ఇది మామూలే కదా!

“నువ్వొక బుర్ర లేనిదానివి. నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు. ఇంత వయసు వచ్చినా మామూలు విషయాలు కూడా అర్థం కాని అయోమయపు మొహానివి ఎక్కడో.”

“నా ఫ్రెండ్ సావిత్రి కూతురికి పెళ్ళంట. కట్నం ఎంతిస్తున్నారో అసలు ఊహించనుకూడా లేవు.”

వాళ్ళ కులంలో పెద్ద కట్నాలు మామూలే కదా. కొత్తేముంది.

***

“రజని వాళ్ళ కోడలికి మళ్ళీ ఆడపిల్లని చెప్పినారంట. మరుసటి రోజే పాపం అబార్షన్ అయిందంట.”

వాళ్ళకు మొదటిసారి కూడా పాపే కదా. ఎప్పుడూ వినని విషయమా ఇది. మామూలే కదా.”

***

“పక్కింటి అమ్మాయిని అడిగినంత కట్నం తేలేదని ఆ పిల్లాడు, వాళ్ళ అమ్మ రోజూ తిట్టడం, కొట్టడం. మనం పోలీసులకు కంప్లైంట్ చేద్దామా.”

కట్నం ఇయ్యలేనప్పుడు వాళ్ళకి తగిన సంబంధం చూసుకోవాలి. ఇస్తామన్నవన్నీ ఇయ్యకపోతే వాళ్ళకు కోపం రావడం మామూలే కదా.”

***

“మా సీతక్క కూతురు సింధుకి గొప్ప సంబంధం వచ్చిందంట. పిల్లోడు ఉద్యోగం కూడా చేసే అవసరం లేనంత ఆస్తిపరులంట. సింధుని కూడా ఉద్యోగం మానేయాలన్నారంట.”

అంత ఆస్తిపరుల కోడలు ఉద్యోగం చేసే పనేముంది. ఉద్యోగం చేయడం వాళ్ళ హోదాకి తక్కువంటే మానేయమనడం మామూలే కదా.

***

“మన భూమి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తానంటోంది. కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ లేదంటోంది.”

ఆడపిల్లలన్నాక కంప్యూటర్ సైన్స్ చదివి ఏ సాఫ్టువేర్ కంపెనీలోనో చేరడం మామూలు కానీ నీ కూతురు ఏమైనా మెకానిక్ పని చేస్తుందా. నోరు మూసుకుని మామూలుగా అందరూ చదివేది చదవమని చెప్పు.”

***

“మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని అన్న ఫోన్‌ చేసినాడు. కొన్ని రోజులు మనింట్లో పెట్టుకుని మంచి హాస్పిటల్‌లో చూపిద్దామా.”

అమ్మానాన్నలు కొడుకులు దగ్గరే వుండడం మామూలు విషయం కదా. మళ్ళీ ఇక్కడున్నప్పుడు ఏమైనా అయితే అందరూ నన్నంటారు. ఏం వద్దు.”

***

ఈరోజు పేపర్‌లో వార్త చూసావా. ఆ అమ్మాయి ఏం చేసిందో.

“ఎప్పుడో ఒకసారి అగ్నిపర్వతాలు పేలడాలు, భూకంపాలు రావడాలు మామూలే కదా. వింతేముంది.”

నువ్వొక బుర్ర లేనిదానివి. నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు. ఇంత వయసు వచ్చినా మామూలు విషయాలు కూడా అర్థం కాని అయోమయపు మొహానివి ఎక్కడో.

***

విజయ జ్యోతి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒక్క పుటలో ఇన్ని కథలా? మీరు వ్రాయబోయే కథలు సంక్షిప్తంగా ఇచ్చారా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు