రాచకొండ విశ్వనాథశాస్త్రి!
క్లుప్తంగా, ఆప్యాయంగా పిలుచుకునే రావిశాస్త్రి తెలుగునేలపై వెలుగులు పూయించేందుకు 104 సంవత్సరాల క్రితం జన్మించిన మహోత్కృష్ట రచయిత.
సమాజంలోని కుళ్లును, మనుషుల మెదళ్లలో ఇంకా గూడుకట్టుకునే ఉన్న సంప్రదాయపు బూజును, ప్లీడరుగా తను స్వయంగా, అతి దగ్గరగా చూసిన న్యాయవ్యవస్థ డొల్లతనాన్ని, రాజకీయవ్యవస్థలోని దుర్మార్గాన్ని, బ్యురోక్రసీలోని దారుణమైన అలసత్వాన్ని, వీటన్నిటినీ పదిలంగా కాపాడుతున్న పోలీసు వ్యవస్థ దాష్టీకాన్ని తన కలంతో చీల్చిచెండాడిన మహారచయిత. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన మహారచయితే. దాదాపు రెండువేల పేజీల్లో పరుచుకున్న ఎనభైకి పైగా కథల్లోను, ఏడు నవలల్లోను ఆయన వినిపించిన సామాన్యుల ఆక్రందనలే అందుకు నిదర్శనం. వారి హృదయప్రకంపనల్నీ, ఆక్రోశాలనూ గుండెలమీద చెవిపెట్టి విని మరీ రాశారు. ఒక్కొక్క వాక్యం మనల్ని కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకే ఆయన మహారచయిత. ఇన్ని పేజీల నుండి సేకరించి రంగులను పంచిన, ఫిరంగులను పేల్చిన ఈ మూడువందల యాభై పేజీల్లోని ఆయన వాక్యాలే అందుకు సాక్ష్యం కూడా.
ఆయన మాటలకు తూటాల్లా పేలే శక్తి, ఎంచుకున్న వస్తువుకు అజరామరమైన నిత్యత్వం ఉండబట్టే దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా వారి రచనలను మళ్లీ మళ్లీ చదువుకుంటున్నాం, వాక్యాలను మననం చేసుకుంటున్నాం. శాస్త్రిగారి రచనల్లోని పాత్రలు ఈనాటికీ నిజజీవితంలో తారసపడుతూనే ఉంటాయి. రత్తాలు, ముత్యాలమ్మలు, రాకెట్ అప్పారావులు, అమాయక ప్లీడర్లు, మాయని మాత్రమే చూసి బాధను చూడలేని పెద్దపెద్ద లాయర్లు, జడ్జీలు, పోలీసులు – అందరూ నిత్యం ప్రశ్నలుగానే మనముందు నిలబడతారు.
శాస్త్రిగారు దాదాపు అరవైల వరకు రాసిన వర్షం, మామిడిచెట్టు, కార్నర్ సీటు వంటి కథలు మధ్యతరగతి జీవితాల్లోని దైన్యానికి, వారి మనసుల్లోని ద్వైదీభావానికి ప్రతిబింబాలు. ఈరోజుల్లోనే కథలు రాయటంలోని మెళకువలు ఆయనకు అలవడ్డాయి. అద్భుతమైన వాక్యవిన్యాసంతో వెన్నెలను పూయించారు, విషాదాన్నీ పండించారు. ఆ తరువాత శాస్త్రిగారి చూపు విస్తరించింది. ‘ప్రతి రచయిత ఎలా చెప్పటమనేది కాక, ఏది చెప్పటమనేది ముందు తేల్చుకోవాల’నే స్పష్టత ఆయనకి పూర్తిగా ఏర్పడింది. ఆ స్పష్టతతోనే సారాకథలు తో తన రచనా విశ్వరూపాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు. అది మరో ఆరు సారాకథలు, ఋక్కులు, బాకీకథలు, కలకంఠి వంటి కథాసంపుటాల్లో కనబడుతుంది.
1953లో రాసిన అల్పజీవి నవల తర్వాత మళ్లీ 1966 వరకు నవలలు రాయలేదు. ఆ తర్వాత రాజు-మహిషి నుంచి తిరిగి నవలలు రాయటం ప్రారంభించి 1993లో ఆయన మరణానికి కొద్దిరోజులు ముందు ప్రచురించిన ఇల్లు నవలతో తన రచనాజీవితాన్ని, జీవితాన్ని కూడా ముగించారు. ఈ నవలలన్నిటిలో రత్తాలు-రాంబాబులో ఆయన మెరిపించిన మెరుపు వాక్యాలు సామాన్యమైనవి కావు. ఇది సామాజిక, వర్తమాన, ఐతిహాసిక నవల అంటే అతిశయోక్తి అనిపించవచ్చు కానీ వాస్తవం. గోవులొస్తున్నాయి జాగ్రత్తలో మరిడీ మహాలక్ష్మి, రత్తాలు-రాంబాబు నవలలో రత్తాలు, ముత్యాలు; మూడుకథల బంగారంలో విమల, శ్రీశ్రీ చెప్పినట్లు, విషాదాశ్రువులకు, విలాపాగ్నులకు ప్రతీకలు. రావిశాస్త్రి ప్రతి నవలలోను ప్రధాన పాత్రలు స్త్రీలు. వారే నిర్ణేతలు, వారే మార్గదర్శకులు.
ఇలా చెప్పుకుంటేపోతే, రావిశాస్త్రి రచనలపై పెద్ద వ్యాసమో, లేదా పుస్తకమో రాయాల్సి వస్తుంది. ఈ ముందుమాట లక్ష్యం అది కాదుకదా!
***
ఈ పుస్తకం రావిశాస్త్రి రచనల్లోంచి కొన్ని ముఖ్యమైన వాక్యాలను, సంభాషణలను ఏర్చికూర్చిన ఉల్లేఖనాల (quotes) సమాహారం. వాటిల్లో విషాదవాక్యాలు, వ్యంగ్య వ్యాఖ్యలు, పాత్రల స్వభావాన్ని చిత్రించిన వర్ణనలు, మానవస్వభావాలపై వ్యాఖ్యానాలు— ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని ఇలా కూర్చడం అంత తేలికైన పనికాదు. ఆ పనిని రమణమూర్తి అలవోకగా చెయ్యలేదు. అతి శ్రద్ధతో, ఇష్టంతో చేశాడు. రావిశాస్త్రి సర్వలభ్య రచనలతో మనసు ఫౌండేషన్ ప్రచురించిన రావిశాస్త్రి రచనాసాగరం గ్రంథాన్ని దాదాపు రెండు మూడు సంవత్సరాలపాటు శ్రద్ధగా చదివి, చదవగానే ఆహా అనిపించిన వాక్యాలను, అద్భుతమనిపించిన పేరాలను ఏర్చికూర్చి పన్నెండువందల పైగా ఉల్లేఖనలతో గుదిగుచ్చి ఈ పుస్తకాన్ని మనకందిస్తున్నారు.
రమణమూర్తి సాహిత్యలోకానికి బాగా పరిచయమున్నవారు. కథాసాహితి ప్రతి సంవత్సరం ప్రచురించే కథాసంకలనాలకు గత పది సంవత్సరాలుగా సహాయం అందిస్తూ, రెండేళ్లుగా సహాయసంపాదకులుగా కూడా ఉన్నారు. ఆయన స్వతహాగా కథలు రాయకపోయినా కథమీద మంచి అవగాహన ఉన్నవారు. వివిధ దేశాల్లో వస్తున్న కథ, నవలా సాహిత్యాన్ని వ్యాఖ్యానిస్తూ కొన్ని వ్యాసఖండికలు రాశారు. కథ, నవల అంతరాత్మను పట్టుకోవటంలో సునిశితమైన కోణాలను చూడగలిగిన వ్యక్తి. నిజానికి రావిశాస్త్రి రచనల్లో ప్రతి వాక్యము గొప్పగానే ఉంటుంది. వాటిల్లోంచి కొన్ని వాక్యాలను, వ్యాఖ్యానాలను ఎన్నిక చేయటం సామాన్యమైన విషయం కాదు. ఇంతటి అసామాన్య భారాన్ని తనకు తానుగా ఇష్టపడి తలకెత్తుకుని మనకి ఈ గ్రంథరూపంలో అందిస్తున్నారు.
***
1222 ఉల్లేఖనాలతో ఈ మూడువందల యాభై పేజీల ఈ గ్రంథం రావిశాస్త్రికి నివాళిగా భావించవచ్చు. ఇందులోని వాక్యాలతో వారి సాహిత్య విశ్వరూపాన్ని సందర్శించవచ్చు. ఎంతో ఆలోచనతో, మథనతో రాసిన ఈ వాక్యాల గొప్పతనం వాటిని అలవోకగా రాసినట్లు అనిపించటం, పాఠకుల హృదయాలను సూటిగా తాకే లక్షణం ఉండటం. రచనలు చేసేవారందరూ ఆరంభం పెద్ద అవస్థ అనుకుంటారు కానీ శాస్త్రిగారికి అది వెన్నతో పెట్టిన విద్య. శ్రీశ్రీ రాసిన ఋక్కులు గేయానికి ప్రతిస్పందనగా కుక్కపిల్ల, అగ్గిపుల్ల… అంటూ ఎనిమిది కథలు, గుర్రపు కళ్లెం అను గోవులొస్తున్నాయి జాగ్రత్త అనే నవలను రాశారు. అందులో కుక్కపిల్ల కథకు రాసిన ఈ ప్రారంభవాక్యాలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ‘కథలోకి ఎలా దిగటమో తెలీక ఈ విధంగా దిగుతున్నందుకు పాఠకులు క్షమించాలి,’ (కొటేషన్ 135) అంటూ కథ మొదలవుతుంది. అలాగే సొమ్మలు పోనాయండి నవల—
సొమ్మలు పోనాయండి… అది ఆరంబఁవండి.
జత పోతులండి… జెనం నిలబడి సూసేవారండి. అలాటి సొమ్మలండి… పోనాయండి.
సొమ్మలు పోనాక బూదేవత కూడా పోనాదండి, ఆ ఎనక సంసారమంతా సల్లారిపోనాదండి.
బూదేవత పోద్దేటండి, మనం బోతాంగనీ- (815)
అంటూ ప్రారంభమవుతుంది. ఈ వాక్యాలు చదివిన తర్వాత నవల పక్కనపెట్టడం ఏ పాఠకుడికైనా సాధ్యమేనా!
తెలుగు సాహిత్యంలో వ్యంగ్యం అరుదుగా కనబడే పదార్థం. ఈ విషయంలో కె.ఎన్.వై. పతంజలి ఎప్పుడూ జ్ఞాపకానికొస్తారు. ఆయన ప్రతిభకి తోడు తన ముందుతరపు రావిశాస్త్రిలోని వ్యంగ్యాన్ని అందిపుచ్చుకున్నారనిపిస్తుంది. రావిశాస్త్రిగారికి తన కథల్లోను, నవలల్లోను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వ్యవస్థపై బాణాలు సంధించడానికి వ్యంగ్యం ఆయనకు పాశుపతాస్త్రం అయింది. తలుపు గొళ్లెం కథలో ఈ వాక్యాలు చూడండి. (286)
కోర్టులోకి వెళ్లటం, కోర్టు వ్యవహారం అంత దగ్గరి నుంచి చూడ్డం అదే ప్రథమం పైడ్రాజుకి. ఏటావాసన? అనుకున్నాడు- అది కోర్టు వాసన అని అతనికి తెలియదు.
మద్దెనేళ దీపాలెట్టుకున్నారేటి- ఆ గదులు కట్టినప్పుడే చీకటిగా కడతారని అతనికి తెలీదు.
పెట్టెల ఎక్కమంటున్నాడే- అవును అక్కడ్నించే అబద్ధాలు పలకాలి.
ఏటో సెప్పమంటున్నాడు ఏంటది?- దేవుడి ఎదుట ప్రమాణం చెయ్యమంటున్నాడు. అదీ అది!
దీనికి వ్యాఖ్యానం అవసరమా? రాజు-మహిషి నవలలో
ఆవుల్లో గేదెలు మనుషుల్లో నీగ్రోల వంటివి. (466)
ఈ కేసు గడిసి గట్టెక్కితే దేవుడికి జుట్టిచ్చి, ఓ నెల జీతం ముడుపు కట్టి ఉండీలో ఏస్తానని మొక్కుకో. కష్టమొచ్చినప్పుడు అంతా నష్టమే. (512)
రత్తాలు-రాంబాబు నవలలో
ఫోను తన దగ్గరికి లాక్కుంటూ హెడ్డుగారు, ‘తొత్తుకొడుకును చూడండి సార్,’ అన్నాడు.
తొత్తుకొడుకు ఎవడో తెలీక అటూఇటూ చూసి, హెడ్డుగారి వైపు చూశారు షావుకారు.
ఇలా చెప్పుకుంటూపోతే పదుల సంఖ్యలో ఉంటాయి ప్రతి నవలలోను, కథలోను. కథకి, నవలకి పాత్రచిత్రణ అతిక్లిష్టమైన ప్రక్రియగా భావిస్తారు రచయితలు. కానీ, రావిశాస్త్రి తన ప్రతి రచనలోను, పాత్ర స్వభావాన్ని విచిత్రమైన, ఊహకందని ఉపమానాలతో నిర్వచిస్తుంటారు. అవి చదివితే ఆ మనిషి మనకు రూపుకడతాడు, స్వభావమూ బోధపడుతుంది. ఈ వాక్యాలు చూడండి—
నిల్చున్న రామారావు దూరం నుంచి చూస్తే కడిగేసిన శిలలా ఉన్నాడు. దగ్గర్నించి చూస్తే మనిషంతా నీరయినట్టుగా ఉన్నాడు. (68)
అతను చెదపుట్టలోంచి తీసిన వస్తువులా ఉన్నాడు. అతనిలో మనిషి పోలిక ఇంకా అక్కడక్కడ లేకపోలేదు. ఒంట్లో ఎముకలు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయో తెలుసుకోవడానికి వీలైనన్ని ఉన్నాయి. (114)
చూడ్డానికి చాలా బీభత్సంగా ఉన్నాడు. కాలీకాలని శవాలు అలాగే ఉంటాయి. (115)
కారాకిళ్లీ ఎరుపుతో అతని నోరు ఎలకని తిన్న పిల్లి నోరులా ఉండేది. (272)
రెండు కేజీలతో చెయ్యబోయి పిండి చాలక ఒక్క కేజీతోనే చేసినట్టుగా పల్చగా ఉంది అతని ముఖం. (706)
ఆవిడ తల్లిలా నలుపే అయినా తల్లంత నలుపు కాదు. కర్రి రాధ మిరియాల కషాయంలా ఉంటే ఆ కషాయంలో పాలు పోసినట్టుంటుంది మంగ. (505)
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నయినా ఉంటాయి, ఇవి మచ్చుకి మాత్రమే. వీటితోపాటు కొన్ని అద్భుతమైన వెంటాడే వాక్యాలు వారి రచనల నిండా కోకొల్లలు.
నీరజకి పెళ్లి చేయించే వృద్ధులూ లేరు, పెళ్లాడ్డానికి యువకులూ లేరు. (18)
…అంటే అతగాడు నేలవిడిచిన వాడు, సాము చేయడం రానివాడు. ఎక్కువగా చదువుకున్న వాడు. ఉన్న మతి పోయినవాడు. (36)
నాన్న నోట్లో ఉండేది చుట్ట, అతని మనసులో ఉండేది పొగ. (39)
పగటి నడక బట్టల్లోంచి రాత్రి పడక బట్టల్లోకి మారేను. (650)
సూర్యభగవానుడు అయినాసరే, బతుక్కి బతుకు ఇవ్వగలడు కానీ చావుకు ఊపిరి పోయలేడు.
(844)
ఆమె పట్టుతివాసీమీద పడ్డ పిల్లిపెంటని చూసినట్టు, ఆ డబ్బుని అసహ్యంగాను, ఆ పిల్లిని చూసినట్టు నావైపు కోపంగాను చూసింది. (896)
ముక్కుసూటిగా పోతే వకాల్తీలో ఏడ్సిందేవిఁటి? భల్లూకశష్పాలు, బదరికాపుష్పాలూను. (463)
ఈ వాక్యాలు రచయితకుండాల్సిన సూక్ష్మగ్రాహకశక్తికి నిదర్శనాలు కాదూ! శాస్త్రిగారి చూపు ఎంత విస్తరించి ఉండకపోతే ఈ వాక్యాలు పుడతాయి. అలాగే కొన్ని విషాదవాక్యాలూ ఉన్నాయి.
వాళ్ల ఇళ్లు కొంచెం దూరంగా ఉన్నా ఒకే వీధిలో ఉన్నాయి. భార్యలు అప్పుసొప్పులకి ఒకరిళ్లకి ఒకళ్లు వెళ్లినప్పుడు ఒకరి దెబ్బలు ఒకరికి చూపించుకోవడం వారికి మామూలే. (64)
కొన్ని బాధలకి మందులుండవు. కొన్ని విషపుకాట్లకి విరుగుళ్లుండవు. కొన్ని చీకట్లకి వెలుగు లుండవు. కొన్ని ఏడ్పులకి ఓదార్పులుండవు. (739)
పిల్లలకి తిండి పెట్టాలంటే ఇంట్లో చీకటి తప్ప మరేంలేదు. (201)
ఇలాంటి వాక్యాలకు వ్యాఖ్యానాలు అవసరమా! మన గుండెల్ని సూటిగా తాకవూ!
రావిశాస్త్రి వెన్నెలమీద, ఎండమీద, వర్షం, చీకటిమీద రాసిన కథలూ ఉన్నాయి. వైవిధ్యానికి మారుపేరు రావిశాస్త్రి.
ఇదిలా ఉండగా రావిశాస్త్రి రచనల్లో అతి ముఖ్యమైనవి రెండు వ్యాఖ్యానాలు, మరో రెండు ఆక్రందనలు గురించి మాట్లాడకపోతే, ఈ ముందుమాటకి ముగింపు లేనట్టే.
మొదటి ఆక్రందన మాయ కథలో ముత్యాలమ్మది. ‘నేదుబాబు నన్ను, నా సంసారం అమ్మేసినా అంత కరీదు కిట్టదు…” (99, 100, 101) అంటూ మొదలయ్యే ఆమె బాధ చదువుతుంటే కడుపులో దేవేసినట్టు ఉంటుంది. ఈ సమాజంలోనా మనందరం బతుకుతున్నాం అనే బాధ కలుగుతుంది.
రెండోది రత్తాలు-రాంబాబులో, ‘కాదు, కాదు. ఏమాట ఎవరితోను చెప్పుకోలేక వెళ్లిపోయింది పెద్దమ్మ…’ (779)తో మొదలైన ఆ పేరా అంతా మనసు వికలం చేస్తుంది. గుండెలో బాధ తన్నుకొస్తుంది. కోపం కలుగుతుంది, కసి రగులుతుంది. ఒక రచనకు ఇంతకన్నా సార్థకత ఏముంది?
రెండు వాఖ్యానాలు ఏవంటే… మొదటిది మాయ కథలో పెద్ద లాయరుగారి ఉవాచ. ‘ఎర్లీ బర్డ్ కాచెస్ ది వర్మ్’ (96) అనే మాటలతో ప్రారంభమయ్యి ఒక పేజీకి పైగా ఉండే ఈ వాక్యాలు తెలుగు సాహిత్యంలో అద్భుతమైనవి, వ్యంగ్యాత్మకమైనవి. న్యాయవ్యవస్థ వలువలు ఊడ్చి మనముందు నగ్నంగా నిలబెట్టేవి. అయితే ఆశ్చర్యంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జస్టిస్ ఎన్.వి. రమణగారు తనకు జరిగిన ప్రతి సన్మానసభలోను ఈ వాక్యాలనే ఉటంకించేవారు. సదరు జడ్జిగారు ఆ వాక్యాల్లోని మాయనే చూసి పొంగిపోయారో, లేదా బాధనే తెలుసుకున్నారో ఏది నిజమో తెలియదుగానీ అంతటి జడ్జిగారిని మెప్పించిన వాక్యాలవి.
మరోటి సృజనలో వచ్చిన రాముడి వ్యాసం. ‘బ్రహ్మాండం బద్దలయ్యేంత రామ రావణ యుద్ధం జరిగితే కానీ దేవుడి భార్య దేవుడికి దక్కింది కాదు,’ (1100) అనే వాక్యాలున్న ఈ వ్యాఖ్యానం 70లలో పెద్ద సంచలనం. విరసం సభల్లోను, వారు నిర్వహించే ప్రతి సభలోను కరపత్రాలు వేసి మరీ పంచారు. ఈ వ్యాఖ్యానంలో ఆయన లేవనెత్తిన ఆర్గ్యుమెంట్కి ఎవరైనా డంగైపోవాల్సిందే.
***
కథలకు, నవలలకు ప్రాణం కథాసంవిధానం, పాత్రల చిత్రణ, వాతావరణానికి అనుకూలమైన వ్యాఖ్యలు, సంభాషణలు వంటివి రచనను పండించడానికి సాధనాలు. ఇవన్నీ శాస్త్రిగారి రచనల్లో పుష్కలంగా దొరుకుతాయి.
ఈ గ్రంథంలోని ఉల్లేఖనాలు చూశాక శాస్త్రిగారి రచనలు ఇప్పటికే చదివినవారికి మళ్లీ మళ్లీ చదవాలని అనిపించినా, ఇప్పటికీ చదవని యువతరానికి తప్పక చదవాలని అనిపించినా ఈ సేకరణ ప్రయత్నం సార్థకమైనట్టే, ఈ సంకలనకర్త రమణమూర్తిగారి కృషి ఫలించినట్టే. ఈ పుస్తకం ద్వారా కొత్తతరం రచయితలు, పాఠకులు రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి రచనలవైపు దృష్టి సారించాలని కోరుకోవటం అత్యాశ కాదనుకుంటా!
*








సూర్యభగవానుడు అయినాసరే, బతుక్కి బతుకు ఇవ్వగలడు కానీ చావుకు ఊపిరి పోయలేడు. welcome
శ్రీ శ్రీ , చలం, రావి శాస్త్రి తెలుగు సాహిత్యానికి icons , నవీన్ గారు అద్భుతంగా రాసారు
రావి శాస్త్రి గారి గురించి ఈ తరం వాళ్లకి అద్భుతంగా పరిచయం చేశారు. పుస్తకాన్ని శ్రమకోర్చి సంకలనం చేసిన రమణమూర్తి గారికి, గొప్పగా విశ్లేషించిన మీకు అభినందనలు.
చక్కటి ముందుమాట రాశారు నవీన్ గారూ. పుస్తకంలో శాస్త్రి గారూ యేమిటి రసారో చెపుతూ పుస్తకంలోని విషయాలను బాగా చెప్పారు. మీరు రాసిన పద్ధతి మీరు చెప్పినట్టు ఆ పుస్తకం వెంటనే కొనుక్కొని చదవాలని అయిపించేలా రాశారు సర్ .