మరిన్ని రంగులూ కొత్త మెరుపులూ

కొత్తగా చదివేవారికీ, లేదా రావిశాస్త్రిగారిని కొన్నేళ్లక్రితం ఎప్పుడో చదివినవారికీ, ఆయన ప్రతిభ మరింతగా వెల్లడయే సరైన వెలుగులో ఆయన్ని చూపించాలన్నది మొదటి ఉద్దేశం.

1979 చివర్లో అనుకుంటాను—

ఖమ్మంలో ఓరాత్రి భోజనం అనంతరం కిల్లీ కొట్టుకి దారితీస్తున్న మా అన్నయ్య శాస్త్రి, కిల్లీకొట్టుకి నాలుగడుగుల దూరంలోనే ఆగిపోయి, నిలబడి, “ఒరే! కవీ! కిల్లీ కొట్టు నిర్మించరా!” అన్నాడు. అని, ఆనక ఓ రెండు మూడు నిమిషాలపాటు ఒక పెద్దపేరాని నాటకీయంగా అప్పజెప్పాడు. అంతకుమునుపు అప్పుడప్పుడు, “కాముని విరిశరములబారికి నే, నేమని సహింతునే, చెలి, యేమని సహింతునే?…” అంటూ వాడు చేసే తమాషా అభినయాలు నాకు అలవాటే కాబట్టి, ఇదికూడా అలాంటిదేదో అయివుంటుందని అనుకున్నాను. రెండునిమిషాలపాటు గడగడా కిల్లీకొట్టు వర్ణన చేసి, అక్కడికి ఆపి, “అబ్బబ్బ! ఏం రాస్తాడ్రా రావిశాస్త్రి!” అన్నాడు. అప్పటికి నేను రాచకొండ విశ్వనాథశాస్త్రి అనే పేరు లీలగా వినివున్నప్పటికీ, ఆ పేరునిబట్టి ఆయనేదో ప్రబంధకవుల కోవకి చెందినవాడనే అభిప్రాయం—ఏవీ చదవని పదిహేడేళ్ల కుర్రాళ్లకి మామూలుగా ఉన్నట్టుగానే—నాకూ ఉండేది. రావిశాస్త్రిగారిని గురించి ఆనాడు అప్పుడు నేను తెలుసుకున్నది అనంతరకాలంలో ఆయన్ని చదవడానికి పురికొల్పింది.

రెండు మూడేళ్ల తర్వాత, ఉద్యోగజీవితపు తొలిరోజుల్లో కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లిలో ఉంటున్నప్పుడు, మిత్రుడు దుర్గాప్రసాద్‌తో కలిసి లైబ్రరీలో ‘రత్తాలు రాంబాబు’ మొదటిభాగం తీసుకున్నాను. ఇద్దరం కలిసి ఒకళ్ల తర్వాత ఒకరం ఆ భాగాన్ని ఎలా గబగబా చదివేశామో, అది పూర్తికాగానే హడావుడిగా వెళ్లి, రెండోభాగం, ఆతర్వాత మూడోభాగం తెచ్చుకుని ఎలా ఆత్రంగా చదివేశామో నాకిప్పటికీ వివరంగా గుర్తుంది! అనంతరకాలంలో రావిశాస్త్రిగారి రచనలు అడపాదడపా చదువుతూనే ఉన్నప్పటికీ, అవన్నీ ఎందుకో చదవాల్సిన క్రమంలో చదవలేదనిపించింది. మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘రచనా సాగరం’ చూశాక, ఆయన రాసినవి సరీగ్గా చదవడంమాట అటుంచి, అసలు ఎంత తక్కువ చదివానోకూడా అర్థమైంది.

రావిశాస్త్రిగారి రచనలన్నిటినీ పద్ధతిగా ఒకటికి రెండుసార్లు, రెండుకి నాలుగుసార్లు చదివాక, చదివిన వాటిల్లో ముఖ్యమైన వాక్యాల్నీ, రావిశాస్త్రిగారు ప్రతిభావంతంగా చేసిన వ్యక్తీకరణల్నీ, మాటల మెరుపుల్నీ, పదాల విరుపుల్నీ, వ్యంగ్యాల్నీ, హాస్యాల్నీ అన్నింటినీ, నేను మళ్లీ మళ్లీ చదువుకుందుకు వీలుగా భద్రపరుచుకుంటూ వచ్చాను. అవి చదువుకుంటున్న ప్రతిసారీ, మనకుమాత్రమే అనుభూత మయ్యే ఆనందం కొసరుగా అందించే అస్పష్టమైన బెంగ ఒకటి ఏదో అదనంగా కలిగేది. ఆ రచనా విశేషాలన్నీ ఎవరితోనైనా పంచుకోవాలన్న తహతహ మొదలయ్యేది. అందుకోసం వీటిని సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడూ పంచుకుంటూ వుండేవాడిని. అయితే, ఆ ప్రయత్నం సరిపోదనీ, రావిశాస్త్రి అనే మహారచయిత ప్రతిభ కొన్ని ఫేస్బుక్ పోస్టులకిమాత్రమే పరిమితమైనది కాదనీ, ఇవన్నీ అందరికీ ఇంకా వివరంగా, విస్తృతంగా తెలియాలనీ, దానికి ఇంకా ఏదేదో చేసితీరాలనీ చాలా బలంగా అనిపిస్తూ ఉండేది.

అటువంటి బలమైన కోరికలోంచి పుట్టిందే ఈ పుస్తకం!

 ఇలా, ఎంపికచేసిన వాక్యాలతో ఎవరైనా ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకురావడంలో ఇది మొదటి ప్రయత్నమూ కాదు; చివరి ప్రయత్నమూ కాబోదు. బూదరాజు రాధాకృష్ణగారి ‘మరవరాని మాటలు’ (2004) వివిధ రచయితల రచనలనుంచి సేకరించినవి. అలానే యండమూరి వీరేంద్రనాథ్‌గారి ‘మంచి ముత్యాలు’ (1995) ఆయన రచనల్లోంచి తీసుకున్నవి. తల్లావజ్ఝల శివాజీగారి ‘త్రిపథ’ (2019) భారత రామాయణ భాగవతాలనుంచి చేసిన మంచివాక్యాల ఎంపిక. ఇలాంటి పుస్తకాలు ఇంకా మరికొన్ని ఉండివుండవచ్చు.

అసలు, రావిశాస్త్రిగారి రచనల విషయంలోనే ఈ ప్రయత్నం ఇంతకుముందు రెండుసార్లు దిగ్విజయంగా జరిగింది. రావిశాస్త్రిగారు కవితాధోరణిలో రాసిన వాక్యాలతో  త్రిపురనేని శ్రీనివాస్ ‘ఎన్నెలో ఎన్నెల’ అనే ఓ యాభైపేజీల పుస్తకాన్ని 1991లో ప్రచురించారు. ఆ తరువాత, పదిహేనేళ్ల అనంతరం, రావిశాస్త్రిగారి సొంపైన వచనాన్ని పరిచయం చేస్తూ  జి.ఎస్. చలం, ‘రావి’ అనే వంద పేజీల పుస్తకాన్ని 2006లో ప్రచురించారు. ఇప్పుడు రావిశాస్త్రిగారి రచనలన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఇప్పుడీ పుస్తకాన్ని ఇంత ప్రమాణంలో, ఇంత విపులంగా తీసుకురావడం సాధ్యపడింది. శ్రీరమణగారి మాటల్లో, ‘పుటలు తిప్పడమే గొప్ప అనుభవం…’ కాగల పుస్తకం ఇది. అటువంటి గొప్ప అనుభవానికి కారణం కేవలం రాచకొండ విశ్వనాథశాస్త్రిగారూ, ఆయన రచనల్లో ఉన్న సౌందర్యమూ-బీభత్సమూ, సారళ్యమూ-సంక్లిష్టతల సమ్మిశ్రత.

 ***

రావిశాస్త్రిగారి రచనల్లోని వస్తువుని గురించి స్థూలమైన అవగాహన సాధారణంగా పుస్తకాలు చదివేవారందరికీ కచ్చితంగా ఉండేవుంటుంది. అన్యాయాలు, దోపిడీలు, దగాలు, మోసాలు, కుతంత్రాలు, రాజ్యహింస, పతితులు, భ్రష్టులూ, ఇంకా ఇంకా అణగారిపోతున్న అణగారిన వర్గాలూ— ఇటువంటి అంశాలు, పాత్రలమీదుగా ఆయన రచనలు నడుస్తాయనీ, దెబ్బతిన్న మనుషులపట్ల ఆయనకి ఆలోచనాపరమైన సహానుభూతే కాకుండా, క్రియాపరమైన ఆచరణకూడా ఉందనే విషయం చాలామందికి తెలిసేవుంటుంది. ఈ స్థూలచిత్రానికి సమాంతరంగా ఆయన కొసరు విశేషం మొత్తమూ ఆయన తన రచనల్లో సూక్ష్మవివరాలని పొందుపరిచే విధానాల్లో ఉంది. ఆయన భావవ్యక్తీకరణలో ఉంది. వ్యక్తిత్వాలని పరిశీలించడంలో ఉంది. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, బలంగా చెప్పడంతోబాటు, ఆ చెప్పడంలో పాఠకుడిని ముంచెత్తేయగల ఆకర్షణని జోడించడంలో ఉంది. ఆయన రచనల్లోని ఏపాత్రా నాటకంలోని సంభాషణలు అప్పచెపుతున్నట్టుండదు. అవి పాత్ర తాలూకు సహజమైన వ్యక్తిత్వంనుంచి అప్పటికప్పుడు ఉద్భవించిన అంతరంగ చైతన్యపు భావశకలాల్లా ఉంటాయి. అది జీవభాష. ఆయన పాత్రలకుండే హాస్యాలు, వ్యంగ్యాలు, వెటకారాలు, దుఃఖాలు, విషాదాలు, అంతఃకరణలు, అంతఃకరుణలూ అన్నీ ప్రాంతీయ నేపథ్యపు సరంజామాతోనే వస్తాయి. కథాసంవిధానం విషయంలోనూ, ఇతర శిల్పవిషయాల్లోనూ అమల్లో ఉన్న అన్ని కథాసూత్రాలనీ తోసిరాజని, నిమ్మళమైన కథన విధానాలని ఎంచుకుని, అలానే రాసి ఒప్పించగలిగారాయన. ఆ వచనంలో ఉన్న గమ్మత్తు అది. ఎంత ఎక్కువగా విడమర్చి ఆయన చెప్తున్నా, ఒక్క వాక్యమూ వృధాగా రాసినట్టు అనిపించని ధోరణి ఆయనది. అందుకు ఉదాహరణగా ఈ పుస్తకంలో పన్నెండువందల పైచిలుకు వచనోత్సవా లున్నాయి!

అయితే, పైన చెప్పిన విశేషాలన్నీ శిల్పానికి సంబంధించినవి. వస్తువు స్థూలంగా పునరావృతమవుతున్నకొద్దీ, దాన్ని మరింత బలమైన శిల్పంతో పఠితల మనసుల్లోకి నాటవలసిన అవసరం గురించి బహుశా ఆయన తొలినాళ్లల్లోనే ఊహించి వుంటారని నా అంచనా.

అందువల్లనే రావిశాస్త్రిగారి ఏ రచనైనా చదివి పక్కన పెట్టేయడం అంత సులభం కాదు. ఆయన రాసినది ఏది చదివినా పట్టరాని ఆనందమో, అసౌకర్యమో, ఆవేదనో, బయటికిరాని దుఃఖమో, ఇంకా రాసివుంటే బాగుణ్ణుకదా అన్న అసంతృప్తో ఏదో ఒకటి మనకి మిగిలిపోతుంది.

ఇన్ని విశేషాల్ని, ఆయన తన రచనల్లో ఎక్కడెక్కడ ఎలా ప్రదర్శించారూ అన్నది చూడటం పాఠకులకి ఆసక్తికరంగానే ఉంటుంది. అలా నేను చూసినవాటిని ఈ పుస్తకం మీకు చూపిస్తుంది. ఈ వచన నిర్మాణాల వెనక ఉన్న వ్యాకరణాలని సిద్ధాంతీకరించవచ్చు. కానీ అది సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసేవారికి ఆసక్తికరంగా ఉంటుంది తప్పించి, మామూలు పాఠకులకి కాదు. అందువల్ల అటువంటి ‘సిద్ధాంతీకరించే’ పనులేవీ ఈ పుస్తకంలో తలపెట్టలేదు. ఏది ఎందువల్ల విశేషంగా మారిందీ అన్నది పాఠకులే ఈ పుస్తకంలోని వచనభాగాలని ఒకటికి రెండుసార్లు చదివాక తప్పక అర్థంచేసుకోగలరు!

ఈ పుస్తకంలో ఉన్న సౌలభ్యమేమిటంటే, దీన్ని వరసగా చదువుకుంటూ పోనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఏ పేజీ అయినా తీసి అప్పటికప్పుడు ఆ పేజీ చదువుకోవచ్చు. ఆ పేజీ ఇందాకే చదివిందైతే మరో పేజీకి మారిపోవచ్చు. ఎంతవరకూ చదివిందీ ఎన్నటికీ గుర్తుపెట్టుకోనక్కర్లేదు. తీరిక ఎక్కువగా ఉన్నా, లేకున్నా, ఎంతున్నా ఈ పుస్తకం తిరగేయవచ్చు.

అయితే—

వచనఖండికలతో కూడుకున్నటువంటి ఈపుస్తకం, మౌలికంగా రచనల్లోని శిల్పవైశిష్ట్యాన్ని చూపించడానికి ఉద్దేశించబడినది. అందువల్ల, ఈ పుస్తకం శిల్పాన్ని గుర్తించడానికీ, దాన్ని అర్థంచేసుకోడానికీ బాగా పనికొస్తుంది. ఆసక్తికొద్దీ మూలరచనని సంపూర్ణంగా చదివే సమయంలో ఈ పుస్తకంలోని ఉదాహరణలు ఆయా కథావస్తువులలో ఎలా మిళితమైపోయి, బలమైన వ్యక్తీకరణలకి ఎలా దోహదం చేశాయో పరిశీలించవచ్చుకూడా!

 ***

ఏదైనా బాగాలేనిది బాగాలేదు అని కారణాలతోసహా చెప్పటం కొంతవరకూ తేలికే. కాని, ఫలానాది బాగుందీ అని సకారణంగా చెప్పటం కొంచెం కష్టం; పైగా అలా చెప్పి ఇతరులని ఒప్పించడం ఇంకా కష్టం. ‘కొమ్మ గానరాదు బ్రహ్మకైన, కొమ్మ గానఁబడిన కొనియాడవచ్చురా,’ అన్నారు వేమన. ఆ కొమ్మని కనుక్కోవడమే అసలు కష్టం. ఈ పుస్తకం విషయంలో బాగున్నవి ఎందుకు బాగున్నాయో చెప్పే శ్రమనుంచి నన్ను నేను మినహాయించుకుంటున్నానని నేను ఎంతగా అనుకుంటున్నప్పటికీ, రావిశాస్త్రిగారి రచనల్లో విశేషాల్ని గురించి నాలుగు మాటలైనా చెప్పకపోతే ఈ పుస్తకానికి పూర్తిన్యాయం జరగదని నేను పూర్తిగా నమ్ముతున్నాను.

రావిశాస్త్రిగారి కథనంలో ఉండే మెరుపులనీ వెలుగులనీ కాసేపు పక్కనపెడదాం. శిల్పం గురించీ, సాహిత్యోపకరణాల గురించీ ఆయనకున్న అవగాహనని ఆయన ప్రత్యేకించి ఎక్కడా స్పష్టంగా చెప్పక పోయినప్పటికీ (Bathos గురించి కోట్—1184 మినహా) ఆయా విశేషాలు ఆయన రచనల్లో విరివిగా కనిపిస్తుంటాయి. దీనికొక ఉత్కృష్టమైన ఉదాహరణ: ‘సొమ్మలు పోనాయండి’ నవలిక. ఉత్తమపురుష కథనం మనకి కొత్తకాకపోయినప్పటికీ, ఆ ఉత్తమపురుష కథకుడు తన కథని నేరుగా పాఠకుడికి చెప్పడంవల్ల— పాఠకులకి అవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయన్న తక్షణానుభూతి కలుగుతుంది; అంతేకాదు, పాఠకులకీ కథకుడికీ మధ్య మానసిక దూరం చెరిగిపోతుంది; పైగా, న్యాయం మీరే చెప్పండి అని అడుగుతున్నట్టుండటంవల్ల, పాఠకులు ఆ అసమర్థపు వ్యవస్థకి ప్రత్యక్షసాక్షులుగా మారి అదనపు అసౌకర్యానికీ అసహనానికీ గురవుతారు. ఇన్ని అంశాలూ కలిసి, అవన్నీ ఆ రచనని చదివిన పాఠకులమీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో, పాఠకులకి ఆ కథకుడిపట్ల ఎలాంటి సహానుభూతిని రేకెత్తిస్తాయో తేలిగ్గా ఊహించవచ్చు. ఇటువంటి కథన విధానాన్ని ఎన్నుకోవడం, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం విశేషమైన ప్రతిభ ఉంటే తప్ప సాధ్యంకాదు.

ఇటువంటిదే మరో మంచి ఉదాహరణ: ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’ నవల. జరుగుతున్న అన్ని అన్యాయాలనీ, అకృత్యాలనీ సమర్థిస్తూ, వాటిని ఉన్నతీకరించే రీతిలో ఒక అన్‌రిలయబుల్ కథకుడి ద్వారా కథని చెప్పించడం అన్నది క్లిష్టమైన ప్రయోగం. ముందుగా కథకుడు అన్‌రిలయబుల్ అయివుండడానికి ఒక బలమైన కారణం ఉండాలి— అతను ఉన్మాదా, తాగుబోతా, మరోటా ఇంకోటా అన్నది. ఈ నవలలోని కథకుడు చిన్నపిల్లవాడు కాబట్టీ, అతని జీవితావగాహనకి తీవ్రమైన పరిమితులుంటాయి కాబట్టీ, ఆ పిల్లవాణ్ని అన్‌రిలయబుల్ కథకుడిగా చేయడంతో ఆ సమస్యని విజయవంతంగా పరిష్కరించారు రావిశాస్త్రిగారు. ఇలాంటి కథనాల్లో మరో ముఖ్యమైన అవరోధం— పాఠకులు కథకుడు చెప్పే అవాస్తవాలతో కొట్టుకొనిపోకుండా, స్థిరంగా నిలబడి, ఆ కథకుడి కథనాలకు వ్యతిరేకంగా ఆలోచించేలా చేయడం. ఆ కథకుడు ఎటువంటి ఘోరాల్ని సైతం పెదనాయనగారిమీదున్న ఆరాధన కారణంగా సమర్థిస్తున్నాడూ అని అతని వక్రతర్కాన్ని రావిశాస్త్రిగారు పలు దృష్టాంతాలతో విస్పష్టంగా రచనలో చెప్పగలిగారు కాబట్టి, నవలతోబాటు కొన్ని పేజీలు నడిచాక, పాఠకులుగా మన పాత్ర ఏమిటో మనకర్థమవుతుంది. అందువల్లనే, ఆవుల కిష్టయ్య అంత మాటకారితనంతో తెలివిగా మాట్లాడుతూ సత్యమూర్తిని అవమానిస్తుంటే (కోట్స్ 666—668) మన సానుభూతి సత్యమూర్తిమీదనే ఉంటుంది తప్పించి, తెలివిగా మాట్లాడుతున్న కిష్టయ్యమీద ఉండదు! ఆ స్థితికి పాఠకులని అవలీలగా రప్పిస్తారు రావిశాస్త్రిగారు.

ద్విరుక్తాలు రావిశాస్త్రిగారి రచనా విధానంలో ఒక కీలకాంశం. ‘అది వెన్నెలే, వెన్నెలే…’, ‘ఆశలయో ఆశలే…’ అంటూ సాగే ‘వెన్నెల’ కథ అందరికీ గుర్తుండేవుంటుంది. ఆ కథని ఒక్కసారి చదివితే మరిచిపోవడం ఎంత కష్టమో, దాన్ని మళ్లీ మళ్లీ చదవకుండా ఉండటం అంత కష్టం. రావిశాస్త్రిగారి రచనల్లో ఏదో మామూలుగా మేఘాలూ, మెరుపులూ రావు. ‘నీలం నీలంగా ఉన్న ఆకాశం నలుపు నలుపుగా మారిపోయి మెరుపు మెరుపుల్తో నిండిపో’తుంది (కోట్—950). పదాలని అలా పునరావృతం చేసి, భావాన్ని బలంగా పాఠకుల మనస్సులమీద ముద్రించడం ఆయన అన్ని రచనల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ ద్విరుక్తాలనే onomatopoeicగా (శబ్దానుసారంగా) చెప్పిన సందర్భాలలో ఒకటి ‘ఈ ప్రేమలోకంలో’ కథలో కనిపిస్తుంది (కోట్—350). ఇందులో పాములపరంగానూ, కప్పలపరంగానూ వచ్చిన పదబంధాలు సందర్భానికి అతికినట్టు ఎలా సరిపోయాయో చూడొచ్చు. అలానే, ఒక సమూహం తాలూకు సంక్లిష్టమైన బహుళ చైతన్యాలని ఆయన ఎంత వినూత్నంగా, ఎంత ప్రతిభావంతంగా చెప్తారో ‘నల్లమేక’ (కోట్—33), ‘హారతిపళ్లెం’ (కోట్—253) కథల్లో కనిపిస్తుంది. ఆయా ఘట్టాల్లో— తప్పించుకున్న మేక ఆడదా, మగదా అనే కుతూహలం చూపించేవాడూ, స్కూటర్ కుర్రాడికి దెబ్బల్తగిలాయా అని ఆందోళన చెందేవాడూ కామిక్ రిలీఫ్ కలిగిస్తున్నట్టుగా అనిపించినా, జరుగుతున్న దానికి భిన్నంగా జనాల ఆసక్తులెలా ఉంటాయో చూపించే విమర్శ వాటిల్లో ఉంది. అలాగే, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సహజంగా ఊహించేదానికి భిన్నంగా చెప్పి ఆశ్చర్యపరుస్తారు రావిశాస్త్రిగారు. ‘నీడలు’ కథలో ఉండేది జుఆలజీ చెప్పే లెక్చరర్ కాదు, జుఆలజీ ‘చెప్పలేని’ లెక్చరర్ (కోట్—58). మరికొన్ని సందర్భాలలో చెప్పిన విషయాన్నే ఇంకొంచెం విపులీకరించి హాస్యం సృష్టిస్తారు. ‘పెళ్లయిందా? లేక సదుంకొంటున్నావా?’ (549), ‘దొంగడాక్టర్ల లిస్ట్’ (572), ‘చెంబూ-చిల్లూ న్యాయం’ (593) వంటి ఉదాహరణల్లో, ఆ అదనపు విపులీకరణే లేకపోతే హాస్యమే లేదు!

రావిశాస్త్రిగారి ప్రయోగాల్లో చెప్పుకోదగినది ‘ట’కార ప్రయోగం. అలా అన్నాట్ట, ఇలా చేశాట్ట అనే తరహాలో చెప్పే ఈ ‘ట’కారాన్ని ఆయన కంఠధ్వనిలోని వెటకారానికి అద్భుతంగా వాడుకున్నారు. అటువంటి వెటకారం ‘అలనాటి డాన్ జువాన్’ (కోట్—355)లో చూడొచ్చు. ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’లోనూ, ‘పిపీలికం’లోనూ విభిన్న వర్ణాలలో చూడొచ్చు. అయితే, రావిశాస్త్రిగారు ఈ ప్రయోగాన్ని ఒకచోట మరోఎత్తుకి తీసుకెళ్లారు. ‘రక్షకులు’ కథలోనిది (కోట్—76) ఆ గమ్మత్తు. “రారా?”ట, “ఎందుకు రారూ?!”ట.”— అవతలివాడు కథకుణ్ని అడిగిన ఈ రెండు ప్రశ్నల మధ్యా (రచయిత కావాలని వదిలేసిన) కథకుడి సమాధానం ఉంటుంది!

రావిశాస్త్రిగారి రచనల్లో పాత్రలు ఇచ్చే ఉపన్యాసాలు కోకొల్లలుగా ఉంటాయి. ‘మాయ’ కథలో లాయరు గారి ఓపెనింగ్ ఉపన్యాసం (కోట్—96), ‘రాజు-మహిషి’లోని కిల్లీ కొట్టు వర్ణన, ఒక ‘విద్వద్వంశపు కొసపింజ చెప్పిన వృత్తాంతము’ వగైరాలు కొన్ని ఉదాహరణలుమాత్రమే. ఇవి రావిశాస్త్రిగారి రచనల్లోనే కాదు, మొత్తం తెలుగుసాహిత్యంలోనే ప్రత్యేకించి గొప్పగా చెప్పుకోదగ్గ వచనఖండికలు.

దృశ్యానికీ, శబ్దానికీ ఉండే సంబంధాన్ని విజువలైజ్ చేయించగలిగే రచయితలు అతితక్కువమంది ఉంటారు. చేతికర్రని తాటించుకుంటూ వెళ్లిపోయిన ముసలివాడి “కర్రకాళ్ల చప్పుడు దూరమయింది, చిన్నదయింది, చివరికి వినిపించకుండా,” పోతుంది, ‘ఆకలి’ కథలో (కోట్—116). ‘రత్తాలు రాంబాబు’ నవలలో సింహాచలంతో లేచిపోతున్న రత్తాలు ఎక్కిన బస్సు అప్పుడే కదుల్తుంది. కదలక ముందు, “కిల్లీ బడ్డీలు తెరుస్తున్నారు. కాఫీ కొట్లోంచి పాసెంజర్లు బైటకొస్తున్నారు, లోనికి వెళ్తున్నారు. రెండావులు మూతులు రాసుకొంటున్నాయి. ఓ ముష్టిది తల బక్కురుకొంటోంది. ఎక్కడో ఓ చంటిపిల్లడు ఏడుస్తున్నాడు.” అన్నీ మామూలుగా సాధారణంగా కనిపించే దృశ్యాలు. బస్సు కదలగానే, “దృశ్యాలన్నీ వెనక్కి పోయేయి, శబ్దాలన్నీ ఉండిపోయేయి.” రచిస్తున్న సన్నివేశాలని తాను స్వయంగా తన మానస తలంలో దర్శించగలిగిన రచయితమాత్రమే వాటిని మనచేతకూడా దర్శింపజేయగలడు!

రావిశాస్త్రిగారి రచనల్లోని రకరకాల వర్ణచ్ఛాయల్లో ఇవి చాలా కొన్నిమాత్రమే. ఇక, ఆయన కవితాత్మక ధోరణి గురించి చాలా చెప్పొచ్చు. ఆయన రాసే పదాలు యావత్తూ కలిసి పద్యాలుగా ఎలా మారిపోతాయో చెప్పొచ్చు. ఇంతా చేసి, ఆయన రచనల్లో రంగుల గురించి మాట్లాడేరే కానీ ఫిరంగులని గురించి ఏమీ చెప్పలేదేం అని మీరనొచ్చు. పర్లేదు, అవి అడుగడుగునా మీకు తగుల్తూనే ఉంటాయి! రావిశాస్త్రిగారి వర్ణనల గురించీ, ఆయన ఉపమానాల గురించీ ఒక్కమాటైనా చెప్పలేదే అనీ అనుకోవచ్చు. దానికి రావిశాస్త్రిగారి మాటల్లోనే సమాధానం ఇవ్వాలంటే: “కృష్ణుడికి సంస్కృతం బాగావచ్చును. అతను ఉపన్యాసాలివ్వగలడు, గీతలు చెప్పగలడు అని ప్రత్యేకంగా చెప్పాలా…?”

రావిశాస్త్రిగారి మాటల్లోనే, ‘ప్రబంధంలో ఆఖరాశ్వాసంలో ముఖ్యవిషయం ఏఁవిఁటంటే’: ఏ శిల్పవిశేషమూ దానికదే స్వతంత్రంగా గొప్పది కాదు. వస్తురీత్యా రచనలో దానికి సముచితమైన స్థానం ఉండి, అది విడిగా కనబడనంతగా వస్తువుతో కలిసిపోయివుంటేనే మొత్తంగా రచన రాణిస్తుంది. రచనలో శిల్పం ఉండటంకంటే, ఆ రచనలో ఆ శిల్పానికో ప్రయోజనం ఉండటం ఇంకా ముఖ్యమైన విషయం.

అందువల్ల, ఇలా ఓ పిడికెడు విశేషాలని ఏకరువు పెట్టి, రావిశాస్త్రిగారి వైదగ్ధ్యాన్ని ఒక నాలుగైదు పేజీల చట్రంలో సంపూర్ణంగా ఆవిష్కరించడం బొత్తిగా కుదరని పని! ఏ ప్రతిభావంతుడి వైదుష్యం తాలూకు లోపలిపొరల అల్లికైనా అదంతా ఒక క్లిష్టమైన ప్రహేళిక. దాన్ని పూర్తిగా విడదీసి, విడమర్చి చెప్పితే చెప్పొచ్చు; కానీ, క్లుప్తంగా చెప్పడం కష్టం. అంతటి ప్రతిభావ్యుత్పత్తుల మేలుకలయికగా వచ్చే ప్రతిరచనా ఒక mystery of mastery! అవి వూహాత్మక, వ్యూహాత్మక కథనాలు!

 ***

ఈ పుస్తకం వీలైనంత ప్రామాణికంగా తయారుచేయాలనే పట్టుదల నాకు మొదటినుంచీ ఉంది. అంటే, పలు ప్రచురణల అనంతరం అవే రచనల్లోని కొన్ని కొన్ని అక్షరాలు, పదాలు మారిపోయే అవకాశం ఉన్నందువల్ల, సాధ్యమైనంతవరకూ (అంటే, లభ్యమైనంతవరకూ) ఆయా రచనల తొలి ప్రచురణలని అనుసరించి రచనపాఠాలని సవరించుకోవడం జరిగింది. అయితే, కొన్ని రచనలు పత్రికల్లో ప్రచురించబడిన అనంతరం పుస్తకరూపంలో వచ్చినప్పుడు (రావిశాస్త్రిగారు జీవించివున్న కాలంలోనే) కొన్ని కొన్ని మార్పులూ, చేర్పులూ జరిగాయి. అటువంటి సందర్భాల్లో, ఆ అనంతర ప్రతుల్నే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది.

పుస్తకం నిర్దుష్టంగా ఉండాలనే పట్టుదలతో, అక్షరదోషాలకోసం ‘కళ్లల్లో వత్తులేసుకుని’ మరీ పరిశీలించాను. అయినా అక్కడక్కడా ఒకటీ అరా ఉండకపోవన్న అనుమానం ఉంది. వాటిని నాదృష్టికి సహృదయులు తీసుకునివస్తే, మలిప్రచురణ జరిగితే అందులో వాటిని తప్పక సవరించుకుంటాను! రావిశాస్త్రిగారి రచనల్లో కొన్నింటికి చిత్రకారులు గీసిన బొమ్మలున్నాయి; కొన్ని అముద్రిత, అసంపూర్ణ రచనలకిమాత్రం సహజంగానే బొమ్మలు లేవు. సాధ్యమైనంతవరకూ ఆయా కథలకీ, సీరియల్స్‌కీ సంబంధించిన బొమ్మలనే ఈ పుస్తకంలో సంబంధిత పేజీలలో ఉంచడం జరిగింది. బొమ్మలు అలభ్యమైనచోట్ల—ముఖ్యంగా నాన్-ఫిక్షన్ రచనలు—రావిశాస్త్రిగారివే ఇతర కథల/సీరియల్స్ బొమ్మలని తీసుకుని వాటిని ఆ పేజీల్లో, పుస్తకం తాలూకు ఏకరూపతకోసం, ఉంచడం జరిగింది.

ఈ పుస్తకాన్ని సర్వాంగసుందరంగా తీసుకురావాలనే పట్టుదల నాకుంది. అయితే, ఆ ప్రయత్నం పాఠకులకి భారం కాకూడదన్న అభిప్రాయంకూడా నాకుంది. పుస్తకాన్ని చూస్తేనూ, దానికి నిర్ణయించిన వెలని చూస్తేనూ బహుశా ఈ విషయం మీకు సులభంగానే అర్థం అవుతుందని నేననుకుంటున్నాను.

 ***

ఈ పుస్తకాన్ని ప్రచురించాలని తలపెట్టాక, దాన్ని అంగీకరించి, ప్రోత్సహించి, ముందుకు వెళ్లమని చెప్పి, అభినందనలు తెలియజేసిన శ్రీ రాచకొండ ఉమా కుమార్ శాస్త్రిగారికీ (రావిశాస్త్రిగారి కుమారుడు), నవోదయా బుక్ హౌస్ (కాచిగూడ, హైదరాబాద్) వారికీ నేనెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. అలానే, ‘రచనా సాగరం’ పుస్తకాన్ని ప్రాతిపదికగా చేసుకోవడానికి అనుమతించిన ‘మనసు’ రాయుడు గారికీ, ఆ సమగ్ర సంకలనం సంపాదకుల్లో మరొకరైన వివిన మూర్తిగారికీకూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వీరిరువురూ రావిశాస్త్రిగారి రచనలమీద చేసిన విశేషమైన కృషి కొత్తబాటల్ని పరిచింది.

రాచకొండని అద్దంలో చూపిద్దామని ఈప్రయత్నం. అలా ఈ పుస్తకం అద్దంలా తయారవడంకోసం, ఈ పుస్తకం తయారీలో ప్రముఖపాత్ర వహించిన వాసిరెడ్డి నవీన్‌గారు, అన్ని విభాగాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా, అవసరమైనచోట్ల మాటసహాయమూ చేశారు. అలానే, విపరీతమైన పనివత్తిడులమధ్యకూడా ఈ పుస్తకానికి అవసరమైనంత సమయాన్నీ కేటాయించి, ఎంతో ఓర్పుతోనూ, మరెంతో ఇష్టంగానూ దీన్ని డిజైన్ చేసిచ్చారు ‘అక్షర’ సీతగారు. వీరిద్దరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు.

సాహిత్యంలో తొలిసారిగా నన్ను చిన్నచిన్న అడుగులు వేయనిచ్చింది ‘రచన’ శాయిగారు. అందువల్ల ఆయనంటే నాకో ప్రత్యేకమైన అభిమానం ఉంది. తన ‘రచన’ పత్రికలోని కొన్ని బొమ్మల్ని అరువు తీసుకుంటానంటే ఆయన సంతోషంగా అనుమతించారు. ఆయన ఔదార్యం, అభిమానాలపట్ల నాకు ఆనందమూ ఉంది, గౌరవమూ ఉంది. కృతజ్ఞత అంతకన్నా ఉంది.

ఈ రచనలన్నీ కథలుగా, సీరియల్స్‌గా పత్రికల్లో వస్తున్నప్పుడూ, కథాసంపుటాలుగా నవలలుగా సమగ్ర రచనలుగా ప్రచురణలు పొందినప్పుడూ చిత్రాలు గీసిన చిత్రకారులందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారి చిత్రాలు కొన్ని ఇందులో దర్శనమిస్తాయి. బాపు, చంద్ర, బాలి, కరుణాకర్— ఈ అపురూపమైన చిత్రకారులందరూ ఇవాళ మనమధ్య లేకపోయినప్పటికీ, వాళ్లందరినీ గుర్తుచేసుకోవ డానికి ఇటువంటి సందర్భాలు వస్తూనే ఉంటాయి; వాళ్లు మన మనస్సుల్లో కలకాలం ఉంటూనే ఉంటారు.

ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో మానసిక ప్రోత్సాహాన్ని అడుగడుగునా అందించిన సహచరి పద్మప్రియకీ, తొలినాళ్లల్లో ఇదంతా పుస్తకరూపంలో ఎలావుంటుందో చూసుకోవడానికి అనువుగా అవసరమైన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసిచ్చిన మా అమ్మాయి చైత్రకీ, తనీ పనిలో మునిగిపోయి వున్నప్పుడు మిగతాపనులు చక్కబెట్టుకుంటూవున్న యతీంద్రకీ, వీళ్లిద్దర్నీ వాళ్ల వాళ్ల పనులు చేసుకోనిస్తూ, తనపాటికి తను ఆడుకుంటూ వున్న చి. రిషికీ వీళ్లకి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు కానీ, అయినా కృతజ్ఞతలు!

ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో రెండు ముఖ్యోద్దేశాలు ఉన్నాయి. కొత్తగా చదివేవారికీ, లేదా రావిశాస్త్రిగారిని కొన్నేళ్లక్రితం ఎప్పుడో చదివినవారికీ, ఆయన ప్రతిభ మరింతగా వెల్లడయే సరైన వెలుగులో ఆయన్ని చూపించాలన్నది మొదటి ఉద్దేశం. ఈ పుస్తకంలో ఉటంకింపులు ఆసక్తికరంగా అనిపిస్తే, రావిశాస్త్రిగారి రచనలు చదవాలన్న ఉత్సుకత పాఠకులలో కొత్తతరానికి కలగకపోతుందా అన్నది రెండో ఉద్దేశం; ఇప్పుడు రావిశాస్త్రిగారి రచనలు విరివిగానే దొరుకుతున్నాయి కాబట్టి, ఆ ఆశ వారికి తీరడం ఒకప్పుడంత కష్టం కాదు.

కాలం నిరంతరం మార్పులకి గురవుతూనే ఉంటుంది. ఏ కాలానికి తగిన సాహిత్యం ఆ కాలానికి అవసరమవుతుంది. మార్పులేవైనా, కొత్తసమస్యలేవైనా, వాటిని పరామర్శించి విమర్శించగలిగిన తాహతు సాహిత్యానికి ఉంటుంది. అయితే, అటువంటి విమర్శ సూటిగానూ, పదునుగానూ, స్పష్టంగానూ ఉండటం అవసరం. అటువంటి బలమైన ఉపకరణాలున్నాయన్న సంగతిని ఇటువంటి సాహిత్యం మరొక్కసారి గుర్తుచేస్తుంది. అందుకే, రావిశాస్త్రిగారి రచనలు ఇప్పటికీ చదవదగ్గవీ, చదివి నేర్చుకోదగ్గవీ; కొనదగినవీ, కొని కొనియాడదగినవీ!

ఈ పుస్తకాన్ని మీరు చదవడం మొదలుపెట్టిన కొన్ని పేజీలకే మీకు అర్థమైపోతుంది. అదేమిటంటే—

ఈ పుస్తకంలో బాగున్న ప్రతివిషయమూ రావిశాస్త్రిగారిది.

బాగోలేనివి ఏవైనా ఉంటే—అంటే ఎంపికా, అక్షరదోషాలూ, ఇతరత్రా లోపాలూ—అవన్నీ నావి!

*

ఎ.వి. రమణమూర్తి

సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అధ్యయనపరంగా రావిశాస్ట్రీ గారి శిల్పమ్మీద కధా కధన శైలి మీద చాలా సమగ్రమైన రచన అనిపిస్తోంది. అయితే శాస్త్రి గారి పుస్తకాలన్నీ పక్కన పెట్టుకుని చదవాల్సిన పుస్తకం. అభినంందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.