సన్మిత్రమండలి- కళల కూడలి

ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఆశయాలతో దేశవ్యాప్తంగా స్థానిక రేడియో కేంద్రాలు మొదలయ్యాయో, ఆ ఆశయాలను తూచా తప్పకుండా పాటించే స్టేషన్ ఏదన్నా ఉన్నదంటే ఆకాశవాణి వరంగల్ కేంద్రమే.

అక్కడి మనుషుల ఆత్మీయత ఈనాటికీ నేను మర్చిపోలేను.

రోజున హోలీ అని మర్చిపోయాను.

కాలింగ్ బెల్ మోగగానే తలుపుతీశానోలేదో ఒక వ్య్యక్తి నా కళ్ళు మూసేశాడు. మిగిలిన వాళ్ళు నాపైన హోలీ రంగులు చల్లారు. క్షణాల్లో నా మొహం నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..ఇదీ నేను కళ్ళు తెరిచిచూసుకుంటే కనిపించిన దృశ్యం. నిజానికి వాళ్ళెవరూ నాకు పరిచయం లేరు. వరంగల్లు పట్టణంలో సహృదయ అనే సాహిత్యసంస్థ అద్భుతమైన సేవ చేస్తోంది.వచ్చిన వారందరూ ఆ సంస్థ ఆఫీస్ బేరర్స్ ..ఇంకా సంస్థ సభ్యులు. 

సారంగ చానెల్ లో రాంబాబు గారి స్వరంలో వినండి!

హోళీ రంగుల కేళీ

లక్కీగా మా వరంగల్ కేంద్రానికి గుండె కాయలాంటి అనిల్ ప్రసాద్ అందరినీ పరిచయం చేశాడు.కుశల ప్రశ్నల అనంతరం అందరం‌ ఛాయ్ తాగటానికి వరంగల్ కేంద్రానికి అడ్డాలాంటి శంకర్ కేఫ్ కు వెళ్ళాం..ఆ తర్వాతి రోజుల్లో సహృదయ సంస్థ సభ్యులు సమర్పించిన నాటకాలు రికార్డ్ చేశాం..ఏ.వి.నరసింహారావు అనే చక్కటి నాటక రచయిత ఉండేవారు.వనం లక్ష్మీకాంతరావు చక్కటి నాటక ప్రయోక్త, సాహిత్యంలో గిరిజామనోహరబాబు, బాధ్యతలు మోసేందుకు కె.కృష్ణమూర్తి ఇంకా వారి మిత్రులు, వీళ్ళందరిని గైడ్ చేసేందుకు డా.కె.ఎల్.వి.ప్రసాద్ అధ్యక్షస్థానంలో ఉండేవారు.

వరంగల్లు లో నన్ను ఆశ్చర్యపరచిన విషయాలు కొన్ని ఉన్నాయి.

యువత అద్భుతంగా జానపద గీతాలు రాస్తారు, పాడతారు.

చిందుయక్షగాన కళాకారులతో పాటు అనేక జానపద కళలు ఇంకా ప్రాచుర్యంలో ఉండేవి.ఈ కళాకారులందరూ రేడియో స్టేషన్ కు రికార్డింగ్ కు వచ్చేవారు..ఇది అక్కడ ఒక రేడియో స్టేషన్ ఉండటం వల్లనే సాధ్యమయింది..స్థానిక కేంద్రాలలో శాస్త్రీయ సంగీత కళాకారులు విభాగాల్లో పాల్గొనాలంటే ఆడిషన్ ఆర్టిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు.వీళ్ళకు చెల్లించే ఫీ (పారితోషికాన్ని రేడియోలో ఆర్టిస్ట్ ఫీ అంటారు) తక్కువుంటుంది. ఆడిషన్ అయిన వారికి గ్రేడు ప్రకారం ఫీ చెల్లిస్తారు.

