చార్లెస్ బుకోవ్స్కి (1920-1994) జర్మన్-అమెరికన్ కవి, నవలా రచయిత, కథా రచయిత. “డర్టీ రియలిజం” (అత్యంత వాస్తవ చిత్రిక ) కల్ట్ హీరోగా ప్రసిద్ధి చెందారు. బుకోస్కి రచనలు అలతి పదాలతో , వాడుక భాషతో ఎలాంటి ఫిల్టర్లు లేకుండా – పేద అమెరికన్ల రోజువారీ బతుకులు , మద్యం, జూదం, శ్రామిక వర్గపు పట్టణ జీవితంలోని కష్టాలు, కలలు , చెదిరిన ఆశలని ప్రతిబింబిస్తాయి
1
లోమాట (confession)
మంచం మీంచి దూకే
పిల్లిలా
మరణంలోకి జారడానికి
ఎదురుచూస్తూ
నా బాధంతా నా భార్య గురించే
మెదలకుండా పడున్న నా
తెల్లని శరీరాన్ని చూసి ,
ఓసారి కదిపి
మరోసారి తట్టి
అంటుంది ఇలా
“ఉన్నావా “
“ఉండను” అప్పటికే
ఛస్తానని నాకే కలతా లేదు
దిగులంతా
ఈ రిక్త రక్తకళేబరపు కుళ్లిన కుప్ప
నా భార్యకు మిగిల్చి వెళతాననే
ప్రతిరాత్రి తన పక్కనే పడుకున్నప్పటికీ
ఆమెకిది తెలియాలని అనుకుంటున్నా
వ్యర్థ వాదనలైనా కూడా
మాకవి
పరమాధ్భుతపు క్షణాలు
నేను ఎప్పటికీ చెప్పడానికి
భయపడిన క్లిష్ట పదాలు
ఇప్పటికి చెప్పగలుగుతున్నా
“నేను నిన్ను ప్రేమిస్తున్నా”
2
నీలం మాయ
ఒక నీలం మాయ నా హృదయంలో
వెలుపలికి రావడానికి తపిస్తూ
కానీ నేను మహా కఠినుణ్ణిగా
అంటానిలా
“ఉండక్కడే-
వేరెవరినీ నిన్ను చూడనివ్వను “
ఓ నీలం మాయ నా హృదయంలో
వెలుపలికి రావడానికి తపిస్తూ
కానీ నేను దానిమీద విస్కీ పోసి
సిగరెట్ పొగలు పీలుస్తా
ఇక వేశ్యలు, మద్యం అంగడి మనుషులు, కిరాణాకొట్టువాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు
వాడు లోపలే ఉన్నాడని
ఒక నీలం మాయ నా హృదయంలో
వెలుపలికి రావడానికి తపిస్తూ
నేను నిజంగానే కఠినుణ్ణి – అంటానిలా –
ఉండక్కడే
నన్ను నాశనం చేయాలని ఉందా ?
పనులన్నీ పాడు చేస్తావా ఏమి?
యూరప్ లో నా పుస్తకాల అమ్మకాలు దెబ్బతీయాలని ఉందా
ఒక నీలం మాయ నా హృదయంలో
వెలుపలికి రావడానికి తపిస్తూ
కానీ నేను తెలివైనవాణ్ణి-
రాత్రి అందరూ నిద్రించాకే
వాడిని
బైటికి పంపుతాను
నీ ఉనికి నాకు తెలుసు – బాధపడకు – అని
మరలా హృదయంలోకి మళ్ళిస్తాను
కానీ వాడు లోపల పాట పాడుతున్నాడు
నేను వాడిని పూర్తిగా చావనివ్వలేదు
అలా మా
ఇద్దరి రహస్య ఒప్పందంతో
రాత్రి కలిసి నిద్రిస్తాం
భలే బాగుంటుంది కదా
ఒక మగాడిని ఏడిపించడం
అయినా నేను ఏడవను
మరి నువ్వూ?
3
రాత
ఇదొక్కటే –
నీకూ, అసాధ్యానికీ
నడుమ
తరచూ తచ్చాడేది
ఏ మధిర
ఏ మధుర ప్రేమా
ఏ మోహ భాగ్యమూ
దీనికి సరితూగవు
ఏదీ నిన్ను కాపాడలేదు
కేవలం రాత తప్ప
అదొక్కటే ఆపుతుంది
పెచ్చుల గోడలు కూలకుండా
అల్లరి గుంపులు చేరకుండా
చీకటిని తుత్తునియలుగా ఛేదిస్తుంది
రాత
అత్యున్నత మానసిక వైద్యుడు
దేవుళ్లలోకెల్లా
పరమోత్కృష్ట దయాళువు
మృత్యువుని సైతం వెంబడించేది
ఎప్పటికీ అలసి విరమించనిది
రాత
తనకి తాను నవ్వుకునేది
నొప్పిని సైతం నవ్వేది
ఇదే ఆఖరి ఆశ
ఇదే వీడుకోలు వివరణ
ఇదొక్కటే అసలైన
రాత
*








Excellent
అద్భుతం. నువ్వు మాత్రమే ఇంత అనుభూతిగా అందించగలవు వంశీ. మూల కవిత్వం చదివినా ఇంత అనుభూతి కలిగేది కాదేమో!