ట్లు ఎఫ్బీ కామెంట్స్‌నే కథా శిల్పంగా యెంచుకున్నారు. అతి పెద్ద కథలు రాశారు. గల్పికలు రాశారు. అల్పికలు అల్లారు. బుల్పికలు అనే కొత్త ప్రయోగమూ చేశారు. వాట్సప్ కథలు (మనం సండే) రాశారు, మూడే వాక్యాలతో. కాదేదీ కథకనర్హం అని నిరూపించారు. పాత జానపద మౌఖిక కథల్ని పిల్లల కోసం పునర్లిఖించారు. వాటిని ఆధునిక సామాజిక అంశాలకు అన్వయిస్తూ పురా కథలకు కొత్తకథలు రూపొందించారు (కొలిమి). పురాణ గాథల మర్మాలు విప్పిచెప్పారు. ‘పురాణ పద బంధాలు’ తీసుకువచ్చారు. ప్రింట్ (ప్రజాతంత్ర: మెరుపు తీగలు) డిజిటల్ (సారంగ: మహారాజశ్రీ పేరిట లేఖా సాహిత్యం, ఇంకా కరోనా కహానీలు/‘విరసం డాట్ ఆర్గ్’లో ‘మెయిల్ బాక్స్’, ‘బుర్రతిరుగుడు కథలు’/ ‘వసంతమేఘం’లో ‘ఎడిటర్స్ డస్ట్‌బిన్ స్టోరీస్’) పత్రికల్లో  దేవుడి పేరున మతం పేరున కులం పేరున అమలయ్యే ఆధిపత్య రాజకీయాలన్నిటినీ విశ్లేషిస్తూ మీరు చెప్పని కథ లేదు. తడమని  బతుకు పొర లేదు. చూడని సామాజిక పార్శ్వం లేదు. ఇవన్నీ నెలలపాటు కొన్ని, సంవత్సరాల పాటు కొన్ని నడిచాయి. కానీ మాతృకలో అవిరామంగా పునరుక్తికి తావు లేకుండా జీవితంలో ఆటుపోట్లు యెదుర్కొంటూ కతలు వెతలు చెబుతూనే వున్నారు. అలసట వేసట లేని మీ యీ రచనా వ్యాసంగం వెనక వున్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి?

  • అశాంతి, ఆందోళన, ఆవేదన (పెద్దగా వూపిరి వదిలి)  వెరసి వూపిరాడని తనం! గుండె కాలుతున్నట్టు వుంటుంది. (రెండు క్షణాల నిశ్శబ్దం)

రచన నాకో ఔట్ లెట్. ప్రపంచం యెలా వుండాలో అలా లేదు. ఈ భూమి సకల జీవరాశులది. మెదడున్న మనిషిదే కాదు. మానవీయంగా వుండాల్సిన మనిషి అమానవీయంగా మారిపోయాడు. స్వార్థం మనుగడకు ఆలంబనగా వుండడం వరకూ అర్థం చేసుకోవచ్చు. స్వార్థమే సర్వస్వం అయినప్పుడు సర్వం వినాశనం కాక తప్పదు. మనిషి అంటే విడిగా కాదు. ఒకడు కాదు. సమూహమే మనిషి. ఒక తలకి పది తలలు తోడవడం, రెండు చేతులకి వేల చేతులు తోడవడం. విడివిడిగా వున్నట్టు కనపడినా విడివిడిగా చేస్తున్నట్టు తోచినా మనం విడివడి ప్రపంచాన్ని చూడగలిగితే వొక సామూహికమైన కార్యమేదో వుమ్మడిగా జరుగుతున్నట్టు తోస్తుంది నాకు. అలాంటి అద్భుత సృష్టిలో సృజనలో ప్రకృతిని మించిన విపత్తుగా ప్రభుత్వాలు తయారు కావడం… అది రోజురోజుకీ మనుషుల్ని కలుషితం చెయ్యడం దిగమింగుకోలేకపోతున్నాను. నాకు వేయి కళ్ళు కావాలి. వేయి చేతులు కావాలి. సహ రచయితలు వర్తమాన సమకాలీన అంశాల్ని కూడా స్వీకరిస్తే బాగుణ్ణు, నే రాయాల్సిన అంశాలు వేరేవి వాయిదా పడుతూ వున్నాయి.

నాకు తెలిసి వస్తుపరంగా రూపపరంగా తెలుగులో రావిశాస్త్రి, పతంజలి వంటి యే వొకరిద్దరు మాత్రమే యింత వైవిధ్యాన్ని చూపగలిగారు. కానీ వేగంలో విస్తృతిలో మీరు వాళ్ళని మించిపోయారు. మీరు చేసినన్ని  ప్రయోగాలు ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో వొకరు చేసినట్టు కనిపిస్తుంది. దేశ విభజన నేపథ్యంలో ఆయన రాసిన కథలు, విద్వేషం పునాదిగా మతవాద  ఫాసిస్టులు దేశాన్ని నిలువుగా చీల్చిన సందర్భంలో మీర్రాసిన కథలూ యీ పోలిక తప్పు కాదని నిరూపిస్తున్నాయి. మనుషుల్లో వెల్లివిరియాల్సిన మానవత్వం మాయమైపోతున్నందుకు యిద్దరిలోనూ కనిపించే వేదనలో సామ్యాలున్నాయి. వ్యంగ్యం ద్వారా అసంబద్ధ రాజకీయాల్ని విమర్శకు పెట్టడమే కాదు దానిని వొక తాత్విక స్థాయికి తీసుకెళ్లి పాఠకుల హృదయాల్ని జయించే కథన విద్యని యిద్దరూ సాధన చేశారనిపిస్తుంది. (దృక్పథపరంగానే కాదు;  సాహిత్యం జీవికని కల్పించని కారణంగా సినిమాకి కథలు సంభాషణలు కూర్చడంలో కూడా ఆయనకూ మీకూ పోలికలున్నాయి). ముఖ్యంగా స్త్రీ దృష్టికోణంతో మహిళల గొంతుక మాతృకలో రాస్తూన్న కతలు వెతలు నా ఆలోచనకు బలం చేకూర్చుతున్నాయి. అయితే మంటో లాగానే మీరు కూడా యీ కథలు రాసే క్రమంలో  రాజకీయ దృక్పథాల అభిప్రాయాల కారణంగా యితర భావజాలాలకు చెందినవారి నుంచి యేవైనా యిబ్బందులు యెదుర్కొన్నారా?

  • చేసేపని యేదైనా తీవ్రంగా చెయ్యాలని అనుకుంటాను. అలా చేసేటప్పుడు తప్పవు.

చాలామందికిలాగే బూతులు తిడుతూ మెసేజులు పెడతారు. పట్టించుకోను. వారి దగ్గర మన టైం వేస్ట్ చేసుకోకూడదు.

నేనెప్పుడూ దేవుడ్ని కించపరచను. పైగా దేవుళ్ళూ దెయ్యాలూ వుంటే యెంత బాగున్నో అనుకుంటాను. నాకు భక్తులంటే భయం. భగవంతుణ్ణి చూస్తే జాలి. దేవుణ్ణి తాము యెక్కిన సింహాసనానికి కాలికింద మెట్టుగా వాడుకోవడం చూస్తే, నోరు లేని దేవుడి పక్కన నిలబడాలని గట్టిగా అనిపిస్తుంది.

అయినా కథలు రాయడం మొదలు పెట్టిన తొలిరోజుల్లోనే కోటిన్నర పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. అంటే అప్పుడు వో అధికార పార్టీ ఎమ్మెల్యేమీద కథ రాశాను, యథాతథ ఘటనకు యథాతథ రూపం యిచ్చాను. పేరులో వొక్క అక్షరమే మార్చాను. మా అమ్మానాన్నలని అన్నయ్యని పిలిచి వార్నింగ్ యిచ్చారు. అప్పుడు నాకు పదహారేళ్ళు, చిన్నవాణ్ని. భయపడ్డాను. ఇంటివాళ్ళ హెచ్చరికతో తొమ్మిది నెలలు యింటికి అంటే మా వూరికి వెళ్ళలేకపోయాను. ఆ దినపత్రికవాళ్ళు నా పేరును బ్లాక్ లిస్టులో పెడుతున్నామని చెప్పారు. అలా నా కథలు వేయకపోవడం వల్ల మిగతా ఎంపీలూ బతికిపోయారు. నేనూ బతికిపోయాను. ఆ అనుభవాలు యెప్పుడో రాయాలి.

మరిప్పుడు? పేరు పెట్టి రాసినా పట్టించుకొనేవాళ్ళు లేరు. వాళ్ళదీ బరితెగింపు. బరితెగింపుతో మనమూ రాయొద్దూ?

ఆగండాగండి; వొక్క నిమిషం. పదహారేళ్లకే యథార్థ ఘటనలకు కథా రూపం యివ్వడం దాన్ని రాజకీయాంశాలకి ముడిపెట్టడం అందుకు బెదిరింపులకి గురికావడం… యింత వ్యవహారం నడిచిందా?!  రాజకీయ తాత్వికత నేపథ్యంగా కథలు రాయడం మీ యిటీవలి సాహిత్య వ్యాసంగం అనుకున్నాను. ‘అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’ అన్నట్టు  గురజాడ దగ్గర్నుంచి మీదాకా వుత్తరాంధ్ర రచయితలకే  యీ వ్యంగ్య రచనా  కళా నైపుణ్యం సొంతమా?  

  • ఇక్కడో మాట చెప్పుకోవాలి. మాది సాహిత్య వారసత్వం వున్న కుటుంబం కాదు. మా అమ్మ వారసత్వంలో మాత్రం జానపద కథలు పుష్కలంగా వున్నాయి. బియ్యమో బెల్లమో నూకో తెచ్చిన పొట్లాంగట్టిన పేపర్లని సాపు చేసి చదువుకొనే వాడిని. పుస్తకాల కోసం ఆబగా చూసేవాణ్ని. పుస్తకాల కోసం స్నేహం చేసేవాణ్ని. ఆ కథలు మా అమ్మకు వినిపించే క్రమంలో అన్నీ అందరూ చదివే కథలు కావని, యెవరికి వారు చదువుకోవాల్సినవీ వుంటాయని గ్రహించాను. ఓరోజు పేపరు చూస్తుంటే, సాహిత్య పేజీలో నా పేరు చూసి ఆశ్చర్యపోయాను. కాళీపట్నం రామారావు మాస్టారు తన యింటర్వ్యూలో మధురాంతకం నరేంద్ర, అట్టాడ అప్పలనాయుడు, నాపేరు, గంట్యాడ గౌరునాయుడు పేర్లు చెప్పారు. ఇప్పుడు బాగా కథలు రాస్తున్న వాళ్ళని. తర్వాత విశాఖపట్టణం బుల్లయ్య కాలేజీలో జరిగిన విరసం సభల్లో 90ల్లో తొలిసారిగా కాళీపట్నం మాస్టారికి యెదురుపడ్డాను. నా జేబుకున్న బ్యాడ్జిమీద పేరు చదివి వో పెద్దాయన నన్ను ఆపారు. ఆయనే కారాగారని అంతదాకా నాకు తెలీదు. ‘నువ్వేనయ్యా అని పేరు పెట్టి అని, ఇంకెంతో పెద్దవాళ్ళని అనుకున్నాను’ అన్నారు, యిరవైయేళ్ళ నన్ను చూసి. అది మొదలు సాహిత్యంలోనే కాదు, కష్టసుఖల్లోనూ నన్ను కాపుగాసారు. బొడ్డ కూర్మారావుగారి స్నేహంతో విరసంలో చేరాను. రచయితల సంఘం సభలకి పోలీసులు ముట్టడి యేమిటో అంతగా బోధపడలేదు. ఈ మాట చెప్పడానికి కారణం నాకు రాజకీయ చైతన్యం తొలి నుంచీ వుందని చెప్పడం తప్పవుతుందని. చెంప పండని కాలంలో అన్యాయమని అనిపించిన ప్రతిదాన్ని రాసేశాను. దాని పర్యవసానాలు తెలియవు. వయసు అనుభవం మీద పడ్డాక యథాతథంగా రాస్తే, ఆ కథ అక్కడివరకే పరిమితం అవుతుందని, అది అందరిదీ చెయ్యడంలోనే సృజనకు విలువ వుంటుందని తదనంతర కాలంలో గ్రహించాను.

కొన్ని నేలలకు కొన్ని ప్రత్యేకతలు వుంటాయి. మా ప్రాంత వ్యంగ్యం నాలోనూ అంటుకట్టకుండా వుంటుందా? (నవ్వు)

సాహిత్య వారసత్వం వున్న కుటుంబం కాదు అన్నారు, అమ్మ వారసత్వంలో జానపద కథన శిల్పాన్ని అందిపుచ్చుకున్నాను అన్నారు. బాగానే వుంది. కానీ యే జీవితానుభవాలు పాఠాలు అధ్యయనాలు స్థూలంగా సామాజిక చలనాల్ని  నిర్దిష్టంగా వర్తమాన మతవాద రాజకీయాల్ని యీ విధంగా అర్థం చేసుకోడానికి తోడ్పడ్డాయి?  

  • కొలిమిలో కాల్చుతున్నట్టు జీవితానుభవాలకి కొదవ లేదు. కాని అవన్నీ యిప్పుడు చెప్పలేను. అధ్యయనాలు అంటారా, తొలిరోజుల్లో కారాగారు యేమేమి చదవాలో సిలబస్ రాసి యిచ్చేవారు, దొరకని పుస్తకాలు కూడా యిచ్చేవారు. రచయితగా నాకొక దృక్పథాన్ని యిచ్చింది మాత్రం విరసం. పునాదితో కలిపి వుపరితలాన్ని చూడగలగడం నేర్చుకున్నది తొలిగా అక్కడే. మా అమ్మ పెంపకంలోని క్రమశిక్షణ సరే, రచయితకు వుండాల్సిన క్రమశిక్షణ అమ్మలా నేర్పింది విరసం. వ్యక్తులుగా నా మీద ప్రభావం వేసినవాళ్ళు చాలామందే వున్నారు. ఇప్పుడయితే విశాఖ (ప్రసాద)వర్మ, సౌదా లాంటి వాళ్ళు ఆలోచనలకు బలంగా పుటం పెట్టగలిగిన గురు మిత్రులు.

జీవిత అధ్యయనం, సిద్ధాంత అధ్యయనం, సాహిత్య అధ్యయనం… యివన్నీ సాహిత్య సృజనకు సహకరించాయి. అయితే పుష్కర కాలంగా పెచ్చుమీరిన మతతత్వం మన యిళ్ళలోకి చొరబడింది. ఇంకా చెప్పాలంటే మనలోకి చొరబడింది. మతవాద మనువాద రాజకీయాల్ని అర్థం చేసుకోక తప్పని పరిస్థితిని యేర్పరచింది. నా చుట్టూ వున్న చక్కని మనుషులు యిప్పుడు యెవరూ మనుషులుగా లేరు, మతాలుగా వున్నారు. ఇంకా చెప్పాలంటే మనువులుగా వున్నారు. శత్రువుకి పాలనా పగ్గాలు యిచ్చేశారు. తమకి తామే శత్రువులైపోయారు. నెత్తిమీద కాలు పెట్టి తొక్కినవాడి కాలు తాకింది కదా అని సంబరపడుతున్నారు. చాతుర్వర్ణ్య ధర్మాలను పాటిస్తూ మనమంతా వొక్కటే అంటున్నారు. మత రాజకీయాలు అధికారం వశం చేసుకోవడంతో బహుజనులపట్ల అన్యమతస్తులపట్ల ద్వేషమూ హింసా పెరిగాయి.

అందువల్ల మునుపటిలా రాసుకోవాల్సిన కథల్ని పక్కన పెట్టి యీ కథల్లో పడ్డాను.

సామాజిక క్షేత్రంలో పనిచేసే ప్రగతిశీల మహిళా కార్యకర్తలు కతలు వెతల్ని యెలా స్వీకరించారు?  తక్కిన సాహిత్య ప్రపంచం యెలా స్పందించింది? 

  • రణస్థలి, మనువాచకం పుస్తకాలు పీవోడబ్ల్యూ మహాసభల్లో ఆవిష్కరించినప్పుడు తెలియని యెందరి అభిమానమో అందుకున్నాను. నాకు ప్లేటులో అన్నం పోటీపడి తెచ్చిపెట్టారు. కోరి వడ్డించారు. వాళ్ళు కూర్చున్న కుర్చీలోంచి లేచి నాకు యిచ్చారు. నవ్వుతూ పలుకరించారు. మీ కథలు బాగుంటాయి అని, నవ్విస్తాయని, మాతృక వస్తే ముందుగా మీ కథే చదువుతామని యిలా యెన్నో. వాళ్ళు మునుపు చదివినవాళ్ళు కారు. ఈ కథలు చదవడం, చదివించుకోవడం చెప్పాలంటే మనకు తెలియని వూహించని కొత్తపాఠకులు. ఆ అనుభవం నాకు కొత్తది.

ఇక మన సాహిత్య ప్రపంచం అంటారా?  ఆ కథల మీద మదింపు చేసిన వాళ్ళు లేరు. కాని వ్యక్తిగతంగా యెందరో సాహిత్య పెద్దలు యెంతగానో యిష్టపడ్డారు. ఉన్నది వున్నట్టుగా రాయడం కథ కాదని, ప్రపంచ సాహిత్యంలో ఆ మార్పులు వందేళ్ళ క్రితమే జరిగాయని, జరగనిది జరిగినట్టు రాయడంలోనే క్రియేటివ్ పార్ట్ వుంటుందని, నా కథల్లో అది వుందని, షేక్స్పియర్ రచనలో లయ వున్నట్టు మీ కథల్లో లయ వుంటుంది అని మెచ్చుకొని ప్రోత్సహించే నందిగం కృష్ణారావుగారు కలిసినప్పుడల్లా ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ప్రపంచ కథల పోకడల్ని చెపుతూ వుంటారు (ప్రభాకర్ : ‘లయ’- మంచి అబ్జర్వేషన్) .

ఏబీకె ప్రసాద్‌గారు వేమన వసంతలక్ష్మిగారి ద్వారా నా ఫోను నంబరు సంపాదించి ఫోను చేసి మీ కథల్ని వదలకుండా చదువుతానని ‘న్యూ ఇండియా’ కథ చదివిన సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్నారు.

అలాగే హరగోపాల్ గారు కూడా కతలు వెతలు చదువుతుంటానని, వాళ్ళు యేమి మాట్లాడారో అవే మాటలు మార్చకుండా రాస్తున్నారు అని తన అబ్జర్వేషన్స్ చెప్పారు.

హెచ్‌ఆర్‌ఎఫ్ జీవన్ కుమార్‌గారయితే యెప్పుడు కలిసినా కతలు వెతలు గురించి మాట్లాడుతూ వుంటారు, నేనే కాదు మా ఆవిడ కూడా మీ కథల్ని చదువుతుంది, మీ అభిమాని అని- యింకా అభినందించిన వాళ్ళలో దర్శకులు సి ఉమామహేశ్వరరావు వంటివారు… యిష్టంగా చదువుతానని చెప్పిన కాత్యాయని విద్మహేగారు… మీ దాక… యిలా యెందరో వున్నారు.

కొండేపూడి నిర్మలగారయితే ‘నేను నీ ఫేనయ్యా’ అని గుర్తుచేస్తూ వుంటారు. సిగ్గేస్తుంది. కలిసినప్పుడల్లా మాట్లాడినవాళ్ళు చాలామందే వున్నారు.

యథార్థ సంఘటనల చుట్టూ అల్లిన ఆ కథల్లోని వ్యక్తులు మిమ్మల్ని యెక్కడైనా పలకరించారా? 

  • కథ రాసాకే సోనీసోరీని చూశాను. నేనూహించిన పాత్ర నా కథల్లో పాత్ర కంటిముందు కనిపిస్తే అదో ఉద్వేగం. ఇంకా-

ఆక్సిజన్ కొరతతో నాలుగు రోజుల్లో నలభైమంది పిల్లలు చనిపోయిన ఘటనలో డాక్టర్ని బాధ్యున్ని చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్న దానిమీద కతలు వెతలులో ‘మురుగు’ అని కథ రాశాను. ఆ డాక్టర్‌ కాఫిల్‌గారు ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఆయన బుక్ ఫెయిర్ అప్పుడు తన అనుభవాలతో రాసిన పుస్తకాన్ని సైన్ చేసి యిచ్చి గుండెకు అద్దుకున్నారు. ఆ స్పర్శ మరువలేను.

తొలినుండీ జియ్యన్ సాయిబాబాగారి ప్రేమా స్నేహం మరువలేనివి. ‘నువ్వు యేది రాసినా చదువుతా బజరా, నువ్వు నవల రాస్తే చదవాలని వుంది’ అన్నారు. ఆయన మీద మూడు కథలు రాశాను.

ఈ కథల్లోని సంభాషణాత్మక నాటకీయ శైలి పావు గంట 20 నిమిషాల పాటు రంగస్థలంపై ప్రదర్శనకు అనుకూలంగా వున్న కారణంగా యెక్కడైనా అటువంటి ప్రదర్శనలు జరిగాయా? ముఖ్యంగా పాఠశాల కళాశాల విద్యార్థుల్లో లౌకిక సమత్వ ప్రజాస్వామిక భావాల ప్రచారానికి యివి గొప్ప కళాత్మక సాధనాలు అని నాకు అనిపించాయి. 

  • లేదు, యీ కథలు ప్రదర్శన రూపం తీసుకోలేదు. మీరన్నట్టుగా రంగస్థలం మీద ప్రదర్శనకు కతలు వెతలును వినియోగించుకోవచ్చు. కాని ఆ ప్రయత్నం జరగలేదు. జరగనీయరు కూడా. అయినా మన ప్రయత్నం మనం చేయాలి.

మీరు పాఠశాల, కళాశాలల గురించి ప్రస్తావించారు కాబట్టి యిక్కడో విషయం చెప్పాలి. ఒకప్పడు పాఠశాలల్లో ప్రార్థన తరువాత వార్తలు చదివేవారు. ఇప్పుడు వార్తలు ఆపేశారు. హింసగా వుంటున్నాయని. ఆ హింస యెందుకు జరుగుతుందో గుర్తించరు సరికదా, తామే తిరిగి కారకులు కూడా అయి ఆ హింసలో భాగస్వాములు అవుతున్నారు. సర్వమత సమానత్వం లేదు. రామాయణంలోని పద్యాలు రాసుకొచ్చి చదువుతున్నారు. అర్థ తాత్పర్యాలు చెపుతున్నారు. గీత వినిపిస్తున్నారు. బడిని గుడి చేసేస్తున్నారు. సరస్వతీ విగ్రహాలతో ఆగలేదు. శివాజీ స్వామి వివేకానందుడూ పటేలూ యివే విగ్రహాలు యింకా అఖండ భారతం ముందున్న భారతమాత. అంతెందుకండీ రెండు తెలుగు రాష్ట్రాలలో టెన్త్‌కు ఉపవాచకం యివాళ రామాయణం. ఇంకా బరితెగింపు చెప్పనా, ముస్లిమ్ క్రిస్టియన్ పండగలకు సెలవులు యివ్వని స్కూల్స్‌ని చూశాను. హిందూత్వ పిల్లల మెదళ్ళలోకి గుట్టుచప్పుడు కాకుండా యెక్కిస్తున్న స్థలాలు యివాల్టి మన పాఠశాలలు. అక్కడ ప్రదర్శనలకు అవకాశమే లేదు.

దీర్ఘ కాలం నిర్వహించే యిటువంటి శీర్షికలు  మొనాటనీకి గురయ్యే అవకాశం వుంది అలా కాకుండా ఉండటానికి మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? అదీగాక పాఠకులకు తెలిసిన యథార్థ ఘటనల్ని యితివృత్తాలుగా నిర్వహించడంలో అవి కేవలం వార్తా కథనాలుగా యే మాత్రం తడి లేని రాజకీయ విశ్లేషణలుగానో తేలిపోయే ప్రమాదం వుంది. ఆ పరిమితుల్ని మీరు యెలా అధిగమించారు? 

  • దీర్ఘకాలం రాసినప్పుడు విరివిగా రాసినప్పుడు దాని మీద విమర్శకులకుగాని సాహిత్యకారులకుగాని వుండాల్సినంత ఫోకస్ వుండదు. కాని రాసేవాళ్ళకు వుండాలి. చెప్పిందే చెప్పడం రాసిందే రాయడం చేస్తే మొనాటనీకి తప్పక గురి అవుతుందన్న స్పృహ మొదట వుండాలి. వస్తువు కథకుడిని యెన్నుకుంటుంది కదా, వస్తువే రూపాన్నీ యెన్నుకుంటుంది కదా, ఆ రూపం పట్ల రచయితగా మెలకువగా వుండాలి. కొత్తదనంతో చెప్పాలి. మనకు తెలిసిన విషయమే కదా అని పాఠకులకి అస్సలు అనిపించకూడదు. సాంఘిక జీవనంలో నిత్యం జరిగే వాటితో మనుషులు పొడిబారి వున్నారు. తడి అద్దాలి. ఆ తడిలో చీమూ నెత్తురూ ప్రవహిస్తూ వుండాలి. స్వయంగా తడిచినతనం  వుండాలి. కొత్త అనుభవాన్ని యివ్వాలి. కొత్త ప్రపంచంలోకి తీసుకుపోవాలి. నవ్వించి యేడిపించాలి. నాటకీయత వుండొచ్చు, ఫార్సు వుండొచ్చు. మేజిక్ రియలిజం దాక యేదైనా వుండొచ్చు. మునుపటి కథలా మాత్రం వుండకూడదు. కాలమ్ పెట్టి కథ రాస్తున్నప్పుడు- సమయం తరుముతున్నప్పుడు- తప్పటడుగులు కొన్ని పడతాయి. దాన్ని గ్రహించగలిగేలా వుండాలి. కొత్త కథన పద్ధతులను యెప్పటికప్పుడు కనుగొనాలి. నిత్య ప్రయోగాలు చెయ్యాలి. ఈ యెరుకతోనే రాయడానికి ప్రయత్నించాను.

 కతలు వెతలు మీద నెగటివ్‌గా ఏమీ రాలేదా?

  • కతలు వెతలు మీద నెగటివ్‌‌గా రాలేదు, కాని మీ తొలి కథలు మళ్ళీ రాయండి. మీరు మోర్ పొలిటికల్ అయిపోతున్నారు అని చెప్పిన మిత్రులూ వున్నారు. ప్రేమగానే. అంటే యీ కథలు కాలానికి నిలవవు అనే వుద్దేశమూ వుంది. ఏమో నేనవన్నీ ఆలోచించడం లేదు. నాకు సెగ తగిలినదాన్ని వదిలెయ్యలేను. పోనీ వేరెవ్వరూ వాటిని రాయడం లేదు. సరే, ఆ పరిస్థితులు వున్నంత వరకూ యీ కథ వుంటుంది. రిలవెన్సు కోల్పోతే మంచిదే, కథ శాశ్వతం కానక్కర్లేదు అనుకుంటాను.

కతలు వెతలలో విస్తృతమైన వస్తు వైవిధ్యాన్నా  విభిన్నమైన శిల్ప ప్రయోగాన్నా నిశితమైన దృక్పథ పటిమనా  అన్నింటినీ మేళవించుకుని అంతర్లీనంగా ప్రవహించే జీవన తాత్త్వికతనా  పాఠకులు దేన్ని ఆదరించారని మీరనుకుంటున్నారు? 

  • మనం పేరు యేది పెట్టినా పాఠకులు  కథగా చూస్తారు. వస్తు శిల్ప దృక్పథాల సమన్వయం ద్వారా జీవన తాత్వికతని అందుకున్న కథ పుష్టిగా నిలబడుతుంది. ఆకర్షిస్తుంది.

కథలోని వస్తువు పాఠకుల జీవనానుభావంతో సంబంధం పెట్టుకుంటుంది. కథలోని శిల్పం పాఠకుల్ని దగ్గరకు తీసుకొని పెనవేసుకుంటుంది. కథలోని దృక్పథం దారితప్పకుండా పాఠకులకు సరైన తోవ చూపిస్తుంది. అదిగో అప్పుడు జీవన సారం అందుతుంది. రచయిత పాఠకుల సమన్వయంలో జీవన తాత్వికత దర్శనమవుతుంది.

వైవిధ్యాన్ని హరించే సాంస్కృతిక జాతీయ వాదానికి మతవాద రాజకీయాలకు కార్పొరేట్ సామ్రాజ్య అనుకూల విధానాలకూ వున్న సంబంధాన్ని సాధారణ పాఠకులకు అర్థం చేయించడంలో మీ రచనలు విస్తృతంగా దోహదం చేశాయి. అయితే రాజ్యానికి వుండే హింసా స్వభావాన్ని గానీ సమాజంలో మానవ సంబంధాల్ని శాసించే కుల మత వర్గ ఆధిపత్యాల్ని గానీ వొక తాత్వికతలంలో కలిపి చూసినప్పుడు వర్తమానం తిరిగి రాలేని అమానవీయ కాలంలోకి  ప్రయాణం చేస్తుందని అనిపిస్తోంది? ఒక సాహిత్యకారుడిగా సామాజిక కార్యకర్తగా  దీనికి  విరుగుడుగా యే ఆచరణ అవసరమని మీరు భావిస్తున్నారు?  

  • సమభావన. నువ్వూ నేనూ వొకటే. నాలో వున్న దేవుడు నీలోనూ వున్నాడు. అణువణువులో వున్నాడు. అని నమ్మకస్తులు నమ్మితే మీరన్న అమానవీయకాలం మానవీయకాలంలోకి తిరిగి మారుతుంది. గీత చెప్పినట్టు యిది నిన్న లేదు. రేపు వుండదు. మధ్యలో? హు… మార్పుకు గురికానిది యేదీ వుండదు. ఆ మార్పుకు సృజన శీలురుగా బుద్ధిజీవులుగా తోటి మనుషుల ఆలోచనల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేయడం అవసరం. నా ఆయుధం అక్షరం! ఆలోచన నా రంగం!

విరసంలో వున్నప్పుడు యువ రచయితగా ఆ సంస్థ నిర్వహించిన  సాహిత్య పాఠశాలలకు హాజరై వుంటారు. ఆ తర్వాత కథల వర్క్ షాప్‌లకు రిసోర్స్ పర్సన్‌గా కూడా వ్యవహరించి వుంటారు. కథల విద్యార్థిగా అధ్యాపకుడిగా మీరు నేర్చుకున్న నేర్పు రాజకీయ కథా రచనలో చేపట్టిన ప్రయోగ వైవిధ్యానికి  తోడ్పడిందా?  

  • తప్పకుండా తోడ్పడింది.

విరసం సాహిత్య పాఠశాల మహానందిలో జరిగినప్పుడు నే తొలిగా హాజరయ్యాను. కథల సెషన్లో అల్లం రాజయ్యగారు అధ్యక్షులు. నేను వక్త. (చిన్న నవ్వు) నాకే అనుభవమూ లేదు. జీవనానుభవం తప్ప. మాట్లాడించారు. కొందరు అపోహ పడ్డట్టు యే సిద్ధాంత చర్చలూ లేవు. జీవితం. దృక్పథం వొక పనిముట్టు. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత. అప్పుడూ యిప్పుడూ నాకు బోధపడింది యిదే. మన సాధన మనం నిరంతరమూ చేస్తూ వుండాలి. ఏ దృక్పథమూ లేకపోవడం తమ దృక్పథంగా కొందరు భావించి దృక్పథం కలిగి వుండడమే నేరమని భావిస్తారు. అది అవగాహన లేకపోవడమే. మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని గుర్తించడంలోనూ ఫోకస్ చేసి చేరుకోవడంలోనూ దృక్పథం వున్నప్పుడే సాధ్యమవుతుంది.

నిత్య జీవితంలో యెన్నో కథాంశాలు విత్తులుగా మన మనసులో పడుతుంటాయి. వాటిని ఆలోచనల్లో పెంచి పెద్దచేసి మహా వృక్షాలు చెయ్యాలి. ఆలోచనల అల్లికకు పగలు రాత్రితో సంబంధం లేదు. నేను ప్రతిరోజూ యెన్నో కథల్ని అల్లి అలా వదిలేస్తూ వుంటాను. ప్రతిదాన్నీ. పట్టుకున్నదాన్ని రాస్తాను. కొన్ని పట్టుకొనీ రాస్తాను. ఆ ఆలోచనల ధార చిత్రంగా వుంటుంది. నిద్రలోంచి మెలకువలోకి వస్తున్నపుడు ఆలోచనలు అక్షరాలుగా వాక్యాలుగా మాటలుగా ప్రవహిస్తూ వుంటుంది. కథ నెరేట్ అవుతూవుంటుంది. భలే తమాషాగా వుంటుంది. అలా గుర్తున్నవి చాలా రాశాను. మనలోపల చాలా ప్రాసెస్ జరుగుతూ వుంటుంది. నే సరిగా చెప్పలేకపోతున్నానేమో. రాజకీయ కథా రచనే కాదు, యే రచన చేయడానికైనా యెప్పటెప్పటివో మనలో యింకిపోయి వుంటాయి. అవి తోడ్పడతాయి. తోసుకువస్తాయి. మనకు తెలిసీ. తెలియకుండా కూడా.

ఇక్కడో  మాట, సమకాలీన రాజకీయ సామాజిక అంశాల్ని కథలు కట్టడంలోనే తలమునకలై వుండడంవల్ల  జీవితానికి చెందిన యితరేతర కథాంశాల పైకి దృష్టి సారించలేకపోవడంవల్ల మీరు చెప్పాల్సిన/రాయాల్సిన కథలెన్నో రాయకుండా మిగిలిపోయాయన్న లోటు మీకు యెప్పుడూ అనిపించలేదా? 

  •  చాలా సార్లు అనిపించింది. రాయాలని రాయకుండా లోలోపల వుండిపోతే ఆ భారం మొయ్యడం కష్టం. ‘దీపం సెప్పిన కత’ విన్నారుగా, ఆ జానపద కథలోలా వుంటుంది నా అవస్థ. అందుకేనేమో యిప్పుడు మీ ప్రశ్నలవల్ల అర్థమవుతోంది. ఆ కథలోలా కడుపులోని కథలన్నీ బయటకు వచ్చి కథలు చెపుతూ వుంటాయి. ఇందాక చెప్పినట్టు మెలకువ నిద్ర కాని స్థితిలో కథల ప్రవాహం వెల్లువెత్తడం అదేనేమో?! ఒకప్పుడు ఆలోచనలు వెంటాడితే లేచి తెల్లవార్లూ రాసుకొనేవాణ్ని. రెక్కలగూడు రాసినప్పుడు ఆ రాత్రి అలా తెల్లవారిపోయింది. వయసు వల్ల శరీరం గొప్పగా సహరించేది. ఇప్పుడు మెదడు ఆడుకుంటుంది. శరీరం నీరసిస్తుంది.

ఇంకో విషయం కతలు వెతలు రాసేటప్పుడు ఆ వస్తువువల్ల దుఃఖంవల్ల కోపంవల్ల బాగా నలిగి అలసిపోతాను. నిజం చెప్పాలంటే కొన్ని కథలకు జబ్బు పడినట్టు అయిపోతాను. ‘డాడీ కళ్ళు లాగేసాయి’ అని నన్ను గమనించిన మా అబ్బాయి చెపుతూ వుంటాడు. మామూలు కథలు రాయడం సులువు. ఈ కథలు కష్టమే. ఇప్పుడొస్తున్న ఈతిహాసము, లోకాయణము కథలకు ప్రూఫ్‌లు చూసిన ల.లి.త.గారు చదివితేనే యింత భారంగా వుంది, రాసేటప్పుడు యింకెంత భారమో కదా అన్నారు. ఆ కథలు వొదిలి మామూలు కథలు రాయండి అన్నారు. నా యిరుకును సర్దుకొని అన్నీ రాయాలని ఆశ వుంది.

అయినా కథ అంటే రచయిత తను జీవిస్తోన్న తన చుట్టూ వున్న సమాజంతో చేసే అంతులేని సంభాషణే కదా, అదొక నిరంతర ప్రక్రియ అనుకుంటాను

  • అది నిరంతరం అయినా యేరోజుకారోజు కొత్తే. ఎనిమిది మందిని కన్నావు- అంటే తొమ్మిదో బిడ్డకు నొప్పులు వుండవా?  అందుకే పురిటి నొప్పులతో పోల్చారేమో (నీరసమైన నవ్వు) 

కథ రూపొందే క్రమంలో వస్తు రూప దృక్పథాల్లో దేని మీద మీ మనసు యెక్కువ కేంద్రీకృతమై వుంటుంది? ఎందువల్ల?

  • వస్తువు కోసం వెదకను. అది వెతికి నన్ను పట్టుకుంటుంది. నేను ఆ వస్తువుని స్వీకరించిన క్షణంలోనే దాని రూపం తయారయిపోతూ వుంటుంది. దిద్దుకుంటూ వుంటుంది. ఈ ప్రాసెస్ మొదలవక ముందూ అయిన తర్వాత యెప్పుడూ దృక్పథం నా లోలోపల వుంటూనే కదా వచ్చింది, నిజం చెప్పాలంటే దృక్పథం వల్లే వస్తువు యెంపిక జరిగింది. వస్తువు వల్లే రూపం యెంపిక జరిగింది. వస్తు రూప దృక్పథాలను సమన్వయం చేస్తూ లక్ష్యాన్ని చేరుకొనే ప్రయాణం మీదే నా ఫోకస్ వుంటుంది.

బాగుంది. కానీ దృక్పథం కళా విలువలు మధ్య అకారణ వైరుధ్యం/స్పర్థ సృష్టించే విమర్శకులు యీ మధ్య మరీ  యెక్కువయ్యారు. దృక్పథవాదం సాహిత్యానికి కీడు చేస్తుందని వాపోతున్నారు. అసలు వొక సృజనాత్మక రచనలో వస్తువు శిల్పం దృక్పథం యీ మూడింటి మధ్య వుండాల్సిన సంబంధం గురించి మీ అభిప్రాయం యేంటి?

  • చాలా పెద్ద చర్చ చేయాల్సిన అంశం.

కళా విలువల్ని దృక్పథం తోసి పుచ్చదు. దృక్పథాన్ని కళా విలువలు కాదనవు. కళా వాదమైనా దృక్పథ వాదమైనా- అది వాదమయితే, వాదం అంటే ‘తగువు’ అని దాని అర్థం తీసుకున్నట్లయితే, అది వస్తు శిల్ప దృక్పథాల మధ్య వుండాల్సిన ఐక్యతని దెబ్బతీస్తుంది. సృజనకు చేర్పు కావాల్సిందిపోయి స్పష్టతని యివ్వాల్సిందిపోయి విఘాతం కలిగిస్తుంది.

అసలు దృక్పథం అన్నది బూచి అనుకున్నప్పుడు బూచి. పేచి. నే ముందే చెప్పాను కదా, మనం ఫోకస్ చెయ్యాల్సిన పాయింట్‌ను చేరుకోడానికి అటూ యిటూ యెటుపడితే అటు పోకుండా దృష్టి/దృక్ ‘పథం’. తోవ. చేరుకోవడానికే.

సాధారణంగా వస్తు రూప చర్చలే చేసేవారు. దృక్పథాన్ని కాదనో ఔనానో గుర్తించడం ద్వారా దాని వునికిని గుర్తించారు. దృక్పథం వున్నవారికీ వుండకూడదని అనుకున్నవారికీ వారి రచనల్లో వ్యత్యాసం గమనించవచ్చు. మళ్ళీ దృక్పథం దగ్గరికి వచ్చేసరికి అది యే దృక్పథం? మార్క్సిస్ట్ దృక్పథమా? మరో దృక్పథమా? అని ప్రశ్న. నేనయితే యిది వరకే చెప్పాను. వాదాలన్నీ నాకు పనిముట్లే.

ఇంత విస్తృతమైన రచనా వ్యాసంగంలో నవల రాయాలని ప్రయత్నించలేదా? ఆ మధ్య వొక సీనియర్ రచయిత నవలలు రాస్తూ కథలు వదిలేశారెందుకు అని ప్రశ్నిస్తే కథ రాయడం కంటే నవల రాయడం తేలిక అన్నారు. మీరు మాకు చాలా నవలలు బాకీ వున్నారు. సమీప భవిష్యత్తులో ఆ బాకీ తీర్చే అవకాశం వుందా? మీరు రాయకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన అనేక జీవితాల్ని అక్కడ portrait చేస్తే చూడాలని వుంది. 

  • నవల కాదు నవలలు చాలానే రాయాలని వుంది. ప్రయత్నం చేశా. పదేళ్ళ క్రితమే. అర పావు మ్పుప్పావు రాసి నాలుగు నవలలు వదిలేశా. కారణం బోధ పడింది. కథలా ఎటస్టెచ్ రాయడానికి కుదరదు. సమయం పడుతుంది. నా జీవితంలో అది వుండవలసినంత లేదు. పైగా యీ కథల ప్రవాహం నుండి పక్కకు రావడానికి లేకుండా వుంది. ఈ వుధృతిలో నవల ఆలస్యమైంది, అధిగమించి తొందర్లోనే సమయం చిక్కబట్టుకొని బాకీ తీర్చేస్తాను.

భిన్న సామాజిక నేపథ్యాల నుంచి కొత్త రచయితలెందరో యింతకు ముందు సాహిత్యంలోకి యెక్కని అనేక జీవన పార్శ్వాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. కొత్త భాషా అభివ్యక్తి రీతుల్ని పరిచయం చేస్తున్నారు .

  • ఔను…

అదే సమయంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ రచయితగా పేరు తెచ్చుకోవాలనుకునేవాళ్ళు, మర్నాడు పొద్దున్నే అవార్డుల కోసం లాబీ చేస్తున్నవాళ్ళు, వాళ్ళ వుబలాటాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించే పబ్లిషర్స్, ప్రగతి శీల సామాజిక దృక్పథం లాగానే ఆ భావజాలానికి చెందిన సాహిత్యం పనైపోయిందని నొసలు చిట్లించేవాళ్ళు సాహిత్య క్షేత్రంలో చిందులు తొక్కుతున్న కాలంలో కొత్త రచయితలకు కథా రచనలో మీరిచ్చే సలహాలేమైనా వున్నాయా?

  • సాహిత్య ప్రయోజనం వొక్కొక్కరికి వొక్కోలా వుంటుంది. (నవ్వుతూ, అంతలోనే ఆగి) కొందరికి పేరు. కొందరికి కెరీర్. కొందరికి డబ్బు. మరికొందరికి అమ్మాయిలు. ఇంకొందరికి సినిమాలు. ఇలా వాళ్ళ ఎజెండాలో యేది వుంటే అది. అదే సాహిత్య ప్రయోజనం అంటే.

ఈ సందర్భంగా ఆ మధ్య బుక్ ఫెయిర్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొస్తోంది. కొత్తగా నవల రాసిన వో అమ్మాయి  మిత్రులు నీలిమా హాస్పిటల్ శ్రీనివాస్ డాక్టరుగారి చేతిలో తన పుస్తకం పెట్టింది. కొనమని. శ్రీనివాస్ డాక్టరు ‘ఏ పర్పజ్‌‌తో రాసావు?’ అని అడిగారు. కంటెంట్ యేమిటి అన్న వుద్దేశంతో. ఆమె ‘పర్పజ్’కు అతుక్కుపోయింది. పర్పజ్ వుండకూడదు అని క్లాసు పీకింది. అసలు పర్పజ్ వల్ల పర్పజ్ లేదంది. చాలా సేపు ‘పర్పజ్’ తన ఎనిమీ అయినట్టు మాట్లాడింది. నేను ఆశ్చర్యపోలేదు. సాహిత్యం మీద ప్రయోజనం అనే భారం మోపకూడదు- అని అనుకొనే పబ్లిషర్స్ వున్న కాలంలో అది సహజం అనుకున్నాను. కాని డాక్టరుగారు బెదిరిపోయారు. కనీసం వో అరడజను సార్లు ఆమె మాటలే యెత్తారు, తర్వాత నాతో. వీళ్ళు భవిష్యత్తులో యేమి రాస్తారు? అని ఆయన ప్రశ్న.

కొత్త రచయితలు అందరూ అలా వున్నారని కాదు, వున్నారు. అంచేత కొత్త రచయితలకు మీరు పోటీలకు రాయకండి, అవార్డులు తీసుకోకండి అని అసలే సలహాలు యివ్వకూడదు అని నా నియమం. మీరు మీ సృజనను ప్రేమించండి. సాధన చేయండి. అధ్యయనం చేయండి. పేరు వెంట పడకండి. పేరే మీ వెంట పడేలా చేసుకోండి. నేను యిది వరకు వో ఇంటర్వ్యూలో చెప్పాను. సాహిత్యం శుక్రవారం విడుదలయ్యే సినిమా కాదు, తేలిపోవడానికి. జీవితకాలం పడుతుంది. అప్పుడూ తేలక పోవచ్చు. మనం ములిగి పోవచ్చు. కాని మన ప్రయత్నం నిరంతర తపనతో కూడినదై వుండాలి.

నేను నమ్మేది కూడా తప్పయిపోయింది. నాకన్నా ముందు రావిశాస్త్రిగారి మాట తప్పయిపోయింది. రాసి వదిలెయ్యాలి. అవసరమైంది కాలానికి మిగులుతుంది, పోయేది పోతుంది అని. కాదు, మోస్తే మిగులుతుందో లేదో కాని ప్రచారంలో వుంటుంది. ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటున్న కాలంలో డప్పులు కొట్టడం కాదు. నీ సృజనలో నువ్వు వుండు అని యెలా చెప్పను?  చెప్పేది వొకటి చేసేది వొకటిగా వుండలేనే. అందుకని నే చెప్పేది వొక్కటే, సృజనకు వ్యక్తిత్వం ముఖ్యం. వ్యక్తిత్వమే సృజనలో ధ్వనిస్తుంది.

ఈ నోట్ తో మన సంభాషణ ఆపుదామా ? మరో సారి మరికొన్ని మాటలు పంచుకుందాం. కథ లాగానే సంభాషణ కూడా నిరంతర ప్రక్రియే. థేంక్యూ అండ్ హగ్యూ…

 

 

ఏ.కె. ప్రభాకర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు