ఆ గాత్రం! వెన్నెల్లో గోదారి అందం! 

నేపథ్య గానాన్ని ఆ స్థానం నుంచి మరింత పైకి తీసుకెళ్ళిన అతి కొద్ది మంది గాయనీ గాయకుల్లో జానకి ఒకరు. కథకు కొత్త అర్థమిచ్చే పాటలు, పాత్రలకు ప్రాణం పోసే పాటలు, భావోద్వేగాలకు అద్దం పట్టే పాటలు ప్రతి సినిమాకీ అవసరమే. జానకమ్మ తన బహుముఖ ప్రజ్ఞతో అలాంటి ఎన్నో పాటలను మలిచారు.

జానకమ్మ పాట!

సన్నగా పారే సెలయేరు, ఉవ్వెత్తున ఎగసే అల తీరు, అంతెత్తు నుంచి దూకే జలపాతపు హోరు!

ఆ స్వరం- వేసవి సాయంత్రాల్లో వీచే తూర్పు గాలి, కవ్వించి, కైపెక్కించే పిల్ల గాలి!  సంతోషం-బాధ, విరహం-విషాదం, భక్తి-రక్తి, అల్లరి-ఆర్ద్రత, ప్రేమ-పేచీ! ఇలా మనిషి మనసులో పుట్టే ప్రతి భావోద్వేగాన్నీ అద్భుతంగా పలికించగల అతి అరుదైన లక్షణం జానకమ్మ గళానికుంది. దక్షిణాది సాంస్కృతిక వైభవాన్ని, జానకమ్మ పాటల ప్రాభవాన్ని విడదీసి చెప్పడం కష్టతరమే!

* * *

జానకమ్మ పెదవి కదిపితే “పగలే వెన్నెల” కురుస్తుంది. గొంతెత్తితే గున్నమామిడి కొమ్మ మీది కోయిల వంత పాడుతుంది.“పగలైతే దొరవేరా” పాట ఓసారి వినండి. మదిలో పులకలు రేగవూ? మరి “నీ లీల పాడెద దేవా” వింటేనో! ఆ స్వర ఝరికి ఒళ్ళు పరవశించిపోదూ? మూడేళ్ళ వయసులో ఓ ఏడాది పాటు సంగీతం నేర్చుకుని వదిలేసిన చిన్నారి జానకి ఇంతటి ప్రౌఢ గీతాన్ని అంత అవలీలగా ఎలా పాడిందో ఇప్పటికీ అంతుపట్టని విషయమే! సన్నాయితో పోటీ పడి పాడగల సామర్థ్యం ఒక్క జానకికి మాత్రమే ఉందని పి. లీల అంతటి గాయనీమణి ఆవిణ్ణీ పాటకు సిఫారసు చేశారట! ఈ పాటేనా? “మరుగేలరా ఓ రాఘవా” అనో, “సామజవరగమన” అనో, “నరవరా ఓ కురువరా” అనో జానకమ్మ పాడుతుంటే ఆ సహజసిద్ధమైన స్వర జ్ఞానానికి అబ్బురపడ్డం తప్ప  ఇంకేం మరింకేం చేయగలం?

“కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు”! “అంతులేని కథ”కు ఆయువుపట్టులాంటి గీతమిది. ఆత్రేయ రాసిన ఈ పాట ద్వారా బాలచందర్, నాయిక మనసులోని సంఘర్షణను ప్రేక్షకుల కళ్ళకు కడతారు. జానకి గాక మరెవరైనా ఈ పాట పాడి ఉంటే ఆ ఆవేదన మన మనసులకు అందకుండా పోయేదేమో! M.S. విశ్వనాథన్ బాణీ జానకమ్మ గొంతును ఎలివేట్ చేసిందా లేక ఆవిడ పాడ్డం వల్లే ఆ బాణీకి అంత డెప్త్ వచ్చిందా అంటే రెండో మాటే కరెక్ట్ అంటాను. అంతగా ఆ పాటను సొంతం చేసుకున్నారావిడ.

వేదన, ఆవేదన కలగలిపి గుండెల్లో మంట పుట్టించే మరో పాట “వెన్నెల్లో గోదారి అందం”! “సితార” కోసం ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటలో జానకమ్మ అంతులేని విషాదాన్ని కుమ్మరించారు. ఆ చివరి చరణమైతే మరీను! అంతటి తారస్థాయిలోనూ శ్రుతి తప్పకుండా, భావం చెడకుండా, ఉద్వేగం పడిపోకుండా పాడ్డం ఆవిడకే చెల్లింది. అత్యంత క్లిష్టమైన ఈ పాటను అత్యద్భుతంగా పాడినందుకు జానకమ్మను జాతీయ అవార్డు వరించింది. “సిరిమల్లె పువ్వా” పాటలోనూ అన్నీ హై నోట్సే! అయినా ఎంత పర్ఫెక్టుగా పాడారావిడ! చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట ఒరిజినల్ ట్యూన్ ఇళయరాజాది. “16 వయతినిలే” కోసం పాడిన తమిళ వర్షన్ ఆవిడకి తొలి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది.

ఆస్తమా రాక ముందు ఒక్క దమ్ములో ఎనిమిది లైన్లు పాడేదాన్నని జానకి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజమే! “రంగుల రాట్నం”లో సినిమాలో ఘంటసాలతో కలిసి ఆవిడ పాడిన “నడిరేయి ఏ జాములో” పాటను గుర్తుకు తెచ్చుకోండి. మొదటి చరణంలో “అమ్మా” అన్న ఆలాపన, ఆ తర్వాత “మముగన్న మాయమ్మ అలివేలు మంగ” అంటూ గమకాలు వేస్తూ తీసిన సుదీర్ఘమైన రాగం వింటే ఊపిరిపై ఆవిడకెంత నియంత్రణ ఉందో అర్థమవుతుంది. “జ్యోతి”లో “సిరిమల్లె పువ్వల్లె నవ్వు” పాట చివరి చరణంలో ఆలాపన తీసి, దమ్ము తీసుకోకుండానే “వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా” అంటూ పదాల్లోకి జారిపోవడం చూస్తే మనకే ఊపిరి నిలిచిపోయినట్లవుతుంది.  అన్నట్లు ఈ పాటలో జయసుధ నవ్వే నవ్వులన్నీ జానకమ్మవే. బాలు పాడే స్వర జతులకు తగ్గట్లుగా నవ్వులు చిందించారావిడ. జానకమ్మ నవ్వులో స్వరాలు పలకడమే కాదు మల్లెపూలు గుబాళిస్తాయి. అందుకే కదా “నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకర్థము జూపేను” అని ఆత్రేయ అన్నారు. “అభిలాష”లోనూ అదే వరస. ఆవిడ నవ్వితే మల్లె చెండు నవ్వినట్లేనని వేటూరి తీర్మానించేశారు.

కెరీర్ మొదట్లో సన్నటి తీగలా ఒంపులు తిరిగిన జానకమ్మ స్వరం 80ల నాటికి మరింత అమృతాన్ని ఒంపుకుని నిండుగా మారింది. ఈ దశకంలో ఇళయరాజా స్వర సారథ్యంలో పాడిన ఎన్నో పాటలు మరపురాని మధురగీతాలుగా నిలిచిపోయాయి. “ఆకాశం ఏనాటిదో”, “మౌనమేలనోయి”, “మనసు పలికే”, “సువ్వీ సువ్వీ”,  “సందె పొద్దులకాడ”, “జయ జయ ప్రియ భారత”, “ఓం నమ:”… ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టుకి అంతే ఉండదు. “వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి. ఎదురులేక ఎదిగిందీ మధురగానకేళి” అని సిరివెన్నెల రాసినట్లు జానకమ్మ గొంతు ఇళయరాజా బాణీలోకి అందంగా ఒదిగిపోయి మధురగానకేళిగా ఎదిగిపోయింది.

రమేశ్ నాయుడుతోనూ జానకమ్మ స్వర ప్రయాణం చెప్పుకోదగ్గదే! “తొలిసారి మిమ్మల్ని”, “మనసా తుళ్ళిపడకే”, “లిపి లేని కంటి బాస” ఇలా ఒకే సినిమాలో మూడు ఆణిముత్యాలు పాడారావిడ. “చందన”లో “పొన్న పూలా ఉయ్యాల” శ్రోతలను ఊయలూపేస్తే “రెండు జెళ్ళ సీత”లో “కొబ్బరి నీళ్ళా” జలకలాడిస్తుంది. “స్వయంకృషి”లో “సిన్నీ సిన్నీ కోరికలడగా” ఎంత హృద్యంగా సాగిపోతుందని!

చాలా మందికి తెలియని, గుర్తు లేని మరో అద్భుతమైన కాంబినేషన్ జానకమ్మ, మాధవపెద్ది సురేశ్ ది. వరసకు తమ్ముడయ్యే సురేశ్ తన ప్రతి సినిమాలోనూ జానకితోనే పాటలు పాడించుకున్నారు. “భైరవ ద్వీపం”లో “నరుడా ఓ నరుడా” అనే పాట మనందరికీ తెలుసు. “బృందావనంలో” “మధురమే సుధాగానం” అంటూ జానకమ్మ బాలూతో కలిసి మధురసమే ఒలికించారు. మరుగున పడిపోయిన మణిపూస లాంటి మరో పాట “హై హై నాయకా”లో ఉంది. “ఇది సరిగమలెరుగని రాగం” అంటూ సాగే ఈ పాటలో జానకమ్మ గొంతు అమృతమే కురిపిస్తుంది.

90ల్లో ఎ. ఆర్. రహమాన్ స్వరకల్పనలో జానకమ్మ గొంతు హొయలు పోయింది. “కొంటెగాణ్ణి కట్టుకో”,“యాయీరే”, “మగధీరా” లాంటి పాటలు శ్రోతలను ఊపేశాయి. ఇక అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన “అమ్మా అమ్మా” అనే పాటను ధనుష్ తో కలిసి పాడి ఈ తరం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారావిడ.

“జానకి గారి గొంతులో సన్నాయి మోగుతుంది, సామవేదం పలుకుతుంది. జానకి గారి గొంతులో పండు ముసలి వణుకుతుంది, పసిపాప పలవరిస్తుంది” అంటారూ కళా తపస్వి! నిజమే! “గోవుల్లు తెల్లన”, “చిన్నారి పొన్నారి కిట్టయ్య” పాటల్లో పసిపాపలా మారినా, “అలక పానుపు ఎక్కనేల” అంటూ పండు ముసలిలా వణికినా జానకమ్మ జనాన్ని ఒప్పించి మెప్పించగలిగారు.  “గోరంత దీపాము తుమ్మెద” అన్నా, “సన్నాజాజి పాడక అన్నా” పల్లెటూరి నయగారం కళ్ళ ముందు కదలాడుతుంది. “నీ ఇల్లు బంగారం గాను” అంటూ ఆవిడ సింగారాలు పోయారు, ఆకాశంలో ఆశల హరివిల్లు పూయించారు.

జానకమ్మ పాడిన నాట్య ప్రధానమైన పాటలు శ్రోతలను పరవళ్ళు తొక్కించాయి. ఆవిడ స్వరం “సప్తపది”లో “నెమలికి నడకలు” నేర్పితే “సాగర సంగమం”లో “ఓం నమశ్శివాయ” అంటూ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఇక “మయూరి” సంగతి వేరే చెప్పాలా? “ఇది నా ప్రియ నర్తన వేళ” అంటూ సుధా చంద్రన్ నర్తిస్తే జానకమ్మ గళం కలిపారు.

నేపథ్య గానాన్ని ఆ స్థానం నుంచి మరింత పైకి తీసుకెళ్ళిన అతి కొద్ది మంది గాయనీ గాయకుల్లో జానకి ఒకరు. కథకు కొత్త అర్థమిచ్చే పాటలు, పాత్రలకు ప్రాణం పోసే పాటలు, భావోద్వేగాలకు అద్దం పట్టే పాటలు ప్రతి సినిమాకీ అవసరమే. జానకమ్మ తన బహుముఖ ప్రజ్ఞతో అలాంటి ఎన్నో పాటలను మలిచారు. Vocal acting తో ఆయా పాత్రలకు నిండుదనాన్నిచ్చారు. అందుకే వేటూరి వారు, “గాత్రధారణ ద్వారా పాత్రధారణను సుగమం చేసిన అనేక నాద నటనలు నేర్చిన గొప్ప జాణకి జానకి!” అనేవారు.

* * *

“నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళ”!

ఎన్నో దశాబ్దాలుగా మన మధ్యనే ఉండి మధుర కూజితాలతో అలరించిన ఓ కోయిల ఇప్పుడు దూరతీరాలకు ఎగిరిపోయింది. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో ఆమె పాట ఇప్పటికీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

*

శాంతి ఈశాన్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జానకమ్మ గారి చక్కని నివాళి అర్పించారు మేడం. జానకమ్మ ఒక అరుదైన గాయని. పాటలు అందరూ పాడతారు. జానకమ్మ పాటకు ప్రాణం పోస్తారు. భారతరత్న దక్కాల్సిన గాయని.

  • ఆమె పాటకు మీ మాటల నీరాజనం రమ్యంగా ఉంది

  • ఓ గొప్ప గాయనికి గొప్ప నివాళి
    జానకమ్మ గారి స్వరమాధుర్యాన్ని అద్భుతంగా విశ్లేషించారు.
    అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.