పద్మవిభూషణ్ కాళోజీ, పేర్వారం జగన్నాధం, అంపశయ్య నవీన్,మాదిరాజు రంగారావు, ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి , రామాచంద్రమౌళి, నాగిళ్ళ రామశాస్త్రి, కె.ఎస్.ఆర్.జి.ప్రసాద్, నెల్లుట్ల రమాదేవి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వి.ఆర్.విద్యార్థి, నమిలికొండ బాల కిషన్ రావు, డా.టి.శ్రీరంగస్వామి, డా ఎల్.ఎస్.ఆర్.ప్రసాద్.

(విప్లవ కవి వరవరరావు వరంగల్ వారే)..ఇలా ఎంతోమంది కవులు, రచయితలతో కొలువైన సాహితీ క్షేత్రం ఆధునిక ఓరుగల్లు నగరం. ధ్వన్యనుకరణకు ఒక గుర్తింపుతెచ్చిన డా.నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్లు వాసే..డా.రామక లక్ష్మణమూర్తి గారని సాహిత్య పిపాసి ఉండేవారు..ఆయన అతి తక్కువ ఫీజు(రూపాయో ,రెండు రూపాయలో తీసుకునేవారు) తీసుకుని వైద్యం చేసేవారు.ఇరవై నాలుగు గంటలూ వైద్యం కోసం ఎవరొచ్చినా ఆ ఇంటి తలుపులు తెరిచే ఉండేవి.

ఏ పట్టణానికైనా సాహిత్య ప్రముఖులు ఆ పట్టణానికో రంగు రుచి వాసననిస్తారు..ఇంతమంది ప్రముఖులు(ఇంకా చెప్పవలసినవారి పేర్లు చాలానేఉన్నాయి) వరంగల్-హనుమకొండ- కాజీపేట మూడు నగరాలకు ఒక సాంస్క్రతిక దిశానిర్దేశనం చేశారు.బహుశః డెబ్భైల్లో ప్రారంభించిన మిత్రమండలి, కొత్తరచయితలకు , కవులకు మార్గదర్శిగా ఉంటూ వారి సాహిత్య వికాసానికి దోహదపడుతు ఉండేది.ప్రతి రెండవ శనివారం జరిగే ఆ సమావేశాలకు నేను కూడా వెళ్ళాను.ఆ సంప్రదాయం నేటికీ సాగుతోంది..ఇక వరంగల్ లో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం, కాకతీయ మెడికల్ కళాశాల, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ(తరువాతి కాలంలో NIT వరంగల్ గా మారింది) కలిసి వరంగల్ పట్టణాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దాయి. 

రైల్వే లైన్ ఢిల్లీ రూట్లో ఉండటం వలన కాజీపేట్ జంక్షన్ కో ప్రత్యేకత ఏర్పడింది.అటు విజయవాడ వెళ్ళే ప్రధాన రైళ్ళకు కూడా కూడలి కాజీపేట.

వరంగల్ లో చైతన్యమెక్కువ..అది విద్యార్థులలోనయినా, రైతులలో నయినా..వరంగల్ లో వ్యవసాయపరిశోధనా స్థానముండేది.అక్కడి శాస్త్రవేత్తలు ఆకాశవాణికి వస్తుండేవారు. ఆ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎల్.జలపతిరావు ఆకాశవాణి ద్వారా రైతులతో మాట్లాడుతుండేవారు.

మరొకపక్క జిల్లా కలెక్టర్ తాను ఆకాశవాణికి స్టూడియోస్ కి రావటమే కాకుండా జిల్లా అధికారులందరూ రేడియో స్టేషన్ కు వచ్చేలా ఆదేశాలిస్తుండేవారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఆశయాలతో దేశవ్యాప్తంగా స్థానిక రేడియో కేంద్రాలు మొదలయ్యాయో, ఆ ఆశయాలను తూచా తప్పకుండా పాటించే స్టేషన్ ఏదన్నా ఉన్నదంటే ఆకాశవాణి వరంగల్ కేంద్రమే.

అక్కడి మనుషుల ఆత్మీయత ఈనాటికీ నేను మర్చిపోలేను.

నేను అక్కడ పనిచేసి ఇరవైఏళ్ళు దాటిపోయినా వారి ఇళ్ళలో శుభకార్యాలుంటే తప్పకుండా రావాలని కోరుతుంటారు..నిన్ననే డా.ఎల్లయ్య అనే ఒక కేజువల్ అనౌన్సర్ ఫోన్ చేసి, తనకి అరవై నిండటంతో రేడియో స్టేషన్ నుంచి సెలవు తీసుకున్నానని(రెగ్యులర్ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉన్నట్టుగానే , కేజువల్ ఉద్యోగులకు కూడా అరవై ఏళ్ళకు రిటైర్మెంట్ ఉంటుంది)

ఆరోజుల్లో మీరు నన్నెంతో ప్రోత్సహించారు, అందుకు నా కృతజ్ఞతలు చెప్పుకోవటానికి ఫోన్ చేశానని చెప్పగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి.(ఈ కర్టెసీ అతను చాలామందికి పాటించాడు.అంతేకాదు అతను పిహెచ్.డి.లో సీటు పొందటానికి అవసరమైన testimonial రాసిచ్చానని, అది అతనికి పి.హెచ్.డి.లో సీటు రావటానికి చెప్పాడు..ఇందులో నేనేమీ exaggerate చేసి చెప్పటం లేదు‌..ఆ విషయం నేను మర్చిపోయినా అతను మర్చిపోలేదు.అదీ అతని సంస్కారం)

నిజానికి అతనా పనిచేయవలసిన అవసరం లేదు..కానీ అది తన కనీస ధర్మమనుకున్నాడతను.

నిజానికి విజయవాడలాంటి పెద్దకేంద్రంలో పనిచేసిన నేను వరంగల్ లాంటి చిన్నకేంద్రానికి వచ్చినందుకు కొంత అసంతృప్తితో ఉండాలి.

కానీ అలా నాకు అనిపించలేదు..ఒకకారణం నేను పదోన్నతి పొంది వరంగల్ కేంద్రానికి రావటం వలన కొంత స్వతహాగా ఉండే ఉత్సాహం..మరొక కారణం వరంగల్ నగరంలోని మనుషుల పట్టరాని ప్రేమాభిమానాలు..దానివలన 1999 జనవరి  నుంచి 2005 ఆగస్టు వరకు దాదాపు ఆరున్నర సంవత్సరాల కాలం నా జీవితంలో ఎలా గడిచిపోయిందా అనిపిస్తుంది. 

మా ఆఫీస్ లోని కొలీగ్సందరూ చాలా కలివిడిగా ఉంటూ ఎవరి సమస్యనైనా తమదిగా భావించి ఇట్టే పరిష్కరించేవారు. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నాస్టాల్జియా అనిపిస్తుంది.

ఇక మా డైరక్టర్ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు, మంచి పరిపాలనాదకక్షులే కాదు, మంచి ఆర్టిస్ట్ కూడా.ఆయనకు సంగీత పరిజ్ఞానం అపారం..రాగాల ఎవల్యూషన్ గురించి మాట్లాడగలరు.

ఎవరినీ నొప్పించకుండా అవుట్ పుట్ రప్పించగలరు.

ఆయన స్టేషన్ కు వచ్చిన ఆర్టిస్ట్ లు, అధికారులు, శాస్త్రవేత్తలు ఇలా వీరందరితో కలిసి మాట్లాడుతుంటే

కొన్నిరోజులకు ఆయన మదిలో ఒక కాన్సెప్ట్ రూపుదిద్దుకుంది.

అదే రేడియో ప్రచారసభ(RPS)..

ఇంతకీ ఏమిటా రేడియో ప్రచార సభ???

*

 

"రేడియో" రాంబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు