ఏటూరి నాగేంద్రరావు కవితలు

మధ్యలో గుండె కోసుకొని
రాసిన నాలుగు పేజీలు నన్ను కలవరపెడుతున్నాయి.

1
అన్వేషణ 
జీవితంలో శూన్యతంటే  ఏమిటో
ఈ రాత్రి ఇద్దరం పూర్తిగా
చచ్చిపోయి బ్రతికినప్పుడు
తెలిసింది.
కొన్ని విషయాలు
యధాతథంగా వదిలేస్తేనే
అరుదైన జ్ఞాపకాల్ని
నిజాయతీగా బ్రతికించుకోగలం.
ఒక్కోసారి నిశ్శబ్దం కూడా
గొప్పగా ఉపయోగపడుతుంది.
ఏదో ఒకరోజు
నువ్వు వస్తావని తెలుసు.
ఒక రహస్య శక్తి
కాలక్రమేణా మనకి
నచ్చచెప్పడమూ తెలుసు.
అయినా మరణాన్ని ఆహ్వానించేవాడికి
లౌకిక లంపటాలతో  పనేంటి?
ఘర్షణల చరిత్రల్లో
ఆత్మల్ని అసలు అర్ధం చేసుకోలేం.
కాలం గడిచే కొద్దీ
అన్వేషణలో అలసిన మనసు
ప్రశ్నల పొరల్లో దాగిన
జవాబుల్ని వెతుక్కుంటూ
ప్రయాణిస్తూనే వుంటుంది.
2
అమ్మ పేజీలు
రైలు కిటికీలోంచి
పొలాలు పరిగెడుతున్నాయి
ఊళ్ళు మాయమవుతున్నాయి
మనుషులు కనిపించి
మాయమవుతున్నారు.
నక్షత్రాలతో  మాట్లాడుతూ
మనసులో కుములుతున్నారు.
అమ్మ ఫోనెందుకో
మౌనంగావుంది.
అమ్మ నెంబర్ డిలీట్ చేయలేకపోతున్న
ఆమెకు వుత్తరాలు రాయడం
ఎప్పుడోమానేశాను!
ఎదురుచూడటం కూడా మానేశా!
కానీ అక్షరాల్లో ప్రేమను దాచుకోవటం
మాత్రం మానేయలేదు.
మరచిపోయిన అలమారలోంచి
నా గొంతు అమ్మ అని అరుస్తోంది.
మధ్యలో గుండె కోసుకొని
రాసిన నాలుగు పేజీలు నన్ను కలవరపెడుతున్నాయి.
అయినా వాట్సాప్ లో డిలీట్ అయ్యే
మెసేజ్ కాదు ఆమె!
చదివిన కొద్దీ
రాసిన కొద్దీ
బ్రతికే జ్ఞాపకం.
*

ఏటూరి నాగేంద్రరావు

నాకంటూ సాహిత్యరంగంలో గురువులెవరూ లేరు. చిన్నప్పటినుంచీ ఎక్కువగా పుస్తకాలు చదవడం, సమాజాన్ని నిశితంగా పరిశీలించడం అలవాటై రచనలను చేయడానికి ఉపక్రమించాను. అలా కాలేజీ మేగజైన్ లలో నా కవితలు ప్రచురించబడ్డాయి. ఆ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా రాయడం మొదలెట్టాను.
ఈ క్రమంలో రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో
ఉద్యోగంలో చేరి ఉద్యోగ భాద్యతలు పాటు
సాహిత్యంలో కూడా నా బాధ్యతగా కవితలు
రాయటం మొదలెట్టాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు